మూడుయాభైలకిందటి హైదరాబాద్ వీరగాథలు
జనవరి 6th, 2008 by డిస్కవర్ తెలంగాణ
- ఎన్. వేణుగోపాల్
సరిగ్గా మూడు యాభైలకింద దేశమంతా అట్టుడికిపోయింది. పరాయిపాలన దోపిడీ పీడనలు ఇంకానా, ఇకపై చెల్లవు అని ఈ నేల గర్జించింది. ఉత్తర భారతంలో ప్రధానంగానూ, దేశవ్యాప్తంగా అక్కడక్కడా అన్ని వర్గాల ప్రజలూ ఆ బ్రిటిష్ వ్యతిరేక పోరాటంలో పాల్గొన్నారు. తమ మీద, తమ దేశంమీద దౌర్జన్యం సాగిస్తున్న తెల్లవాళ్లపై విరుచుకుపడ్డారు. దాదూ ఫిర్యాదూ లేకుండా వందలాది మంది భారతీయులను ఊచకోతకోసిన తెల్లవాళ్లకు అదే పద్ధతిలో జవాబుచెప్పారు. తెల్లవాళ్లను బందీలుగా పట్టుకుని, రోజులతరబడి చక్రబంధంలో పెట్టి తమ పట్ల వాళ్లు సాగించిన దుర్మార్గం ఎటువంటిదో వాళ్లకే రుచి చూపించారు. ఈ దేశప్రజలను దోచి అపార విలాసాలు అనుభవిస్తున్న తెల్లవాళ్ల ఆస్తిని స్వాదీనం చేసుకున్నారు. బంగళాలను ధ్వంసం చేశారు. రాజవిలాస అధికార చిహ్నాలను భస్మీపటలం చేశారు. ఒక్కమాటలో చెప్పాలంటే, న్యాయమైన ప్రజాగ్రహం అత్యుద్భుతంగా, అసాధారణంగా, అగ్ని పర్వతంలా పెల్లుబికిన సందర్భం అది. ఆగ్రహప్రకటనాక్రమంలో కొన్ని అపశ్రుతులు వ్యక్తమైనప్పటికీ ఈదేశప్రజలు పరాయిపాలనను ప్రతిఘటించిన అపూర్వ ప్రజ్వలనం అది. అట్టడుగు ప్రజలు తమ కొరకు తాము చేసుకున్న యుద్ధం అది. దోపిడీ పీడనలకు వ్యతిరేకంగా ఇవాళ్టిదాకా సాగుతున్న ప్రజాఉద్యమాలన్నీ సగౌరవంగా సంస్మరించుకోవలసిన జ్ఞాపకం అది.
అప్పటికి ఆరుదశాబ్దాల కింద మొదలైన శాశ్వత భూమిశిస్తు విధానం కింద నలిగిపోయిన చిన్నాపెద్దా రైతులు, ఈస్టిండియా కంపెనీ వాణిజ్య విధానాలవల్ల విధ్వంసమైపోయిన చేతివృత్తులవారు, సైన్యసహకారపద్ధతి వల్ల, రాజ్యసంక్రమణ విధానం వల్ల అసంతృప్తి చెందిన సంస్థానాధీశులు, తెల్లదొరల ధాష్టీకానికి విసిగిపోయి, తూటాలకు పూసిన కొవ్వుతో భగ్గున మండిన సైనికులు ఉమ్మడిగా సాగించిన మహాప్రజాయుద్ధమది. హిందువులు, ముస్లింలు తమ మతాచారాల విభజనరేఖలు చెరిపి, ధర్మంకోసమైనా, దీన్ కోసమైనా తెల్లవాళ్లను వెళ్లగొట్టవలసిందేనని నిర్ణయించుకున్న వేళ అది.
