Feed on
Posts
Comments

- ఎం. కోదండరాం, కె. సీతారామారావు

వ్యవసాయం ప్రధాన జీవికగా ఉన్న దేశాలలో భూసంబంధాలే సమాజ పరిస్థితిని, రాజకీయ ఉద్యమాల స్థితిగతులను నిర్ణయిస్తాయి. తెలంగాణ ఉద్యమాన్ని అర్థం చేసుకోవాలన్నా ఆంధ్రప్రదేశ్‌లో వ్యవసాయరంగంలో వచ్చిన మార్పులను పరిగణనలోకి తీసుకోకతప్పదు.

బ్రిటిష్‌ పాలనకు వెలుపల వున్న తెలంగాణ చరిత్రక్రమాన్ని 1956దాకా ఇక్కడి ప్రజలే నిర్ణయించుకున్నా 1956 నుండి కోస్తాంధ్ర పాలక వర్గాలు శాసిస్తున్నాయి, నిర్ధేశిస్తున్నాయి. అందుకే 1956కు పూర్వం భూసంబంధాలలో వచ్చిన మార్పు-చేర్పులను ఆంతరంగిక కారకాల (Internal factors) ఆధారంగానే అధ్యయనం చేయవలసి ఉంటుంది. 1956 తరువాత తెలంగాణేతర శక్తుల ప్రమేయాన్ని కూడా లెక్కలోకి తీసుకోవాలి. 1956కు పూర్వం తెలంగాణ జాతీయ, అంతర్జాతీయ వ్యవస్థల నుండి విడిగా, పూర్తిగా స్వతంత్రంగా ఉందని అర్థం కాదు. తెలంగాణ చరిత్ర పరిణామక్రమంపైన కోస్తాంధ్ర సంపన్న వర్గాల ప్రభావం అంతగా లేదని మాత్రమే ఇక్కడ చెప్పదలచుకున్నాము.

బ్రిటిష్‌ పాలకులు తమకు బాగా ఆదాయాన్ని ఇవ్వలేవనుకున్న ప్రాంతాలను, రక్షణ అవసరాలరీత్యా అంతగా ప్రాధాన్యత లేదనుకున్న ప్రాంతాలను సంస్థానాధీశుల స్థానిక పాలకుల అధీనంలోనే ఉంచారు. తెలంగాణ ప్రాంతం ఆ విధంగా నిజాం అధీనంలోనే ఉండిపోయింది.

భూసంబంధాలలో వచ్చే మార్పులు రెండు రూపాల్లో జరుగుతుంటాయి.. ప్రభుత్వమే చట్టాలద్వారా, విధానాల ద్వారా భూపంపిణీ కార్యక్రమాలను అమలుచేసి భూసంబంధాలలో మార్పుల తేవడం ఒక పద్ధతి ఇవి రాజ్య నిర్ధేశిత భూస్కరణలు. ఇక ప్రజలు సంఘటితమై పెత్తందార్లను, భూస్వాములను ఎదిరించి, భూములను ఆక్రమించడం ద్వారా భూసంబంధాలలో మార్పులు తీసుకొనిరావడం మరొకపద్ధతి దీన్నే ఉద్యమ జనిత భూసంస్కరణలుగా పేర్కొన్నవచ్చు. మొదటి పద్ధతిలో ప్రభుత్వమే పైనుండి కౌల్దారీ చట్టాలు, భూసీలింగులు, భూపంపిణీ కార్యక్రమాలను ప్రవేశపెట్టగా, రెండవ పద్ధతిలో ప్రజలు పూనుకొని భూమిని ఆక్రమించి, పంచుకుంటారు. రెండు పద్ధతుల మధ్య వైరుధ్యం లేదు. తెలంగాణ ప్రాంతంలో ప్రజలు సంఘటితమై భూపోరాటాలను చేసినప్పుడే ప్రభుత్వం ఆ ఉద్యమాల ప్రభావానికిలోనై చట్టాలను తీసుకొచ్చింది. ఆ చట్టాలు కూడా ప్రజలు, ముఖ్యంగా రైతాంగం సంఘటితంగా ఉన్న ప్రాంతాల్లో మాత్రమే సరిగా అమలయ్యాయి. ప్రజలు సంఘటితంగా లేనప్పుడు భూసంస్కరణలు కాగితాలకే పరిమితమయ్యాయి.

