ఊరూరా తెలంగాణ విముక్తి దినం
సెప్టెంబర్ 17th, 2008 by డిస్కవర్ తెలంగాణ
హైదరాబాద్, సెప్టెంబర్ 16(ఆన్‌లైన్): తెలంగాణ విముక్తి దినోత్సవం బుధవారం నాడు తెలంగాణలో ఊరూరా జరుగనుంది. దీనిని గతంలో ఎన్నడూ లేనివిధంగా అన్ని రాజకీయ పార్టీలు జరుపుకోనున్నాయి. తమ తమ పార్టీ కార్యాలయాల్లో జాతీయ పతాకాలు ఎగురవేయనున్నాయి. ఈ ఉత్సవాలను అధికారికంగా నిర్వహించాలంటూ బీజేపీ జైల్ భరో కార్యక్రమం చేపట్టనుంది. సీపీఐ, సీపీఎం పార్టీలు సైతం పలుచోట్ల సభలు, సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించాయి.
సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం 60వ వార్షికోత్సవాన్ని ఆ రెండు పార్టీలు ఉమ్మడిగా నిర్వహించనున్నాయి. ఓట్ల రాజకీయాల కోసం అన్ని పార్టీలు పోటీపడి ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నప్పటికీ, అదే ఓట్లకోసం అధికారంలో ఉన్న పార్టీలు ఈ దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించడానికి సంశయిస్తున్నాయి. సెప్టెంబర్ 17వ తేదీన తెలంగాణ స్వాతంత్య్ర దినోత్సవమని, బుధవారం 61వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు నిర్వహించాలని తెలంగాణ ప్రజలకు టీఆర్‌ఎస్ పిలుపునిచ్చింది.
ఊరూరా జాతీయపతాకాలు ఎగురవేసి స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు నిర్వహించాలని ఆ పార్టీ అధికార ప్రతినిధి ఎస్.మధుసూధనాచారి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు తెలంగాణ భవన్‌లో జాతీయ పతాకాన్ని ఎగురవేసి, అనంతరం సిద్దిపేటలోని తెలంగాణ అమరవీరుల స్మారకస్థూపాన్ని ఆవిష్కరిస్తారు. పలుచోట్ల తెలంగాణ ధూం…ధాం…కార్యక్రమాలు, స్వాతంత్య్ర సమరయోధులకు సన్మానాలు చేస్తారు.
ఎన్టీపీపీ కేంద్ర కార్యాలయంలో స్వాతంత్య్ర పోరాట యోధుడితో జాతీయ పతాకం ఎగురవేసి, ఉత్సవాలు నిర్వహిస్తారు. అదేవిధంగా తల్లి తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు విజయశాంతి నల్లగొండ జిల్లా చిట్యాల మండలం గుండ్రాంపల్లి, వలిగొండ మండలం పులిగిల్ల, వరంగల్ జిల్లా మద్దూరు మండలం బైరాన్‌పల్లి, దేవరుప్పల మండలం కడివెండి గ్రామంలోని స్మారక స్థూపాల వద్ద తెలంగాణ అమరవీరులకు నివాళులర్పిస్తారు.
తెలంగాణ సంఘర్షణ సమితి ఆధ్వర్యంలో నల్లగొండలో భారీ సదస్సు జరగనుంది. మరోవైపున తెలంగాణ అంతటా తెలంగాణ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు నిర్వహించడానికి తెలంగాణ సంఘాలు సన్నద్ధమవుతున్నాయి. తెలంగాణ సంఘాలు తెలంగాణ విమోచన దినోత్సవాల్లో పాల్గొనాలని తెలంగాణ ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మికసంఘాల జేఎస్‌సీ చైర్మన్ టి.ప్రభాకర్ తమ శ్రేణులకు విజ్ఞప్తి చేశారు.
సమరయోధులకు టీడీపీ, పీఆర్‌పీ సన్మానం
బుధవారం తెలంగాణ స్వాతంత్య్ర సమరయోధులు నారాయణరావు పవార్, జగదీష్ ఆర్య, ఎంఎస్ రాజలింగం, శ్రీధర్ దేశ్‌పాండే, నారాయణరావు, పర్సా సత్యనారాయణ, మల్లు స్వరాజ్యం, నంద్యాల శ్రీనివాసరెడ్డి, ప్రియంవద, సీహెచ్ రాజేశ్వరరావు, పిచ్చిరెడ్డిలకు తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబునాయుడు సన్మానం చేయనున్నారు. అలాగే తెలంగాణ ప్రాంత ప్రజలకు మరింత దగ్గరయ్యేందుకు చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ చర్యలు ప్రారంభించింది. 20 మంది తెలంగాణ సాయుధ పోరాట యోధులను సన్మానించబోతున్నారు. తెలంగాణ పది జిల్లాల నుంచి ఇద్దరేసి చొప్పున మొత్తం 20 మందిని బుధవారం నాడు పార్టీ కార్యాలయంలో అధ్యక్షుడు చిరంజీవి సన్మానిస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి.





