- పెద్దింటి అశోక్‌కుమార్
మార్చి 14, 15తేదీలలో 13మంది కథకులతో మిడ్‌మానేరు ముంపుగ్రామాల సందర్శనను చేపట్టింది తెలంగాణ రచయితల వేదిక. శ్రీరాంసాగర్ వరద కాలువ ప్రాజెక్టులో భాగంగా కరీంనగర్ జిల్లా మానేరు నదిపై కడుతున్న చెక్ డ్యాం కింద 18 ఊర్లు మునిగిపోనున్నాయి. దాదాపు లక్షమంది నిర్వాసితులవబోతున్నారు. బాధిత ప్రజలకు నష్టపరిహారాల్లేవు.. పునరావాసాల్లేవు.. వారి దీన గాధలు విని తల్లడిల్లిన రచయితల మనసు ఘోష ఇది…
గుర్రంవానిపల్లెలో తెలిసిన ఇంకో విషయం- ఒకరోజు అక్కడి మహిళలందరూ రెండు ట్రాక్టర్లనిండా ఆర్డీవో ఆఫీసుకు వెళ్లి సోకం బెట్టుకుని ఏడుస్తూ ‘కష్టాల్లో సుఖాల్లో ఒక్క జాగలున్నం. మాకు ఏమి ఇయ్యకుండ్రి. ఒక్క జాగల ఇండ్లు కట్టియ్యిండ్రి’ అన్నరట.
గోదావరి ఉపనది మానేరుపై కడుతున్న మిడ్‌మానేరు ప్రాజెక్టు ముంపు గ్రామాలను తెలంగాణ రచయితల వేదిక 13మంది కథకులతో సందర్శించింది. ఓ రచయిత అడిగిన ప్రశ్నకు సిరిసిల్ల జర్నలిస్టు మిత్రుడొకరు ఇచ్చిన సమాచారం మేరకు 2005లో మొదలయి 2009 మార్చికే పూర్తి కావలసిన ప్రాజెక్టు ఇది. మునిగిపోతున్న ఊర్లకు ఇంకా నష్టపరిహారమే చెల్లించలేదు. గృహాలు, ఆబాదు భూములకు పరిహారాన్ని తేల్చనేలేదు. పునరావాసం మొదలు పెట్టనేలేదు. కనీసం కట్ట నిర్మాణం కూడా పూర్తి కాలేదు. ఇదేమిటని ప్రశ్నించిన మరో రచయితకు ఇంకో మీడియా మిత్రుడు ‘కేటాయించిన నిధులు అయిపోయాయి. ఇప్పుడు నిధులే లెవ్వు’ అన్నాడు. ప్రాజెక్టులు అవసరమా అన్న అంశం నుంచి మానేరు చెక్‌డ్యాం వరకు చర్చ జరుగుతూవుంటే రచయితలు రెండు సుమోల్లో కూర్చున్నారు. అందరికి రెండురోజుల వసతిని కల్పించారు రంగినేని ట్రస్టువారు. సుమోలు రెండు చింతలతానా, చీర్లవంచల మీదుగా గుర్రంవానిపల్లె చేరుకున్నాయి. అది చిన్న పల్లె. ఇండ్లు వందవరకు ఉండొచ్చు. రెండుమూడేండ్ల నుంచి అవస్థలు పడుతున్నవారు, అధికారులు, సర్వేలు, ప్రకటనలు చూస్తున్నవారు మమ్మల్ని నిరాసక్తిగా చూసారు. మాకు వివరాలు చెప్పడానికి నిరాకరించారు.
ఒక అవ్వ మావైపు కోపంగా చూసి ధిక్కార స్వరంతో ‘మేమేదో చెప్పుతం.. మీరేదో రాస్తరు. మీరు ఉన్నోళ్ల మంచాలు మోస్తరు. మాకు పైసలు రాకుండ జేస్తరు’ అన్నది. వచ్చింది ఎవరమో చెప్పి కొద్దిసేపు మాట్లాడిన తర్వాత అవ్వ ఆవేశంలో అర్థం ఉందనిపించింది. జట్లుగా విడిపోయి ప్రజలతో మాట్లాడాలనుకున్నాం. చిన్నపల్లెలో ఎటువైపు వెళ్లినా కలుసుకునేది ఒక్కచోటనే. ఒక్కొక్క కుటుంబానిది ఒక్కొక్క కథ. గ్రామసభ జరుగలేదు. తీర్మానం ఆమోదం పొందలేదు. ప్రజలెవరికీ తెలియకుండానే భూములకు రేటు నిర్ణయించబడింది. ఇది ఎలా జరిగిందని అడిగితే వారు చెప్పిన విషయం అందరికీ విష్మయాన్ని కలిగించింది.