అప్పటికే చెదురుమదురుగా సాగుతున్న ఇంగ్లీషు వ్యతిరేక వ్యక్తిగత, సామూహిక ఆందోళనలకు ఒక విశాలవేదికను కల్పించినది 1857. ఇంగ్లీషువాళ్లు అప్పటికి రెండుశాతాబ్దాలుగా వ్యాపారం పేరుమీద సాగించిన విధ్వంసాన్ని, ఒక శతాబ్దంగా పాలనను కూడా తమచేతుల్లోకి తీసుకుని అమలుచేసిన దౌర్జన్యాన్ని ప్రతిఘటిస్తూ అప్పటి భారత సమాజంలోని నాలుగు ప్రధాన వర్గాలు సాగించిన అత్యద్భుతమైన సంగ్రామం 1857. రైతులు, చేతివృత్తులవారు, వారిపిల్లలే అయిన సైనికులు, అప్పటికి కలుపుకోకతప్పని స్థానిక జమీందార్లు, భూస్వామ్య ప్రభువులు - అది ఒక ఆశ్చర్యకరమైన విశాల ఐక్యసంఘటన. కాని అనివార్యమైన ఐక్య సంఘటన. బహుశా ఈ దేశంలో ఈ మట్టిలోంచి పుట్టుకొచ్చిన ప్రజాస్వామిక విప్లవానికి ఒక తొలిపాదు అది.
ఆ ప్రజాస్వామిక విప్లవపు తొలిపాదులో మనం గెలిచి ఉంటే తప్పనిసరిగా భారత సమాజం ఇవాళ ఉన్నట్టుగా ఉండేది కాదు. కనీసమైన ప్రజాస్వామిక స్వభావానికి ఆ పోరాటం ఒక మార్గ నిర్దేశనం చేసింది. పరాయిపాలన వద్దు అని స్పష్టంగా ప్రకటించింది. పరాయిపాలనకు వ్యతిరేకంగా ఈ దేశంలోని ప్రధాన వర్గాలను కూడగట్టింది. ఈ దేశ పీడితప్రజలుగా హిందువులు, ముస్లింలు తమను తాము ఎప్పుడూ వేరుగా చూసుకోలేదని, బ్రిటిష్ వ్యతిరేక పోరాటంలో అద్భుతమైన ఐక్యతను ప్రదర్శించడం ద్వారా ఆ యుద్ధం చూపెట్టింది.
ఆ మార్గం నెత్తురుటేర్లలో విఫలమైన తర్వాతనే, ఆ నాలుగు వర్గాలను పక్కనపెడుతూ, లేదా పైపైన చూపెడుతూ ప్రధానంగా వ్యాపార వర్గాలు, విద్యావంతులు, మధ్యతరగతి పాల్గొన్న జాతీయోద్యమం అనబడేది ప్రారంభమైంది. భారత జాతీయ కాంగ్రెస్ నాయకత్వంలోని ఆ జాతీయోద్యమం పరాయిపాలన నిజంగా రద్దయిపోయే మార్గాన్ని గాక ప్రచ్ఛన్న రూపంలో కొనసాగే, తిరిగి వచ్చే మార్గాన్ని చేపట్టింది. కత్తితో, తుపాకితో పాలిస్తున్న దౌర్జన్య రాజ్యాన్ని ధ్వంసించడానికి కత్తి తూపాకీ పట్టక తప్పదని సహజమైన, అనివార్యమైన సాయుధపారాట పాఠం నేర్పిన 1857ను విస్మరింపజేసింది. ప్రథమ భారత స్వాతంత్య్ర సంగ్రామాన్ని సిపాయిల తిరుగుబాటుగా తక్కువ చేసి చూపిన బ్రిటిష్ చరిత్రకారుల అబద్ధాన్ని నమ్ముతూ, అబద్ధపు శాంతి అహింసల కుహనా స్వాతంత్య్ర పోరాట మార్గాన్ని చేపట్టింది.