నిజాం కాలంలో భూమి కొద్దిమంది చేతుల్లో కేంద్రీకృతమై ఉండేది. అప్పటికి మూడు రకాల భూమిశిస్తు వ్యవస్థ ఉండేది. దివానీ భూములు ఇవి మొత్తం భూమిలో 30 శాతం ఈ భూముల్లో దున్నుతున్న వారికే యాజమాన్యపు హక్కులను ఇవ్వాలని ప్రభుత్వం సంకల్పించినా దేశ్‌ముఖ్‌, దేశ్‌పాండేలు యాజమాన్యపు హక్కులను హస్తగతం చేసుకున్నారు. జన్నారెడ్డి ప్రతాప్‌రెడ్డి అధీనంలోనే 1,50,000 ఎకరాలుండేవి. విస్నూర్‌ దేశ్‌ముఖ్‌ 40,000 ఎకరాలకు అధిపతి. సూర్యపేట దేశ్‌ముఖ్‌ 20,000 ఎకరాలకు పట్టేదారు.

నిజాం స్వంత భూములను సర్ఫే-ఖాస్‌ భూములనేవారు. హైదరాబాద్‌ రాష్ట్రంలోని 10 శాతం భూమి నిజాం స్వంత ఆస్తిగా పరిగణించబడింది. 12.5 లక్షల ప్రజలు ఈ గ్రామాల్లో నివాసం ఉండేవారు. ఇక జాగీరు భూమి మూడవరకమైనది. హైదరాబాదు విస్తీర్ణంలో 30 శాతం జాగీర్దార్ల చేతుల్లో ఉండేది. జాగీర్దార్లకు పన్ను వసూలు చేసే అధికారంతో పాటు న్యాయ, శాసనాధికారాలు ఉండేవి. జాగీర్దార్లు చిన్నపాటి రాజులగానే చెలామణియ్యేవారు. తమ అధికారంతో వారు రైతులను పీడించి విపరీతంగా పన్నులు వసూలు చేసేవారు.

ప్రజల పైన సంక్రమించిన అధికారంతో భూస్వాములు 1930ల్లో తలెత్తిన సంక్షోభం ప్రభావాన్ని రైతుల పైకి ఇతర పేద ప్రజలపైకి నెట్టి వేయగలిగారు. ప్రభుత్వం రైతులందరు లెవీ ధాన్యం కట్టాలన్న నియమాన్ని తెస్తే తమ పలుకుబడితో భూస్వాములు తప్పించుకున్నారు. కానీ పేద ప్రజల నుండి విపరీతంగా లెవీ వసూలు చేసినారు. అదేవిధంగా ధరలు పడిపోవడంతో ఆదాయం రాక రైతులు అప్పుల పాలయ్యారు అట్లా తమ భూములను కోల్పోయారు. వెట్టికి తోడు రైతులపైన అదనపు ఆర్థిక భారం పడింది. ఆ కాలంలో ఆర్థిక సంక్షోభ భారాన్ని ఎక్కువగా మోసింది ధనిక రైతులతోపాటుమధ్యతరగతి, పేద రైతులు, వ్యవసాయ కూలీలే.

ఈ దోపిడీ అణిచివేతలకు నిరసనగానే తెలంగాణ రైతాంగ ఉద్యమం చెలరేగింది. ఉద్యమం వలన నిజాం పాలనకు మూలస్తంభంగా నిలిచిన జాగీర్దార్లు, దేశముఖులు, దేశ్‌పాండేల అధికారం బలహీనపడింది. స్వాతంత్య్రానంతరం విస్తృత సమూహాలపై ఆధిపత్యాన్ని సాధించడానికి, రాజ్య యంత్రాంగాన్ని గ్రామగ్రామాన విస్తరించడానికి భూ సంస్కరణలు అవసరమయ్యాయి. తమ లక్ష్యాలకు అనుగుణంగానే ప్రభుత్వం భూసంస్కరణలను నిర్వచించింది. అందుకే భూమిని పంచడానికి బదులు జాగీర్దారీ వ్యవస్థను రద్దుచేసి కౌల్దార్లకు రక్షణ కల్పించింది.

