Feed on
Posts
Comments

పుట్టినప్పట్నించీ నేను ‘ఢిల్లీ’ నగరం గురించి వింటూనే ఉన్నాను.
 నేను చిన్నపిల్లవాడిగా ఉన్నపుడే మా అమ్మ చక్రవర్తి ఔరంగజేబు గురించి చెప్పింది. వాడు మా సిక్కుమతం ‘గురువు’ను చాందినీ చౌక్‌ ప్రాంతంలో ఎట్లా చిత్రవధ చేసి చంపిందీ తర్వాత కాలంలో అదే స్థలంలో మా వాళ్ళు అతి పెద్ద అందమైన గురుద్వారాను ఎట్లా నిర్మించిందీ ఒక కథగా వినిపించేది. ఆమెకు ఔరంగజేబు పట్ల ఎంత అసహ్యం ఉండేదంటే ఆ పేరును ఉచ్చరించిన ప్రతీసారీ ‘థూ’ అని ఉమ్మివేసేది. నేను కూడా ఒక ఔరంగజేబునే గాక మొత్తం ముస్లింలనే ద్వేషించటం, అసహ్యించుకోవటం నేర్చుకున్నాను. అయితే ఢిల్లీ నగరంపై ప్రేమ మాత్రం నాతో పాటే పెరుగుతూ వచ్చింది. ఢిల్లీని సందర్శించాలని నా హృదయం తహతహలాడేది. ”ఎవరైతే ఢిల్లీని చూడరో వారు మొత్తం ప్రపంచాన్నే చూడనట్లు అని మా దోస్తులు నన్ను మరి మరీ రెచ్చగొట్టేవాళ్లు. నా కోరిక నెరవేరాలని గురుద్వారాకు వెళ్లి పదే పదే మొక్కుకునే వాడిని.


 చివరికి ఒక రోజు నా కోరిక ఫలించింది. ఆ రోజు మా గ్రామంలో డప్పుల చాటింపు వినబడింది. గ్రామం నడిబొడ్డున అందరం జమ అయినాం. రావిచెట్టు క్రింద నున్న ఎత్తైన బండమీదికి ఒక అంగ్రేజీ సైనికుడు ఎక్కి నిలబడి ఒక ప్రకటన చేశాడు. కంపెనీ పరిపాలనకు వ్యతిరేకంగా ఢిల్లీ లాల్‌ఖిల్లాలో నెమిలి సింహాసనం మీద కూచున్న మొగల్‌ బాద్‌షా బహద్దుర్‌ షా జఫర్‌ తిరుగుబాటు చేస్తున్నాడని, ఆ తిరుగుబాటును ఆణచటానికి సైన్యాన్ని సిద్దం చేస్తున్నామనీ, కొత్త వారిని, యువకులను రిక్రూట్‌ చేసుకుంటున్నామని, ఆసక్తి కలవారు సైన్యంలో చేరితే మంచి జీతభత్యాలే గాక ఢిల్లీ నగరాన్ని గెలుచుకోగానే ఆ నగరాన్ని యదేచ్ఛగా కొల్లగొట్టి దోపిడీ చేసుకునేందుకు సైనికులకు సంపూర్ణమైన స్వేచ్చను ప్రసాదిస్తామని ప్రకటించాడు. మా అనేకమంది మత గురువులను మొగల్‌ రాజులు చిత్రవధ చేసి చంపినందుకు ప్రతీకారంగ సైన్యంలో చేరి ఔరంగజేబు వారసుడైన బహద్దుర్‌షా జఫర్‌ మీద కక్ష సాధించాలని నా రక్తం పరవళ్లు తొక్కింది. మరోవైపు నా కలల నగరం నా ప్రేమనగరం ‘ఢిల్లీ’ని కళ్లారా దర్శించుకోవచ్చని ఆలోచన కల్గింది. అట్ల ఒకవైపు పగ మరోవైపు ప్రేమ నన్ను కంపెనీ వారి సైన్యంలో ఒక సైనికుడిగా చేరి ఢిల్లీకి వెళ్లేటట్టు చేసింది. నాతో పాటు గ్రామంలోని మరో ఇద్దరు దోస్తులు లేహనా, మరియు నాధాలు కూడా ఆ అంగ్రేజీ ఫౌజ్‌లో భర్తీ అయ్యారు. ఒక మంచి రోజు నిర్ణయించుకుని అమ్మా బాపుల పాదాలకు దండం పెట్టి నేను నా గ్రామాన్ని విడిచి ప్రయాణమయ్యాను. మా పటాలం ఢిల్లీ వైపు కవాతు చేయసాగింది.
 1857 మే నెల. మండే ఎండాకాలం. ఎండలకు నేల తందూరి నిప్పుల పొయ్యిలాగ మండుతుంది. మా కండ్లు, ముక్కులు దుమ్మూ ధూళితో నిండటమే గాక మా గడ్డాలు మీసాలు నలుపురంగు నుండి ఖాకీ రంగుకు మారాయి. అయినా ఈ సిక్కు సింహాలను మండే ఎండలు ఏం చేయగలవని మాకు మేం ధైర్యం చెప్పుకున్నాము. నడినెత్తిన సూర్యుడు భాంగ్రా నృత్యం చేస్తున్నా లెక్కచేయక మున్ముందుకే సాగినాం. దారిపొడవునా గల బావులు, చెరువుల చెంత స్నానపానాలు కొనసాగిస్తూ వేపచెట్టు నీడల క్రింద విశ్రమిస్తూ రెండు రోజులకు అంతాలా చేరుకున్నాము. అక్కడ మరికొంతమంది యువకులను మా సైన్యంలోకి భర్తీ చేసుకున్నాం. అంబాలా సంస్థానానికి సంబంధించిన రాజు తన వందమంది సైనికుల్ని మాకు అప్పగించాడు. ముస్లిం రాజుల పరిపాలనను అంతమొందించాలన్న ఉద్దేశ్యంతో ఆయన ఆంగ్లేయులకు సహకరించాడు.
 మా పటాలం సైనికాధికారి పేరు హడ్సన్‌. బట్టతలతో ఉండే ఆయన ఎరుపు ముఖాన్ని చూస్తుంటే కోతి క్రింది భాగాన ఉండే ఎరుపు రంగు జ్ఞాపకం వచ్చేది. ఒక రోజు ఉదయం పరేడ్‌ జరుగుతున్నపుడు ఆయన మా వద్దకు వచ్చి ప్రతి ఒక్కరి కడుపులో, ఛాతీ మీద తన చూపుడు వేలితో పొడిచి చూసి మా శరీర ధారుడ్యాన్ని అంచనా వేస్తున్నాడు. నా దగ్గరికి రాగానే అందరికన్న ఎత్తుగా, బలంగా ఉన్న నన్ను చూసి నీ పేరేమిటి? అని స్పష్టమైన ఉచ్చారణతో పంజాబీ భాషలో అడిగాడు.
 ’నిహాల్‌ సింగు’ అని జవాబు చెప్పాను.
 ”నిహాల్‌ సింగు ఈ రోజు నుండి నువ్వు నా దగ్గర ఆర్డర్లీగా పనిచేస్తున్నావు” అని మళ్లీ అదే స్పష్టమైన ఉచ్చారణతో పంజాబీ భాషలో హుకుం జారీ చేశాడు. దాంతో నా మనను ఎగిరి గంతేసింది. నా దోస్తులందరూ నా అదృష్టానికి అసూయ చెందారు. వారు నా భుజం తట్టి శబ్బాష్‌ అని శుభాకాంక్షలు తెలుపుతూనే నేను అటు తిరుగగానే నా వెనుక ”సాబ్‌ కా చమ్చా” అనటం వింటునే వున్నాను. హడ్సన్‌ సాబ్‌ అంతరంగిక సేవకుడిని కావటం వలన మా పటాలం సుబేదార్‌ సర్దార్‌ మాన్‌సింగు కూడా నన్ను గౌరవంగా ”భాయీ నిహాల్‌ సింగు జీ” అని పిలువసాగాడు. పనిలో శ్రద్ద వలన నేను కొద్ది కాలానికే హడ్సన్‌ సాబ్‌కు బాగా దగ్గరయ్యాను.
 మా అందరికీ కొత్త యూనిఫాంలు ఇచ్చారు. ఖాకీరంగు పాంటు షర్టు తలకు ఎర్ర టర్బన్‌ నడుముకు బెల్టు దానికి వ్రేలాడే పొడుగు కత్తితో పాటు ప్రతి ఒక్కరికీ తుపాకీ కూడా ఇచ్చారు. దూరంలో ఉన్న శత్రువును చూసేందుకు ”లెన్సు”లను ఇచ్చారు. వీటన్నింటితో మా ఉత్సాహం ఇనుమడించింది. ఇక తిండి, తాగుడు గురించి చెప్పవలసిన పనేలేదు. పుష్కలం. ప్రతి రాత్రి రమ్‌ రేషన్‌ పద్దతిలో సరఫరా అయ్యేది. ”బానిసలాగ తిని బంటులాగ పని చెయ్యాలి” అనే సామెత నా పట్ల నిజమైంది.
 మేము కర్నాల్‌ చేరుకునేసరికి మరొక దండు మాకు జమ అయ్యింది. మా దండుబాట ఢిల్లీ వైపు పురోగమిస్తుంది. తెల్లతోలు అంగ్రేజీలు ఎండలకు తట్టుకోలేకపోవటం వలన రాత్రులందే మా ప్రయాణం కొనసాగుతుండేది. అట్ల అనేక గ్రామాలను దాటుకుంటు చివరికి ఒకరాత్రి ఢిల్లీ పొలిమేరలకు చేరుకుని డేరాలను, గుడారాలను వేసుకుని బందోబస్త్‌ చేసుకున్నాము. ప్రయాణం అలసట వల్ల మా వాళ్లందరూ కాళ్లకున్న బూట్లనయినా విప్పకుండా యూనిఫాంలలోనే ఎక్కడి వాళ్లు అక్కడే నిద్రలోకి జారుకున్నారు.
 బాల్యంనుండీ నన్ను వెంటాడుతున్న కల ఢిల్లీ. నా కలల నగరం ఢిల్లీకి చేరుకున్నానన్న సంతోషంతో నాకు నిద్రపట్టలేదు. కాళ్లుచేతులూ శుభ్రంగా కడుక్కుని గుడారం వెలుపలికి వచ్చి మైదానంలో ఉన్న ఒక చదును బండపై విశ్రాంతిగా వెల్లకిలా పండుకున్నాను. పైన శ్యామలాకాశంలో మిణుకు మిణుకు మంటున్న నక్షత్రాలు. నా తలపాగా విప్పేసి వెంట్రుకల్ని వదులుగా వదిలేసాను. ఆ మైదానంలో వీచే చల్లగాలి తెమ్మెరలకు నా మనస్సు పరవశమైపోయింది. ఆనంద హృదయంతో నా కండ్లు అరమోడ్పులైనాయి. మెల్లమెల్లగా తెలియకుండానే నిద్రలోకి జారుకున్నాను.

