Feed on
Posts
Comments

- ఎన్‌. వేణుగోపాల్‌

091708aj02.jpgసెప్టెంబర్‌ 17 న హైదరాబాద్‌ రాజ్య (తెలంగాణ) విమోచన జరిగిందని ఒక కట్టుకథ కొంతకాలంగా ప్రచారంలో ఉంది. తమ మతవిద్వేషాలు రెచ్చగొట్టే కార్యక్రమంలో భాగంగా సంఘ పరివారం , భారతీయ జనతా పార్టీ ఈ కట్టు కథను పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నాయి. ‘మా వైపు లేకపోతే వాళ్లవైపు ఉన్నట్టే’ అని ప్రపంచాన్ని బెదిరించిన జార్జి బుష్‌ లాగ ‘దీన్ని విమోచనం అనకపోతే రజాకార్ల వైపు ఉన్నట్టే’ అని బ్లాక్‌ మెయిల్‌ చేస్తూ వచ్చిన సంఘ పరివారం ఇప్పటికి చాలామందిని లొంగదీసింది. అలా లొంగిపోయిన వారి జాబితా ఇంకా పెరిగిపోతోంది.

మత విద్వేషాలు రెచ్చగొట్టడానికి ఒక భావజాల పక్షం చేస్తున్న ప్రయత్నాలకు ఎవరెవరు ఏ ప్రయోజనాల కొరకు లొంగిపోదలచుకున్నారో వారి వారి ఇష్టం. కాని సెప్టెంబర్‌ 17, 1948 ని ‘హైదరాబాద్‌ విమోచన దినం’ అని అభివర్ణిస్తే చరిత్ర మాత్రం ఫక్కున నవ్వుతుంది. ఏ ఒక్క చారిత్రక కోణం నుంచి చూసినా అది తెలంగాణ విమోచన కాదు. కావడానికి అవకాశం లేదు. ఎక్కువలో ఎక్కువ అది హైదరాబాద్‌ రాజ్యాన్ని భారత ప్రభుత్వ పాలన కిందికి తెచ్చిన రోజు. అలా తేవడం కోసం, పోలీస్‌చర్య పేరుతో జరిపిన సైనిక దాడి విజయం సాధించిన రోజు. విలీనం అనే మాట వాడడం కూడ కష్టం.

ఆ మాటలో కూడ విలీనమయ్యే వారి ఆమోదం ఉందనే అర్థం ఉంది. 1948 సెప్టెంబర్‌ 17 చర్యకు నిజంగా తెలంగాణ ప్రజామోదం ఉందా అనేది సందేహాస్పదమే. ‘ముస్లిం పాలన కింద ఉన్న హైదరాబాదు హిందూ ప్రజలకు 1948 సెప్టెంబర్‌ 17న కేంద్ర ప్రభుత్వం విమోచన కలిగించిందని, అందువల్ల హైదరాబాద్‌ రాజ్యాధీశుడు మీర్‌ ఉస్మాన్‌ అలీఖాన్‌ లొంగిపోయిన ఆ తేదీని హైదరాబాద్‌ విమోచన దినంగా జరపాలని’ సంఘ పరివారం వాదిస్తున్నది. అసలు హైదరాబాద్‌ ముస్లిం పాలన కింద ఉండేదనేదే అర్ధ సత్యం.

పాలకుల మత విశ్వాసం ఇస్లాం కావచ్చుగాని వారు ఆధారపడింది ఇటు ‘హిందూ’ భూస్వాముల మీద, అటు క్రైస్తవ’ వలసవాదుల మీద. చివరకు మతోన్మాదులుగా పేరు పడిన రజాకార్ల సైన్యం కూడ హిందూ జాగీర్దార్ల, దేశ్‌ముఖ్‌ల, భూస్వాముల తరపున, వారి గడీలలో విడిది చేసి, తిని తాగి, పేద ప్రజల మీద, పోరాడుతున్న రైతుకూలీల మీద హంతక దాడులు చేసింది. అందువల్ల అసలు 1948 నాటి హైదరాబాద్‌ పాలనను రజాకార్ల దాడులను ముస్లిం పాలనగా, ముస్లిం మతదాడులుగా చిత్రించడం ఒక కుట్ర. అది ఒక నిరంకుశ పాలన అనే మాట, దాని నుంచి ప్రజలు విముక్తిని కోరుకున్నారనే మాట నిజమే.

