Feed on
Posts
Comments

Malividata Vyakhyalu

ఈ దేశంలో ప్రజాస్వామ్యం ఇంతకాలం బతికి బట్టకట్టడానికి కారణం ప్రజలే తప్ప ప్రభువులు కారనడానికి గురువారం నాటి తొలిదశ పోలింగ్‌ సరళీ, పోలింగ్‌ ముగిసీ ముగియకముందే ముఖ్యమంత్రి ప్రదర్శించిన బాధ్యతారాహిత్యం మరోసారి రుజువు చేశాయి. కష్టనిష్టూరాలకు ఓర్చి ప్రజలు ఓటర్లుగా తమ బాధ్యతను నెరవేర్చుకున్నారు. కానీ రాజకీయలోకానికి ఆదర్శంగా నిలబడవలసిన పదవిలో ఉండి కూడా ముఖ్యమంత్రి వై.ఎస్‌. తెలంగాణలో పోలింగ్‌ ముగిసిన క్షణాన, ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. ఓట్ల కోసం నోరుజారి పిసిసి అధ్యక్షుడు ఎన్నికల కమిషన్‌ చేత చీవాట్లు తిని ఎంతో కాలం కాకముందే, ముఖ్యమంత్రి అంతకు అనేక రెట్లు మించిన వాచాలత్వాన్ని చూపించడం ఆందోళనకరం.

రాష్ట్రంలోని తొలిదశ పోలింగ్‌లో ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాలను మినహాయిస్తే, మిగతా స్థానాలన్నీ తెలంగాణలోనివే. దీంతో గురువారం పోలింగ్‌ సమయం గడవడమే తరువాయి- కర్నూలు జిల్లా నంద్యాలలో ఎన్నికల ప్రచారసభలో వై.ఎస్‌. నోటిదురుసు ప్రదర్శించారు. చంద్రబాబు అధికారంలోకి వస్తే, రాయలసీమకు నీళ్లుండవని, పులిచింతల పూర్తికాదని, టిఆర్‌ఎస్‌ నేత చంద్రశేఖరరావు హెచ్చరించినట్టుగా, ‘మనం’ హైదరాబాద్‌లో ఏ పనీ చేసుకోవడానికి వీలుండదని, సీమ వాసులు హైదరాబాద్‌లో విదేశీయులుగా బతకవలసి వస్తుందని భయపెట్టే రీతిలో మాట్లాడారు. వ్యాపారాలు చేసుకోవడం సాధ్యపడదన్నారు. రెండో దశ ఎన్నికలకోసం ఇటువంటి ప్రచార వ్యూహాన్ని ముందే సిద్ధం చేసుకుని అయినా ఉండాలి,లేదా మొదటి దశ పోలింగ్‌లో ‘తేడా’ వచ్చినట్టు వేగులు సమాచారం అందించిన తరువాత అప్పటికప్పుడు రూపొందించిన అస్త్రమైనా అయి ఉండాలి.

ఏదైనాసరే, రాజకీయ లబ్ధి కోసం, నాలుగు ఓట్ల కోసం ప్రమాదకరమైన క్రీడలకు పాల్పడడం దారుణం. ఏదో ఒక ఉద్యమ సందర్భంలో కెసిఆర్‌ కానీ, తెలంగాణ ఉద్యమనాయకులు కానీ ఇతర ప్రాంతాల వ్యాపారుల గురించి, జలపంపకాల్లో వివక్ష గురించి మాట్లాడి ఉంటారు. దాన్ని ఇతర ప్రాంతాల తెలుగువారు ఎప్పుడూ శత్రుపూరిత వ్యాఖ్యలుగా పరిగణించలేదు. ఎందుకంటే, ఏడేళ్లుగా సాగుతున్న మలిదశ తెలంగాణ ఉద్యమం ఒక్క ప్రాణాన్ని కూడా బలిపెట్టకుండా శాంతియుతంగా సాగుతున్నది. స్థానికుల పొట్ట కొట్టేవారి మీదనే తప్ప, బతుకుతెరువు కోసం వచ్చినవారి మీద తమకు కోపం కానీ, అభ్యంతరం కానీ లేదని ఉద్యమనాయకులు అనేక సందర్భాలలో చెబుతూ వస్తున్నారు, ఆచరణలో అందుకు భిన్నంగా ఎప్పుడూ జరిగింది లేదు. ఉద్యమం ఇంత సహనంతో, శాంతియుతంగా సాగుతున్నందునే కావచ్చు, రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలవారు కూడా తెలంగాణ ఉద్యమాన్ని సానుభూతిగా అర్థంచేసుకోవడం, సమ్మతించడం జరిగాయి.

ఆ సమ్మతికి ప్రతిఫలనంగానే తెలుగుదేశంతో సహా అనేక ప్రధాన పక్షాలు తెలంగాణ ఆకాంక్షకు ఆమోదాన్ని, సమర్థనను తెలిపాయి. సైద్ధాంతిక అభ్యంతరం ఉన్నప్పటికీ, క్రియాశీలంగా అడ్డుపడబోమని మార్క్సి స్టు పార్టీ కూడా పదే పదే సూచిస్తున్నది. త్వరలోనా, ఆలస్యంగానా అన్నదే తప్ప- తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం ఖాయం అన్న వాతావరణం ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొని ఉన్నది.

