దారి తప్పించే ప్రయత్నం !
మార్చ్ 3rd, 2008 by డిస్కవర్ తెలంగాణ
- బోధనం నర్సిరెడ్డి, ఎలికట్టె శంకర్‌రావు, గౌస్ మొహియుద్దీన్
‘దారి తప్పుతున్నాం జాగ్రత్త’ అంటూ తెలంగాణా ప్రజలతో మమేకమైనట్టు ఎం.వి.రమణారెడ్డి రాసిన ఉపన్యాస వ్యాసం (ఫిబ్రవరి -వివిధ) ఉత్త వైరుధ్యాలపుట్టగానూ, కోస్తా పక్షపాతంగానూ ఉంది. తిరుపతిలో ఈ ఉపన్యాసం ఎంత దురుద్దేశ్యపూర్వకంగా, పక్షపాత ధోరణితో చేసిందో పత్రికలో రావడం ద్వారా తెలంగాణా ప్రజలకు తెలిసింది. ఇందులోని వైరుధ్యాలను, పక్షపాత వ్యాఖ్యానాలను ఒక్కటొక్కటే సోదాహరణంగా వివరిస్తాం.
- తిరుపతిలో తెలుగుతల్లి రథోత్సవం జరిపించిన తమ్ముళ్ళను అభినందించడంలోనే ఆయన ఎటువైపో తేలిపోయింది. రాష్ట్రాలు వేరైనాక రాష్ట్ర చిహ్నాలు వేరైనట్టు’రాష్ట్రమాత’ కూడా వేరౌతుంది. ఇందులో అసహజమేముంది? దేశానికి భారతమాత’ ఉండగా రాష్ట్రానికి తెలుగుతల్లి ఉండడం ఇన్నాళ్ళు అనవసరం అనిపించలేదు కదా.
- ’సమాజాన్ని కదిలించే ఏ ప్రకంపనైనా సాహిత్యాన్ని తాకుతుంది’అన్నారు నిజమే. తెలంగాణా ప్రజలను కదిలించిన రాజకీయ ఉద్యమం సాహిత్యాన్ని కూడా తాకింది. కదిలించింది. అందుకు దాఖలాయే తెలంగాణా మాండలికంలో వస్తున్న కథలు, కవిత్వం.
- ‘నా ప్రాంతంలో వాడే మాండలికాన్ని నేను రాస్తాను. నా యాసలోనే నేను రాస్తాను. ఇంకొకరి భాష నేనెందుకు రాయాలి? అనే పరిస్థితి వచ్చేసింది. ఇంకొకరి భాష అంటే కోస్తా వాళ్ళ భాష అనే అర్థంలో ‘ప్రామాణికమైన భాషను కోస్తా భాష కింద జమకట్టి దాన్ని తొలగించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి’ అంటూ తనకు తానే ప్రశ్నలు వేసుకుని జవాబులు రాసుకున్నారు. ఇవ్వాళ తెలంగాణా మాండలికం రాసే కవులు గాని, రచయితలు గాని, ఎవరూ కూడా ‘ఇంకొకరి భాష ఎందుకు రాయాలి’ అని అనుకోవడంలేదు. మా భాష, మాకు తెలిసిన భాష, మేం మాట్లాడే భాష మాత్రమే రాస్తామని రాస్తున్నారు. ‘ప్రామాణిక తెలుగు భాష’ అని మనమనుకునే తెలుగు భాషకీ, కోస్తా భాషకీ ఉన్న సామ్యాలు, వ్యత్యాసాలు ఏ పాటివో రమణారెడ్డి గారికి తెలియవనుకోము.
- సినిమాభాష ప్రస్తావనలో తెలంగాణా, రాయలసీమ భాషలు పొందుతున్న అవమానాన్ని ఒక్కటి చేశారు. దీనితో మాకేమీ పేచీ లేదు. కాకపోతే రాయలసీమ భాషను మాత్రమే కించపరుస్తున్నారని వివరంగా స్పష్టపర్చారు. తెలంగాణా భాష పొందుతున్న అవమానం విషయంలో అంత శ్రద్ధ చూపలేదు.
- ‘ఇంతవరకూ ఉపయోగిస్తూ వచ్చిన ప్రామాణిక భాషను ఇది నా భాష అంటూ ఎవడో కోస్తావాడు వచ్చి దొమ్మీగా లాక్కుపోతూ ఉంటే చూసి ఊరుకోవడానికి నేను సిద్ధంగా లేను’ అన్నారు. ఇది వ్యాసకర్త లేదా ఉపన్యాసకర్త అవగాహనకు నిదర్శనం. ఎందుకంటే ఏ భాషకు ప్రచారం పొందే అవకాశం వస్తుందో అదే ప్రామాణిక భాష అయి కూర్చుంటుంది. కోస్తా భాష విషయంలో అదే జరిగింది. ప్రామాణిక భాషగా చలామణి పొందుతున్న కోస్తాంధ్ర భాషను కాపాడుకుందామన్నారు. దీన్ని కాపాడుకోవటానికి కూడా ఈయన దగ్గర గొప్ప సాధనాలేమీ ఉన్నట్టు చెప్పలేదు.
