నేడు తెలంగాణ విమోచన దినం : నిజాం మెడలు వంచిన తెలంగాణ
సెప్టెంబర్ 17th, 2008 by డిస్కవర్ తెలంగాణ
హైదరాబాద్, సెప్టెంబర్ 17, 2008 : భారత దేశానికి స్వాతంత్య్రం వచ్చే నాటికి స్వయం ప్రతిపత్తి కలిగి ఉన్న రాజ్యం హైదరాబాద్ సంస్థానం. నిజాం రాజుల పాలన కింద ఉన్న ఆ రాజ్యాన్ని నాటి భారత పాలకులు సైనిక చర్య ద్వారా 1948లో ఇండియన్ యూనియన్‌లో విలీనం చేసుకున్నారు. సెప్టెంబర్ 17న ఈ సంఘటన జరిగింది. ఐదు రోజులు… వంద గంటల్లో సైనిక చర్య ముగిసింది. నిజాం రాజు లొంగిపోయాడు. ఇండియన్ యూనియన్ చేతుల్లో అధికారం పెట్టాడు. పాలకులు మారారు. తదనంతరం హైదరాబాద్ రాష్ట్రంలో అనేక పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఈ ప్రాంతం తరువాత మద్రాసు రాష్ట్రంలో ఉండి ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్‌తో కలిసి కొత్త రూపు సంతరించుకుంది. కుతుబ్‌షాహీలు రూపుదిద్దిన ఈ ప్రాంతం 200 ఏళ్లకు పైగా నిజాం రాజుల పాలనలో ఉండి ఇప్పుడు అస్తిత్వం కోసం ఆరాటపడుతోంది. మళ్లీ స్వయం ప్రతిపత్తి కోసం పోరాడుతోంది.
అలనాటి జీవ వైభవం కోసం తండ్లాడుతోంది. ఇలాంటి నేపథ్యంలో స్మరించుకుంటున్న సెప్టెంబర్ 17 నాటి జ్ఞాపకాలు, చారిత్రక ఘట్టాలకు ఇప్పుడు ఎంతో ప్రాధాన్యం ఏర్పడింది. దీని చుట్టూ ఎంతో వివాదం కూడా చెలరేగుతోంది. హైదరాబాద్ రాజ్యం ఇండియన్ యూనియన్‌లో విలీనం కావడాన్ని కొందరు విమోచనా దినోత్సవంగా పరిగణిస్తుండగా, మరికొందరు దీన్ని విలీనంగా చూస్తున్నారు. ఇంకొందరు ఇదో విద్రోహమని, ఆక్రమణ అని అంటున్నారు. భారత దేశానికి స్వాతంత్య్ర వచ్చిన వేళ స్వతంత్ర రాజ్యంగా ప్రకటించుకుని, అంతర్జాతీయ సంస్థల గుర్తింపు పొందిన హైదరాబాద్ రాష్ట్రం నాడు ఇండియన్ యూనియన్ సేనలతో పోరాడి ఓడిన ఘట్టాలు, నాటి సంఘటనలు, చారిత్రక పరిస్థితులు, పరిణామాలు, అధికార బదలాయింపు నేపథ్యాలు… దాని పర్యవసానాలు ఇపుడు సుదీర్ఘమైన, లోతైన చర్చలకు తెరలేపింది.
ఈ నేపథ్యంలో నాడు హైదరాబాద్ నగరంలో చోటుచేసుకున్న సన్నివేశాలు, సంఘటనలకు ప్రత్యక్ష సాక్షులైన వారి అభిప్రాయాలు, నాటి ఘటనలపై నిపుణుల అభిప్రాయాలు ఎలా ఉన్నాయో చూద్దాం… ఇండియన్ యూనియన్ హైదరాబాద్ రాష్ట్రంపై పోలీసు చర్యకు పూనుకోవాలని నిర్ణయించగానే నిజాం రాజు మీర్ ఉస్మాన్ అలీఖాన్ దాన్ని ఎదుర్కోవాలని నిశ్చయించుకున్నాడు.
