సింగిడి
సెప్టెంబర్ 15th, 2008 by డిస్కవర్ తెలంగాణ
‘సింగిడి’ ఆహ్వానం (Vividha, 15 Sept, 2008)
‘సింగిడి’పై ‘వివిధ’లో జరిగిన చర్చ తెలంగాణ రచయితల సంఘం ఉద్దేశాన్ని మరింత స్పష్టం చేసింది. అనేక రంగుల కలయికగా, ఇంతదాకా విస్మరిస్తూ వస్తున్న అన్నివర్గాల ప్రాతినిధ్యంతో ముందుకు నడిచే వేదికగా ‘సింగిడి’ని తీర్చిదిద్దాలనేదే మా ఉద్దేశం. అందుకే తెలంగాణ సాహిత్యానికి వెన్నెముకైన అస్తిత్వ ఉద్యమాల ప్రతినిధులుగా ఆరుగురు కన్వీనర్లతో మొదలైంది ‘సింగిడి’. ఆయా జాతుల సాహిత్యాన్ని మరింత చర్చకు తేవడం, వారి డిమాండ్ల సాధికారతకు గొంతునివ్వడం ద్వారా తెలంగాణ ఉద్యమానికి మరింత ఊతమందించే ప్రయత్నం ‘సింగిడి’ చేస్తుంది. 21 సెప్టెంబర్ 2008 ఆదివారంనాడు హైదరాబాద్‌లోని బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో ‘సింగిడి’ ఆవిర్భావ సదస్సు జరుగుతుంది.
ఉదయం 10 గం.ల నుండి రాత్రి 9 వరకు జరిగే ఈ సదస్సులో తెలంగాణ స్త్రీ, దళిత, బహుజన, ముస్లిం, గిరిజన సాహిత్యాలపై వివిధ సెషన్‌లుంటాయి. రవ్వాశ్రీహరి, జయధీర్ తిరుమలరావు, బి.నరసింగరావు, కె.శ్రీనివాస్, అల్లం నారాయణ, ఎస్వీ రామారావు, ఎస్వీ సత్యనారాయణ, ననుమాసస్వామి, జె.సుభద్ర, షాజహానా, బిఎస్.రాములు, జిలుకర శ్రీనివాస్, గూడ అంజయ్య, అందెశ్రీ, గోరటి వెంకన్న, ముదిగంటి సుజాతారెడ్డి, గుడిపాటి, జింబో తదితర ప్రముఖులు, తెలంగాణ సాహిత్యోద్యమంలో భాగస్వాములెందరో పాల్గొంటున్నారు. సాయంత్రం కవి సమ్మేళనం ఉంటుంది. తెలంగాణ అన్ని జిల్లాల నుంచి రచయితలు, కళాకారులు, మేధావులు, తెలంగాణవాదులంతా పాల్గొని ‘సింగిడి’ని శోభింపజేస్తారని- అందరికీ ఇదే మా పిలుపు…
- ఏలేశ్వర నాగభూషణాచార్య కన్వీనర్, ‘సింగిడి’ తెరసం
* * *
సింగిడి తెలంగాణకే స్వంతం (Vividha, 8 Sept, 2008)
విల్లు తెలుగుపదం. దీనికి ‘సింగిణి, సింగాణి’ అనేవి రూపాంతరాలు. సంస్కృతంలో దీనికి ‘ధనువు, ధనుస్సు, కార్ముకం, చాపం, కోదండం’ మొదలైనవి సమానార్థకాలు. ‘అల్లె (తాడు), అరి నారి, గొనయం’ అనేవాటికి సంస్కృతంలో ‘మౌర్వి, జ్యా, శింజిని, గుణం’ అనేవి సమానార్థకాలు. ‘శింజిని’ పదానికి వింటినారి అనే అర్థంతోబాటు ‘కాలి అందె’ అని కూడా అర్థముంది. ‘ఇంద్రధనుస్సు, హరివిల్లు’ పదాలు, ఇంగ్లీషులో ‘రైన్‌బో’ అని విద్యావంతులు పలుకుతారు. ఇక్కడ ‘హరి’ అనే పదానికి ఇంద్రుడనే అర్థం. విష్ణువు అని కాదు. ఋగ్వేద కాలమున ఇంద్రుడు, అగ్ని, సోముడు, సూర్యుడు వరుసగా ప్రధాన దేవతలు. ప్రాగ్దిశాధిపతి ఇంద్రుడు కాబట్టి ‘ఇంద్రధనుస్సు’ అన్నారు.