రాయలసీమ, తెలంగాణా గ్రామాల్లో వాడే పదాలను తీసుకొచ్చి ప్రామాణిక భాషలో చేరేట్టు చూడండి’ అన్నారు. నిజానికి పదాలను తీసుకొచ్చి భాషలో చేర్చరు. భాషలో చేరిన పదాలను మాత్రమే మనం చూస్తాం. అందుకు ఏ ప్రాంతంలోనైనా ప్రజలు మాట్లాడే సజీవ భాషలో సాహిత్య సృజన జరగాలి. అంతే. ఇప్పుడు మనం వాడిదొద్దు, వీడిదొద్దు అనుకోవడంలేదు. వాడిదీ, వీడిదీ, మనదీ, అందరిదీ ఎవడిది వాడే రాసుకోవాలి అనుకుంటున్నాం. - ‘మాండలిక పదాలు కాదు మాండలిక యాస మాత్రమే’ అన్నారు. నిజానికి రెండింటికీ ఉన్న తేడా ఏమిటి? పదాలు కాని, యాస గానీ పరిచయం ఉంటేనేగా తెలిసేది. ఆ పరిచయం కోసమే మాండలికంలో సాహిత్య సృజన జరగాలి. ఇది చేతనైంది పులికంటి కృష్ణారెడ్డి వంటి ముగ్గురు నలుగురు రచయితలకే అన్నారు. మరి మిగతా ముగ్గురు ఎవరు? అల్లం రాజయ్య, తుమ్మేటి రఘోత్తమరెడ్డి, తెలిదేవర భానుమూర్తి వంటి వాళ్ళా? లేక రావి శాస్త్రి, పతంజలి, నామిని వంటి వాళ్ళా?
- ప్రామాణిక భాషలో రాసి మాండలికంలోకి తర్జుమా చేస్తున్నారన్నారు. నిజానికి ఇవ్వాళ మాండలికంలో రాసే రచయితలెవ్వరూ ఆపని చెయ్యడంలేదు. అది సాధ్యపడదుకూడా. కావాలంటే మాండలికం నుంచి ప్రామాణికంలోకి తర్జుమా చేసుకోవచ్చు. ఆ ప్రయత్నాలు జరుగుతున్నాయి కూడా.
- మాండలిక భాషలో రాయడంవల్ల పాఠకుల సంఖ్య తగ్గుతుందన్నారు. కాని అట్ల జరగదు. మాండలికభాష పాఠకుల్లో జిజ్ఞాసను పెంచుతుంది. ఎందుకంటే పాఠకులు కేవలం కథ కోసమే చదవరు. ఇతరేతర భాషా అంశాలను, జీవితాన్ని కూడా తెలుసుకోవాలనుకుంటారు.
- ‘బ్రిటన్‌లో ఇంగ్లీషంతా ఒకలాగా ఉంటుందని మనం అనుకుంటాం’ అన్నారు. అందులో 43 రకాల ఉచ్చారణలు ఉన్నాయని అన్నారు. నిజానికి ఈ రెండూ అబద్ధాలే. ఎందుకంటే బ్రిటన్ ఇంగ్లీషంతా ఒకేలాగా ఉంటుందని అనుకునేటంత అజ్ఞానంలో ఇవాళ ఎవరూలేరు. భాష సజీవమైనది. ఉచ్చారణ ఇవ్వాళ 43 రకాలుంటే ఎల్లకాలం అన్నీ ఉండవు. పెరుగుతూనో, తగ్గుతూనో ఉంటాయి.
- ‘ప్రామాణిక భాష కోస్తాదా? రాయలసీమదా? తెలంగాణాదా? లేక మరొకటా? అని తేలడానికి అసలు తెలుగుభాష బతికుంటే కదా’? అని ఆవేదన వెలిబుచ్చారు. దీనితో మాకు పేచీ ఏమీలేదు. ఇవ్వాళ అన్ని భారతీయ భాషలు కూడా ఆంగ్లం మోజులో పడి అణగారిపోతున్నాయే తప్ప మాండలికాల వల్ల కాదు. రమణారెడ్డి గారి భాషా శాస్త్ర పరిజ్ఞానాన్ని నగ్నంగా బయటపెట్టే మరో అంశం.
