Feed on
Posts
Comments

- ఎస్‌. జగన్‌రెడ్డి

051809_aj_nizam1.jpg

అలనాడు సాహిత్యకారులను గౌరవించడం హైదరాబాద్‌ రాజ్యంలో ఒక సామాజిక విలువగా చెలామణి అయ్యేది. రాజులు, కులీనవర్గాలే కాదు సామాన్యులు కూడా కళాప్రియులు, కవిత్వ పిపాసులే. రాజులు సంగీత, సాహిత్యకారులు కావడం చరిత్రలో ఉన్నదే. ఆసఫ్‌ జాహీల వంశంలో ఐదుగురు రాజకవులు ఉర్దూ సాహిత్యంలో పేరెన్నికగనడం విశేషం…

సిపాయిల తిరుగుబాటు దేశాన్నే కాదు, హిందుస్తా నీ సాహిత్య (ఉర్దూ), సంప్రదాయాలను కూడా ఒక కుదుపు కుదిపింది. క్షీణ విలువలు, సామాజిక సంక్షుభితి ఎల్లెడలా వ్యాపించిన కాలమది. ఆనాటి దుస్థితిని, దేశపరాధీనతను మహాకవి గాలిబ్‌, జఫర్‌, దాగ్‌ రచన తేటతెల్లం చేస్తున్నది. మారిన భౌతిక వాస్తవికత రీత్యా ఆనాటి కవులు, కళాకారుల లోకం పునరాలోచనలో పడిపోయింది. కొన్నాళ్లు నిరాశ, నిస్పృహ, దైన్యం రాజ్యం చేసింది. 1857 నుంచి 1870ల మధ్యకాలం హిందుస్తానీ సంగీత సాహిత్యరంగాలకు సంధికాలం.

అనేక రంగాలకు ప్రధాన కేంద్రంగా ఉన్న ఢిల్లీ బ్రిటిషువారి చేతుల్లోకి మారినా సంగీత సాహిత్య రంగాల స్ఫూర్తికి జరిగిన నష్టమేమీలేదు. భారతీయ అంతరాత్మను పొదివి పట్టుకున్న హిందుస్తానీ కవులు, కళాకారుల ధీమా ఏమాత్రం సడలిపోలేదు. ఈ కాలపు పురుటి నొప్పులను బాగా చిత్రించిన కవి దాగ్‌. ఆయన హైదరాబాద్‌లో స్థిరపడ్డాడు. అనేక కారణాలవల్ల దేశ సాంస్కృతిక కేంద్రం ఆనాటి దక్కన్‌లోని హైదరాబాద్‌కు బదిలీ అయింది. అందుకు సిద్ధం చేసి దానిని మలిచిన ఆసఫ్‌ జాహీలు గొప్ప కవులు కావడం ముఖ్యకారణం.

051809_aj_nizam2.jpg

శతాబ్దాల తరబడి మొఘలుల అధికార కేంద్రంగా భాసిల్లిన ఢిల్లీ ఆంగ్లేయుల పట్టుతో పాత ప్రాభవాన్ని కోల్పోయింది. దేశంలో వారి ప్రాబల్యం పెరుగుతున్న క్రమంలోనే ఢిల్లీ పతనం కావడం- దేశీయ సాహిత్య, సంగీత సంస్కృతులకు హైదరాబాదు కేంద్రం కావడం ఒకేసారి జరిగిపోయాయి. అటుతరువాత హిందుస్తానీ సంగీత, సాహిత్య సంప్రదాయాల వికాసానికి ఆసఫ్‌జాహీల చేయూత మరువలేనిది. విస్మరింపరానిది. భారత సాంస్కృతిక రంగంలో మొఘలులకు ఉన్నటువంటి ఘనమైన చరిత్రే నిజాము రాజవంశీయులకు ఉన్నది. వారిది మధ్యయుగాల చివరి రోజులవరకల్లా అంతమయితే వీరి చరిత్ర ఆధునిక కాలానికి కూడా విస్తరించింది. స్వాతంత్య్రం సిద్ధించేవరకు భారత సాంస్కృతిక రంగ వికాసానికి ఎంతో చేయూతనిచ్చిన నిజాములు వీటిపట్ల చాలా సెక్యులర్‌ దృష్టితో వ్యవహరించారు. పవిత్రమైన దైవకార్యంగా భావించేవారు.