* * *

”ఓయ్‌ నిహాలియా! శత్రువుల చేతులల్ల బడి నిద్రలనే చస్తవా ఏంది? లే నిద్రలే” అని మా వాళ్లు నన్ను నిద్రలేపుతున్నారు.
 ఢాం ఢాం అని దూరాన ఫిరంగుల మోతలు దగ్గర దగ్గరకు వస్తున్నాయి. దాంతో నా పెనునిద్దుర నన్ను వదిలింది. మా శిబిరాలకు కొంచెం దూరంలో దట్టంగా దుమ్మురేగుతుంది. చెట్ల కొమ్మల మీద కాకులన్నీ చిందరవందరగా ఎగురుతూ కావు కావుమని కీసర బాసరగా కాకి గోల చేస్తున్నాయి. హడ్సన్‌తో పాటు మిగిలిన సైనికాధికారులందరూ భూతద్దాల గొట్టాల నుండి దుమ్ము రేగుతున్న దిక్కు పరీక్షగా చూస్తున్నారు. ఢిల్లీ నగరం సబ్జీమండీ వైపునుండి ఒక అశ్వికదళం మేమున్న శిబిరం వైపు వాయు వేగంతో దూసుకు వస్తుంది. దాని వెనుకనే పదాతిదళం. వారందరూ కంపెనీ సైన్యం యూనిఫాంలో ఉన్నారు. ఆశ్చర్యం! నమ్మక్‌ హరాం గాళ్లు. తిన్న ఇంటి వాసాలనే లెక్కపెట్టెటోళ్లు. ధన్‌ ధన్‌ మని తుపాకులను పేల్చుకుంటూ మా మీద దాడికి వస్తున్నారు. హరహర మహాదేవ్‌, అల్లాహొ అక్బర్‌ అన్న కలగాపులగపు నినాదాలు వినబడుతున్నాయి. ఫిరంగీ కో మార్‌ దాలో అన్న కేకలు. అంగ్రేజీ కే హుకూమత్‌ కే ఖిలాఫ్‌ భగావత్‌. కాటికి కాళ్లు చాపుకున్న ఎనభైరెండు సంవత్సరాల మూడుకాళ్ల ముసలోణ్ణి - బహద్దూర్‌ షా జఫర్‌ను మళ్లీ భారతదేశానికి చక్రవర్తిగా చేయాలని గొంతెమ్మ కోరిక. ముందు ముసలం కంపెనీ సైనికులల్లనే పుట్టింది. మంగళ్‌ పాండే వారి నాయకుడట. తుపాకీ తూటాలకు ఆవు కొవ్వు పంది కొవ్వు పూసినారని చిచ్చురేగింది. కంపెనీ సైన్యంలో ఉన్న హిందూ ముస్లింలందరూ ఒక్కటైనారు. మీరట్‌లో ప్రారంభమైన తిరుగుబాటు లక్నోకు వ్యాపించింది. గ్రామాలల్ల ప్రజల మద్దతు అందింది. అగ్నికి ఆజ్యం తోడైనట్లు సిపాయిల తిరుగుబాటుకు నాయకత్వం వహించింది ఝాన్సీ, గ్వాలియర్‌, ఆవధ్‌ సంస్థానాధీషుల రాజులు, రాణులు ఝాన్సీ లక్ష్మీబాయి, నానా సాహెబ్‌, తాంతియాతోపే, బేగం హజ్రత్‌ మహల్‌లు. డల్హౌసీ రాజ్య సంక్రమణ విధానం వారందరినీ గాయపడిన బెబ్బులిగా మార్చివేసింది.
 ఆ తిరుగుబాటుదారుల సైన్యం మా శిబిరం దగ్గరకు సమీపించగానే హడ్సన్‌ సాబ్‌ ”హమ్లా” అని పెద్దగా కేక వేసినాడు. మేము కూడా సర్వశక్తులు వొడ్డి ఎదురుదాడికి దిగినాం. సంకుల సమరం ప్రారంభమైంది. ఇంతలో శత్రువులలో నుండి ఒకడు నన్ను ఉద్దేశించి:
 ”ఓయ్‌ సర్దార్జీ కిరాయి కూలీ కోసం ఫిరంగీల వైపు నిలబడి మాతో ఎందుకు యుద్దం చేస్తున్నావ్‌? మనం మనం ఒకటి. భారతీయులం, మావైపురా. అంతకన్నా ఎక్కువ డబ్బులు ఇస్తాం” అని కేకేశాడు. వాడు ముసల్మాన్‌ అని వాడి గడ్డంతోటే తెలుస్తుంది. ఇంతలో మా నాధూ తన తేజ్‌ తల్వార్‌తో వాడి తలను ఒక్కవేటుతో నేలమీదికి దొర్లించాడు. వాడి చావు నాకేమీ పశ్చాత్తాపం కలుగలేదు. మేం ఒక సిక్కులమే కాదు మరాఠాలు కూడా మాతో కలిసి ఫిరంగీలకు మద్దతుగా ముస్లింలకు వ్యతిరేకంగా ఈ యుద్దంలో పాల్గొంటున్నారు. ఔరంగజేబును ఎదిరించిన శివాజీ వారసత్వం వారి నరనరాన జీర్ణించుకుని ఉండటం వల్లనే ముస్లింలంటేనే వారు అగ్గిమీద గుగ్గిలం అవుతారు. ఇక ఈ తెల్లతోలు గాళ్ల తరఫున కిరాయి కూలీకోసం పోరాడే మరో వర్గం గూర్ఖాలు. యుద్దంలో వారు వీరులే. పొట్టి వాళ్లయినా గట్టివాళ్లు. వాళ్ల తలకాయలు ఉక్కు కవచాల్లాగ గట్టిగానే ఉన్నా లోపల మాత్రం మెదళ్ల బదులు పచ్చిపెండ ఉంటది. ఆలోచన అనేదే ఉండదు. ఈ కోతి గుద్ద తెల్ల తోలుగాళ్లు వాళ్ల చేతికి తుపాకీ ఇచ్చి ”ఒరే మీ అమ్మను కాల్చి రారా” అంటే వాళ్లు వాళ్ల అమ్మా నాయనల్ని ఇద్దర్నీ వరసపెట్టి కాల్చేస్తారు. అదీ వారి స్వామిభక్తి. విశ్వాసగుణం. పైసా హీ పరమాత్మ హై.
 ఆ పోరులో జన నష్టం రెండువైపులా జరిగింది. అదృష్టంకొద్ది మా వాళ్లనెవరినీ వాల్లు బందీలుగా పట్టుకపోలేదు. మేమే వారిని ముప్పైమందిని బందీలుగా పట్టుకున్నాం. చనిపోయిన శత్రువుల మృతదేహాలను గాలించి వారి వద్దవున్న బంగారు, వెండి నాణాలను స్వాధీనం చేసుకున్నాం. వారి చెవులు, చేతి వేళ్లను కత్తిరించి చెవిపోగులను, వేళ్ల ఉంగరాలను మాజేబుల్లో వేసుకున్నాం. యుద్దరంగంలో నైతిక సూత్రాలు, మానవత్వం ఉండవు కదా!
 హడ్సన్‌ సాబ్‌ ఆ బందీలందర్ని ఒక చెట్టుక్రింద వరుసగా నిలబెట్టి వారిని విచారించడం ప్రారంభించాడు. వారందర్నీ మోకాళ్లపై వంగి కూచోమని ఆజ్ఞాపించాడు. వారిలో గడ్డం, మీసాలు బాగా నెరిసిన ఒక నాయకుడు లాంటివాణ్ణి ప్రశ్నించడం మొదలుపెట్టినాడు.
 ’కంపెనీ ఉప్పు ఎంతకాలం నుండి తింటున్నావ్‌?
 ”జీ హుజూర్‌ తప్పయిపోయింది. క్షమించాలి” వాడు ప్రాణ భీతితో ప్రార్థించసాగాడు. మిగిలిన అందరూ కూడా అదే పద్దతిలో రెండు చేతులూ జోడించి ఏడుపు రాగాలతో క్షమాభిక్షకోసం మొత్తుకోసాగారు. హడ్సన్‌ ఆ ఏడుపుల్ని పట్టించుకోకుండానే మీరంతా ఏ రెజిమెంటుకు చెందిన వారు? అని ప్రశ్నల పరంపరని కొనసాగించి తనకు కావాల్సిన సమాచారాన్నంతా సేకరించుకుని చివరికి బెల్టులోనుండి తన రివాల్వర్‌ను ఇవతలికి తీసి నాయకుడి కణతకు గురిపెట్టినాడు.
 ”మత్‌ మారో సాబ్‌” అని వాడు గొల్లుమన్నాడు. ట్రిగ్గర్‌ నొక్కేసరికి ముసలాడి తల నుండి గుండు ఇటునుండి అటు ఇవతలికి దూసుకువచ్చింది. వాడు ‘యా అల్లా’ అంటూ నేలకొరిగాడు.
 ’మిగిలిన వారి తలల్ని నరికి పారేయండి’ అని హుకుం జారీ చేసి హడ్సన్‌సాబ్‌ వడివడిగా నడుచుకుంటూ అక్కడ్నించి వెళ్లిపోయాడు. మా కృప్రాణాలతో మిగిలిన వారి తలలు నరకటం జున్ను ముక్కల్ని కోయటం కన్నా సులభంగా అనిపించింది. తలలు తెగగోసే ఆ క్రీడా వినోదాన్ని చాలా సేపు ఆనందించాం.
 ఆ రోజు రాత్రి రమ్ముకు రేషన్‌ లేదు. పీకలదాకా తాగేటట్టు సరఫరా చేశారు.