తెలంగాణ ఉద్యమానికి మద్దతుదారుగా తెలుగుదేశం పార్టీ కొత్తగా రంగంలోకి వచ్చింది కానీ, దానికి ప్రోత్సాహాన్ని, సహాయాన్ని అందించిన పక్షం కాంగ్రెస్‌పార్టీ, అందులోనూ రాజశేఖరరెడ్డి. ప్రతిపక్షనేతగా ఉన్నప్పుడు- కాంగ్రె స్‌ శాసనసభ్యులను ఢిల్లీకి పంపించి, ప్రత్యేక పీసీసీని డిమాండ్‌ చేయించి, 2004 ఎన్నికల్లో టిఆర్‌ఎస్‌తో పొత్తును కోరుకున్నది ఎవరు? ఆ తరువాత మాట మార్చి కొత్త పల్లవి ఎత్తుకుని ఉండవచ్చును కానీ, గతాన్ని మరచిపోయి, విద్వేషప్రచారానికి తెగబడడం ఎందుకు? రాయలసీమ, కోస్తా వాసులను ఏదో విధంగా భద్రతారాహిత్యానికి, ఆందోళనకు గురిచేసి ఓట్లు రాల్చుకుని పబ్బం గడుపుకోవాలను కోవడం ఏమి రాజకీయం? తెలంగాణ రాష్ట్రం వస్తే, తక్కిన ప్రాంతాలవారు హైదరాబాద్‌లో విదేశీయులెందుకు అవుతారు? తమిళులను ఎదిరించి, ప్రత్యేక రాష్ట్రం సాధించుకున్న తరువాత కూడా కోస్తాంధ్ర, రాయలసీమ సంపన్నులు మద్రాసునగరంలోనే దీర్ఘకాలం ఎలా కొనసాగగలిగారు? 1980 దశకం తరువాత కదా, హైదరాబాద్‌ను తెలుగునగరంగా గుర్తించి స్థిరపడింది? మహారాష్ట్ర నుంచి వేరయినతరువాత కూడా గుజరాతీలు ముంబైనగరంలో ముఖ్యసమాజంగా జీవిస్తున్నారే? హైదరాబాద్‌కు మాత్రం ఎందుకు ఆ సమస్య వస్తుంది? సమస్య వస్తుందని కాదు, తెలంగాణపార్టీతో పొత్తు పెట్టుకున్న టిడిపిని మలిదశ పోలింగ్‌లో రాజకీయంగా దెబ్బతీయడానికి ఇటువంటి అనైతిక విమర్శలకు పాల్పడ్డారు.

Videshiyulu

నిజంగానే అటువంటి భయావహ వాతావరణం ఉన్నదనుకుంటే, మొదటిదశ ప్రచారంలో ఎందుకు ఆ మాటలు మాట్లాడలేదు? తెలంగాణ ప్రజలను మభ్యపెట్టి, ఆ తరువాత వారిమీద బురద జల్లి, ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడం ఏమి నీతి? ముఖ్యమంత్రులను మార్చడానికి మతకలహాలు రెచ్చగొట్టడం, సొంతపార్టీ ప్రధానమంత్రి మీదనే చెప్పులు వేయించడం వంటి రాజకీయ ముఠాచర్యలకు అలవాటు పడ్డవారికి శాంతిభద్రతలను కాపాడవలసిన బాధ్యతపై పెద్ద గౌరవం ఉండకపోవచ్చు. వారు చెప్పుకుంటున్నట్టు, తిరిగి అధికారంలోకి వస్తే, ముఖ్యమంత్రిగా తెలంగాణ ప్రజల ముందుకు ఏ ముఖం పెట్టుకుని వెడతారు? మొదటి దశ పోలింగ్‌లో తమకు వ్యతిరేక గాలి వీచిందని ఎం.ఎస్‌. వంటి సీనియర్‌ నాయకులు స్వయంగా ప్రకటిస్తున్నారు.

ఓటరు తీర్పు ఏమైనప్పటికీ, తొలిదశ పోలింగ్‌ కాంగ్రెస్‌ వారిని భీతిల్ల చేసినట్టుంది. అయినప్పటికీ, ఎంత నిర్వేదం ఆవరించినప్పటికీ, ప్రజల మధ్య విద్వేషాలు రగల్చడం తగని రాజకీయం. రోజుకో మాట మార్చే నాయకులు నేడు తమ సార్థం కోసం రోజుకో ప్రాంతం ప్రజలను రెచ్చగొట్టగలరు. తమ అవినీతి యజ్ఞంలో భాగంగా రేపు రాష్ట్రాన్ని రెండు కాదు గదా నాలుగు ముక్కలు చేయడానికీ వెనుకాడరు.

రాష్ట్ర శ్రేయస్సుపై నిబద్ధత, ప్రజల పట్ల అంకిత భావం గల నాయకులు తొందర పాటు లేకుండా, అన్ని కోణాలు ఆలోచించి, నిర్ణయాలు తీసుకుంటారు. సమస్యను సాకల్యంగా పరిశీలిస్తారు, తప్ప తొందరపాటును ప్రదర్శించరు. తమ రాజకీయ లబ్ధి కోసం ప్రజలను రెచ్చగొట్టరు. అభివృద్ధిలో సమన్యాయం కోసం రాష్ట్రం విడిపోవలసి వస్తే, ఆ వేర్పాటును భౌతిక విభజనకే పరిమితం చేసి, మానసిక ఐక్యతను పటిష్టం చేయడానికి పూనుకుంటారు. అటువంటి విశ్వసనీయమైన నాయకత్వమే ఈ కీలకమైన తరుణంలో రాష్ట్రానికి అవసరం.