051809_aj_nizam3.jpg

ఆయా రంగాలలో ఏమాత్రం ప్రతిభ ఉన్నవారికైనా తమ దర్బారులో అత్యున్నత గౌరవ ప్రతిపత్తులు లభించేవి. ఈ మేరకు వారిది ఘనమైన చరిత్రే. ఇంతేగాక జాతీయోద్యమానికీ, ఆధునిక భారత పునర్వికాసానికి ప్రత్యక్షంగా పరోక్షంగా వారు అందించిన సహకారం మరో విలువైన కోణం. శాంతినికేతన్‌, అలీగడ్‌, బెనారస్‌, ఆంధ్ర విశ్వవిద్యాలయాలకు, అఖిల భారత హిస్టరీ కాంగ్రెస్‌కు నిజాం అందించిన ఆర్థిక సహాయం ఆ రోజుల్లోనే లక్షలలోనే. దక్షిణాదిన ఆసఫ్‌జాహీల పరిపాలన మొదలైంది లగాయితు హిందుస్తానీ భాషా సాహిత్యాల, సంగీత చరిత్రకు వారి ప్రమేయం, వారి ప్రస్తావన లేకుండా ముగింపు ఉండదు. అది వ్యక్తిగత స్థాయిలోనూ, సామాజిక స్థాయిలోనూ ఉండడం విశేషం. ‘వస్తాదోంకా వస్తాద్‌’ అల్లాదియాఖాన్‌ నుంచి బడే గులాంఅలీఖాన్‌ వరకూ, 19వ శతాబ్దంలో గద్వాలను సందర్శించిన గోహార్‌జాన్‌ నుంచి బేగం అఖ్తర్‌ వరకు నిజాం రాజవంశీయులు, వారి సంస్థానాధీశులు చూపిన ఆదరణ ఎంతో విలువైంది.

గాలిబ్‌ నుంచి విప్లవ కవి (షాయరే ఇంక్విలాబ్‌) జోష్‌ మలిహాబాది వరకు ఆనాటి ప్రతిష్ట కలిగిన ప్రతి రచయిత తమ జీవితాంతం నిజాంల నుంచి ఆదరణ పొందినవారే. ఆదరణ విషయంలో నిజాములకు ప్రతిభే గీటురాయి. తామే సంగీత సాహిత్యాలలో విధ్వాంసులు కనుక ప్రత్యక్షంగా చూసి తెలుసుకునేవారు. ఒకసారి ఆదరణ లభిస్తే ఆ కవికి జీవితాంతం ఇక రాజభోగమే. ఆనాటి హిందుస్తానీ పండితులు, ప్రధానంగా సంగీత, సాహిత్యకారులు నిజాముల పరిచయభాగ్యంకోసం వెంపర్లాడేవారు.

051809_aj_nizam4.jpg

మహరాజా కిషన్‌ ప్రసాద్‌ కవిత షానామా హిందుస్తానీలోకి తర్జుమా చేసిన ప్రేంచంద్‌ నిజాంలనుంచి ఆర్థికసహాయం పొందినవారే. బయటివారిని, తమ ఆశ్రయం పొందిన వారిని ఎంతో గౌరవించడం ఒక సామాజిక విలువగా చెలామణి అయిన కాలమది. ఇప్పటికీ ఈ విలువ హైదరాబాద్‌, తెలంగాణ స్థానికులైన ప్రజలలో ఉండడం గమనించవచ్చు. రాజులు, కులీనవర్గాలే కాదు సామాన్యులు కూడా కళాప్రియులు, షాయరీ దివానే. ఇందుకు మంచి దాఖలా మహాకవి దాశరథి ఆత్మకథ ‘యాత్రాచరిత్ర.’ ఒక కవితా గోష్టిలో పాల్గొనడానికి ఒక బస్తీలో ఆయన రిక్షా ఎక్కుతాడు. కొంతదూరం పోగానే రిక్షా అతనిని పేరడిగి మాట కలుపుతాడు. తానూ కవితాగోష్టికే వస్తున్నానని చెబుతాడు రిక్షావాలా. దాశరథి ఆశ్చర్యపోయి ‘వినడానికా!’ అంటూ అడుగుతాడు. గోష్టిలో కవిత చదవడానికి తనకూ ఆహ్వానం అందిందనీ దబదబా రిక్షా నడుపుతుంటాడు. విస్తుపోయిన దాశరథి తనను పరిచయం చేసుకుని ఆ పెద్దమనిషిని రిక్షా ఆపమని పట్టుబట్టి ‘మీరు రిక్షాలో కూర్చోండి, నేను తొక్కుతా’నంటాడు. ఈ లోపు వేదిక వచ్చేస్తుంది. ఆ రిక్షా పెద్దమనిషి కూడా షేర్వాని తొడుక్కుని వేదిక నెక్కుతాడు. ఇది యాభైలలో జరిగిన సంఘటన. ఇటువంటి పరిస్థితులవల్లే ఉత్తరాది కవులు, సంగీతకారులు హైదరాబాద్‌ రావడానికి ఉత్సుకత చూపేవారు. ఇక్కడే తిష్టవేసి ప్రదర్శనలు ఇచ్చేవారు. శ్రోతల అభిరుచి, కళాతత్పరత, మన్నన, ఉన్నత స్థాయిలో ఉండడంవల్ల వారికి ప్రోత్సాహంగా ఉండేది.

