తెలంగాణ - ఇటీవలి పరిణామాలు
ఏప్రిల్ 14th, 2008 by డిస్కవర్ తెలంగాణ
తెలంగాణ కోసం ప్రజలు ఏ త్యాగాలకైనా సిద్ధమేనని, అంతర్జాతీయ సామ్రాజ్యవాదాన్ని, అంతర్గత వలసవాదాన్ని ఓడించేందుకు అవకాశవాద నాయకుల్ని కాదని ఉద్యమించాల్సిందేనని అంటున్నారు నాగోబా
భారతదేశం స్వాతంత్య్రం అందినాక దేశంలో జాతుల పోరాటాలు, ఉపజాతుల ఆకాంక్షలు పెల్లుబికాయి. బ్రిటిష్ ఇండియాలో ఏర్పడిన రాష్ట్రాలు, ప్రావిన్సులు, సంస్థానాలు ప్రజల ఆకాంక్షలను గౌరవించి, జాతుల, ఉపజాతుల ఆకాంక్షలకు అనుగుణంగా ఏర్పడినవి కావు. బ్రిటిష్ రాజ్యాధికారానికి, వారి వలస దోపిడీకి అనుకూలమైన రాజ్యవ్యవస్థనే వారు ఏర్పాటు చేసుకున్నారు. స్వాతంత్య్రానంతరం జాతుల, ఉపజాతుల ఆకాంక్షలు పెల్లుబుకుతున్న నేపథ్యంలో రాష్ట్రాలను, ప్రావిన్సులను, సంస్థానాలను పునర్‌వ్యవస్థీకరించవలసిన ఒక చారిత్రక అగత్యం భారత ప్రభుత్వానికి ఏర్పడింది. జస్టిస్ ఫజల్ అలీ అధ్యక్షతన కె.ఎం. ఫణిక్కర్, హృదయనాథ్ కుంజ్రూలు సభ్యులుగా రాష్ట్రాల పునర్‌వ్యవస్థీకరణ సంఘాన్ని కేంద్ర ప్రభుత్వం 1953 లో ప్రకటించింది. దీని ప్రధాన ఉద్యేశ్యం దేశ సమైక్యతకు దోహదం చేసే ప్రజాస్వామిక పునర్‌వ్యవస్థీకరణ సంఘం దేశమంతా తిరిగి లక్షలాది వినతి పత్రాలు స్వీకరించి, వేలాదిమందిని కలిసి 1955 నాటికి అంటే మూడేండ్లలో సిఫారసులతో కూడిన నివేదికను భారత ప్రభుత్వానికి అందజేసింది. సంఘం సిఫారసులకు ప్రాతిపదికలు ప్రధానమైనవి నాలుగు. అవి
1) భారత దేశ సమైక్యతను కాపాడి, బలోపేతం చేయడం,
2) భాషా సాంస్కృతిక సారూప్యత.
3) ఆర్థిక, పాలనాపరమైన సానుకూలత,
4) భారత ప్రభుత్వం ప్రవేశపెట్టిన జాతీయ పంచవర్ష ప్రణాళికల అమలు.
పై నాలుగు ప్రాతిపదికల్లో బలమైన ప్రభావాన్ని వేసింది. భాషా సారుప్యత మాత్రమే. దీనికి కారణం అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం 1920 నాగుపూర్ కాంగ్రెస్‌లో భాషా ప్రాతిపదికన రాష్ట్రాల ప్రావిన్సుల పునర్‌వ్యవస్థీకరణ తమ విధానమని ప్రకటించింది. ఇదే అంశం 1928లో నెహ్రూ అధ్యక్షతన ఏర్పాటైన అఖిలపక్ష కమిటీ నివేదికలోను చోటు చేసుకున్నది. ఈ నివేదికనే ఆంధ్రోద్యమానికి దోహదం చేసింది. ఆంధ్రోద్యమం ఫలితంగా, పొట్టిశ్రీరాములు అమరత్వంతో కేంద్రప్రభుత్వం 1953 లో ఆంధ్రరాష్ట్రాన్ని ఏర్పాటు చేయక తప్పలేదు. ఇది దేశంలో భాషా ప్రాతిపదికన ఏర్పాటైన మొదటి రాష్ట్రం. ఈ ప్రాతిపదికను ఆధారం చేసుకొనే విశాలాంధ్ర నినాదాన్ని లేవనెత్తడం 1956 లో ఆంధ్రప్రదేశ్ ఉర్పాటు కావడం అందరూ ఎరిగిన చరిత్రే. అయితే 1953 లో ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటుకు - 1956 లో ఆంధ్రప్రదేశ్ ఏర్పాటుకు మధ్య జరిగిన చరిత్ర చాలా కీలకమైంది. ఇవ్వాళ్టి రెండో ఎస్సార్సి సందర్భాన్ని విశ్లేషంచడానికి ఉపకరిస్తాయి.
