- కోటీ-వేణు
![]()
అమ్మకు బహిరంగ లేఖ
అమ్మా!
బావున్నావే, మేమిద్దరం బాగున్నామే. ఇప్పుడు నువ్వు, నీ ఆలోచనలు మా ఇద్దరి మధ్య ఇద్దరి కోడళ్ల మధ్యే కాదు మొత్తం మన పార్టీ కామ్రేడ్స్ మద్యా చర్చనీయాంశమే అమ్మా! మన కామ్రేడ్స్ అందరికీ అమ్మవే నీవిపుడు. నీ గుండె ధైర్యం, మనసులోని మంచితనం మాకెప్పుడూ ఆదర్శమే కాదు అనుసరణీయమే. మేం ఇల్లు విడిచిన నాటి నీ రూపు, బాపు రూపు తప్ప మరో మారు చూసి ఎరగం కదే.
ఇప్పుడు పేపర్లో ప్రచురితమైన నీ ఫోటో తొణకని నిండు కుండలా నీ రూపు లక్షలు-కోట్లాది ప్రజలు చూశారే అమ్మ. నీ ఆరాటం నీ జీవిత పోరాటం ఎరిగిన వాళ్ళం ఎపుడెపుడు నీఒడిలో ఓ ఘడియ వుండిపోదామనే కోరిక ఉన్నా రాజ్యం అనుమతించదికదే. మొదట నీ ఉత్తరం ఆంధ్రజ్యోతిలో చూశాక నీ కోసం ఓ కవిత రాసామే అమ్మా. అది పంపే మార్గం లేదు కదా. మా పార్టీ పత్రికలు ప్రచురించాయి. అవి అందే మార్గం లేదు కదా.
నీ కంట తడియే కాదూ నీలాంటి అమ్మలందరి కంటితుడుపు తుడుస్తామని వాగ్దానం చేశామే అమ్మ. ఇల్లు విడిచిన నాడు నీతో బాపుతో ఏం చెప్పామో అదే చేస్తున్నామే అమ్మ. మీరిద్దరూ ఎప్పుడూ మాకు జన్మనిచ్చిన వారనేకాదు సమాజంలో మా బాధ్యత ఏమిటో, మేం ప్రగతిశీలి గా కావాలంటే ఏం చదవాలో, ఎలా ఆలోచించాలో బాపు నీవు చేసిన కృషి ఎలా మరువగలమే అమ్మా.
మనదో సాంప్రదాయ బ్రాహ్మణ కుటుంబంగా కాక ప్రగతిశీల కుటుంబంగా ఎదిగి రావడంలో మాకన్నా మీరు చేసిన కృషే అధికం కదే. మన మధ్య పేగుబంధం మాత్రమే కాదు భావ బంధం మీ స్మృతిని ఎప్పుడూ మాలో నవనవోన్మేషంగానే నిలుపుకున్నామే. శివాజీ, భగత్‌సింగ్‌ల తల్లిదండ్రుల పాత్ర, చేగువేరా తల్లి పాత్ర పాఠ్య పుస్తకాలలో చదివామే. కానీ నిన్ను 20 ఏళ్ల జీవితమంతా చూశామే. ఇంట్లో ఎప్పుడూ నీతోనే ఉండేవాళ్లం.
ఇంటి చాకిరి అంతా నీ వొక్కదానివే చేస్తుంటే సహాయపడే ప్రయత్నం చేశాం. మృదువుగా తిరస్కరించినా మేం ఏదో వంకతో నీ వెన్నంటి నిలిచి దెబ్బతిన్న మన ఆర్థిక పరిస్థితి మా కంటపడకుండా గుంభనంగా కుటుంబాన్ని నడపడమేకాక ఇంటికొచ్చే బంధుమిత్రులందరినీ మీరు ఆదరించిన తీరు మేం ఎలా మరువగలమే అమ్మా! మా చదువు కోసం మా ఎదుగుదల కోసం అందరి తల్లిదండ్రుల్లాగే మీరూ చేశారని అనుకోలే మేం.
