కొత్తపల్లి జయశంకర్ : “తెలంగాణ రాష్ట్రం - ఒక డిమాండ్” పుస్తక పరిచయం
నవంబర్ 11th, 2008 by డిస్కవర్ తెలంగాణ
పొరిగింట్లో జామిచెట్టు కొమ్మ మన ఇంట్లోకి వాలిందనుకోండి. ఆ కొమ్మపై పళ్లు మనవా? వాళ్లవా? మనింట్లో జామిచెట్టు కొమ్మ పొరిగింటి పిట్టగోడ మీదుగా వెళ్లిందనుకోండి, అక్కడి పళ్లు మనవా? వాళ్లవా? ఎదురింటి వాళ్ల జామికొమ్మ వాల్ల పక్కింటిలోకి వాలితే ఆ పళ్లు ఎవరివి? చెప్పండి చూద్దాం. మొదటి రెండింటికి జవాబు మనవి. మూడో ప్రశ్నకు జవాబు ఆ రెండిళ్లలో మనకు దగ్గరి వాళ్లు ఎవరైతే వారివి. మన దేశంలో అంతర్ రాష్ట్ర వివాదాలు, నదీ జలాల వినియోగపు వివాదాలు, అంతర్జాతీయ సమంధాలు తదితర విషయాలు తరచిచూస్తే ఈ న్యాయమే కనిపిస్తుంటుంది.
ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు చేయాలంటూ గత కొన్ని దశాబ్దాలుగా కొనసాగుతున్న ఉద్యమానికి సైద్ధాంతిక ఊపిరులూదుతున్న కొత్తపల్లి జయశంకర్ వెలువరించిన “తెలంగాణ రాష్ట్రం - ఒక డిమాండ్” పుస్తకాన్ని ఈ వారం పరిచయం చేస్తున్నాను.
పరిచయానికి ముందర రెండు మాటలు. వేర్పాటువాదం వినకూడని, చదవకూడని, ఆలోచించకూడని విషయం కానే కాదు. ఇరవైమందికి పైగా సభ్యులతో అన్యోన్యంగా ఉండే కుటుంబాలనూ, అదే సమయంలో నిరంతరమూ మనస్పర్థలతో గడిపే కుటుంబాలనూ చూస్తున్నాం. వేరుకుంపట్లు పెట్టి వృద్ధి చెందినవారినీ, పతనమైనవారినీ చూశాం. కళింగాంధ్ర వాసులమనో, రాయలసీమ వాసులమనో కాసేపు మరిచి విశాల భారత భావనలో మునిగి ఈ పుస్తకాన్ని చదవగలగాలి. అప్పుడే వివక్ష రూపం బట్టబయలవుతుంది. అటు రాజకీయం, ఇటు వ్యాపార సామ్రాజ్యం ఎవరి చెప్పుచేతల్లో ఉన్నాయో ఆలోచిస్తే తెలంగాణ వెనుకబాటుతనమే కాదు, కళింగాంధ్ర వెనుకబాటుతనమూ (ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లా వట్టి డొల్లగా ఎలా మారిందో) తెలుస్తుంది. అధికారపు గంతలు కళ్లకు కట్టుకుని నడిచే రాజకీయ రాబందులు ఎలా భారతదేశ పతనానికి దారులు వెతుక్కుంటున్నారో బోధపడుతుంది.
భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటులో ముందు వెనుకడుగేసిన నెహ్రూ తర్వాత ముందుకు వచ్చినా విశాలాంధ్ర ఏర్పాటులో తుదివరకూ గుంజాటన పడ్డారనేది చారిత్రక సత్యం. పొట్టి శ్రీరాముల ఆత్మ పరిత్యాగం తర్వాత, వి.కె.కృష్ణమీనన్ హితబోధల తర్వాతే ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటుకు దారి సుగమమైంది. ఈ దారిలో మనకు నిర్మించతలపెట్టిన పెద్ద మనుషుల ఒప్పందం, అఖిలపక్ష ఒప్పందం, ఒకటేమిటి అన్నింటి స్పూర్తిని తూట్లు పొడవడమే జరిగింది. తెలంగాణ ప్రాంతానికి ఏ రకంగానైనా చేయూతనిద్దామని తలచి కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన అష్టసూత్ర పథకం, పంచసూత్ర పథకం, ఆరుసూత్రాల పథకం… అన్నీ నీరుగారిపోయాయి.
ముఖ్యంగా నీటి పారుదల రంగంలో విశాల దృష్టి లేకపొవడంవల్ల సంకుచిత దృష్టి ఏర్పరచుకోవడం వల్ల మనకు మనమే చాలా అన్యాయం చేసుకున్నామనిపిస్తోంది. ఆంధ్ర ప్రాంతంలో (దీంతో కళింగాంధ్ర ప్రాంతాన్ని కలపకండి) పలుకుబడి కలిగిన వ్యక్తులు, వాళ్ల భూములున్న కొన్ని జిల్లాలకే అదనపు నీటిని పొందే ప్రయత్నంలో తెలంగాణ రైతాంగానికి జరిపిన ద్రోహం ప్రభుత్వమే వెలువరించిన గణాంకాల సాక్ష్యాలతో జయశంకర్ బయటపెట్టారు. ఇది అది అని కాదు అన్ని రంగాలలో తెలంగాణ వాటాను ఆంధ్రకు తరలించడాన్ని రచయిత వర్ణించిన తీరు మనకు కంట తడిపెట్టిస్తుంది. చెరువులలో పూడికలు తీయక, తెగిపోయిన చెరువు కట్టలను మరమ్మతులు చేయక, చెరువులను ఉద్దేశపూర్వకంగా శిథిలపరచి చిన్నకారు, సన్నకారు రైతులు నిస్సహాయులై తమ భూములను కారుచౌక ధరకు కోస్తా ఆంధ్రానుంచి వచ్చిన సంపన్నులకు అమ్మివేసే పరిస్థితులను కల్పించడం…అంటూ జరిపే వర్ణణ చుస్తే నాకు శ్రీకాకుళం జిల్లా రైతాంగపు ముఖచిత్రం ఎదలో దుఖం తన్నుకొచ్చేలా మెదులుతోంది.
