చివరికిలానూ…మిగిలేం
నవంబర్ 11th, 2008 by డిస్కవర్ తెలంగాణ
-అల్లం నారాయణ
జగిత్యాల పోటెత్తింది. జన ప్రవాహంతో వీధులు కేరింతలయ్యాయి. మూడు దశాబ్దాల తర్వాతి దృశ్యం. జగిత్యాల జైత్రయాత్ర ఈ దేశానికే ‘వసంత మేఘ గర్జన’. జన యుద్ధారావాన్ని వినిపించిన పేరు. భారత దేశ రైతాంగ పోరాటంలో మేలు మలుపు పరిణామాలకు చుక్కాని. ప్రజాయుద్ధ పంథాకది అసలు సిసలు ప్రతీక. తన చూపుడు వేలుతో మూడు దశాబ్దాలకు పైబడి నడుస్తున్న, దండకారణ్యాలకు, నల్లమలకు విస్తరించిన ఒక పల్లె విప్లవం. ఇప్పుడది. ఒక సినీ నట రాజకీయ వేత్తకు నీరాజనం పట్టింది. అవునది జగిత్యాలేనా? మూడు దశాబ్దాల ఏ ఆకాంక్షలూ ఉపరితలంలో తేలని ఉత్త సినీ నటునికి జై కొట్టే ఖాళీ జగిత్యాలేనా? కడుపులో ఏమి దాచుకున్నది తెలంగాణ. కనపడని ఏ గాయాలను, కదుములు కట్టిన ఏ గేయాలను దాచుకున్నది జగిత్యాల.
ఒక్క చిరంజీవిని చూడడానికి పోటెత్తింది జగిత్యాల. అతనిలో ఆ పల్లె ఏ ఆశ్వాసాలను, ఏ విశ్వాసాలను చూసింది. తర్కానికీ, హేతువుకూ, అంచనాలకు ఎలా దొరుకుతుంది నాడి. ఇది దేనికి సూచిక. ఎలా చెప్పగలం. ఇప్పుడు తెలంగాణకు ఒక్క శత్రువూ లేడు. శత్రువు లేక పోవడం సుఖంగానే ఉన్నట్టుంది. కానీ, ఏ శిశువు జన్మించనున్నది. కరడు గట్టిన సమైక్యవాదం బీటలు వారింది నిజమే. చంద్రబాబు తెలంగాణ కోసం వచ్చే ప్రయత్నాలన్నింటినీ నచ్చేలా చేస్తారు. దేని కోసం అయితేనేమి? ఆయన సమైక్య వాదాన్ని వదులుకున్నారు. దేవేందర్ గౌడ్ ఇల్లు ఖాళీ చేసిన తర్వాతైతేమి? తెలుగుదేశం ఇంటిని చక్కదిద్దుకోవడానికైతేనేం. ఎన్నికల్లో ఎవరితో ఒకరితో పొత్తు పెట్టుకుని నాలుగు సీట్లు సాధించడానికైతేనేమి? మనసులో ఏమి ఉంటేనేమి? ప్రత్యేక తెలంగాణ ఏర్పాటుకు జరిగే ప్రక్రియలన్నింటికీ తల ఊపుతానన్నారు చంద్రబాబు. జై తెలంగాణ. కానీ ఆయన ఉద్యమించరు.
ఇక చిరంజీవి. ఆయన మాత్రం ఎందుకు వ్యతిరేకిస్తారు? తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని ఆయనా గుర్తించారు కనుక, కేంద్రం ఇస్తే వద్దనరు. తెలంగాణ ఇవ్వాల్సింది కేంద్రమే కనుక ప్రత్యేక తెలంగాణ ప్రతిపాదనలను పంపమని ఒత్తిడి చేద్దామంటారు. ఆ మాటకొస్తే సిపిఎం కూడా తెలంగాణ ఇస్తానంటే వద్దనదు. రాఘవులు గారు దయతో తెలంగాణ వాళ్ళిస్తామంటే మేము అడ్డుపడము కానీ, ఇప్పటికీ సమైక్యవాదులమని ప్రకటించి ఉన్నారు. ఇక భారత కమ్యూనిస్టులూ ప్రత్యేక తెలంగాణ ఏర్పాటుకు అనుకూలమే. కానీ ఉద్యమించరు. భారతీయ జనతా పార్టీ కేంద్రంలో ఎప్పుడు అధికారంలోకి వస్తే ఆ క్షణాన తెలంగాణ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నది. ఇక కాంగ్రెస్ కూడా తెలంగాణకు వ్యతిరేకం కాదు.
