- ఇనుకొండ తిరుమలి
ముస్లింలు, తెలుగువారి సంబంధ బాంధవ్యాలు, వాటి చారిత్రక పరిణామాలను నిష్పాక్షిక వైఖరితో అర్థం చేసుకోవల్సిన సమయమాసన్నమయింది. హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో విలీనమవడంతో సకల ప్రాభవాలను కోల్పోయిన మన రాష్ట్ర ముస్లింలలో ఇటీవలి కాలంలో పెంపొందుతున్న రాజకీయ ఆలోచనల దృష్ట్యా ఈ పునః పరిశీలన ఎంతైనా అవసరం. ముస్లింలు ఒక మత సమూహంగా, పాలకులుగా ఐదు శతాబ్దాల పాటు దక్క న్/ హైదరాబాద్ రాష్ట్రంలో అంతర్భాగంగా ఉన్నారు.
ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తరువాత మాత్రమే వారు ఎక్కువగా హైదరాబాదు నగర నివాసానికి పరిమితమయ్యారు. వీరికి దాదాపు అన్ని ప్రాంతాలతో సంబంధాలుతెగిపోయాయి. కనీసం నగరంతో కూడా సంబంధం లేకుండా పోయింది. చారిత్రకంగా సాంస్కృతిక సాంఘికరంగాలలో తెలుగు వారిపై ముస్లింల ప్రభావం అపారం. గుడ్డలు కుట్టడం, దూది ఏకడం, పరుపులు కుట్టడం, వడ్రంగం, గాజులు చేయడం ద్వారా ముస్లిం చేతి వృత్తుల నిపుణులు తెలుగువారి ఆర్థిక సామాజిక జీవనంలో అంతర్భాగంగా ఉన్నారు.
ముస్లిం నవాబుల కాలంలో జిల్లాలను రాజవంశస్తుల పేర్లతో నిర్మించివాటికి మహబూబ్‌నగర్ (పాలమూరు), నిజామాబాద్ (ఇందూర్), కరీంనగర్ (ఎలగందుల)గా పునర్‌వ్యవస్థీకరించడం జరిగింది. పేరున్న పాత పట్టణాలై న వరంగల్, ఖమ్మం మెట్టు (స్తంభం ఖమ్మం)ని మార్చపోవటంలో ప్రాంతీయ సామరస్యం కనబడుతుంది. సూఫీ మత ప్రభావం కూడా వీరిపై ఎక్కువగా ఉండేది. రాజ్యాధికారం కోల్పోవడానికి, కోల్పోయిన అనంతరం అన్ని విధా లా వెనుకబడిపోవడానికి గల కారణాలను లోతుగా అన్వేషించవలసి ఉంది. ఇందుకు 19వ శతాబ్ది చివరి దశాబ్దాల నుంచి చోటుచేసుకొన్న పరిణామాల నిశిత పరిశీలనతో ఈ అన్వేషణ ప్రారంభమవవలసి ఉంది.
భారత జాతీయ కాంగ్రెస్ ఆవిర్భవించిన కాలంలో అసఫ్‌జాహీల పాలనలో ఉన్న హైదరాబాద్ సంస్థానంలో జాతీయవాదులైన ముస్లింలు చాలామంది ఉండేవారు. వారు జాతీయవాదులే కాదు సాంఘిక సంస్కరణలను ప్రగాఢం గా అభిలషించి వాటికోసం కృషి చేసినవారు కూడా. ముల్లా అబ్దుల్ ఖయాం, మహిబ్ హుసేన్, సయ్యద్ అఖిల్ మొదలైనవారు హైదరాబాద్ నగరంలో సామాజిక ఆధునికీకరణ ఉద్యమాలు చేపట్టారు. ముస్లిం ప్రజానీకంలో మూఢనమ్మకాల నిర్మూలనకు వారు కృషి చేశారు. మహిళలు బురఖాలు వేసుకోవడాన్ని వ్యతిరేకించారు. తమ కృషికి ఆలంబనగా హజర్ దస్తాన్, ముల్లిసిల్- ఇ- సాఫిక్ తదితర ఉర్దూ పత్రికలను స్థాపించి చాలాకాలంపాటు నడిపారు.
