- పి.వరలక్ష్మి
‘ఈత గురించి ఎన్ని పుస్తకాలు చదివినా ఈత రాదు. ఈత రావాలంటే నీళ్లలోకి దిగాల్సిందే. అట్లాగే కథ గురించి ఎన్ని ఉపన్యాసాలు విన్నా, ఎన్ని పుస్తకాలు చదివినా కథ రాయడం రాదు. కథ రాసి చర్చిస్తేనే అది సరిగ్గా అర్థమవుతుంది’ అన్నారు అల్లం రాజయ్య కథా వర్క్‌షాపుల ఉద్దేశాన్ని వివరిస్తూ. సరిగ్గా ఇదే పని చేస్తూ వస్తున్నది విరసం. 2007 నుండి ప్రతి మూన్నెళ్లకోసారి కథకుల సమావేశాలను రూపకల్పన చేసి ఇప్పటికీ అమరావతి, అనంతపురం, షాద్ నగర్, ప్రొద్దుటూరు, హనుమకొండ, కర్నూలు చుట్టివచ్చింది. ఈ ఆరు మజిలీల్లో నలభైకి పైగా వచ్చిన కథల నుండి పద్దెనిమిది కథల్ని ఎంపిక చేసి ‘కథల పంట’గా తీసుకొచ్చాం. తెనాలి విరసం సాహిత్య పాఠశాలలో దీనిని ఆవిష్కరించాం. కర్నూలు తర్వాత మా కథలబండి ఫిబ్రవరి 20కి కరీంనగర్ చేరుకుంది.
ఎప్పటిలానే మూడురోజులపాటు కథకులు చదివి వినిపించిన 18 కథల మీద చర్చ జరిగింది. అవి ఇంచుమించు రాష్ట్రం నలుమూలల నుండి వచ్చిన కథకుల విభిన్న జీవిత నేపథ్యాల నుండి, అనుభవాల నుండి రాసిన కథలు కావడంతో విస్తృతమైన సామాజిక జీవనాన్ని విభిన్నమైన శిల్పరీతులతో అనుభూతి చెందే అవకాశం కలిగింది. కుటుంబ సంబంధాలు, వృద్ధాప్య సమస్యలు, ముస్లింలపై సామాజిక, సాంస్కృతిక అణచివేత, పాలమూరు వలస, సెజ్ సెగలు, తెలంగాణ ఆకాంక్ష, ప్రపంచీకరణ దుష్ఫలితాలు, నేతకారుల జీవన సంక్షోభం, సామాజిక సంక్షోభం-అసహజ మరణాలు, ఆత్మహత్యలు, విప్లవోద్యమం చిగురింపచేసే ఆశలు, వికసించే త్యాగాలు, అన్ని మానవీయ రూపాల్ని చిదిమేసే రాజ్యం దుర్మార్గం.. ఇలా అన్నీ కథల రూపం ధరించి కరీంనగర్‌లో ఆవిష్కరించబడ్డాయి.
వీటితోపాటు స్త్రీవాద రచయిత్రి నియమచంద్ర రాసిన ఓ కన్నడ కథకు నలిమెల భాష్కర్ తెలుగు అనువాదం ‘మళ్లీ జీవితంలోకి’ కూడ చదివి చర్చించాము. ఆనవాయితీ అయిన సాహిత్య ప్రసంగం ఈసారి సంపత్‌రావు చేశారు. ఒకే అంశం మీద ప్రపంచ సాహిత్యంలో వచ్చిన కథల సంకలనం ‘ద టేబుల్ ఈజ్ లెయిడ్’ను పరిచయం చేశారు. ఇందులోని కథలన్నీ భోజన పదార్థాల మీద రాసినవి. ఒకే అంశం తీసుకొని అనేక పార్శ్వాలలో కథలు ఎట్లా రాయవచ్చో సంపత్‌రావు ఆసక్తికరంగా వివరించారు. తుమ్మేటి రఘోత్తమరెడ్డి, పాణి, గీతాంజలి, నల్లూరి రుక్మిణి వంటివారితోపాటు నలభైమంది రచయితలు పాల్గొన్న ఈ సమావేశానికి ఓ ప్రత్యేకత ఉంది.
కరీంనగర్ ఫిలిం సొసైటీ ఆతిథ్యానికి దేశంలోని చిన్న సినిమాల, డాక్యుమెంటరీల ప్రదర్శన తోడైంది. కఫిసొ ప్రధాన కార్యదర్శి వారాల ఆనంద్ దీని ఉద్దేశాన్ని వివరిస్తూ సాహిత్యం, చిత్రకళ, సంగీతం, సినిమా అన్నీ కూడా సృజనాత్మక భావవ్యక్తీకరణ రూపాలేనని, వాటిమధ్య అంతరాలు తగ్గించుకొనే వారధి నిర్మించుకోవాలని అన్నారు. మంచి లక్ష్యాలతో వస్తున్న సమాంతర సినిమాకు, సామాజిక ప్రయోజనం ఆశించి వస్తున్న సాహిత్యానికి ఉమ్మడి వేదిక కల్పించి పరస్పరం చర్చించుకునే అవకాశం కలిగించింది కఫిసొ. పగలంతా కథా పఠనం, చర్చ. సాయంకాలం నుండి అర్థరాత్రి దాకా సినిమాలు చూడటం, ఆయా దర్శకులతో మాటలు కలబోసుకోవటం ఈసారికి కొత్త అనుభవం
(9 మార్చ్ 2009, ఆంధ్రజ్యోతి వివిధ సౌజన్యంతోటి)