అరవై సంవత్సరాల కింద గెలిచిందని మనం ఊదరగొట్టుకుంటున్న ఆ మార్గం నిజం భారతీయుల గెలుపు కాదు, భారతీయుల గెలుపులాగ కనిపించిన పరాయిపాలకుల గెలుపు. రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యం కూలిపోయిందని భ్రమగొలిపి, రవి అస్తమించని బహుళ జాతిసంస్థల సామ్రాజ్యాన్ని విస్తరించిన మలుపు అది. దేశాన్ని ప్రత్యక్ష వలస స్థానం నుంచి, పరోక్ష వలసగా, అర్ధవలసగా మార్చిన పరిణామం అది. ఆ రోజున సాధించినది ఈ దేశ పీడిత ప్రజలు కోరుకున్న, భగత్‌సింగు స్పష్టంగా వ్యక్తీకరించిన నిజమైన స్వాతంత్య్రం కాదనీ, అది కేవలం తెల్లదొరల దోపిడీ పీడనల స్థానంలో నల్లదొరల దోపిడీపీడనలను నెలకొల్పడమేననీ 1947లో గుర్తించిన వారు కొందరేకావచ్చు. ఆ ఎరుక 1967 నాటికి మరికొంత ఎక్కువ మందికి కలిగి ఉండవచ్చు. కాని 2007 వచ్చే నాటికి పాలకవర్గాలకు చెందిన వారెందరో కూడా రెండో స్వాతంత్య్ర పోరాటం గురించి మాట్లాడక తప్పని పరిస్థితి వచ్చింది.
1857 ప్రథమ భారత స్వాతంత్య్ర సంగ్రామంలో పరాయిపాలన రద్దయిపోవాలనే గొప్ప కలతో ప్రాణాలు బలిపెట్టిన వేలాది మంది వీరయోధుల కలలు ఇవాళ్టికీ సాకారం కాలేదు. ఆ అసంపూర్ణ స్వప్నాన్ని నిజం చేయవలసిన కర్తవ్యం ఈ దేశం ముందర ఇంకా మిగిలే ఉన్నది. అందువల్ల ఇవాళ జరుగుతున్న అధికారమార్పిడి అరవై సంవత్సరాల ఉత్సవం ప్రథమభారత స్వాతంత్య్ర సంగ్రామపు ప్రాథాన్యతను మరింతగా గుర్తుతెస్తున్నది. ఇవాళ, నూతన ఆర్థిక విధానాల తర్వాత, ప్రపంచీకరణ పేరిట కొత్త సామ్రాజ్యవాద విధానాల తర్వాత, 1857ను గుర్తు తెచ్చుకోవలసిన అవసరం ఇంకా పెరిగింది. ‘ఆగస్టు 15 విద్రోహం గురించి చెప్పకపోతే అన్నం సయించదు నాకు’ అని చెరబండ రాజు అన్నట్టు 1947 విద్రోహం గురించి స్పష్టంగా తెలుసుకోవాలంటే 1857లో చిదిమి వేయబడిన స్వప్నాలగురించి తెలుసుకోవలసి ఉంటుంది. 1857 వీరగాథలను మననం చేసుకోవలసి ఉంటుంది. మనతాతముత్తాతలు అపురూపమైన ధైర్యసాహసాలతో బరిలోకిదూకిన ఆ వీరగాథలను తవ్వితలకెత్తుకుని ఇవాళ్టి కార్యాచరణకు స్ఫూర్తి పొందవలసి ఉంటుంది.