ఇవ్వాళ చెప్పే వ్యాకరణాన్ని గురించి ప్రస్తావిస్తూ తత్సమమంటే సంస్కృత సమమని, తద్భవమంటే సంస్కృతం నుండి పుట్టినదని మాత్రమే చెప్తున్నారన్నారు. కాని ఆంగ్ల, ఉర్దూ, హిందీ’సమాలను, భవాలను’ గురించి కూడా ఉపాధ్యాయులు చెప్తున్నారు. రాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లోని భాషోపాధ్యాయులు ఇతర రాష్ట్ర భాషా భవాలను, సమాలను గురించి కూడా చెప్తున్నారు. కాకపోతే అవన్నీ విద్యార్థులకు పరీక్షాంశాలు కావు. నిజానికి పాఠశాలలు, కళాశాలల్లో సిలబస్ కూడా మారాలి. ప్రజా పాఠ్యాంశాలు రాకుండా అడ్డుపడేది కూడా కోస్తాంధ్ర పాలకులు, రచయితలే. తెలంగాణను వ్యతిరేకించే రాజకీయనాయకుల భావాలకు ఏమాత్రం తీసిపోనివిగా రమణారెడ్డిగారి భావాలున్నాయి. ఇది తెలంగాణ సంస్కృతిని దొంగదెబ్బకొట్టే ప్రయత్నంలో భాగమే.
(వివిధ, 03 మార్చ్2008, ఆంధ్రజ్యోతి సౌజన్యం)
* * *
దారి తప్పుతున్నాం జాగ్రత్త!
-యం.వి.రమణారెడ్డి (వివిధ, 11 ఫిబ్రవరి 2008)
ప్రామాణిక తెలుగుభాషను కోస్తాభాష కింద జమగట్టి, దాన్ని తొలగించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ప్రామాణిక తెలుగుభాషంటే కోస్తాభాష అనే విషయంతో నేను ఏకీభవించలేను.
నువ్వుండేది తిరుపతిలోనైనా, హైదరాబాదులోనైనా, నీ పల్లెలో మాట్లాడే యాసలో రాయాలనుకుంటున్నావు. ప్రామాణిక భాషలో కథ వ్రాసి, దాన్ని మాండలికంలోకి తర్జుమా చేస్తున్నావ్. పల్లెలో వాడే పద్ధతి గుర్తున్నచోట పల్లెయాస పలుకుతుంది. గుర్తులేని చోట పట్నం వాసన తగులుతుంది.
మనకు హైదరాబాదులో తెలుగుతల్లి విగ్రహముంది. కొంతమంది ఆ విగ్రహాన్ని చూడగానే, ఈమె విజయవాడనుండో కాకినాడనుండో వచ్చిన ఆడమనిషి అనుకుంటున్నారే తప్ప, తల్లి అనే భావనతో చూడకపోవడం గమనిస్తే మనసు చివుక్కుమంటుంది. వాళ్ళు పరాయివాళ్ళయినా కాదు. తెలుగు బిడ్డలే. మరి వాళ్ళకు ఈ వికారం ఎందుకు కలిగింది? కుటుంబం నుండి విడిపోవాలనే భావన వాళ్ళకు కలిగింది కనుక. కలిసుంటామా విడిపోతామా అనేది భవిష్యత్తు నిర్ణయిస్తుంది. అన్నదమ్ములు కలిసున్నా విడిపోయినా తల్లి మారదు.
విడిపోవాలనే భావం కలిగినంత మాత్రాన తల్లిని మార్చుకోవాలనే దౌర్భాగ్యపు ఆలోచన ఇది వరకు ఎక్కడా వినలేదు. కలిసున్నా విడిపోయినా మనకు తల్లి మాత్రం ఒకటే ఉంటుందని చాటిచెప్పే విధంగా, తిరుపతిలో తెలుగుతల్లి రథోత్సవం జరిపించిన నా తమ్ముళ్ళను మనసారా అభినందిస్తున్నాను. ఇప్పుడనుకున్నామే, ఈ రాజకీయప్రభాలు, ఈ ప్రాంతీయ విభేదాలు, ఇవి కలిగించే ప్రకంపనాలు, తెలుగు సాహిత్యాన్ని గూడా సోకినా యి. అది తప్పదు. అది మనకు ఇక్కడ కొత్తగా జరుగుతున్న విశేషమేంగాదు. ప్రపంచంలో అన్ని చోట్లా జరిగేదే. సమాజాన్ని కదిలించే ఏ ప్రకంపనైనా సాహిత్యాన్ని తాకుతుంది.