* * *
 మేం ఇంకా ఢిల్లీ నగరంపై దాడి మొదలు పెట్టనేలేదు. కోట లోపల నగరమంతా తిరుగుబాటుదారుల స్వాధీనంలోనే ఉంది. నగరంలో కనబడ్డ ప్రతి తెల్లవాడిని ‘ముజాహిద్దీన్‌లు’ నరికిపారేశారు. ముసలి ముతకా పిల్లల్ని చిత్రవధలకు గురిచేశారు. మేంసాబ్‌లను ఆటబొమ్మలుగా ఆడుకుని వాడుకుని చివరికి చంపేశారు. బహద్దూర్‌ షా జఫర్‌ అనేక మంది ఆంగ్లేయ స్త్రీ పురుష పిల్లలను తన ఎర్రకోటలోని నేలమాళిగలో ఆశ్రయమిచ్చి, వారిని చంపవద్దని కాపాడినా అది ఎంతో కాలం కొనసాగలేదు. అలగాజనం మూకల రాజ్యం ముందు ‘షా ఆలం’ పరిపాలన బేకార్‌ అయిపోయింది.
 ఎర్రకోట బురుజుల మీద నుండి తిరుగుబాటుదారులు అడపాదడపా మాపై తుపాకులు, ఫిరంగులు పేలుస్తూ మమ్మల్ని నిరంతరం కవ్విస్తూనే ఉన్నారు. కదనానికి కాలు దువ్వుతునే ఉన్నారు. హడ్సన్‌ సాబ్‌ సరిఐన సమయంకోసం కాచుకొని వున్నట్టుంది. ఈలోగా తిరుగుబాటు దారులు తెలివిగా రాయబారాలను ప్రారంభించారు. మా శిబిరాలలోకి దూతలను పంపారు. ముస్లింలు ముసల్మానుల దగ్గరకి చేతులలో ఖురానులతో వచ్చి నీచమైన పందిమాంసాన్ని తినే ఫిరంగీలకు వ్యతిరేకంగా కొనసాగుతున్న అతి పవిత్ర మత యుద్దం ”జీహద్‌కు” మద్దతు ఇవ్వమని కాళ్లుపట్టుకుని ప్రార్ధించారు. కన్నీళ్లు పెట్టుకొని మనుసుల్ని కరిగించేందుకు ప్రయత్నించారు. మాలోపల వున్న బెలూచీ పఠాన్లు, పంజాబీ ముస్లింలు వారి విజ్ఞప్తులను లెక్కచేయలేదు. చేతులలో అతి పవిత్ర గంగాజలం తీర్ధపాత్రలతో సద్బ్రాహ్మణులు మా శిబిరాలలో ఉన్న సిక్కు, మరాఠాల వద్దకు వచ్చి గోమాంసాన్ని భుజించే మ్లేచ్చులకు, అప్రాచ్యులకు వ్యతిరేకంగా కొనసాగుతున్న పవిత్ర యుద్దానికి మద్దతు ఇచ్చి తమతో కలవాలని ఉపదేశించారు. మేం అసలే సర్ధార్‌జీ దమాక్‌లం కదా! పండిత్‌ల, ముల్లాల ఉపదేశాలనన్నింటినీ పెడచెవిని పెట్టి వారందరినీ కలిసికట్టుగా దగ్గరలో వున్న వేపచెట్టుకొమ్మలకు సామూహికంగా ఉరిదీశాం. అట్ల వారందరికీ మా చేతులల్ల స్వర్గప్రాప్తి లభించింది.
 అయితే ఏ మాట కామాట. మేం కాసులకోసం పనిచేసే కిరాయి కూలీలమే గావొచ్చు గాని అంగ్రేజీలకు జీహుజూర్‌ సలాంగాళ్లం, గులాం గాళ్లం మాత్రం కాదు. మేం గురుగోవింద్‌, రంజిత్‌ సింగు, అర్జున్‌ సింగుల వారసులం. వీరపుత్రులం, వీరకేసరులం. తెల్లవాళ్లకు మేం మా ఆత్మల్ని కుదువపెట్టలేదు. నేను అన్నింటినీ సునిశితంగా గమనిస్తునే ఉన్నాను. మేం ప్రాణాలకు తెగించి ఎంత పోరాడినా అంగ్రేజీలు మమ్మల్ని ఎప్పుడూ మిగతా తెల్లసైనికులతో సమానంగా చూడలేదు. అడుగడుగునా మాకు వివక్ష. యుద్దంలో మేం గాయపడితే డాక్టర్లు, దవాఖానాలు మాకు లేవు. ఏదో ఒక మలాము మా ముఖాన పడేసి రెండు రోజులలో కోలుకుని మళ్లీ యుద్దరంగానికి రావాలని హుకుం జారీ చేసేవారు. అదే వారి సైనికులు గాయపడితే అన్నిరకాల వైద్య సదుపాయాలను సమకూర్చేవారు. కోలుకునే వరకూ పూర్తిగా సెలవు లభించేది. అంగ్రేజీ అఫీసర్లు మంచి మంచి భవనాలలో, వారి సైనికులు మంచి బ్యారక్సులలో ఉండేవారు. మాకు మాత్రం చెట్లక్రింద గుడారాలే గతి. మాకు వారి భాష ఇంగ్లీషు రాదు కావున వారు ఇంగ్లీషులోనే మాట్లాడుకుంటూ మమ్మల్ని అపహాస్యం చేసేవారు. మామీద జోకుల్ని చెప్పుకునేవారు. అయినా మేం అన్నిటినీ భరించేవారం. పాపీ పేఠ్‌ హై!.
 దేశంలోని వివిధ ప్రాంతాలనుండి మరికొన్ని పటాలాలు రావాలని అప్పుడే అందరూ మూకుమ్మడిగా ఢీల్లీ పై దండయాత్ర చేయాలని హడ్సన్‌ సాబ్‌ ప్రణాళిక. యుద్దవ్యూహం. మే, జూన్‌ ఎండలన్నీ మా తలల మీదుగానే వెళ్లిపోయినాయి. ఈదురు గాలులతో వానలు మొదలయినాయి. గబ్బిలాల వలె ఎండలకు అంటకాగిన మాకు వర్షపు జల్లులు, మట్టి పరిమళాలు ఆనందాలను మోసుకొచ్చినాయి. మేమంతా బల్లే బల్లే అని పాటలు పాడుతూ బాంగ్రానృత్యాలు చేస్తు వానచినుకులలో తడిచేవాళ్ళం. మా ఆనందానికి కారణమేమిటో అంగ్రేజులకు అర్థంకాక ఏమిటీ సంగతి? అని గూర్ఖాలను అడిగారు. వారికి మాకు అనేక విషయాలలో చుక్కెదురు. ఇద్దరిదీ ఒకే కొలువైనా ఉప్పునిప్పులాగ ఉండేవాళ్లం. వారడిగిన ప్రశ్నకు గూర్ఖాలు వెటకారంగా ”సాహెబ్‌ ఈ సర్దార్జీలకు జుట్టు చాలా పొడుగ్గా ఉంటుంది కదా. ఈ వేసవి ఎండల వేడిమి వారి జుట్టుద్వారా తలలోకి దిగి భరించలేక పిచ్చెక్కి నృత్యం చేస్తున్నారు. అని సమాధానమిచ్చారు. గూర్ఖాల జుట్టు చాలా కురచ కావున మా పొడవైన వెంట్రుకలు ఉన్నజుట్టంటే వారికి హేళన.
 ఆ గూర్ఖాల వెటకారం విన్న మా వాడొక్కడు కుక్కకాటుకు చెప్పుదెబ్బ అన్నట్లు ”ఓయ్‌ మీ అమ్మా అక్క చెల్లెళ్లకు కూడా పొడవైన జుట్టుంది. వారికి కూడా వేడి తగిలుండొచ్చు. వారందర్నీ మా దగ్గరికి పంపండి. తలలోనే కాదు వారి తొడల మధ్యన ఉన్న వేడిని కూడా తగ్గించి పంపుతాం” అని విసురుగా సమాధానం ఇచ్చాడు. పాపం గూర్ఖాలు మళ్లీ నోరెత్తలేదు. సాయంకాలం కురిసిన వర్షాలకు రాత్రిళ్లు వెలుతురు పురుగులు విజృంభించి ఎగురుతుండేవి. కొన్ని వెలుతురు పురుగులు మా గడ్డాలల్ల చిక్కుకుని రత్నాలలాగ మెరుస్తుండేవి. ఆ ఆనందంతో మే మళ్లీ బాంగ్రా నృత్యాలు చేసేవాళ్లం.
 ఒక రోజు రాత్రంతా వర్షం కురిసి తెల్లారింది. ఆకాశం కడిగిన ముత్యంలాగ తెల్లగా మెరిసిపోతుంది. అక్కడక్కడా నల్లని మబ్బులు గుంపులు గుంపులుగా తిరుగుతున్నాయి. అంతటా ఆకుపచ్చని సతత హరితాలు. ఇంతలో నాకు నెమళ్ల చప్పుడు ”క్రీంకారాలు” వినబడ్డవి. ఆ దిక్కు చూసేసరికి ఒక మొగ నెమిలి రెండు ఆడనెమళ్లు ఆనందంతో పురివిప్పి నాట్యాలు చేస్తున్నాయి. ఆ సుందర దృశ్యాన్ని చూసేసరికి నా మనస్సు కూడా ఎగిరి గంతులు వేసి నాట్యం చేసింది. మా గుడారం లోకి పరుగెత్తి నిద్రపోతున్న నా సహచరుల్ని లేపుతూ ”ఓయ్‌ మత్తుమందు బానిసల్లారా లేవండి, లేవండి నెమళ్లు నాట్యాలు చేస్తున్నాయి” అని అరవసాగాను. ”నీ యమ్మ నువ్వు నీ నెమళ్లు….” అని బూతులు తిడుతూ లెహనా అటు తిరిగి పండుకున్నాడు. మిగిలిన ఒకరిద్దరు నాతో పాటు ఇవతలికి వచ్చి నెమళ్ల నాట్యాన్ని చూస్తున్నారు. పురివిప్పిన నెమళ్ల పింఛాలు ఎండపొడకు ధగధగా మెరుస్తున్నాయి. మగ నెమలి రాచఠీవితో మెడను పొడుగ్గా సాగదీసి అడుగుల్ని ముందుకు, వెనక్కు వేస్తు లయబద్దంగా నాట్యం చేస్తుంది. వాటిని వాటి నాట్యాన్ని చూస్తున్న నా మనస్సు మానస సరోవరం అయ్యింది.

