కోట్ల డబ్బులు అయిపోయాయి పనులింకా పూర్తి కాలేదు ఆర్భాటంగా ప్రాజెక్టుల పెంపు ఇలాగైతే పదిహేనేళ్లయినా పట్టొచ్చు పెరిగిపోతున్న అంచనా వ్యయం నాణ్యతకు తిలోదకాలు రైతన్నకు నీరు అందేదెన్నడు?
- ఎం.ఎల్.నరసింహారెడ్డి, న్యూస్‌టుడే జనరల్‌బ్యూరో
ముఖ్యమంత్రి వై.ఎస్. గద్దెనెక్కగానే ఘనంగా ప్రకటించుకున్నదీ… అపరభగీరథుడినంటూ తనకు తాను కితాబునిచ్చుకున్నదీ…. ప్రధానీ తదితర ప్రముఖులందరికీ ప్రముఖంగా చూపించుకున్నదీ… ప్రపంచంలోనే నభూతో… అని చాటుకున్నదీ…. జలయజ్ఞం! మరి.. ఆ యజ్ఞం ఇప్పుడెక్కడికొచ్చింది? ఫలం ఎలా ఉంది? నీటి ప్రాజెక్టుల పరిస్థితేంటి? ఎన్ని పూర్తయ్యాయ్! డబ్బులెన్ని ఖర్చయ్యాయ్! రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులపై ‘పాంచజన్యం’ ప్రత్యేక కథనం!

”రాష్ట్రంలోని పెండింగ్ ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తాం!” 2004 అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ చేసిన ప్రకటనిది!
”ఐదేళ్ళలో 26 ప్రాజెక్టులు పూర్తిచేస్తాం! 50 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరందిస్తాం! ఇందుకు 46 వేల కోట్లు వ్యయమౌతుందని అంచనా!” అధికారంలోకి రాగానే వై.ఎస్. సర్కారు ప్రకటనిది!
ఐదేళ్ళు పూర్తయ్యాయ్! మళ్ళీ ఎన్నికలొచ్చాయ్! ఒక్కసారి చూస్తే…
26 ప్రాజెక్టుల్లో సగం కూడా పూర్తి చేయలేదు…
50 లక్షల ఎకరాలకు కాదు కదా అందులో 10 శాతానికి మించి నీరివ్వలేదు. నిధులు మాత్రం రూ.40 వేల కోట్లు ఖర్చయ్యాయి.
గత ఎన్నికల నాటికీ ఇప్పటికీ తేడా ఏమిటంటే..
ఆర్భాటంగా ఆరంభించిన కొత్త ప్రాజెక్టులతో పెండింగ్ ప్రాజెక్టుల సంఖ్య 80 దాటింది. ఆయకట్టు లక్ష్యం కోటి ఎకరాలు దాటింది. వ్యయ అంచనా మరో రూ.లక్షా 60వేల కోట్లకు చేరింది! ఒక్కమాటలో చెప్పాలంటే … మరో మూడు నాలుగు ఎన్నికల వరకు ఈ హామీ ఇలాగే కొనసాగినా ఆశ్చర్యపోనవసరం లేదు. నిధులను పరిగణలోకి తీసుకొన్నా కనీసం పదిహేనేళ్ళు పట్టే అవకాశముంది!
రెండేళ్లన్నవి…
మొదట రెండేళ్లలోనే 8 ప్రాజెక్టులను పూర్తి చేసి 13 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరందిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. వీటిలో వంశధార రెండోదశ మొదటి భాగం, తాడిపూడి, పుష్కర ఎత్తిపోతల పథకం, తెలుగుగంగ, సోమశిల, గోదావరి ఎత్తిపోతల పథకం మొదటి దశ, అలీసాగర్, గుత్ప ఎత్తిపోతల పథకాలున్నాయి. రెండేళ్లు కాదు కదా ఐదేళ్లు గడిచినా ఈ ప్రాజెక్టుల కింద పూర్తి స్థాయిలో ఆయకట్టుకు నీరందలేదు. నిర్మాణంలో జాప్యం కాకుండా చూసేందుకు ఇ.పి.సి పద్ధతిలో టెండర్లు ఖరారు చేసింది. నిర్ణీత వ్యవధిలో పూర్తి చేయాల్సి ఉంటుంది కాబట్టి పనికి అయ్యే ఖర్చులో ఐదు శాతం అదనంగా కలిపారు. అంచనాపై మరో ఐదు శాతం వరకు ఎక్కువ కోట్ చేసుకోవడానికీ అనుమతిచ్చారు. ఇలా నిర్మాణ వ్యయం పెరిగిందే తప్ప ఏ ప్రాజెక్టూ ఐదేళ్లయినా పూర్తి కాలేదు.