051809_aj_nizam5.jpg

మెప్పిస్తే శ్రోతలతో పాటు వేదికపైనున్న వాళ్లు కూడా పాదాభివందనం చేయడం ఖాయం. హిందుస్తానీ సంగీతానికైనా, సాహిత్యానికైనా నిజాములు అండగా నిలిచారంటే వాటి వికాసానికీ పూనుకున్నారంటే కేవలం రారాజులు కావడం వల్ల కాదు. సంప్రదాయంలోని ఉన్నత విలువలు, శతాబ్దాల పరంపర వారికి వారసత్వంగా వచ్చింది. వారే స్వయంగా కవులు, కళాప్రియులు, సంగీతలాలసులు కావడమే. ఐదుగురు రాజకవులు, రాజులు సంగీత, సాహిత్యకారులు కావడం చరిత్రలో ఉన్నదే. కొన్ని మినహాయింపులు ఉన్నా ఆసఫ్‌ జాహీల వంశంలో అయిదుగురు రాజకవులు ఉన్నట్టు తెలుస్తున్నది. మొదటి నిజాంతో పాటు రెండవ నిజాం కుమారుడు ఆర్తుజా, అటు తరువాత మీర్‌ మహబూబ్‌ అలీఖాన్‌, ఆయన కొడుకు ఉస్మాన్‌ అలీఖాన్‌, ఆయన కొడుకు మొహజ్జం జా బహాదూర్‌ ఉర్దూ సాహిత్యంలో పేరెన్నికగల కవులు.

చిన్న వయస్సులో మరణించిన ఆర్తుజా గొప్పకవి. బ్రిటిష్‌ వలసవాదులకు వ్యతిరేకంగా 17, 18 శతాబ్దాలలో ముస్లింలలో తలెత్తిన వహాబీ సామాజిక ఉద్యమంలో మెదక్‌ పాలకుడు సదాశివరెడ్డితో పాల్గొని తండ్రిపై తిరుగుబాటు చేశాడు. ఇందుకు ఉరిశిక్ష పడి ఇద్దరూ అకాలంగా మరణించారు. షజ్జి పేరుతో ఐదువేల కవితలు రాసిన మొహజ్జం జా ఆధునిక ఉర్దూ సాహిత్యంలో ప్రసిద్ధులు. గజల్‌ గాయకునిగా ప్రసిద్ధిగాంచిన వస్తాద్‌ విఠల్‌రావు ఆయన శిష్యుడే. షజ్జి రాసిన గజల్లను హైదరాబాద్‌ మెహిఫిల్‌లలో పాడడం ఇటీవల ఒక సంప్రదాయంగా స్థిరపడింది. ఆసఫ్‌ జాహీల పరిపాలన కాలాన హైదరాబాద్‌ ఉర్దూ విప్లవాత్మకమైన మార్పును చవి చూసింది. ఆరవ ఆసఫ్‌జాహీ మహబూబ్‌ అలీఖాన్‌ వరకు దఖనీగానే ప్రసిద్ధి గాంచింది.

