Feed on
Posts
Comments

- ఎన్ వేణుగోపాల్

కోరుకున్నంత సంపూర్ణమైన సంతోషం దక్కనప్పుడు మనుషులు అల్పసంతోషులుగా మారుతారు. జరగనిదాన్ని కూడ జరిగినట్టు భావించి సంతోషపడుతుంటారు. కొంచెం జరిగినా కొండంత జరిగినట్టు పొంగిపోతుంటారు. ఏమీలేని చోటకూడ తమకు కావలసిన అర్థాలు వెతుక్కుని ఏదో ఉన్నదని చెప్పడానికి ప్రయత్నిస్తారు. ఇది ఒక చిత్తవృత్తి.

ప్రత్యేక తెలంగాణ విషయంలో అన్ని రాజకీయ పార్టీలూ ఒకేరకంగా ద్రోహం చేస్తున్నప్పటికీ, మోసపూరితమైన మాటలు మాట్లాడుతున్నప్పటికీ కొందరు తెలంగాణవాదులు ప్రదర్శిస్తున్న ఉత్సాహంలో ఈ చిత్తవృత్తే కనబడుతున్నది. అసందర్భపు ప్రకటనలను, తెలంగాణ వ్యతిరేక భావనలతో నిండి ఉన్న ప్రకటనలను కూడ ఆ చిత్తవృత్తి వల్లనే ఆహ్వానిస్తున్నట్టున్నారు.

ఇటీవల తెలంగాణ గురించి చిరంజీవి చేసిన ప్రకటనలో పొంగిపోవడానికీ, మురిసి ముక్కలు కావడానికీ ఏమున్నది? అంతకుముందు తెలుగుదేశం చేసిన తీర్మానంలో తెలంగాణ ప్రజల మనోభావాలకు వ్యతిరేకమైన మాటలెన్నో ఉండగా కూడ తెలంగాణ వాదులు కొందరు సంతోషించడానికి కారణమేమిటి? ఆ మాటకొస్తే, కాంగ్రెస్ 2004 ఎన్నికల ప్రణాళికలోగాని, యు.పి.ఎ కనీస ఉమ్మడి ప్రణాళికలోగాని చెప్పినమాటలలో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు గురించి ఏ నిర్దిష్ట వాగ్దానాలు ఉన్నాయని తెలంగాణ రాష్ట్ర సమితి ఎన్నికల పొత్తు కుదుర్చుకున్నది? ఏ స్పష్టత వచ్చిందని తెలంగాణ వాదులు సంతోషించారు?

ప్రజారాజ్యం అధినేత చిరంజీవి తిరుపతి సభలో తెలంగాణ సమస్య ఆత్మగౌరవ సమస్య అని ప్రకటించి మిగిలిన రాజకీయ నాయకుల కన్న ఒక అడుగు ముందుకువేసినట్టే కనిపించారు. అందువల్ల ఉత్తర తెలంగాణ యాత్ర ప్రారంభించకముందే తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు గురించి కూడ ఆయన ఏదో స్పష్టమైన ప్రకటన చేస్తారని ఆశలు వ్యాపించాయి. కాని ఆయన అటువంటి ప్రకటనేదీ చేయకపోగా, మొదటి రోజున సిరిసిల్లలో ‘తెలంగాణ గడ్డ వదిలేలోపు ప్రకటిస్తాను’ అని వాయిదా వేశారు. అలా వాయిదా వేయడమంటే బహుశా ప్రతికూల ప్రకటనకు సూచన కావచ్చునని, అటువంటి ప్రకటనకు ప్రతిస్పందన తీవ్రంగా ఉంటుందని ఊహించడం వల్లనే దాన్ని తెలంగాణ వదిలే సమయానికి వాయిదా వేశారని ఒక అభిప్రాయం వ్యక్తమయింది. కాని యాత్ర రెండవరోజున స్పష్టమయిన ప్రకటన చేయమని మెట్‌పల్లిలో తెలంగాణ అభిమానులు నిలదీయడంతో చిరంజీవికి ఆ వాయిదాను ఉపసంహరించుకోక తప్పలేదు. ఏదో ఒక ప్రకటన చేయక తప్పలేదు.

