Feed on
Posts
Comments

- వరవరరావు

తెలంగాణలో ప్రజలు ఎన్నికల పట్ల ఎటువంటి వైఖరి తీసుకుంటున్నారు? ఎన్నికల సందర్భంగా మొత్తంగా వారిని వేధిస్తున్న సమస్యలు ఏమిటి? వ్యక్తమవుతున్న ఆకాంక్ష ఏమిటి? నక్సల్బరీ, శ్రీకాకుళ పోరాటాలు ప్రారంభమయ్యాక చారుమజుందార్‌ నాయకత్వాన్ని అనుసరించిన పార్టీ ఇస్తున్న ఎన్నికల బహిష్కరణ పిలుపును తెలంగాణ ప్రజలు ఏ విధంగా తమ ఆచరణలోకి అనువదించుకుంటున్నారు? వంటి ప్రశ్నలు ఆసక్తిదాయకమైనవే. స్థూలంగా ఇది తెలుగునేల కంతా వర్తించేవే.

అయితే 1952 ఎన్నికల నాటికి తెలంగాణ హైదరాబాద్‌ రాష్ట్రంలో భాగంగా ఎన్నికల్లో పాల్గొన్నది. 1971 ఎన్నికల నాటికి శ్రీకాకుళ పోరాటం వెనుకపట్టు పట్టినా దాని ఆటుపోటులను తెలంగాణ కూడ ఎదుర్కొన్నది. పోరాట ప్రభావం, రాజ్యహింస తెలంగాణ అంతటా అమలయింది. కల్లోలిత ప్రాంతాల చట్టం 1969 నుంచి శ్రీకాకుళంతో పాటు ఖమ్మం, వరంగల్‌, కరీంనగర్‌ జిల్లాల్లో కూడా అమలయింది.

అయితే అదనంగా తెలంగాణకు 1971 నాటికి ప్రత్యేక తెలంగాణ ఉద్యమం ఉన్నది. ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో 350 మంది విద్యార్థులు అమరులయ్యారు.

తెలంగాణకు ఎనభై సంవత్సరాల భూవిముక్తి పోరాటాల చరిత్ర ఉన్నది. ఆంధ్రమహా సభ నాయకత్వంలో అది వెట్టి చాకిరీ రద్దుతో మొదలై, కౌల్దారీ హక్కుల రక్షణ, దున్నేవారికి భూమి పోరాటంగా ఎదిగి మూడువేల గ్రామాల్లో పది లక్షల ఎకరాల భూమి స్వాధీనం చేసుకొని సైనిక చర్య (1948) నాటికి బీజప్రాయంలో ఎర్రరాజ్యాన్ని చవిచూడకుంగా పరిణమించింది. భూమిపై హక్కును రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల అధికారాన్ని ప్రతిఘటించి కాపాడుకోవడంగా 1951 వరకు కొనసాగింది. అందుకోసం 1948 నుంచి 51 వరకు తెలంగాణ ప్రజలు దేశంలోనే అపూర్వంగా సాయుధ పోరాటమే చేసారు. కారణాలు ఏమైనప్పటికీ ఆ పోరాట విరమణ నేపథ్యంలో వచ్చిన ఎన్నికల్లో ఆ పోరాటానికి నాయకత్వం వహించిన కమ్యూనిస్టు పార్టీ పీపుల్స్‌ డెమొక్రటిక్‌ ఫ్రంట్‌గా చెయ్యి గుర్తుతో పోటీచేసి తెలంగాణ వరకు ఘనవిజయం సాధించింది. తెలంగాణలోని 90 సీట్లలో 48 గెలుచుకున్నది.

సైనికచర్యకు, రాజ్యహింసకు వ్యతిరేకంగా, భూసంస్కరణలకు అనుకూలంగా తెలంగాణ ప్రజలు మొట్టమొదటి సార్వజనీన ఎన్నికల్లో ఓటు వేసారు. జమీందారీ, జాగీర్దారీ వ్యవస్థ రద్దయి, దక్షిణ కౌల్దారీ చట్టాన్ని అమలు చేసే ‘విప్లవాత్మక’ భూసంస్కరణల చట్టం వచ్చింది.

