అక్టోబర్లోనే ‘గోదావరి’ పనులు
సెప్టెంబర్ 25th, 2008 by డిస్కవర్ తెలంగాణ
హైదరాబాద్, సెప్టెంబర్ 25 : ప్రతిష్ఠాత్మక గోదావరి ప్రాజెక్టుకు కేబినెట్ ఆమోదం లభించింది. దీంతో ఈ ప్రాజెక్టు పనులను అక్టోబరు నెలాఖరులోనే ప్రారంభించేందుకు మెట్రోవాటర్‌బోర్డు అధికారులు సిద్ధమవుతున్నారు. బుధవారం జరిగిన కేబినెట్ సమావేశంలో ఈప్రాజెక్టుకు సంబంధించిన అడ్డంకులన్నీ తొలగిపోయినట్టయ్యింది. ప్రాజెక్టును నవంబరులోగా ప్రారంభించాలని ప్రభుత్వం ఆదేశించింది. అక్టోబరులో ప్రారంభించడానికి తాము సిద్ధంగా ఉన్నామని అధికారులు తెలిపారు. ప్రాజెక్టుకు సంబంధించి టెండర్ల ప్రక్రియ దాదాపు పూర్తయ్యింది. కాంట్రాక్టర్ల ఎంపిక కూడా జరిగిపోయింది. కేవలం టెండర్ కమిటీ సమావేశంలో దీనిని ఆమోదించాల్సి ఉంటుంది.
ఈ విషయంలో అధికారులు సైతం అవసరమైన ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. ప్రాణహిత చేవెళ్ల సోర్స్‌ద్వారానే ఎల్లం పల్లి నుంచి గోదావరి జలాలను తరలించేందుకు అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. దీనికి సంబంధించి డిటేల్డ్ ప్రాజెక్ట్‌రిపోర్ట్(డీపీఆర్)ను ‘వ్యాప్‌కోస్’ అందించింది. గోదావరి నుంచి నగరానికి మూడు దశల్లో 31 టీఎంసీల నీటిని తరలించేందుకు అవసరమైన ఫీజుబులిటీ రిపోర్టును అందించింది. ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి సమక్షంలో 2006, ఏప్రిల్ 12న జరిగిన సమావేశంలో ఈ ప్రతిపాదనకు ఆమోదం లభించింది. ప్రాణహిత చేవెళ్ల నుంచి 30టీఎంసీల నీటిని జంటనగరాలకు సరఫరా చేసేందుకు మెట్రోవాటర్‌బోర్డుకు కేటాయింపులు చేసింది. అందులో భాగంగానే మొదటి దశలో 10 టీఎంసీల నీటిని నగరానికి తరలించే ప్రతిపాదనలకు ఆమోదం లభించింది. మొదటి దశ పనులకు 3375కోట్ల రూపాయలు ఖర్చుకాగలవని అంచ నావేశారు. దీనికి 2008 జనవరిలో జరిగిన రాష్ట్రస్థాయి స్టీరింగ్ కమిటీ సమావేశంలో ఆమోదం లభించింది.
ఈ ప్రాజెక్టుకు అవసరమైన నిధుల విషయంలో కేంద్ర ప్రభుత్వం జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం పథకంలోనూ, రాష్ట్ర ప్రభుత్వం, యూఎల్‌బీ తరపున అందించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. మూడు సంవత్సరాల్లో మొదటి దశ పనులు పూర్తి చేయాలని నిర్ణయించారు. రాష్ట్ర ప్రభుత్వంతోపాటు, జీహెచ్‌ఎంసీ నుంచి కూడా నిధుల కేటాయింపులు జరుగుతాయి. ప్రాజెక్టుకు అవసరమైన నిధుల కోసం ప్రభుత్వం అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇచ్చింది. త్వరలోనే టెండర్ కమిటీ సమావేశం జరగనుంది. ఇది లాంఛనమేనని అధికారులు అంటున్నారు. ఇందులో ఆమోదం పొందాక టెండర్లు దక్కించుకున్న కంపెనీలకు పనులు అప్పగించనున్నామని అధికారులు తెలిపారు.
గోదావరి ప్రాజెక్టుకు నిధుల సమీకరణ ఇలా(కోట్లలో)
(25 సెప్టెంబర్ 2008, ఆంధ్రజ్యోతి సౌజన్యం)