ఆ విధంగా వేల ఎకరాలు కల భూస్వామ్య వర్గం పోయి దాని స్థానంలో చిన్న భూస్వాములు, ధనిక రైతులు ఎదిగారు. అయితే కులపరమైన శ్రమ విభజన మాత్రం అంతం కాలేదు. మరొకవైపు ఈ పరిణామాలకు సమాంతరంగా రాజకీయ రంగంలోనూ మార్పులు రావడం మొదలయింది. ఎన్నికల వ్యవస్థ, గ్రామస్థాయిలో స్థానిక ప్రభుత్వాలు స్వయంపాలనా సంస్థలు ఉనికిలోకి వచ్చినాయి. బ్యాంకులు, సహకార సంఘాలు ఏర్పడినాయి. గ్రామంలో పెత్తనంగల కులాలే ఈ వ్యవస్థలపైనా ఆధిపత్యాన్ని చెలాయించాయి. రాజ్యాంగబద్దమైన ఆధునిక రాజకీయ వ్యవస్థల పైన అధిపత్యం లేకుండ గ్రామంలో పెత్తనం నిలువదని గ్రహించడం వలన రాజకీయ వ్యవస్థలను గుప్పెటపెట్టుకోటానికి పెత్తందారీ కులాలు ప్రత్యేకంగా ప్రయత్నం చేసినాయి. విశాలాంధ్ర ఏర్పడక పోయిఉంటే ఇక్కడ పరిణామాలు ఇంకొకరకంగా జరిగి ఉండేవి. నిజాం వ్యతిరేక పోరాటాలతో చైతన్యాన్ని పొందిన ప్రజలు, కార్యకర్తలు, నాయకులు, మధ్యతరగతి వర్గం సమాజాన్ని మార్చడానికి కృషిచేసేది. 1952 ముల్కీ ఉద్యమంలో రాజకీయ సృహ పొందిన విద్యార్థులు, మధ్యతరగగతి వర్గం కూడా సమాజ ఎదుగుదలకు తోడ్పడి ఉండేవారు. ఈ రకంగా ఒక కొత్తతరం రాజకీయ నాయకత్వం ఎదగి ఈ ప్రాంత అవసరాలకునుగుణమైన నూతన రాజకీయాలు తేవడానికి అవకాశం ఉండేది. విశాలాంధ్ర ఎర్పడడంతో ఆ సామాజిక ప్రక్రియ అర్ధాంతరంగా ఆగిపోయింది. దాని స్థానంలో ఆంధ్రపాలక వర్గ నిర్ధేశిత రాజకీయాలు అస్థిత్వంలోనికొచ్చి కొనసాగినాయి.

నిజానికి నిజాం నిరంకుశ పాలన కారణంగా తెలంగాణలో వ్యవస్థల నిర్వహణతో అనుభవమున్న మధ్యతరగతి వర్గం బలంగా ఎదగలేకపోయింది. కొంత ఆధునిక వ్యవస్థల నిర్వహణలో పరిచయం ఏర్పడిన ముస్లిం మేధావులు పోలీస్‌ యాక్షన్‌ తర్వాత వలస వెళ్ళిపోయారు. ఉన్న కొద్దిమంది వ్యవస్థలో స్థానం కోల్పోయారు. కమ్యూనిస్టు పార్టీలోను, కాంగ్రెస్‌ పార్టీలోను అనుభవజ్ఞులైన నాయకులకు అధికారం రాలేదు. ఫలితంగా చదువుకొని సమాజానికి ఆయారంగాలలో నాయకత్వం వహించగల వర్గం లేకుండాపోయింది. ఉన్న కొద్దిమందికి వ్యవస్థలో స్థానం దొరకలేదు. 1948 పోలీస్‌ చర్య తర్వాత 1948-52 వరకు నాలుగేళ్ళ పాటు కొనసాగిన జె.ఎన్‌. చౌదరి నాయకత్వంలోని మిలటరీ ప్రభుత్వం ఆ తరువాతి వెల్లొడి నాయకత్వంలోని పౌర ప్రభుత్వం రెండు కూడా ఇంగ్లీషు తెలుగు సరిగా రాదనే కారణంతో, హిందు-ముస్లి-వైషమ్యాలు తీవ్రంగా ఉన్నాయనే నెపంతో నిజాం ప్రభుత్వ అధికారులను, ఉద్యోగులను చాలమందిని నిర్దాక్షిణ్యంగా తొలగించింది. వారిస్థానంలో ఆనాటి మద్రాసు రాష్ట్రంలో ఆంధ్రప్రాంత వారిని ఇక్కడ పాలనాయంత్రాంగంలో నింపింది. దీనికి వ్యతిరేకంగా 1952లో నాన్‌ ముల్కీ గో బ్యాక్‌ ఉద్యమం వచ్చింది.