ఆధునిక విద్య, మత ప్రమేయం లేని భావాలు, కార్యాచరణ ద్వారా భారత జాతీయత పెంపొందుతుందనే విశ్వాసాన్ని ఆనాటి విద్యా వంతులలో నెలకొల్పడానికి వారు ఆ పత్రికల ద్వారా పాటు పడ్డారు. ఈ ముస్లిం ప్రముఖులు ఏటా జాతీయ కాంగ్రెస్ మహాసభలకు హాజరయ్యేవారు. కాంగ్రెస్ భావాలు, కార్యక్రమాలను హైదరాబాద్‌లో ప్రచారం చేసేవారు. కాంగ్రెస్ హిందూ పక్షపాతి అనే విమర్శలు వచ్చినప్పుడు ఈ హైదరాబాదు జాతీయవాదులు వాటిని ఖండించారు. కాంగ్రెస్ మతాతీతమైన జాతీయ సంస్థ అని వారు స్పష్టం చేశారు. సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ భావాలతో వారు ఏకీభవించేవారు కాదు. బ్రిటిష్ పాలనా విధానాలకు కాంగ్రెస్ వ్యతిరేకమని, ప్రజలు దానికి మద్దతు నివ్వాలని వారు తమ పత్రికల ద్వారా ప్రచారం చేశారు. ఖయ్యాం, హుస్సేన్, సయ్యద్ అఖిల్ ప్రభృతులు డాక్టర్ అబ్దుర్ రహమాన్‌తో కలిసి హైదరాబాద్‌లో స్వదేశీ ఉద్యమాన్ని కూడా నిర్వహించారు.
ఇప్పుడిది విస్మృత చరిత్ర. విశ్వవిద్యాలయాలు కూడా ఈ గతించిన చరిత్రపై పరిశోధనా వెలుగులు ప్రసరింపచేయడానికి శ్రద్ధ చూపక పోవడం ఎంతైనా దుదృష్టకరం. ముస్లింలు మతపరమైన సమూహమైనప్పటికీ సాంఘిక జీవనంలో మిగతా మేధావి వర్గంతో కలిసి హైదరాబాదు రాజకీయాలలో ముఖ్య భూమిక నిర్వహించారు. హైదరాబాదు మేధావి వర్గం (హిందువులు, ముస్లింలు) పరిణత భారత జాతీయ రాజకీయ మేధావులుగా దేశంలోని ఏ ప్రాంతపు మేధావులకు ఏ మాత్రం తీసిపోనివారు. తమ హైదరాబాద్ భారతదేశంలో ఒక భాగమనే భావనతో వారు మొదటి నుంచి భారత స్వాతంత్య్రోద్యమంతో సంబంధాలు పెట్టుకున్నారు. హైదరాబాద్ ముస్లింల ఈ జాతీయవాద స్ఫూర్తికి రెండు ప్రభావాలు అవరోధమయ్యాయి. మహారాష్ట్రలో బాలగంగాధర తిలక్ ఆందోళనలు మరాఠ్వాడా ప్రాంతం, హైదరాబాద్ నగరాలలోని మేధావులపై అమిత ప్రభావాన్ని చూపాయి. ఆ తరువాత తెలుగు భాష మాట్లాడేవారు తమ భాషా సంస్కృతుల పరిరక్షణకు ప్రారంభించిన ఉద్యమాలు.