(17 ఎప్రిల్ 2009, ఆంధ్రజ్యోతి సంపాదకీయం సౌజన్యం తోటి)

* * *

‘విష’వసనీయత!

ఓటు వేసే వరకు ఓటు మల్లన్న… ఓటు వేశాక ఓటి మల్లన్న!

- శంకరనారాయణ

వైఎస్‌ నోరు తెరిస్తే చాలు తన విశ్వసనీయత గురించి కథలుకథలుగా చెబుతున్నారు! ఈ ఎన్నికలు వంచనకూ… విశ్వసనీయతకూ పోరంటున్నారు! ఇంతకూ… ఆయన విశ్వసనీయత ఎవరికన్నదే అసలయిన ప్రశ్న! జనానికా? సొంత పార్టీకా? సొంత పార్టీ (గత) ముఖ్యమంత్రులకా? నీతి పరులకా? అవినీతిపరులకా? ఎవరికనేది చర్చనీయాంశం! నిజంగా వైఎస్‌ విశ్వసనీయత జనం పట్లనే అయితే మొన్న ‘ఆ’ మాటలెందుకన్నారు? అసలు రంగు ఎందుకలా బయటపెట్టుకున్నారు? మహా కూటమి అధికారంలోకి వచ్చి తెలంగాణ ఏర్పడితే హైదరాబాద్‌లో కోస్తా, రాయలసీమ వాళ్లు విదేశీయుల్లాగా బతకాల్సి వస్తుంద“నే ఆగ్రహ భాషణం … తెలంగాణలో పోలింగ్‌ కాగానే ఎందుకు చేసినట్లు? ఈ ముక్కేదో ముందే ఎందుకు చెప్పలేదంటే… అదే మరి ఆయన విశ్వసనీయత! ఆ మాట చెబితే ఓట్లు రాలవనేగా! ‘జన్మ జన్మాల బూజు’ అనిపించుకున్న నిజాం రాజు కూడా ఇటువంటి మాటలన లేదు. ఓటు వేసే వరకు ఓటు మల్లన్న… ఓటు వేశాక ఓటి మల్లన్న! రెండో ఎస్సార్సీ పాఠం… ప్రణబ్‌ కమిటీ… సీఎంపీలో తెలంగాణ ప్రస్తావన… రోశయ్య కమిటీ… ఇవన్నీ వై.ఎస్‌. విశ్వసనీయతకు నిలువుటద్దాలు!

Visha Vasaniyata“అబ్బబ్బే నా ఉద్దేశం అదికాదు… తెరాసతో తెలుగుదేశం పొత్తు పచ్చి అవకాశవాదం” అనేది రాజావారి తాజా మాట! మరి ఈ తెరాసతో పొత్తు పెట్టుకునేగా 2004లో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిందీ? మరి అప్పుడు రాజా వారిది అవకాశవాదం కాదా? తెలంగాణా గురించి అప్పుడేమన్నారు? భారతీయులు ఏ రాష్ట్రం వారైనా వీసాలు, మోసాలు లేకుండానే దేశంలో ఎక్కడయినా స్వదేశీయులుగా ఉండవచ్చు. ఇవేవీ ‘రాజ’ కోటలు కావు, పరాయి వారికి ప్రవేశం లేదనడానికి! తెలంగాణ మీద అక్కసును… కోస్తా, రాయలసీమల మీద వలగా విసిరి భయభ్రాంతులను చేయడానికి ఎంచుకున్న సమయంలోనూ ఎంత మోసం? చెప్పేది జయహో… మనసులోనేమో భయహో! ప్రస్తుతం ఆయన సమైక్య రాష్ట్ర ముఖ్యమంత్రి! ఇన్ని మాటలన్నాక… ఒకవేళ మళ్లీ గెలిస్తే ఈ రాష్ట్రానికి తగుదునమ్మా అని ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి ఆయనకు నైతిక హక్కు ఉంటుందా?

జనం పట్ల సరే… కాంగ్రెస్‌ పట్ల ఆయన విశ్వసనీయత ఎలాంటిది? ఇందిరాగాంధీ పట్ల విశ్వసనీయత ఎలాంటిది? ముఖ్యమంత్రిగా దక్కిన అవకాశంతో ‘ఇందిరమ్మ రాజ్యం’ అని రోజూ కలవరిస్తున్న ఆయన ఇందిరాగాంధీ బతికి ఉండగా ఆమెను వ్యతిరేకించారు. రెడ్డి కాంగ్రెస్‌ పార్టీని నెత్తికెత్తుకున్నారు. అదీ ఇందిరమ్మ పట్ల ఆయన విశ్వసనీయత! పోనీ సొంత పార్టీ ప్రధానమంత్రి, ముఖ్యమంత్రుల పట్ల ఆయన విశ్వసనీయత ఎలా ఉంది? మర్రి చెన్నారెడ్డి, విజయ భాస్కర్‌రెడ్డి ఎవరైతేనేం వారికి ఆయన ‘సింహ స్వప్నమే’. అప్పుడాయన ప్రతిపక్ష నాయకుడా అంటే అదీ కాదు! సొంతపార్టీలోనే వింత కుంపటి! అలా తాను గెలవడానికి కాంగ్రెస్‌ను ఉపయోగించుకున్నారు. పార్టీ ముఖ్యమంత్రులతో సహా పార్టీలోని ఇతర ముఠాలనూ ఆయన కాంగ్రెస్‌ వాళ్లను ఉపయోగించుకునే దెబ్బ తీశారు!