1953లో రాష్ట్రాల పునర్‌వ్యవస్థీకరణ సంఘం ఏర్పడింది. 1955 లో తుది నివేదిక వెలువడింది. 1956 లో రాష్ట్రాల పునర్ వ్యవస్థీకరణ చట్టం అమలులోకి వచ్చింది. అయితే రాష్ట్రాల పునర్ వ్యవస్థీకరణ ఎస్సార్సీ సిఫారసుల మేరకు జరుగలేదు. సంఘం భాషా ప్రాతిపదికను ఒక ప్రధాన అంశంగా పరిగణించినప్పటికీ రాష్ట్రాల పునర్ వ్యవస్థీకరణకు అదొక్కటే ప్రాతిపదిక కాదు. సంఘం దేశాన్ని మొత్తం 16 రాష్ట్రాలుగా పునర్‌వ్యవస్థీకరించింది. ఇందులో 4 హిందీ భాషా రాష్ట్రాలు, 2 తెలుగు భాషా రాష్ట్రాలు (హైదరాబాదు, ఆంధ్ర) ఒక మిశ్రమ భాషా రాష్ట్రం (బాంబాయి: మరాఠి, గుజరాతి) మిగతా 10 రాష్ట్రాలు ఆనాడు ప్రధాన భాషలుగా గుర్తింపు పొందిన అస్సామీ, బెంగాలీ, కన్నడ, కాశ్మీరీ, మలయాళం, ఒరియా, తమిళం, మరాఠి, పంజాబీ భాషా రాష్ట్రాలు.
సంఘం చేసిన సిఫారసులను కేంద్రం బుట్టదాఖలు చేసింది. హైదరాబాద్ రాష్ట్రాన్ని విడదీసి తెలుగు మాట్లాడే తెలంగాణని ఆంధ్రలో విలీనం చేసింది. మరాఠి ప్రాంతాలైన మరాఠ్వాడ, విదర్భలను బొంబాయి లో కలిపింది. కన్నడ ప్రాంతాలను కర్నాటకలో కలిపింది. ఈ రకంగా ఎస్సార్సీ సిఫారసులకు విరుద్ధంగా రాష్ట్రాల పునర్‌వ్యవస్థీకరణ జరిగిపోయింది. 14 రాష్ట్రాలలో పునర్‌వ్యవస్థీకరణ అమలులోకి వచ్చింది. ఆ తర్వాత అంటే 1960 నుండి 2002 వరకు 14 రాష్ట్రాలు ఎటువంటి ఎస్సార్సీ లేకుండానే ఏర్పాటు అయినాయి. 1956 లో జరిగిన పునర్‌వ్యవస్థీకరణ ఆయా ప్రాంతాలలో అసంతృప్తులను రగిలించింది. ఎస్సార్సీ కూడా భాషా సారుప్యతనే ప్రధానంగా దృష్టిలో పెట్టుకున్నదే తప్ప భాషా సారుప్యతకు వెలుపల ప్రజలను ఒక దగ్గర కట్టిపడవేసే సామాజిక సాంస్కృతిక అస్తిత్వాలను పట్టించుకోనే లేదు. భాష ఒక జాతి సాంస్కృతిక అస్తిత్వంలో ఒకానొక అంశమే తప్ప అదే మొత్తం అస్తిత్వం కాజాలదు. 1969 లో పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్రం కోసం ప్రజా ఉద్యమం ఎగిసింది. దేశవ్యాప్తంగా రాష్ట్రాల పునర్‌వ్యవస్థీకరణకు సంబంధించి చర్చ మొదలైంది. 1973 లో ప్రొఫెస్సర్ రషీదుద్దీన్ ఖాన్ ఈ అంశంపై చేసిన అధ్యయనం ప్రధానంగా స్మరించుకోవాలి. ఈ అధ్యయనానికి ముందే 1960 లో గుజరాత్, 1966 లో పంజాబ్‌నుండి హిందీ ప్రాంతాలను విడదీసి హర్యానా రాష్ట్రాలు ఏర్పడినాయి. 1966 నాటికి 14 భాషలను రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్‌లో పొందుపరిచారు. పునర్‌వ్యవస్థీకరణ చేసి ఉండవల్సిందని ప్రొఫెస్సర్ రషీదుద్దీన్‌ఖాన్ అభిప్రాయ పడినాడు. ఆయన అధ్యయనం ప్రకారం దేశంలో 58 స్పష్టమైన సామాజిక సాంస్కృతిక అస్తిత్వం కలిగిన ఉప ప్రాంతాలు ఉన్నాయని తేల్చాడు. భాషా సారుప్యతలు ఉన్నప్పటికీ స్పష్టమైన భాషా వైవిధ్యాలు కూడా ఉన్నాయని ఆయన గుర్తించాడు.