అలా తప్పనిసరి పరిస్థితుల్లో వెలువడినదే జగిత్యాల ప్రకటన. అక్కడయినా ఆయన ఏమన్నారు? “తెలంగాణ రాష్ట్ర ప్రతిపాదన కేంద్రం చేయాలి. అలా కేంద్రం ప్రతిపాదిస్తే ప్రజారాజ్యం పార్టీ అడ్డుపడదు, అడ్డుపడదు, అడ్డుపడదు. మీ మనోభావాలకు అనుకూలమైన వైఖరే తీసుకుంటుంది.” దీనిలో రెండో వాక్యం కొంత ఆశాజనకం కావచ్చు గాని, మొదటి వాక్యానికి అర్థమే లేదు. కేంద్రప్రభుత్వం అటువంటి నిర్ణయం తీసుకుంటే ఎవరు అడ్డుపడినా అది ఆగదు. అడ్డుపడడం, పడకపోవడం అన్న ప్రశ్నే తలెత్తదు. నిజానికి పార్లమెంటులో ఆ అధికారిక తీర్మానం ప్రవేశపెట్టడం జరిగినప్పుడు, ఏ పార్టీ అయినా అడ్డుపడదలచుకున్నా, ఆ పార్టీకి కనీసం ఒక్క సభ్యుడయినా ఉండాలి. 2009 ఎన్నికల తర్వాత మాట ఏమోగాని, ఇప్పటికయితే ప్రజారాజ్యం పార్టీకి ఆ స్థితి లేదు. అంటే తలచుకున్నా ప్రజారాజ్యం పార్టీకి అడ్డుపడే అవకాశం లేదు. కాబట్టి చిరంజీవి గంభీర ప్రకటనలోని మొదటి వాక్యానికి నిజంగా ఏ అర్థమూ లేదు. ఇంతకూ ఆ వ్యాఖ్య గతంలో మార్క్సిస్టు పార్టీ చేసిన ప్రకటనతో సమానమైనదే. అప్పుడు మార్క్సిస్టు పార్టీని తీవ్రంగా విమర్శించిన తెలంగాణ వాదులు ఇప్పుడు చిరంజీవి ప్రకటనను ప్రశంసించడం ఆశ్చర్యకరం. ఇక చిరంజీవి జగిత్యాల వ్యాఖ్యలోని రెండో వాక్యం ఆయన తిరుపతి వ్యాఖ్యకు మరో రూపమే తప్ప, కొత్త విషయమేమీ లేదు.

సరిగ్గా ఇప్పుడు చిరంజీవి వ్యాఖ్యలమీద సంతోషం వెల్లివిరుస్తున్నట్టే విజయదశమి రోజున చంద్రబాబు నాయుడు చేసిన ప్రకటన మీద కూడ కొందరు తెలంగాణ వాదులు సంతోషం ప్రకటించారు. అక్కడయితే తెలుగుదేశం అధినేత ఆరోజున మాటల్లో ఏమి చెప్పారనేదానికంటే, చాల స్పష్టంగా పొలిట్ బ్యూరో చేసిన తీర్మానం నలుపు తెలుపు అక్షరాల్లో ఉంది. ఆ తీర్మానంలో పార్టీ “ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అనుకూలంగా నిర్ణయించింది” అనే వాక్యం ఉన్నమాట నిజమేగాని, ఆ తీర్మానం తెలంగాణ వాదులు ఇంతకాలమూ ప్రకటిస్తున్న అభిప్రాయాలను ఖండిస్తూ మొదలయింది.

“తెలంగాణ, ఆంధ్ర ప్రాంతాల ప్రజాభీష్టం మేరకు, ప్రజానాయకుల అంగీకారంతో 1.11.1956 న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ జరిగింది” అని ఆ తీర్మానం మొదలయింది. ఈ అవగాహనతో యాభై సంవత్సరాలుగా తెలంగాణ వాదులు విభేదిస్తున్నారు. సమైక్య రాష్ట్రమనేది ప్రజాభీష్టం మేరకు జరిగినది కాదని, ఫజల్ అలీ కమిషన్ ముందు వ్యక్తమయిన అభిప్రాయాలలో సమైక్యతకు అనుకూలమైన వైఖరి తెలంగాణలో వ్యక్తం కాలేదని చరిత్ర స్పష్టంగా చెపుతున్నది. అలాగే పెద్దమనుషుల ఒప్పందాన్ని ప్రజానాయకుల అంగీకారం అనడం కూడ సరయినది కాదు. నిశితంగా పరిశీలిస్తే, పెద్దమనుషుల ఒప్పందం అంగీకారం కాదు, అది తెలంగాణ రక్షణల, హామీల పత్రం. అది తెలంగాణకు అనుకూలమైన షరతులను ఆంధ్ర నాయకులు అంగీకరించి రాసి ఇచ్చిన ఒప్పుదలపత్రం. అంటే సమైక్య రాష్ట్రం ఏర్పాటు షరతులమీద జరిగినదే తప్ప, అంగీకారం మీద జరిగినది కాదు. అడుగడుగునా ఆ షరతుల ఉల్లంఘన జరిగినందువల్ల సమైక్యతకు ప్రాతిపదికే రద్దయిపోయింది. ఈవాదనను ప్రత్యేక తెలంగాణ ఉద్యమం కనీసం గత నలభై ఏళ్లుగా, మరీ ముఖ్యంగా గత పన్నెండేళ్లుగా చేస్తున్నది. ఇవాళ తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో వచ్చి తెలంగాణ అనుకూల తీర్మానం అనబడేదానిలో సమైక్య రాష్ట్రం ప్రజాభీష్టం మేరకు ఏర్పడిందని అనడం చరిత్రకు అపచారం, తెలంగాణ ఉద్యమ మనోభావాల మీద క్రూరమైన పరిహాసం.