అంత విస్తృతంగా, అంత ఉజ్వలంగా సాగిన ప్రథమ భారత స్వాతంత్య్ర సంగ్రామం ఓడిపోయిన మాట నిజమే. కాని అది ఓడిపోవడంలో, ఆ యుద్ధంలో బ్రిటిష్ వాళ్ళు గెలవడంలో హైదరాబాద్ ప్రాత్ర చాలా ఉన్నదని చరిత్రపుస్తకాలన్నీ ఘోషిస్తున్నాయి. ”హైదరాబాద్ చెయిజారితే, సమస్తమూ చెయిజారినట్టే” అని బొంబాయి గవర్నర్ సరిగ్గా ఆ కల్లోలం జరుగుతున్నప్పుడే హైదరాబాద్ రెసిడెంటుకు ఒక ఆందోళనాపూర్వకమైన టెలిగ్రాము పంపించాడంటే ఈస్టిండియా కంపెనీ అర్థమవుతుంది. కాని అంతముఖ్యమైన హైదరాబాద్ రాజ్యం అప్పటికే బ్రిటిష్ ఒత్తిడికింద ఉండి కూడా, అప్పటికే బేరార్ విషయంలో బ్రిటిష్ వారి మీద అసంతృప్తితో ఉండి కూడ తిరుగుబాటుదారులకు సహకరించదలచలేదు. ఆ కల్లోలం మధ్యనే నాలుగో నిజామ్ నాసీరుద్దౌలా మరణించి, ఐదవ నిజాము అఫ్జలుద్దౌలా గద్దెనెక్కడంతో, ఆధునికీకరణ మోజులో బ్రిటిష్ అనుమాయిగా మారిన ప్రధానమంత్రి మొదటి సాలార్జంగు తనను తాను మంత్రాంగ తంత్రజ్ఞుడిగా భావించుకుని వేసిన వ్యూహాలతో హైదరాబాద్ రాజ్యం ప్రథమ భారత స్వాతంత్య్ర సంగ్రామంలో తీసుకోవలసిన వైఖరి తీసుకోలేకపోయింది. దేశీయ ప్రయోజనాలకు అనుకూలమైన, కనీసం ఇస్లాందీన్‌కు అనుకూలమైన బ్రిటిష్ వ్యతిరేక వైఖరి తీసుకోలేకపోయింది. ”హైదరాబాద్ రాజ్యమూ, దాని ప్రదానమంత్రీ భవిష్యత్ గమనాన్ని అర్థం చేసుకొని ప్రవర్తించి ఉంటే, 1857లో దేశవ్యాప్తంగా సాగిన స్వాతంత్య్ర సమరం, 1857లోనే భారత చరిత్రను మార్చి ఉండేది” అని కాశీనాథరావు వైద్య 1956లో ‘ది ప్రీడం స్ట్రగుల్ ఇన్ హైదరాబాద్’ అనే పుస్తకానికి ముందు మాటరాస్తూ అన్నారు. మొత్తంమీద ఉత్తర భారతదేశంలో అనేక చిన్నా పెద్దా సంస్థానాలలో హిందూ ముస్లిం ప్రభువుల వ్యతిరేకతను ఎదుర్కొన్న బ్రిటిష్ పాలకులు హైదరబాద్ ప్రభువుల నుండి మాత్రం పూర్తి మద్దతును సంపాదించుకున్నారు. హైదరాబాద్ రాజ్యంలో సాగిన తిరుగుబాట్లన్నిటిన్నీ అణచివేయడంలో బ్రిటిష్ వారికి ప్రభుత్వం పూర్తి సహకారాన్ని అందించింది.
ఆ రకంగా 1857 నాటి హైదరాబాద్ ఎన్నో నెగెటివ్ పాఠాలను నేర్పుతుంది.
ఐతే హైదరాబాదుది విషాదాల చరిత్రమాత్రమే కాదు, అది కొన్నెత్తుటి త్యాగాలచరిత్ర కూడా. అది రాజులూ దివాన్లూ అప్జలుద్దౌలాలూ సాలార్జంగులూ తెల్లవాళ్ల గులాములై ఈ నేలకు చేసిన ద్రోహాల చరిత్ర మాత్రమే కాదు. మౌల్వీ అల్లా ఉద్దీన్‌లూ, తుర్రెబాజ్ ఖాన్లూ, వెంకటప్ప నాయకులూ, భీంరావులూ, రంగారావులూ, రాంజీగోండులూ, అటువంటి వందలాది మంది ప్రజలూ, చరిత్రకు అందిన, అందని వీరయోధులెందరో లేచి నిలిచి పరాయిపాలనను కూలదోయడానికి తమశక్తిమేరకు పోరాడిన వైభవోజ్వలగాథ.