హిందీ భాషకు స్పష్టమైన వైవిధ్యం కలిగిన పంజాబీ, మైథిలీ, రాజస్థానీ, భోజ్‌పురీ, బ్రజ్, అవధీ, ఖరీబోలి భాషా అస్తిత్వాలు ఉన్నాయనీ గుర్తించారు. ఉత్తర బీహార్‌లోని దర్భంగా ప్రాంతంలో మాట్లాడే మైథిలీ, భోజ్‌పూర్ ప్రాంతంలో మాట్లాడే భోజ్‌పురీ కంటె భిన్నమైనది. పశ్చిమ ఉత్తర ప్రదేశ్‌లో మాట్లాడే బ్రజ్‌భాష మధ్య ఉత్తరప్రదేశ్‌లో మాట్లాడే అవధీ కంటె భిన్నమైనది. ఈరకంగా అన్ని రాష్ట్రాలను పరిశీలించి 58 ప్రత్యేక సామాజిక సాంస్కృతిక ప్రత్యేకతలు కలిగిన ఉపప్రాంతాలను గుర్తించి ఒక చిత్రపటాన్ని కూడా రూపొందించారు. ఫ్రొ.రషీదుద్దీన్‌ఖాన్. మధ్యప్రదేశ్‌లో 5, ఉత్తరప్రదేశ్‌లో 6, రాజస్థాన్‌లో 4, బీహార్‌లో 3, గుజరాత్‌లో 3, మహారాష్ట్రలో 5, ఆంధ్రప్రదేశ్‌లో 3 (తెలంగాణ, ఆంధ్ర రాయలసీమ), కర్నాటకలో 3, కేరళలో 2, తమిళనాడులో 2, ఒరిస్సాలో 2, పశ్చిమ బెంగాల్‌లో 3, పంజాబ్‌లో 2, జమ్మూకాశ్మీర్‌లో3, అస్సాంలో2, సామాజిక-సాంస్కృతిక వైవిధ్యం గల ప్రాంతాలను ఆయన గుర్తించాడు. వీటిలో ఇప్పటికే ఉత్తరప్రదేశ్‌లో ఉత్తరాంచల్, బీహార్ నుండి జార్ఖండ్, మధ్య ప్రదేశ్ నుండి ఛత్తీస్‌గడ్ రాష్ట్రాలు ఏర్పడినాయి. ఆయా ప్రాంతాలలో అసమ అభివృద్ధికి సంబంధించిన అసంతృప్తులు ఉన్నప్పటికీ ప్రత్యేక రాష్ట డిమాండ్‌లు ఉన్న ఉప ప్రాంతాలు కొన్నే. బలమైన డిమాండ్లు దశాబ్దాలుగా వెల్లువెత్తుతున్న ప్రాంతాలు తెలంగాణ విదర్భలు మాత్రమే. ఈ రెండింటిలోనూ తెలంగాణలో స్థిరమైన ప్రజా ఉద్యమాలు నడుస్తూనే ఉన్నాయి. కొన్నిసార్లు విరామం జరిగినా ఆగిపోలేదు.
