- ఎం.డి.మునీర్
![]()
తెలంగాణ ప్రజల బతుకులలో అంతర్భాగం సింగరేణి. 1920 డిసెంబర్ 23వ తేదిన అప్పటి నిజాం ప్రభుత్వ హైదరాబాద్ కంపెనీ యాక్టు క్రింద 1920 డిసెంబర్ 23న సింగరేణి కంపెనీ మొట్ట మొదటి సారిగా నమోదయింది. నిజానికి హైదరాబాద్ దక్కన్ కంపెనీ పేరుమీద ఉన్న బొగ్గు సంస్థనే సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్‌గా మార్చటం జరిగింది. ఇలా ఏర్పడిన సింగరేణి కాలరీస్ ఆవిర్భావ దినోత్సవాన్ని గత కొన్ని సంవత్సరాలుగా సింగరేణి సంస్థ ఏటా ఒక్కో ప్రదేశంలో పెద్ద ఎత్తున నిర్వహిస్తోంది. ఈ ఏడాది రామగుండంలో నిర్వహిస్తున్నారు. ఖమ్మం, ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్ జిల్లాల్లోని గోదావరి పరివాహక ప్రాంతంలో దాదాపు వెయ్యి కిలో మీటర్ల పరిధిలో సింగరేణి విస్తరించి ఉన్నది.
తొలినాళ్ళలో ప్రధానంగా నిజాం స్టేట్‌లోని రైల్వేలు, థర్మల్ విద్యుత్ అవసరాల మేరకు పరిమిత స్థాయిలో బొగ్గు ఉత్పత్తులు సాగేవి. బొగ్గు ఉత్పత్తిలో మానవ శ్రమ ప్రధాన పాత్ర వహించేది. తత్కారణంగా బొగ్గు గనుల కింద నిర్వాసితులు అయిన వారికి ఉపాధి హమీ ఉండేది. వారితో పాటు ఆనాటి దొరలు, దేశముఖ్‌ల దౌర్జన్యాలను భరించలేక పారిపోయి వచ్చిన నిరుపేద గ్రామీణులకు కూడా సింగరేణి ఉపాధి కల్పించేది. పరిమిత స్థాయిలో బొగ్గు తవ్వకాలు జరగటం వల్ల పర్యావరణ పరంగా కూడా నష్టం వాటిల్లేది కాదు. దీనికి తోడు తెలంగాణ సంపదను స్థానికుల అవసరాలకే వినియోగించటం వల్ల ఒక విధమయిన సమతుల్యం ఉండేది. ఆంధ్రప్రదేశ్ అవతరణతో రాష్ట్ర పరిధి విస్తరించింది. బొగ్గు అవసరాలు పెరిగాయి. ఇతర దక్షిణాది రాష్ట్రాలూ తమ బొగ్గు అవసరాలకు సింగరేణిపై ఆధారపడసాగాయి. దీంతో తెలంగాణ నల్ల బంగారం వ్యాపార వస్తువయింది.
బొగ్గు గనులూ విస్తరించాయి. విస్తరించిన మేరకు గ్రామాలు అంతరించిపోయి నూతన పారిశ్రామిక వాడలు ఆవిర్భవించాయి. సామాజిక రంగంలో పెను మార్పులు చోటు చేసుకున్నాయి. నూతన పారిశ్రామిక వర్గం, సంస్కృతి ఆవిర్భవించింది. ఉమ్మడి రాష్ట్రం పేరు మీద తెలంగాణలో తవ్వితీసిన బొగ్గును ఇతర ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన బొగ్గు ఆధారిత పరిశ్రమలకు ముఖ్యంగా థర్మల్ విద్యుత్ కేంద్రాలకు తరలించటం పెద్ద ఎత్తున కొనసాగింది. ఇలా సగటున సంవత్సరానికి ఐదు వేల కోట్ల రూపాయల విలువైన నల్ల బంగారం తెలంగాణ నుంచి తరలిపోయేది. అప్పటికీ బొగ్గు గనులలో ‘తట్టా – చెమ్మాస్’దే ప్రధాన పాత్ర. కార్మికుల సంఖ్య గణనీయంగా పెరిగి 1990 నాటికి దాదాపు 1.17 లక్షలకు చేరింది.