హైదరాబాద్‌ రాష్ట్రంలో 1952లో జరిగిన మొదటి సాధారణ ఎన్నికలు హైదరాబాద్‌ సంస్థాన స్వాతంత్య్ర పోరాటం నేపథ్యంలో జరిగినవి. ఈ ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థులు చాలామంది తెలంగాణ పోరాట ప్రభావం, ఎంతో కొంత సామాజిక సృహ కలిగిన నాయకులు. దీని ప్రభావం ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం ఎర్పడ్డ తర్వాత జరిగిన 1957 ఎన్నికల్లో కూడా కొనసాగింది. కాని తర్వాత 1962లో జరిగిన ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థుల సామాజిక నేపధ్యాన్ని పరిశీలిస్తే వీరిపై తెలంగాణ స్వతంత్ర పోరాట ప్రభావం ఏమాత్రం లేని ఒక కొత్త తరం నాయకత్వంగా గమనించవచ్చు. ఈ కొత్త తరం నాయకత్వం ఆంధ్రప్రాంత కాంగ్రెస్‌ పార్టీ నాయకత్వ మద్దతుతో ఎదిగివచ్చింది. హైదరాబాద్‌, ఆంధ్రప్రాంతాల కాంగ్రెస్‌ కమిటీల విలీనం అయిన తర్వాత తెలంగాణా ప్రాంత నాయకత్వంపై ఆంధ్ర ప్రాంత నాయకత్వం పట్టు క్రమంగా పెరిగి తెలంగాణా ప్రాంత నాయకులు వారి అడుగులకు మడుగులొత్తే రెండవ శ్రేణి నాయకులుగా మార్చబడ్డారు. దాదాపు అన్ని పార్టీలో ఇదే పరిస్థితి కొనసాగుతున్నది.