రాజకీయాల్లో ఇటువంటి ఎత్తుగడలు సహజమే అనుకోవడానికీ వీల్లేదు. మర్రి చెన్నారెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా పాతబస్తీలో మత కల్లోలాలు చెలరేగాయి. ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. అప్పుడు చెన్నారెడ్డి ప్రతి పక్షాలను నిందించలేదు. సొంత పార్టీ నాయకుడైన వైఎస్‌ వైపు వేలెత్తి చూపి లబోదిబోమన్నారు. ఇంత కంటే వైఎస్‌ విశ్వసనీయతకు వేరే గుర్తు ఉంటుందా! ఒక్క చెన్నారెడ్డే ఇలా ఇబ్బంది పడ్డారంటే వైఎస్‌ను తక్కువ అంచనా వేసినట్లే అవుతుంది! వైఎస్‌ విశ్వసనీయత ‘రుచి చూసిన’ వాళ్లలో దివంగత ప్రధానమంత్రి పీవీ నరసింహారావు కూడా ఉన్నారు. ప్రధానమంత్రిగా పీవీ; ముఖ్యమంత్రిగా విజయభాస్కరరెడ్డి పాల్గొన్న సభలో ఉన్నట్టుండి చెప్పులు పడ్డాయి! అందరి వేళ్లూ వైఎస్‌ వర్గం వైపే వేలెత్తి చూపాయి! “వైఎస్‌ గారూ ఆ చెప్పులు ఎందుకు పడ్డా”యంటే అవి పీవీ, విజయభాస్కరరెడ్డిల మీదికి విసిరినవి కాదు… మైసూరారెడ్డి మీదికి అని జవాబిచ్చారు. ఇదీ పార్టీ అగ్రనేతల పట్ల వైఎస్‌ విశ్వసనీయత! బుష్‌, చిదంబరం, అద్వానీ వంటి దేశ, విదేశీ నేతల మీద ఇప్పుడు చెప్పులు పడితే అందరూ ముక్కున వేలేసుకుంటున్నారు. ఈ ‘కళ’కు మూలపురుషుడెవరో తెలుసుకుంటే ఆయన ‘విశ్వసనీయత’ నషాళానికంటుతుంది.

పోనీ… తనను నమ్మిన పార్టీ నాయకుల పట్త్లెనా వైఎస్‌కు విశ్వసనీయత ఉందా అంటే… అబ్బో… అంత కన్నా ‘హాస్యచిత్రం’ ఏముంటుంది? ఎన్నో గాలి కబుర్లు బయటపడుతాయి! గాలి ముద్దుకృష్ణమ నాయుడు వంటి వారిని దగ్గరకు తీసి ఆయనే కంగుతినేట్లు ‘విశ్వసనీయత’ రుచి చూపించారు. అతడనేక ఎన్నికల యుద్ధాల్లో ఆరితేరిన వృద్ధమూర్తి అనిపించుకొన్న పెన్మత్స సాంబశివ రాజుకు అసెంబ్లీ టికెట్‌ ఇవ్వనప్పుడే తేలిపోయింది వైఎస్‌ విశ్వసనీయత ఏపాటిదో! పోనీ తనను నమ్ముకున్నవాళ్ళ పట్లయినా విశ్వసనీయత చూపించారా… అంటే అదీ లేదు. అందుకు మారెప్ప, గొల్లపల్లి సూర్యారావులే నిదర్శనం. టికెట్‌ దక్కని కుతూహలమ్మ కంట కన్నీరొలికిన తర్వాతనే కదా ఆమెకు టిక్కెట్టు లభించింది. ‘ఆహా! మందకృష్ణ… ఓహో! మందకృష్ణ’ అన్న వైఎస్‌ ఆయన పట్ల సమయానికి ‘విశ్వసనీయత’ ప్రదర్శించారు. ఆయన నిజ స్వరూపం చూసి అందరూ బిత్తరపోయారు. తాను ముఖ్యమంత్రి కాగానే … తన విజయానికి తోడ్పడ్డ తెలంగాణలోని కాంగ్రెస్‌ సీనియర్లు ఆయనకు కరివేపాకులై పోయారు. ‘నిచ్చెనలను’ తన్నేయడం కన్నా విశ్వసనీయత ఏముంటుంది? అంతెందుకు కనీసం మిత్రపక్షాల పట్ల అయినా ఆయన విశ్వసనీయత ఎంతో తెలుసుకుంటే గుండె బలహీనంగా ఉన్న వాళ్లు తట్టుకోలేరు. మిత్రపక్షమై, తన మంత్రివర్గంలో కూడా భాగస్వామి అయిన తెరాసను నిలువునా చీల్చి తన విశ్వసనీయతను ‘విశ్వరూపం’గా ప్రదర్శించారు. రోజూ ఆయన ‘చేవెళ్ల చెల్లెమ్మ’ అంటూ పలవరించే సబితా ఇంద్రారెడ్డికీ అవసరమైన సమయానికి ‘చెయ్యి’చ్చి విశ్వసనీయ సెంటిమెంట్‌ను అనుభవంలోకి తెచ్చారు.

