- వరవరరావు
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం పార్లమెంటులో బిల్లు పెట్టాలనే డిమాండ్‌తో ప్రజా గాయకుడు గద్దర్ వరంగల్, హనుమకొండ, కాజీపేటలలో 2008, డిసెంబర్ 11 నుంచి 15 వరకు పాదయాత్ర తలపెట్టాడు. ఈ పాదయాత్రలో ఆ మూడు పట్టణాల్లో ఆయన ప్రతి గడప తొక్కి ప్రతి ఇంటిలో పౌరుల కడుపులో తలపెట్టి తన ఈ డిమాండుకు సంఘీభావం ప్రకటించాలని కోరుతానన్నాడు. ఈ విషయం రాజధాని నగరంలో, వరంగల్‌లో, పలుచోట్ల చెప్తూనే ఉన్నాడు. మీడియాలో విస్తృత ప్రచారాన్ని పొందింది. గద్దర్ వరంగల్ నగరంలో కాలు మోపితే చంపేస్తామని, ఆయన పాదం మోపే నేలకింద మందుపాతరల పెట్టి పేల్చి వేస్తామని బ్లూ టైగర్స్ పేరుతో ఒక మీడియా ప్రకటన వచ్చింది. ఈ బెదిరింపు ఎవరిచ్చినా దీని వెనుక ఉన్నది ప్రభుత్వమేననేది ప్రభుత్వానికీ తెలుసు. ప్రజలకీ తెలుసు. ఇటువంటి బెదిరింపులు ఇది మొదటిసారి కాదు. చివరిసారి కాకపోవచ్చు. ప్రభుత్వాలు ఉన్నంతకాలం, ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ప్రజా ఉద్యమకారులు గొంతెత్తినంత కాలం ఈ బెదిరింపులు ఉంటూనే ఉంటాయి.
అయితే ఇది వట్టి బెదిరింపులయితే ఎవరూ ఖాతరు చేయనక్కర్లేదు. కాని గద్దర్ విషయంలో ఈ బెదిరింపు ఒకసారి ప్రాణాంతకమయింది. పదకొండేళ్ల క్రితం 1997 ఏప్రిల్ 6న ఆయన ఇంటి మీదికి వచ్చి ఆయన గుండెల్లో గురి చూసి కాల్చారు. నాలుగు బులెట్లు తొలగించినా ఆయన వెన్నుపూస బొక్క దగ్గర ఇంకా ఒక బులెట్ మిగిలే ఉన్నది. వరంగల్‌లో డి.ఎస్.పి స్థాయిలో ఉన్న ఒక ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్ నాయకత్వంలో ఈ హంతక ముఠా వచ్చి దాడి చేసిందని లోకానికంతా తెలుసు. కాని ఇప్పటికీ ఈ హత్యా ప్రయత్నం పై ఎటువంటి దర్యాప్తు లేదు. చర్య లేదు. ఈ కేసు మూసి వేసామని కూడ ప్రభుత్వం ప్రకటించినట్లున్నది.
1997 ఏప్రిల్ 6న ఈ హత్యాప్రయత్నం జరగడానికి ముందు, ఏప్రిల్ 1న కూడా ఇటువంటి ప్రయత్నం ఒకటి జరిగింది. ఆరోజు హైకోర్టులో తీగుల్ ఎన్‌కౌంటర్‌లో అమరులయిన ఎనిమిది పీపుల్స్ వార్ సభ్యుల భౌతికకాయాల రిపోస్ట్ మార్టమ్ జరగాలని గద్దర్ నాయకత్వంలోని నక్సలైట్ మృతదేహాల స్వాధీన కమిటీ వేసిన పిటిషన్‌పై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అనుకూలమైన తీర్పు ఇచ్చాడు. అప్పటికది మూడవసారి. హైదరాబాద్ నగర పీపుల్స్ వార్ కార్యదర్శి రామేశ్వర్ ఎన్‌కౌంటర్‌తో ప్రారంభించి ఈ ఉద్యమం మొదలయింది. 1997 జనవరి – ఏప్రిల్ మధ్యలో జరిగిన అన్ని ఎన్‌కౌంటర్ల విషయంలోనూ మృతదేహాల రిపోస్ట్ మార్టమ్ గురించి, మృతదేహాలను రక్త బంధువులకు, సన్నిహిత మిత్రులకు అప్పగించడానికి సంబంధించి, ‘మృతదేహాల స్వాధీన కమిటీ’ వివిధ ప్రజా సంఘాలను, ఎ.పి.సి.ఎల్.సి ని కలుపుకుని న్యాయస్థానాల్లోనూ, బయట విశాల ఐక్య పోరాటాలు చేపట్టింది. మానవీయమైన ఈ డిమాండ్‌కు వస్తున్న స్పందనను చూసి ప్రభుత్వం దీనికి అడ్డుకట్ట వేయాలని కుట్ర చేసింది.
