- మహమ్మద్ షఫీయొద్దీన్, దేవాత్ సురేష్
తమ ప్రాంత వెనుకబాటుతనాన్ని రూపుమాపడానికి ఎవరైనా ఉద్యమించవచ్చు కాని, మరో ప్రాంత ఆకాంక్షలకు పోటీగా వాదనలు తేవడం సరికాదంటున్నారు మహమ్మద్ షఫీయొద్దీన్, దేవాత్ సురేష్
అభివృద్ధికి నోచుకోలేక, పాలకుల నిర్లక్ష్యానికి గురై, పేదరికంతో బాధపడుతూ, తాగు, సాగు నీటికి సకల ఇబ్బందులు ఎదుర్కొంటూ నిధుల పంపిణీలో సమాన వాటా రానందుకు ప్రత్యేక రాయలసీమ రాష్ట్రం ఏర్పాటును కోరుకుంటున్నామని రాయలసీమ నాయకులు ప్రకటిస్తే అందులో అర్థం పరమార్థం ఉన్నాయి. అలా కాకుండా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేస్తే మాకు కూడా రాయలసీమ ప్రత్యేక రాష్ట్రం కావాలి అనే వాదన కేవలం తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర నినాదాన్ని నీరుకార్చడానికి మాత్రమే కొందరు స్వార్థపూరిత రాజకీయ నాయకులు తెరమీదికి తెస్తున్నారనేది తెలంగాణ గడ్డపై పుట్టిన సగటు పౌరునికి సైతం అర్థమయిపోయింది.
పైగా తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడితే, ఆంధ్ర ప్రాంతం వారితో కలిసి సహవాసం చేయడం మరింత కష్టమవుతుంది అనే రాయలసీమ ప్రాంతం వారి వాదన మరీ వింతగా, విడ్డూరంగా ఉంది. ఈ వాదన రాయలసీమ, ఆంధ్రప్రాంతాలు రెండు కలిసి తెలంగాణ ప్రాంతాన్ని దోచుకోవడానికి, ఇక్కడున్న వనరులను తరలించుకోవడానికి చేసే వాదన తప్ప మరేది కాదు. ఆంధ్రా, రాయలసీమ ప్రాంతాలు కలిసి ఉండటానికి లేక విడిపోవడానికి తెలంగాణ ప్రాంతానికి ఎలాంటి సంబంధం లేదు. అయినా ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర వాదన నినాదం ఈ రోజు కొత్తగా పుట్టుకొచ్చింది కాదు. కొంతమంది స్వార్థపూరిత రాజకీయ నాయకులు పబ్బంగడుపుకోవడానికి ఆవిర్భవించింది కాదు. 1969లో అంటే ముప్పై తొమ్మిది సంవత్సరాల క్రితం తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం ఉవ్వెత్తున నింగికెగసి, ఒక్కసారిగా కనుమరుగయిపోయిన విషయం. ఆనాడు ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమాన్ని నీరు కార్చడానికి తెలంగాణ ప్రాంత రాజకీయ నాయకులు, కొంతమంది స్వార్థ రాజకీయ నాయకులకు అమ్ముడుపోయారన్నది చారిత్రక సత్యం. కాని ప్రత్యేక రాయలసీమ రాష్ట్ర ఉద్యమం ప్రారంభమయింది ఇటీవలనే అనేది మరచిపోరాదు. 1956లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ సందర్భంగా తెలంగాణ ప్రాంతంలోని కొంతమంది నాయకుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని తెలంగాణ పేద ప్రాంతాన్ని ధనిక ఆంధ్రప్రాంతంతో విలీనం చేయడం తెలంగాణ ప్రాంత అభివృద్ధికి ఆటంకమని ఆనాటి ప్రధాని నెహ్రూ అన్నారు.