అది అమలయిందా, చట్టాలకే పరిమితమైందా – అన్నది వేరే అంశం.
1956, 52 ఎన్నికల వరకు కూడ కాంగ్రెస్‌, కమ్యూనిస్టు పార్టీల లక్ష్యాలలో సామ్యవాదం, ప్రజాస్వామ్యం, పంచవర్ష ప్రణాళికలు, సహకార వ్యవసాయం, గ్రామాల్లో కుటీర పరిశ్రమలు, పట్టణాల్లో ప్రభుత్వ రంగంలో పరిశ్రమలు, విద్య, వైద్యం, సమాచార, రవాణా సౌకర్యాలు ప్రభుత్వ రంగంలో ఉండడం వంటి అంశాలు ఉన్నాయి. కమ్యూనిస్టు పార్టీ కూడ సంస్కరణల బాటలోనే ఉన్నది. ‘సంక్షేమ / శ్రేయోరాజ్యం’ భావన బలంగా ఉన్న రోజులవి. అందుకే 1967 ఎన్నికల్లో కూడ కమ్యూనిస్టు పార్టీ ప్రతిపక్ష పార్టీ అయినా కాగలిగింది. ప్రతిపక్ష నాయకుడు తరిమెల నాగిరెడ్డి నక్సల్బరీ పంథాను స్వీకరించి ‘శాసనసభ సాలెగూడు’ అని ప్రకటించి రాజీనామా చేసారు.

ఆ తర్వాత 1974 లోక్‌సభ ఎన్నికల నాటికి ఎన్నికల బహిష్కరణ ఎజెండా మీదికి వచ్చింది. కాని శ్రీకాకుళ పోరాటం పూర్తిగా అణచివేయబడింది. ఇది ఒక వాస్తవమైతే మరొక వాస్తవం ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో 350 మంది విద్యార్థులు అమరులైన నేపథ్యంలో తెలంగాణ ప్రజా సమితి ఈ ఎన్నికల్లో లోక్‌సభకు ప్రత్యేక తెలంగాణ డిమాండ్‌తో పోటీ చేసీంది. 52 ఎన్నికల్లో కమ్యూనిస్టు పార్టీ (పిడిఎఫ్‌) కన్నా ఎక్కువ మెజారిటీతో 14 లోక్‌సభ స్థానాల్లో 11 ను తెలంగాణ ప్రజా సమితి గెలుచుకున్నది. అంటే 1971లో లోక్‌సభ ఎన్నికలు రాజ్యహింసకు వ్యతిరేకంగా, తెలంగాణ రాష్ట్రానికి అనుకూలంగా ప్రజలు ఇచ్చిన తీర్పు. అంట్లే రాష్ట్ర వ్యాప్తంగా చూసినపుడు రాజ్యహింసకు వ్యతిరేకంగా, మళ్లీ ఒకసారి శ్రీకాకుళ ఉద్యమం నేపథ్యంలో రాడికల్‌ భూసంస్కరణలు అనుకూలమైన తీర్పు. అందుకే 1973లో ఆదివాసులకు అడవి భూమిపై హక్కు కల్పించే 1/70 చట్టం, భూగరిష్ఠ పరిమితి కుటుంబానికి 54 ఎకరాల మెట్ట భూమిగా నిర్ణయించే చట్టం 1973లో వచ్చాయి.