22 వేల మంది సొంత సైన్యంతోపాటు ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చి పఠాన్లు, రొమ్లాలతో కూడిన సైన్యం ఉండేది. లక్ష మంది రజాకార్ మిలిటెంట్లు ఉండేవాళ్లు. వీళ్ల సహాయంతో అత్యంత ఆధునిక ఆయుధాలు కలిగి ఉన్న భారత సైన్యంతో తలపడవచ్చని భావించాడు. ప్రధాని లాయాక్ అలీ కూడా నిజాంకు భరోసా ఇచ్చాడు. మరోపక్క నిజాం రాజును తన రాజ్యాన్ని ఇండియన్ యూనియన్‌లో విలీనం చేయమని పదే పదే చేసిన విజ్ఞప్తులు విఫలం కావడంతో ప్రధాని నెహ్రూ సెప్టెంబర్ 12 కేంద్ర మంత్రి మండలి సమావేశం ఏర్పాటు చేసి పోలీసు చర్యకు దిగాలని తలపోసింది. మరుసటి రోజు ప్రారంభమైన చర్య ఐదు రోజుల్లోనే విజయవంతమైంది.
సెప్టెంబర్ 12…
హైదరాబాద్ రాష్ట్రం విషయంలో ఏం చేయాలనే నిర్ణయాన్ని తీసుకునేందుకు సెప్టెంబర్ 12న ఢిల్లీలో కేంద్ర మంత్రి మండలి సమావేశమైంది. ప్రధానమంత్రి జవహర్‌లాల్ నెహ్రూతో పాటు హోం మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్, రక్షణ మంత్రి బల్‌దేవ్‌సింగ్, గోపాలస్వామి అయ్యంగార్, వైమానిక దళ చీఫ్ కమాండెంట్ జనరల్ బుచ్చర్, ఎయిర్ మార్షల్ సర్ థామస్ ఎల్మ్‌హిర్ట్స్ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. హైదరాబాద్‌పై పోలీసు చర్య తీసుకోవాలనే నిర్ణయాన్ని జనరల్ బుచ్చర్ అడ్డుకున్నారు. చర్యకే సిద్ధమయ్యేట్లయితే రాజీనామా చేస్తానని హెచ్చరించారు. ఆయనకేం చెప్పాలో తోచక నెహ్రూ మౌనంగా ఉండగా సర్దార్ పటేల్ లేచి.. ‘బుచ్చర్, మీరు రాజీనామా చేసుకోవచ్చు. పోలీసు చర్య మాత్రం ఆగదు.. రేపే కార్యాచరణకు పూనుకుంటున్నాం’ అని ప్రకటించారు. దాంతో హైదరాబాద్ రాష్ట్ర చరిత్ర కొత్త మలుపు తిరిగింది…
సెప్టెంబర్ 13…
ఉదయం 5 గంటలకు ఐదు మార్గాల గుండా పోలీసు చర్య ప్రారంభమైంది. దక్షిణాదిన ఉన్న దుర్భేద్యమైన నాల్దర్గ్ కోట మొదటి గురి. షోలాపూర్-సికింద్రాబాద్ మార్గంలో ఇది ఉంది. లెఫ్టినెంట్ కల్నల్ రామ్ సింగ్ నేతృత్వంలోని మరో పటాలం హైదరాబాద్‌కు 66 కిలోమీటర్ల దూరంలో ఒక పటాలం, విజయవాడవైపు మరో పటాలం, గుంతకల్ వైపు ఇంకో పటాలం… ఇలా హైదరాబాద్ రాష్ట్రాన్ని అన్ని వైపులా పకడ్బందీగా చుట్టుముట్టే వ్యూహాన్ని రూపొందించారు.