1952 లో ముల్కీ ఉద్యమం మొదటి దశ కాగా, 1969 ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమం రెండో దశ, 1990 దశకం నుండి నడుస్తున్న వర్తమాన తెలంగాణ ఉద్యమం మూడోదశ ఇంత సుదీర్ఘకాలం ప్రత్యేక రాష్ట్రం కోసం సాగిన ఉద్యమాలు దేశంలో మరెక్కడా కానరావు. స్వాతంత్య్రానంతరం 1969లో తెలంగాణలో ఉవ్వెత్తున ఎగిసిన ప్రజా ఉద్యమం చేసిన ప్రాణ త్యాగాలు మరెక్కడా లేవు. తెలంగాణ ప్రజలు అన్ని రూపాలలో తమ ఆకాంక్షలను వ్యక్తం చేస్తూనే ఉన్నారు. ఉద్యమాలు చేసారు, లాఠీ దెబ్బలు తిన్నారు, జైళ్లకు వెళ్లారు, ప్రాణత్యాగం చేశారు ఎన్నికల్లో తెలంగాణ అభ్యర్థులను గెలిపించారు. అయినా భారత పాలక వర్గాలు తెలంగాణ ప్రజల ప్రజాస్వామిక ఆకాంక్షలను నిర్లక్ష్యం చేస్తూ వస్తున్నారు. కోస్తా ఆంధ్రా సంపన్న వర్గాల ప్రయోజనాలకే కొమ్ము కాస్తున్నారు.
ఇక ప్రస్తుత పరిస్థితుల దగ్గరికే వస్తే, తెలంగాణ ప్రజల ఆకాంక్షలను సొమ్ముచేసుకొని 2004 లో అటు కేంద్రంలోనూ, ఇటు రాష్ట్రంలోనూ గద్దెనెక్కిన కాంగ్రెస్ ఇపుడు మూడున్నర ఏండ్ల తర్వాత రెండో ఎస్సార్సీ వేసి తెలంగాణ సమస్యను పరిష్కరిస్తానంటున్నది. అధికారంలోకి వచ్చిన తొలి నాళ్లలో ప్రజలకిచ్చిన హామీలు నెరవేరుస్తామన్న భ్రమలు కల్పించింది. యు.పి.ఎ. ఉమ్మడి ప్రణాళికలో తెలంగాణ ఏర్పాటును ప్రస్తావించింది. అందులో రెండో ఎస్సార్సీ ఊసేలేదు. రాష్ట్రపతి ప్రసంగంలోనూ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటును ప్రస్తావింపజేశారు. ఏకాభిప్రాయ సేకరణకు ప్రణబ్ ముఖర్జీ కమిటీని ఏర్పాటు చేశారు. ఇదంతా కాంగ్రెస్ వంచనా శిల్పంలో భాగమేనని, కాలయాపనకు ఉద్దేశించిన పథకమేనని సంవత్సరం తిరిగే లోపలే స్పష్టమైంది. ప్రధానమంత్రి హైదరాబాద్ సెస్ స్వర్ణోత్సవ సభలో తెలంగాణ కు పాలనాపరమైన పరిష్కారమా? రాజకీయపరమైన పరిష్కారమా? ఏదికావాలో చర్చించమని మేధావులకు పురమాయించాడు.
2006 మార్చ్‌లో హైదరాబాద్‌లో జరిగిన కాంగ్రెస్ ప్లీనరీలో ఉన్న పళంగా ఇవ్వడానికి తెలంగాణ ఇన్‌స్టంట్‌కాఫీ కాదు. తెలంగాణపై ఏకాభిప్రాయం కుదరలేదని ప్రకటించాడు. నెపం బిజెపి మీదకి నెట్టివేసాడు. ఇక్కడ వై.ఎస్ అభివృద్ది మంత్రాన్ని జపించడం ఉధృతం చేశాడు. తమ ప్రభుత్వం అమలుచేస్తున్న అభివృద్ధి పథకాలు తెలంగాణ ప్రజలను సమ్మోహితులను చేస్తున్నాయని. వచ్చే ఎన్నికల్లో తామే తిరిగి అధికారంలోకి రాబోతున్నామని కాంగ్రెస్ అధిష్ఠానాన్ని నమ్మిస్తున్నాడు. కోస్తా, రాయలసీమలో మెజారిటీ సీట్లు గెలుస్తామని, తెలంగాణాలో ఎంత సెంటుమెంటున్న జిల్లాకు రెండు అంటే 20-25 సీట్లు గెలుచుకొని ఇతరుల మద్దతుతో ప్రభుత్వాన్ని, ఏర్పాటు చేస్తామని నమ్మబలుకు తున్నాడు. ఒక ప్రాంతం మొత్తం వ్యతిరేకమైనా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామనడం ఎంతటి అహంకారం. ఇపుడు గనుక రాష్ట్రాన్ని విభజిస్తే తెలంగాణ ఏర్పడిన ఖ్యాతి టి.