ఇంతలో ఢాం అని తుపాకీ చప్పుడు వినబడింది. నాకేమీ అర్థం కాలేదు. మళ్లీ ఢాం ఢాం అని రెండుసార్లు చప్పుడయ్యింది. నేను నా ఆనందలోకంలోనుండి ఇవతలికి వచ్చేసరికి నేలమీద మూడు నెమళ్లు రక్తాలు కారుస్తూ విగత జీవులై పడిఉన్నాయి.
 ”హే” మొత్తం మూడింటిని పడగొట్టాం అని ఒక తెల్లసైనికుడు గంతులు వేస్తూ అరుస్తున్నాడు. నేను నేలమీద కూలబడి ముఖాన్ని నా రెండు చేతుల మధ్య దాచుకుని వెక్కివెక్కి ఏడవసాగాను. ఇటువంటి హృదయం లేని లుచ్ఛాగాళ్ల కోసమా నేను యుద్దానికొచ్చింది. ఇటువంటి కోతి ముఖంగాళ్ల తరపునా నేను యుద్దం చేస్తున్నది. వీళ్లకు వర్షాల అందం గురించి ఏం తెలుసు? నల్లటి దట్టమైన మేఘాల లాంటి జుట్టు వీళ్ల స్త్రీలకు ఉండదు గాక ఉండదు. మరి అట్లాంటప్పుడు ఆకాశంలో సంచరించే నల్లటి మబ్బుల గుంపుల్ని చూస్తే తలారా స్నానం చేసి నల్లటి దట్టమైన వెంట్రుకల్ని విరబోసుకున్న భార్యలు ఎట్లా జ్ఞాపకం వస్తారు? విరహవేదనను ఎట్లా ఆనందిస్తారు. విరహాన్ని వ్యక్తపరిచే మగనెమలి నాట్యాన్ని కూడా ఆనందించలేరు కదా? వయసొచ్చిన వీళ్ల ఆడపిల్లలు మామిడిచెట్టు కొమ్మలకు ఊయలలూగుతూ పాటలు పాడరు కదా? అసలు వీళ్లకు పాటలు పాడటం వచ్చా? ఈ కిరస్తానీ వాళ్లు ప్రతి ఆదివారం చర్చికి హాజరయ్యి గార్ధభ గొంతుతో హాహా హహా అని ఓండ్ర పెట్టటమే గాని మరి ఇట్లాంటి వాళ్లు వర్షపు చినుకుల చిటపటల సంగీతాన్ని ఎట్లా ఆస్వాదిస్తారు. నెమళ్ల నాట్యాన్ని ఎట్లా ఆనందిస్తారు. ప్రకృతిలో వున్న ఆకుపచ్చదనాన్ని అందాన్ని వీరు గుర్తించలేరు. మనుషుల్ని ప్రాణుల్ని చంపడమొక్కటే వీరికి ఆనందం కల్గించే విషయం. ఇటువంటి వారికోసమేనా నేను నా కన్న తల్లి లాంటి ఊరిని వదిలి ఇంతదూరం వచ్చింది? అట్ల నేను వెక్కెక్కి చాలా సేపు ఏడిచాను.
 మర్నాడు ఉదయం చాయ్‌ అందించడానికి నేను హడ్సన్‌ సాబ్‌ కచ్చీర్‌లోకి అడుగు పెట్టగానే ”అందర్ని సిద్దంగా ఉండమను. ఢిల్లీ మీదికి హమ్లాకు వెళ్లాలి” అని హుకుం జారీ చేశాడు.