పోనీ రాజకీయంగా కుటుంబ సభ్యుల మీదైనా విశ్వసనీయత చూపించారా … అంటే దిక్కులు చూడాల్సిందే! గత ఎన్నికల్లో కడప ఎంపీగా ఎన్నికైన సోదరుడు వివేకానంద రెడ్డితో గెలిచిన కొద్ది నెలల్లోనే రాజీనామా చేయించాలని చూశారు. యువరాజు జగన్‌కు ఆ సీటు కట్టబెట్టాలనుకున్నారు. కాంగ్రెస్‌ అధిష్ఠానం అడ్డుపడకపోతే వివేకానందరెడ్డి పట్ల వై.ఎస్‌. విశ్వసనీయత అప్పుడే పంచరంగుల్లో కనిపించేది. జగన్‌ కోసం ఈ ఎన్నికల్లో ఆయన్ను పక్కనబెట్టారు.

వైఎస్‌ విశ్వసనీయత చెబుతుంటే ఓ పెద్దగ్రంథమే అవుతుంది. ఎంతో మంది ఆంతరంగికులు తమ పాత్రల్ని పోషిస్తూ ప్రదర్శనమిస్తారు. అయినవాళ్ళలో ‘కొందరి’ పట్ల ఆయన విశ్వసనీయత తిరుగులేనిది! ఎవరికీ అర్థం కానిది! ఆయన విశ్వసనీయత చూపించాలంటే ఏం లక్షణాలు ఉండాలో తెలుసుకోలేని అభాగ్యులను ఎవరూ రక్షించలేరు.

ఎవరైనా ఎన్నికల తర్వాత ‘విజయఢంకా’ మోగిస్తారు. తర్వాత అవకాశం ఉండదని తెలుసుకోవడం వల్లనేమో ఆయన ఎన్నికల ముందే ఢంకా మోగించారు. మలి దశ అయితే పరిస్థితి ఎలా ఉంటుందోనని భయపడి తొలి దశ కాగానే ‘సెంచరీ కొట్టేశాం’ అంటూ గాంధీ భవన్లో సంబరాలు జరిపారు. తర్వాత ఒకటి రెండు గంటలు కూడా కాకుండానే ‘మహా కూటమి అధికారంలోకి వచ్చి తెలంగాణా ఏర్పడితే ఏమేమి కష్టాలు వస్తాయో‘ ఊహించి ఏకరువు పెట్టారు. ఇదే తెరాసతో పొత్తు పెట్టుకొని తెలంగాణా ఇస్తామని 2004లో వైఎస్‌ ముఖ్యమంత్రి అయ్యారు. అప్పుడు ఈ కష్టాలేవీ ఆయన ఊహించలేదు. మొత్తానికి ‘రాజశేఖర రెడ్డి బాధ రాష్ట్రానికి బాధ’ అనిపించారు.

ఎన్టీఆర్‌ గెలవడం ఖాయమని, ఎన్నికల ఫలితాలకు ముందే అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ పసికట్టారు. ‘ఎన్టీఆర్‌ అధికారంలోకి వచ్చినా ఎన్నాళ్లు అధికారంలో ఉంటారులే’ అన్నారు. ఆ తర్వాత తన మాటను నిలబెట్టుకోవడానికి ప్రయత్నించి భంగపడ్డారు! రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకు వ్యతిరేకంగా ఆమె ఒక్క ముక్కా అనలేదు. ఇప్పుడు వైఎస్‌ అంటున్నారు. ఆయన విశ్వసనీయత అంతే మరి!

(18 ఎప్రిల్ 2009, ఈనాడు సౌజన్యం తోటి)

5 Responses to “ఛీ! ఇదేం బాధ్యతారాహిత్యం!”

  1. 1
    వైఎస్‌ పునరుద్ఘాటన Says:

    నా వ్యాఖ్యల్లో తప్పేమీ లేదు: వైఎస్‌ పునరుద్ఘాటన

    గుంటూరు, ఏప్రిల్‌ 18 : ‘తెలంగాణ’ అంశంపై తాను చేసిన వ్యాఖ్యలను వైఎస్‌ మరోసారి సమర్థించుకున్నారు. ఆనాడు అదే వ్యాఖ్యలు కెసిఆర్‌ పదే పదే చేస్తే తప్పుపట్టని వారు, ఇప్పుడు తనను మాత్రం ఎందుకు తప్పుపడుతున్నారని వైఎస్‌ ఎదురు ప్రశ్నించారు. మహాకూటమి అధికారంలోకి వస్తే అసలు ఏం జరుగుతుందో ఊహించలేమని వైఎస్‌ భయాందోళనలు వ్యక్తం చేశారు.

    ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం వచ్చిన తరువాత ఆంధ్ర వాళ్ళను తరిమి కొడతామని కెసిఆర్‌ గతంలో చేసిన వ్యాఖ్యలను ఎవరూ ఎందుకు ఖండించలేదని శనివారం వైఎస్‌ ప్రశ్నించారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం వస్తే పోతిరెడ్డి పాడుకు నీళ్ళు రానివ్వరని, సెటిలర్లు విదేశీయులుగా బతకవలసి వస్తుందని తాను చేసిన వ్యాఖ్యల్లో తప్పేమీ లేదని, ఆనాడు కెసిఆర్‌ చేసిన వ్యాఖ్యల కంటే ఇవి పెద్దవేమీ కాదని వైఎస్‌ సమర్థించుకున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత ఆంధ్ర విశ్వవిద్యాలయాలను రద్దు చేస్తామని కెసిఆర్‌ చెప్పడాన్ని విశ్లేషిస్తే తన వ్యాఖ్యల్లో అంతరార్థాం అవగతమవుతుందని అన్నారు. పోలవరానికి వ్యతిరేకంగా కెసిఆర్‌ కోర్టులో వ్యాజ్యం దాఖలు చేయడాన్ని వైఎస్‌ ఎత్తిచూపారు. తన వ్యాఖ్యలకు దురుద్దేశాలు ఆపాదించి ప్రచారం చేస్తున్న చంద్రబాబు ఇప్పుడు కెసిఆర్‌తో ఆనాడు తాను అన్న వ్యాఖ్యలు తప్పు అని చెప్పించగలరా? అని వైఎస్‌ ఎదురు ప్రశ్నించారు.

    తమతో కలిసి ఉన్నప్పుడు పోలవరంపై మాట్లాడని సిపిఎం, ఆ తరువాత ఉద్యమాలు చేయడం చూస్తుంటే మహాకూటమి అధికారంలోకి వస్తే ఏం జరగబోతుందో ఎవరైనా ఊహించగలరా? అని వైఎస్‌ ప్రశ్నాస్త్రాలు సంధించారు. తెలంగాణ ప్రాంతానికి చెందిన కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌్‌ నేతలు తన గురించి మంచిగా మాట్లాడడం వల్లనే అధిష్టానం వద్ద తన పరపతి పెరిగిందంటూనే, కెసిఆర్‌ వ్యాఖ్యలను అదే సీనియర్లు ప్రశ్నించకపోవడానికి కార ణం ఏమిటని నిలదీశారు. పోతిరెడ్డి పాడు, పోలవరం నిర్మిత ప్రాంతానికి వెళ్ళినపుడు ఆయా ప్రాంత ప్రజలకు అనుగుణంగా మాట్లాడడం తప్పెలా అవుతుందని గుంటూరులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వైఎస్‌ తనను తాము సమర్థించుకున్నారు. మొత్తానికి కెసిఆర్‌తో తనను తాను పోల్చుకుని తమ పార్టీలో ఉన్నంత అంతర్గత ప్రజాస్వామ్యం మరెక్కడా లేదని ఆయన స్వీయ ప్రశంసలు జల్లుకున్నారు.

    (18 ఎప్రిల్ 2009, ఆంధ్రజ్యోతి సౌజన్యం తోటి)

  2. 2
    ప్రొ. బి.ఆర్‌.బాపూజీ Says:

    ఒక దళారీ దేశభక్తి!
    తెలంగాణ ప్రాంతం ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడితే, మిగతా ప్రాంతాల వాళ్లు, ముఖ్యంగా రాయలసీమ ప్రజలు, హైదరాబాదులో విదేశీయులుగా బతకవలసి వస్తుందని ముఖ్యమంత్రి, ఎన్నికల ప్రచార సభలో అన్నారు. తెలంగాణలో ఓట్ల పని ముగిసీ ముగియగానే, అప్పటిదాకా ఇలాంటి ప్రమాదాన్ని ప్రస్తావించని ముఖ్యమంత్రి, ఇలా అనడం ఓట్ల కోసం ఎత్తే నీచ ఎత్తుగడలలో నీచాతి నీచమైందనే విషయాన్ని, ఇతర రాజకీయ పక్షాలూ, తెలంగాణ మేధావులూ, సంస్థలూ గట్టిగానూ, చాలా వరకూ సరిగానే ఖండించాయి. ఆ ఖండనల్లో ప్రస్తావనకు రాని ఒక విషయాన్ని, తోటి పాఠకుల దృష్టికి తేదల్చుకున్నాను. ప్రత్యేక ఆర్థిక మండళ్ల పేరుతో (‘సెజ్‌’ల పేరుతో) విదేశీ కంపెనీలకు వేల వేల ఎకరాలు దోచిపెట్టిన వారిలో అగ్రగణ్యుడు ఈ ముఖ్యమంత్రి. చట్టాలలో సెజ్‌లకు కట్టబెట్టిన నిరంకుశాధికారాలు చూస్తే, భారత దేశంలోనే అనేక విదేశాలు తయారవుతాయి.