ఆర్.ఎస్ తన్నుకుపోతుంది. కోస్తా, రాయలసీమలను చిరంజీవి తన్నుకుపోతాడు. రెంటికి చెడ్డ రేవడి అవుతుందని వై.ఎస్ అధిష్ఠానాన్ని హెచ్చరించాడు. అధిష్ఠానం కూడా ఆయన హెచ్చరికలని పరిగణనలోకి తీసుకున్నట్లే కనబడుతున్నది. రెండో ఎస్సార్సీపై వెనక్కి తగ్గినా తెలంగాణ ఏర్పాటుపై మౌనమే పాటిస్తున్నది. వై.ఎస్ మరింత స్పష్టంగా ఆంధ్రజ్యోతి దినపత్రికకు ఇంటర్వ్యూ ఇస్తూ ఈ టర్మ్‌లో తెలంగాణ సాధ్యం కాదు అన్నారు. సోనియా నిర్ణయమే శిరోధార్యం అని ఇన్నాళ్లు చెప్పుకొచ్చిన వై.ఎస్ ఇపుడు సోనియా ఏమైనా సామ్రాజ్ఞియా, ఆమెకూ పరిమితులుంటాయని సెలవిచ్చారు. అంటే సోనియా ఈ టర్మ్‌లో తెలంగాణ పై నిర్ణయం తీసుకునే అవకాశం లేదని తేలిపోయింది. ఇక సరి అయిన సమయం రానట్లే. సరిఅయిన సమయంలో సరి అయిన నిర్ణయం జరగడం ఇక కల్ల. అయితే ఎటువంటి డిమాండ్ గాని, రాష్ట్రం కోసం ప్రజా ఉద్యమం గాని లేని బుందేల్‌ఖండ్‌కు మాత్రం సరి అయిన సమయం వచ్చేసినట్లుగా కనిపిస్తున్నది. ఇదీ కాంగ్రెస్ వంచనా శిల్పం.
రెండో ఎస్పార్సీ ద్వారానే తెలంగాణ సమస్యను పరిష్కరిస్తామని గతంలోనే ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల కాంగ్రెస్ ఇన్‌చార్జ్ దిగ్విజయ్‌సింగు ప్రకటించినపుడు పెద్ద చర్చనే జరిగింది. తెలంగాణ కాంగ్రెస్ నాయకులు మండిపడినారు. మధుయాష్కి, పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి, ఉప్పునూతల పురుషోత్తంరెడ్డి, ఆమోస్, ఇంద్రకరణ్‌రెడ్డి, సర్వేసత్యనారాయణ, వి.హెచ్. హనుమంతరావులు దిగ్విజయ్‌సింగు ప్రకటనపై, ఆపై వీరప్ప మొయిలీ ప్రకటనపై నిరసన వ్యక్తం చేశారు. ఇపుడు మళ్లీ ఢిల్లీ నుంచి రెండో ఎస్సార్సీ వేస్తున్నారన్న వదంతులు, ఆ వార్తలని వీరప్పమొయిలీ ధృవీకరించడంతో రాష్ట్రమంతా అగ్గిరాజుకున్నది. ఈసారి వృద్ధ కాంగ్రెస్ నాయకులు వెంకటస్వామి, ఎమ్మెస్ గళమెత్తారు. రెండో ఎస్సార్సీ వేస్తే తాను లోక్‌సభ సభ్యాత్వానికి రాజీనామా చేస్తానని ప్రకటించాడు. ఢిల్లీ నుంచి సంయమనంతో మాట్లాడే జయపాల్‌రెడ్డి రెండో ఎస్సార్సీ వేస్తే తాను ఎన్నికల్లో పోటీ చేయనని ప్రకటించాడు. రెండో ఎస్సార్సీ ఏర్పాటును వ్యతిరేకిస్తూ టి.ఆర్.ఎస్ ఇప్పటికే ఆందోళనా కార్యక్రమాలు చేపట్టింది. రాస్తోరోకోలు, రైల్ రోకోలు, దిష్టిబొమ్మల దగ్ధం, మంత్రుల ఘెరావ్‌లను కొనసాగిస్తున్నది. నల్లగొండలో తెలంగాణని డిమాండ్ చేస్తూ 5 లక్షల మందితో బహిరంగ సభ నిర్వహిస్తానని ప్రకటించింది. మార్చ్ 6వ తేదీలోగా తెలంగాణ ఏర్పాటును ప్రకటించకపోతే తమ పార్టీ ఎంపీలు, ఎం.ఎల్.ఎ.లు, ఎం.ఎల్.సి.లు రాజీనామాలు సమర్పిస్తారని అల్టిమేటం ఇచ్చింది. ఈ అగ్గి అన్ని రాజకీయ పక్షాలకు అంటుకున్నది. కాంగ్రెస్ వంచనని, దగాని ఖండిస్తూ అన్ని రాజకీయ పక్షాలు ప్రకటనలు జారీ చేస్తున్నాయి.