ఈ రెండు పార్టీల తెలంగాణ అనుకూల వైఖరులు ఇప్పటివి కావచ్చు, వాటి పర్యవసానాలు ఎలా ఉంటాయో ఇప్పుడే చెప్పలేకపోవచ్చు. కాని తెలంగాణ అనుకూల వైఖరి తీసుకుని, ఎన్నికల ప్రణాళికలో కూడ చేర్చి, తెరాసతో ఎన్నికల పొత్తు కుదుర్చుకుని, తెలంగాణకు ఎన్నెన్నో చేశానని చెప్పుకుంటున్న కాంగ్రెస్ కూడ నిర్దిష్టంగా ఏ ప్రకటనా చేయకుండానే 2004లో తెరాస పొత్తు కుదుర్చుకుంది. కాంగ్రెస్ ఎన్నికల ప్రణాళికలో రాసినదేమంటే, “తెలంగాణ ప్రాంత ప్రజల పెరిగిపోతున్న ఆకాంక్షలు, ఆశలను, ఉద్వేగాన్ని కాంగ్రెస్ పార్టీ గుర్తిస్తోంది. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఈ అంశాన్ని సునిశితంగా పరిశీలించింది. “రాష్ట్రాల పునర్ వ్యవస్థీకరణ మొదటి కమిషన్ నివేదికను గౌరవిస్తూనే, విదర్భ, తెలంగాణలో ప్రత్యేక రాష్ట్రాల ఏర్పాటుకు అనేక సకారణాలు ఉన్నాయని కాంగ్రెస్ భావిస్తోంది. అయితే రాష్ట్రాల పునర్ వ్యవస్థీకరణ అనేక సమస్యలను లేవనెత్తుతుంది. ఇందులో ఇమిడి ఉన్న అన్ని సమస్యలను పరిశీలించి ఈ అంశాన్ని నిర్ధారించడానికి రాష్ట్రాల పునర్ వ్యవస్థీకరణకు రెండో కమిషన్ ను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని కాంగ్రెస్ భావిస్తోంది.” ఈ వాగ్దానంలో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుకు అనుకూలంగా ఏమి ఉందని తెరాస ఎన్నికల పొత్తుకు సిద్ధపడిందో తెలియదు. ఆ తర్వాత తెరాస కూడ భాగస్వామిగా ఉన్న యుపిఎ దేశ పాలన కోసం తయారు చేసుకున్న కనీస ఉమ్మడి కార్యక్రమం లో “తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ఉన్న డిమాండ్‌ను అవసరమైన సంప్రదింపుల తర్వాత, ఏకాభిప్రాయం తర్వాత, తగిన సమయంలో యుపిఎ ప్రభుత్వం పరిశీలనకు తీసుకుంటుంది” అని రాశారు. మూడు మెలికల తర్వాత కూడ చూద్దాం అనే తప్ప, చేద్దాం అని అనలేదు! ఆమాత్రం మెలికల ప్రస్తావనే ఘనవిజయమన్నట్టుగా నాలుగేళ్లుగా ఊదరగొడుతున్నారు.

ఇక మిగిలిన “జాతీయ” రాజకీయ పార్టీల తెలంగాణ “అనుకూల” ప్రకటనల గురించి, తెలంగాణకు అడ్డంరామనే ప్రకటనల గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది.

మూడున్నరకోట్ల తెలంగాణ ప్రజల న్యాయమైన ఆకాంక్షలు, స్వయంనిర్ణయాధికార వాంఛ, వివక్షపట్ల ధిక్కారం ఈ రకంగా అన్ని రాజకీయపక్షాల చేతిలో ఆటబొమ్మలుగా, రాజకీయచదరంగపు పావులుగా మారుతున్నాయి. ఈ విషాదవర్తమానంలో “తె” అంటే చాలు సంబరపడడానికి తెలంగాణ ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఆ అమాయకత్వమే అందరికీ పెట్టుబడి.

Share/Save/Bookmark

One Response to “తెలంగాణ “అనుకూల ప్రకటనలు” - మురిసిపోవడానికేమున్నది?”

  1. 1
    Raj Kishan Says:

    తెలంగాణ తల్లికి వందనం ……

    ఎందరో విప్లవ కారులు ….
    ఎన్నో అరిచి మూగబోయిన గొంతులు ….
    ఎన్నో ముడుచుకు పోయిన గులాబి జెండాలు …..
    ఎందరో ఆకలి తో అమరులయిన భూమి తల్లి బిడ్డలు ……….
    ఎన్నాళ్ళని ఎన్నేళ్ళని ఈ మౌనం ….
    నా కలమే నిజమయితే …… వీరులార మేలుకోండి ……… మేలుకోండి !!!!!

    జై తెలంగాణ

Leave a Reply

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

Managed by Discover Telangana Inc., a registered nonprofit organization in USA.

All opinions and views expressed by third party content providers and shown here as preview are not that of Discover Telangana.

If you find any Content that is infringing, libelous, defamatory, obscene, abusive, offensive or otherwise violation of copyright law, alert us by emailing us at discover.telangana(at)gmail.com