అట్లా అయివుంటే మాలో భౌతిక భావాల స్థానే ఆద ర్శ భావజాలం కాకుండా, సాంప్రదాయ బ్రాహ్మణ కుటుంబ ఆచార వ్యవహారాలే వచ్చేవి తప్ప మార్క్సిస్టులం అయ్యేవారిమి కాదు. బాపు నాస్తికుడే కాక సోషలిస్టు భావాలతో ఉండటం, నువ్వు మూఢ విశ్వాసాలకు దూరం గా వుండటం మా బాల్యం ఒక మార్గంలో నడవడానికి తోడ్పడి మమ్ము ఈ నలభై ఏళ్లు విప్లవ జీవితంలో నిలబెట్టిందే అమ్మా.
బాపు ఆదర్శాలను పుణికిపుచ్చుకొన్న నువ్వూ నిన్ను-బాపునూ పుణికి పుచ్చుకున్న మేం నీ కోరిక నుకొన ఊపిరి వరకు పాటిస్తామే అమ్మా! ఇదో వాగ్దానమే కాదు. ఇదొక విశ్వాసం, ఇదో నమ్మకం, ఇదో ఆశ, ఇదే జీవిత పరమార్థమే అమ్మా! అమ్మా, రాజ్య నిర్బంధం నిన్ను చూడటానికే కాదు నీకు ఉత్తరం రాయడాన్నీ అనుమతించనపుడు ఈ బహిరంగ లేఖ తప్ప మాకు మరో రూపంలో నిన్ను పలకరించే అవకాశం లేదే.
మా ఇద్దరిలో ఒకరం 1977లో, మరొకరం 1980లలో ఇల్లు విడిచి ఇక ఆపై ఇంటికి రాలేదని ఏలినవారికే అందరికన్నా ఎక్కువే తెలిసినా మన ఇంటి పెంకులే కాదు ఒక్కో ఇటుకను కూల్చేవరకు మన వాడకట్టు వారందరినీ బాదారంటే పాలకవర్గ పార్టీల ప్రజాస్వామ్యం మనం అర్థం చేసుకోవచ్చే. మన ఇల్లనే కాదుకదా మన పార్టీలో ఉన్న అనేకుల ఇండ్లూ నేలమట్టం చేసి అందరినీ భయభ్రాంతులు చేసినా విప్లవోద్యమం ఆగలేదుకదే.
అందుకే కొత్త రూపంలో ప్రజలపై దాడిని అప్పటి నుంచి ఇప్పటికీ కొనసాగిస్తుండే అమ్మా. నువ్వన్నట్లు రజాకార్ల కాలంలో మన తలుపులు టకటక కొట్టడం మానలే. ఆ ఒరవడినే పుణికిపుచ్చుకున్న ఆధునిక పాలకులు ఇప్పటికీ మన తలుపు తట్టడం మానలేదుకదే. ఊర్లోకి వచ్చే కొత్త ఎస్.ఐ., జిల్లాకు వచ్చే కొత్త-పాత ఎస్.పి లు ఎవరైనా వాళ్ల ఖాకీ బట్టల కల్చర్‌ను ఎట్లా వదిలివేస్తారే అమ్మా!…
ప్రజాస్వామ్యం, ప్రగతిశీల భావాలు అబ్బితే ఖాకీ గబ్బు ఎందుకు పూసుకుంటారే. రాజ్యం రజాకార్ల కాలం నాటి నవాబులదైనా నేటి పాలెగాడిదైనా అది జనం చేతుల్లోకి వచ్చేవరకు మన తలుపు తట్టుడు ఆగదే. అందుకే నువ్వు మాకు ఇచ్చిన పిలుపూ మన దేశంలోని తల్లులంతా తమ పిల్లలకు ‘బిడ్డలారా! విప్లవం వీడకండి’ అని ఇచ్చే సాధారణ పిలుపు అయిననాడు తలుపు తట్టడాలు వుండవే.
అంతేకాదు అమ్మా! విప్లవం గెలిచాక చైనాలో సాంస్కృతిక విప్లవం అనే ఉద్యమం చేపట్టారే. వారి వణుకు నీకు తెలిసిందే కదే. ఏ మార్గం తప్పని మేం అనుకున్నామో అదే మార్గం కదా భూస్వామి మళ్లీ మమ్ముల అచరించమని చెప్పింది. ఆంధ్రప్రదేశ్ ప్రజలు అది కన్నగురం అయినా క్రిష్టవేణమ్మ ఒడి అయిన ఆదరించి అభిమానించడమే కాదే వెంట వుండి నడిచారూ, నడిపించారే. ఇప్పటికీ ప్రజల సహకారం లేక మేం దెబ్బతినలేదు కదే అమ్మా.
