Feed on
Posts
Comments

Chatta Sabhallo SahitiSaurabhalu 1

కవులు, రచయితలుగానే పరిచయమున్న ఎందరో ప్రముఖులు చట్టసభల్లోనూ అడుగుపెట్టారు. మంత్రులూ ముఖ్యమంత్రులూ ప్రధానమంత్రీ అయ్యారు. వారిలో చాలామంది సాహిత్యకారుల్లాగే పేదరికాన్ని అనుభవించినవారే. రేఖామాత్రంగా ఆ వివరాలు తెలిపే రెండు వ్యాసాలివి..

తెలంగాణ..

- సంగిశెట్టి శ్రీనివాస్‌

తెలుగు సాహిత్య చరిత్రలో ‘గోలకొండ కవుల సంచిక’కు ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది. ‘తెలంగాణ’లో కవులు లేరనే విమర్శకు సమాధానంగా రోషంతో సురవరం ప్రతాపరెడ్డి ఈ సంచికను వెలువరించారు. ఇందులో బూర్గుల రామకృష్ణారావు, సురవరం ప్రతాపరెడ్డి, అరిగె రామస్వామి ముగ్గురూ 1952లో జరిగిన తొలి ఎన్నికల్లో హైదరాబాద్‌ శాసనసభకు ఎన్నికయ్యారు. బూర్గుల రామకృష్ణారావు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయగా ఆయన మంత్రివర్గంలో అరిగె రామస్వామి సభ్యుడిగా ఉన్నారు. ఇలా చట్టసభల్లో తెలంగాణకు ప్రాతినిధ్యం వహించిన సాహితీవేత్తలు ఎందరో ఉన్నారు.

నిత్యం ప్రజలతో మమేకమవుతూ, వారి సమస్యలకు పరిష్కారం చూపే దిశలో తీరిక లేకపోయినప్పటికీ ఈ రాజకీయ సాహితీవేత్తలు విలువైన సాహిత్యాన్ని కథ, నవల, కవిత్వం, పాటలు, బుర్రకథలు రూపంలో సృజించారు. చాలా సందర్భాల్లో ప్రజా, రాజకీయ సంబంధాలు వారి సాహిత్యాన్ని మెరుగు పరిచాయంటే అతిశయోక్తి కాదు. తెలంగాణ సాహిత్యానికి తమ రచనల ద్వారా విశిష్టమైన స్థానాన్ని కల్పించిన బూర్గుల రామకృష్ణారావు, సురవరం ఇద్దరూ తొలి శాసనసభకు మహబూబ్‌నగర్‌ జిల్లా నుంచి ఎన్నికయ్యారు. కృష్ణ శతకము, కరుణాలహరి, లక్ష్మీలహరి, పండిత రాజ పంచామృతమ్‌ లాంటి ఎన్నో పుస్తకాలను బూర్గుల వెలువరించారు.

సురవరం ప్రతాపరెడ్డి కథలతో బాటుగా, శుద్ధాంత కాంత అనే నవల (అలభ్యం), భక్త తుకారామ్‌, ఉచ్ఛల విషాదము నాటకాలు రాశారు. ఆంధ్రమహాసభ నాటి నుంచి హైదరాబాద్‌ అసెంబ్లీ వరకు సాగిన వీరి రాజకీయ ప్రస్థానంలో సాహిత్యం కూడ భాగంగా ఉండింది. తెలుగు సాహిత్యాన్ని పరిపుష్టం చేసినవారిలో శాసన సభ్యులుగా, పార్లమెంటేరియన్లుగా మాడపాటి హనుమంతరావు మొదలు ఇటీవలి శాసనసభలోని నవలా రచయిత్రి స్వర్ణసుధాకర్‌ వరకు ఎందరో తెలంగాణ సాహితీవేత్తలు ఉన్నారు. తొలి తెలుగు కథకుల్లో ఒకరైన మాడపాటి హనుమంతరావు ‘మల్లికా గుచ్ఛము’ పేరిట కథా సంకలనాన్ని వెలువరించారు. పద్యాలు కూడా రాశారు. ఈయన 1952 సార్వత్రిక ఎన్నికల్లో మెదక్‌ జిల్లా గజ్వేల్‌ నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసి ప్రొగ్రెసివ్‌ డెమోక్రటిక్‌ ఫ్రంట్‌ (పిడీఎఫ్‌) కూటమి అభ్యర్థి పెండెం వాసుదేవరావు చేతిలో ఓడిపోయారు.