ఈ నేపథ్యంలో పాలనా వ్యవస్థలు కేవలం కొద్దిమంది భూస్వాముల ఆధిపత్యాన్ని నిలబెట్టే సంస్థలుగా మిగిలిపోయాయి. ప్రజలకు ఉపయోగపడే రీతిలో పాలనా యంత్రాంగం ఎదుగలేదు, పనిచేయలేదు. కాంగ్రెస్‌ పార్టీలోని ఆంధ్రనాయకత్వం తెలంగాణ ప్రాంత భూస్వామ్య వర్గం రాజకీయంగా ఎదగడానికి దోహదం చేసింది. ఆంధ్ర పాలకవర్గ ఆధిపత్యాన్ని వ్యవస్థితం చేయడానికి ఆంధ్ర కాంగ్రెస్‌ నాయకత్వం పార్టీ నిర్మాణాన్ని మార్చివేసింది. అప్పటివరకు ఆంధ్ర తెలంగాణ ప్రాంతాలకు విడివిడిగా కొనసాగిన కాంగ్రెస్‌ కమిటీలను విలీనం చేసి ఆంధ్రప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీగా మార్చినారు. 1959 వరకు కాంగ్రెసు పార్టీలో ఎన్నికలకు అభ్యర్థులను జిల్లా కమిటీలే నిర్ణయించేవి. ఆ తరువాత నిర్ణయాధికారాన్ని రాష్ట్ర ఎన్నికల కమిటీకి బదలాయించారు. ఈ కమిటీపై పట్టుకలిగిన ఆంధ్ర నాయకత్వం నిజాం వ్యతిరేక ఉద్యమాల ద్వారా ఎదిగిన నాయకత్వాన్ని పక్కనబెట్టి భూస్వామ్య వర్గాల నుండి నాయకులను ప్రోత్సహించారు. 1952 తరువాత ఎదిగిన హైదరాబాద్‌ స్టేట్‌ కాంగ్రెస్‌ నాయకులు కూడా భూస్వామ్య శ్రేణుల నుండే వచ్చినా ఉద్యమాల ఫలితంగా వారిలో కొంత సామాజిక సృహ ఉండేది. ఆంధ్రనాయకత్వ ప్రాబల్యంతో ఎదిగిన వారికి కనీస సామాజిక అవగాహన లేదు. అందుకని నిరంకుశమైన అధికారాన్ని చెలాయించారు. సమాజం పట్ల ఏమాత్రం బాధ్యతను చూపలేదు. పాలనా వ్యవస్థలతో చిన్న చిన్న పనులు వచ్చినప్పుడు చేసిపెట్టి తమ పట్టును నిలుపుకున్నారు. ప్రధానంగా రెవెన్యూ, పోలీస్‌, ఎక్సైజు, అటవీశాఖలతో ప్రజలకు అవసరాలు ఉంటుండేవి. ఆ అవసరాలను తీర్చడం ద్వారా తమ పలుకుబడిని నిలుపుకునేవాళ్ళు. అంతకుమించి సమాజాభివృద్ధికి కృషి చేసిన నాయకులు లేరు. ఆర్థికాభివృద్ధికి కృషిచేసిన వాళ్ళులేరు. జైపాల్‌రెడ్డి వంటి నాయకులు కూడా ఢిల్లీలో ఇంగ్లీషు మాట్లాడి మేధావిగా గుర్తింపు పొందినా నియోజకవర్గంలో మాత్రం పైన చెప్పిన పద్ధతిలోనే వ్యవహరించారు. అందుకనే తెలంగాణ ప్రాంత అభివృద్ధికి పాలనా వ్యవస్థలు అసలు ఉపయోగపడలేదు. ఈ ప్రాంత నాయకత్వం వనరుల తరలింపును ఆపాలన్న సృహనూ కూడ ప్రదర్శించలేదు.

1969లో తెలంగాణ ఉద్యమం ఈ నేపథ్యంలోనే వచ్చింది. ఆ ఉద్యమానికి ఉద్యోగస్తులు, విద్యార్థులు నాయకత్వం వహించారు. ఈ ఉద్యమం రెండు కొత్త రాజకీయ పరిణామాలకు తెరలేపింది. మొట్టమొదట తెలంగాణ అభివృద్ధికి ఆంధ్ర నాయకత్వం ఏమాత్రం కృషిచేయకపోగా తెలంగాణ వనరులను ఆంధ్రకు తరలిస్తున్నారన్న విషయాన్ని ఎత్తిచూపింది. అప్పటికే సృహకలిగిన కొందరు నాయకులు రీజినల్‌ కమిటీ ద్వారా తెలంగాణ దోపిడికి సంబంధించిన గణాంకాలను పోగేసినారు. తెలంగాణ పట్ల ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం చూపుతున్న వివక్షను ఎత్తిచూపినారు. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం ఈ సమస్యలను ఎజెండా మీదికి తేగలిగింది. ఇక రెండో విషయం తెలంగాణలో ఆంధ్ర నాయకుల అండదండలతో సాగుతున్న రాజకీయ నాయకత్వం ఈ ఉద్యమ ఫలితంగా బలహీనపడింది. సామాజిక, రాజకీయ రంగాలలో కొత్త నాయకత్వం ఎదుగుదలకు తెలంగాణ ఒక భూమికను తయారుచేసింది.