ఎత్తులు పై ఎత్తులలో మేం పప్పులో కాలేసామే. ఫలితం తప్పులు జరిగాయి. రాజకీయ-సైద్ధాంతిక పోరాటంలో వెనకబడిపోయాం- ఇప్పుడింకా పూర్తిగా ఈ లోపం నుంచి బయటపడలేదే. బయటపడాలనే ప్రయత్నం ప్రారంభించాం. ప్రజలను పోరాటాల్లో సమీకరించినా ఏ పోరాటాలైతే వారిని రాజ్య వ్యతిరేక పోరాట జ్వాలల్లో నిలుపుతాయో వాటిల్లో జాగు చేయడమే కాదు ప్రతిఘటన రూపాలలోనూ అవసరమైన మార్పులు చేయడంలో, మమ్ము మేం దిద్దుకోవడంలో జరిగిన లోపం ఓ దశాబ్దం మమ్ముల గుక్కదింపుకోని విధంగా చేసిందే. ఇది స్వయం కృతాపరాధమే అమ్మ.
అది ఇక్కడ దండకారణ్యంలో దిద్దుకొని దెబ్బ ఎట్లా కొట్టాలో ఒక్కటే కాదే, ప్రత్యామ్నాయ రాజ్య రూపు రేఖలు ఎట్లా వుండాలో చెబుతూ వచ్చిన దానికి రూపంగా విప్లవ ప్రజా కమిటీలను విభిన్న దొంతర్లలో ఏర్పరిచాం. స్థానిక భాషలో ‘జనతన సర్కార్’ అంటారే. ఇవి మేం ఏర్పర్చే ప్రజాస్వామిక ప్రభుత్వానికి అంకురాలు. మేం ఇక్కడ ఇప్పుడు ప్రజల రక్షణ కవచంలో, జనతన సర్కార్ల రక్షణలో గర్వంగా నిలబడి పాలకవర్గాలను సవాల్ చేస్తున్నామే అమ్మా!
‘భవిష్యత్ ప్రజలది, మావోయిస్టులదనీ’! గోదావరి ఆవల దెబ్బతిన్న దళాలు, ప్లాటూన్లు, నాయకత్వ కామ్రేడ్స్ దండకారణ్య పోరాటానికి నాయకత్వం వహించడమే కాదు తెలంగాణ మీదుగా మళ్లీ పశ్చిమ కనుమలలోకి ఎలా ఉద్యమాన్ని విస్తరింపచేయడమా ఆలోచిస్తున్నారే అమ్మా. దానితో మావోయిస్టు రహిత రాజ్యం కాదే మావోయిస్టుల రాజ్యంగా తెలంగాణను తీర్చిదిద్దుతామే అమ్మ.
భౌతిక పరిస్థితి ఏలినవారికి అనుకూలంగా లేదని వర్తమానంలో ఏ రోజు పేపర్ చూసినా, వార్త విన్నా అర్థం అయ్యే విషయమే. కానీ చివరి వరకూ తమ తప్పులను, గోతులను కాపాడుకోవడం కంటే పార్లమెంటరీ పాలకవర్గాల పార్టీలకు కావలసిందేముంటుంది. చంద్రబాబునాయుడు గురించి నీవెరిగినదే కదా అమ్మా, ప్రతి ప్రజా పోరాటాన్ని వ్యతిరేకించాడు. మమ్ముల వ్యతిరేకించడం తదుపరి మాట.
ఇప్పుడు ఏ చిన్న అవకాశం దొరికినా ప్రజల ‘పక్షాన’ ప్రజా ‘ఆందోళన’ చేస్తానని ప్రకటిస్తున్నాడే. అమ్మా నీకు నాకు ఉండే చిత్తశుద్ధి మన ప్రజలకుండే చిత్తశుద్ధి వీరికి ఉండదే. ప్రజలను ఈ పేర వంచించడం తప్ప. ఈ మధ్య పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించకుంటే ‘ప్రజాందోళన’ చేస్తానని హుంకరించాడు. ఏదీ ప్రజాందోళన? ప్రపంచ మార్కెట్ ధర- ఇండియన్ మార్కెట్ ధర లెక్కలు తీసి మరీ చెప్పారు.