ఇంత జరుగుతున్నా సోనియాగాంధీ మాత్రం తన మనోభావాలు వెల్లడించడం లేదు. ద్రోహాల చరిత్ర కలిగిన కాంగ్రెస్‌ను ఇకనమ్మే పరిస్థితి కనపడటంలేదు. కాంగ్రెస్ ద్రోహాల చిట్టా చిత్రగుప్తుడి పాపాల చిట్టా కన్నా పెద్దదే, కనుక తన పాపాల పరిహారానికైనా ఇపుడైనా తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించాలి. అందుకు తగిన రాజ్యాంగపరమైన చర్యల్ని వెంటనే చేపట్టాలి. తెలంగాణ రాష్ట్రం తప్ప మరేది తెలంగాణ ప్రజలను సంతృప్తి పరచలేదు.
ఇక పోతే తెలంగాణ ప్రజలు, ఉద్యమకారులు విశ్లేషించు కోవాల్సిన మరో ప్రధానాంశం - దేశంలో 14 రాష్ట్రాలను ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాటు చేయగలిగిన కేంద్ర ప్రభుత్వాలు, ఇపుడు బుందేల్‌ఖండ్‌ని సునాయసంగా ఇవ్వజూపుతున్న యు.పి.ఎ ప్రభుత్వం తెలంగాణ దగ్గరికి వచ్చేవరకు ఎందుకు ఈ ఊగిసలాట? ఎందుకీ సంశయంలో డిమాండ్ ఉన్నది. ప్రజల ఆకాంక్షలు పలుమార్లు పలు రూపాలలో వ్యక్తమైనాయి. 1990 దశకం నుండి వర్తమాన తెలంగాణ ఉద్యమం పల్లె పల్లెకు చేరింది. అయినా కేంద్ర ప్రభుత్వాలు తెలంగాణ ఇవ్వడానికి ఇబ్బంది పడుతున్నాయి. అంటె కోస్తా వలసవాదం తెలంగాణపై తన పట్టును ఇంకా సడలించుకోలేదు. అసలు ఇన్నేళ్ల ఉద్యమం తర్వాత వలసవాదం బలహీనపడిందా? పడితే కేంద్ర పాలక వర్గాలను ఇంకా ఎందువల్ల ప్రభావితం చేయగలుగుతున్నారు? కేంద్ర పాలక వర్గాలపై వలసవాదం ప్రభావాలతో పాటు అంతర్జాతీయంగా సామ్రాజ్యవాదుల, ఎం.ఎన్ సిల ఒత్తిళ్లు ఉన్నాయా? తెలంగాణపై నిర్ణయం జరిగేది ఢిల్లీలోనా? వాషింగుటన్‌లోనా? ఇవ్వాళ కోస్తావలస వాదం అంతర్జాతీయ సామ్రాజ్యవాదులకు దళారులుగా మారిన పరిస్థితుల్లో కేంద్ర పాలక వర్గాలపై జమిలిగా ఈ రెండింటి ప్రభావాలు ఉండే అవకాశం లేకపోలేదు. కాబట్టి తెలంగాణ అనుకూల శక్తుల ఏకీకరణ ఎంత బలంగా ఉంటె అంటే బలంగా కోస్తా వలసవాదం పట్టును సడలించగలుగుతాము. కేంద్ర పాలక వర్గాలపై వలసవాదులు ప్రభావాన్ని తగ్గించగలుగుతాం. తెలంగాణ అనుకూల శక్తులను సంఘటితం చేయడం, తెలంగాణ వ్యతిరేకశక్తులను ఏకాకులను చెయ్యడం ఇవ్వాళ అనివార్య సందర్భంగా మనముందు ఉన్నది. ప్రజలు ఏ త్యాగలకైనా సిద్ధంగా ఉన్నారు. నాయకత్వమే దివాళకోరు తనంతో వ్యవహరిస్తున్నది. అంతర్జాతీయ సామ్రాజ్యవాదాన్ని, అంతర్గత వలస వాదాన్ని ఓడించేందుకు తెలంగాణ ప్రజలు, ఉద్యమం సంసిద్ధం కావడం ఇవ్వాళ్టి కర్తవ్యం.