మొదట ఆంధ్రరాష్ట్ర రాజధానిగా కర్నూలును, తరువాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణతో రాజధానిగా హైదరాబాద్‌ను ప్రకటించారు. అప్పటి రాయలసీమ నాయకులు కర్నూలును రాజధానిగా కొనసాగించవలసిందిగా ఎందుకు పట్టుబట్టలేదో తెలియాలి? ఆంధ్ర ప్రాంతంవారు కూడా విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు లాంటి పట్టణాలను రాజధానిగా చేయాలని ఎందుకు కోరలేదు. ఈ రాజకీయా లన్ని కూడా తెలంగాణ ప్రాంతంపై ప్రేమతో చేసినవి మాత్రం కావు. హైదరాబాద్‌ను రాజధానిగా చేసుకొని మిగతా తెలంగాణ ప్రాంతాన్ని తమ అవసరాలకు వినియోగించుకుందామనే కుట్రలో భాగంగా, ఆనాటి నిజాం ప్రభువులు అనేక కట్టడాలు, చెరువులు, దేశంలోనే ప్రధాన నగరాలకు ధీటుగా హైదరాబాద్ నగరాన్ని నిర్మించారు. ఈ నగరంపై రాయలసీమ, ఆంధ్ర ప్రాంతంవారి దృష్టిపడింది. ఆ అభివృద్ధిని సొమ్ము చేసుకోవాలని, హైదరాబాద్‌ను అడ్డాగా చేసుకొని మిగతా తెలంగాణ ప్రాంతాన్ని తమ అవసరాలకు గరిష్ఠ స్థాయిలో వినియోగించుకోవాలనే కుట్రలో భాగమే ఆనాటి మౌనానికి కారణం కావచ్చు. రాయలసీమ ప్రాంతంలో తాగు, సాగునీటి సమస్యను పరిష్కరించడానికి ఉమ్మడి నిధులతో ‘తెలుగుగంగ’ పథకాన్ని కోట్లాది రూపాయల ఖర్చుతో పూర్తి చేసిన సందర్భంగా తెలంగాణ నాయకులు అభిమానంతో ఆప్యాయతతో సోదరభావంతో తాగు, సాగునీటి అవసరాలు తీర్చాలనే ఉద్దేశ్యంతో సహకరించారు. కాని తెలంగాణ నాయకులు స్వార్థపూరితంగా ఆలోచించి ఉంటే ఆనాడే తెలుగుగంగకు అడ్డుకట్ట వేసి రాజకీయం చేసేవారు.
నీలం సంజీవరెడ్డి, నారా చంద్రబాబునాయుడు, వై.ఎస్. రాజశేఖరరెడ్డి మొదలైనవారు అటు కేంద్రంలో, ఇటు రాష్ట్రంలో కీలక స్థానాల్లో ఉండి చాలా సంవత్సరాలు రాష్ట్రానికి తమ పరిపాలనను అందించారు, అందిస్తున్నారు కూడా. వీరందరు కూడా రాయలసీమ ప్రాంతం వారే. వీరి పాలనకు తెలంగాణ ప్రజలు ప్రాంత భేదాల్ని మరిచిపోయి సంపూర్ణ మద్దతును ఇచ్చారు. ఈ విషయాన్ని రాయలసీమ నాయకులు కాదని చెప్పగలరా? వీరందరు కీలక పదవుల్లో ఉండగా రాయలసీమ ప్రగతికి వీరు మాత్రం సహకరించలేదని రాయలసీమ నాయుకులు చెప్పగలరా? ప్రస్తుత ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖరరెడ్డి రాయలసీమ ప్రాంతానికి చెందినవారే అయినా తెలంగాణ ప్రజలు వై.ఎస్. రాజశేఖరరెడ్డికి నీరాజనాలు పట్టలేదని రాయలసీమ నాయకులు బాహాటంగా చెప్పగలరా?
తెలంగాణ ప్రాంతం నుండి రాజకీయ రంగంలో ఉన్నత శాఖలకు ఎదిగిన ఏకైక వ్యక్తి పి.వి. నర్సింహారావు. ఈయన ప్రధాని అయిన తరువాత తెలంగాణ ప్రాంతంలోని తను పుట్టిన గడ్డ అయిన కరీంనగర్ జిల్లాను మరిచిపోయి రాయలసీమ ప్రాంతంలోని నంద్యాల నుండి పోటీ చేసిన విషయం వాస్తవం కాదా? మీ ప్రతినిధిగా నంద్యాల నుండి ఎన్నికై సీమ సందులన్నీ సుందరంగా మార్చిన సందర్భాన్ని రాయలసీమ నాయకులు కాదనగలరా?