ఊర్లో ముగ్గురో నలుగురో భూస్వాములున్నారు. భూములు, ఇండ్లు వదలి పట్నంలో ఉంటున్నారు. అవి సాగులో లేని భూములు. వారికి ఎంత ఇచ్చినా లాభమే. రాత్రికి రాత్రే ఆర్డీవో కలెక్టర్లతో ఒప్పందం రాసుకుని భూముల్ని ‘ఎ’ గ్రేడు కింద నమోదు చేసుకుని లక్షల డబ్బును తీసుకుపోయారు. వారు నిర్ణయించిన రేటుకే పేదప్రజలు భూములను అప్పగించక తప్పలేదు. ఇంకో విషయమేమిటంటే ప్రాజెక్టు కట్ట ఊరి మధ్యలోంచి పోతుంది. అందుకే వారు తక్షణం ఇండ్లను ఖాళీ చెయ్యాలి. ఇండ్లకు పరిహారమే ఇవ్వలేదు. ఊర్లో రైతులందరూ ఒకటి, రెండు ఎకరాలున్న రైతులే. భూములకు ఇచ్చిన పరిహారం అవసరాలకు ఎప్పుడో కరిగిపోయింది. ఓ తాత తన ఆవేదన చెబుతూ ‘భూమి పైసలిచ్చి రెండేడ్లయింది. ఇల్లు పైసలు ఇంకా రాలేదు. అన్ని అప్పుడే ఇత్తె ఎటన్న పోదుము. ఇప్పుడు ఎటుగాకుంటాయె.. రెండు వానలు గొడితే కట్ట మన్నంతా ఇంట్లకత్తది. ఎట్ల ఉండుడు.. ఎక్కడుండుడు..’ అన్నాడు. అక్కడో డబ్బ దుకాణముంది. ఓ పుట్టు గుడ్డి దుకాణంలో ఉన్నాడు. పేరు హన్మంతరెడ్డి. బీడీలు అగ్గిపెట్టెలు సిగరేట్లు అమ్ముకుంటూ బతుకుతున్నాడు. ‘వీళ్లు సరే.. నువ్వెక్కడికి పోతావు’ అని అడిగితే అతడి కళ్లు తడిదేరాయి.
పగటిపూట దాటాక కట్టమీది నుంచి సుమోలు రెండు చీర్లవంచ చేరుకున్నాయి. ముంపు గ్రామాల్లో పెద్ద ఊరు అదే. మేజర్ గ్రామ పంచాయితి. రెండు చెరువులు నాలుగు కుంటలు. ఏ ఊరికి వచ్చినా ఎవరిని కదిలించినా ఒక్కటే బాధ. ప్రాజెక్టు పూర్తయి నీళ్లతో నిండితే నట్టనడుమ నీళ్లలో ఉండేది ఆ ఊరే! రౌతు హన్మాండ్లు అనే రైతు తనకు భూమి పరిహారం రాలేదంటూ ఒక కొత్త విషయం చెప్పాడు- ‘సారూ! మట్టి తీసే భూములకు పని ఆపుతరని జెట్టన పైసలిచ్చిండ్రు. మా భూములు నట్టనడుమల ఉంటయి. ఎంత మొత్తుకున్నా పైసలిత్తలేదు. ఈ పైసలత్తయని మా సుట్టాల ఇంటికాడ రెండెకురాలకు బయాన ఇచ్చిన. అవి అటే ఇవి ఇటే’ అన్నాడు. ‘తాతలు తండ్రులు పుట్టిన ఊరు. అందరు కలిసిమెలిసి ఉన్నరు. ఇప్పుడు విడిపోవడం కష్టంగా లేదా’ అన్న ప్రశ్నకు వాళ్లు ఉదారంగా స్పందించారు- ‘పది ఊర్లు లేసిపోతయి సరే! వందల ఊర్లు బాగుపడుతయి గదా! కని ఒక్కటే సారు.. ఇక్కడ ఎకురం అమ్మితే బయట గుంటెడు వత్తలేదు. భూములకు గిరాకి పెరిగింది. మాకు ఎక్కడైనా ఇండ్లు కట్టిత్తె బాగుండు’ అన్నాడొకాయన. చీర్లవంచలో అరవై ఏండ్లు దాటిన మంద నర్సయ్య ఏడుస్తూ ‘నాకు ఇద్దరు కొడుకులు. వాని అత్తగారింటికి వాడు వోతడట. వీని అత్తగారింటికి వీడు వోతడట. నేనెటు పోవాలె’ అన్నాడు.
భూమి ఉన్నవాళ్ల సమస్య ఇలా ఉంటే అసలు భూమి లేనివాళ్ల సమస్య ఏమిటని బావాజీలవాడకు వెళ్లాం. వాళ్లది మరో సమస్య. అసలు వాళ్లకు కులమే లేదు. వాళ్లు బిసీలా, ఎస్సీలా, ఎస్టీలా ఎవరూ తేల్చలేదు. చదువుకునే పిల్లలకు కులం సర్టిఫికెట్ లేదు. అలా వాళ్లు చాలా అవకాశాలు కోల్పోయారు. స్వతంత్రం వచ్చి ఇన్ని రోజులైనా బావాజీ, బోగం, గోత్రాల లాంటి కులాలు ఏ గ్రూపు కింద వస్తాయో విభజించలేదు. భూమి లేనివాళ్లకు కుటుంబ భరణం లెక్క కట్టిందని చెప్పారువారు. 720 పనిదినాలు లెక్కకట్టారట. 18 ఏళ్లలోపు 60 ఏళ్లపైన వయసున్నవాళ్లకు ఈ భరణం లేదని చెప్పారు. అది గూడా ఇంతవరకు లెక్క కట్టడమే కాని ఇచ్చింది లేదని చెప్పారు.
