- జిందం అశోక్

తెలంగాణ అంటే
అందరికి బతుకమ్మ పాట
బతుకమ్మ ఆటైనది-
ఒకడు పాడిన పాట
మరొకడు పాడడు అనడు
ఒకడు ఆడిన ఆట
ఇంకొకడు ఆడడు నడవడు
ఎవ్వని పాట ఆట వానిదే
ఎవ్వని జెండా ఎజెండా వానిదే
ఎవ్వని రంగు గుర్తు వానిదే
ఎవ్వని దుకానం
ఎవ్వని బతుకుదెరువు వానిదే
అందుకే చూసేటోనికి అలుసైంది
వినేటోనికి చులకనైంది
పాలించేటోనికి పలుచనైంది
నాడు నేడు నీళ్లు నిధులు
ఉద్యోగాలు భూములు
రాజకీయ దిష్టిబొమ్మల సాక్షిగా
‘సర్కారు’ తుమ్మల్లో కల్సినై కలుత్తున్నయి
ఓటు !
ఏ వ్యక్తి కెయ్యాలి
ఏ గుర్తు కెయ్యాలి..
తెలంగాణ
వత్తది రాదు! రాదు వత్తది! అంటూ
కల్వరిత్తూ కల్వరిత్తూ
మానాది కొద్ది
యాభై యేండ్లన్న నిండని
తెలంగాణ బిడ్డ
నిన్ననే సచ్చిండు
ఉన్నవాళ్లు బతికి సత్తుండ్రు
పార్టీల పొత్తులు ఎత్తులు
పబ్బం గడవడానికి పూటకుళ్ల
రాజకీయాలైనయి
రాజకీయ వృత్తి ప్రవృత్తి కల్గినోళ్లు
తెలంగాణను
వాసనలేని ప్లాస్టిక్ పూలతోట సేత్తుండ్రు
ఇన్నినాళ్ల వెనుకబాటుతనానికి
కండ్లల్లో ఇసుక పడి ఒత్తిన బాధ
వార్డు మెంబర్ సర్పంచ్
ప్రాదేశిక సభ్యుడు శాసనసభ్యుడు
పార్లమెంట్ ఉభయసభల సభ్యుడు
ఎవ్వడు పరాయోడు కాదు
ఇన్ని రోజులు
మనమే వాళ్లకు పరాయివాళ్లమైనము
తెలంగాణ తల్లీ !
వాళ్లను శపించు ! శపించు !!
మమ్మల్ని క్షమించు ! క్షమించు !!