సెప్టెంబర్ 14…
సైనిక చర్యకు నేతృత్వం వహిస్తున్న మేజర్ జనరల్ చౌదరి తూర్పున ఉన్న రాజసుర్‌కు తన సైన్యాన్ని చేర్చే వ్యూహం పన్నారు. కొండల నడుమ నుంచి సాగే ఈ ప్రయాణం దుర్భేద్యంగా ఉండడంతో ఆయన వాయుసేన సహకారం తీసుకున్నారు. ట్యాంకులు రంగ ప్రవేశం చేశాయి. ఇదే సమయంలో మేజర్ జనరల్ డీఎస్ బ్రార్ సైన్యం ఔరంగాబాద్ వైపు నుంచి చొచ్చుకు రావడం మొదలెట్టింది. ఇక్కడి ప్రతిఘటనలో నిజాం సైన్యం పోరాడి చేతులెత్తేసింది.
సెప్టెంబర్ 15…
ఔరంగాబాద్‌ను స్వాధీనంలోకి తీసుకుని లాతూర్ వైపు పయనం సాగించారు. మరోవైపు సూర్యపేట మీద వైమానిక దళం దాడులు చేసింది. నిజాం సైన్యం మూసీ నదిపై నిర్మించిన వంతెనను పాక్షికంగా ధ్వంసం చేసి భారత సైనాన్ని నిలువరించాలని ప్రయత్నించింది. మరోపక్క జహీరాబాద్, బీదర్‌ల వైపు నుంచి భారత సైన్యం దాడి కొనసాగించింది.
సెప్టెంబర్ 16…
రామ్‌సింగ్ నేతృత్వంలోని యూనియన్ సేనలు జహీరాబాద్‌లోకి ప్రవేశించాయి. షోలాపూర్-హైదరాబాద్ రహదారిలోని కీలకమైన ఒక ప్రాంతం భారత సైన్యం వశమైంది. రాత్రి వరకు జహీరాబాద్ దాటి హైదరాబాద్ వైపుగా 15 కిలోమీటర్లు ముందుకు సాగింది.
సెప్టెంబర్ 17…
వేకువ జామునే భారత సైన్యం బీదర్‌లో ప్రవేశించింది. మరోవైపు బీబీనగర్ రైల్వే స్టేషన్‌కు సమీపంలో బాంబుల వర్షం మొదలైంది. ఈ విషయాన్నే ప్రధాని లాయక్ అలీకి స్టేషన్ మాస్టర్ ఫోన్‌లో తెలిపాడు. కొద్దిసేపటికే నైజాం ఆర్మీ కమాండర్ ఇద్రిస్ కూడా తన అశక్తతను వ్యక్తం చేశాడు. నిజాం రాజుకు పరిస్థితి వివరించిన లాయక్ అలీ ఉదయం 8 గంటల సమయంలో నిజాం రాజుని కలిశాడు. అప్పటికే పరిస్థితి తెలుసుకున్న నిజాం ఏం చేద్దామని లాయక్ అలీని ప్రశ్నించాడు. “భారత సైన్యం రాజధాని వైపు ఇంకా చొచ్చుకు వస్తే రక్తపాతం తప్పదు. అమాయకులైన ప్రజలు మరణిస్తారు” అంటూ లాయక్ తన మంత్రి మండలిని సమావేశపరిచాడు. మండలి రాజీనామా సమర్పించి తుది నిర్ణయాన్ని నిజాం చేతిలో పెట్టింది. ఈ లోపునే నిజాం భాతర ప్రభుత్వ ప్రతినిధి కె.ఎం.మున్షీతో సంప్రదింపులు మొదలెట్టాడు.