పందొమ్మిదోశతాబ్ది మధ్యభాగం నుంచే హైదరాబాద్ రాజ్యంలో ఇంగ్లీషు వారి దుర్మార్గాలకు వ్యతిరేకంగా వేరువేరు వర్గాల ప్రజలలో అసంతృప్తులతో రగిలిపోవడం మొదలయిందనీ, ఆ ధిక్కార స్ఫూర్తి నిరంతరం సాగిందనీ, 1857లో జరిగిందల్లా ఆ అసంతృప్తిని ఎగసిన దోయడం మాత్రమేననీ చరిత్ర చెపుతోంది. ఆ అసంతృప్తి ప్రజ్వలనాలు ఎన్నో చిన్నా పెద్దా సంఘటనలుగా వ్యక్తమయ్యాయి. అవి విజయం సాధించలేదనే మాట, దుష్ప్రచారానికి, విస్మరణకూ బలి అయ్యాయనే మాట నిజమే గాని నూటయాభై సంవత్సరాల క్రింద అటువంటి సాహసిక ప్రయత్నాలు జరిగాయనేదే గుర్తించవలసిన విషయం.
1857 మేలో ఉత్తర భారత తిరుగుబాట్లు జరిగితే జూన్ కల్లా ఆ తిరుగుబాట్ల గురించి హైదరాబాద్ నగరమంతటా ప్రచారం జరగడం మొదలయింది. ప్రధానంగా మతాభిమానాన్ని వాడుకున్నట్లు కనిపించినప్పటికీ అప్పటి గోడలమీద రాతలు, గోడలకు అతికించిన కాగితాలు ఇంగ్లీషు వారిపట్ల వ్యతిరేకతను కార్యాచరణగా మార్చమని పిలుపు ఇచ్చాయి. బోయినపల్లిలో సైనికశిభిరాలలోపల ఒక ఫకీరు తిరుగుబాటు గురించి ప్రచారం చేస్తూ తిరిగాడు. మక్కామసీదులో మౌల్వీ అల్లా ఉద్దీన్ తిరుగుబాటును సమర్థిస్తూ ఉపన్యాసాలు ఇచ్చాడు. ఔరంగాబాదులో చిన్నపాటి సైనికుల తిరుగుబాటు పొడసూపితే తిరుగుబాటుదారులను ఫిరంగులకు కట్టి కల్చారు. తుపాకులతో కాల్చి చంపారు. ముక్కలుగా నరికారు. ఉరితీశారు. మొత్తం రెండువందల మంది సైనికులను శిక్షించారు. ఈ ఘటనమీద ఆందోళనపడిన పదమూడు మంది సైనికులు జమేదార్ చీదాఖాన్ నాయకత్వంలో ఫిర్యాదు చేయడానికి హైదరాబాద్ వస్తే సాలార్జంగు నిర్భందించి బ్రిటిష్ రెసిడెన్సీకి అప్పగించాడు. రెసిడెన్సీలో వారిమీద చిత్రహింసలు అమలవుతున్నాయని విని జూలై 17న వందలాది మంది సైనికులు, ప్రజలు రెసిడెన్సీ మీద దాడి చేశారు. ఇవాళ కోఠీ విమెన్స్ కాలేజిగా ఉన్న ఆనాటి రెసిడెన్సీ పై పుత్లీబౌలీ వైపు నుంచి, సుల్తాన్ బజార్ వైపునుంచి నేల ఈనినట్టుగా జనం విరుచుకుపడ్డారని సమకాలీన కథనాలు చెపుతున్నాయి. మౌల్వీ అల్లా ఉద్దీన్, రొహిల్లా సైనిక నాయకుడు తుర్రెబాజ్ ఖాన్ ఆ దాడికి నాయకత్వం వహించారు. సుల్తాన్ బజారులోని హిందూ, ముస్లిం వ్యాపారులు ఆ దాడికి సహకరించారు. రెసిడెన్సీలోంచి పేల్చిన ఫిరంగిదెబ్బలకు 30 మంది దాకా చనిపోయినప్పటికీ, ఇద్దరు నాయకులమీదా కఠినమైన శిక్షలు అమలయినప్పటికీ తిరుగుబాటు స్పూర్తి అణగిపోలేదు. ఆ కాలమంతా కూడ హైదరాబాద్ తిరుగుబాటుకు తాంతియా తోపే తో దగ్గరి సంబంధం ఉండింది.