రాయలసీమ ప్రాంతం నుండి పుట్టుకొచ్చిన నాయకుడు నారా చంద్రబాబునాయుడు రాష్ట్రానికి తొమ్మిది సంవత్సరాల పాలన అందించారు. వియ్యాలు, కయ్యాలతో దగ్గరి సంబంధాలు కలిగి ఉన్న రాయలసీమ, కోస్తా ప్రాంత రాజకీయ నాయకులు తెలంగాణ ప్రాంతం వేరు పడితే మేము వేరు పడతామని ప్రకటించటం కేవలం దురుద్దేశ పూర్వకమైనదిగా తేటతెల్లమవుతోంది.
తెలంగాణ ఉద్యమ చరిత్రలో ఏనాడు కూడా రాయలసీమ పదం ఉచ్చరించలేదు. ఆంధ్ర వలసవాదుల దోపిడీతో తెలంగాణ తల్లడిల్లి పోతోందని మాత్రమే తెలంగాణ ప్రజలు నినదించారు. ఇప్పటికీ అదే నినాదానికి కట్టుబడి ఉద్యమాన్ని కొనసాగిస్తున్నారు. ఈ వాదన నిజం కాదు అని కోస్తా ప్రాంతం వారు ముందుకు రాగలుగుతారా? ఒకవేళ అదే నిజమైతే మనం వేరుగా ఉందామన్న వాదన, కోస్తా ప్రాంతం వారి నుండి రావాలి? ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర వాదన ఆంధ్ర ప్రాంత ప్రజలకు కోపం తెప్పించడం లేదు. కాని రాయలసీమ నాయకులకు చిరాకు కలుగుతోంది.
రాయలసీమలో ఉన్నవి నాలుగు జిల్లాలు మాత్రమే. కోస్తాలో ఉన్నవి తొమ్మిది జిల్లాలు మాత్రమే. కాని తెలంగాణలో ఉన్నవి పది జిల్లాలు. ఈ పది జిల్లాలకు ప్రత్యేక రాష్ట్రం కోరితే చిన్న రాష్ట్రాలు దేశానికి అనారోగ్యం అని వాదించిన రాయలసీమ నాయకులు కేవలం నాలుగుజిల్లాల కోసం ప్రత్యేక రాష్ట్రం కోరడం ఎంతవరకు సమంజసంగా ఉందో వారే వివరించాలి? తెలంగాణ ప్రాంత ప్రత్యేకవాదంతో నాయకులు ఎన్నికల్లో పోటీ చేసి ప్రజల అభిప్రాయాన్ని అడిగారు. ఎన్నికల్లో ప్రత్యేక తెలంగాణ వాదానికి ప్రజలు నీరాజనాలు పలికారు. కాని రాయలసీమ ప్రత్యేక రాష్ట్ర వాదంతో ఎప్పుడయినా రాయలసీమ నాయకులు ఎన్నికల్లో పోటీ చేశారా? ప్రజల తీర్పును కోరారా?
ప్రగతిపరంగా చూస్తే రాయలసీమలో నాలుగు జిల్లాలకే ఐదు విశ్వవిద్యాలయాలున్నాయి. 1) శ్రీ వెంకటేశ్వర, 2) శ్రీ కృష్ణదేవరాయ, 3) ద్రవిడ, 4) యోగివేమన, 5) పద్మావతి మహిళా మొదలైన విశ్వవిద్యాలయాలు ఉన్నాయి. కాని పది జిల్లాలు గల తెలంగాణకు మాత్రం ఆరు విశ్వవిద్యాలయాలే ఉన్నాయి. 1) ఉస్మానియా, 2) కాకతీయ, 3) తెలంగాణ, 4) పాలమూరు, 5) శాతవాహన, 6) నల్లగొండ. అందులో ఒక విశ్వవిద్యాలయం రాష్ట్ర రాజధానిలో ఉండి అన్ని ప్రాంతాల విద్యార్థులకు అవకాశాలు కల్పిస్తున్నది. తెలంగాణ, పాలమూరు, శాతవాహన, నల్లగొండ మొదలైన విశ్వవిద్యాలయాలు తెలంగాణ ఉద్యమ ఫలితంగా ఏర్పడినవి. ఇటీవలనే ఏర్పాటు చేసిన ఈ విశ్వవిద్యాలయాలకు కేటాయించిన నిధులలో కూడా వివక్ష కండ్లకు కట్టినట్టు కనిపిస్తోంది.