అయితే పరాజయం తర్వాత శాసనమండలికి నామినేట్‌ అయిన మాడపాటి దానికి చైర్మన్‌గా కూడా వ్యవహరించారు. ‘నేనే, హృదయశల్యము’ లాంటి కథలు ఆయన ప్రతిభకు మచ్చుతునకలు. అలాగే మాడపాటిని ఓడించిన పెండెం వాసుదేవరావు కూడా సాహిత్యకారులే. వాసుదేవరావు ‘గుగుసలు’ అనే నవలను వెలువరించారు. అనేక పాటలు, బుర్రకథలు రాశారు. ఇదే సభలో పిడిఎఫ్‌ నుంచి నల్గొండ జిల్లా చినకొండూర్‌ నుంచి గెలుపొందిన కాంచనపల్లి చినవెంకటరామారావు కథలు, కవిత్వం వెలువరించారు. తెలంగాణ గ్రామీణజీవితాన్ని తన ‘అరుణరేఖలు’ అనే కవితా సంపుటంలో, సాయుధ పోరాట అనుభవ నేపథ్యంలో రాసిన ‘మన వూళ్లో కూడానా’ కథా సంపుటిలో అక్షరబద్ధం చేశారు.

అభ్యుదయ రచయితల సంఘాన్ని నల్గొండలో స్థాపించి ఎందరో యువకవులను కాంచనపల్లి ప్రోత్సహించారు. ఇదే సభలో కరీంనగర్‌ జిల్లా కూనూరు నుంచి స్వతంత్ర అభ్యర్థిగా గెలుపొందిన ముదిగంటి కొండల్‌రెడ్డి ‘నహి నహి’ పేరిట అప్పటి అసెంబ్లీలో జరిగే కార్యక్రమాలను, రాజకీయాలను, రాజకీయ నాయకుల ద్వంద్వ ప్రమాణాలను విమర్శిస్తూ హాస్యం వ్యంగ్యం మిళితం చేస్తూ రాసిన తన కవిత్వాన్ని ఉర్దూలో పుస్తకంగా వెలువరించారు. ఉర్దూలో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపున్న కవి, ఉద్యమకారులు మఖ్దూం మొహియుద్దీన్‌ శాసన సభ్యులుగా, పార్లమెంటేరియన్‌గా సేవలందించారు.

1954లో హుజూర్‌నగర్‌ నుంచి అసెంబ్లీకి ఎన్నికైన మఖ్దూం అరవైల్లో రాజ్యసభ మెంబర్‌గా ఉన్నారు. హైదరాబాద్‌ అసెంబ్లీ రద్దయి కేవలం తెలంగాణ ప్రాంతంలోనే జరిగిన మొదటి ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో కరీంనగర్‌ జిల్లా మంథని నుంచి పీవీ నరసింహారావు, చొప్పదండి నుంచి సిహెచ్‌ రాజేశ్వరరావు గెలుపొందారు. వీరిద్దరు చక్కని కథలు రాశారు. దేశ ప్రధానిగా పనిచేసిన పీవీ కవిగా, కథకుడిగా, నవలాకారుడిగా, అనువాదకుడిగా లబ్దప్రతిష్టులు. తెలంగాణ సాయుధ పోరాట నేపథ్యంలో ఆయన రాసిన ‘గొల్ల రామవ్వ’ కథ విమర్శకుల ప్రశంసలందుకుంది. అలాగే రాజేశ్వరరావు ‘పిట్ట బ్రతుకు’ కథానిక కూడా సంకలనాల్లో చోటుచేసుకుంది. 1957 ఎన్నికల్లో యల్లాప్రగడ సీతాకుమారి నిజామాబాద్‌ జిల్లా ‘బాన్స్‌వాడ’ నుంచి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