1975లో ఎమర్జెన్సీ వచ్చింది. 77లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో దేశమంతా కాంగ్రెస్‌ ఓడిపోతే ఆంధ్రప్రదేశ్‌లో గెలిచింది. నీలం సంజీవరెడ్డి ఒక్కడే కొత్తగా ఏర్పడిన జనతాపార్టీ తరఫున దళితులను ఓటు వేయకుండా అడ్డుకొని నంద్యాల నియోజకవర్గం నుంచి గెలిచాడు. లోక్‌సభ స్పీకర్‌ అయ్యాడు. తర్వాత రాష్ట్రపతి కాగలిగాడు. ఎందుకీ విషయాన్ని ప్రస్తావించానంటే ఆంధ్రప్రదేశ్‌లో ప్రజలు, ముఖ్యంగా బడుగువర్గాలు ఎమర్జెన్సీని శ్రీకాకుళ పోరాటం, ప్రత్యేక తెలంగాణ పోరాటం కాలం నుంచే అనుభవిస్తున్నారు. వాళ్లకు ఎమర్జెన్సీ కొత్తగా రాలేదు. పైగా దళితులకు, ఆదివాసులకు శ్రీకాకుళ పోరాటం వెనకపట్టు పట్టాక 1978 నాటికి ఇందిరాగాంధీ ఇరవై సూత్రాల్లోనే ఊరట కనిపించింది. కెఆర్‌ వేణుగోపాల్‌, ఎస్‌ఆర్‌ శంకరన్‌ వంటి ఐఎఎస్‌ అధికారులు ఆ చట్టాలను అమలు చేయడంలో చూపిన నిజాయితీ కూడ అందుకు దోహదం చేసింది. అందువల్లనే 78 శాసనసభ ఎన్నికల్లో వెంగళరావు (బ్రహ్మానందరెడ్డి) కాంగ్రెస్‌ ఓడిపోయి, చెన్నారెడ్డి (ఇందిరా) కాంగ్రెస్‌ గెలిచింది. ఆంధ్రప్రదేశ్‌లో ఎమర్జెన్సీ నియంతగా జలగం వెంగళరావును చూసినంతగా ఇందిరాగాంధీని పేద ప్రజలు భావించలేదు. ఒకవైపు జగిత్యాల జైత్రయాత్ర నేపథ్యంలో కొండపల్లి సీతారామయ్య నాయకత్వంలోని సిపిఐ ఎంఎల్‌ ఎన్నికల బహిష్కరణ పిలుపు ఇచ్చినా, అది వెంగళరావు ప్రభుత్వ వ్యతిరేక తీర్పుగానే వచ్చింది. అయినా 1978 వరంగల్‌ రాడికల్‌ విద్యార్థి సంఘం రెండవ మహాసభలు ఇచ్చిన ఎన్నికల బహిష్కరణ, గ్రామాలకు తరలండి పిలుపు (ఈ సభల్లో స్వయంగా కరీంనగర్‌ జిల్లా సిపిఐ ఎంఎల్‌ నాయకుడు కోటేశ్వరరావు పాల్గొని ఎన్నికల బహిష్కరణ పిలుపు ఇచ్చాడు) ఉద్యమ ప్రాంతాల్లో బలమైన ప్రభావమే చూపింది.

1978 నుంచి 83 ఎన్నికల వరకు తెలుగునేల చరిత్రంతా విప్లవోద్యమ పునరోజ్వల చరిత్ర. విప్లవోద్యమ నాయకత్వంలో రాడికల్‌ భూసంస్కరణలు అమలవుతున్న చరిత్ర.

1980లో సిపిఐ ఎంఎల్‌ పీపుల్స్‌వార్‌ ఏర్పడింది. 1982లో ఎన్టీఆర్‌ తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పాటు చేసేనాటికి పీపుల్స్‌వార్‌ ప్రజాసంఘాల ప్రభావం తెలుగునేల మీద సుడిగాలి వీస్తున్నది. 1981లో ఇంద్రవెల్లి ఆదివాసులపై కాంగ్రెస్‌ ప్రభుత్వం కాల్పులు జరిపింది. నక్సలైట్లు దేశభక్తులని, నక్సలైట్లు తనతో చేతులు కలిపితే ఎర్రకోట పై ఎర్రజెండా ఎగురవేస్తాననే ప్రచారంతో పాటు ఆత్మగౌరవ ప్రచారాన్ని అజెండా మీదికి ఎన్టీఆర్‌ తెచ్చాడు. శ్రీకాకుళ ఉద్యమం, ఎమర్జెన్సీ, జగిత్యాల సిరిసిల్లా పోరాటాలు – కాలమంతా కాంగ్రెస్‌ దమననీతిని చవిచూసిన ప్రజల్లో కాంగ్రెస్‌ వ్యతిరేకత పెల్లుబికింది. నిజానికి పీపుల్స్‌వార్‌ ఇచ్చిన ఎన్నికల బహిష్కరణ పిలుపు బలంగా ప్రజల్లో పనిచేసిన కాలం కూడ ఇదే. ఉద్యమ ప్రాంతమంతా పోలీసులు ఓటు వేయించడం మీద కేంద్రీకరించారు. ఓటర్ల జాబితాలు తీసుకొని ఓటు వేయని వారిని ఎన్‌కౌంటర్‌ చేస్తామని, ఎన్నికలను బహిష్కరించే గ్రామాలను తగులబెడతామని పోలీసులు లౌడ్‌స్పీకర్లు పెట్టుకొని ప్రకటిస్తూ పెట్రోలింగు చేస్తూ ప్రజల్ని భయభీతాహుల్ని చేసారు. (1994లో కూడ ఇదే పునరావృతమైంది. ఉత్తర తెలంగాణ జిల్లాలకు పంజాబ్‌ కమాండోలను కూడ దించారు.) పీపుల్స్‌ వార్‌ ఏర్పడిన 1980 నుంచి 1999 వరకు జరిగిన ఎన్నికలన్నీ తుపాకి నీడన జరిగిన ఎన్నికలే. రాజకీయ పార్టీలు తమకోసం ఓట్లు అడిగాయేమో కానీ ప్రభుత్వ యంత్రాంగం మొత్తంగా, పోలీసు ప్యారామిలిటరీ బలగాలు వేల సంఖ్యలో అదనంగా దిగి పోరాట ప్రాంతాల్లో ఓట్లు వేయించడం, ఇల్లెందు వంటి ప్రాంతాల్లో ఓట్లు వేయకుండా చూడడమే పనిగా పెట్టుకున్నాయి.
ఇటువంటి సందర్భాల్లో సహజంగానే 1999 మినహాయింపుతో ప్రతి ఎన్నికలు అధికారంలో ఉన్న పార్టీకి వ్యతిరేక తీర్పుగానే పరిణమించినవి.