మరునాడు నీలోజుపల్లె కొదురుపాక పర్యటన. నీలోజుపల్లెకొక విశిష్టత ఉంది. బహుశా తెలంగాణ జిల్లాల్లో అదే మొదటి ఊరు కావచ్చు కూరగాయలు పండించేది. కరీంనగర్‌కు సగంవరకు సరిపోయే కూరగాయలు ఆ పల్లెనే సరఫరా చేస్తుంది. పల్లెలో భూములకు ఇండ్లకు డబ్బులిస్తామని బ్రోకర్ అవతారమెత్తి కోట్లు సంపాదించినవారున్నారు. ఇంజనీర్లకు లంచమిచ్చి పొలంలో మట్టి కట్టకు పనికిరాదని చెప్పించి భూముల్ని సాగు చేసుకుంటున్నవారున్నారు. ఏ సహాయం అందనివారున్నా రు. భూమిమీద ప్రేమతో గుండె ఆగి చనిపోయిన ఓ నర్సయ్య ఉన్నాడు. పక్కనే కొదురుపాక. అక్కడ కొత్తకొత్త షెడ్లు కనిపించాయి. ఎన్నడూ ఊరి మొఖం చూడని వారు, షెడ్లు వేసుకుని నివాసముంటున్నట్టు, కోళ్లఫారం పెట్టుకుంటున్నట్టు రికార్డ్ చేసుకున్నవాళ్లున్నారు.
తన ఇంటికి సరియైన వెల కట్టలేదని అధికారుల చుట్టూ తిరిగిన మైళారం కొమురవ్వ చివరికి కిరోసిన్ పోసుకుని కాలబెట్టుకుని చనిపోయింది. మంటలార్పడానికి వెళ్లిన ఆమె భర్త దేవయ్య చేతులు కాలిపోయాయి. పొద్దంతా మట్టి తీస్తే ఎదురుతిరుగుతున్నారని రాత్రిపూట మట్టి తీస్తున్నారు. ఇండ్లనిండా దుమ్ము, ధూళి. ఉపాధి హామీ పథకాలు లెవ్వు. వృద్ధాప్య పింఛన్లు లెవ్వు. మహిళా సంఘాలకు పావలా వడ్డీ లేదు. అప్పులు లెవ్వు. భూముల మీద పరిహారం ఇస్తేగిస్తే బ్యాంకువాళ్లు ముందే దిగి అప్పులు వసూలు చేసుకుంటున్నారు. రైతులను విభజించే పాలసీలను అమలుచేస్తున్నారు… రచయితలు ఇల్లిలు తిరిగారు. బాధలను విన్నారు. జీవితాలను చూసారు. కన్నీళ్లు కార్చారు. వ్యవసాయ భూములను సందర్శించారు.
మట్టి తీస్తుంటే వాటర్‌పైపులు పగిలి, కరంటు స్థంభాలు కూలి నీరు, వెలుతురు కరువైంది. చీకటి బతుకుల్ని చూసి బరువెక్కిన హృదయంతో ట్రస్టుకు వచ్చారు. పర్యటన సమీక్ష జరిగింది. అందరూ తమను కదిలించిన విషయాలను పంచుకున్నారు. మనిషికో కథ రాసి సంకలనం వేసి ఆ ప్రజలకు అంకితం ఇయ్యాలనే నిర్ణయానికి వచ్చారు. ‘అనాధ పిల్లలను ఒకచోట చేర్చి తిండి పెట్టి చదువు నేర్పిస్తుంది మా ట్రస్టు. మరి వేలమంది అనాధలవుతున్నారు. వారి బతుకులెట్లా?‘ అన్న రంగినేని మోహన్‌రావు సమాధానం లేని ప్రశ్నతో సమావేశం ముగిసింది.
(మార్చ్ 23, 2009, ఆంధ్రజ్యోతి వివిధ సౌజన్యంతోటి)
March 27th, 2009 at 12:13 am
రచయితలు వెళ్ళి నిర్వాసిత గ్రామాలను సందర్శించడం, వారి బాధలను ప్రత్యక్ష్యంగా వినడం బాగానే ఉంది. కానీ అది సరిపోదు. ఈ రోజు కవిత్వం చదివి స్పందించే మనుషులు లేరు. ఉన్నా ఆ స్పందన జీవితాల కొరకు పోరాడే స్థాయిలో లేదు.
ఇది సరిపోదు. ఇంకా ఎంతో చైతన్యం, క్రియా శీలత కావాలి.