మహబూబ్‌ కాలంలో సామాజిక ఆర్థిక రాజకీయ రంగాలలో వచ్చిన మార్పుల ప్రభావం ఉర్దూ భాషపై పడింది. ఉత్తరాది నుంచి వందలమంది పండితులు ఉద్యోగాన్వేషణలో హైదరాబాద్‌కు రావడంతో వారి ప్రభావం సాహిత్య సాంస్కృతిక రంగాలపై ప్రసరించింది. వారిలో అత్యధికులు పండితులే. వీరికి అనువాదరంగం, రాజదర్బారు, అప్పుడే ప్రారంభమవుతున్న ఆధునిక విద్యాసంస్థలు, పత్రికలలో ఉద్యోగాలు లభించాయి. 1820నాటికే ఆంగ్లేయులు పెద్ద ఎత్తున స్థిరపడ్డారు. ముందు ఫ్రెంచివారే గాక సికింద్రాబాద్‌లో ఆంగ్లేయుల సైనిక స్థావరం ఏర్పడడంతో ఆంగ్లజీవనశైలి హైదరాబాద్‌లో ప్రధాన భాగమైపోయింది. మొత్తానికి ఈ బయటి గాలులవల్ల మస్నవి (ప్రబంధాన్ని పోలిన రచన) ఖసీదా (స్మృతిగీతం) శృంగారం వంటి సంప్రదాయ, పర్శియన్‌ నుంచి ఉర్దూలోకి వచ్చిన రచనలకు కాలం చెల్లింది.

వాటిస్థానే సుందర సుకుమార గజల్‌ భావగీతాల రచన మొగ్గతొడిగింది. మహబూబ్‌ కాలం వరకు రొమాంటిక్‌ పొయెట్రీదే ప్రాబల్యమయితే ఏడవ నిజాం ఉస్మాన్‌ అలీఖాన్‌ హయాంలో ఉర్దూ భాషాసాహిత్యాలు మరింత వాస్తవికతను, ఆధునికతను సంతరించుకున్నాయి. మొత్తం ఆనాటి హైదరాబాద్‌ కవిలోకం నాలుగు శ్రేణులుగా ఉండేది. 1. రాజకవులు 2. ఇక్కడ స్థిరపడిన బయటికవులు 3. స్థానికులైన ప్రగతిశీలవాదులు 4. కవయిత్రులు. 20వ శతాబ్దపు రాజకవులలో ప్రముఖులు మీర్‌ ఉస్మాన్‌ అలీఖాన్‌, రాజా కిషన్‌ ప్రసాద్‌, దోమకొండ సంస్థానాధీశుడైన రాజా రాజేశ్వర్‌రావు. రాజకవులైనంత మాత్రాన మధ్యయుగపు కాలంవలే కవితా రచన వీరికి కాలక్షేపం కాదు. వారి జీవితాలలో అదొక ముఖ్యమైన వ్యాపకం. ఆధునిక భావ విలువలకు, సంప్రదాయాలకు ఆలోచనా ధారలకు మధ్య వారధి, సమన్వయ మార్గమని ఓయు ఆంగ్ల విద్యాశాఖలో అధ్యాపకుడు, అనువాదకుడు సిరాజుల్‌ హసన్‌ అంటారు.

సంప్రదాయ శైలి, ధార్మిక, ప్రేమభావాల అనురక్తి, నైతిక ప్రబోధం వారి కవితా లక్షణాలని హసన్‌ విశ్లేషించారు. కులీకుతుబ్‌షా యుగం నాటి కవులు ప్రవేశపెట్టిన శృంగార లాలస, భౌతిక వాంఛానురక్తి వంటి ప్రధాన లక్షణాలను మహబూబ్‌అలీ కాలం నాటికి ఉర్దూ రచనారంగం విదుల్చుకుంది. 1857లో హైదరాబాద్‌ నగరంలో మొదటి సాలర్‌జంగ్‌ ప్రారంభించిన ఆధునిక విద్యాసంస్థ దారుల్‌ ఉలూం, 1870లలో ఢిల్లీలో సర్‌సయ్యద్‌ ప్రారంభించిన మహ్మదియన్‌ కాలేజిలో పశ్చిమ దేశాల గాలులు వీచడం మొదలయ్యాయి. పర్షియన్‌, తెలుగుతో పాటు ఆంగ్ల భాషలలో విద్యాబోధన మొదలయ్యింది.