ఆ 1857 ప్రజ్వలనం సమసిపోయినట్టనిపించిన తర్వాత కూడ 1858లో పోరాపూర్ సంస్థానాధీశుడు వెంకటప్పనాయక్ తిరుగుబాటుకు సహకరించాడు. కొప్పల్ సంస్థానాధీశుడు భీంరావు ముందర్గి తిరుగుబాటుచేశాడు. నానాసాహెబ్‌తో సంబంధం పెట్టుకున్న కౌలాస్ అధిపతి రంగారావు పగే తిరుగుబాటు చేశాడు. రావుసాహెబ్ పీష్వాకు హైదరాబాద్‌లో 1862లో ఆశ్రయం దొరికింది. 1867లో భాల్కిలో జంగు బహదూర్ అని పేరుపెట్టుకున్న రామ్‌రావు తిరుగుబాటుచేశాడు. నానాసాహెబ్ అనుచరులమని చెప్పుకున్న రొహిల్లాలు, గోండులు ఆదిలాబాదులో తిరుగుబాటుచేశారు. అంటే, అంతకు ముందరి ప్రయత్నాలను ప్రక్కనపెట్టిన 1857 నుంచి 1867 దాకా హైదరాబాద్ రాజ్యం కుతకుత ఉడికి పోయింది. రాజ్యంలో బ్రిటిష్ వ్యతిరేక తిరుగుబాటు స్ఫూర్తి జాజ్వల్యమానంగా వికసించింది. ఇంకా చరిత్రకెక్కని, ఇంకా తవ్వితీయవలసిన వీరగాథలు ఎన్ని ఉన్నాయో లెక్కలేదు.
ఆ వైభవోజ్వలగాథ అంతా ఇప్పుడు మరుగునపడిపోయింది. దేశవ్యాప్తంగా జరిగిన ప్రథమ భారత స్వాతంత్య్ర సంగ్రామ నూటయాభై సంవత్సరాల ఉత్సవాలలో హైదరాబాద్ తిరుగుబాటుగాథకు రావలసినంత గుర్తింపు రానేలేదు. ఆ పోరాటం మీదనే ప్రత్యేక సంచిక వేసిన ఒక ఇంగ్లీషు పత్రిక దక్షిణాదిలో ఆ పోరాటం జరిగినది అతి తక్కువచోట్లనని అంటూ, వాటిలో తమిళనాడులోని నాలుగైదు ఘటనలను, అదీ ఇతర సందర్బాలలోని ఘటనలను మాత్రం ప్రస్తావించి ఊరుకున్నది.
పునర్విజృంభిస్తున్న తెలంగాణ ఆకాంక్షల ఉద్యమంలో భాగంగా, తెలంగాణకు అన్ని రంగాలలో జరుగుతున్న అన్యాయం వలెనే తెలంగాణ చరిత్ర విస్మరణకూడా జరుగుతున్నదని వస్తున్న విశ్లేషణ మనకళ్లముందే 1857 స్మరణలో కూడ నిజమని తేలింది. హైదరాబాద్‌కు, తెలంగాణకు ఇవాళ్టి సమస్యలపై ఇవాళ పోరాడే అవకాశం లేకపోవడం మాత్రమే కాదు, గత వైభవ స్మృతులను నెమరువేసుకునే అవకాశం కూడా లేకుండా పోతున్నది.
కాని చరిత్ర రచయితల రాగద్వేషాలు, ఉద్దేశ్యపూర్వక విస్మరణలు, వక్రీకరణలు ఎట్లా ఉన్నా, ఈ నేల మీద చరిత్ర నిర్మాతలయిన ప్రజలు 1857ను మాత్రమే కాదు, గతకాలపు పోరాట స్మృతులలో ఏ ఒక్కదాన్నీ ఎప్పుడూ మరచిపోలేదు. తారీఖులు, దస్తావేజులు, స్థలాలు, నాయకుల పేర్లు, స్మృతి చిహ్నాలు గుర్తు పెట్టుకోలేకపోవచ్చు కాని ఆ పోరాటాల స్వభావాన్ని ప్రజలు తమ నిత్యజీవితాచరణలో ఎన్నడూ మరచిపోలేదు. ఆ పోరాటాల, త్యాగాల దీపకళికలను ఎన్నడూ కొడిగట్టిపోనివ్వలేదు. అన్యాయానికి ఎన్నడూ తలవంచలేదు. దౌర్జన్యాన్ని, ఆధిపత్యాన్ని ఎప్పడూ ధిక్కరిస్తూనే వచ్చారు. హైదరాబాద్ నేలలో, తెలంగాణ నేలలో గతతరాలు విత్తిన త్యాగాలు ఇవాళ్టిదాకా విభిన్న ఆధిపత్య వ్యతిరేక పోరాటాలలో నిరంతర వికసించి పరిమళిస్తూనే ఉన్నాయి. ప్రేరణగా నిలుస్తూనే ఉన్నాయి.