తెలుగు సాహిత్యంగూడా మార్పును స్వీకరించింది. అనేకమంది రచయితలు, ముఖ్యంగా కథా రచయితలు, తమ ప్రాంతీయ మాండలికంలో రాయ డం మొదలుపెట్టినారు. నిన్నా మొన్నటివరకూ ప్రామాణికభాషనే మనమంతా ఉపయోగించాం. కానీ, ఈ తరం రచయితలు దాన్ని ఆమోదించే పరిస్థితిలో లేరు. రాజకీయాలు కానివ్వండి, ప్రాంతీయ మనస్తత్వం కానివ్వండి, కారణం ఏదైనా, నా ప్రాంతంలో వాడే మాండలికాన్నే నేను రాస్తాను, నా ప్రాంతంలో వాడే యాసలోనే రాస్తాను. ఇంకొకరి భాష నేనెందుకు వ్రాయాల?-అనే పరిస్థితి వచ్చేసింది.
ఇంకొకరి భాష అంటే కోస్తావాళ్ళ భాష అనే అర్థంలో, ప్రామాణిక తెలుగుభాషను కోస్తాభాష కింద జమగట్టి, దాన్ని తొలగించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ప్రామాణిక తెలుగుభాషంటే కోస్తాభాష అనే విషయంతో నేను ఏకీభవించలేను. ఎందుకు అనే వివరణకు పోయేముందు ఈ పరిస్థితి దాపురించడానికి దోహదం చేసిన కారణాలు కొద్దిగా చర్చించుకోవడం మంచిదని నా అభిప్రాయం. వాటిల్లో మొదటిది మన కోస్తాసోదరుల ప్రవర్తన. దాన్ని జీవితంలో ప్రతి ఒక్కరూ ఎప్పుడో ఒకప్పుడు అనుభవించే ఉంటారు. దీనికి చిన్న ఉదాహరణ చెబుతాను.
రాయలసీమ ప్రాంతంలో తండ్రి తల్లిని ‘జేజి’ అంటారు. కోస్తాలో ‘నాయనమ్మ’ అంటారు. నాయనమ్మ అనేది తేలికైన రెండు పదాల కలయిక. చిన్నపిల్లలు, ఇంకా భాష సరిగారానిసమయంలో నాయనకు అమ్మకాబట్టి నాయనమ్మ అంటూ తేలిగ్గా వాళ్ళకు వాళ్ళు కూర్చున్నమాట. జేజి పదం అలా తయారైంది కాదు. అది తెలుగుభాష ప్రత్యేకతను సూచించే పదం. సంస్క¬ృతానికీ తెలుగుకూ ఉన్న తేడాను తెలియచేసే పదం. కుటుంబ సంబంధాలను విడివిడిగా, స్పష్టంగా తెలియజేసే అన్న, తమ్ముడు, అక్క, చెల్లెలు, అత్త, కోడలు వంటి పదాలు సంస్కృతానికి లేవు. అవి తెలుగులోనే దొరుకుతాయి.
మన భాషకు ఒక స్వతంత్ర ప్రతిపత్తి ఉందని నిరూపించే పదాల్లో జేజి అనే పదం కూడా ఒకటి. అందువల్ల అది మనం పోగొట్టుకోవడానికి కూడా వీల్లేని మేలిమి. అలాంటి పదా న్ని చులకన చేసి ‘జేజి ఏమిటండీ జేజి. చక్కగా నాన మ్మా అని పలకలేరా?’ అంటూ ముఖం చిట్లించుకుంటారు కోస్తా సోదరులు. వెంటనే మనం చిన్నబోతాం. మనం కూడా ‘నానమ్మ ఏంటండీ నానమ్మ. చక్కగా జేజి అని పలకలేరా?’ అని అడగచ్చు. కానీ అడగలేం. ఎందుకంటే నా భాష తప్పేమో అనే గిలి మనను వెనక్కు లాగుతుంది. నాది ప్రామాణిక భాష కాదు అనే మానసిక బానిసత్వం మననుజవాబు చెప్పే పరిస్థితిలో లేకుండా గొంతునొక్కేస్తుంది.
ఇలాంటి పోట్లు కోస్తా సోదరుల చేతుల్లో ఇతర ప్రాంతాల రచయితలూ సామాన్యులూ లెక్కలేనన్ని సార్లు అనుభవించారు. ఈ పరిస్థితి ఇలావుంటే, పుండుమీద కారం చల్లినట్టు చేస్తున్నాయి తెలుగుసినిమాలు. రౌడీకి రాయలసీమ యాస, విదూషకునికి తెలంగాణ యాస, హీరోకు కోస్తా యాస ఉపయోగించడం సినిమా రచయితలకు అలవాటైపోయింది. ఇక సినిమా కథలందామా, ఏదోవొక ఫైన్‌మార్నింగ్ ఆ రచయిత తలకాయలో ఒక క్రైమ్ కథ మొలుస్తుంది. అది ఏ ప్రాంతంలో జరిగినట్టు తడుతుందంటే రాయలసీమలో జరిగినట్టు తడుతుంది.