చంద్రబాబు ఆంధ్రలోనే కాదు భారతదేశంలో పెట్రోల్ డీజిల్ తదితర పెట్రోల్ ఉత్పత్తుల ధరలు తగ్గించే ఆందోళన చేపట్టి ఉంటే ఆంధ్రులే కాదు దేశ వాసులు బ్రహ్మరథం పట్టేవారే. మాట మాత్రంగానైనా ధరలు తగ్గకుంటే పరువుపోతుందే ఎన్నికల కాలంలో అని కాంగ్రెస్ జడుసుకొని, ధర్మదాతల్లా చేయి విదిలించింది. 5-10 తగ్గించి పాపం కడుక్కున్నాం పొమ్మన్నారు.
ఇదే అమ్మ చంద్రుడు, ఇంద్రుడు, మన్మోహన్ పేరు ఏదైనా అందరొకటే దోపిడీకి అని చెప్పడానికే. అమ్మా! నీకు గుర్తుందానే, తెలంగాణ రాష్ట్రం కావాలని 1969లో మన ఊర్లో మేం బస్సు కాల్చి జైలుకుపోయిన వైనం. 69లో మా స్కూలు ముందు పోలీసు కాల్పులు. ఇగో ఇప్పటికీ ఆ ప్రత్యేక తెలంగాణ రానేలేదు. ఆ నినాదం ఇప్పటికీ ఓట్లకు అన్నదాతలా ఉంది. ఇప్పుడు అందరూ తెలంగాణ పాటే కదా. ఇది ‘పాలక పార్టీల’ చిత్తశుద్ధీ అమ్మ.
45 నాటి తెలంగాణ, 69-71 నాటి తెలంగాణ, 1977-99ల నాటి తెలంగాణ దాటి మా అనుభవాలు, ఆ తర్వాత మరెంతో ముందుకుపోయిందే అమ్మా. అయినప్పటికీ, మేం మళ్లీ తెలంగాణలో ఈ అనుభవం అంతా ముందుపెట్టి ఇప్పటికీ చేసిన పోరాటానికి నాలుగు రెట్లు అధికంగా ఉద్యమం నిర్మిస్తేనే ఇగో, ఇక్కడ దండకారణ్యంలో జనతన సర్కార్లను నిలబెట్టడమే కాదు, ప్రత్యామ్నాయ ప్రజాప్రభుత్వం ఎట్లుంటుందో అర్థం చేయించగలం.
మార్క్సిజమే ప్రపంచ కార్మిక వర్గానికి కావాలసిన శాస్త్రం- అని చెప్పగలం. ఇది మేం చెప్పడం ఆలస్యం అయితే ప్రపంచ పెట్టుబడిదారీ సంక్షోభం ఈ ఆర్థిక మాంద్యాలే మార్పు నుంచి మావో వరకు చేసిన విశ్లేషణలను ముందుపెట్టుకొని ఉద్యమ గర్భం నుంచే కొత్తతరం ఉద్యమ నాయకులు ముందుకు వస్తారే అమ్మా. ఇది చరిత్ర నిండా నడిచిన నడుస్తున్న క్రమం అని నువ్వు ఎరిగినదే కదా అమ్మా. నిన్న బి.బి.సి వార్తల్లో ఏడాది ఆంధ్రప్రదేశ్‌ను విశ్లేషించారే.
2008 మా ఆందోళన సంవత్సరమే అయినా బలిమెల ఘటనల్లో గ్రేహౌండ్స్ జాగిలాల నీటిమునక విడి ఘటనగా చూడకుండా సరిహద్దుల్లో ఉన్న సమస్యను సమష్టిగా ఎదుర్కొంటామని సర్కారీ గొంతు పలికింది. ఈ విశ్లేషణ అందరెరిగినదే కదా. అయితే విప్లవోద్యమాన్ని ఘటనల పట్టీగా చూసే ఏలినవారు, వారి వందిమాగధులు విప్లవోద్యమంలోని వైవిధ్యాలు, పలు పార్శ్వాలను ముట్టుకునే సాహసం చేయలేరుకదే అమ్మా.