కాని 1948 సెప్టెంబర్‌ 17 ఆ విముక్తిని కూడ సాధించలేదు. హైదరాబాద్‌ రాజ్యపాలన 1950 జనవరి 26 దాకా మీర్‌ ఉస్మాన్‌ ఆలీఖాన్‌ పేరు మీదనే సాగింది. ఆ తర్వాత కూడా 1956 నవంబర్‌ 1 దాకా ఆయన రాజప్రముఖ్‌గా కొనసాగాడు. దుర్మార్గమైన భూస్వామ్య వ్యవస్థను నెలకొల్పి, ప్రజల గోళ్ళూడ గొట్టి పన్నులు వసూలుచేసి ప్రపంచంలోనే అత్యంత ధనికులలో ఒకడుగా పేరుపడ్డ నిజాం ఆస్తులను ఈ ‘విమోచన’ తర్వాత స్వాధీనం చేసుకుని ప్రజలకు అప్పగించలేదు సరిగదా, అయనకే ఎదురుగా రాజభరణం, నష్టపరిహారాలు అందజేశారు. ఆయన ఆస్తులలో అత్యధిక భాగాన్ని, ఆయన అధికారాలను యధాతథంగా ఉంచారు.

ఎవరి నుంచి విమోచన సాగినట్టు? ఎవరికి విమోచన దొరికినట్టు? నిజాం పాలన నుంచి, భూస్వామ్య పీడన నుంచి విముక్తి కోరుతూ పోరాటం ప్రారంభించిన ప్రజలు ఆ పోరాటాన్ని 1948 సెప్టెంబర్‌ 17 తర్వాత ఆపివేయలేదు. ఆరోజుతో ఏదో మార్పు వచ్చిందని ప్రజలు భావించలేదు. గొర్రెలు తినేవాడుపోయి బర్రెలు తినేవాడు వచ్చాడని ప్రజలు చెప్పుకున్నారు. అందుకే ఆ తర్వాత మూడు సంవత్సరాలపాటు ప్రజలుసాయుధ పోరాటం కొనసాగించారు.

తెలంగాణను విముక్తి చేయడానికి వచ్చిందని చెప్పబడుతున్న సైన్యం 1948 సెప్టెంబర్‌ 18 నుంచి 1951 అక్టోబర్‌ దాకా వేల మంది తెలంగాణ రైతు కూలీలను, పోరాటయోధులను కాల్చి చంపింది. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో 1946 జూలై 4 నుంచి 1948 సెప్టెంబర్‌ 17 దాకా నైజాం సైన్యాలు, రజాకార్లు చేసిన హత్యల కన్న, 1948 సెప్టెంబర్‌ తర్వాత కేంద్రప్రభుత్వ సైనిక బలగాలు చేసిన హత్యలు, ఆకృత్యాలు ఎక్కువ. ప్రజలు సాధించుకున్న విజయాలన్నిటినీ నెహ్రూ-పటేల్‌ సైన్యాలు ధ్వంసం చేశాయి. ప్రజలు ఆక్రమించుకున్న భూములను మళ్లీ భూస్వాములకు కట్టబెట్టాయి.

రజాకార్లను అణచడం అనే పేరు మీద రెండు లక్షల మంది అమాయక ముస్లింలను ఊచకోత కోశాయి. ఆ బీభత్సకాండకు నాందిపలికిన సెప్టెంబర్‌ 17ను విమోచన దినంగా అభివర్ణించడం అర్థరహితం. సమకాలీన చరిత్రకారులు, పరిశీలకులు ఆ తేదీని విమోచన దినంగా పేర్కొనలేదు. స్వయంగా ఆ సైనికదాడిని నడిపిన వాళ్లు, యంత్రాంగం నెరిపినవాళ్లు, సమర్థించినవాళ్లు కూడ దాన్ని విలీనం, పోలీసు చర్య వంటి మాటల తోనే సూచించారు గాని విమోచన అనలేదు. కొన్ని సంవత్సరాల కింద సంఘపరి వారం ప్రారంభించి న ‘విమోచన’ ఆలోచన ఇవాళ అన్ని రాజకీయపక్షాలకు అంటుకున్నట్టుంది.