ఆ మొలిచిన కథకీ, రాయలసీమ వాస్తవిక జీవితానికీ ఏ మాత్రం పొత్తుండదు. ఆ రచయిత రాయలసీమలో గడపటానికి తన జీవితంలో అర్ధరోజైనా కేటాయించి ఉండడు. అతనికి రాయలసీమజీవితం తెలియదు, భాష తెలియదు, సంస్క¬ృతీ తెలీదు. కోస్తా యాజమాన్యాల గుత్తాధిపత్యంలో నడిచే పత్రికల ద్వారా సంపాదించిన తప్పుడు సమాచారంతో రాయలసీమను ఊహించి తన బుర్రలో పుట్టిన క్రైమ్‌నంతా రాయలసీమమీద రుద్దుతాడు. ప్రతినిత్యం అంతపెద్ద తెరమీద, అంత విస్తృతమైన మీడియాలో రాయలసీమ పేరుబెట్టి అడ్డమైన వాచకాలు వాగుతూంటే చూసేవాళ్ళకు ఎలాగుంటుందండీ? వాస్తవంగా అది రాయలసీమ జీవితాన్ని ప్రతిబించేదే అయితే మనకు సంతోషమే! రాయలసీమ సంస్కృతినో, బాధలనో ప్రతిబింబించేదైతే సంతోషమే. కానీ అలా జరగడం లేదు.
ఉద్దేశపూర్వకంగా రాయలసీమను కించపరిచే పద్ధతి లో తయారైన సినిమాను అంతపెద్ద తెరమీద చూస్తున్నప్పుడు ఎవరికైనా గుండెల్లో మండుతుంది. కాబట్టి, అందరికిలాగే మన రచయితలకు కూడా మండింది.వాళ్ళ భాషలో నేనెందుకు వ్రాయాలి. నా భాషలోనే, నా ప్రాంతంలోనే వాడే మాండలికంలోనే నేను వ్రాయాలి-అనే పట్టుదల పెరిగింది. ఈ వాదన తో నేను పూర్తిగా ఏకీభవించలేనని ఇది వరకే సూచించాను. ఎందుకంటే మనం ఇంతవరకూ ఉపయోగిస్తూ వచ్చిన ప్రామాణికభాషను ఎవడో కోస్తావాడు వచ్చి ఇది నా భాష అంటూ దొమ్మీగా లాక్కుపోతుంటే చూసి ఊరుకోటానికి నేను సిద్ధంగా లేను.
నాకు తెలిసి మనం ఉపయోగిస్తున్న ప్రామాణికభాషను యధాతథంగా వాడుతున్న జిల్లా ఒక్కటైనా నాకు కోస్తాలో కనిపించలేదు. జిల్లా జిల్లాకూ యాసమారుతుంది. వ్యవహారశైలి మారుతుంది. ఐతే, ఒక్క విషయం మనం అంగీకరించకతప్పదు. మనం ఉపయోగించే ప్రామాణికభాష కోస్తా వ్యవహారానికి దగ్గరగా ఉండటం వాస్తవం. దానికి చారిత్రిక కారణాలు చాలా ఉన్నాయి. సరే, జరిగిందేదో జరిగిపోయింది. ఇప్పుడు నామాండలికానికి కూడా హోదాకావాలనే పట్టుదల పెరిగింది. మంచిదే. ఆ ప్రయత్నం మొదలెట్టండి. వాడిదొద్దు వీడిదొద్దు అనుకంటూ ఉన్నది కాస్తా ఊడగొట్టుకుంటే నష్టం తప్ప లాభముండదు.
అలాకాకుండా అచ్చమైన తెలుగుపదాలకోసం గ్రామసీమల్లో వెదకండి. పాశ్చాత్యనాగరికతకు దూరంగా ఉండే గ్రామసీమల్లో వెదకండి. సామాన్యమైన మానవ సంబం« దాలు, దినసరి వ్యవహారాలు నెరపటానికి అవసరమైన పదాలు ప్రతిభాషకూ ఉంటాయి, మనకూ ఉన్నా యి. అలాంటి పదాలు వెదికి తీయండి. అపభ్రంషంగా మారిన పదాలు ఉంటే వాటిని సంస్కరించండి. అప్పుడు మాండలికపదాల భాండాగారం తయారౌతుంది. రాయలసీమ గ్రామాల్లో, తెలంగాణ గ్రామా ల్లో వాడే పదాలను తీసుకొచ్చి ప్రామాణికభాషలో చేరేట్టు చూడండి. దానివల్ల తెలుగుభాష పరిధి పెరుగుతుంది. తెలుగు భాష విస్త¬ృతమౌతుంది.