అన్ని సందర్భాల్లోను ఇది రాజ్యహింస వ్యతిరేక ఓటుగానే ఫలితాన్ని ఇచ్చింది. 94లో మాత్రం ప్రపంచ బ్యాంక్‌ అభివృద్ధి నమూనా ప్లేటు తిప్పి చంద్రబాబు ప్రకటించిన జనాకర్షక పథకాల భ్రమగా ఫలించింది.
1971 తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణ ప్రజా సమితికి, 1983లో తెలుగుదేశం పార్టీకి, 2004లో కాంగ్రెస్‌ పార్టీకి అనుకూలమైన ఓటు రావడంలో యువతరం, మిలిటెంట్లు, పోలింగు బూతులోని ఎన్నికల సిబ్బంది నిర్వహించిన పాత్ర తక్కువేమీ కాదు.

తెలంగాణలో ప్రజలు ఎన్నికల బహిష్కరణను ఒక ప్రజాస్వామిక విలువను, స్వేచ్ఛాకాంక్షను చైతన్యంలోకి మార్చుకోవడంగా అమలు చేసారు. ఉదాహరణకు 1985లో ఎన్టీఆర్‌ను గవర్నర్‌ తొలగించినపుడు 1959లో కేరళలో నంబూద్రిపాద్‌ను తొలగించినప్పటికన్న ఉవ్వెత్తున ఎగసిన నిరసన ఉద్యమంలో రాడికల్స్‌దే కీలకపాత్ర. 1985లో ఎన్టీఆర్‌ మళ్లీ అధికారంలోకి రావడానికి అదే దోహదం చేసింది. కాని ఆ ఎన్టీఆరే ప్రజలు తనను నియంతగా ఎన్నుకున్నారనుకున్నట్లున్నాడు. విద్య, వైద్య రంగాలను ప్రైవేటీకరించి, ఎన్‌కౌంటర్లకు తోడుగా ‘మిస్సింగు’ హత్యలు చేసి, పదమూడు వేలమంది పై టాడా కేసులు పెట్టి, పౌరహక్కుల నాయకులను చంపించే దుర్మార్గ సంప్రదాయాన్ని ప్రారంభించి, ఆట, పాట, మాట బంద్‌ చేసి, అమరవీరుల స్థూపాలు కూల్చివేసి, కె.ఎస్‌. వ్యాస్‌కు పెద్దపీట వేయడానికి ‘గ్రేహౌండ్స్‌’ హంతక పోలీసు ముఠాను ప్రత్యేకంగా ఏర్పాటు చేసి 1989 డిసెంబర్‌ ఎన్నికల నాటికి తన గోయి తాను తవ్వుకున్నాడు. తీరా ఎన్నికలకు ముందు ఇంద్రవెల్లి, గద్వాల్‌ మొదలయిన స్థూపాలు పునర్‌ నిర్మాణం చేసినా, విప్లవకారులపై 84 కేసులు ఎత్తివేసుకున్నా, లాకప్‌ హత్యల న్యాయవిచారణ చేయిస్తానన్నా, ‘మిస్సింగు’ కేసులపై జస్టిస్‌ టిఎల్‌ఎన్‌ రెడ్డి కమిషన్‌ వేసినా, అతడు మారాడన్న విశ్వాసం ప్రజల్లో కలుగలేదు. ఓడిపోయాడు. 90లో తిరిగి అధికారంలోకి వచ్చి చెన్నారెడ్డి చేసినవి రెండే పనులు – 1969, 76, 78 లలో శ్రీకాకుళం, ఉభయ గోదావరి, ఉత్తర తెలంగాణ జిల్లాల్లో విధించిన ‘కల్లోలిత’ ప్రాంతాల చట్టాన్ని రద్దు చేసాడు. 90 జనవరి నుంచి మే దాకా బహిరంగ సభలు జరుగనిచ్చాడు. నర్మెట పోలీసు కాల్పులతో ఆ ముచ్చట తీరింది.