* * *

వర్షం తుంపరలనే మా దండు బయలుదేరింది. పెద్ద పెద్ద ఫిరంగులను ఏనుగులు భారంగా లాగుతూ నడుస్తున్నాయి. వాటి చక్రాలు బురదలో చిక్కుకుని మందకొడిగా ప్రయాణం సాగుతుంది. ఒంటెలు, ఎద్దులు చిన్న చిన్న ఫిరంగులను లాగుతున్నాయి. నేల బురదతో జారుడుగా ఉన్నందున మేం కూడా అడుగుల్ని జాగ్రత్తగానే వేస్తున్నాం. అట్ల మధ్యాహ్నం కల్లా మేం ఢిల్లీ సబ్జీమండి ప్రాంతానికి చేరుకున్నాం. అప్పటికి వర్షం తగ్గి లేత ఎండ వచ్చింది. పిల్లలంతా రంగు రంగుల పతంగులను ఆకాశంలో ఎగురేస్తూ ”కాట్‌ హై” అని అరుస్తున్నారు. పెద్దలు నల్లని తెల్లని పావురాలను ఆకాశంలోకి వదిలి అవి టపటపా ఎగురుతుంటే సీటీలు బజాయిస్తున్నారు. సబ్జిమండి వేశ్యావాటికలో నుండి కాళ్ల గజ్జెల సవ్వడి కమనీయంగా వినిపిస్తుంది. తబ్లాలు మంద్ర స్వరంతో మోగుతున్నాయి. ఢిల్లీవాలాలందరూ ఆనందోత్సాహాలలో మునిగి తేలుతున్నారు.
 కాశ్మీరీ గేట్‌కు గురిపెట్టి మేం ఫిరంగులను పేల్చగానే ఢాం ఢాం అని ప్రళయభీకర శబ్దాలతో గేటు ముక్కలయ్యి కుప్పకూలింది. ప్రజలందరూ హోష్‌లోకి వచ్చారు. పిల్లలు పతంగులను గబగబా క్రిందికి లాగారు. పావురాలు తమ తమ గూళ్లకు చేరుకున్నాయి. ప్రజలందరూ వీధుల నుండి పారిపోయి ఇళ్లల్లో తలదాచుకున్నారు. ఇంతలో మేం మోతీ దర్వజాను కూడా కూలగొట్టి సబ్జీమండి బజారుల గుండా కవాతు చేస్తూ చౌరస్తాలో వున్న అతిపెద్ద భవంతిని చుట్టుముట్టాం. వీధులలో నిలబడి విచ్చలవిడిగా కాల్పులు జరిపాం. కనబడిన ప్రతి ఒక్కరినీ తల్వార్లతో నరికి వేసాం. మేం చుట్టు ముట్టిన బంగ్లాలో తిరుగుబాటుదారులు, వారి ముఖ్య నాయకులు వున్న సమాచారం మాకు ముందే గూఢచారుల ద్వారా తెలిసింది. కావున దాని ముట్టడే మా ప్రధాన లక్ష్యం. తిరుగుబాటు దారుల స్థావరం కన్నా ముందు ఆ భవనం ఒక వేశ్యావాటిక. మాకందిన సమాచారం నిజమని రుజువైంది. ఆ బంగ్లా పెద్ద దర్వాజాను చిన్న ఫిరంగితో కూల్చి లోపలికి దూసుకపోయాం. మా ముందు వారి నాటు తుపాకులు బేకార్‌ అయినాయి. బంగ్లాలో కనబడిన ప్రతి ఒక్కరినీ కాల్చివేసాం లేదా నరికివేసాం. ఇంతలో మెట్లపైనున్న గదిలో ఏదో చప్పుడు వినిపించింది. నేను మరికొంత మందిమి ఆ ప్రయత్నంలో ఆ మెట్లు ఎక్కసాగినాం. అక్కడున్న దృశ్యాన్ని చూసేసరికి మేం ఆశ్చర్య చకితులమయినాం.
 అక్కడ చివరి మెట్టుపై ఒక స్త్రీ చిరుతపులిలా మెరుస్తున్న కండ్లతో చేతిలో ఒక పెద్ద జంబియా పట్టుకొని రొప్పుతూ నిలబడి ఉంది. ఆమె ముక్కుపుడకలో వున్న వజ్రంపై ఎండపడి అది తళుక్కుమని మెరుస్తుంది. అటు ఇటు కాని మధ్య వయస్సు. ఆమె అందంలో రాచఠీవి కనబడుతుంది.
 ’భాయ్‌ నాధియా’ అని బిగ్గరగా కేకేసి ఇటు చూడు నేనెవర్ని పట్టుకున్నానో అని అరిచాను. నాధాసింగు నావైపు వచ్చి ఆమెను చూసి ‘బల్లే బల్లే’ అని సంతోషంతో అరిచాడు. ఇంతలో చాలా మంది సిక్కుసైనికులు అక్కడ జమ అయినారు. మా అందరి చేతులలో తుపాకులు ఆమె చేతిలో తుప్పుపట్టిన ఒక పాత కత్తి. పూర్తిగా మగ్గిన మామిడి పండు లాంటి ప్రౌడ వయస్సు ఆమెది. మెరుస్తున్న కండ్లతో ఆమె రోషంతో రొప్పుతూ ఉంటే బరువైన ఆమె రొమ్ములు సముద్రంలోని అలల్లా ఎగిసిపడుతున్నాయి. ఇంతలో నాథూ ఒడుపుగా ఆమె చేతిలోని కత్తిని లాక్కున్నాడు.
 ”బీబీ నీ చురుకైన చురచుర చూపులతోనే మమ్మల్ని చంపొచ్చుగా ఈ కత్తి నీకెందుకు?” అని సరసమాడాడు. ”ఓయ్‌ నాథియా! ఏం మాటలవి? ఆమెకు మీ అమ్మంత వయస్సుంది” అని ఎవరో నాథాసింగును హెచ్చరించారు.
 ”అబే జాభే. మేం ఎవడి అమ్మల్ని వదిలి పెట్టం” నాథియా యవ్వనమదంతో దురుసుగా జవాబిచ్చాడు.
 ఆ మాటలు విన్న అందరూ ఫక్కున నవ్వారు.
 మాటలలోనే హడ్సన్‌ సాబ్‌ మా దగ్గరకి వచ్చాడు. మేమందరం నిశ్శబ్దంగా నిలుచున్నాం. నాథా ఆమెను కొప్పుపట్టి ఈడ్చుకుంటూ వచ్చి ఆయన కాళ్లమీద పడేటట్టు విసిరేశాడు. హడ్సన్‌ పాదాల చెంత ఆమె కుప్పకూలింది. అంతలోనే సంభాళించుకుని లేచి నిలబడి.
 ’మీ తుపాకీతో నన్ను కాల్చేయండి’ అని హడ్సన్‌ సాబ్‌ను అడిగింది. ఆమె గొంతులో ఏ మాత్రం భయం లేదు.
 ”నువ్వు వేశ్యవా?” హడ్సన్‌ సాబ్‌ ఆమె కండ్లలో సూటిగా చూస్తూ ప్రశ్నించాడు.
 ”అవును ఒకప్పుడు, కాని ఇప్పుడు నేను ముజాహిద్దీన్‌ను” ఆమె ధైర్యంగా సమాధానమిచ్చింది.
 ”ఇక్కడేం చేస్తున్నావ్‌?”