నాటి నీలం సంజీవరెడ్డి మొదలుకొని నేటి వై.ఎస్. రాజశేఖర రెడ్డి వరకు ఆంధ్రప్రదేశ్‌ను పరిపాలించినది రాయలసీమ ప్రాంత నాయకులే కదా? వారి ప్రాంత ప్రగతిని మరిచిపోయినందుకు నాయకులను నిలదీయవలసిన అవసరం రాయలసీమ ప్రాంత ప్రజలకు ఉంది. కాని ఇదంతా మరిచిపోయి ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయంలో ఎందుకు కాలు అడ్డు పెడుతున్నారో వారికే అర్థం కావాలి. రాయలసీమ ప్రాంతం రాళ్లతో నిండిపోయి, కరువుతో ఎండిపోయి ఉందన్న వాస్తవాన్ని అందరు గుర్తిస్తారు. కాని ఆ రాళ్లనే దేవుళ్లుగా మలచుకొని, ఆంధ్రప్రదేశ్ నలుమూలల నుండి భక్తులను ఆకర్షిస్తూ, ధనం సంపాదిస్తున్న శ్రీశైలం, తిరుపతి, శ్రీకాళహస్తి, మంత్రాలయం, పుట్టపర్తి, హర్స్‌లీహిల్స్, బ్రహ్మంగారి మఠం, అవుకు, అహోబిలం, కాణిపాకం, లేపాక్షి మొదలైన వాటిలోనుండి ఎవరికి ఎంత ఖర్చు పెడుతున్నారో రాయలసీమ నాయకులకు, పాలకులకు మాత్రమే తెలుసు. ఏనాడు కూడా వాటా అడిగే పాపానికి తెలంగాణ ప్రజలు దిగజారలేదు. దేవాలయాల పేరుతో కోట్లాది రూపాయలను సమీకరించి రాయలసీమ ప్రాంతం వారు మాత్రమే ఉపాధి సౌకర్యాలను పొందుతున్నారని తెలంగాణ ప్రజలు ఏనాడు బాధపడలేదు.
తెలంగాణలోని బాసరలో గల సరస్వతి దేవాలయం దేశంలోనే రెండవది, ప్రధానమైనది. ఇక్కడ ఐఐటి స్థాపిస్తే తిరుపతిని మించి పోతుందనే దురుద్దేశంతో, తెలంగాణ ప్రజలు ఉపాధిని, ఆదాయాన్ని పొందుతారనే స్వార్థంతో రాయలసీమ ప్రాంత నాయకులకు అనుకూలంగా ఉండే మెదక్ జిల్లాలో పెట్టడానికి ప్రణాళిక వేశారు. మరోవైపు తెలంగాణ ప్రజలను విభజించి పాలించడానికి కుట్రపన్నారు.
రాయలసీమ, తెలంగాణ రెండు ప్రాంతాలూ అభివృద్ధికి నోచుకోని ప్రాంతాలే. ఈ రెండు ప్రాంతాలవారు గొడవ పడితే మధ్యలో కోస్తా ఆంధ్ర ప్రాంతం వారు బాగుపడతారు. ఈ వైరాన్ని ఇలాగే కొనసాగేలా ఆంధ్ర ప్రాంత నాయకులు తమ వ్యూహాన్ని రచిస్తారు. కాబట్టి తెలంగాణ, రాయలసీమ ప్రాంత నాయకులు ఒకరి ఉద్యమానికి మరొకరు అడ్డు రాకుండా ఉద్యమాన్ని కొనసాగించినట్లయితే ఇరువర్గాలకు మంచి జరుగుతుంది.