ఉద్యమాన్ని అణచడానికి ఒకవైపు కాంగ్రెస్‌ నాయకత్వం విపరీతమైన హింసను ప్రయోగిస్తూనే మరొకవైపు రాష్ట్ర నాయకత్వాన్ని మార్చి సమస్యను పరిష్కరించదలిచింది. అందువలన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు డిమాండ్‌ అపరిష్కృతంగా మిగిలిపోయింది. దీనివల్ల సంభవించిన మరో పరిణామం తెలంగాణ యువతలో రాజకీయ వ్యవస్థల మీద నమ్మకం సడలిపోవడం. ఫలితమే నక్పల్బరీ ఉద్యమం వైపు విద్యార్థులు, యువకులు ఆకర్షితులు కావడం.

నక్సల్బరీ ఉద్యమంవలన తెలంగాణ గ్రామీణ సామాజిక-ఆర్థిక వ్యవస్థలో మౌలికమైన మార్పులు వచ్చినాయి. నక్సల్బరీ ఉద్యమం వెట్టిని పూర్తిగా నిర్మూలించింది. ఉద్యమం వలన కూలీ రేట్లు పెరిగాయి. గ్రామ సామాజిక వ్యవస్థలపై దొరల ఆధిపత్యం పోయింది. తెలంగాణ గ్రామాల్లోని ప్రజలు ఉద్యమం వలన వచ్చిన మార్పుల గురించి మాట్లాడుతూ ”దొరల పెత్తనం పోయిందంటారు”. గ్రామాల్లో వచ్చిన మార్పును ఇంతకన్నా సూటిగా చెప్పడం సాధ్యం కాదు.

నక్సల్బరీ ఉద్యమం వలన దొరల పెత్తనం నుండి విముక్తి పొందిన ఎస్సీ, బిసీ వర్గాల ఎదుగుదలకు అవకాశం కలిగింది. ముఖ్యంగా బి.సి వర్గాలకు రాజకీయ వ్యక్తీకరణను ఇచ్చి తెలుగుదేశం అధికారంలోకి రాగలిగింది. అందువలన రాజకీయాల స్వభావం మారిపోయింది. అంతవరకు రాజకీయాలకు దొరలు కేంద్ర బిందువుగా ఉండేవారు. ఆ తరువాత అన్ని వాడలకు రాజకీయ నాయకులు పోవడం ప్రారంభించారు. అందువలన అన్ని వర్గాల నుండి రాజకీయ నాయకులు ఎదిగారు. అందరికీ పౌరసత్వపు హక్కులు సంక్రమించాయి.