ఈ ప్రాంతీయవాద (హిందూ, భాషా) రాజకీయాలు సయ్యద్ అఖిల్, అఘోరనాథ్ చటోపాధ్యయ ప్రభృతులు నిర్మించిన హైదరాబాద్ రాష్ట్ర జాతీయ రాజకీయాలకు భిన్నమైనవి. కొత్త రాజకీయాలలో మత, భాషావాదాలు ప్రాధాన్యం వహించాయి. ఈ పరిణామంతో దక్కన్ పరిపాలన ముస్లిం పరిపాలనగా, ఉర్దూ ముస్లిం భాషగా, ప్రభుత్వోద్యోగులు వేసుకొనే షేర్వాని ముస్లింల వస్త్ర ధారణ శైలి అనే నమ్మకాలు ప్రజలలో మొలకొత్తి క్రమంగా పాదుకుపోయాయి. హైదరాబాద్ సంస్థానం కూలిపోవాలనే భావనకు ఇవి ఎంతై నా ప్రోది చేశాయి. హైదరాబాద్ మతసామరస్య జీవనంలో ఈ మార్పు ఒక లోపంగా మత పండితులు ముఖ్యంగా సూఫీ సిద్ధాంతాల అనుయాయులు భావించారు. ఈ నేపథ్యం నుంచే షిరిడీ సాయిబాబా పుట్టుకొచ్చాడని చెప్పాలి.
ఆయన సూఫీ మానవతావాదాన్ని, నిరాకార దేవుణ్ణి ప్రతిపాదించి ప్రజల్లో సామాజిక ఐక్యతను, సామరస్య భావాలను ప్రచారం చేశాడు. మతసహనాన్ని బాగా ప్రబోధించాడు. సాయిబాబా మాదిరిగానే మోయిన్ అల్లాషా కూడా సూఫీ సంప్రదాయాలను బాగా ప్రచారం చేశాడు. ఆయన ఉర్దూ భాషలో రాయడం, ఉపన్యాసాలివ్వడం ద్వారా సూఫీ మతంతో పాటు ఉర్దూ భాషకు కూడా బాగా ప్రచారం కల్పించాడు. ఆయన శిష్యుడు ఇఫ్తికార్ అలీషా సాహిత్యంలో సూఫీ సిద్ధాంతాల ప్రభావం అంతగా కన్పించదు. అప్పుడే మొలకెత్తుతోన్న హిందూ-ముస్లిం విభేదాలకు ఆయన బాగా ప్రాధాన్యమిచ్చాడు. హిందువులను కాఫిర్లు (అవిశ్వాసులు- ఇస్లాంను అనుసరించని వారు), మునాఫిక్ (కపటం గలవారు)లు, ముషిరిక్ (బహుదేవతావాదులు)లని ద్వేష భావంతో చిత్రించాడు. హిందూ మత వ్యతిరేక భావాలను ప్రచారం చేశాడు.
ఇస్లాం ఔన్నత్యాన్ని ఉగ్గడిస్తూ ముస్లింలను భిన్న సమాజంగా ఏర్పరచే ప్రయత్నం చేశాడు. అలీషా తన ప్రవచనాలలో మత పరమైన రెండు భిన్న సమాజాలను, సమూహాలను సృష్టించడం జరిగింది. అలీషా ముస్లింలకు ఆరాధ్యుడైతే, సాయిబాబా హిందువులకు దైవమయ్యాడు. 1910 నాటికి హిందువులు, ముస్లింలు సాంఘికంగా, మతపరంగా భిన్న ధ్రువాలనే భావన బాగా పాదుకుపోయింది. సూఫీ మానవతావాదం ప్రభావం పూర్తిగా తగ్గిపోయింది. దీంతో హిందువులు, ముస్లింల మధ్య పూడ్చలేని ఒక అగాధం ఏర్పడింది. ఇది క్రమేణా ఉర్దూ ముస్లింల భాష అనే భావన హిందువులలో ప్రబలిపోవడానికి దారి తీసింది. అలాగే మతం, భాషలు సంకుచిత రాజకీయ అస్త్రాలుగా మారిపోయాయి.
- ఇనుకొండ తిరుమలి
(వ్యాసకర్త ఢిల్లీ విశ్వవిద్యాలయంలో అధ్యాపకులు)
హైదరాబాద్ ముస్లిం రాజకీయాలపై డా॥ తిరుమలి రాసిన రెండు విశ్లేషణాత్మక వ్యాసాలలో ఇది మొదటిది
(Courtesy: AndhraJyothy)
December 29th, 2008 at 9:04 pm
వ్యాసం బాగుంది.