ఘటనలు విప్లవానికి చిహ్నమా? సామాజిక పరిస్థితి, ప్రజల చైతన్యం అనే ప్రశ్న ఏలినవారు ఎరిగినదే అయినా ప్రజలకు ఏం చెబుతారు? ఓ విడివడిన ప్రాంతానికో, ఒక జాతికో, కులానికో, ఓ సమస్యకో, ఓ జిల్లాకో, ఓ రాష్ట్రానికో మేం ఇంకా పరిమితమైనా పంట అని అందరూ అనుకుంటున్నా ఏ పోరాటం తెగించి చేయ సిద్ధంగా లేరు.
ఇది మేం చేతుల్లోకి తీసుకొని ప్రజల సమస్యలపై కొంచం వెనకా ముందో ఉద్యమాలు నిర్మిస్తాం కొన్ని ఉద్యమాలు తాత్కాలికంగానే నిలిచినా అవి ప్రజల జీవితాలపై, రాజకీయాలపై ఎడతెగని ముద్ర వేస్తాయి. అది ఏ రాజ్యంలో వేసినా దేశవ్యాపిత ప్రభావం నెరపడం గతితార్కిక సూత్రమే అమ్మ. అందుకే అమ్మా! మేం ఇద్దరమే కాదు కోటన్నొక కోటన్నలు, వేణన్నలు ఉద్యమ గర్భం నుండి పుట్టుకు వచ్చారు-వస్తున్నారు.
దేశ భవిష్యత్ ఇగో ఈ యువత చేతుల్లో వుంది. బాపు దేహం చాలించిన విషయం నాకు మా నేస్తం ఒకరు ఉత్తరం రాసి మా కంట్లో పదను తుడిచారు. ‘ఒక తల మాణ్యమై తన ఆదర్శాలను ఆఖరి వరకు ఆచరించిన గొప్ప నాయకుడు మీ తండ్రి ఇక లేరు. ఆ తరం ఇక లేదు.’ బాపు చివరికి నా చేతిలో చేయి వేసిన రోజైనా మేమే కాదు మా మిత్రులు, సహచరులు బాపు గురించి గర్వంగా చెప్పినా నీ కంటి కొలుకుల్లో నీరు తుడవ మేం రాలేకపోయాం.
రాజ్యం మమ్ముల రానీయలేదు అమ్మా! అంతేకాదు మాతో దినం రాత్రి తెలంగాణలో నడిచిన వాళ్లూ ఆంధ్రలో తిరగాడిన వాళ్లూ నేలరాలితే ఆ తల్లుల కంటి కొనుకుల్లో నీరు తుడవ వేలాది ప్రజలు కదిలారే. నీ వెంటనూ అట్లా వేలాది లక్షలాది ప్రజలున్నారే అమ్మా. మేం ఈ ప్రజాబాటలో కొనసాగడం నీకే కాదే అమ్మ కోట్లాది అమ్మలకు, అక్కలకు, వదినమ్మలకే కాదే పీడిత మహిళలందరికీ గర్వంగానే వుంది. ఇదంతా మీకే కాదే మా అందరికీ గర్వంగానే వుందే.
అమ్మా! మా ఆరోగ్యాలు ఎలా వున్నయని అంటావా? ఏం ఢోకా లేదే- దినం రాత్రి తిరగాడేవాళ్లం- అయినా నువ్వు విన్నప్పటిలా గతంలా తిరగాల్సిన అవసరం మాకు లేదే. ఆరోగ్యం కన్నా సల్వాజుడుం అనే సర్కారీ నిర్బంధంలో ఊరు విడిచి మాతో వుండే పేద ప్రజలకు వైద్య సౌకర్యం కల్పించలేని మా పరిమితికి బాధగా వుందే. సర్కారు వంచనకు సల్వాజుడుం క్యాంపులో వుండే పిల్లల చావుకు బాధగా వుంటుందే అమ్మా.