మేము చిన్నప్పుడు (1950) నెల్లూరు జిల్లాలో దీనిని ‘వానగుడి’ అని కాని, ‘అరిల్లు’ అనికాని అనేవాళ్ళం. హరివిల్లుకు గ్రామ్యరూపం అరిల్లు కావచ్చు. ఇక ‘సింగిడి’ అనే పదం ఆంధ్రప్రాంతంలో లేనేలేదు. అది తెలంగాణకే స్వంతం. ‘శింజిని, సింగిణి’ పదాలకు ‘సింగిడి’కి సంబంధం ఉండవచ్చు. ‘సింగిణి’లోని ‘ణి’ మారి ‘డి’ కావటం సహజమే. అడగు-అణగు, వడకు-వణకు.. మాదిరి. ‘సింగిడి’కి ‘సింగాడి’ అనే రూపాంతరం కూడా తెలంగాణాలో ఉంది. అంతేకాక సింగిడికి ఇంద్రధనుస్సు అనే అర్థంతోబాటు, మరో అర్థముంది, కొన్ని లంబాడీ తండాల్లో. వడ్లు, జొన్నలు మొదలైన ధాన్యంగాని, అన్నం రొట్టెలు మొదలైన పదార్థాలుగాని ఒక తేలికపాటి మూటగా కట్టితే, ఆ మూటకు సింగిడి అని పేరట. ఇక్కడ మేము దాన్ని ‘జంగిడి’ అంటాము.
మరో చిత్రమైన పేరు, ఇంద్రధనువు అనే అర్థంలో, పరిచయం చేస్తాను. 1952-53లో కడప జిల్లాలోని, ఒక మారుమూల కుగ్రామంలో ఉండినాను. అక్కడ దీనికి ‘కొర్రు’ అనే ఒక్క పదం మాత్రమే మాడేవారు. వేరే ఏ పదమూ అక్కడ, అప్పుడు తెలియదు. ఈ పదానికి నెల్లూరులో వాడియైన పరికరము, మేకు అని అర్థం. ఎండిపోయిన చెట్టుకొమ్మ మీద పంచ ఆరవేసి లాగేటప్పుడు చినిగితే, కొర్రు బట్టి చినిగింది అనేవాళ్ళం. ‘వరదగుడి, వరదగూడు’ పదాలు కూడ ఇక్కడ హరివిల్లునే సూచిస్తాయి. ‘వానగుడి’ మాదిరే.
అంతేకాని ‘Halo’ మాదిరి, సూర్యచంద్రుల చుట్టు వలయాకారంగా ఉండే కాంతి పరివేషము అని కాదు. బ్రౌన్ పొరబడినాడో లేక తెలంగాణాలో ఎక్కడైనా ఆ అర్థంలో వాడుతారో ఏమో! రోజులు మారాయి సినిమాలో ‘ఏరువాకా సాగారో..’ పాటలో ‘పడమటి దిక్కున వరదగుడేసీ’ అన్నచోట కూడ ఇంద్రధనుస్సు అనే అర్థం. ఆచార్య జి.యన్.రెడ్డి ‘అర్థ పరిణామం’ అనే వ్యాసంలో ‘అరివిల్లు, సింగాడి, కొర్రు, వరదగూడు’ పదాలు రూపాంతరాలని పైవన్నీ పరిశీలించే చెప్పారు.