    స్వదేశంలోనే విదేశీపాలనా ప్రాంతాల్ని ఏర్పాటు చేసుకోనిచ్చి కమీషన్లు దండుకున్నది ఈ ముఖ్యమంత్రే. అలాంటి ప్రభుత్వాధినేత ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును విదేశీ పాలనగా చిత్రించడం పాలక పక్ష దళారీ రాజకీయానికి నిదర్శనం. ప్రత్యేక తెలంగాణ అనేది ఎంత చిన్న కోరిక! ‘విద్యా పరంగా, సాంఘికంగా’ వెనకబడిన కులాలు అడిగే రిజర్వేషన్ల వంటి తాత్కాలిక ఉపశమనాన్ని ఆశించే కోరిక. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే నీళ్లూ, నిధులూ, నియామకాలూ! ఇంతేగా! ఉన్న జలవిధానం ప్రకారమైనా, తమకు రావాల్సిన నీళ్లని అడగడం ఏం పెద్ద కోరిక? ‘పెద్దమనుషుల ఒప్పందం’ ప్రకారం అయినా రావాల్సిన నిధులూ, నియామకాలూ రానప్పుడు ప్రత్యేక రాష్ట్రం అడిగితే, అదేమన్నా గొంతెమ్మ కోరికా? కాకపోతే, దొరల తెలంగాణ కాదు, సామాజిక తెలంగాణ కావాలనడమూ; ఎన్‌కౌంటర్లు లేని ప్రజాస్వామిక తెలంగాణ కావాలనడం మాత్రం గొంతెమ్మ కోర్కెలే! సామాజిక తెలంగాణ అంటే ఈ దోపిడీ ప్రభుత్వంలోనే కీలక పదవుల్లో అగ్రకులాలకు చెందినవారు కాక, వెనకబడిన కులాలకు చెందినవారే ఉండే తెలంగాణ.

    దీనివల్ల, అగ్రకుల దొరలు రెండో స్థానంలోకీ, వెనకబడిన కులాల నయాదొరలు మొదటి స్థానంలోకి వస్తారు. మొత్తం మీద ఈ రకం సామాజిక తెలంగాణ శ్రమ దోపిడీనీ, కులాల శ్రమ విభజననీ అరిగట్ట గలిగేది కాదు. అలాగే, ఎన్‌కౌంటర్లు లేని ప్రజాస్వామిక తెలంగాణ అనే నినాదం కూడా! సైన్యమూ, ప్రత్యేక పోలీసూ, గుఢాచారి శాఖా వగైరా అణచివేత సాధనాలు ఉన్నంతకాలం ఎన్‌కౌంటర్లూ, ఏక వర్గ ప్రజాస్వామ్యమూ మాత్రమే ఉంటాయి. కాబట్టి ప్రజాస్వామిక తెలంగాణ అనేది కూడా అర్థంలేని డిమాండు. అందుచేత. ‘నీళ్లూ – నిధులూ – నియామకాలూ’ అనే నినాదంతో కూడిన ప్రత్యేక తెలంగాణ అన్నదే, ప్రస్తుతానికి, సరైన, భ్రమలు కల్పించని డిమాండు. మళ్లీ దాంట్లోకి ‘ఆత్మగౌరవం’ అనే బ్రహ్మపదార్థాన్ని తీసుకురాకూడదు. శ్రమదోపిడీ, అసమాన శ్రమ విభజనా అనే వ్యవస్థాగత మూలాల్ని ప్రశ్నించకుండా ఏ ప్రాంతం వారైనా, ఏ కులాల వారైనా ఆత్మగౌరవంతో ఉండలేరు.

    చివరగా సెజ్‌లు లేని తెలంగాణ అని కూడా ఆశించలేము. సెజ్‌లు అంటే స్వదేశంలో విదేశీ పాలనా ప్రాంతాలే. 2000లో మొదలై, 2005లో పకడ్బందీగా స్థిరపడి, ఇప్పుడు వీరవిహారం చేస్తున్న ఈ సెజ్‌ల్ని ఎటువంటి మినహాయింపులూ లేకుండా వ్యతిరేకిస్తామని, ప్రస్తుత పార్లమెంటరీ వ్యవస్థలో పాలు పంచుకునే ఏ రాజకీయ పార్టీ కూడా చెప్పలేదు, చెప్పవు. అలాగే, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని కోరుకునే రాజకీయ శక్తులు కూడా! సామ్రాజ్యవాదాన్ని వ్యతిరేకించే లక్షయం ఉన్న రాజకీయ శక్తులకే అది సాధ్యం. కానీ, తన పాలనలో సెజ్‌ల యజమానులకు ఆర్థికంగా, రాజకీయంగా, దళారీగా పనిచేసిన కాంగ్రెస్‌ పార్టీ నేతలలో అగ్రగణ్యుడైన ముఖ్యమంత్రి ప్రత్యేక తెలంగాణ భూతాన్ని చూపడం మాత్రం, ఒక దళారీ దేశభక్తిని ప్రదర్శించడం లాంటిదే!

    - ప్రొ. బి.ఆర్‌.బాపూజీ హైదరాబాద్‌ విశ్వవిద్యాలయం
    (20 ఎప్రిల్ 2009, ఆంధ్రజ్యోతి జనవాక్యం సౌజన్యం)

  3. 3
    శ్రీశైల్‌రెడ్డి పంజుగుల Says:

    ఎంత అవమానం!

    తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే హైదరాబాద్‌లోనూ, కొత్త రాష్ట్రంలోనూ మిగతా ప్రాంతాల వారు విదేశీయులైపోతారని ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి మాట్లాడడం గర్హనీయం. తెలుగుజాతి సర్వతోముఖాభివృద్ధిని కాంక్షించే ఒక తెలంగాణ వాసిగా భరించలేనంత అవమానపడ్డాను. రాయలసీమ, కోస్తా ప్రాంతవాసులారా, ఈ నయవంచక ముఖ్యమంత్రి మాటల్లో అణుమాత్రం నిజం లేదన్న విషయం మీకు తెలుసనీ తెలుసు. ఈ కపటనాటకుడిని మీరు నమ్మరనీ తెలుసు. అయినా చెప్పవలసిన అంశాలు కొన్ని ఉన్నాయి. తెలంగాణ విషయమై పార్లమెంటులో, శాసన సభలో, చివరికి మొన్నటి సోనియా సభలోనూ సానుకూలంగా మాట్లాడి తొలివిడత పోలింగ్‌ ముగియగానే పూర్తి విరుద్ధంగా మాట్లాడుతున్నా రు.
    కాంగ్రెస్‌లో నాయకులే నిరసన తెలియజేసేంతగా విషం కక్కారు ముఖ్యమంత్రి. తెలంగాణ వాళ్లని అవమానపర్చడమే కాదు-ఇతర ప్రాంతాల తెలుగువారినీ అవమానిస్తున్నారు- మన సఖ్యతనీ స్నేహశీలతనీ హేళన చేశారు. అవునులే, ఈ విలువలు వదిలేసిన నాయకుడి నుంచి ఇంతకంటే ఏం ఆశించగలం? ముఖ్యమంత్రిని మార్చడం కోసం మతాల మధ్య చిచ్చుపెట్టిన చరిత్ర కలిగిన వారీయన. తిరిగి అధికారంలోకి రావడం కోసం ప్రాంతీయ విభేదాలు రెచ్చగొట్టడం చేస్తున్నారిపుడు. భారతీయులు దేశంలో ఎక్కడైనా నివసించే హక్కు, ఉద్యోగాలు, వ్యాపారాలు చేసుకునే హక్కు కల్పించింది మన రాజ్యాంగం. అందువల్లే వై.ఎస్‌.జగన్మోహనరెడ్డి బెంగుళూరులో వ్యాపారాలు చేసుకోగలుగుతున్నారు.
    భారతీయులు విదేశాల్లో సైతం స్థిరనివాసమేర్పరచుకుని ఆస్తులు కొనుక్కుంటూ, రాజకీయాల్లో పాల్గొంటూ రాణిస్తున్నారు. ఈ విశాల భావనకీ, మన రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా సంకుచిత భావాలతో ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నాన్ని మనం ఎంత మాత్రమూ ఉపేక్షించకూడదు. అన్నదమ్ములు విడిపోయినపుడు ఆ విభజన భౌతికమైన ఆస్తుల వరకేగానీ మానవ, మానసిక సంబంధాలపై విభజన నీడలు పడకూడదు.
    ఈ ఇంగితం రాష్ట్రాన్ని పాలిస్తున్న ఒక ముఖ్యమంత్రికి లేకపోవడం దురదృష్టకరం. సహృదయులూ, చైతన్యవంతులూ అయిన తెలుగుజాతి ఇలాంటి చీడపురుగులను తరిమికొట్టాలనీ, ప్రజా జీవితంలో వారికిక ఎంత మాత్రమూ భాగం కల్పించకూడదనీ ప్రార్థిస్తున్నాను.
    -శ్రీశైల్‌రెడ్డి పంజుగుల, సామాజిక కార్యకర్త
    (20 ఎప్రిల్ 2009, ఆంధ్రజ్యోతి జనవాక్యం సౌజన్యం)

  4. 4
    Neethi Leni Kukka - Page 2 - Lazydesis Says:

    [...] 05:06 AM #14 resource:http://discover-telangana.org/wp/200…/chi/#more-545 ఛీ! ఇదేం [...]

  5. 5
    వరవరరావు Says:

    వై.ఎస్‌ ‘మనవాళ్లు’ ఎవరు?

    042409_aj_02.jpgవైఎస్‌ ముఖ్యమంత్రిగా చేపట్టిన జలయజ్ఞం ప్రాజెక్టులు మొత్తం ప్రజల మౌలిక అవపసరాలు తీర్చడానికి ఉద్దేశించినవేనా? మూడు ప్రాంతాల్లో తాగునీరు, సాగునీరు, పరిశ్రమలు, ఉపాధిని దృష్టిలో పెట్టుకుని వస్తున్నవేనా? బడా పెట్టుబడిదారులు, కాంట్రాక్టర్లు, రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు-వీళ్ళందరినుంచి ప్రభుత్వం ద్వారా కమీషన్ల మీద బలిసే బహుళ జాతి కంపెనీల కోసం చేపట్టినవా?

    Continue Reading »

Leave a Reply

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

Managed by Discover Telangana Inc., a registered nonprofit organization in USA.

All opinions and views expressed by third party content providers and shown here as preview are not that of Discover Telangana.

If you find any Content that is infringing, libelous, defamatory, obscene, abusive, offensive or otherwise violation of copyright law, alert us by emailing us at discover.telangana(at)gmail.com