అయితే, ఆ దిశగా మన కృషి ఏ మేరకు జరుగుతూందంటే, దాదాపు జరగడం లేదనే చెప్పుకోవాలి. ప్రాంతీయ ప్రాముఖ్యత కావాలని కోరుకొనే రచయితలు ఎన్నుకుంటున్నది ఆ ప్రాంతంలో వాడే మాండలిక పదాలు కాదు, మాండలిక యాస మాత్రమే. అదైనా అందరికీ చేతనౌతూందా? పులికంటి కృష్ణారెడ్డి వంటి ముగ్గురు నలుగురు రచయితలకు తప్ప, మిగతావారికి అదిగూడా చేతకావడం లేదు. ఎందుకు చేతగాదంటే, ఏ పల్లెటూర్లో ఆ యాసవాడుతున్నారో, ఆ పల్లెతో నీ బొడ్డు తెగిపోయింది. కానీ, నా మాండలికంలో రాయాలనే కుతి పెరిగింది.
నువ్వుండేది తిరుపతిలోనైనా, హైదరాబాదులోనైనా, నీ పల్లెలో మాట్లాడే యాసలో రాయాలనుకుంటున్నావు. అది వ్రాయటానికి ఏం చేస్తున్నావ్? మొట్టమొదట నువ్వు అలవాటుపడిన ప్రామాణిక భాషలో కథ వ్రాసి, ఆ తరువాత దాన్ని మాండలికంలోకి తర్జుమా చేస్తున్నావ్. దానివల్ల, కథలో అనవసరమైన కృత్రిమత్వం చోటుచేసుకుంటూందే తప్ప, యాస కుదరటం లేదు. పల్లెలో వాడే పద్ధతి గుర్తున్నచోట పల్లెయాస పలుకుతుంది. గుర్తులేని చోట పట్నం వాసన తగులుతుంది. ప్రాంతీయ ప్రాముఖ్యతకోసం యాసను కోరుకుంటున్నాం గదా. మరి నువ్వు కలగనే ప్రాంతానికంతా ఒకే యాసలేదే.
రాయలసీమ తీసుకుంటే చిత్తూరులో ఒక యాస, కడపలో మరో యాస, అనంతపురంలో ఒక యాస, కర్నూలుది మరోయాస. ఒకే జిల్లాలో కూడా ఐదారు రకాల యాసలు మనకు కనిపిస్తాయి. కడపయాసలో రాసింది పక్కనున్న చిత్తూరు, అనంతపురాలకు చదవడమే కష్టమౌతుంది. దానివల్ల పాఠకుల సంఖ్య కుదించుకుపోతుంది. పాఠకుల సంఖ్య తగ్గితే ఆ సాహిత్యం వల్ల సమకూరే ప్రయోజనం ఎంత అనేది నా సందేహం. కాబట్టి, మనం ఒక దిశగా చెయ్యవలసిన ప్రయాణాన్ని మరో దిశగా, చేరవలసిన గమ్యానికి సరిగ్గా వ్యతిరకమైన దిశగా చేస్తున్నామేమోనని నా అనుమానం.
ఇదేదో కొత్త ప్రయోగమని మనం మొదలెట్టామే, ఈ మాండలిక ప్రయోగం చాలా చాలా పురాతనమైనది. బ్రిటన్‌లో ఇంగ్లీషంతా ఒకరకంగా ఉంటుందని మనం అనుకుంటూ ఉంటాం. అందులో 43రకాల ఉచ్చారణా తేడాలు ఉన్నాయి. బెర్నార్డ్ షా రచించిన ‘పిగ్మ్యాలియన్’ నాటకం చదివితే కొంతవరకూ తెలిసొస్తుంది. ‘డయలెక్ట్స్’తో వేగలేక వాళ్ళు కూడా చివరకు ‘ఆక్స్‌ఫర్డ్ ఇంగ్లీష్’ పేరుతో ప్రామాణిక భాషను రూపొందించుకునే అవసరం కలిగింది. చారిత్రికంగా అది తప్పనిపరిస్థితి. ఈపరిణామాలను గమనించకుండా ఇప్పుడు మనం ఒక ఎమోషనల్ మూడ్‌లో మాండలిక తెలుగును ఉద్ధరించటానికి మారుగా, మాండలిక యాసకోసం పాకులాడుతున్నాం.
కాబట్టి, తెలుగు ప్రజల ఉమ్మడి ప్రయోజనం కోసం, ఒక ప్రామాణికభాష అవసరాన్ని గుర్తించ వలసిందిగా సభకు విజ్ఞప్తిచేస్తూ- ఆ ప్రామాణిక భాష కోస్తాదా, రాయలసీమదా, తెలంగాణదా లేక అందరికీ సమ్మతమైన మరొకటా అనేది తరువాతి సంగతి. ముందు తెలుగుభాష బతికుంటే కదా నీ మాం డలికమా, నా మాండలికమా అని తేల్చుకోవాల్సిన సమస్య ఉత్పన్నమయ్యేది! తెలుగు వ్యాకరణం పేరుతో మనం బోధించే పుస్తకాలను చూస్తే, మన భాష స్థాయి ఏమిటో మనకు కనువిప్పు కలుగుతుంది.