మిశ్రమ పరిపాలనపై ప్రతిపాదనలు ముందుంచాడు. ఈ లోపున రేడియోలో ప్రధాని లాయక్ అలీ, కాశీం రజ్వీలు ప్రజలను సంయమనంగా ఉండాలని కోరుతూ సందేశమిచ్చారు. సాయంత్రం నిజాం రాజు కూడా తన సైన్యాన్ని వెనక్కు పిలుస్తూ ఆదేశాలు జారీ చేశాడు. ఈ రకంగా తన ఓటమిని అంగీకరించాడు. వెంటనే మున్షీ కూడా రేడియోలో మాట్లాడాడు. కాగా ఈ తరువాత బొల్లారం రెసిడెన్సీకి వచ్చిన మేజర్ జనరల్ చౌదరి నిజాం మిశ్రమ పరిపాలన ప్రతిపాదనలను తోసిపుచ్చాడు. మిలటరీ పాలనను ప్రకటించాడు. ఈ నిర్ణయం నిజాంకు పెద్ద షాక్! “మున్షీతో కుదిరిన ఒప్పందానికి ఇది విరుద్ధం” అంటూ నిజాం రాజు లాయక్ అలీ వద్ద వాపోయాడు. అయినా అంతా అయిపోయింది. అధికారం చేతులు మారింది. ఇక రాజైనా, ప్రజలు అయినా ప్రేక్షక పాత్రే వహించాల్సి వచ్చింది.
ఆత్మరక్షణను ఏర్పాటు చేసుకున్నాం : కవి నిఖిలేశ్వర్
నిజాం నిరంకుశత్వానికి, రజాకార్లకు వ్యతిరేకంగా కమ్యూనిస్టుల నాయకత్వాన సాయుధ పోరాటం జోరుగా సాగుతున్న రోజులవి. మరో వైపు రజాకార్లు గ్రామాలను లూటీ చేస్తున్నారు. అప్పుడే నిజాంతో చర్చించడానికి భారత ఏజెంట్‌గా కె.ఎం.మున్షి హైదరాబాద్‌కు వచ్చారు. కానీ ఆయనను లేక్‌వ్యూ గెస్ట్‌హౌజ్‌లో బంధించారు. సెప్టెంబర్ 13న మరట్వాడ, కర్నాటక, తెలంగాణ ప్రాంతాల నుంచి భారత సైన్యం నిజాం రాజ్యాన్ని ముట్టడించింది. సెప్టెంబర్ 16న ఏమి జరగనుందోనని ప్రజలు ఉత్కంఠతతో కాలం గడుపుతున్నారు. 16న రజాకార్లు కొడతారనే భయంతో అన్ని ప్రాంతాలలో ఆత్మరక్షణకు ఏర్పాటు చేసుకున్నాం. చివరకు నిజాం లొంగిపోయాడని తెలుసుకున్న ప్రజలు ఆనందంగా ఉత్సవాలు జరుపుకొన్నారు. కోటి సుల్తాన్ బజార్‌లో ఉన్న నేను ఆనందోత్సవాలను చూశాను. నగర వ్యాప్తంగా జాతీయ జెండాలు ఎగిశాయి.
ఇది దేశానికే విమోచన దినోత్సవం : దాశరథి రంగాచార్య
సెప్టెంబరు 17న జరుపుకొనేది తెలంగాణ విమోచనోద్యమ దినం కాదు… హైదరాబాద్ రాజ్య విమోచనోత్సవం ఇది. మరట్వాడ, కర్నాటక ప్రాంతాలను విలీనం చేసుకున్న రాష్ట్రాలు విమోచన దినోత్సవాలను అధికారికంగా నిర్వహిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎందుకో భయపడుతోంది. నిజం చెప్పాలంటే ఇది హైదరాబాద్ విమోచనం కూడా కాదు… భారత విమోచనం అని చెప్పవచ్చు. హైదరాబాద్ సంస్థానం విమోచనం అంటే సమస్త భారతదేశానికి ఒకరకంగా స్వాతంత్య్రం వచ్చినట్టయ్యింది. అందుకే యావత్ భారతదేశంలో సెప్టెంబర్ 17న ఉత్సవం జరుపుకోవాలి. తెలంగాణ పోరాటం భూమి కోసం, భుక్తి కోసం జరిగిన పోరాటం. ప్రపంచ చరిత్రలోనే ప్రాధాన్యం ఉన్న పోరాటం ఇది… కమ్యూనిస్టు పోరాటాల్లో ఈ పోరాటం చెప్పుకోదగ్గది. హైదరాబాద్ రాజ్యం నిజంగా స్వతంత్రంగా ఉండి ఉంటే భారతదేశానికి పక్కలో బల్లెం అయి ఉండేది. హైదరాబాద్‌పై జరిగిన పోలీసు చర్య కమ్యూనిస్టులపై జరిగిన చర్యగా నేను భావిస్తున్నాను. ఆనాడు కమ్యూనిస్టులు బలపడి ఉంటే కాంగ్రెస్‌కు ప్రమాదంగా మారేది. ప్రజల సహకారం లేకపోతే నిజాం నవాబు లొంగిపోయేవాడు కాదు. పోలీసు చర్య కంటే ప్రజా బలమే ప్రధానమైంది. అయితే పోలీసు చర్య కింద ప్రజాబలం నలిగిపోయింది.