ఆ వీరయోధుల అమరస్మరణను, త్యాగఫలితాలను, ప్రేరణను అక్షరీకరించడం కోసమే ఈ ‘1857 హైద్రాబాద్ తిరుగుబాటు గాథలు’. ‘సలాం హైద్రాబాద్’ నవల ద్వారా హైదరాబాద్ జన జీవస్మరణ సాహసగాథలను అజరామరంగా చిత్రించిన లోకేశ్వర్ ఇప్పడు రెసిడెన్సీపై దాడిని, వెంకటప్ప నాయక్ సాహసాన్ని, ఆ రెండు గాథలకూ పునాది కల్పించే ఢిల్లీ సమరపు మానవీయకోణాన్ని మనముందు ఉంచుతున్నారు. చిరస్మరణీయమైన గాథలివి. ఇవాళ మననేలమీదికి మహమ్మారిలా వచ్చిన ప్రపంచీకరణ సామ్రాజ్యవాద శక్తులను ఎదిరించే తండ్లాటలో ప్రతి ఒక్కరూ సగౌరవంగా తలచుకోవలసిన కథలివి. స్పూర్తినిచ్చే అనుభవాలివి. గతానికి వర్తమానానికీ మధ్య జరిగే నిరంతర సంభాషణ ఇక్కడ కాల్పానికచిత్రణ పొంది మన గత ఘనతను గుర్తుచేస్తున్నది. మన వర్తమాన కర్తవ్యాన్ని నిర్దేశిస్తున్నది.
- ఎన్. వేణుగోపాల్ (జూలై 12, 2007)



i am sorry, i donot know telugu typing. kindly excuse.
here is something i felt for some time now. the sad part of this country is that while we hate our own fellow countrymen, based on their religion, region or caste, we simply wipe the shoes of the white man with our shirts. this is true to this day. india has not been freed yet. the fact that we feel proud only when our children call us, “mummy and daddy”, we feel successful when we get high-paid jobs as high-tech coolies in the hi-tech industry which serves the interests of the “DEVELOPED” (Read white man’s) countries, the fact that we think we are “BACKWARD” when we wear dhoties, when we live in mud houses, when our profession is not some “fancy” “suited booted job” but when we are farmers…a friend of mine has once said, “if the british had not come, we would still be wearing dhoti, pyjamas’. this then is the state of our self-respect.
in the padayatra against the uranium mining in nalgonda district in year 2006, young boys sang very poignant songs about the loss of livelihoods for the weavers and potters etc. but they all “fancy” wearing “Jeans”…
this then is the dichotomy of our land. we are all living a lie.
what the british have stolen from us is not so much our wealth, or natural resources…but our “SELF-RESPECT’. we have lost faith in all that is Indian, because it is not “Scientific”…be it natural farming, be it folk medicine, folk arts or culture…or wearing indian clothes.
They have destroyed this country by destroying our self-respect and our self-reliance.
No point in speaking about 1857, as long as our scholars feel happy only when they are recognised in America or Europe. No point in speaking about freedom movements, when we as people continue to bend over backwards to give red carpet welcome to Bill Gates, while we destroy the homes of our farmers to give away their lands for ‘Corporations”; in the name of a “Development” which is alien to this land. No point in speaking about freedom, when the greatest dream of a young Indian is to prefer to sweep the streets of New york or London, rather than go back to his village or town and try to change things there.
Saraswati Kavula
filmmaker