1997 ఏప్రిల్ 1న అప్పటి కామారెడ్డి డి.ఎస్.పి నాయకత్వంలో అరవై మంది ఒక బస్సు తీసుకొని హైకోర్టుకు వచ్చారు. అప్పటికే తీగుల్ ఎన్‌కౌంటర్ మృతుల విషయంలో రిపోస్ట్-మార్టమ్ ఉత్తర్వులు వెలువడినవి. ఈ అరవై మంది నక్సలైటు బాధితులని వీళ్లకు కూడా న్యాయం చేయాలని ప్రధాన న్యాయమూర్తిని ఆయన చెంబర్‌లో కలిసి వినతి పత్రం ఇచ్చారు. అటునుంచి ఈస్ట్ మారెడ్‌పల్లిలో కన్నబిరాన్ గారింటికి పోయారు. తాము నక్సలైటు బాధితులమని తమ గోడు వినాలని ఆయన ఇంట్లో ఆయనను చుట్టుముట్టారు. ‘నేను ఎవరి గోడయినా వింటాను గానీ ఈ నక్సలైటు బాధితులమని చెప్పుకుంటున్న వారిలో చాలామంది ఎస్.ఐ.బి వాళ్ల మొహాలను నేను పోల్చుకోగలను. కనుక వాళ్లు బయటికి పోతే తప్పకుండా ఆలకిస్తా’నన్నాడు. దానితో అందరూ బయటికి వెళ్లిపోయి భూదేవినగర్ (వెంకటాపురం) చేరారు.
గద్దర్ ఇంట్లో లేడు. విమల చెప్పింది. బూతులు తిట్టారు. బెదిరించారు. ఇక్కడ దాచుకోకుండానే తాము నక్సలైట్ బాధితులం మాత్రమే కాదని కూడా చెప్పారు. చేయవలసినంత హంగామా చేసి భయభీతావహాలు కల్పించే ప్రయత్నం చేసి వెళ్లిపోయారు.
ఈ విషయాలన్నీ మర్నాడు మీడియాలో వచ్చాయి. బెదిరింపులు కేవలం బెదిరింపులుగా ఆగిపోలేదు. ఐదు రోజులకే ఆయనపై హత్యా ప్రయత్నం ఏప్రిల్ 6న జరిగిందని చెప్పడానికే ఈ ఉదంతాలను జ్ఞాపకం చేయడం.
ఆ తర్వాత ఆయనకు ఎన్నో సందర్భాల్లో ఇటువంటి బెదిరింపులు వచ్చాయి. వరంగల్ నుంచే వచ్చిన బెదిరింపు లేఖపై దర్యాప్తు జరిపి రాసిన వ్యక్తిని అరెస్ట్ చేసి కూడా పెట్టారు. కాని చర్యలేదు. ఆరు నెలల క్రితం టి.ఆర్.ఎస్ నాయకులకు గద్దర్‌ను చంపుతామన్న బెదిరింపు లేఖ వచ్చింది. వాళ్లు హోంమంత్రి దృష్టికి తెచ్చారు. ఇంతవరకు ఎటువంటి దర్యాప్తులేదు. చర్యలేదు.
1997 డిసెంబర్ 29, 30 తేదీల్లో వరంగల్‌లో ప్రజాస్వామిక ప్రత్యేక తెలంగాణ సదస్సు జరిగినప్పుడు (అప్పటికి ఆయనపై హత్యా ప్రయత్నం జరిగి ఎనిమిది నెలలు మాత్రమే గడిచింది. వెన్నులో బులెట్ గాయం పచ్చిగానే ఉన్నది) ఢిల్లీలో చికిత్స చేయించుకొని నేరుగా ఆ సదస్సుకే వచ్చాడు.
