గ్రామీణ జీవిత కథకురాలు
నవంబర్ 4th, 2008 by డిస్కవర్ తెలంగాణ
- బి.ఎస్.రాములు
![]()
యశోదమ్మ తెలంగాణ ప్రాంతపు తెలుగు ఆడపడుచు. ఆమె మాటలు తెలంగాణ భాషలోని సొగ సైన ముత్యాలు. పాకాల యశోదారెడ్డితో మాట్లాడితే ఉస్మానియా విశ్వవిద్యాలయంలో తెలుగు ఆచార్య పీఠం అధిష్ఠించిన, తెలుగు అధికార భాషా సంఘం అధ్య క్షురాలుగా ఉన్న ఒక విద్యావతితో మాట్లాడినట్టుగా ఉండదు. అనేక అనుభవాలు పండిన పల్లెటూరి అమ్మమ్మ, నానమ్మ మాట్లాడినట్టుగా ఆత్మీయత తొణికిసలాడుతుంది. ఒకనాటి గ్రామీణ సంస్కృతి జీవన సౌరభాన్ని కథలుగా అక్షర బద్ధం చేసిన సాహిత్యకురాలు. ఆమె మనలను శాశ్వతంగా వీడిపోయి నేటికి సరిగ్గా ఒక సంవత్సరం! శ్రద్ధాంజలిగా ఆ విదుషీమణి కథలను తరచి చూద్దాం.
యశోదారెడ్డి కథలు మూడు సంపుటాలుగా ప్రచురితమయ్యాయి. అవి ‘మా వూరి ముచ్చట్లు’ (1973), ‘ధర్మశాల’ (1999), ‘ఎచ్చమ్మ కథలు’ (2000). తెలంగాణ గ్రామీణ జీవితచిత్రణ పరుచుకున్న పది కథల సమాహారం ‘మా వూరి ముచ్చట్లు’. 24 కథలు ఉన్న ‘ధర్మశాల’లో మధ్యతరగతి జీవితాలు కూడా ఉన్నాయి. ‘ఎచ్చమ్మ కథ లు’ ఇరవయీ తెలంగాణ గ్రామీణ జీవితాన్ని చిత్రించినవే. తెలంగాణ భాషను, పలు కుబడిని, మాటతీరును, సంస్కృతిని యశోదారెడ్డి తన కథల్లో నిక్షిప్తం చేశారు. భాష సంస్కృతికి ఒక ఆయువుపట్టు అని గమనించి దానిని రికార్డు చేయాలని కథలను రాశారు. ‘మా వూరి ముచ్చట్లు’ కథల్లో ఎన్నో పలుకుబడులు, సామెతలు, జాతీయా లు, ప్రజల నోట్లో నానే గ్రామీణ పదాలు ఎంతోచక్కగా ఒదిగిపోయాయి. ఒక పరిశోధ కురాలుగా తానే ఆయా పదాలను, జాతీయాలను, సంస్కృతిని, సామెతలను మాండలికంలో భాషా ధ్వనుల మార్పులను అనుబంధంలో వివరించారు.
అందువల్ల ‘మా వూరి ముచ్చట్లు’ కథల సంపుటి దానికదే గ్రామీణ సంస్కృతి జీవన సౌరభాన్ని అక్షర బద్ధం చేసిన ఒక విజ్ఞాన సర్వస్వం వంటిది. ఆధునిక కథ సర్వసాక్షి కథనంతో , కెమెరా వలె దృశ్యీకరణతో, సంభాషణలతో నడపడం చూస్తాం. కొన్ని కథలు ఉత్తరాల రూపంలో ఎదుటివారిని సంబోధిస్తూ చెప్తున్న రూపంలో, డైరీల రూపంలో, ఆత్మకథ రూపంలో చూస్తుం టాం. యశోదారెడ్డి కథలు ఈ కథన రీతుల కన్న ప్రత్యేకమైనవి. తెలుగు సాహిత్యంలో ముఖ్యంగా తెలంగాణ సాహిత్యంలో కథను పల్లెటూరి మహిళలు మాట్లాడుతూ చెప్పేతీరు ను పలుకథల్లో చిత్రించింది యశోదారెడ్డే. ఆమె మాట్లాడే తీరు కూడా ఇలాగే గలా గలా గంటల తరబడి సాగిపోతూనే వుంటుంది. ఆమె మాట్లాడే తీరే ఆమె కథల్లో చేరిందా? ఆమె కథలు రాసే తీరే ఆమె మాటల్లో వచ్చి చేరిందా? విడగొట్టలేనంతగా చక్కగా కలిసిపోయాయి.
