Feed on
Posts
Comments

- అల్లం నారాయణ

నురుగులు కక్కే పున్నమి ఎన్నీల వెలుగులు. పాటలు మోగుతాయి. వసంతరుతువు. కాముని పున్నమ. జాజిరాడదాం. . జమగూడుందాం. . ఎప్పటికి మనతోటి ఎనభైమంది అని కోలాటాల్లాంటి కోలల వరసవేది చిటపట చప్పుడు. ఉప్పు చిట్లినట్టు. మంటల్లో తునికికట్టె బెరడు చిట్టినట్లు. సినీరిమంచమ్మే వలలో. . . సన్నప్పు నులకా వలలో. . . దాని మీద కూకున్న వలలో దానారెవరమ్మా వలలో. . చప్పట్ల మోత. వెన్నెల కురుస్తున్న ఆరాత్రి. పాటలు సుడులు తిరుగుతూ. . ఆకాశాన్నంటుతుండడం ఓ జ్ఞాపకం.

అంగిమీద రంగుబిళ్ళలే. . ఓనారన్న. . రంగుజూసి మోసపోకుడే ఓ సేడెలార. . కైకట్టిన పాట. అదొక జీవగర్ర. అది ప్రకృతికి పలుకులు నేర్పడం. పల్లెకు నడకలు నేర్పడం. ఎన్నీలకు వెలుగులివ్వడం. ఆ ప్రకృతిలోంచి పుట్టిందొక పాట. అది మూడు దశాబ్దాలుగా అన్ని రకాల ఉద్యమాలకూ ఆరంభపు పాట. అదొక పతాక గీతం. అన్ని రకాల వామపక్ష ఉద్యమాల వేదికల మీద అది ప్రవాహమై ప్రవహించింది. జలపాతమై దూకింది. మరణించిన వాళ్ల కోసం అది గొప్ప వెన్నెల కోనల నివాళులిచ్చింది.

అదే ఎర్రజెండెర్రజెండెన్నియ్యలో. . ఎర్రెర్రని దీ జెండెన్నియ్యలో. . అల్లం వీరయ్యది ఆ పాట. కాముని పున్నమినాడు నాలుకల మీద నడయాడే పాటల నుడుగుల నుంచి పుట్టిందా పాట. ఆ మాటకొస్తే వీరయ్య పాటకు ప్రాణమైంది ముప్పదేళ్ల కిందటి జగిత్యాల జైత్రయాత్ర వేదిక. అవన్నీ ఇప్పటి జ్ఞాపకాలు. ఒకప్పటి ఎలుగురవ్వలు. ఎన్నెల కోనలు. అదంతా ఒక మహా వైభవం. ఒక గతం.

ఒక పాటల పల్లవులు నర్తించిన ప్రజా బాహుళ్యపు ఊరేగింపు. నిత్యం పల్లెలను రగిలించి, పాడించి, ఆడించిన ప్రజాయుద్ధ పంథా సంరంభం. మేడే తెల్లవారి మూడు దశాబ్దాల తర్వాత అదొక తట్టి లేపిన జ్ఞాపకం. పాటెట్లా పుట్టింది. ఆ పాట ఎట్లా ప్రాచుర్యం పొందింది. ఆ పాట రాసిందెవరు? పాడిందెవరు. దాన్ని వాకిలి పొక్కిలవంగ దుంకులాడిన వాళ్లెవ్వరు? ఒకానొక కాముని పున్నమి జ్ఞాపకం ఆ పాట. జానపదాలను విప్లవ పాటల నురుగుల్లోకి తర్జుమా చేసింది గద్దర్‌. అదొక శకం. శివసాగరుడు నర్రెంక సెట్టుకింద నరుడో భాస్కరుడా! అంటే ఆ తర్వాత గద్దర్‌ జానపదాలను నెత్తురుమండే విప్లవ జావళులుగా తీర్చిదిద్దారు.

వంగపండు, భూపాల్‌లదీ అదే ఒరవడి. పొదలపొదల గట్లనడుమ పొడిసెనొక్క సందమామ సాహు (శనిగరపు వెంకటేశ్వర్లు) అదే ఒరవడి. మంథని తాలూకా గాజులపల్లిలో పుట్టిన అల్లం వీరయ్యది అదే దారి. ఆయన అద్భుతమైన పాటలు రాశారు. ఎర్రజెండెర్రజెండ మాత్రుక. .

పుల్లలు పుల్లాలెనియ్యలో
మరి లవంగ పుల్లాలెనియ్యలో. .
లవంగ పుల్లాలెనియ్యలో. .
మరి నవులుతె వాసనలెనియ లో. .
సుక్కబొట్టు. . సుక్కబొట్టెనియ్యలో. .
సూరుడు లచ్చన్నెనియ్యల్లో. .
సూరుడులచ్చన్నెనియ్యలో. .
రణధీరుడు లచ్చన్నెనియ్యలో. . .

ఈ పాట బాణీతోనే వీరయ్య ఎర్రజెండెర్రజెండినియలో. . అని అన్నలు అన్నాలెనియ్యలో మరి వెన్నెల కోనాలెనియ్యలో. . అని రాశాడు. అప్పుడు శివసాగర్‌ ఒక ప్రశ్న అడిగాడని గుర్తు. అది వెన్నెల కోనలా? వెన్నెలకూనలా? అని. కోనలంటే అడవిలో ఒక వెన్నెల మూల అని. కూనలంటే వెన్నెల ముద్దలని. . లేదా వెన్నెల శిశువులని. .

