- జూకంటి జగన్నాథం
![]()
కావాల్నని తంతే
తంతెకైనా కోపం వస్తది
రేషం పుట్టువడి
పాప దోషమే పెట్టుబడి
మీ గోకరికాయ సొమ్ము ఎరుకలేదు
మీ సొమ్మూ సంబంధము అసలే కాదు
ఉప్పేసి పొత్తు కూడి
కడుపుల కత్తులు పెట్టుక
తడిగుడ్డతో గొంతుకోసిన సోపతిగాళ్లు
నమ్మిచ్చి నడిగండ్లె బొండిగ పిసికే ఆపతిగాళ్లు
ఒకలను అన్యాలం చేసినోళ్లు అడుక్కు పడుతరు
అవ్ ! అడుగకుంటేంది
మేము గిట్లనే చేయిపట్టి
మిమ్ముల్ని అడుగుతం
ఉత్త పున్యానికి అంటే
కన్న పొల్లగాండ్లైనా ఎదిరిత్తరు
ఒక దినం కాకపాయె యాభై రెండేండ్ల నుంచి
మా ఊర్లను మా చావడిలోని పీర్లను
ఆగమాగం చేసి అడివి పట్టిచ్చిండ్రు
గోసగోసోలె సూత్తు సూత్తుండంగనే
కండ్ల ఎలుగులసుంటి భూముల్ని కబ్జా చేసి
అడుక్కునేటోల్లను చేసిండ్రు
గంతే ! అనకుంటేంది
మేము నడి బజార్ల నిలబెట్టి
మిమ్మల్ని కడుగుతం
ఒకటా రెండా
ఎన్నని దుర్మార్గాలను చెప్పమంటరు
ఒక రీతా ఒక రివాజా
ఎంతని మీ కపటబాజి చిక్కుల్ని
దెప్పమంటరు
చేసేటోనికి సిగ్గులేకున్నా
చూసేటోనికి సిగ్గు లేకపాయె
అనేటోనికి మానం లేకున్నా
ఇనేటోనికి అభిమానం రాకపాయె
మా మాటను మా బతుకును
మా తినే నోటి ముందటి మెతుకును
గావర గావర సెల్పి సెల్పి ఎత్తగొడ్తిరి
గిట్లనే ! ప్రశ్నించకుంటేంది
మేము నలుగుట్ల మిమ్ముల్ని సవాల్ ఏత్తం
ఇజ్జత్ లేదు ఇమానం లేదు
ఫజీల్ సేత్తరనే భయం లేదు
కండ్లకు రక్తం అత్తది
నేలంతా నెత్తుర్లు పారిత్తిరి
చేతికంది వచ్చిన బిడ్డల్ని చంపి
తల్లిదండ్రుల కడుపులు కాలపెడితిరి
ఊరేగింపులు సభలు
రోడ్‌షోలు ఊకదంపుడు ఉపన్యాసాలు
బొంకుడు బోర్లేసుడు
అన్యాయాల్ని చెప్ప వశం కాదు
దుఃఖాన్ని ఆప తరం కాదు
నవ్వుకుంట నవ్వుకుంట
నా ఇల్లు ముంచితిరి
అవ్ ! అరేయ్ !
దగుల్బాజీ ! ఏడికిపోతే ఆడికి వచ్చి
తెలంగాణా ఇచ్చేదాక వచ్చేదాక
అసెంబ్లీ పార్లమెంట్ల
పదిమంది ముందట పంచాయితీ పెడుతం
మేము
మళ్లా మళ్లా గల్లా పట్టి అడుగుతం
వంచించి ముంచిన మీకే
గిన్ని బోకెత్తుల ఏషాలు వుంటే
మాకెంత మనసు కుత కుత ఉడుకాలె
బరాబరి అడుగుతం ! అడుగుతం !
ఫో ! చెప్పుకో ఫో ! మీకు ఉన్నకాడ దిక్కు
ముమ్మాటికీ తెలంగాణా మా జన్మహక్కు
(తెలంగాణకై నిజామాబాద్ జిల్లాలో వై.ఎస్.ను నిలదీసిన శ్రీధర్‌రెడ్డిపై దాడికి నిరసనగా..)
(20 ఎప్రిల్, 2009, ఆంధ్రజ్యోతి వివిధ సౌజన్యంతోటి)