ఇంక 92 నుంచి ప్రభుత్వాలను పరోక్షంగానే కాదు ప్రత్యక్షంగా కూడ ప్రపంచబ్యాంకే నడిపింది గనుక పివి నరసింహారావు నూతన ఆర్థిక విధానాలను అమలు చేయడానికి నేదురమల్లి జనార్ధనరెడ్డి కావల్సి వచ్చాడు. ఆయన అధికారంలోకి రావడానికి వైఎస్‌ఆర్‌ సహకారంతో పాతబస్తీలో వందలమంది ముస్లింలపై దాడులు, హత్యలు, 92లో సంఘ్‌పరివార్‌ బాబ్రీ మసీదు విధ్వంసం విడిగా చూడాల్సిన అంశాలు కావు. 92లో పీపుల్స్‌వార్‌ దాని అనుబంధ సంస్థల నిషేధం, హయగ్రీవాచారి హత్య తర్వాత తెలంగాణలోకి సరిహద్దు రక్షణ ప్రవేశం కూడ విడిగా చూడాల్సిన అంశాలు కావు. భూ దురాక్రమణ గురించి రాసినందుకు జర్నలిస్టు గులామ్‌ రసూల్‌ హత్య మొదలుకొని ఇంజనీరింగు కాలెజీల ప్రైవేటీకరణ వరకు ప్రపంచ బ్యాంకు విధానాల ఒత్తిడి ప్రభావం చూడవచ్చు. కాకపోతే ఇరాక్‌ పై అమెరికా బాంబు దాడి మొదలు, బాబ్రీమసీదు విధ్వంసం వరకు, తెలుగునేల మీద వ్యక్తమయిన సామ్రాజ్యవాద, ఫాసిస్టు ప్రతికూల నిరసన, మండల్‌ కమిషన్‌ నివేదిక అమలుకు అనుకూలంగానూ ఇంజనీరింగు కాలెజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగానూ చేసిన పోరాటాలు హైకోర్టు తీర్పు పుణ్యమా అని ఫలించి జనార్దనరెడ్డి ప్రభుత్వం రాజీనామా చేయాల్సి వచ్చింది.

1994 ఎన్నికలకు సంక్షేమ పథకాలు, సారా నిషేధంలు అజెండా అయ్యాయి. రెండు రూపాయల కిలో బియ్యం, సారా నిషేధం, పీపుల్స్‌వార్‌పై నిషేధం ఎత్తివేయడం – ఎన్టీఆర్‌ ఎన్నికల ప్రచార నినాదాలైనవి. సరిగ్గా అవే ఆర్థికమంత్రిగా చంద్రబాబుకు ప్రపంచ బ్యాంక్‌ అభివృద్ధి నమూనాకు అమలు చేయడానికి గొంతులో వెలక్కాయిగా అడ్డుపడ్డాయి. ఫలితంగా వైస్రాయి హోటలు కుట్ర.

ఇంక 1996 నుంచి ఇప్పటి దాకా అమలవుతున్నదంతా సామ్రాజ్యవాద ప్రపంచీకరణ కార్యక్రమమే. ఇందులో భూసంస్కరణలుండవు, సంక్షేమం ఉండదు. ప్రాథమిక హక్కులుండవు.

