- కోయి కోటేశ్వరరావు
కళాశాలలు, విశ్వ విద్యాలయాల్లో బోధించే తెలుగు సాహిత్యానికి సంబంధించిన కొన్ని పాఠ్యాంశాలు విద్యార్థుల బౌద్ధిక చైతన్యాన్ని నిర్వీర్యం చేసే విధంగా ఉన్నాయి. విజ్ఞానశాస్త్రం, అర్థ శాస్త్రం, సామాజిక శాస్త్రం తదితర విభాగాల్లోని పాఠ్య ప్రణాళికల్లో కాలానుగుణంగా నిర్మాణాత్మక మార్పులు చోటుచేసుకున్నప్పటికీ తెలుగు సాహిత్య పాఠ్యాంశాలు శుద్ధ సంప్రదాయ పద్ధతిలోనే ఇంకా కొనసాగటం చిత్రం. నిజానికి తెలుగు సాహిత్య పాఠ్య ప్రణాళికలో సింహభాగం రంగు రంగుల వింతైన బొంగరం వంటిది. దీనికి భ్రమణ వేగమే కాని పురోగమన శీలం తక్కువ. పాఠ్యాంశాల్లో ప్రతిపాదిత సందేశానికి బోధించే కథాంశానికి ఏ మాత్రం పొంతన కనిపించదు. కొన్ని పాఠ్యాంశాలు ద్రవిడ ప్రాణాయామం లాంటివైతే, మరికొన్ని కొండను తవ్వి ఎలుకను పట్టినట్లుగా ఉన్నాయి.
కాల ధర్మాన్ని సామాజిక పరిణామక్రమాన్ని రవంతైనా దృష్టిలో ఉంచుకోకుండా పాఠ్యప్రణాళికను రూపొందించటం వలన బోధనలో సవాలక్ష సందేహాలు, విశ్లేషణలో లెక్కలేనన్ని చిక్కుముడులు ఎదురవుతున్నాయి. అధ్యాపకులు మానసిక సంఘర్షణకు విద్యార్థులు అయోమయానికి గురవుతున్నారు. ఈ విపత్కర పరిస్థితినే డా.వినోదిని తీవ్రంగా ప్రశ్నించారు. ఆమె చెప్పినట్లుగానే వీటిని సమకాలీన ఎరుకతో పునస్సమీక్షించాల్సిన అవసరమెంతైనా ఉంది. బోధనాంశం ప్రజాస్వమ్య స్ఫూర్తికి భంగం కలిగించకూడదు.
ఆత్మగౌరవ పోరాటాలు బలోపేతమవుతున్న నేటి సామాజిక సందర్భంలో భూస్వామ్య భావజాలానికి, మనుధర్మ తత్వానికి తావులేని పాఠ్యాంశాలను రూపొందించుకోవాలి. పాఠ్యాంశం తరగతి గదిలోని విద్యార్థుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉండకూడదు. మానవీయ శాస్త్రాల (Humanities) పాఠ్య ప్రణాళిక సమాజ కేంద్రీకృత సూత్రాన్ని (Principle of community centredness) విధిగా అనుసరించాలి. ప్రాచీన కావ్యాల్లోని అసంబద్ధమైన అంశాలను, నిర్దిష్ట సామాజిక వర్గాలను న్యూనతపరిచే పాఠ్యభాగాలను నిర్ద్వంద్వంగా వ్యతిరేకించాలి. ఆయా వివాదాస్పద అంశాల్లోని లోపాలను స్వేచ్ఛగా చర్చించే బోధనా సౌలభ్యం అధ్యాపకులకుండాలి. ఈ సందర్భంలో పాఠ్యాంశాన్ని ప్రతిఘటించాలని ప్రముఖ అర్థశాస్త్ర ఆచార్యులు మైఖేల్ మీరోపోల్ సూచించారు-’పాఠ్యాంశాలలో ఉన్న పాఠ్యపుస్తకంతో విభేదిస్తూ చెప్పడం అనేది దానికదే ఒక ప్రత్యేకమైన విలువ. అటువంటి విభేదం వలన విద్యార్థులకు సొంతంగా ఆలోచించటం తెలుస్తుంది. పుస్తకం ఒక రకంగా చెప్పి, మీరు మరొక రకంగా చెబుతున్నందువల్ల విద్యార్థులకు మీ భావాలను ఎదిరించాలా? సమర్ధించాలా? తెలియని స్థితి వస్తుంది. అంటే వాళ్లకు తమంతట తాము ఆలోచించక తప్పని స్థితి ఏర్పడుతుంది. మనం చెప్పే దాని మీద మనకు పూర్తి విశ్వాసం ఉన్నట్లయితే మనం విద్యార్థులను ఇందుకు ప్రోత్సహించాలి.అటు సంప్రదాయ పుస్తకంలో వున్న అభిప్రాయాలనూ, ఇటు మనకున్న అభిప్రాయాలనూ మనం నిజాయితీగా విద్యార్థుల ముందుంచాలి.‘ హైందవ సంస్కృతిలోని వైరుధ్యాలను లౌకిక రాజ్యంలో పాఠ్యాంశాలుగా అసలెందుకు బోధించాలి? భారతీయ సంస్కృతిని గౌరవించాలి. దానికి ఏకంగా దాసోహం కానవసరం లేదు. ‘నాగరికతను సంస్కృతిని అవగాహన చేసుకొని అభినందించడానికి ప్రాధాన్యం యిస్తూనే, వారసత్వ సాంస్కృతిక విధానాలలో కోరదగ్గ అవసరమైన మార్పులను చేసేదిగా విద్యా విధానం ఉండాలి‘ అని ఈశ్వరీబాయి పటేల్ కమిటి చేసిన సిఫార్సులను ఇక్కడ గ్రహించడం అవసరం.