(ఫిబ్రవరీ 2009 వీక్షణం, సౌజన్యం తోటి)
April 14th, 2009 at 10:32 pm
ఎంటీఆర్ పాలనకాలంలో తెలుగు గంగను తెలంగాణవాళ్ళు ఎందుకు వ్యతిరేకించలేదంటే తెలంగానవాళ్ళు ఐకమత్యంతో లేరు,ఉద్యమం నడుస్తలేదు.ఉద్యమం నడిచే కాలంలోనే ఎక్కడ ఏకారణంగా తమను అరెస్టు చేస్తే ఎవరన్న విడిపిస్తరా అనే సందేహంతోనే చాలామంది తెలంగాణావాళ్ళు భయపడుతున్నారు. ఎంటీఆర్ పైన తెలంగాణవాళ్ళకు కూడ ఎంతో అభిమానం ఉండేది , ఆకారణంగా ఆయనచేసే ప్రతిపనిని సమర్ధించేవారే ఎక్కువ.ఇప్పుడు తెలంగాణలోని వయ్యెస్ భక్తులుకూడా తెలంగాణీయులకు వ్యతిరేకంగా చేసే ఏపనిని కూడా వ్యతిరేకించరు. పోగా విమర్శించిన వాళ్ళనే కొట్టకొట్టొస్తుంటరు,ఆయనమీద ఈగ వాలనియ్యరు. తెలంగాణనాయకుల ఇటువంటి మద్ద్తతుతోటే ఇతర ముఖ్యమంత్రులు సజావుగా తమ కాలాన్ని పూర్తి చెయ్యగలుగుతున్నారు.తమకు వ్యక్తిగతమైన పనులు చేసిపెట్టి,అదాయ వనరులు చూపించే ఇతర ప్రాంత ముఖ్యమంత్రులకు తెలంగాణ నాయకులు తెలంగాణ ప్రయోజనాలను ఫణంగా పెట్టడమ్ వల్ల తమకు దక్కిన లభాలను చూసుకొని మురిసిపోతూ కుక్కమాదిరి విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నారు.
ఇక పీవీ నర్సింహా రావు గారు పైకి వచ్చిన విషయంలో ఇతర ప్రాంతీయుల సహకారం ఎంతమాత్రం లేదు. సహకరించక పోగా , సుప్రీంకోర్టు ముల్కీనిబంధనలను చెల్లుతాయని తీర్పు ఇచ్చిన సందర్భంగా పివి హర్షం వ్యక్తం చేసినందుకే ముఖ్యమంత్రి పదవిని కోల్పోవాల్సి వచ్చింది. ఆయన తన జీవిత కాలంలో మళ్ళీ తెలంగాణ ఊసెత్తనిదీ,తన ప్రాంతానికి ఏమీ చెయ్యనిదీ,తన వాళ్ళను దగ్గరికి రానియ్యనిది,తెలంగాణ నాయకులను చేరదియ్యనిది అందుకే. తెలంగాణను పట్టుకుంటే తనే పైకి రాలేనని తె-కు దూరంగా ఉన్నాడు. ఆంధ్ర నాయకులు వేగుల మాదిరిగా పనిచెయ్యడం , లాబీయింగ్ చెయ్యడం ముఖ్యమంత్రిగా ఉన్న చెన్నారెడ్డే తట్టుకోలేక పొయాడని , తన ఆంతరంగికుల వద్ద ఆవిషయం అతి గోప్యంగా ప్రస్తావించాడని తెలిసింది. దానికి తోడు ఎప్పటికప్పుడు తెలంగాణలోని రెడ్డి-రావుల,బ్రాహ్మల,తురకల్ మధ్యనున్న చిన్నచిన్న వైరుధ్యాలను ఆంధ్ర-సీమల నాయకులు ఎక్స్ ప్లాయిట్ చేశారు, తమకనుకూలంగా మలుచుకున్నారు.
మీరు(ఈవ్యాస రచయితలు) తెలిపిన అంశాలు కొన్ని చూసి తెలంగాణవాళ్లు ఆంధ్రతో విడిపోయినా సీమతో కలిసి రాష్ట్రంగా ఉందామనే ఆలోచనకు వచ్చే ప్రమాదముంది. తమ రాయలసీమ ఫాక్షన్్ సంస్క్రుతితో ఎట్లా భూములను కబ్జా చేసుకుంటారు,ప్రజల మధ్యన వస్తుండే సమస్యలను సెట్టిల్్ చేస్తారో గత ఐదేళ్ళ కాలంలో ప్రత్యక్షంగా చూశాము. వాళ్ళలో వాళ్ళకు ఎన్ని కొట్లాటలున్నా తెలంగాణతో ఏవివాదం తలెత్తినా అన్నదమ్ములము మేము నూటైదుగురము అనే తీరుగా వ్యవహరిస్తుంటారు అనేది అనభవైకవైద్యము . కనుక వారితో కూడా మనం వేగలేము. తెలంగాణ్ వాళ్ళు కలిసుండగలిగేది ఉత్తరాంధ్రలో ఉన్న వెనకబడిన ప్రాంతీయులతో మాత్రమే, కాని అదికూడా భౌగోళికంగా సాధ్యం కాదేమో.