-కాళిదాసు చంద్రశేఖరశర్మ, ముసునూరు, నెల్లూరు
* * *
సింగిణి, సింగిడి అయిందా? (Vividha, 25 Aug, 2008)
చెమన్ అన్నట్టు సింగిడి, ఇంద్రధనస్సు ఒక్కటే; వరదగూడు వేరు. అయితే, సింగిడి, వరదగూడు-పుస్తకాలు, నిఘంటువుల పదాలు కావని అంటున్నారు చెమన్ (వివిధ, ఆగస్ట్). సంస్కృతంలో ‘శార్ఙ’్గ అంటే ‘విష్ణువు యొక్క విల్లు’ లేదా ‘విల్లు’ అనీ, ‘శిఞ్జినీ’ (శింజిని) అంటే ‘వింటి నారి’ అనీ నిఘంటువులు చెప్తున్నాయి. వీటి నుండి తెలుగులోకి వచ్చింది సింగాణి । సింగిణి । సింగిణీ అని, ‘విల్లు’ అర్థం చూపుతున్నాయి నిఘంటువులు.
ఈ అర్థంలోనే కాళోజి -
అంద చందా లొల్కు ఆనందఝరులు
చంటి పాపని పెదవి జంట సింగిణులలో
అన్ని చేరి ఆటలాడుతున్నాయి - అని ‘జంట సింగిణులు’ కవితలో అన్నారు.
(‘నా గొడివ’ : 1953)
రాజకీయ బల్లీ(యు)లు
రక్త సిక్త హస్తాలతో ఎగరేసిన
తెల తెల్లని కపోతాలు వాలగ, కూర్చొని పాడగ
కైత సింగిణీల దీర్చు
కవి గూడ నేతగాడె
బహు చక్కని సాలెగూడు అల్లవాడె
- అంటూ కాళోజి ‘కవి గూడ నేతగాడె’ కవితలో ‘సింగిణి’ని హరివిల్లు । ఇంద్రధనస్సు అనే అర్థంలో వాడారు (‘నా గొడవ : 1975-1977′).
‘హరివిల్లు’ ‘ఇంద్రధనస్సు’ బడిపలుకు, ‘సింగిణి’ పలుకుబడి - అని ఆయన చెప్పారు.
‘వరదగుడి’ అంటే ్చ halo round the sun or moon, సూర్యాది పరివేషము-అని బ్రౌన్ తన నిఘంటువులో ఎపుడో చెప్పారు (1852 ?).
మరి, సింగిణి, సింగిడి అయిందా? ఇట్లే - వరదగుడి, వరదగూడు అయి - పున్నమి చంద్రుని చుట్టూ కనిపించే వలయంగా తెలంగాణాలో వాడుకలోకి వచ్చిందా? ఆంధ్రా ప్రాంతంలో ఈ ‘పలుకుబడులు’ లేవా?
- జీడి, వరంగల్
* * *
సింగిడి- ఇంద్రధనస్సు ఒక్కటే (Vividha, 11 Aug, 2008)
‘వివిధ’లో ‘సింగిడి- ఇంద్రధనస్సు ఒక్కటి కావు’ అని అనంతోజు దేవీప్రసాదరావు అన్నమాట సత్యదూరం. తెలంగాణ ప్రాంతంలో ఇంద్రధనస్సునే ‘సింగిడి’గా పిలుస్తారు. ఇప్పటికీ తెలంగాణ పల్లెప్రజలకు ఇంద్రధనస్సు అనే పదం తెలియదు. ఇంద్రధనస్సు అనేది చదువరుల, పండితుల పదం. కానీ పల్లె ప్రజల పదం ‘సింగిడి’నే. తెలంగాణలో పుట్టి పెరిగిన మేము తెలంగాణ పల్లె బాల్యాన్ని గ్రోలుకున్నవారమే. సాయంత్రం వేళల్లో ఆకాశంలో రంగుల అద్భుతాన్ని చూడగానే సింగిడి గెంతడం మా బాల్యపు ఆనందంలో భాగమే.
చేను చెలకల నుండి సాయంత్రం పూట ఇళ్లకు తిరిగి వస్తుంటే కనిపించే సింగిడి దృశ్యం తెలంగాణవారి మనస్సుల్లో మాయని మధురమైన జ్ఞాపకం. తెలంగాణలో సింగిడికి మరో పదం లేదు. సింగిడి అంటే వర్షం పడుతున్నప్పుడు సూర్యుడికి వ్యతిరేక దిశలో కాంతి వక్రీభవనంతో ఆకాశంలో ఏర్పడే హరివిల్లు. దానికి సింగిడి తప్ప మా తెలంగాణ పల్లె ప్రజలకు వేరే పేరు లేదు. ఇక వరదగూడును వరదగూడు అని మాత్రమే పిలుస్తారు. కానీ వరదగూడును సింగిడి అని పిలవరు. ఇవి తెలంగాణ పల్లె ప్రజల పదాలు. పుస్తకాలు, నిఘంటువుల పదాలు కావు.