మరే జిల్లాకు లేని రీతిలో పదమూడు నదులు ఈ జిల్లాగుండా పారుతున్నాయి. పెట్టని కోట తూర్పు కనుమలు, విస్తారంగా దొరికే గ్రానైట్, నల్లరాయి నిక్షేపాలు… ఒకటేమిటి అపార వనరులు. కాని మన రైతు పొట్ట చేత పట్టుకుని విశాఖ నుంచి అండమాన్ దీవుల వరకు వలస పోవడం చేత పల్లెలకు పల్లెలే ఖాళీ అయ్యాయి. పొరుగు రాష్ట్రాలవారు ఖనిజ సంపద తరలించుకుపోతుంటే, గోదావరి జిల్లాల వడ్డీ వ్యాపారులు రైతాంగపు, చిన్న వ్యాపారుల రక్తం పీల్చుకుంటున్నారు. మరింత విషాదకరమైన కోణం ఏమిటంటే మన గిరిజన ప్రాంతాల అటవీ ఫలసాయాన్ని వారి శ్రమను మన అధికారులు, మన మైదాన ప్రాంత వాసులే దోచుకోవడం. దోపిడీ ఒక మానవ నైజమైపోయింది.
అందరికీ అర్థమయ్యే చక్కటి ఆంధ్ర తెలుగులో (నా ఉద్దేశం తెలంగాణ మాండలికంలో కాకుండా) వివక్ష బహుముఖ రూపాలను అందంగా చిత్రించారు. కొత్తపల్లి జయశంకర్ విద్యాధికుడైన రచయిత. అరటిపండు ఒలిచిన రీతిలో ఎవరికైనా బోధపడేలా విషయాన్ని వివరించడంలో సఫలమయ్యారు. కనీసం ఒక్క అచ్చు తప్పయినా లేని ఈ పుస్తకంలో రాజోలి బండ మళ్లింపు పథకంలొ మెంట్ గేట్లను బాంబ్లతో పేల్చివేసి ఆ నీటిని తరలించుకుపోతుండే ఇప్పటి పలక పక్ష ఎం.ఎల్.ఏ. (ఈ పుస్తకం మార్చ్ 2004లో వచ్చింది అంటే తెలుగుదేశం పార్టీ అయిఉండాలి) పేరు చెప్పడానికి భయమెందుకు? 1971లో తెలంగాణ ప్రజా సమితి కాంగ్రెస్ పార్టీలో విలీనమవడం ఒక రాజకీయ ద్రోహం. అలా చెప్పకుండా సుదీర్ఘ పోరాటాన్ని కొనసాగించిన తెలంగాణ ప్రజలు ‘అలసిపోవడం’ చేత ఉద్యమతీవ్రత కొంత తగ్గిందన్నారు. ఇది పెలుసుమాట. ఉద్యమంలో పాల్గొనే ప్రజలెప్పుడూ అలసిపోరు. విజేతలయ్యేవరకూ ప్రజా ఉద్యమాలు అలుపెరగవు. నాయకులు వారి స్వప్రయోజనాల కోసమే ప్రజలను నిస్తేజం చేయడమో, ఆవేశపరూలను చేయడమో జరుగుతుంటుంది.
తెలంగాణ రణన్నినాదాన్ని స్పష్టంగా వినిపించిన “తెలంగాణ రాష్ట్రం - ఒక డిమాండ్” పుస్తకం మన అన్ని ఇగోల, భ్రమల ముసుగూల్ను పక్కన పెట్తి చదవగలిగితే చాలా ఆలోచనలు రేకెత్తించే పుస్తకం. మరి మీరు చదివారా?
- (Source : ప్రత్యేక రాష్ట్ర పరిశీలన పాపమేమీ కాదు ; దుప్పల రవికుమార్ వృత్తిరీత్యా శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో ఆదిత్య ఇంజనీరింగ్ కళాశాలలో సాఫ్ట్ స్కిల్స్ ట్రైనరు)
- Also read రాయలసీమలో ఆధునిక సాహిత్యం by దుప్పల రవికుమార్






నవంబర్ 13th, 2008 at 4:01 am
“తెలంగాణ్ రాష్ట్రం - ఒక డిమాండు” పుస్తకంపై పరిచయ వ్యాసం నాకెంతో బాగా నచ్చిన డిస్కవర్ తెలంగాణ్ వెబ్సైటులో వుంచడం నా అదృష్టంగా భావిస్తున్నాను. మీకు కృతజ్నతలు. నమస్తే.