అటు ఢిల్లీలో ఇటు హైదరాబాద్‌లో 1857 సిపాయిల తిరుగుబాటు ఆసఫ్‌ జాహీలను కుదుపు కుదిపింది. మొఘల్‌ పాలన అంతమవడంతో ఢిల్లీ, లక్నోలలో హిందూ, ముస్లిం కులీన వర్గం తేరుకోనంతగా దెబ్బతిన్నది. ఈ పరిస్థితులలో గాలిబ్‌, జఫర్‌ ఢిల్లీలో, మహబూబ్‌ అలీఖాన్‌, హాలీ, దాగ్‌, రాజా రాజేశ్వర్‌రావు, మహారాజా కిషన్‌ ప్రసాద్‌ హైదరాబాద్‌ నగరంలో సరికొత్త కవితా రచన ఆవిష్కరించారు. మొఘల్‌ కోర్టులో ఎంతో ఆదరణ పొందిన గజల్‌ సంప్రదాయ స్వభావాన్నీ కోల్పోయి నేల మీదికి వచ్చి చతికిలపడింది. హాలీ, గాలిబ్‌లతో పాటు దాగ్‌, మహబూబ్‌ అలీలతో ఉర్దూ కవితకు కాస్త తెరపి దొరికింది. కొంత హేతువు, భౌతిక వాస్తవికతతో సరికొత్త స్వరూపాన్ని సంతరించుకుంది.

మీర్‌ మహబూబ్‌ అలీఖాన్‌
మధ్య యుగాల లక్షణాలను త్రోసిరాజని 1880ల నాటికి మహబూబ్‌ అలీఖాన్‌ కవిత పూర్తి ఆధునిక, రొమాంటిక్‌ లక్షణాలను సంతరించుకుంది. ప్రేమ, నైతికత, దైవారాధన వంటి సూఫీ భావాలతో ప్రచలితమయింది. ఆధునిక ఉర్దూ కవితను తీర్చిదిద్దిన కవులలో ఆయన ఒకరు. ఆయనపై ఆయన పాలనపై పరిశోధన చేసి ‘అవర్‌ బి లవ్డ్‌ డేస్‌’ వంటి అపురూప గ్రంథాన్ని వెలువరించిన కొత్వాల్‌ వెంకట్రామారెడ్డి మనుమరాలు మోహినీరాజన్‌ మహబూబ్‌ పై సూఫీ ఆలోచనా స్రవంతి ప్రభావం ఉందన్నారు. ఆధునిక ఆలోచనారీతులకు పట్టం కట్టిన ఈ రాజకవి తఖుల్లస్‌ (కలం పేరు) ఆసఫ్‌. ఉర్దూ, అరబ్బీ, పర్షియన్‌ భాషా సాహిత్యాల అధ్యయనం చిన్ననాటి నుంచే మొదలైంది. ఆనాడే ఇంగ్లీషు అధ్యయనం చేసిన రాజకవిగా ఆయనకు పేరుంది. చిన్న వయస్సులోనే రెండు కవితా సంకలనాలను ప్రచురించిన మహబూబ్‌ పై దాగ్‌ ప్రభావం ఉందనీ ఒక అభిప్రాయం ఉంది.

ఆయన కవితకు ప్రేమ, అమలిన శృంగారం, దైవారాధన, నైతికత ప్రధాన లక్షణాలన్నది నిజమే. యుటిలిటేరియన్‌ తాత్వికత వల్ల కావచ్చు, ఇప్పటి కాలాన సంపన్న, అధికార వర్గాల సాహితీ కళా తత్పరతను పరిశీలిస్తే నాసిరకంగానూ, చౌకబారుగానూ ఉంటుంది. కానీ మధ్యయుగాల నుంచి చివరి నిజాం వరకు పరిశీలిస్తే సాహిత్య కళారంగాలపై తమదయిన ముద్ర వేయగలిగిన రాజన్యులు అనేకమంది. తాము ఎంచుకున్న ప్రక్రియలపై పూర్తిస్థాయి పట్టు సాధించి సమకాలీన పండిత లోకం మెప్పు పొందడం చరిత్రలో ఉన్నదే. ఉర్దూ మహాకవి ఇక్బాల్‌కు కవితా గురువు దాగ్‌దహేల్వీ మహబూబ్‌ కవితా వస్తాద్‌. కవి ఎవరైనా వస్తాద్‌ తప్పనిసరిగా ఉండడం, అతని చేత దిద్దించుకోవడం, సవరణలు చేయించుకోవడం, ఉర్దూ సాహిత్య సంప్రదాయం.