-చెమన్, ఆదిలాబాద్
* * *
సింగిడి, ఇంద్రధనస్సు ఒక్కటి కావు (Vividha, 4 Aug, 2008)
ఇటీవల ఏర్పడిన తెలంగాణా రచయితల సంఘానికి ‘సింగిడి’ అనే పేరు పెట్టడం తెలుగు భాషాభిమానులందరూ ఆనందించాల్సిన విష యం. కాల గర్భంలో కలిసిపోతున్న అచ్చతెలుగు గ్రామీణ మాటలు మళ్లీ వెలుగు చూడటం మంచి పరిణామం. ఇంకా తెలంగాణాలో ఈ సింగిడి అనే పదం వాడుతున్నారంటే వారిని అభినందించి తీరాల్సిందే. అయితే.. సింగిడి, ఇంద్రధనస్సు ఒక్కటి కావు. రెండూ వేరు వేరు మాటలు. సింగిడికి ఇంధ్రధనస్సుకు సంబంధం లేదు. ఇంద్రధనస్సు సూర్యాస్తమయం లోపు పగలు మాత్రమే కనిపిస్తుంది. సింగిడి రాత్రిళ్లు వెన్నెల రోజుల్లో కనబడుతుంది.
ఇది పౌర్ణమికి రెండు రోజుల ముందు పౌర్ణమి తర్వాత రెండు రోజులు సుమారుగా ఐదారు రోజులు మాత్రమే కనిపిస్తుంటుంది. సింగిడికి వరద గూడు అనే మరో పేరు కూడా కలదు. పూర్ణ చందమామకు అతి దగ్గరగా ఓ అందమైన వలయం ఏర్పడితే వానలు ఆలస్యంగా పడతాయని, చందమామకు బాగా దూరంగా వలయం ఏర్పడితే తొందరలోనే వర్షాలు పడతాయని జనపదుల నమ్మకం. ఇది ముదురు బూడిద రంగులో ఉంటుంది. చందమామ చుట్టూ సింగిడి వేసిన తర్వాత సుమారు రెండు మూడు గంటలు ఉంటుంది.
రాత్రిళ్లు వెన్నెల రోజుల్లో ఆరుబయట నిద్రించే వారికి వెన్నెల అందాలు ఆహ్లాదించేవారికి సింగిడి అందాలు బాగా అనుభవం. సింగిడి వేసిన రాత్రి ఆకాశం అత్యంత ప్రకాశంగా నిర్మలంగా ఉన్నట్లు కనిపిస్తుంది. నిజానికి రంగుల ఇంద్రధనస్సు కంటే సింగిడి చాలా అందమైనది. ఇంద్రధనస్సు వర్షం పడుతున్నప్పుడు సూర్యకిరణాలు వర్షం నుంచి చొచ్చుకొని బయటకు వెళ్లడంలో కాంతి వక్రీభవనం చెంది సూర్యుడికి వ్యతిరేక దిశలో ఏర్పడుతుంది. దీన్ని హరివిల్లు, రెయిన్‌బో అని కూడా పిలవడం మనకు అలవాటు.
ఇది తుంపులు తుంపులుగా కూడా ఏర్పడుతూ ఉంటుంది. ఒకేసారి రెండు మూడు రెయిన్‌బోలు కూడా ఏర్పడుతుంటాయి. ఎంత గొప్ప ఇంద్రధనస్సైనా ఇరవై నిమిషాలు లేదా అర్థగంట లోపు మాత్రమే ఉంటుంది. ఆకాశంలో అందమైన రంగుల గొడుగుగా పల్లెకారులు భావిస్తే, రెయిన్‌బో అని నాగరికులు మురిసిపోతుంటారు. విశ్వమంతటా ఇంద్రధనస్సును మానవులు తాము ఊహించుకునే కలల పందిరిగా, ఆశల హరివిల్లుగా పోల్చుకోవడం రీతి. ‘సింగిడి’ -మంచి పేరు. తెలంగాణా రచయితల సంఘానికి ఈ పేరు పెట్టడం ఆహ్వానించదగినదే. తెలంగాణా రచయితలు సింగిడిని అత్యంత ఉన్నతంగా ముందుకు తీసుకుపోతారని ఆశిస్తున్నాను.