 ”తిరుగుబాటు చేస్తున్న సోదరులకు నా సహాయాన్ని అందిస్తున్నాను”.
 ”ఎందుకు? నీకేం పని?”
 ”మీ కిరస్తానీ పరిపాలనను అంతం చేయటమే నా లక్ష్యం”.
 ఒక మామూలు వేశ్యనోటివెంట అటువంటి మాటలు వినడం వలన ఆయన ముఖం కందగడ్డలాగ ఎర్రగా మారింది. అది గమనించిన నేను ఆయన్ని సంతోషపెట్టే పనిగా నా తుపాకీ బాయ్‌నెట్‌ మొనను ఆమె రొమ్ముల మధ్యన గురిపెట్టి
 ”ఏయ్‌ లంజా! మాటలు చక్కగా రానీయ్‌. నాలుక అదుపులో పెట్టుకో. లేదంటే ఇది నీ గుండెల్లోకి దిగుతుంది” అని తీవ్రంగా హెచ్చరించాను.
 అయినా ఆ సిగ్గులేని ఆడది ఏ మాత్రం జంకలేదు.
 ”నిహాల్‌ సింగు ఆమెను ఇంటారాగేట్‌ చేయడానికి మన క్యాంపుకు తీసుకురా ఆ తర్వాత ఆమె కోరిన విధంగానే ఆమెను స్వర్గానికి పంపిద్దాం” అని హడ్సన్‌సాబ్‌ నన్ను ఆదేశించినాడు. ఆమెను బందీగా చేసి మేమందరం ఆమెను మా క్యాంపుకు తీసుకువెళ్తున్నాం. ఆమె వెనుక నేను నడుస్తున్నాను. ఆమె మెల్లగా నడుస్తుంటే త్వరగా నడవమని సూచిస్తూ ఆమె పిరుదులపై నా అరచేతితో చరిచాను. ఒక్కోసారి నా చూపుడు వేలుతో అక్కడ పొడవడం చేశాను. మా వాళ్లంతా ఆమెను అపహాస్యం చేస్తూ, వ్యాఖ్యానాలు చేస్తూ చాలా చాలా ఆనందించారు.
 ’అరే భాయి ఈ రాత్రి మన ఆయుధాలకు బాగా పాలిష్‌ పెట్టుకుందామా’ అన్నాడు నాథా.
 ”ఓ భామా మా తుపాకుల వేడిని నువ్వు తగ్గించు. తర్వాత ఓ బుల్లెట్‌ను నీ శరీరంలోకి దింపి నీ వేడిని మేం తగ్గిస్తాం” లెహనా మరో జోకు వేశాడు. అందరం ఫకాలున విరగబడి నవ్వాం. ఆమె మాత్రం మమ్మల్ని లెక్కచేయలేదు. కనీసం మా మాటలు విన్నట్టు కూడా లేదు. నిర్వికారంగా నడుస్తుంది.
 ఆమెను సాబ్‌ టెంట్‌ లోపలికి పట్టుకెళ్లాను. ఆయన తన హెల్మెట్‌ను తీసి బెల్టు వదులు చేసుకుని నడుముకున్న పటకా కత్తిని టేబుల్‌పై పెట్టాడు. తిరిగి ఆమెను సమీపించి తన అరచేతితో గట్టిగా ఆమె ముఖంపై లాగి కొట్టాడు. ఊహించని ఆ దెబ్బకు ఆమె వెనక్కు విరుచుకొని పడ్డది. ఆ పడటంతో ఆమె తల వెనుకనున్న గోడ ఢీకొని కాసేపు కండ్లు భైర్లుకమ్మి తలంతా దిమ్మెరపోయింది.
 ”మీరు నన్ను చంపదలచుకొంటే చంపండి. అంతే కాని ఈ చిత్రహింసలు పెట్టకండి”. దీనంగా రెండు చేతులు జోడించి ఆమె సాబ్‌ను ప్రార్థిస్తుంది.
 సాబ్‌ ఆమెకు దగ్గరగా ఓ కుర్చీలాగి వేసుకున్నాడు. జేబులోంచి ఒక చిన్న డైరీ మరియు పెన్సిల్‌ తీసి చేతపట్టుకుని……. ‘నీ పేరు’ అడిగాడు.
 ”అన్వర్‌ భాయి”.
 ”ఇల్లు?”
 ”చావిడీ బజార్‌”.
 ”మీ తిరుగుబాటు ముఠాకు నాయకుడెవరు?”
 ”భక్త్‌ఖాన్‌ రాయ్‌బరేలీ జనరల్‌”.
 ”ఆ నమక్‌హరాం బేదార్‌ గాడు జనరల్‌ ఎప్పుడయ్యాడు?” కోపంగా ప్రశ్నించాడు.
 ”ఈ సబ్జిమండి ప్రాంతంలో ఎంత మంది తిరుగుబాటు దార్లు ఉన్నారు?” మళ్లీ ప్రశ్నించాడు.
 ”నాకు ఆ వివరాలు తెలియదు. ఈ రోజే నేను గార్డు డ్యూటీలో చేరాను. అంతకు ముందు ఆడవాళ్ల దళంలో పనిచేసాను”.
 ”ఆడవాళ్ల దళమా? అది కూడా ఒకటి ప్రత్యేకంగా ఉందా?” హడ్సన్‌ ఆశ్చర్యంతో ప్రశ్నించాడు.
 ”అవును దళంలోని ఆడవాళ్లను ‘జిహాదీన్స్‌’ అని పిలుస్తారు”.
 ”దళంలోని మీ భాద్యతలు, పనులు ఏమిటి?”
 ”పోరాటంలో గాయపడిన వారికి వైద్యసేవలు అందించటం, వంటలు చేసి దళాలకు ఆహారాన్ని సరఫరా చేయటం రహస్య సమాచారం సేకరించటం వగైరా”.
 ”నీ గురించి ఇంకా ఏవైనా చెప్పు”.
 ”చెప్పేదేముంది. గతంలో నేనొక వేశ్యను. చాందినీ చౌక్‌ ప్రాంతంలో స్వయంగా నేనే ఒక గృహాన్ని నడిపేదానిని. ఈ సిపాయిల తిరుగుబాటు ప్రారంభం కాగానే మనసు మార్చుకుని ఈ పవిత్ర మత యుద్ధం ‘జిహాద్‌’లో చేరాను. ఇట్లానైనా గతంలో నేను చేసిన పాపాలకు ప్రాయశ్చితం చేసుకుంటాను. అల్లా నన్ను క్షమిస్తాడు”.
 ”జిహాద్‌” పేరు వినగానే హడ్సన్‌ సాబ్‌కు మళ్లీ చర్రున కోపం నసాళానికి అందుకుంది. ముఖం ఎర్రగా మారింది.
 ”చర్చిలో ప్రార్థనలు చేసుకొంటున్న మా అమాయకమైన స్త్రీలు, పిల్లలను చంపిన మీది పవిత్ర యుద్దమా?”
 ఆమె మౌనంగా ఉంది. ఆ మౌనం అతడ్ని మరింత రెచ్చగొట్టింది. ”మాట్లాడు. రక్తపాతాన్ని సృష్టించడమే మీ జీహాద్‌-మత యుద్ద లక్షణమా”? పులిలా గాండ్రించాడు.
 ఆ బరితెగించిన దానికి సిగ్గే కాదు భయం కూడా లేనట్టుంది. చాలా ప్రశాంతంగా, నిదానంగా సమాధానం చెప్పింది.
 ”సాహెబ్‌ నా కండ్లతో ప్రత్యక్షంగా చూసాను. మీ సైనికులు కూడా ఎంతో మం