తెలంగాణలో స్త్రీల ఉద్యమాలకు ఆమె ఆద్యురాలు. అంతేగాకుండా వివిధ పత్రికల్లో ఆవిడ రాసిన ఇరవైకి పైగా కథలున్నాయి. శాసనసభకు, లోక్‌సభకు ఎన్నికై సేవలందించిన నల్గొండకు చెందిన బీఎన్‌ రెడ్డి ‘ఆయువుపట్టు’ లాంటి అద్భుతమైన కథ రాశారు. బీఎన్‌ సోదరి మల్లు స్వరాజ్యం శాసనసభకు ఎన్నికయ్యారు. ఆవిడ తెలంగాణ సాయుధ పోరాటంలో అనేక పాటలు కైగట్టి పాడారు. వరంగల్‌కు చెందిన దేవులపల్లి రామానుజరావు రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. ఆయన ‘పచ్చతోరణము’ కవితా సంకలనం అందరి మన్ననలందుకుంది. ఆంధ్రసారస్వత పరిషత్‌ స్థాపకుడిగా, నిర్వాహకుడిగా, కవిగా, విమర్శకుడిగా ఆయన తెలుగు సాహిత్యానికి చేసిన సేవ చిరస్మరణీయమైంది. ప్రస్తుత సారస్వత పరిషత్‌ అధ్యక్షులు సి.నారాయణరెడ్డి రాజ్యసభకు నామినేట్‌ అయ్యారు.

1950ల నుంచి ఇప్పటివరకూ బహుశా రోజూ కవిత్వం రాసే నారాయణరెడ్డి జ్ఞానపీఠ్‌ అవార్డు అందుకున్నారు. శాసనమండలిలో తమ వాణిని వినిపించిన వారిలో కాళోజి నారాయణరావు, వానమామలై వరదాచార్యులు, ఇల్లిందల సరస్వతీదేవి, హీరాలాల్‌ మోరియా ముఖ్యులు. ‘నా గొడవ’ల కవిగా, కథకుడిగా కాళోజి, కథా రచనలో సరస్వతీదేవి, మోరియాలు, అభినవ పోతనగా వానమామలై తెలుగు సాహిత్యానికి చేసిన సేవ విశిష్టమైనది. మోరియా ఎక్కువగా ఉర్దూలో రాసినప్పటికీ అవన్నీ కవిరాజమూర్తి లాంటి వారివల్ల తెలుగులోకి తర్జుమా అయ్యాయి. ‘తులసీ దలాలు’ పేరిట వందకు పైగా కథల్ని సరస్వతీదేవి బతికున్న కాలంలోనే సంపుటాలుగా తీసుకొచ్చారు. అడపాదడపా తెలంగాణ ఉద్యమ ప్రచారానికి పాటలు రాసే కేసీఆర్‌ మొదలు ఒకప్పటి కథకుడు ఇటికాల నీలకంఠరావు దాకా చట్టసభల్లో తెలంగాణకు ప్రాతినిధ్యం వహించినవారే.

* * *

కోస్తా.. రాయలసీమ..

- ఎస్వీ సత్యనారాయణ

Chatta Sabhallo SahitiSaurabhalu 2

ఆధునిక యుగంలో తెలుగు సాహిత్యం రాజకీయ చైతన్యాన్ని ప్రదర్శించింది. వ్యక్తులు స్వేచ్ఛకోసం, జాతుల విముక్తి కోసం, దేశాలు స్వాతంత్య్రం కోసం పోరాడుతున్న సందర్భంలో సాహిత్యం అనివార్యంగా ఉద్యమాలకూ, రాజకీయాలకూ ఊతమిచ్చింది. ఉత్తేజాన్నిచ్చింది. సాహిత్యం రాజకీయాలను ప్రభావితం చేసింది. రాజకీయాలు సాహిత్యాన్ని ప్రభావితం చేశాయి. ఫలితంగా గొప్ప సాహిత్య ప్రక్రియలు, వినూత్న కళారూపాలు ఆవిర్భవించాయి. తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేశాయి. ఇక సుప్రసిద్ధ సాహితీవేత్తలు, కవులూ, రచయితలూ ఒకవైపు క్రియాశీల రాజకీయ కార్యకలాపల్లో భాగస్వామలౌతూనే, మరోవైపు చట్టసభల్లోనూ తమ బలమైన గళ గర్జనలు వినిపించారు.