కానీ దానికో పద్ధతున్నది. ఆ పద్ధతేమిటో? ఆ అధిష్ఠానమేమిటో? అదొక బ్రహ్మ పదార్థం. కనుక తెలంగాణకు వ్యతిరేకం కాదు కానీ… ఒక్క వైఎస్ వ్యతిరేకిస్తున్నారు? ఐనా… మరి ఏదీ తెలంగాణ ! ఇంత మంది ముక్త కంఠంతో కేంద్రం ఇస్తే అడ్డపడని స్థితిలో తెలంగాణ ఎందుకు రాదు? అదీ శేష ప్రశ్న! అదీ అసలు ప్రశ్న. మెరమెచ్చు మాటలకు, పెదాలపైన సానుభూతి వచనాలకు, వాళ్ళిస్తే మేం వద్దనం అనే మాటలకు, మంత్రాలకు తెలంగాణ రాలుతుందా?… ఒకరిస్తే పుచ్చుకోవడానికి, ఇవ్వకపోతే చచ్చిపోవడానికి తెలంగాణ ఒక సరుకా? అవును ఇప్పుడు తెలంగాణ ఒక అత్యంత గిరాకీ కలిగిన మారకపు సరుకు. ప్రపంచమంతా మాంద్యంలోకి కూరుకుపోతున్న వేళ, సరుకుల గిరాకీ తగ్గుతున్న వేళ తెలంగాణ సరుకుకు పెరిగింది గిరాకీ. ఒక బేరమాడండి. ఓట్ల కోసం, కొన్ని సీట్ల కోసం బేరం పెట్టండి తెలంగాణను. పొత్తులో, ఎత్తులో, అవసరాలో, అభ్యర్థనలో, అధికారంలోకి ఎక్కి రావడానికి అంగట్లో సరుకైంది తెలంగాణ.
ఎందుకోసం తెలంగాణ? ఎవరి కోసం తెలంగాణ ఉద్యమిస్తున్న తెలంగాణను అంగడి సరుకును చేసి ఓట్లకూ, సీట్లకూ, లెక్కలకూ, పత్రాలకూ బలిపెడ్తున్నదెవరు? తెలంగాణంటే ఒక అస్తిత్వవేదనా? ఒక స్వయం పాలన ఆకాంక్షా? వనరుల దోపిడి మీద ఎక్కుపెట్టిన ప్రశ్నా? ఆక్రమించిన అంతర్గత వలసల ఆధిపత్యం మీద ఎక్కుపెట్టిన ప్రశ్నల కొడవలా? ఏమిటి? తెలంగాణ ఎందుకు కావాలి? తెలంగాణ. ఒక బాబు ఇవ్వడానికీ, ఒకరు ఇస్తుంటే ఒక చిరంజీవి ఔననడానికి తెలంగాణ ఒక వస్తువా? లేదా ఉద్వేగాల సమాహారమా? ఐదు దశాబ్దాలకు పై బడిన వివక్ష పై సమరమా? ఒక అమ్మకం సరుకా? ఏది తెలంగాణ. కనుక తెలంగాణ ప్రజలు చెప్పింది నమ్ముతారు కనుక, వింటారు కనుక, బ్రిటిషాంధ్ర పాలన తాలూకు తెలివితేటలూ, లౌక్యం, వ్యాపార మెళకువలూ అబ్బలేదు కనుక.
నైజాం బూజులో మగ్గిన అమాయకత్వం, అణచివేతల్లో ఉన్నారు కనుక, చెప్పండి మీ ఇష్టమైనవన్నీ. వినిపించండి మీకు తోచినవన్నీ. తెలంగాణ ఒక ప్రయోగశాల. ఆడుకోండి. మీ ఇష్టం వచ్చిన ఆట. ఎట్లా ఉన్నాయి కదా అంటకాగుతున్న పార్టీలు. వారిని అంటకాగుతున్న బుద్ధిజీవులు. చేవచచ్చి, లొంగిపోయిన మేతాపులు కానివ్వండి. ఏమిటీ మాటలు.. సినీ నాయకా! ‘కేంద్రం ఇస్తే కాదనం’ అంటే ఏమున్నది దీంట్లో? మీరేం చేస్తారో చెప్పండి.
తెలంగాణ సమస్య ఏమిటో గుర్తించారు కదా! ఆత్మగౌరవానికీ, స్వయం పాలనకూ, వనరుల దోపిడీకి, అంతర్గత వలసల ఆధిపత్యానికి, వివక్షకూ ఏ పరిష్కారం చెబుతారో? ప్రకటించండి. ఇవి తొలగడానికి మీరేం చేస్తారో చెప్పండి. తెలంగాణ వనరులు తెలంగాణకు దక్కడమే తెలంగాణకు మోక్షం. మా బొగ్గు మాకు, మీ నీళ్లు మాకు, మా ఆత్మగౌరవం మాకు కావాలంటున్నది తెలంగాణ, హైదరాబాద్ భూములమ్మి పులివెందులలో రోడ్లు నిర్మిస్తున్న మహా రాజా వారు ఒక్కరే వ్యతిరేకిస్తున్నప్పుడు తెలంగాణకు మద్దతిస్తున్న వారంతా ఏం చేయగలరో చెప్పండి అప్పటి దాకా. ఎందుకీ శుష్క ప్రియాలు శూన్య హస్తాలు… తెలంగాణలాగా స్వచ్ఛంగా, సూటిగా చెప్పండి ఆనక మీ ఇష్టం. తెలంగాణ జగిత్యాలను కూడా కన్నది. ఆ జగిత్యాల ఈ దేశపు పోరాటాలను కన్నది. అది నివురు గప్పిన నిప్పని…. చరిత్ర రుజువు చేస్తున్నది.