మహబూబ్‌కు 20 ఏళ్లు వస్తాద్‌గా ఉండిన దాగ్‌ గాలిబ్‌ శిష్యుడు. చిట్టచివరి మొఘల్‌ బహదూర్‌ షా జఫర్‌కు సమీప బంధువు. ఆనాడు ఆధునిక ఉర్దూ వికాసానికీ కృషి చేసిన హిందుస్తానీ మహాకవులంతా మహబూబ్‌కు సహచరులు. వారిలో చాలామంది ఆయన ప్రాపకంతో హైదరాబాదులో స్థిరపడి తమ సాహిత్య కృషి చేసినవారే. ప్రతీకలు, భావధార, వ్యక్తీకరణలో ఆనాడే తనదైన ప్రతిభ కనపరిచిన మహబూబ్‌ పండితులను ఆదరించి వారికి సరైన గౌరవ ప్రతిపత్తులు కలిపించి గొప్పగొప్ప గ్రంథాలను వెలువరించడానికి పూనుకున్నారు. తెలుగు భాషా సంస్కృతుల పరిరక్షణకు ఎంతో కృషి చేసిన గద్వాల సంస్థానాధీశులకు ఎంతో చేయూత నిచ్చారు. ఉత్తరాది నుంచి వచ్చిన కవిలోకం మోసుకొచ్చిన భాషా సంప్రదాయాలు, అప్పటికే కుతుబ్‌ షాహీల ప్రభావం వల్ల శక్తివంతమైన దక్కనీ ఉర్దూ కలగలిసి ఆధునిక ఉర్దూగా, అదే హిందుస్తానీగా రూపుదిద్దుకుంది. షాద్‌ పేరుతో అనేక గ్రంథాలు వెలువరించిన కిషన్‌ ప్రసాద్‌ తన కవితా వస్తాద్‌గా మహబూబ్‌ను స్వీకరించాడు.

మీర్‌ ఉస్మాన్‌ ఆలీఖాన్‌
మీర్‌ ఉస్మాన్‌ఖాన్‌ అలీఖాన్‌కు రొమాంటిక్‌ సంప్రదాయంతో పాటు కొంత వాస్తవికత, ఆధునిక ఉదారవాద భావాలకు పట్టం కట్టిన కవిగా పేరుంది. ఆయన తఖుల్లస్‌ ‘ఉస్మాన్‌’. పర్షియన్‌, ఉర్దూ భాషలలో పండితుడయిన ఉస్మాన్‌ రెండు భాషలలో కవిత రాసేవారు. మొదటి సంకలనం 1920లలోనే ముద్రణ పొందింది. 1930ల నుంచి నిరంతరాయంగా ఉర్దూ కవిత రాయడం ప్రారంభించారు. ఆయన వస్తాద్‌ జలాల్‌ మాణిక్‌పురి. 1940లలో సుబా-యే-దక్కన్‌ అనే దినపత్రిక ఉస్మాన్‌ రాసిన కవిత రోజొకటి ప్రచురించేది. సరళత, పదలాలిత్యం ఆయన కవితా లక్షణాలు. 1974లో రెండవ దివాను ముద్రణ పొందింది. తన యవ్వన కాలంలో రాసిన కవితకూ, ఆయన మరణానంతరం ప్రచురణ పొందిన కవితకూ తేడా ఉందన్న విషయాన్ని గుర్తించారు.

తొలినాటి రచనలో ప్రేమ, స్తుతి, దైవారాధన, సూఫీ భావాలు ఉంటే 1940ల నుంచి రాసిన కవితలలో వాస్తవికత, ఉదారవాద, సెక్యులర్‌ భావాలు కనిపిస్తాయి. 1948 తరువాత రాసిన కవితలలో ఆయన అనుభవించిన స్థితిగతులపై విషాద వైరాగ్యభావాలు కనిపిస్తాయి. సఖి బాకీ తీరింది, ఉస్మాన్‌ నీ శకం ముగిసింది అంటూ ముగించిన షేర్‌ పోలీసు యాక్షన్‌ తదనంతర పరిస్థితులపై రాసినటువంటిదని సిరాజుల్‌ హసన్‌ అభిప్రాయపడ్డారు. ఆయన రచనలపై ఓ.యు.లో పిహెచ్‌డి జరిగింది. ఏమైనా సమకాలీన గత శతాబ్దపు ఉర్దూ సాహిత్యంలో ఆయనకు ప్రముఖ స్థానముంది.

(18 మే 2009, ఆంధ్రజ్యోతి వివిధ సౌజన్యంతోటి)

Leave a Reply

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

Managed by Discover Telangana Inc., a registered nonprofit organization in USA.

All opinions and views expressed by third party content providers and shown here as preview are not that of Discover Telangana.

If you find any Content that is infringing, libelous, defamatory, obscene, abusive, offensive or otherwise violation of copyright law, alert us by emailing us at discover.telangana(at)gmail.com