ఆ తరువాత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన నూతన ఆర్థిక విధానాల ఫలితంగా ప్రభుత్వ రంగ పరిశ్రమల స్వరూపం మారిపోయింది. ప్రైవేటీకరణ, అంతర్గత ప్రైవేటీకరణ, యాంత్రీకరణ, ఔట్ సోర్సింగ్ పెరిగిపోయి సంస్థ నామ మాత్రంగా మిగిలిపోయింది. ఒకప్పుడు ఉపాధి వనరుగా పేరొందిన సింగరేణిలో ఉపాధి కరువై ఉన్న ఉద్యోగులకే ఎసరు వచ్చి కార్మికుల సంఖ్య 72 వేలకు పడిపోయింది. ఉత్పత్తులు రెట్టింపైనవి. అంతో, ఇంతో ఉపాధి అవకాశాలు కల్పించే అండర్ గ్రౌండ్ గనులు క్రమంగా మూసివేతకు గురవుతుంటే పూర్తి యాంత్రీకరణ, ఔట్ సోర్సింగ్ ద్వారా నడిచే ఓపెన్ కాస్టు గనులు పెరిగిపోతున్నాయి. ఆ మేరకు పెద్ద ఎత్తున పర్యావరణ విధ్వంసం జరుగుతుంది. సింగరేణి చరిత్రలో మొదటి సంవత్సరాలలో ఈ ప్రాంతం నుంచి తవ్వి తీసిన బొగ్గుకు రెట్టింపు స్థాయి బొగ్గు గత పద్దెనిమిది సంవత్సరాలలో తవ్వితీశారంటే బొగ్గు తవ్వకాలు ఎంతో వేగవంతంగా విస్తరిస్తున్నాయో అర్థం చేసుకోవచ్చు.
విస్తరిస్తున్న నూతన బొగ్గు గనుల వల్ల నిర్వాసితులవుతున్న స్థానికుల సంఖ్య చిన్నదేమీ కాదు. ఇక కార్మికుల పరిస్థితి కూడా రోజు రోజుకు అధ్వాన్నమయిపోతున్నది. హక్కులు మృగ్యమవుతున్నా యి. కార్మికులను తగ్గించే యత్నంలో భాగంగా అణచివేత వ్యవస్థీకృతమయింది. వేధింపులు అంతకంతకూ తీవ్రమవుతున్నాయి. దీంతో జీవన పరిస్థితులు, పని పరిస్థితులు మరింత అధ్వాన్నమయిపోయి కార్మికులు తమకు తామే ఉద్యోగాలు వదులుకునే పరిస్థితి ఏర్పడింది. సంస్థలో అంతర్గత ప్రయివేటీకరణ పెరిగిపోయిన ఫలితంగా పర్మనెంటు కార్మికుల స్థానే వచ్చి చేరిన కాంట్రాక్టు కార్మికుల పరిస్థితి మరింత దుర్భరమయిపోయింది. కనీస సౌకర్యాలులేవు, కనీస పని గంటలు లేవు, సమాన పనికి సమాన వేతనం లేదు.
కనీస వేతనాలు లేవు, మొత్తంగా కాంట్రాక్టు కార్మికుల పరిస్థితి బానిసత్వమైపోయింది. స్థానిక సంపద స్థానికుల జీవితాలలో వెలుగు నింపకపోగా వాళ్ళ బతుకులను మరింత దుర్భరం చేసింది. వాళ్ళ భూములలో సంపద ఉంటే వాళ్ళ బతుకు బాగుపడలేదు. వారినే వలస కూలీలుగా మార్చి వేసింది. కటిక దారిద్య్రంలోకి నెట్టివేస్తున్నది. ఎవరయితే తరతరాలుగా సింగరేణి ప్రాంతాల్లో నివసిస్తున్నారో, ఎవరయితే బొగ్గు గనులలో రెక్కలు ముక్కలు చేసుకుంటు తమ నెత్తురు ధారవోసి బొగ్గు ఉత్పత్తి చేస్తున్నారో వాళ్ళకు బతుకు లేకుండా చేస్తున్న వాళ్లే అభివృద్ధి గురించి కబుర్లు చెబుతున్నారు! అసమాన అభివృద్ధిని రంగుటద్దాల్లో చూపించటానికి ఆర్భాటంగా సింగరేణి ఆవిర్భావ దినోత్సవాలను జరుపుతున్నారు. మూలవాసుల బతుకులలో విషం చిమ్ముతున్నారు.
(Courtesy : 23 December, 2008; AndhraJyothy Editorial)
May 20th, 2009 at 5:04 am
అన్నా!
చాలా బాగా చెప్పినవే
ఇన్క నా పని అందరికి చెప్పుడే ఈ బ్లాగు చూడుండ్రని
ఇగ ఉంటనే
మంచిది మరి