‘నీ పాటనయి వస్తున్నానమ్మా‘ అని పాట రాసింది అప్పుడే. ఆ సదస్సులోను, బహిరంగ సభలోను “గద్దర్ పాల్గొంటే బహిరంగ సభ వేదిక కింద మందుపాతర పెట్టి పేల్చివేస్తామని” ఇటువంటి బెదిరింపు ప్రకటనలే వచ్చాయి. అయితే గద్దర్‌తోపాటు, ఇతర వక్తలతో పాటు నేను కూడా ఆ వేదిక మీద ఉంటాను. “పేల్చి వేస్తే, పేల్చి వేయండి చూస్తాను” అని ప్రజాకవి కాళోజీ ప్రకటించాడు. హనుమకొండ ములుగు రోడ్ నుంచి జూనియర్ కాలేజీ గ్రౌండ్స్ వరకు వేలాదిమందితో ఊరేగింపు సాగి, విశాలమైన జూనియర్ కాలేజీ మైదానంలో మూడు లక్షల మందితో బహిరంగ సభ జరిగింది. ఆ వేదిక మీంచి మళ్లీ ప్రజాకవి కాళోజీ ప్రకటించాడు “ఇదుగో ఈ వేదిక మీద గద్దర్‌తో పాటు నేను నిలబడి ప్రత్యేక తెలంగాణ డిమాండ్‌ను ప్రకటిస్తున్నాను. వేదిక కింద మందుపాతర పెట్టారో, మా మీద బాంబులు వేస్తారో – ఏం చేసినా మేం సిద్ధమే” అని.
బెదిరింపులకు, దాడులకు పదకొండేళ్లు గడిచినవి. గద్దర్ మీద 1997 ఏప్రిల్ 6న హత్యాప్రయత్నం జరిగినప్పుడు సుందరయ్య విజ్ఞాన భవన్ వెలుపల జరిగిన సభలో ప్రతి ఒక్కరు ఆయనపై దాడి వెనుక మూడు కారణాలు ఉన్నట్లు ముక్తకంఠంతో విశ్లేషించారు. ఆయన నక్సలైట్ మృతదేహాలను వారి బంధుమిత్రులకు అప్పగించాలన్న ఒక మానవీయమైన డిమాండ్‌తో సంఘీభావ కమిటీ అనే ఒక ఐక్య విశాల కార్యాచరణకు నాయకత్వం వహిస్తున్నాడు.
అప్పటికే భోనగిరి సభలో ప్రత్యేక తెలంగాణ డిమాండ్‌ను ముందుకు తెచ్చిన శక్తులకు నాయకత్వం వహించాడు.
కారంచేడు, చుండూరులలో దళితుల హత్యాకాండను ఖండిస్తూ గళమెత్తాడు.
గద్దర్ గాయకుడు మాత్రమే కాదు, నాయకుడు కూడా అవుతున్నాడని ప్రభుత్వం భయపడుతున్నది అని.
తేడా అల్లా అప్పుడు అది చంద్రబాబు తెలుగుదేశం ప్రభుత్వం. ఇప్పుడిది వైఎస్‌ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం.
రెండు ప్రభుత్వాల కాలంలోను ఎన్‌కౌంటర్లు ఉన్నాయి. ఎన్‌కౌంటర్ జరిగిన ప్రతిసారీ మృతదేహాల రిపోస్ట్-మార్టమ్ కోసం, రక్త బంధువులకు అప్పగించడం కోసం ఒక పోరాటమే చేయాల్సి వస్తున్నది. కాకపోతే ఇందుకు ‘అమరుల బంధుమిత్రుల సంఘం’ వంటి రాష్ట్ర వ్యాప్త సంస్థ ఒకటి ఏర్పడి పౌర, ప్రజాస్వామిక హక్కుల సంఘాల, వ్యక్తుల సహకారంతో ఆ డిమాండ్‌లకు హైకోర్టు నుంచి కొంత సాధికారతను సాధించింది.
ప్రజాస్వామిక ప్రత్యేక తెలంగాణ డిమాండ్ – ప్రజా సంఘాలకు, ఉద్యమాలకే పరిమితమైనా, ప్రత్యేక తెలంగాణ డిమాండ్ మాత్రం కాంగ్రెస్ మినహా అన్ని రాజకీయ పార్టీల డిమాండ్ కూడా అయింది. ఇందులో ఏ రాజకీయ పార్టీ చిత్తశుద్ధి ఎంతటిదో ప్రజానీకానికి స్పష్టంగానే తెలుసు.
చంద్రబాబు నాయుడు ప్రభుత్వ కాలంలో తెలంగాణ అనే మాట శాసనసభలో ఉచ్చరించడానికి వీలులేదని శాసించాడు. 2004 ఎన్నికలు – 1) ప్రపంచ బ్యాంక్ అభివృద్ధి నమూనాకు; 2) నక్సలైట్ పట్ల తన వైఖరికి; 3) ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర డిమాండ్‌కు రిఫరెండం అన్నాడు. కాంగ్రెస్ – టి.ఆర్.ఎస్ పొత్తుగానీ, ఇతర ప్రతిపక్షాలుగానీ ఈ సవాల్‌ను రెఫరెండం గానే స్వీకరించాయి.
