చివరి రేల పాట
నవంబర్ 4th, 2008 by డిస్కవర్ తెలంగాణ
గోదారి మెడలు వంచి రెక్కలిరిసి
అసాముల గోనె సంచుల్లో ముక్కలు ముక్కలుగా నింపితే
అభివృద్ధి సిలువకు ఆదివాసులను అందంగా బలిస్తే
ముంపు సమస్యలంటరేమి
నీళ్ళు నిధుల్లో వ్యత్యాసాలని లెక్కలు చెప్తరేమి?
వేల కోట్లను బంజారా హిల్స్ నుంచి విదేశి బ్యాంకుల్లో బధ్రపర్చితే
పారే గోదారి తల్లికి సంకెళ్ళంటరేమి?
గల్లీ నుండి ఢిల్లీ వరకు నాలుగేళ్ళు నిర్విరామంగా శ్రమిస్తే
అనుమతుల్లేవు అరాచకమంటూ ఆడిపోసుకొంటరేమి?
కృష్ణా గోదావరిని కలిపి ఆంధ్రలో పేద ప్రాంతాలకు నీళ్ళిస్తే
తెలంగాణకు అన్యాయమని సంవత్సరానికో ప్రకటన చేస్తరేమీ?
జల యజ్ఞం కాదు బలి యజ్ఞమని గడప దాటకుండ ముచ్చట్లాడితే
కాంట్రాక్టర్ల బంగారు బాతు ఆనకట్ట పనులాగిపోతయేమి?
పచ్చని ప్రాంతాల్లో మరో పంటకు నీళ్ళివ్వక
నోరిప్పని నాయకుల కరువు ప్రాంతాల్లో పారబోస్తరేమి?
పట్టపగలు కొండ చిలువలా సాగుతున్న
ఆనకట్ట పనులు బుసబుసలు కొడుతుంటే
ఏసీ రూముల్లో కూసోని
గోదావరిల దొంగలు పడ్డరని విమర్శలేమి?
పాలకులకు అమాయకంగ చిక్కే ఆదివాసులని బలివ్వకపొతే
మరింకెవ్వరిని దోచుకోవాలో చెప్పరేమి?
అభివృద్ధి రాక్షసికి లేడిపిల్లను కాక తోడేలును బలిస్తరేమి
నిజానికి ఆదివాసులు ఏమైపోతేనేమి?
అయినా పాలకులకు వరలక్ష్మిలా పోలవరం నిలిచినట్లు
ప్రతిపక్షానికి నిందారోపణలకు సాకుగా పనికి రాలేదేమి?
పత్రికలకు వార్తలా స్వచ్చంధ సంస్థలకు ప్రాజెక్టులా
మేధావుల ఉపన్యాసాలకు వస్తువులా లాయర్లకు కేసులా
అందరినీ గోదారి మంచి సమస్యగా సమంగా ఆదుకోలేదేమి?
పెరిగిన ధరలకు పొగాకు రైతుల రాయితీల కొరకు
కాదంటే అక్టోబర్ రష్యా విప్లవ వేడుకలకు కోయ జాతిని
హైదరబాదు తరలించిన పోరాటం ఇంటి పేరైన కామ్రేడ్లు
పోలవరం కొరకు లక్షల ఎకరాలు పోతుంటే భద్రాచలంలో
భూ పోరాటం మరిశి ‘ఇపుడైతే కంపెన్సేషన్ తీసుకోండని’
కోయోల్ల ఊర్లు ముంచే మంత్రం జపిస్తరేమి?
ఎడారైనా తెలంగాణ మాత్రం తప్పక సాధించే తెరాసకు
సమసమాజమే ఊపిరైన ఖమ్మం కమ్మని కామ్రేడ్లకు
నాటకాలకు స్వస్తి చెప్పి ప్రజలకే అంకితమైన చిరంజీవికి
ప్రజా తెలంగాణకు బద్దుడైన ఉద్యమాల దేవేంద్రునికి
ఒక రాష్ట్రమడిగితే ఇంకోటి ఫ్రీ స్కీమును చెప్పిన భాజపాకు
మాయమైన కోయ జాతిని మరల బతికించే సంజీవిని
కాటగల్సిన గొదారిని ఇంటికి తిరిగితెచ్చే ఉపాయం తెల్సునేమో
నాలుగొందల ఊర్లు మూడు రాష్ట్రాల కోయోల్లను
సమాధి చేసిన గోదావరి విషంగా మారడం
ధండకారణ్యంలొ ఉరితాడుకు రేల పాట
వేలాడటం ఇంక ఖాయమేమో
రేల రేలా రేలారే
రేల రేలా రేరేలా
రేల రేలా రేలారే
రేల రేలా రేరేలా
రేరేలాయో రేరేలా
రేరేలాయో రేరేలా
రేల రేలా రేలారే
రేల రేలా రేరేలా
రేరేల రేలా రేరేలా
రేరేలాయో రేరేలా