అందరికన్న ఎక్కువ ఆశ్చర్యకరంగా ఆ తేదీన మొదలుపెట్టి తెలంగాణ సాయుధ పోరాట వార్షికోత్సవాలు జరపాలని సిపిఐ, సిపిఎం నిర్ణయించుకున్నాయి. నిజానికి తెలంగాణ సాయుధ పోరాటానికి సంకేతాత్మక ప్రారంభమైన దొడ్డి కొమురయ్య అమరత్వ దినం (1946 జూలై 4) గాని, సాయుధ సమర ప్రారంభానికి రావి నారాయణ రెడ్డి , బద్ధం ఎల్లా రెడ్డి, మఖ్దూం మొహియుద్దీన్‌లు పిలుపు ఇచ్చిన 1947 సెప్టెంబర్‌ 11 గాని, సాయుధ పోరాటాన్ని అధికారికంగా విరమించిన 1951 అక్టోబర్‌ 20 గాని సాయుధ పోరాట వార్షికోత్సవ సందర్భం అవుతాయి గాని, తమ కార్యకర్తలను ఇతోధికంగా చంపడానికి కారణమైన, తాము అప్పుడు ఏ మార్పు లేదని భావించి పోరాటం కొనసాగించిన తేదీకి ఇవాళ ఎందుకు ప్రాధాన్యం ఇస్తున్నారో ఆ పోరాట అమరుల త్యాగాల సాక్షిగా వామపక్షాలు సంజాయిషీ ఇచ్చు కోవలసి ఉంటుంది.

ఇంకా విచిత్రంగా ప్రత్యేక తెలంగాణ వాదులలో కొందరు కూడా హైదరాబాద్‌ విమోచన దినాన్ని గుర్తిస్తున్నారు. నిజానికి 1948 సెప్టెంబర్‌ 17ను అందరికన్న ఎక్కువగా వ్యతిరేకించవలసిన వారు ప్రత్యేక తెలంగాణ వాదులు. ఎందుకంటే తెలంగాణ ప్రత్యేక అస్తిత్వాన్ని రద్దు చేయడం ప్రారంభమైన చీకటి రోజు అది. హైదరాబాద్‌ రాజ్యం, అందులో భాగంగా తెలంగాణ చిత్రపటం చెరిగిపోయి, ఇవాళ తెలంగాణ వాదులు చెపుతున్న ‘ఆంధ్ర వలస పాలకుల పాలన’కు నాంది పలికిన రోజు అది. ఆంధ్రప్రదేశ్‌ అవతరణతో 1956 నవంబర్‌ ఒకటిన స్థిరపడిన ప్రక్రియకు తొలి అడుగు పడినది 1948 సెప్టెంబర్‌ 17ననే.

చారిత్రక వాస్తవాలతోగానీ, జరిగిన చరిత్రతోగాని, సమకాలీన ఆధారాలతో కానీ, తదనంతర పరిణామాలను బట్టిగానీ ఎంత మాత్రం అంగీకరించలేని ‘విమోచన దినాన్ని’ జరపడానికి సంఘపరివారానికి ఒక నిర్దిష్ట - సమాజాన్ని నిట్ట నిలువునా చీల్చే ప్రయోజనం ఉంది. కానీ చరిత్ర తెలిసిన వారు, తెలియని వారు, ఆ చరిత్రలో భాగమయిన వారు, ఆ చరిత్ర వల్ల ధ్వంసమయిన వారు అందరికందరూ ఆ సంబరాలకు పరుగెత్తి పోవడమేనా? అవి ఎవరి సంబరాలో మనం పాల్గొనవచ్చునో లేదో కనీస ఆలోచన ఉండనక్కర లేదా?

Share/Save/Bookmark

Leave a Reply

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

Managed by Discover Telangana Inc., a registered nonprofit organization in USA.

All opinions and views expressed by third party content providers and shown here as preview are not that of Discover Telangana.

If you find any Content that is infringing, libelous, defamatory, obscene, abusive, offensive or otherwise violation of copyright law, alert us by emailing us at discover.telangana(at)gmail.com