(Source: AndhraJyothy, Pranahita 11 Nov’2008)






నవంబర్ 23rd, 2008 at 1:56 am
తెలంగాణంటే ఒక అస్తిత్వవేదనేనేమో? ఒక స్వయం పాలన ఆకాంక్షేనేమో? వనరుల దోపిడి మీద ఎక్కుపెట్టిన ప్రశ్నా? అవునేమో? ఆక్రమించిన అంతర్గత వలసల ఆధిపత్యం మీద ఎక్కుపెట్టిన ప్రశ్నల కొడవలా? కొడవలేనా? ఏమిటి? తెలంగాణ ఎందుకు కావాలి? తెలంగాణ. ఒక బాబు ఇవ్వడానికీ, ఒకరు ఇస్తుంటే ఒక చిరంజీవి ఔననడానికి తెలంగాణ ఒక వస్తువా? లేదా ఉద్వేగాల సమాహారమా? ఐదు దశాబ్దాలకు పై బడిన వివక్ష పై సమరమా? ఒక అమ్మకం సరుకా? ఏది తెలంగాణ.
తెలంగాణకి అడ్డుపడనివారూ ఉద్యమించరు, తెలంగాణ రాష్ట్రసాషనే లక్ష్యమైనవారూ ఉద్యమించరు. ఎవరూ ఉద్యమించరు
అది ఒక వస్తువు కాదా? అదొక అమ్మకం సరుకు కాదా? ఇది అమ్మకం సరుకు ఎప్పుడో అయిపోయింది. అది అలా మారటంలో తప్పెవరిది? తెలంగాణా జనానికి అందులో బాధ్యత లేదా? ఒకవేళ లేదంటే అది ఎస్కేపిజమే యధా రాజా తధా ప్రజా అన్న నానుడిని ఇప్పటి పరిస్తితులకన్వయించుకుంటే యధా ప్రజా తధా నాయకుడు. అట్లా నడిస్తెనే అది ప్రజాస్వామ్యమయితది. అట్ల నడవకపోతే ఆ తప్పు ప్రజలది కాదా? నాయకుడు చెప్పినట్లు మనమింటమా? మనం చెప్పినట్లు మన నాయకుడింటడా? అట్ల వినకపోతే ఆ తప్పు మనది కాదా? అది మన అమాయత్వమేనేమో!
మన గడ్డమీదికొచ్చి అసలు మన ఉనికినే విస్మరిస్తే, మనం ఆనందంగా భరిస్తే? అదీ మన అమాయకత్వమేనేమో? ప్రాంతంవాడూ ప్రాంతేతరుడూ అన్న తేడా లేకుండా ఎంత వీలయితే అంత అని దోచుకుంటున్నా మారు మాట్లాడరు. అదీ అమాయకత్వమేనేమో! మరి ఈ అమాకత్వం నిజామునెట్లా ఎదిరించింది. అప్పుడీ అమాయకత్వం అడ్డం రాలేదా? తెలంగాణ సాయుధపోరాటంలో అడ్డం రాలేదా. ఇప్పుడు మాత్రనే ఎందుకొస్తుంది. ఇది మన ప్రజల అలస్త్వమనుకుంటే తప్పయితదా? అబధ్ధమయితదా? ఇది ఇట్లనే ఇంకొంత కాలం నడిస్తే తెలంగాణ పేరును కూడా అందరూ మర్చిపోతరు. అప్పుడేబాధా ఉండదేమో!
ఇసుంట రమ్మంటే ఇల్లంత నాదే అని ఇక్కడ్నే తిష్టేస్కున్నోళ్ళని ఇట్లనే వదిలేస్తే చేతులు కాలినంక ఆకులు పట్టుకున్న చందం కాదా?
మెధావులనన్నా అడుగుదామనుకుంటె వారెక్కడున్నరింక అని సెలవిస్తే ఏది దిక్కు! దలారి నాయకులు చావ చచ్చిన మేధావులు ఉన్నపుడు ఒంటరి ప్రజల ఉద్యమాలు ఎటు పోతయి? తెలంగాణ ఎట్లొస్తది?