- అనంతోజు దేవీ ప్రసాదరావు
mrananthoju@gmail.com
* * *






ఆగస్టు 27th, 2008 at 4:27 am
తెలంగాణపై తేల్చాలి: సింగిడి
హైదరాబాద్, ఆగస్టు 27 (ఆన్‌లైన్): తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర డిమాండ్‌పై నాన్చుడు ధోరణి కాకుండా స్పష్టమైన వైఖరి ప్రటించాలని ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు చిరంజీవిని తెలంగాణ రచయితల సంఘం (సింగిడి) డిమాండ్ చేసింది. ‘తెలంగాణకు మేం వ్యతిరేకం కాదన్న టీడీపీ వైఖరికి, శాస్త్రీయ అధ్యయనం జరగాలన్న చిరంజీవి ప్రకటనకు ఏమాత్రం తేడా లేదు. మాకు చిరునవ్వుల ఆంధ్రప్రదేశ్ అవసరం లేదు. ఆత్మగౌరవ తెలంగాణ కావలి. స్వీయపాలన కావాలి” అని సింగిడి తరఫున కన్వీనర్లు నారాయణ రెడ్డి, ఏలేశ్వరం నాగభూషాణాచార్య, జాజుల గౌరి, అన్వర్, హరనాథ్, సూర్యనాయక్ తదితరులు హెచ్చరించారు.
చిరంజీవి ప్రకటించిన సామాజిక న్యాయ సిద్ధాంతం ప్రత్యేక తెలంగాణలో మాత్రమే అమలవుతుందని తాము నమ్ముతున్నామన్నారు. “గతంలో అసెంబ్లీలో తెలంగాణ పదం ఉచ్చరించరాదన్న టీడీపీ పూడ్చిపెట్టుకుపోయింది. తెలంగాణకు అనుకూలమే అంటూ కాంగ్రెస్ ఎన్నికల ఏరు దాటిన తర్వాత తెప్పతగలేసింది. ఇప్పుడు మీరు తెలంగాణ జనాన్ని మభ్యపెట్టి పబ్బం గడుపుకోవాలని చూస్తే కవులు, రచయితలు, కళాకారులు చూస్తు వూరుకోరు” అని ప్రజారాజ్యం పార్టీని హెచ్చరించారు.
అక్టోబర్ 20th, 2008 at 4:25 pm
ఈ నడుమ ‘వివిధ’లో సింగిడి మీద కొంత చర్చ జరిగినట్లుంది. తెలుగు దిన పత్రికలు అందుబాటులో లేక ఆ చర్చను చదువలేకపోయినాను. అయినా ఇంద్రధనుస్సు పైనా నాకు తెలిసిన మందలను చెప్పాలనుకొంటున్నాను.
‘కొర్రు’ అనే మాట ఒక్క కడప జిల్లాకు మటుకే చెందినది కాదు. రాయలసీమలోని చాలాచోట్ల ఇదే వాడుక మాట. నెల్లూరు జిల్లాలో కూడా ఈ మాట వాడుకలో ఉంది. అయితే కొన్నిచోట్ల ‘కొర్రు’ ‘కర్రు’ అయింది. కొర్రు ఒడ్డింది, కొర్రు వేసింది అని రెండు రకాలుగా అంటుంటారు. ఆంధ్రప్రదేశంలో జరుగుతున్న చర్చలు ముక్కెంగా తెలుగు మాటలపైనా యాసలపైనా జరుగుతున్నవి- ఆంధ్రప్రదేశపు గిరి లోపలనే జరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశమనేది రాజకీయపు గిరి. మంచికి జరిగిందో చెడుకు జరిగిందో అనే చర్చను పక్కన బెడితే ఇప్పటి ఆంధ్రదేశం పూర్తి తెలుగునేల కానేకాదు.