ప్రాచీన కవిత్వానికి భరతవాక్యం, ఆధునిక కవిత్వానికి నాందీగీతం పలికిన ‘ముసలమ్మ మరణం’ కావ్యాన్నీ, ‘కవిత్వ తత్వ విచారం’ పేరిట విమర్శన గ్రంథాన్ని రచించిన కట్టమంచి రామలింగారెడ్డి బ్రిటీషిండియాలోని మద్రాస్‌ శాసనసభకు ఎన్నికయ్యారు. ప్రతిపక్ష నాయకుడి హోదాలో చురుకైన శాసన సభ్యుడి పాత్రను నిర్వర్తించారు. భారత స్వాతంత్య్రానంతరం దక్షిణ భారతదేశం నుంచి రాష్ట్రపతులుగా ఎంపికయిన డా.సర్వేపల్లి రాధాకృష్ణన్‌, వరాహగిరి వెంకటగిరి సుప్రసిద్ధ సాహితీవేత్తలే. అతి క్లిష్ట సమయంలో దేశ ప్రధానిగా బాధ్యతలు నిర్వహించిన పి.వి.నరసింహారావు బహుగ్రంధకర్త.

జాతీయోద్యమకాలంలో ఉత్తేజకరమైన గీతాలు రచించిన హరీంద్రనాథ్‌చటోపాధ్యాయ (సరోజినీ నాయుడు సోదరులు) 1952 సార్వత్రిక ఎన్నికల్లో విజయవాడ నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు. ప్రముఖ సాహితీవేత్త బెజవాడ గోపాలరెడ్డి చట్టసభల్లో ప్రాతినిధ్యం వహించడమే కాక, గవర్నర్‌ గానూ బాధ్యతలు నిర్వర్తించారు. ‘భాగమతీదేవీ’ కావ్యాన్నీ, అనేక చారిత్రక నవలల్ని రచించిన రాజగోపాలనాయుడు (గల్లా అరుణకుమారి తండ్రి) కృషీకార్‌ పార్టీలోనూ, కాంగ్రెస్‌ పార్టీలోనూ ఉన్నత పదవులు నిర్వహించడంతో పాటు శాసనసభ సభ్యుడిగా రాష్ట్ర ప్రజలకు సేవలందించారు.

‘పలనాడు వెలలేని మాగాణిరా’ వంటి జనాదరణ పొందిన అనేక గీతాలు రచించిన కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాతల్లో ప్రముఖులు పులుపుల శివయ్య 1952, 1962 ఎన్నికల్లో వినుకొండ నియోజకవర్గం నుంచి శాసనసభకు ఎన్నికయ్యారు. రెండవపర్యాయం ఎన్ని కైనప్పుడు ఆంధ్రప్రదేశ్‌ శాసనసభలో శ్రీకృష్ణ సిపిఐపక్ష నాయకుడిగానూ, ప్రతిపక్ష నాయకుడిగానూ బాధ్యతలు నిర్వహించారు. తెలంగాణా సాయుధ పోరాటకాలంలో ‘ఉదయిని’, ‘ఎర్రజెండాలు’ వంటి గ్రంథాలు రచించిన గంగినేని వెంకటేశ్వరరావు వినుకొండ నియోజకవర్గం నుంచి పలుమార్లు శాసనసభకు ఎన్నికయ్యారు.

రచయిత, జర్నలిస్టయిన కోటం రాజరామారావు రాజ్యసభకు ఎన్నికయ్యారు. రాహుల్‌ సాంకృత్యాయన్‌ రచించిన ‘ఓల్గా సే గంగా’ మొదలైన గ్రంథాలను తెలుగు ప్రజలకు అనువాదం చేసి అందించిన అల్లూరి సత్యనారాయణరాజు చట్టసభలకు ఎన్నికయ్యారు. అభ్యుదయ, విప్లవ సాహిత్యోద్యమాల వైతాళికుడు శ్రీశ్రీ ఒక పర్యాయం శాసనమండలికి ఎన్నికయ్యారు. అలాగే రాష్ట్ర శాసన మండలికి నామినేటయిన ప్రముఖ సాహితీ వేత్తల్లో విశ్వనాథ సత్యనారాయణ, గడియారం వేంకటశేషశాస్త్రి, గుర్రం జాషువా, బోయి భీమన్న, ఎస్‌.టి.జ్ఞానానంద కవి పేర్కొనదగినవారు. ప్రస్తుతం రాష్ట్ర శాసనమండలికి ఎన్నికయిన సాహితీ ప్రముఖులు షేక్‌హుసేన్‌ సత్యాగ్ని.