ఉత్సవాలు నిర్వహించకపోవడం కుట్ర
హైదరాబాద్ రాష్ట్రం విముక్తి అయిన 1948 సంవత్సరం సెప్టెంబర్ 17న నేను అజ్ఞాత వాసంలో ఉండి పోరాడుతున్నాను. భారత సైన్యం రాకతో మాలో ఆనందం వెల్లివిరిసింది. హైదరాబాద్ భారత్‌లో విలీనమైన రోజున ప్రజలు వీధుల్లోకి వచ్చి జాతీయ జెండాలు ఎగుర వేశారు. సెప్టెంబర్ 17న హైదరాబాద్ విముక్తి అయింది. నేటికీ మరట్వాడ, కర్నాటకలలో నిజాం విముక్తి ఉత్సవాలను ప్రభుత్వాలు అధికారికంగా నిర్వహిస్తున్నాయి. కానీ ఆంధ్రప్రదేశ్‌లో విముక్తి ఉత్సవాలు నిర్వహించకపోవడం ఆంధ్ర వలస పాలకుల కుట్ర. ప్రభుత్వం అధికారికంగా తెలంగాణ విముక్తి ఉత్సవాలను నిర్వహించాలి. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం సెప్టెంబర్ 17 నాటి విముక్తి ఉద్యమ స్పూర్తితో ఇప్పుడు ఉద్యమించాలి.
- స్వాతంత్య్ర సమరయోధులు కొండా లక్ష్మణ్ బాపూజీ
అది ‘విలీన దినం’ : ప్రొఫెసర్ కోదండరామ్
సెప్టెంబర్ 17 తెలంగాణ చరిత్రలో కీలకమైన దినం. దానికి ఉండే ప్రత్యేకతను గుర్తించి ఉత్సవాలు జరుపుకోవడం వల్ల తెలంగాణ చరిత్రను గుర్తుకు తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. మరిచిపోకుండా చర్చించుకుంటాం. దీనిని విముక్తి ఉత్సవంగానో, విద్రోహ దినంగానో కాకుండా ‘విలీనం’ జరిగిన దినంగా గుర్తించాలి. తెలంగాణ ప్రజలు చేసిన పోరాటాల ఫలితంగా జరిగిన పరిణామమే సెప్టెంబర్ 17న జరిగిన విలీనం. భారత దేశంలో అంతర్భాగంగా ప్రజలు ఈ విలీనాన్ని ఆహ్వానించారు. ఏ కోరికల సాధన కోసం సైన్యం ప్రవేశించిందో ఆ ఆకాంక్షలను ప్రభుత్వం గౌరవించలేదు. గౌరవించకపోవడం వల్లనే ఆశించిన ఫలితాలు రాలేదన్న అభిప్రాయం ఏర్పడింది. దీనిపై చర్చ జరగాలి. చర్చ జరగాలంటే ఉత్సవాలు జరగాల్సిందే.