అందుకే 2004 ఎన్నికలు చంద్రబాబు కూడ ఒప్పుకోక తప్పని రెఫరెండమ్‌ అయ్యాయి. నిజానికి ఈ ఎజెండాను తెలంగాణలో 2003లో జరిగిన పంచాయతీ ఎన్నికలు ముందుకు తెచ్చాయి. అవి 1) ప్రపంచబ్యాంక్‌ అభివృద్ధి నమూనా; 2) దానిని ప్రతిఘటిస్తున్న నక్సలైట్లతో బేషరతు చర్చలు; 3) ఆ అభివృద్ధి నమూనాకు ప్రయోగ శాలగా మారిన తెలంగాణను ప్రత్యేక రాష్ట్రంగా ప్రకటించి బతికించుకోవడం.

ఈ ఎన్నికల్లో బహిష్కరణ పిలుపు ప్రజలు ఎంతగా పట్టించుకోలేదంటే నక్సలైట్లే కాంగ్రెస్‌-టిఆర్‌ఎస్‌లకు ఓట్లు వేయమని చెప్పారని నలుగురూ భావించేంతగా.

మూడు సందర్భాల (తెలంగాణ, శ్రీకాకుళం, మళ్లీ తెలంగాణ) సాయుధ పోరాటాలు, రెండు సందర్భాల భూసంస్కరణలు (1952, 73) రెండు సందర్భాల ప్రత్యేక తెలంగాణ ఉద్యమాలు (1969-72, 1996 నుంచి మళ్లీ) రెండు సందర్భాల నక్సలైట్లతో శాంతి చర్చల (లాంఛనప్రాయంగా 2002, సీరియస్‌గానే అనిపించేలా 2004) ప్రజాస్వామిక హక్కుల చుట్టు, భూసంస్కరణల చుట్టూ తిరిగినవి. ప్రజలకు ఈ రెండు అంశాల పట్ల ఉన్న ఆకాంక్షలను బలంగా ముందుకు తెచ్చినవి.

2009 ఎన్నికల నాటికి 1985-89 నాటి స్థితి పునరావృతమైంది. ఒక్క విషయంలో 1951 కన్నా ముందున్న స్థితి పునరావృతమవుతున్నది. 1951 దాకా కమ్యూనిస్టు పార్టీ నాయకత్వంలో ప్రజలు స్వాధీనం చేసుకున్న భూమి మినహా తెలంగాణ అంతటా, ఆ మాటకు తెలుగు నేల అంతటా జమీందారీ వ్యవస్థ ఉన్నది. పెద్ద పెద్ద సంస్థానాలు ఉన్నాయి. తెలంగాణలో జాగీర్దార్లు, సర్ఫెఖాస్‌ రూపంలో కూడ భూమి అంతా ఫ్యూడల్‌ ప్రభువుల చేతుల్లో ఉన్నది. ఇందుకు ఆనాడు నైజాం ప్రభుత్వం, అండగా నిలిచిన బ్రిటిష్‌ వలస పాలన కారణమయ్యాయి.

