అంతా ఒల్లెక్కల
సెప్టెంబర్ 22nd, 2008 by డిస్కవర్ తెలంగాణ
- రామా చంద్రమౌళి
![]()
నేనడ్గుతాన
బీదోడంటే బిచ్చగాడా ?
మనిషి మనసును గెల్వాలె గని
లంచాలిచ్చి మనిషిని కొంటరా
రెండ్రూపాయలకే కిలో బియ్యమంటవ్
ఒట్టిగనే కలర్ టి.విలనిస్తనంటవ్
ఉత్తగనే కరంటిస్తనంటవ్..
యాడికెల్లి తెచ్చి యాడబెడ్తవ్
ఒకన్ని మించి ఒకడు పైపైనబడి వరాలిత్తాండ్లు
అసలీ పైకమెక్కడ్ది- మీ ఇంట్లకెల్లిస్తాండ్లా
అప్పుల్జేసి కొప్పులు పెట్టబడ్తిరి
భూములన్నింటిని అడ్డికి పావుశేరమ్మి
గాలిక్కొట్కపోయే రోడ్లేసి, కాలువలు కట్టి
మందికొంపలు ముంచి కోట్లక్కోట్లు తినబడ్తిరి..
మాతోనే సర్కస్ ఆడిపిత్తాండ్లా-
మీరు సర్కస్ ఆడి మాకు సూపిత్తాండ్లా
పొరగాండ్లక్కూడా తాగుడు నేర్పబడ్తిరి
అరె.. తాగుబోతుల పైసల్తోటి సర్కార్ నడిపిస్తరా
బిడ్డా చెప్తాన.. అంతా తెర్లయిపోతాంది
బండి పట్టాల్ తప్తాంది.. జర జాగర్త
నేను లెక్కలడ్గుతాన చెప్పు
నీ రాకడెంత- పోకడెంత
అరవై ఏండ్లు నిండని సొతంత్ర సమరయోధులెంతమందున్నరు
లక్షలమంది కాలేజి పోరగాండ్లకు పీసులు ఎన్నాళ్ళు కట్తవ్
ధరలను దించక నౌకర్లను పెంచుకుంట
కూకుండబెట్టి వేలకువేల జీతాలెన్నాళ్లిస్తవ్
పనిచేసుడు చెప్పక కూకుండబెట్ట లంచాలిచ్చుడు నేర్పి
ప్రజలను ఎందుకు పందొంగలు జేస్తవ్
ఓట్లకోసం తెల్లకార్డులు, పచ్చకార్డులు..
రాత్రయితే రోడ్లన్నీ సారగబ్బుతో పరమకంపు
అంతా బహిరంగ దోపిడి.. ఎగబడి పీక్క తినుడు-
ఏమిలేనోడు పదేండ్లల్ల కోట్లెట్ల సంపాదిస్తాండు
నిలబడి చూచెటోడు గతిలేక లాపత్తా ఎట్లయితాండు
మీరంతా కల్సి
మమ్మల్ని ఎవరికి ఎంతకమ్మిండ్లో చెప్పుండ్లి
మా నెత్తిల కనబడకుంట ఎంత బాకి మోపిండ్లో చెప్పుండ్లి-
కోతిచేతికి కొబ్బరికాయిచ్చినట్టు
మనుషులకు సెల్‌ఫోన్లిచ్చి, టివిలిచ్చి
బరిబాత* పెయ్యిని పదిమందికి సూపుడు నేర్పి
తియ్యని ఇసాన్ని నరనరాన పారిత్తాండ్లు గదరా
నీ యవ్వ నీతి తప్పి, రీతి తప్పి
మేము చచ్చి బతుకుతానమో
బతుక్కుంట సత్తానమో తెలియక
ఈ బతుకే ఒల్లెక్కలైపోయింది*
ఈ దేశమే ఒల్లెక్కలైపోయింది గదరా- థూఁ !
(22 సెప్టెంబర్ 2008, ఆంధ్రజ్యోతి సౌజన్యం)