విద్రోహ దినంగానే చూస్తున్నా : సంగిశెట్టి శ్రీనివాస్
1948 సెప్టెంబర్ 17న తెలంగాణపై భారత సైన్యం దాడి చేసింది. అప్పటికే సాయుధ పోరాటం ద్వారా ప్రజలు భూస్వాముల నుంచి స్వాధీనం చేసుకున్న భూమిని తిరిగి దేశ్‌ముఖ్‌లకు కట్టబెట్టేందుకు భారత సైన్యం ప్రయత్నించింది. నిజాం రాజ్యం స్వాధీన ఫలాలను భూస్వాములకు కట్టబెట్టింది. దీనిని తెలంగాణ విద్రోహ చర్యగానే చూస్తాం. పోలీస్ చర్య తరువాత పరిపాలన సజావుగా సాగాలనే పేరుతో మద్రాసు ఉమ్మడి రాష్ట్రంలోని 3000 మంది స్థానికేతరులను ఇక్కడి ఉన్నత స్థానాల్లో నియమించారు. తెలంగాణ ప్రజలపై కనీస నమ్మకం వారికి లేదు. ఆనాడు మా ఉద్యోగాలు మాకే కావాలని ఉద్యమించిన తెలంగాణ యువకులను ఏడుగురిని కాల్చి చంపారు. నేటికీ తెలంగాణ ప్రాంతాన్ని వలస పాలకులు దోచుకుంటున్నారు. ఈ పరిణామాలన్నింటికీ కారణమైన సెప్టెంబర్ 17ను తెలంగాణ విద్రోహ దినంగా పాటిస్తున్నా.
వరంగల్ జైలులో ఉన్నాను
పోలీస్ యాక్షన్ జరిగిన రోజు నేను వరంగల్ జైలులో ఉన్నాను. మొదటి నుంచి నిర్మాణ కార్యక్రమాలపై దృష్టి ఉన్న కారణంగా వరంగల్‌కు రెండు మూడు మైళ్ల దూరంలో ఉన్న స్తంభంపల్లి సర్వోదయ ఆశ్రమం నడిపాం. అందులో ఖాదీ, నూనె, కాగితం, ఇత్యాది ఉత్పత్తి చేయసాగాం. దానివల్ల చుట్టుపక్కల ప్రజల్లో కలిగిన చైతన్యాన్ని సహించలేక జాతీయ విద్రోహ శక్తులు ఆశ్రమాన్ని తగలబెట్టారు. ఈ వార్త మాకు అందింది. ఇది ఆందోళన కార్యక్రమాలకు మరింత దోహదపడుతుందని భావించాం. అదేరోజు కాలోజి నారాయణరావును, నన్ను, డాక్టర్ ఉపేందర్‌రావు తదితర ప్రముఖులను అంతమొందించాలని రజాకార్లు భావించినట్లు తెలిసింది. భరత్‌పూర్ నుంచి వచ్చిన ముస్లిం కాందిశీకులు ఈ వార్తను మాకు అందజేశారు. వారు ముస్లింలు అయినా మా ప్రాణాలకు అండగా నిలిచారు. టంగుటూరి ప్రకాశం పంతులు పరిటాలలో ప్రవేశిస్తున్నారన్న వార్త పత్రికల్లో వచ్చింది. ఆ పత్రికలన్నింటిలో ఈ వార్తను మసిపూసి మాకిచ్చారు. అయినా కూడా నూనె పూసి మసిని తొలగించి వార్తను చదివాం. ఈ వార్తను జైలులో వెయ్యికి పైగా ఉన్న మా సహ స్వాతంత్య్రయోధులకు తెలియబర్చడం జరిగింది. అది కొంత ఊరట కలిగించింది. మాతోటి వారికి పునర్‌జన్మ కలిగంచినట్లైంది.
- స్వాతంత్య్ర సమరయోధులు ఎం.ఎస్.రాజలింగం