భారతీయ సాంస్కృతిక పరిరక్షణ పేరుతో సామాజిక అంతరాలను సమర్ధించే ఉపాఖ్యానాలను పాఠ్యాంశాల్లో చొప్పించటం విద్యావిషయిక నేరంగా (Acadamic Crime)గా భావించాలి. మనుధర్మ తత్వానుకూలమైన వైషమ్య పద్ధతి (Contrast Method)ని బోధనాంశాల ద్వారా ప్రచారం చేస్తే విద్యార్థులు మానసిక వృద్ధులుగా రూపొందే ప్రమాదం లేకపోలేదు. మనుస్మృతి మానవ సంబంధాలను చిన్నాభిన్నం చేసింది. స్త్రీల, శూద్రుల జీవితాల్లో నిరవధిక కర్ఫ్యూ విధించింది. ఇలాంటి భావాలన్నీ ప్రక్షిప్తాలని దాటవేయటం సరికాదు. ఒకవైపు దుర్మార్గమైన సామాజిక అణచివేతను విజయవంతంగా ప్రబోధిస్తూ, మరోవైపు ఆధ్యాత్మిక తాయిలాలు ఎరజూపే విచిత్ర తత్వానికి పురాణాలు పెట్టింది పేరు.
‘పురాణమిత్యేవనసాధు సర్వం / నచాపికావ్యం నవమిత్యవద్యమ్’ అన్న కాళిదాసు మాటల్లోని భావ సమతౌల్యాన్ని, ‘వివేక చతురత’ను ప్రతిఫలించే విధంగా పాఠ్యాంశాలు రూపుదిద్దుకోవాలి. ఒక పాఠ్య ప్రణాళిక లోపభూయిష్టమైనదైతే జరిగే నష్టం ఊహాతీతం. దీనివల్ల ఒక జాతి మొత్తం తీవ్రమైన సంక్షోభానికి గురవుతుంది. రేపటి జీవితం అంధకార బంధురమవుతుంది. విద్యార్థుల నైతిక చైతన్యాన్ని బలోపేతం చేసే తెలుగు సాహిత్యంలాంటి మానవీయ శాస్త్రాల పాఠ్య ప్రణాళిక విషయంలో మేధావులు అప్రమత్తంగా ఉండాలి.
జాతీయ సమైక్యత, లౌకిక రాజ్య భావనల మేలికలయికగా, విజ్ఞాన దాయకంగా, వివేకవంతంగా, సార్వజనీనంగా, సార్వకాలికంగా పాఠ్యప్రణాళికను తీర్చిదిద్దాలి. అన్నింటికీ మించి విద్యార్థి ‘ఎరుక సమగ్రమయ్యే’ విధంగా, సామాజిక పురోగమనానికి మార్గదర్శకంగా వుండే విధంగా తెలుగు సాహిత్య పాఠ్యప్రణాళికా రచన జరగాలి. అప్పుడే గిజుబాయి, ప్రొ.యశ్‌పాల్, కృష్ణకుమార్ లాంటి మహానుభావుల ఆకాంక్షలు నెరవేరతాయి.
(20 ఎప్రిల్, 2009, ఆంధ్రజ్యోతి వివిధ సౌజన్యంతోటి)