ది ఆడవాళ్ల కడుపుల్ని కత్తులతో చీల్చటం, చిన్న పిల్లలను గాలిలోకి విసిరేసి మీ తుపాకీ బాయ్‌నెట్లతో వారిని అట్లనే పొడిచి నిలబెట్టటం……”
 ”ఆపు….” హడ్సన్‌సాబ్‌ నిలువెల్లా కోపంతో కంపించిపోతున్నాడు. అంత కోపంతో నేను అతడ్ని ఎప్పుడూ చూడలేదు.
 ఆమె మళ్లీ మాట్లాడటం మొదలు పెట్టింది.
 ”అంతెందుకు సాహెబ్‌ ఇప్పుడు మీరే స్వయంగా మీ చేతులతోనే నన్ను చంపి ఒక స్త్రీ రక్తాన్ని ఈ భూమిమీద చిందిస్తున్నారు కదా?”
 భయం లేని ఆమె సూటి మాటలకు హడ్సన్‌సాబ్‌ నిరుత్తరుడయ్యాడు. క్షణంలోనే తేరుకుని నావైపు తిరిగి ”ఒక స్త్రీ తన చేతుల్లోకి ఆయుధాన్ని తీసుకొని పురుషుడితో పాటు సమానంగా తిరుగుబాటులో పాల్గొన్నపుడు అతడికి ఏ విధమైన శిక్ష విధిస్తామో ఈ స్త్రీకి కూడా అదే శిక్ష అమలు జరపండి. మళ్లీ ఈమె పేరు నాకు వినబడకూడదు” అని హుకూం జారీ చేశాడు.
 విషయం నాకు అర్థం అయింది. ఆమెను బరబరా లాక్కుంటూ ఇవతలికి తీసుకువచ్చాను.
 సూర్యాస్తమయం అవుతుంది. చీకట్లు కమ్ముకుంటున్నాయి. నాలో జంతువు నిద్ర లేస్తుంది. ముందు ఆమెను నేను అనుభవిస్తాను. హడ్సన్‌ సాబ్‌ ప్రథమ సేవకుడిని కావున అది నా హక్కు. ఆ తర్వాత నేను చిన్న కునుకు తీసేలోగా మిగతా వాళ్లు వంతుల వారిగా ఆమెతో సుఖిస్తారు. మళ్లీ నేను రెండవసారి ఇంకా మూడవసారి అట్లా తెల్లారేదాకా….. ఆ తర్వాత నా చేతులతో నేనే స్వయంగా తుపాకీతో కాల్చేస్తాను. ”బావిదగ్గరకు వెళ్లి దాహం తీర్చుకుని ఆ తర్వాత అదే బావిలో ఉమ్మేసే రకం మేం”.
 ఆమెను మా గుడారానికి తీసుకవచ్చాను. మా వాళ్లు చపాతీలు తయారు చేసి పొయ్యి మీద కాలుస్తున్నారు. ఆమెను చూడగానే మళ్లీ జోకులు ప్రారంభించారు.
 ”ఓయ్‌ నాథా, తొవ్వా (పెనం) గరం హై మరి పని ఎప్పుడు మొదలు పెడదాం?”
 పక పకా నవ్వులు.
 ”ఒరేయ్‌ ఈ పెంకను చెత్తకుప్పపై పారేసే ముందు మనం మన రొట్టెలను హాయిగా కాల్చుకోవచ్చు”.
 ”అబే సాలే. ఇది అసలే బజారు రకం. మనలాంటి ఎన్ని పటాలాలు దీని తొడల సందుల గుండా ప్రయాణించాయో మనకేం తెలుసు?”
 ”ఒయ్‌ నిలహాలియా ముందు దీనిపై నీ ఆయుధాన్ని ప్రయోగించు. ఆ తర్వాత మాలో ఉప్పొంగుతున్న ప్రవాహాలలో దీన్ని ముంచెత్తుతాం”.
 ఆమె చెవుల్లోకి మా మాటలేమీ దూరుతున్నట్లు లేవు. చాలా ప్రశాంతమైన వదనంతో నావైపు తిరిగి.
 ”సర్ధార్జీ మీరు నాకు అనుమతి ఇస్తే నా సాయంకాలం నమాజు ప్రార్థన పూర్తి చేసుకుంటాను. ఆ తర్వాత మీరు నన్ను ఏం చేసుకున్న ఫరవాలేదు” అన్నది.