పదాలను విభజించినప్పుడు మనకు మొట్టమొదట తారసపడేది ‘తత్ సమము’. తత్ అంటే ఏమిటో మీకందరికీ బాగా తెలుసు. సంస్కృతానికి సమానమైన పదానిది మన తెలుగు వ్యాక రణంలో మొదటిస్థానం. ఆ తరువాతది ‘తత్ భవము’. అంటే సంస్కృతంనుండి పుట్టిన పదానిది ద్వితీయ స్థానం. నువ్వు అచ్చతెనుగు అనుకుంటున్నావే, దానికి నీ వ్యాకరణంలో ఇచ్చింది మూడోస్థానం. నువ్వు విప్లవాత్మకంగా భావిస్తున్నావే, ఆ మాండలికం నాల్గవస్థానంలో గ్రామ్యంగా ముచ్చటించబడి, సాహి త్యానికి అనర్హమైన భాషగా వెలివేయబడింది. మరి ఆ వ్యాకరణాన్నే భావితరాలకు బోధిస్తున్నాం. ఇకపోతే నిఘంటువులు.
అవి పేరుకు మాత్రమే తెలుగు నిఘంటువులు. పాత గ్రాంధికభాషా సాహిత్యాన్ని ముం దేసుకుని, ఆ పురాతన కవులు వాడిన సంస్కృతపదాలకు అర్థం చెప్పడం, ఉదాహరణలు చూపడం తప్ప తెలుగు వాసనే వాటికి లేదు. మరి చుట్టూ ఇన్ని తప్పులు పెట్టుకుని, వాటిని సవరించే ప్రయత్నం చేయ కుండా, నా తెలుగో నా తెలుగో అని పేద అరుపులు అరిస్తే ప్రయోజనం ఏముంది? ఈ ఆధునిక యుగం లో ముందుకు పోవటానికి నీ భాషకు ఇప్పటిదాకా సరైన నిఘంటువు లేదు, సరైన వ్యాకరణం లేదు, దానికి తోడు ప్రామాణిక భాషను గూడా లేకుండా చేసుకోవడం మంచిదో కాదో సభికులే ఆలోచించ వలసిందిగా కోరుతున్నాను.
(వివిధ, 11 ఫిబ్రవరి 2008, ఆంధ్రజ్యోతి సౌజన్యం)






మార్చ్ 7th, 2008 at 11:02 am
తిరుపతి లో తెలుగు తల్లి రథోత్సవం సంధర్బంగా భవదీయ ఇ.వి. రమణా రెడ్డి గారు ప్రసంగించారు. తెలంగాణ భాషలో వస్తున్న సాహిత్యాన్ని తప్పు బట్టిన వీరు తెలంగాణ తల్లి ఎర్పాటు అనాలోచితమన్నారు.
Career చూసుకునే ఇలాంటి కవులు కళాకారులు కొందరు ఇక్కడ తెలంగాణ గడ్డ మీద ఒకటి చెప్తారు. ఆంధ్రా లో ఇంకో పాట పాడుతారు. ఈ బతకనేర్చిన కవులు తెలంగాణ ప్రజల అస్తిత్వ పోరాటాన్ని ఎంధుకు అర్థం చేసుకోరు. వీళ్ల అసంబద్ధతనేమనుకోవాలి. విషయం తెలియని అజ్ణానమనుకోవాలా..? లేక ఆంధ్రా బిడ్డల ప్రాపకం కోసం వెంపర్లాడే దిగజారుడుతనం అనుకోవాలా..??
“దారితప్పుతున్నాం జాగ్రత్త” అని వీరు తెలంగాణ కవులకు ఉద్బొధించే ప్రయత్నం చేసారు. అయ్యా రమణారెడ్డి గారు మేము దారి తప్పలేదు. మీలాంటి కవులు ఆంధ్రా వలస పాలకుల అధికార భాషావ్యామోహం లో పడి కొట్టుకు పోతున్నారు. ఏది స్వాభిమానమో ఏది వ్యామోహమో తేల్చుకోలేని మీ విచక్షన చిక్కి శల్యమై నిస్తేజంగా మారింది. ముందే అనుకున్నట్టు మీరు నిజమే చెప్పారు. మీరు “దారితప్పుతున్నారు”.
వీరంటారు: “ఇంతవరకు ఉపయోగిస్తూ వచ్చిన ప్రామాణిక భాషను ఇది నా భాష అంటూ ఎవడో కోస్తా వాడు వచ్చి దొమ్మీగా లాక్కుపొతు ఉంటే చూసి ఊరుకోడానికి నేను సిధ్ధంగా లేను” అని..