ఆ పాట ప్రాచుర్యం ఎలా పొందిందన్నది ఒక ఆసక్తికరమైన జ్ఞాపకం. గాజుల పల్లెలో ఉండే అల్లం వీరయ్య సోదరులిద్దరూ రచయితలే. ఒకరు నవలా రచయిత అల్లం రాజయ్య. ఇంకొకన్ని నేను. నేను కవిని అప్పటికి. ఈ పాటరాసిన వీరయ్య అప్పుడు రంగనాయకమ్మ సంపాదకత్వంలో వెలువడుతున్న ‘ప్రజాసాహితి’కి పంపించారు. అప్పుడు రత్నమాల నడుపుతున్న ‘నూతన’, రంగనాయకమ్మ ‘ప్రజా సాహితి’ వరవరరావు ‘సృజన’లు ప్రచురణలో ఉన్నవి. సృజన అల్లం సోదరుల వాసన వేసే కాలమొకటి అప్పుడు ఉండేది.

ఆ పత్రిక మా ఆత్మలను తట్టిలేపిన వేదిక కూడా. కానీ సృజన ఎందుకో తాత్కాలికంగా ఆగిపోయింది. ప్రజాసాహితి ఈ పాటను చాలా నిజాయితీగా తిప్పిపంపింది. ప్రచురించలేదు. అప్పుడు వీరయ్య చిన్న తమ్ముడినైన నేను. . పాటల కోలాటమాడుతున్న ఉద్యమంలో ఉన్నవాన్ని. ఇకనేం ఒకానొక ఎండకాలం. ఈ పాట. . . ఈ పాట బాణీ అల్లం వీరయ్య తన నెమ్మదైన బాణీలో వినిపించారు. ఎంత ఎగిరి దుమికి. . మా అరుగులు. . వాకిళ్లన్నీ పొక్కిలి పొక్కిలయేదాకా. . ఆపాట అట్లా జగిత్యాల జైత్రయాత్ర వేదికమీద అప్పుడొక రికార్డు స్థాయి జనవాహిని మధ్య మోగింది. అదట్లా జనంలో అంటుకున్నది. ఆ వేదిక ఇంకా గుర్తుకొస్తున్నది.

ఓ వంక గద్దర్‌. . మరోవంక మల్లా రాజిరెడ్డి, ముప్పాళ లక్ష్మణరావు, ఇట్లా ఎందరెందరో! ఇదొక జ్ఞాపకం. మూడు దశాబ్దాల కిందటిది. ఆపాట అట్లా నేను పాడినందువల్ల సృజన సంచికలో అల్లం నారాయణ పేరిట అచ్చయింది. సృజన ప్రత్యేక సంచికలో కూడా అట్లాగే అచ్చయింది. ఆ తర్వాత కొత్తగూడెంలో ఆర్‌వై. ఎల్‌ మహాసభలో గద్దర్‌ ఎత్తుకున్నాడా పాటను. సాదాసీదా ఒక వాగు పారినట్టు, ఒక నీటి సవ్వడి మాత్రంగా శబ్దం వినిపిస్తున్న ట్టు. . . నిశ్చల నదిలా సాగే ఒక జానపద సరళమైన బాణీ గల ఈ పాటను గద్దర్‌ ఎత్తులు. . . విరుపులు. . హాఁ అనే హుషారైన మాటలు. . ఎర్రజెండెర్రజెండెర్రజెండ అనే పునరుక్తి తాడింపులతో ఆకాశమెత్తుకు తీసుకెళ్లారు.

(ఒకప్పుడు నేను సరళంగా పాడిన ఆ పాట తర్వాత గద్దర్‌ బాణీలో నాకే పాడరానంత తీవ్ర స్థాయి రాగంలోకి వెళ్లిందాపాట) ఇక అట్లా అంటుకుందా పాట. మా అన్నదమ్ముల్లో అల్లం వీరయ్య సున్నితమైన ఆత్మగలవాడు. ‘మనసంత మానేరు. . మాట కోనేరు’ … ‘అన్నా. . రెక్కలుంటే లేసిరండి’ అని అమర వీరులను ‘ఎర్ర మొగ్గలాలీ ‘ అని పిలిచినా ‘లేగదూడల తీరు కూడి బతుకు దామని’ ఉయ్యాల పాటలు పాడినా. . ఆయన కవిత్వం ఒక సున్నితమైన ఆత్మను తట్టి లేపే పూవురేకలాంటిది.

ప్రజాకవుల్లో గద్దర్‌, వంగపండు, గూడ అంజయ్య, భూపాల్‌ అనే వరసలో అల్లం వీరయ్యదీ ఒక ఒరవడే. ‘మే’డే తెల్లవారి ఆ పాట గురించీ అల్లం వీరయ్య గురించి చెప్పడం ఎందుకంటే ఆ పాట ఎట్లా పుట్టింది. ఎట్లా ప్రజల్లోకి వెళ్లింది. అన్న గందరగోళం కొంత ఉంది. చివరగా నారాయణమూర్తి ఆ పాటను ‘ఎర్రసైన్యం’ సినిమాలోకి తీసుకోవడం వందేమాతరం దాన్ని పాడడం. అది సినిమా కాబట్టి విస్త­ృత ప్రచారం పొందడం అనంతర పరిణామం. ఆపాట కమ్యూనిస్టు ఉద్యమాల కదన రంగపు కవాతుపాట. ‘మే’డే నాడు ఈ పాట ఎట్లా పుట్టిందో చెప్పడం ఒక అవసరంగా భావించి. . . .

(3 మే 2008, ఆంధ్రజ్యోతి, ప్రాణహిత సౌజన్యం తోటి)

Leave a Reply

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

Managed by Discover Telangana Inc., a registered nonprofit organization in USA.

All opinions and views expressed by third party content providers and shown here as preview are not that of Discover Telangana.

If you find any Content that is infringing, libelous, defamatory, obscene, abusive, offensive or otherwise violation of copyright law, alert us by emailing us at discover.telangana(at)gmail.com