ఇపుడు తెలంగాణలోను, తెలుగు నేలంతా దేశంలోనే అగ్రగణ్యంగా ప్రత్యేక ఆర్థిక మండలాల భూదురాక్రమణకు గురయింది. పులిచింతల, పోలవరం వంటి ప్రాజెక్టుల కింద భూమి ప్రత్యేక ఆర్థిక మండలాలు కాకుండా కూడ మునిగిపోతున్నది. ఆదివాసులు ముంపునకు గురవుతున్నారు. నిర్వాసితులవుతున్నారు.
ఫ్యూడల్‌ భూస్వామ్యాన్ని వీరోచితంగా ప్రతిఘటించిన సాయుధ పోరాట నేపథ్యంలో 1952 ఎన్నికలు జరిగాయి. అపుడు అన్ని పార్టీల ఎజెండా జమీందారీ, జాగీర్దారీ వ్యవస్థ రద్దు, రక్షిత కౌల్దారీ చట్టం, భూసంస్కరణలు. సామ్రాజ్యవాద భూస్వామ్యం ప్రజల్ని నిర్వాసితుల్ని చేస్తున్న నేపథ్యంలో 2009 ఎన్నికలు జరుగుతున్నాయి. కాని ఇపుడు ఏ ఎన్నికల పార్టీ ఎజెండాలోనూ భూసంస్కరణలు లేవు. ప్రజాస్వామిక హక్కులు లేవు. ప్రపంచ బ్యాంక్‌ అభివృద్ధి నమూనా పట్ల వ్యతిరేకత లేదు. సెజ్‌లపట్ల వ్యతిరేకతలో గానీ, పోలవరం, పోతిరెడ్డిపాడు, దేవాదుల, పులిచింతల వంటి ‘జలయజ్ఞం’ పట్ల వ్యతిరేకతలోగానీ వేలకోట్ల రూపాయల డబ్బు అధికార పార్టీ కాంట్ట్రార్లకు, వాళ్లద్వారా కాంగ్రెస్‌లోని వైఎస్‌ఆర్‌ కోటరీకో కుటుంబానికో పోగుపడుతున్నదన్నదే ప్రతిపక్షం ఉక్రోశం. ఎందుకంటే వీటిలో పోతిరెడ్డిపాడు విషయంలో తప్ప దేనిపట్లా టిడిపికి వ్యతిరేకత లేదు. తెరాస మొదటి రెండున్నర సంవత్సరాలు రాష్ట్రంలో కాంగ్రెస్‌తో అధికారం పంచుకున్నదే. కేంద్రంలో ఇంకా ఎక్కువ కాలమే కెసిఆర్‌, నరేంద్రలు మంత్రులుగానే ఉన్నారు. సిపిఐ, సిపిఎం లు నాలుగేళ్ల దాకా కాంగ్రెస్‌ను బలపరచినవే. పైగా బెంగాల్‌లో సింగూరులో, నందిగ్రామ్‌లో చేతులు కాల్చుకున్నవే. ఎన్నికలను ఒక పోరాట రూపంగా గుర్తించి పాల్గొంటున్న న్యూ డెమొక్రసీ వంటి ఎంఎల్‌ పార్టీలు మాత్రమే సెజ్‌లను వ్యతిరేకిస్తున్నాయి. పోలవరం ప్రాజెక్టు విషయంలో న్యూడెమొక్రసీ సమర్థిస్తున్నది. తెరాస పోలవరం, పులిచింతల, పోతిరెడ్డిపాడు వ్యతిరేకత ఇపుడు మహాకూటమిలో చేరడం వల్ల మరుగున పడిపోయింది. బిజెపి వంటి ఫాసిస్టు పార్టీ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత క్షేమం. పివి నరసింహారావు తర్వాత ఏకబిగిని ఐదేళ్ల సామ్రాజ్యవాద ప్రపంచీకరణను సమర్థవంతంగా అమలుచేసి భారతదేశం ప్రకాశిస్తున్నదని ప్రకటించింది అదే. ఆ ప్రకాశం వెనుక జ్వాలలన్నీ గుజరాత్‌ మారణకాండ నుంచి ఎగసినవే. కర్ణాటక దాకా విస్తరించినవే.

ఇంక ఇపుడు పరస్పరం అవినీతి, ఆశ్రిత పాలన వంటి అంశాలు, కుటుంబ పాలనలు మినహా మాట్లాడుకోవడానికి ఏమీలేవు.

ఈ స్థితిలో ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల్లో మిగిలిన ఎజెండా ఒక్కటే. అది తెలంగాణ. కాంగ్రెస్‌ కమిటీ వేసి, టిడిపి శాసనసభలో తీర్మానం చేసి, పిఆర్‌పి ప్రజలు కోరితే శాసనసభలో తీర్మానం చేసి తెలంగాణ తెస్తామంటున్నాయి. కాంగ్రెస్‌ నోటితో అభ్యంతరం లేదంటూ నొసలుతో ప్రజల్లో తెలంగాణకు అనుకూలత లేదంటున్నది. తెలంగాణకు వ్యతిరేకంగా ముస్లిం మైనారిటీ మనోభావాలంటూ ఎంఐఎం ను ఉసికొల్పుతున్నది.