రాయలసీమ సాహితీవేత్త ఎన్‌.శివరామిరెడ్డి ఆంధ్ర రాష్ట్ర శాసనసభలో కడప జిల్లా కమలాపురం నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించారు. శాసనసభకు పోటీచేసి, ఓడిపోయిన ప్రముఖులు గజ్జెల మల్లారెడ్డి, ఎం.వి.రమణారెడ్డి. రచయితలుగా, విద్యావేత్తలుగా తెలుగుజాతికి పరచయమైన ఉన్న లక్షీనారాయణ, విద్వాన్‌ విశ్వం, తెన్నేటి విశ్వనాధం, తుమ్మల వెంకట్రామయ్య, తిరుమల రామచంద్ర, భాట్టం శ్రీరామమూర్తి, కొండా వెంకటప్పయ్య, కొమర్రాజు అచ్చమాంబ, కనపర్తి వరలక్ష్మమ్మ, గజ్జెల సరళాదేవి, సుబ్బారావు పాణిగ్రహి, శివసాగర్‌ తదితరులు క్రియాశీల రాజకీయ జీవితం గడిపారు. తెలుగుజాతి గర్వించదగిన ఉత్తమ రాజకీయ జీవితాన్ని, ఉత్తేజకరమైన ఉద్యమ జీవితాన్ని, ఉదాత్తమైన వ్యక్తిగత జీవితాలను గడిపిన, గుడుపుతున్న సాహితీవేత్తల నుంచి స్ఫూర్తిని పొందుదాం. అనుసరిద్దాం.

(20 ఎప్రిల్, 2009, ఆంధ్రజ్యోతి వివిధ సౌజన్యంతోటి)

4 Responses to “చట్టసభల్లో సాహితీ సౌరభాలు”

  1. 1
    Ramulu Says:

    వీరి గురించి ఎన్నో సార్లు మన తెలుగు మీడియా వెలుగులోకి తెచ్చింది. మన తెలంగాణకు అసలు మీడియా లేనేలేదు. అస్తోబిస్తో అంటూ నడుస్తున్న ఈడిస్కవర్్ తెలంగాణాలో కూడా వీరి గురించి రాసుకోవడమం్ అవసరమా? వీరికి మీడియాలోనేకాదు,తెలుగు పాఠ్య పుస్తకాలలో చోటుదక్కి ప్రచారం ఐనారు,కావాల్సినంత/రావాల్సినంత పేరుకూడా వచ్చింది. మన్కున్న ఈకొద్ది చోటును/స్పేస్ ను మళ్ళీ వాళ్ళకు కేటాయించేకంటే మరుగునపడిన మరికొందరి తెలంగాణ కవుల,విశిష్ట వ్యక్తుల గురించి రాసుకుంటే,తెలుసుకుంటే మంచిదనుకుంటాను.

  2. 2
    Ramulu Says:

    పై లేఖలో వీరిగురించి అని నేనురాసింది తెలంగాణేతర ప్రముఖులగురించి మాత్రమే.అది అర్ధం చేసుకుంటారనుకుంటాను.

  3. 3
    డిస్కవర్ తెలంగాణ Says:

    రాములు గారు పలాన వారికి చోటు ఇయ్యాలె పలాన వారికి ఇయ్యొద్దు అన్న ఉద్దేశం కంటె, తెలంగాణకు సంబందించి ఇదివరకు ఉన్న / ఇప్పుడు వస్తున్న వ్యాసాలు, సాహిత్యాన్ని ఒక్క చోట పొందుపరిచడం ‘డిస్కవర్ తెలంగాణ’ లక్ష్యం, ఒక ఆరోగ్యకర చర్చ జరిగినంక, వ్యాసాలను ఏ దృష్టి తోటి చూడలె అన్న విషయం పాఠకుడికి వదిలేస్తున్నాము.
    (‘Discover Telangana’s intent is to archive the content / literature, about / related to Telangana without prejudice & leave the decision to the readers how they would judge the content)

    - జయప్రకాశ్ తెలంగాణ

  4. 4
    డిస్కవర్ తెలంగాణ Says:

    All opinions and views expressed by third party content providers and shown here as preview are not that of ‘Discover Telangana’.

Leave a Reply

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

Managed by Discover Telangana Inc., a registered nonprofit organization in USA.

All opinions and views expressed by third party content providers and shown here as preview are not that of Discover Telangana.

If you find any Content that is infringing, libelous, defamatory, obscene, abusive, offensive or otherwise violation of copyright law, alert us by emailing us at discover.telangana(at)gmail.com