ఆ గీతకు వెలుపట కోట్ల మంది తెలుగువాళ్లు వందల వేల ఏండ్లనుంచి బతుకుతున్నారు. ఒక అంచ నా ప్రకారం ప్రతి ఇద్దరి తెలుగువాళ్లలో ఒకరు ఆంధ్రదేశానికి బయటనే ఉన్నారు. వాళ్ల నోళ్లలో కూడా అమ్మ బాసలో కమ్మటి తెలుగు మాట పాటలెన్నో ఉన్నాయి. ముందే చెప్పుకొన్నాను కదా, మన వెతుకులాటంతా ఆంధ్రదేశపు ఎల్లలకే మిగిలిపోయింది. ఇంద్ర ధనుస్సుకు తమిళనాట ఉన్న మూడుకోట్ల మంది తెలుగువారిలో కొన్ని తెలుగు మాటలు వాడుకలో ఉన్నాయి. ఇంద్రధనస్సు, హరివిల్లు అనే మాటలు ఇక్కడ తెలియవు. ఇప్పటి తమిళనాడు పాతకాలంలో నాలుగు మండలాలుగా ఉండేవి.
కొంగు, తొండ, చోళ, పాండ్య మండలాలు అవి. ఈ నాలుగు మండలాల్లోనూ నాలుగురకాల తమిళ యాసలుంటాయి, అట్లాగే నాలుగురకాల తెలుగు యాసలూ ఉంటాయి. అయితే తెలుగులో ఉన్నన్ని రకరకాలమాటలు తమిళంలో లేవు. ఈ నాలుగు మండలాల్లోనూ హరివిల్లును తమిళంలో ‘వానవిల్’ అనే అంటా రు. తెలుగులో మటుకు నాలుగు మండలాల్లానూ నాలుగు రకాల మాటలున్నాయి. కొంగు మండలం (పాత కోయంబత్తూరు, సేలం జిల్లాలు. ఇప్పుడివే కొత్తగా ఆరు జిల్లాలయినాయి) లో కాముని విల్లు అంటారు. దీనినే పలికే తీరు కూడా మారుతూ ఉంటుంది.
దక్కణాన కాముని విల్లు అనే పలుకు వక్కణానికి ఎగబడే కొందీ కాముని బిల్లు, కామన బిల్లుగా మారుతుంది. తొండ మండలంలో ‘వన్నెలగర్రు’ అంటారు. తొండ మండలానికి ఆనుకొని చిత్తూరు, నెల్లూరు జిల్లాలుంటాయి. అక్కడి కొర్రుకూ ఈ వన్నెల గుర్రుకు పొత్తున్నట్లుంది. వన్నెల కర్రు, వన్నెలగొర్రు అని కూడా పలుకుతుంటారు తొండమండలపు తెలుగువారు. చోళ మండల మంటే పాత తంజావూరు, తిరుచిరాపల్లి జిల్లాలు. ఇవిప్పుడు ఎనిమిది జిల్లాలు. తమిళనాట తెలుగు బాగా దెబ్బతినింది ఈ చోళ మండలంలోనే. మరీ కొన ఊపిరితో కొట్టుకొంటున్నది. చోళ మండలంలో హరివిల్లును ‘మింటిముడి’ అంటారు.