బిజెపి ఏకంగా ఢిల్లీలో అధికారానికి వచ్చి నూరు రోజుల్లో తెలంగాణ ఇస్తానంటున్నది. నిన్నటికి నిన్న వెంకయ్యనాయుడు ఒక ప్యాకేజీ ప్రోగ్రాం ప్రకటించాడు. అధికారానికి వచ్చిన నెల రోజుల్లోనే తెలంగాణ ఇస్తాం. అధికారంలోకి వస్తే ఛత్తీస్‌ఘడ్‌లో వలె ఇక్కడ కూడ సాల్వాజుడుం ఏర్పాటు చేసి నక్సలైటు ఉద్యమాన్ని అణచివేస్తాం. పోటా పునరుద్ధరిస్తాం. అధికారానికి వచ్చిన నాలుగు రోజుల్లో అఫ్జల్‌గురును ఉరితీస్తాం. ఈ అంశాలన్నీ మానిఫెస్టోలో చేర్చామంటున్నాడు. ఒరిస్సా, కర్ణాటక అనుభవాల తర్వాత, వరుణ్‌గాంధీ రెచ్చగొట్టే ప్రసంగాలకు సంఘ్‌పరివార్‌ సంఘీభావం చూస్తుంటే బిజెపి వస్తే గిస్తే వచ్చే తెలంగాణ దయ్యపు బిడ్డ సంతానమే అవుతుంది.

ఏమైనా ఈ ఎన్నికల్లో చెప్పీ, చెప్పక, మానిఫెస్టోల్లో రాసీ రాయక అన్ని పార్టీల ఎజెండాగా అనుకూలంగానూ, అవకాశవాదంగానూ, ప్రతికూలంగానూ తెలంగాణ ఒక్కటే ఉన్నది. తెలంగాణ అంశం ఉండడమంటే విప్లవోద్యమ ప్రభావం ఉండడమనే అర్థం. ఎందుకంటే నలభై ఏళ్లుగా ఇప్పటి మావోయిస్టు పార్టీ ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర డిమాండును బలపరుస్తున్నది. అందుకోసం ఉద్యమాలు నిర్మించింది. పోరాడి త్యాగాలు చేసింది. ప్రజాస్వామిక ప్రత్యేక తెలంగాణ డిమాండ్‌ను 1996లోనే, తెరాస ఆవిర్భవాని కన్నా ముందే ప్రతిపాదించింది. 2004 నుంచి సిపిఐ ఎంఎల్‌ జనశక్తితో కూడ ఎన్నికల బహిష్కరణతో పాటు ప్రజల తెలంగాణ రాష్ట్ర డిమాండ్‌ను తన రాజకీయ కార్యక్రమంలో చేర్చింది. ఇపుడు న్యూ డెమొక్రసీ కూడ తెలంగాణ రాష్ట్ర డిమాండ్‌ను బలపరుస్తున్నది. (మానిఫెస్టోలో చేర్చినట్లు పత్రికల్లోనయితే రాలేదు) కమిటీలు, లాబీయింగులు మొదలు, తెలంగాణకు మోసం చేసిన కాంగ్రెస్‌ను మట్టికరిపించండి వరకు ఈ ఎన్నికల్లో ముఖ్యంగా తెలంగాణలో (అంటే మొదటి దశ ఎన్నికల్లో) తెలంగాణయే ఏకైక ఎజెండాగా ఉన్నది. ఇది ప్రజల ఎజెండాగా ప్రకటించే క్రమంలో ప్రజలు ఎన్నికల పార్టీల పట్ల ఎటువంటి వైఖరి తీసుకుంటారో, అది ఏ రూపంలో ప్రకటిస్తారో చూడాల్సే ఉన్నది.

(హైదరాబాదు, 09.04.2009)

(వరవరరావు.ఆర్గ్ సౌజన్యం తోటి)

3 Responses to “ఎన్నికలు – తెలంగాణ ప్రజల ఆకాంక్షలు – ఒక విహంగ వీక్షణం”

  1. 1
    sagar Says:

    Can you explain what do you mean by “ఆ ప్రకాశం వెనుక జ్వాలలన్నీ గుజరాత్‌ మారణకాండ నుంచి ఎగసినవే. కర్ణాటక దాకా విస్తరించినవే”.

  2. 2
    sreenath from bangalore Says:

    He is criticising BJP govt. by mentioning that gujarath maranakanda (attacked on muslims) and karnataka incident (section of people recently attacked on christians,after formation of BJP govt.)…. it’s fact only

  3. 3
    Debroah Brownfield Says:

    I feel one of your advertisements triggered my internet browser to resize, you might want to put that on your blacklist.

Leave a Reply

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

Managed by Discover Telangana Inc., a registered nonprofit organization in USA.

All opinions and views expressed by third party content providers and shown here as preview are not that of Discover Telangana.

If you find any Content that is infringing, libelous, defamatory, obscene, abusive, offensive or otherwise violation of copyright law, alert us by emailing us at discover.telangana(at)gmail.com