పండిన గోరింట చేతులే కన్నీళ్లు తుడిచె
మంటలే మండించ కనుల నిప్పు రాజేసె
* * *
అద్దిన రంగులతో అద్దమ రాతిరి వోలె నీ రూపు
కొత్త కొత్త తారకలన్నీ రాలె ధరాతలం వైపు
* * *
మధుపానీ! తాగు మత్తిల్ల – వసంతానికీ ఇదే ఆఖరు
చూడు! సాకీ చేతి పాత్ర – కరిగె ఉదయ కాంతి తీరు
* * *
విశ్వాసివీ కాదు – విరాగివి కావు, విధ్వంసునివనీ చెప్పరెవరు
విగ్రహ పూజ కాదన – ఉస్మాన్! నీ వెవరు
* * *
పాత రాజాధిరాజులంతా గతియించిరి కాల గర్భమున
ఉస్మాన్! నీ పాలనే ఉనికి – ముసల్మాన్‌లకు అది నిషాని
(రాజుగా ఉన్నప్పుడు రాసినవి)
* * *
మృత్యువే ముంచుక రానున్నది- ఉప్పెనే ఉర్కి రానున్నది
సఖి భృకుటి సంధించనున్నది- ఖుదా! జనులకు ఉన్నదా భద్రత యన్నది
* * *
నా అవసానమే నీకు పరిహాస చరణం- ఎవరు నేర్పించిరి సఖీ!
నీ సౌందర్యమే- నాకు ఇంతటి నరకమనీ
* * *
విధి ఆడుకున్నది- మధువు వొలికింది- సోపతి చెదిరింది
మధురిమ కరిగింది- సఖి బాకీ తీరింది, ఉస్మాన్! నీ శకం ముగిసింది!
(రాజరికం పోయిన తరువాత రాసినవి)
(18 మే 2009, ఆంధ్రజ్యోతి వివిధ సౌజన్యంతోటి )