సరే సరే అని అందరూ ఒకే సారి మొత్తుకొని ”ఒరే నిహాలియా ఆమె అల్లాను ప్రార్థించుకోని. ఆ ప్రార్థనలో అల్లా ఆమె హృదయాన్ని శాంత పరిస్తే ఆ తర్వాత ఆమె మనందర్నీ శాంతపరుస్తుంది” - మళ్లీ గొల్లు గొల్లున నవ్వులు.
 ”ఆల్‌రైట్‌. మరి తొందరగా కానివ్వు. ఫటాఫట్‌” అంటూ అందరితో పాటు నేను కూడా రమ్‌ త్రాగటంలో మునిగిపోయాను.
 ఆమె తన దుపట్టాను దులిపి దుమ్ము నేలపై పరిచింది. సూర్యుడు అస్తమించే పశ్చిమంవైపు తన మోకాళ్లపై శ్రద్దగా కూచుంది. దీపం వెలుగుకు ఆమె ముక్కుపుడక మళ్లీ ధగధగా మెరిసింది. ఆ ముక్కుపుడక ఎవరం తీసుకుందాం? నాథా అడిగాడు.
 ”ఒక్క ముక్కుపుడకే కాదు. చెవులకు కమ్మలు మెడలో బంగారు గొలుసు కూడా ఉన్నాయి” అన్నాడు లెహనా.
 ”తొందరపడకండ్రా. దాని పనిపట్టింతర్వాత మన నిహాల్‌ వాటిన్నంటినీ ఒక్కసారే అమ్మేసి తెచ్చిన డబ్బుల్ని అందరం సమానంగా పంచుకుందాం” మరొకడన్నాడు.
 ఆమె ప్రశాంతంగా ప్రార్థన చేసుకొంటూనే ఉంది. కళ్లు మూసుకుని పెదవులతో ఖురాన్‌ పంక్తుల్ని నిశ్శబ్దంగానే చదువుకుంటుంది. ఆమె మళ్లీ మోకాళ్లపై వంగినపుడు బలమైన ఆమె స్థనాలు బంతుల్లాగ కదలటం నేను గమనిస్తూనే ఉన్నాను. ఆమె ఇంకా క్రిందికి వంగి తన నుదిటిని నేలమీద అనేక సార్లు తాకించింది. మళ్లీ పైకి లేచి అట్లనే మోకాళ్లు ముడుచుకుని కూచుని రెండు చేతుల్ని పుస్తకంలా తెరిచి తన ముఖం ముందు పెట్టుకుంది - పుస్తకాన్ని, చదువుతున్నట్లు. ఆమె ముఖంలో ఒక దివ్యకాంతి వెలుగుతుంది. ఒకానొక తేజస్సు ఆమె ముఖం చుట్టూ కాంతి వలయంలా అలుముకుంది. మేం అందరం హఠాత్తుగా జోకులు వేయటం మానుకున్నాం. ఆమె కళ్లనుండి ధారాపాతంగా కన్నీరు కారుతుంది. మేం మాటలు మాని మౌనంతో గడ్డకట్టుకొనిపోయాం. కారుతున్న కన్నీళ్లు ఆమె చెంపలపైనుండి కారి వేసుకున్న మస్లీన్‌ షర్టును తడిపేస్తున్నాయి. మేం శిలా ప్రతిమల్లా ఎక్కడి వాళ్లం అక్కడే నేలకు అతుక్కుని కూచుండిపోయాం. ఆమె పెదాలు కదలటం మానేశాయి. తన రెండు అరచేతులతో కన్నీళ్లతో తడిసిన ముఖాన్ని సుతారంగా రుద్దుకుంది. కండ్లు మూసుకున్న ముఖాన్ని ఆమె ముందు కుడివైపునకు త్రిప్పింది. ఆ తర్వాత మెల్లగా ఎడంవైపు. నాకు బాగా తెలుసు ముసల్మానులు ప్రార్థనా సమయంలో రెండు వైపులా వున్నవారిని దీవించటానికి అట్లా చేస్తారని. మేం కుడివైపున ఉన్నాం కావున మమ్మల్ని దీవించటానికి ఆమె ముందు కుడివైపుకే తిరిగింది. తన షర్టు జేబులోనుండి ఒక గులాబీ పుష్పాన్ని తీసి దాని రేకులన్నింటినీ లెక్కపెట్టింది. చీకటి బాగా ముదిరింది. ఆమె ఆ గులాబీని తన తలలో తరుముకుని లేచి నిలబడి నా వద్దకు వచ్చి
 ”సర్దార్‌ సాహెబ్‌ నేను సిద్దం” అంది.
 ఎవరూ చప్పుడు చేయలేదు. కనీసం ఆమెవైపు కన్నెత్తి చూసే సాహసం కూడా ఎవరూ చేయలేదు. కొంత సేపయిన తర్వాత నేను నా గుడారంలోకి దారి తీస్తూ ”లోపలికి రా” అన్నాను. ఆమె లోపలికి రాగానే గుడారం పర్ధా వేశాను. కూచో అన్నాను. కూర్చుంది. ఆమె చేతులలో మూడు రొట్టెలు కొంత పప్పు పెట్టి తిను అన్నాను.
 ”సర్ధార్‌జీ నా మీద మీకెందుకింత దయ, ఎట్లాగూ నన్ను తుపాకీతో కాల్చివేస్తున్నారు కదా!” అన్నది.
 ”ముందు తిను తర్వాత మాట్లాడుకుందాం” అన్నాను.
 ఆమె కొంచెం తిన్నది. నీళ్ల సీసా అందించగానే గటగటా కడుపు నిండా నీళ్లు త్రాగింది. చీకటి మాయ పొరలు లోకాన్నంతా కప్పేసినాయి. గుడారంలోని ఇంకో ద్వారం గుండా బయటికి మైదానంలోకి వచ్చాను. ఆమె ముందు నడుస్తుంది. ఆమె వీపుకు నా తుపాకీ బాయ్‌నెట్‌ను ఆనించి వెనక నడుస్తున్నాను.
 దారిలో కాపలా కాసే సెంట్రీలు కలిశారు. ”ఎవరదీ?” అని గట్టిగా కేకేశారు. ”బందీని కాల్చటానికి తీసుకపోతున్నాను”. అని సమాధానం ఇచ్చాను. ఇంతకు ముందు బందీలను కాల్చివేసిన శవాల దిబ్బవైపు ఆమెను నడిపించాను. శవాలు కుళ్లిన వాసన గుప్పుమంది. భరించలేని శవాల దుర్గంధం. ఆ వాసన భరించలేక ఆమె తన ముక్కుపుటాలకు దుపట్టాను అడ్డంగా పెట్టుకుంది. ఆ శవాల దిబ్బను దాటి ఆ చీకటి రాత్రి నడుస్తూ నడుస్తూ సబ్జీమండి మొహల్లా ప్రాంతానికి చేరుకున్నాం. ఆమెను అరెస్టు చేసింది ఆ ప్రాంతంలోనే.
 ”అమ్మా ఇక్కడ్నుంచి మీ ఇంటికి వెళ్లే దారి నీకు తెలుసా?” అడిగాను.
 ”ఆల్లా నిన్ను సదా రక్షించుగాక. అల్లా నిన్ను పిల్లాపాపలతో కలకాలం సుఖంగా ఉండనీ గాక.
 అల్లా……………………………..
 నేను తుపాకీని నేలపై పెట్టి నా రెండు చేతులతో ఆమె పాదాలకు దండం పెట్టి ”అమ్మా మమ్మల్ని క్షమించు. నీతో చాలా హీనంగా ప్రవర్తించాం. చాలా చెడ్డగా మాట్లాడాం. మీరు మాకు నిజంగా మా అమ్మలాంటి వారు”. అని వెక్కెక్కి ఏడిచాను.
 ”అల్లా దయామయుడు. అందరి పాపాలను క్షమిస్తాడు. నన్ను క్షమించిన వాడు మిమ్మల్ని క్షమించడా!” నా తల మీద చేయి వేసి ఆమె ఆశీర్వదించింది.
 చీకట్లో ఆమె నడుచుకుంటూ వెళ్లిపోతుంటే ఆమె కాళ్లకున్న చెప్పులు టక్‌ టక్‌ టక్‌ అని శబ్దం చేస్తున్నాయి. నిశ్శబ్దంగా ఆ శబ్దం మాయమైపోయింది.
 నేను నా తుపాకీని ఆకాశానికి గురిపెట్టి ట్రిగ్గర్‌ను గట్టిగా నొక్కాను.

- ఢాం -

సమాప్తం
(కుష్వంత్‌ సింగు రాసిన ఢిల్లీ నవలలో ఒక భాగానికి అనుసృజన. కుష్వంత్‌ సింగుకు కృతజ్ఞతలతో….)

Share/Save/Bookmark

Leave a Reply

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

Managed by Discover Telangana Inc., a registered nonprofit organization in USA.

All opinions and views expressed by third party content providers and shown here as preview are not that of Discover Telangana.

If you find any Content that is infringing, libelous, defamatory, obscene, abusive, offensive or otherwise violation of copyright law, alert us by emailing us at discover.telangana(at)gmail.com