దేవాదుల ఎత్తిపోతల పథకం మొదటి దశ పూర్తికాకముందే రెండో దశ చేపట్టారు. ఇప్పటివరకు దేవాదుల ప్రాజెక్టుకు మూడువేల కోట్ల రూపాయలు వ్యయం చేశారు. మొదటి దశ కింద ఆయకట్టు లక్షా 23 వేల ఎకరాలు. అయితే నీటి లభ్యత కన్నా ఆయకట్టు ఎక్కువగా చూపించారని భావించి 65వేల ఎకరాలకు తగ్గించారు. అయినా ఒక్క ఎకరాకు కూడా నీరందించలేకపోయారు. పిల్లకాల్వల నిర్మాణం పూర్తికాలేదు.
తాడిపూడి, పుష్కర ఎత్తిపోతల పథకాల కింద 4 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. ఇప్పటివరకు లక్షన్నర ఎకరాలకు మించి ఇవ్వలేకపోయారు.
అలీసాగర్, గుత్ప ఎత్తిపోతల పథకాలు పూర్తయినా శ్రీరాంసాగర్‌కు నీటి సమస్య ఉండటంతో వీటి ద్వారా నీరందించలేకపోయారు. ఈ రెండూ నిజాంసాగర్ ఆయకట్టు స్థిరీకరణకు సంబంధించినవి.
తెలుగుగంగ కింద పరిస్థితి మరీ దయనీయం. రెండు దశాబ్దాలకు పైగా కొనసాగుతోంది. ఈ ప్రభుత్వం వచ్చాక రెండేళ్లలో పూర్తి చేస్తామంటే ఐదేళ్లయినా కాలేదు. ఇప్పటికీ పిల్ల కాల్వల నిర్మాణం పూర్తి కాక సగం ఆయకట్టుకు కూడా నీరందించలేదు. తెలుగుగంగ కాల్వలకు సోనియాగాంధీ నీటిని విడుదల చేశారు. పిల్లకాల్వలు కాకపోవడంతో చెరువులను నింపి ఇచ్చామనిపించారు.
వంశధార స్టేజి-2, ఫేజ్-1 పరిస్థితి కూడా ఇంతే. ఇది చిన్న ప్రాజెక్టు. 62,280 ఎకరాల ఆయకట్టు ఉంటే జలయజ్ఞం ప్రారంభం నాటికే 20వేల ఎకరాల ఆయకట్టుకు ఇచ్చారు. మిగిలిన ఆయకట్టుకు గత నాలుగన్నరేళ్లలోనూ పూర్తిగా ఇవ్వలేకపోయారు.

ఇవి ఇంకెన్నేళ్లకో…
వై.ఎస్. ప్రభుత్వం ఈ ఐదేళ్లలో పూర్తిచేస్తామన్న మరో 18 ప్రాజెక్టుల్లో తోటపల్లి. జంజావతి, పులిచింతల, గుండ్లకమ్మ, రామతీర్థం బ్యాలన్సింగ్ రిజర్వాయర్, గురురాఘవేంద్ర ఎత్తిపోతల పథకం, కె.సి.కాలువ ఆధునికీకరణ, గాలేరు-నగరి, పి.ఎ.బి.ఆర్ రెండో దశ, హంద్రీనీవా, చిత్రావతి బ్యాలన్సింగ్ రిజర్వాయర్, ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టు, శ్రీరామసాగర్ రెండోదశ, వరదకాలువ, భీమా , కల్వకుర్తి, నెట్టెంపాడు, వెలిగొండ ప్రాజెక్టులున్నాయి. రామతీర్థం చాలా చిన్న ప్రాజెక్టు. నాలుగేళ్లపాటు కష్టపడి ఇటీవలనే అయిందనిపించారు.
గురురాఘవేంద్ర చిన్న ప్రాజెక్టే అయినా ఇంకా పూర్తికాలేదు. గుండ్లకమ్మ ప్రాజెక్టు ఇటీవలే ప్రారంభించినా ఇంకా సగం ఆయకట్టుకు కూడా నీరందలేదు. గత ప్రభుత్వ హయాంలో కాలువలు పూర్తయి, ఈ ప్రభుత్వ హయాంలో పిల్లకాల్వల నిర్మాణం చేపట్టిన ఎ.ఎం.ఆర్.పి. కింద కూడా పూర్తిగా ఆయకట్టుకు నీరందలేదు. ఐదేళ్లలో పూర్తిచేస్తామన్న గాలేరు-నగరి, హంద్రీనీవా, వెలిగొండ, పి.ఎ.బి.ఆర్ రెండోదశ, పులిచింతల, కల్వకుర్తి లాంటి ప్రాజెక్టులు మరో ఐదేళ్ల తర్వాతనే. తోటపల్లి, భీమా ప్రాజెక్టుల కింద 2008 ఖరీఫ్ నాటికే నీళ్లిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. వచ్చే ఖరీఫ్ నాటికి కూడా ఇచ్చే పరిస్థితి లేదు.