అయితే తెలుగుదేశం కూడా కాంగ్రెస్‌ వలె కోస్తాంధ్ర సంపన్న వర్గాల పార్టీ. ముఖ్యంగా హరిత విప్లవం తరువాత ఆర్థికంగా బలపడిన వర్గాల పార్టీ. ఆ పార్టీ కోస్తా సంపన్న వర్గాల ప్రయోజనాలకు లోబడి తెలంగాణ బి.సి. వర్గాల అభివృద్ధికి విధానాలను తయారుచేసింది. మండలాలను ఏర్పరచి రిజర్వేషన్లను ప్రవేశపెట్టింది. అనువంశికంగా గ్రామాధికారాన్ని, హోదాలను పొందే అవకాశాలను రద్దుచేసింది. రెండు రూపాయలకు కిలో బియ్యం పథకాన్ని, తక్కువ రేటుకు కరెంటును ఇచ్చే పథకం ప్రవేశపెట్టింది. అయితే అందుకయ్యే రాబడిని పొందడానికి సార అమ్మకాలను విపరీతంగా పెంచింది. దీనివల్ల గ్రామీణ ప్రాంతాల్లో చాలా కుటుంబాలు ఆర్థికంగా, ఆరోగ్యపరంగా చితికిపోయాయి. ఈ పరిమితులున్నా బి.సి.ల ఎదుగుదలకు నక్పల్బరీ ఉద్యమం అవకాశాన్ని కల్పిస్తే తెలుగుదేశం అట్లా ఎదిగిన వర్గాలకు రాజకీయ వ్యక్తీకరణ నిచ్చింది తత్ఫలితంగానే తెలంగాణల కొత్త నాయకత్వం ఎదిగింది. ఆ తరువాతి కాలంలో తెలుగుదేశం ఆర్థిక విధానాలే ఈ నూతన నాయకత్వం ఎదుగుదలకు ప్రతిబంధకమయ్యాయి. మొదట కొన్ని సంక్షేమ విధానాలను ప్రవేశపెట్టేనా పైన చెప్పినట్టు సంక్షేమానికయ్యే ఖర్చు వలన తమ ఆర్థిక అవకాశాలు దెబ్బతింటున్నాయని భావించి ఆ అభివృద్ధి సంక్షేమ పథకాలను తెలుగుదేశం పార్టీ నాయకత్వం ఉపసంహరించుకున్నది. మొత్తం వనరులను కోస్తాంధ్ర సంపన్నవర్గాలకే ఇచ్చింది. తెలంగాణా బి.సి.ల ఎదుగుదల తెలుగుదేశం విజన్‌లోనుండే తొలగిపోయింది. వ్యక్తులుగానే బి.సి. నాయకులు స్థానం పొందగలిగారు. బి.సి.ల సమస్యలపై పార్టీ దృష్టి పెట్టలేదు. బలహీనవర్గాల సంక్షేమంపై ప్రభుత్వం ఖర్చును దాదాపుగా నిలిపివేసింది. పేద, బలహీన వర్గాల ఎదుగుదలకు ప్రభుత్వ సహాయం చాలా అవసరం. కోస్తాంధ్రలో ప్రభుత్వ సాయంతోనే హరిత విప్లవం వచ్చింది. అక్కడ సంపన్న వర్గాలు ప్రభుత్వ సాయంతోనే బలంగా ఎదగాయి. కానీ తెలంగాణలో బి.సి.లు, ఎస్సీలు, ఎస్టీలు కొంత భూమి సంపాదించుకొని ఎదుగదలకు అవకాశాన్ని పొందారు. సరిగ్గా ఆ సమయంలో ప్రభుత్వ విధానాలు మారిపోయాయి. ప్రభుత్వం సంక్షేమ పథకాలను ఉపసంహరించుకున్నది. చిన్న, సన్నకారు రైతులు వ్యవసాయం చేయలేరన్నదివారి అభిప్రాయం. అందుకే వారికి మద్దతునిచ్చే బదులు అగ్రి బిజినెస్‌ కంపెనీలను ప్రోత్సహించడం మంచిదని భావించింది. ఆ విధంగా అగ్రి బిజినెస్‌ కంపెనీలకు చేయూత నివ్వడం ప్రభుత్వ విధానమైంది. అదేవిధంగా వృత్తిదారులకు సహాయాన్ని అందించగల ఆప్కో, పాడిపరిశ్రామికాభివృధ్ధి సంస్థలను బలహీనపర్చింది. ఈ పరిణామాలే తెలంగాణలో వ్యవసాయ సంక్షోభానికి మూల కారణమయ్యాయి. ఏ ఆధారమూ లేని రైతులు, చేనేత కార్మికులు, చేతివృత్తుల వారు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. కనుకనే మొత్తం తెలుగుదేశం ప్రవేశపెట్టిన ఆర్థిక విధానాలు తెలంగాణ జన జీవితాన్ని అతలాకుతలం చేసినాయి. ఈ అభివృద్ధి క్రమమే తెలంగాణను అంతర్గత వలసగా మార్చింది. అంతర్గత వలసగా మారిన ప్రాంతంగా నిరంతర దోపిడికి గురవుతున్నది. ఆర్థిక ఉత్పత్తి క్రమం పూర్తిగా అభివృద్ధి చెందిన ప్రాంతాల సంపన్న వర్గాల చేతిలో ఉంటది. కనుక అన్ని వ్యవస్థలు అంతర్గత వలస దోపిడికి సాధనాలుగా పనిచేస్తుంటాయి. సాంస్కృతిక ఆధిపత్యం ఈ దోపిడిని నిలబెట్టడానికి భూమికను తయారేచేస్తది.