వనరులు లేక వైద్యం చేయలేకపోయాం. ఉన్నమేరకు చేయప్రయత్నించినా మా వైద్య సరఫరాలను అటకాయించే రాక్షసం రాజ్యమేలుతుందని మరోమారు మరో పటాలాన్ని ట్రిగ్గర్ గట్టిగా నొక్కి ప్రజల వైద్యావసరాలను చూడమని ఆదేశం ఇచ్చామని మా అమ్మగా నీకు అమ్మలాంటి అమ్మలందరికి చెబుతున్నామే. అమ్మా! నీ చనుబాలు తాగి బతికిన వాళ్లం. మా ముందు ముగ్గురన్నలు నీ చనుబాలు లేక కండ్లు తెరవకముందే కాటికి వెళ్లిన కథ నీ నోట ఎన్నోసార్లు విన్నాం కదే అమ్మ. అందుకే ఇరాక్ పిల్లలకు, ఆఫ్ఘానిస్తాన్ పిల్లలకు, బంగ్లాదేశ్ పిల్లలకు ఇక్కడ మా చుట్టూ పిల్లలకు పాలు లేకుండా చేసిన బుష్‌లన్నా, రమణ్‌సింగ్‌లు, రాజశేఖరులు ఎవరన్నా మాకు కసితో కళ్ళు ఎర్రబడుతాయే అమ్మా- వ్యక్తులుగా మేం ఎవరినీ ద్వేషించము. కానీ ఏ వ్యక్తి ఏ వర్గ ప్రయోజనం కోసం ఎవరికి ఆధిపత్యం వహించి క్రూర హింసకు నేతృత్వం వహిస్తున్నాడనేది గీటురాయిగా ఉంటుంది. మా మార్గం వర్తమాన ప్రపంచానికి తగినది కాదని అనేవాళ్ళు ఎప్పుడూ ఉంటారే అమ్మా. మాతో కదం కలిపి నడిచిన వారు ఇక నడవలేమనుకున్నప్పుడు వెనుదిరగడమే కాదు మా మార్గాన్నే తప్పు పట్టిన వారున్నారు. వీరు శత్రు క్యాంపునకు మద్దతుగా నిలిచారు.
మరికొందరు సముద్ర ఘోషకు, ఎగిసిపడిన నది అలలకు గుండె చెదిరి గంగమ్మకు మొక్కి వెనుదిరిగితే, గంగమ్మ (గోదావరి) ఒడ్డున గుడారం వేసిన మేము చూపు ముందుకే సారించామే అమ్మా. ఉద్యమం ఆటనో, అల్లికనో కాదు కదే. అది జీవితంలో అడుగడుగునా క్రమ శిక్షణనే కాదు, నిరంతర అధ్యయనాన్ని నిరంతర మెళకువను, పాదరసం లాంటి మేధస్సును, యుక్తిని, మాట మంచితనాన్ని డిమాండ్ చేస్తుంది.
ఇలా అణకువ, ఆరోగ్య వాతావరణం, సోదర సంబంధాలు, పరస్పర గౌరవం, ఇచ్చి పుచ్చుకోవడాలు లేని అప్రజాస్వామిక వాతావరణం ఎవరైనా కొద్ది కాలం చెలాయించగలరేమో కాని అమ్మా, అదెంతో కాలం సాగదే. అందుకే కొందరు మార్గ మధ్యనే దారి తప్పేవాళ్ళు ఉన్నారే మాలో. వారిని వదిలి మేం, మా ప్రజలు ముందుకు సాగిపోతున్నాం. ఈ సమయంలో నీదే కాదే, నీలాంటి అమ్మలు, అక్కలు, అన్నలు, తండ్రుల పిలుపులకు స్పందిస్తున్నామే.
నేలరాలిన మా సహచరులలో నీకు కొందరు తెలుసు. మరికొందరి పేరు వినే ఉంటావ్. ఇంకొందరి పేర్లు రాజ్యం తన క్రూరత్వాన్ని ప్రదర్శించినప్పుడు పరిచయం చేసింది. ఏది ఏమైనా జనాభాలో అత్యధికులు మా వైపే ఉండటం వల్ల ఒక చోట దెబ్బ తిన్నా మరో చోట ముందుకు సాగుతుంది. ఈ లోగా భౌతిక పరిస్థితిలో ప్రజలు పోరాడక తప్పని పరిస్థితిని పీడకవర్గాలే సృష్టిస్తున్నాయి. కనుక మళ్ళీ పోరాట ఉప్పెనలు, నిప్పురవ్వలు దావాగ్ని కావడం కొనసాగుతుందే అమ్మా.