మిగిలింది పాండ్యమండలం. పాత మదుర, రామనాదపురం, తిన్నెవెల్లి జిల్లాలు. ఇక్కడి చొక్కపు తెలుగుమాట సింగార చెంగు. సింగార చింగు అని కూడా పలుకుతుంటారు. ఇంత చెప్పుకొన్నా ఈ మాటలన్నీ విరవిరా వాయిదప్పి చెవి మరుగయిపోతున్నాయి. అన్ని చోట్లా, అన్ని నోళ్లా వానవిల్లు వచ్చి కూచునేసింది. కొందరు కాదనుకొన్నా వాదాని కొచ్చినా వానవిల్లు మటుకు తెలుగుమాట కాకుండా పోతుందా? తమిళం కన్నా తెలుగుకెంత దవ్వునున్నదో చూడండీమాట. కోరిక, ఓపిక ఉండాలే కానీ తవ్వితే తెన్నాట అప్పటపు తెలుగు మాటలను మూటలు కట్టి బాస బొక్కసాన్ని నింపుకోవచ్చు. మప్పిదాలతో-
(Courtesy: AndhraJyothy, Vividha, 20 October 2008)
నవంబర్ 14th, 2008 at 9:36 am
కొర్రు ఒడ్డింది
ఆంధ్ర దేశపు రాజకీయ ఎల్లలు తెలుగు భాషకు గిరిగీయలేవని సం.వె.రమేష్ తన చిన్న వ్యాసంతో చక్కగా నిరూపించినాడు. ఆకాశంలో కన్పించే ఇంధ్రధనుస్సును కొర్రు ఒడ్డింది అని అనంతపురం పల్లెల్లో కూడా అంటారు.చూడగా;రాయ లసీమ పల్లె సమాజం మొత్తంలో ఈ వ్యక్తీకరణ ఇంకా కొనసాగుతూనే ఉంది. కొర్రు అనే పదానికి ఉన్న అసలైన అర్థమేమి?కొర్రు అనే పదాన్ని ఏ అర్థంలో ఉపయోగిస్తున్నారు? ఆంధ్ర శబ్ద చింతామణి కర్రుకు ఇచ్చిన అర్థం నాగలి మేకు. ఇది ఇప్పటికీ వాడుకలో ఉంది. శబ్ద రత్నాకరం కొర్రు (కొఱ్ఱు)కు ఇచ్చిన అర్థం మేకు, శూలము. కాబట్టి కర్రు, కొర్రు రెండింటినీ రూపవ్యత్యాసం పొందిన సమానార్థక పదాలుగా స్వీకరింపవచ్చు. కొర్రు మాదిరే కొర్రి అని ఇంకొక పదం జనం వాడుకలో ఉంది. మేకు వంటి వస్తువు అడ్డువచ్చి బట్టలు చినిగిపోతే కొర్రి పట్టుకుంది అనే అర్థంలో ఈ పదాన్ని వాడుతారు. ఇంకొక అర్థంలో కూడా సంకేతంగా వాడతారు.
ఒకడు ఒక పనిని జరగకుండా అడ్డుపుల్ల వేసిన సందర్భంలో వాడు కొర్రేసినాడు అని వ్యక్తీకరిస్తారు. కర్రు, కొర్రు, కొర్రి పదాలను సందర్భాన్నిబట్టి వస్త్వార్థంలోనే కాకుండా క్రియార్థంలో పరిశీలించడానికి కూడా ఇక్కడ అవకాశం ఉంది. ఆకాశంలో హరివిల్లు కన్పిస్తే అది వాన రావడానికి అడ్డంకిగా చెప్పుకుంటారు ప్రజలు. ఈ అడ్డుపడే అర్థంలోనే ఇంద్రచాపాన్ని కొర్రు ఒడ్డింది, కొర్రు వేసింది, కొర్రేసింది అని మాట్లాడుకుంటారు. కర్రు, కొర్రు పదాలలో పూర్వరూపం ఏదై ఉండొచ్చు అనేది మరొక అంశం. ఇంద్ర చాపాలూ, ఇంద్ర ధనస్సులూ, హరివిల్లులూ వంటి పురాణాత్మక సంస్కృత పదాలను తెలుగు జాతి మీద రుద్దిన వారు ఎవ్వరు? కొర్రు ఒడ్డింది లాంటి జీవితాత్మక తెలుగు భాషా పదాలను ఉప్పు పాతర వేసింది ఎవ్వరు? వృత్తుల నుంచీ, పనిముట్ల నుంచీ, ప్రాంతీయ వాతావరణం నుంచీ, మొత్తం ఒక పని సంస్కృతీ నుంచీ, కవితాత్మక దృశ్య రూపం పొందుతుంది ప్రజల భాష! ఈ ప్రజల భాషను ప్రపంచీకరణను అడ్డుకునే ఆయుధాలలో ఒకటిగా మనం గుర్తించాల్సిన అవసరం ఉంది. ఈ క్రమంలోనే ‘సింగిడి’ పదానికి తెర లేవనెత్తిన తెలంగాణ రచయితలకు జేజేలు చెప్పకుండా ఉండలేను.
(Courtesy: AndhraJyothy, Vividha, 10 November 2008)