ఈ పరిస్థితిలో తెలంగాణకు వనరుల కేటాయింపులో జరుగుతున్న వివక్షకు వ్యతిరేకంగా వచ్చిన ఉద్యమానికి విశేష జనాదరణ లభించింది. తెలంగాణ వివక్షను ఎదిరించే క్రమంలోనే సాంస్కృతిక అణచివేత నుండి బయటపడి తన అస్థిత్వాన్ని నిర్వచించుకొనే ప్రయత్నం మొదలైంది. కనుక తెలంగాణ ఉద్యమానికి ఏకకాలంలోనే రెండు పార్ష్యాలున్నాయి. ఒకవైపు వనరులపైన అధికారాన్ని పొందడానికి పోరాడడం, మరొకవైపు అస్థిత్వాన్ని కాపాడుకునే ప్రయత్నం. ఈ రెంటి కలయికతో తెలంగాణవాదం రూపుదిద్దుకున్నది.

ఈ రెంటినీ నిర్వచించే ప్రయత్నంలో నేడున్న సామాజిక, రాజకీయ వాతావరణంలో అన్ని వర్గాలకు భాగస్వామ్యం కల్పించకతప్పలేదు. అందుకే 1969 తెలంగాణ ఉద్యమానికి నేటి తెలంగాణ ఉద్యమానికి మౌలికంగా తేడాలున్నాయి. అప్పటి తెలంగాణ ఉద్యమం మధ్యతరగతి ఉద్యమంగానే నడిచింది. నేటి తెలంగాణ ఉద్యమంలో గ్రామీణ ప్రాంతాలలో కేంద్రీకృతమైంది. ఈనాటి ఉద్యమం తెలంగాణకు జరుగుతున్న అన్యాయాలకు, తెలంగాణ పట్ల ప్రభుత్వం చూపుతున్న వివక్షకు వ్యతిరేకంగా వచ్చింది. నేటి ఉద్యమం వలస దోపిడిని నిరసిస్తున్నది. తెలంగాణకు వనరులపై సంపూర్ణ అధికారాన్ని, అస్థిత్వాన్ని కాపాడుకోవటాని కవసరమయిన స్వతంత్ర ప్రతిపత్తితో కూడిన స్వయం పాలనను డిమాండ్‌ చేస్తున్నది.

ఈ నేపథ్యంలో తెలంగాణలో ఏ వర్గం వికాసముకూడా ఉమ్మడి రాష్ట్రంలో సాధ్యంకాదని గ్రహించవచ్చు. రాజ్యాధికారం మీద పట్టుతో వనరులను కొల్లగొట్టె వికృత రూపంతో ఆంధ్ర సంపన్న వర్గం ఎదిగింది. అన్ని వ్యవస్థల మీద పట్టు సాధించింది. ఈ వర్గం తెలంగాణలో అణగారిన వర్గాలు చేసే ఏ విముక్తి పోరాటమైన రాజీకయ వ్యక్తీకరణ పొందకుండా అడ్డుకుంటున్నది. తెలంగాణలో అణచివేయబడిన వర్గాల వికాసానికి తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడే సరిఅయిన అవకాశం దొరుకుతుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడకపోతే ఆయా ఉద్యమాల నుండి కొందరు వ్యక్తులుగా, రాజకీయ నాయకులుగా ఎదుగగలరేమో కానీ తెలంగాణ సమాజంలో మౌలిక మార్పులు ప్రవేశపెట్టడం మాత్రం సాధ్యం కాదు.

Click here to download the PDF of
“Telangana Udhyayamam – Samajika Nepathyam”

One Response to “తెలంగాణా ఉద్యమం – సామాజిక నేపథ్యం”

  1. 1
    డిస్కవర్ తెలంగాణ Says:

    ‘Discover Telangana’ sincerely thanks M.KodandaRam, K.SeethaRama Rao & ‘Telangana Vidyavanthula Vedika’ (TVV) for providing us their intellectual property & sharing with all of us.

    - Jai Telangana

Leave a Reply

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

Managed by Discover Telangana Inc., a registered nonprofit organization in USA.

All opinions and views expressed by third party content providers and shown here as preview are not that of Discover Telangana.

If you find any Content that is infringing, libelous, defamatory, obscene, abusive, offensive or otherwise violation of copyright law, alert us by emailing us at discover.telangana(at)gmail.com