అమ్మా, సంక్రాంతి రాబోతుంది కదే. తెలంగాణ వాకిళ్ళలో సంక్రాంతి ముగ్గులు నిన్న మొన్నటి సంస్కృతిగా సామ్రాజ్యవాద సంస్కృతి చేసింది కదే. మన సకినాలు, అర్షలు, రేగుపళ్ళు, నెగళ్ళు పాతవైపోయాయి కదే. మల్టీ నేషనల్ కంపెనీలు వంటకాల సుప్రసిద్ధ మన వంటకాలను, అలవాట్లనే మార్చి కొత్త తరాన్ని వంచించుతున్నాయే అమ్మా. ఈ విష సంస్కృతిపైనా మా పోరాటమే అమ్మా. పండుగ పబ్బానికి నువ్వు మా కోసం కన్నీళ్ళు పెట్టడం మేం ఎరిగినదే అమ్మా. నువ్వే కాదే ఏ ఊరు వెళ్ళినా, ఏ జిల్లా అయినా, ఏ రాష్ట్రమైనా, ఏ భాష అయినా పండుక్కు మీరు వస్తారని చూసామని చెప్పి చేతిలో ఫలమో, తృణ మో పెట్టే అమ్మలు, అక్కలు ప్రతి ఇంటి ఇంటికి ఉన్నారే అమ్మా. పిండి వంటలు ఏ ఇంట్లో ఉన్నా తింటాం. కానీ కన్న కడుపుకు నోటి నిండా పెట్టడం మా చేతిలో పని కాదని అనుకుంటామే. ఇది మేమే కాదే మా వాళ్ళంతా అనుకుంటారు.
ఏ అమ్మ ఎలా వండి పెట్టిందీ మా కబుర్లలో ఇప్పటికీ వస్తాయంటే నమ్ముతావే నీవు… అమ్మా! ఇక ముగిస్తామే. ఎంతరాసినా తరగని చరిత్ర విప్లవోద్యమానిదే. ఇప్పటికి లిఖిత చరిత్ర అనేకం ఉందే. అన్నట్లు అమ్మా, పగలు తిన్నాక చదివే నీ అలవాటు ఇంకా ఉందానే. తప్పక చరిత్ర చదవాలే నువ్వు. నీ కొడుకులు, కూతుళ్ళు వేనవేల మంది రచిస్తున్న కొత్త చరిత్ర చదవాలే అమ్మా.
చివరగా ఒక క్షమాపణే అమ్మా. మా జవాబు ఆలస్యం అయిందని చెప్పడానికి చింతిస్తున్నామే. రాజ్య నిర్బంధంలో నీ మాట మాకు అందడమే ఆలస్యం అయితే అందాక జవాబు ఆలస్యానికి కారణం రాజ్యమేనే. ఎందుకంటావా? ఏ రూపంలో నీకు జవాబు పంపాలో అనుకుని చివరకు ఈ బహిరంగ లేఖకు దిగాం. బాపు ఉన్నప్పుడు ఓ సారి మేం చదువుకునే రోజుల్లో ఆయన రాసిన ఉత్తరానికి జవాబు రాయలే.
తదుపరి కలిసినప్పుడు ఎందుకు జవాబు రాయాలో అర్థం చేయించాడు. అది ఇప్పటికీ మేం మరిచిపోక ఆచరిస్తున్నాం. పార్టీలోకి వచ్చాక మునుపటి మా నాయకుడు సీతరామయ్య గారు పార్టీపై జరిగే రాజకీయ దాడి, ప్రజల నుంచి వచ్చే అర్జీలకు సకాలంలో జవాబు ఇవ్వాలని నేర్పాడు. అది పాటించే ప్రయత్నం చేస్తున్నాం. మా పార్టీ సైద్ధాంతిక నాయకులు మార్క్సు- ఎంగిల్స్ రచనలు, లెనిన్- మావో రాజ్యం నడిపిన తీరు ఇదే విషయం నొక్కి చెబుతాయి.
సత్యం, చంద్రం, మైన, తారలే కాదు మా కామ్రేడ్స్ అందరూ నీకు వందనాలు తెలుపమన్నారు. నీ దండి గుండెను మరవమన్నారు. ఏ రూపంలో మా జవాబు వస్తుందా అని ఎదిరి చూసే నీకు ఈ ఆలస్యం మనోవేదన కలిగిస్తుందనే దాంట్లో సందేహం లేదు. అందుకే క్షమాపణలతో ఆలస్యానికి ఈ రోజుకి ఇక్కడే ముగిస్తాం. నీ కంట్లో వెలుగులు-ఒడిలో పిల్లలు !
- కోటీ-వేణు
జనవరి ఒకటి, 2009
(15 మే 2009, ఆంధ్రజ్యోతి సౌజన్యంతోటి )