పొంతనలేని లెక్కలు…
2008 డిసెంబరు వరకు జలయజ్ఞం ప్రాజెక్టుల కింద 11.6 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టుకు, లక్షా 20వేల ఎకరాల స్థిరీకరణకు నీళ్లిచ్చినట్లు నీటిపారుదల శాఖ లెక్కలు చెబుతున్నాయి. కానీ వాస్తవంగా పొలాలు తడిసింది సుమారు ఐదులక్షల ఎకరాలు మాత్రమే. కడప జిల్లాలోని వెలిగల్లు ప్రాజెక్టు పూర్తి చేసి 24వేల ఎకరాలకు నీళ్లిచ్చినట్లు ప్రభుత్వం చెబుతోంది. కానీ ప్రారంభించిన తర్వాత, ప్రాజెక్టులోకి నీళ్లొచ్చే అవకాశం లేదని గుర్తించి హంద్రీనీవా రెండో దశ నుంచి మళ్లించేందుకు టెండర్లు పిలిచారు. హంద్రీనీవా మొదటిదశకే దిక్కులేదు. ఇక రెండోదశ ఎప్పుడు రావాలో… దాన్నుంచి వెలిగల్లుకు వచ్చేదెప్పుడో సర్కారుకే ఎరుక! ఆయకట్టుకు నీళ్లిచ్చినట్లు చెబుతున్నా అనేక ప్రాజెక్టుల కింద పిల్లకాల్వలు సిద్ధం కాకపోవడమో, ప్రాజెక్టులో నీళ్లు లేకపోవడంలాంటి పరిస్థితులున్నాయి.
హడావుడిగా…. ఆర్భాటంగా
చేతిలో ఉన్న ప్రాజెక్టులు పూర్తి చేయకుండానే ప్రభుత్వం కొత్త ప్రాజెక్టుల సంఖ్య పెంచుకుంటూ పోయింది. అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రకటించిన 26 ప్రాజెక్టులతోపాటు మరిన్ని భారీ ప్రాజెక్టులను ఆర్భాటంగా చేపట్టింది. శ్రీశైలం ఎడమగట్టు కాలువ (ఎస్‌ఎల్‌బిసి), పోలవరం, గండికోట-చిత్రావతి ఎత్తిపోతల, రాజీవ్ ఎత్తిపోతల, ఇందిరా ఎత్తిపోతల, ఎల్లంపల్లి, తారకరామతీర్థసాగర్ తదితర ప్రాజెక్టుల పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుంది. ఇవ్వన్నీ పూర్తి చేయడానికి అవసరమైన నిధుల సమీకరణ గురించి పట్టించుకోకుండానే, ఎన్నికలకు ముందు మరిన్ని భారీ పథకాలకు శ్రీకారం చుట్టింది. ప్రాణహిత-చేవేళ్ల, దుమ్ముగూడెం-టేల్‌పాండ్, ఉత్తరాంధ్ర సృజల స్రవంతి, చింతలపూడి ఎత్తిపోతల, దేవాదుల ఎత్తిపోతల పథకం మూడోదశకు టెండర్లు పిలిచింది. ఈ పనుల విలువ రూ.75 వేల కోట్లు. వీటికి తోడుగా కృష్ణా, గోదావరి, పెన్నా డెల్టాల ఆధునికీకరణను మరో రూ. 10వేల కోట్లతో చేపట్టింది.
కేటాయించినా…
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జలయజ్ఞం ప్రాజెక్టులకు అత్యధికంగా రూ.12 వేల కోట్లు వ్యయం చేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.16,511 కోట్లు కేటాయించి రూ. పదివేల కోట్లు కూడా ఇవ్వలేని పరిస్థితి. గత నాలుగు నెలలుగా గుత్తేదార్లకు బిల్లులు చెల్లించకపోవడంతో అనేక చోట్ల పనులు ఆగిపోయాయి కూడా.
(ఈనాడు పాంచజన్యం 2009 సౌజన్యంతోటి)