బి.జె.పి ఒక ఓటు రెండు రాష్ట్రాలు అని కాకినాడలో తీర్మానం చేసి కేంద్రంలో అధికారానికి వచ్చి తనకు బయటి నుంచి మద్దత్తు ఇస్తున్న టి.డి.పి వ్యతిరేకిస్తున్నదని ప్లేటు ఫిరాయించింది. లాలూ ప్రసాద్‌ను బలహీనపరచడానికి జార్ఖండ్‌ను, కాంగ్రెస్‌ను బలహీనపరచడానికి చత్తీస్‌ఘడ్‌ను, బి.జె.పి కి అధికారం వస్తుందనే అంచనాతో ఉత్తరాంచల్‌లోను, ఆ సమయంలో ఏ ఉద్యమాలు లేకున్నా ఏర్పాటు చేసింది. ఇప్పుడు కేంద్రంలో అధికారానికి వస్తే లోకసభలో తెలంగాణదే మొదటి తీర్మానం అవుతుందని అంటున్నది గానీ గుజరాత్ నుంచి ఒరిస్సా వరకు, చివరకు భైంసా, వటోలీలలో అది చూపిన ఫాసిస్ట్ హిందుత్వ మొహంతో ఆ వాగ్దానం వినడానికే వికటాట్టహాసంగా ఉన్నది. మాలెగాఁవ్ పేలుళ్లలో ప్రజ్ఞాసాధ్వీ, పురోహిత్ వంటి సైనిక ఇంటెలిజెన్స్ అధికారి చర్యలు కుట్రలు చూస్తే ఫాసిస్ట్ లు మాత్రమే కాదు ఉగ్రవాదులుగా కూడా మారిన సంఘ్‌పరివార్ శక్తుల ప్రత్యేక తెలంగాణ ప్రేమ భస్మాసుర హస్తమే అవుతుందని తెలంగాణ శక్తులను హెచ్చరించాల్సి ఉన్నది.
టి.ఆర్.ఎస్ రాష్ట్రంలోను, కేంద్రంలోను అధికారంలో ఉన్న కాలంలో తెలంగాణ రాష్ట్ర సాధన కోసం చేసిందేమీ లేదు. ఇప్పటికీ లాబీయింగు మీద, ఎన్నికల పొత్తుమీద ఉన్న యావ ఉద్యమాల మీద లేదు. సి.పి.ఐ, సి.పి.ఎం లు టి.డి.పి, కాంగ్రెస్ ప్రభుత్వాలను బలపరిచిన పార్టీలే.
అంతకన్న ముఖ్యం అధికారంలో ఉండగా, కాంగ్రెస్, బిజెపిలు మాత్రమే కాదు టిడిపి, టిఆర్‌ఎస్ లు సిపిఐ, సిపిఎం లు కూడా పూర్తిగా సామ్రాజ్యవాద ప్రపంచీకరణను బలోపేతం చేసినవి, అమలు చేసినవి.
కనుక ప్రజాస్వామిక ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి వీటి నుంచి ఆశించగలిగిన భరోసా ఏమీ లేదు.
నవ తెలంగాణ పార్టీ నాయకుడు దేవేందర్ గౌడ్ ఇరవై ఏళ్లు టిడిపిలో రెవెన్యూ, హోంశాఖలు నిర్వహించాడు. పోలిట్‌బ్యూరోలో ఉన్నాడు. రెండవ స్థానంలో ఉన్నాడు. ఇవ్వాళ ఏ గర్జనలు చేసినా అది ప్రజాస్వామిక పరివర్తన మాత్రం కాజాలదు.
ఇవ్వాళ ప్రజారాజ్యం పార్టీ పెట్టిన చిరంజీవి ఇప్పటిదాకా ఏ ప్రభుత్వంలో లేకపోవచ్చు. కానీ సినీ పరిశ్రమలో ఆయనకున్న స్థానాన్ని బట్టి ఆయన రాజ్య సంస్కృతిలో భాగమే. ఆయన కూడ సామ్రాజ్యవాద ప్రపంచీకరణకు అనుకూలుడే అనడానికి ఆయన ఎంచుకున్న నమూనా చాలు.
కనకు బెదిరింపులు, దాడులనుంచి గద్దర్‌నే కాదు తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ప్రజాస్వామిక ఆకాంక్షలను కాపాడుకోవడానికి ప్రజాస్వామిక శక్తుల విశాల ఐక్య సంఘటనయే సరియైన హామీ.
(సౌజన్యం: వరవరరావు వెబ్‌సైట్ 11.12.2008)
- ఆంధ్రజ్యోతిలో అచ్చు అయిన “విశాల ఐక్య సంఘటన కావాలి! వ్యాసానికి” మూలం ఈ వ్యాసం.