నిజమే మీరే కాదు మీలాగే పరాయి భాషను పట్టుకుని వేలాడే వాళ్లెవరూ ఒప్పుకోరు. ఈ రోజు ప్రామణిక భాష గా ఉన్నది అందరి భాషో ఆంధ్ర భాషో మీకు తెలియదు అనుకోము. తెలంగాణ బిడ్డలు తమ భాషలో తమ సాహిత్యాన్ని ఆవిష్కరించడం తప్పెలా అవుతుంది…!! తెలంగాణ భాష యాస ల ‘సోయీ’ మరిచిన మీరు ఆంధ్ర భాష ను ఆంధ్రులు తమది అంటే వెక్కెక్కి పడి ఏడవడం సహజమే.
ఈ మేకవన్నె పులి పై తెలంగాణ కవులు ఎక్కు పెట్టిన అక్షర అస్థ్రాల్ని చూడండి
నిజానికి కవులు అనేవాళ్లెక్కడా ప్రత్యేకంగా పుట్టరు. తమ అభిప్రాయాల్ని, ఆలోచనల్ని యథాతథంగా ఆవిష్కరించడమే వాళ్లను గొప్ప రచయితలుగానో కవులు గానో చేస్తది. ప్రపంచ ప్రసిద్ధ రచయితలెవరిని చూసినా భాషాసౌందర్యం కన్నా శిల్ప సౌందర్యం, సన్నివేషాల కల్పననే ప్రధానం గా కనిపిస్తయి.
గూగుల్ వారు ఈ మద్యనే కాశ్మీరి భాష లో కూడా వాల్ల సైట్ అందుబాటులో ఉండేటట్టు రూపకల్పన చేసారు. దీని కారణంగా శ్రీనగర్ సెంట్రల్ లైబ్రరీ లో విద్యార్థుల రాక పెరిగిందట. అదీ మాత్రుభాష శక్తి. ఈరోజుకి కూడ పెద్ద పెద్ద MNC ల్లొ పని చేసేటోళ్లు కూడ రాత్రి 12 కాంగనే ఇంటర్నెట్ ల ఆంధ్ర జ్యోతే సదువుతరు. Deccan chronicle కాదు.
ఇక ఏది మాతౄ భాష ఏది ప్రామాణిక భాష అనే So called సాహిత్యకారుల మీమాంసను పక్కకు పెడితె 5 వ తరగతి లోపు పిల్లలు తమ మాతౄభాష లో ఐతే నే ఎక్కువ విషయాలను తొందరగా నేర్చుకుంటరన్నది ప్రపంచం అంగీకరించిన విషయం. మన పిల్లలకు మన భాష లోనే ఆ విద్య లభిస్తుందా అన్నది మనకు మనం వేసుకోవాల్సిన ప్రశ్న. ఇప్పటికె ఆంధ్ర భాషను మా మీద రుద్దారు. ఇంక మా పిల్లలపై కూడానా..?
మన దురదౄష్టం ఏందంటె ఇతర ప్రాంతాల భాష లో రాస్తె దాన్ని సాహిత్యమే కాదనడం ఈడున్నది. ఇప్పుడు అది శౄతి మించి అలా రాయకూడదు అనే వరకూ పొయింది. ఇక్కడ ఇట్ల అనేటోల్ల ఉద్దేశ్యం ఒక్కటే. తెలంగాణ వాడు అసలేమి రాయొద్ధు. రాసినా వాని సొంత భాష ల రాయొద్దు. లేకపోతే తెలంగాణ వాళ్లు అద్భుతాలు సృష్టించే ప్రమాదం ఉంది. సీమ మాండలికంల వచ్చిన మూగవాని పిల్లనగ్రోవి తెలంగాణ మాండలికంల వచ్చిన సలాం హైదరాబాద్ లాంటివి చాలానే ఉన్నయి. ఈ ప్రస్థానం కొనసాగి ఇట్లాంటి రచనలు ఇంకా వస్తే మన రమణారెడ్డి లాంటి వాళ్ల రచనలెవరు చదువుతారు. చప్పట్లెవరు కొడతారు. వీళ్లకు ప్రేక్షకుల కొరత ఏర్పడే పెను ప్రమాదం ఉంది.
మన తెలంగాణ వాళ్లకు ఊహా శక్తి చాలా ఎక్కువ. World famous painter’s ల Photographers ల మనవాళ్లు బాగనే ఉన్నరు. ఇక్కడెవరు వీరికి నిబంధనలు పెట్టకపోవడమే ఇందుకు కారణం.
ఈ పరిస్తితి తెలుగు సాహిత్యం లో కూడా రావాల.