- అందెశ్రీ
![]()
చెట్టుకొమ్మన పిట్ట
గూడల్లుకున్నట్టు
చేతిలో ఈతాకు
చాపల్లు కున్నట్టు
పనిలోన మాయవ్వ
పాటల్లుకున్నదీ.. ఆ..
పాటె నా బతుకు
బాటయ్యి ఉన్నదీ
ఆ పాటనే పాడనా
బతుకంత
గా బాటలో నడువనా
॥చెట్టు॥
లోకమున వేకువ
కిరణమై మెరిసింది
చీకటైతే చాలు
వెన్నెలై కురిసింది
దండకారణ్యాల
కొండగాలై వీచి
ఎండ వానల కోర్చి
ఎదిగె ఎదలోయల్లో
పాయలుగ ప్రవహించెనా
ఆ పాట
ప్రజలల్ల జీవించెనా
॥చెట్టు॥
చలిమంట లేసుకుని
పొలికేక పెట్టింది
గుండె దరువుల మీద
జెండ ఎగిరేసింది
వంపులెన్నో దాటి
గుంపులల్లో గలిసి
గాలి తరగల మీద
ఊరేగి, ఊరేగి
పొలిమెరలు చెరిపేసెనా
ఆ పాట
పొద్దుపొడుపై వెలిగెనా
॥చెట్టు॥
దుమికె జలపాతాల
దుందుభై మ్రోగింది
కొండ కోనల కోటి
రాగాల దాగుంది
అడవితల్లి ఒడిలో
ఎండుటాకుల సడిలో
ఆదిమా జాతుల
ఆటలతో జతగట్టి
వేట మొదలెట్టిందిరా
ఆ పాట
కోటలను గొట్టిందిరా
॥చెట్టు॥
నేలపై గడ్డోలె
పచ్చగా బతికింది
నెల చంద మామోలె
లోకాన వెలిగింది
నల్లలము వువ్వులా
నాజూకు నవ్వులా
నా పల్లె లోగిళ్ల
ఉయ్యాల లూగింది
ఏ తల్లి గన్న బిడ్డో
ఆ పాట
కెవరు పురుడు బోసిరో
॥చెట్టు॥
వనసీమలను దాటి
జనసీమలో గలిసి
చెలుకల్ల మొలిచేటి
మొలకల్ల ఎదిగింది
నాట్లేసె తల్లులా
నాలుకల నర్తించి
తుమ్మెదల గుంపులా
కమ్మనీ రాగాల
జగమంత దిరిగొచ్చెనా
ఆ పాట
జానపదమై నిలచెనా
॥చెట్టు॥
కాల చక్రాలకే
ఇరుసయ్యి ఉన్నది
కలిమిలేముల మధ్య
కంచె గానన్నది
పంచ భూతాలని
ప్రాణముగ జేసుకుని
పాడేటి గొంతుల్లో
పాటగా పూచింది
ఆ పాటనే పాడనా
బతుకంత
గా బాటలో నడువనా
॥చెట్టు॥
మండేటి ఎండల్లో
మంచయ్యి కురిసింది
ఎండేటి డొక్కల్లో
మెతుకయ్యి మురిసింది
కరువు రక్కసి కోర
కాటేయు వేళల్లో
ఊతమై ఆశ్రిత
జాతులను పోషించ
ఇల్లిల్లు తిరిగిందిరా
ఆ పాట
పల్లెలను ఏలిందిరా
॥చెట్టు॥
గళసీమ తెగిపడిన
గండు చీమల పట్టు
కుమ్మరీ పురుగోలె
మలిన మంటదు ఒట్టు
చెట్టోలె పాటకు
చరిత ఎంతున్నదో
చిరకాలముగ
చిరంజీవిగా వర్ధిల్లె
‘మనిషి’లో సంగీతమూ
ఆ పాట
మన దేశ ఇతిహాసమూ
॥చెట్టు॥
August 11th, 2009 at 11:11 pm
చాలా బాగుంది బ్రదరు…..