‘మా వూరి ముచ్చట్లు’ 1950ల నాటి గ్రామీణ సంస్కృతిని, జీవితాన్ని, భాషను, ఆచార వ్యవహారాలను, మానవ సంబంధాలను కళ్లకు కట్టి నట్లుగా మన ముందుంచు తున్నది. ‘ఎచ్చమ్మ కథలు’ 1960-70ల నాటి భాషను, సంస్కృతిని, గ్రామీణ జీవ నాన్ని చిత్రించాయి. ఈ కథా సంపుటాలు తెలుగు సాహిత్యచరిత్రలో కాలనాళికలు. తెలంగాణ గ్రామీణ జీవన చిత్రణకు ఆనవాళ్లు. సామాజిక పరిణామాలు ఎన్నో ఈ కథ ల్లో నిక్షిప్తమై ఉన్నాయి. ‘ఎదుర్కోల్లు’ కథలో పెళ్ళిలోని ఎదురుకోలు సంప్రదాయం ఎలా వుంటుందో చక్కగా వివరించారు. పల్లెల్లో ఆత్మీయులకు ఇరుగు పొరుగు వారికి కథ చెప్తున్నట్లుగా యశోదారెడ్డి కథన రీతులు ఉంటాయి. స్త్రీ ముచ్చట్లలో స్త్రీల కోణం లో ప్రపంచంలోని అనేక విషయాలు గిరగిరా తిరుగుతుంటాయి.
అక్రమ సంబంధా లు, ఇరుగింటి పొరుగింటి విషయాలు, ఊరి విషయాలు, కొత్త కోడలు విశేషాలు, తాగుబోతు మగవాళ్ల విశేషాలు, పిల్లల పెంపకం వివరాలు, ఎవరు ఎప్పుడు నెల తప్పారో, ఎవరు ఎందుకు నవ్వారో కళ్లల్లోని ఆ వెలుగుకు కారణాలేమిటో మొదలైనవ న్నీ ఆడవాళ్ల ముచ్చట్లలో జీవనదిలో జలకాలాడినట్టు కదులుతుంటాయి. యశోదా రెడ్డి కథల్లో వ్యవసాయపు పనులు, పనిముట్లు, సందర్భాలు ఎన్నో చిత్రించారు. పగ్గా లు, పలుపులు, మెడదుత్తలు, బండి, కందెన, పెద్ద సవారి, ఎడ్లు, పరదాలు మొదలైన వన్నీ దొరల ఇళ్లల్లో ఏమి ఉండేవో చక్కగా చూపించారు.
బతుకమ్మ పండగ తెలంగాణ మహిళలకు చాలా ముఖ్యమైన పండుగ. బతుకమ్మ పండుగకు తల్లి గారింటికి పోవ డం పెళ్లైన వాళ్లకి ఒక హక్కుగా ఉండేదని ఒక కథ ప్రారంభం తెలుపుతున్నది. ‘పీర్ల పండుగ’ కథలో పీరీల పండుగలో ఊరిలో అందరూ ఎలా పాల్గొంటారో ఆ సంస్కృ తిని చక్కగా వర్ణించారు. ఊళ్లో లాగులు తొడుక్కునే వాళ్లు అప్పుడప్పుడే బయలుదేరు తున్నారని లాగులు తొడుక్కోవడం ఒక విచిత్రమైన విషయమని , పంచె కట్టుకోవడం, ధోవతి కట్టుకోవడం పల్లె సంస్కృతి అని ఈ కథలో చెప్పకనే చెప్పారు.
యశోదారెడ్డి కథల్లో వస్తువు, శిల్పం కూడా గ్రామీణ ప్రజల జీవితాల నుంచి వారి కథ చెప్పే శ్రవ్య కథన రీతుల నుంచి స్వీకరించి తీర్చిదిద్దారు. ‘మా వూరి ముచ్చట్లు’ కథల సంపుటి చదువుతుంటే నాలిక తిరగదు. ‘ఎచ్చమ్మ కథలు’ కాస్త నయం. మనం మన తెలుగుకు ఎంత దూరమయ్యామో ఈ కథలను చదివితే తెలుస్తుంది. తెలుగు కథా సాహిత్యంలో యశోదారెడ్డి స్థానం విశిష్టమైనది. స్వాతంత్య్రానంతరం తెలంగాణ తొలితరం కథకుల్లో యశోదారెడ్డి ఒకరు. ప్రేమ్‌చంద్, టాల్‌స్టాయ్, మల్లాది రామకృష్ణ శాస్త్రి, కరుణకుమార, మా గోఖలే, గూడూరి సీతారాం, సత్యం శంకరమంచి మొదలైన వారి ఒరవడిలో యశోదారెడ్డి గొప్ప కథకురాలు.
(డాక్టర్ పి.యశోదా రెడ్డి వర్ధంతి సభ సందర్భంగా)
(Courtesy: AndhraJyothy, 04 November 2008)





