- మఖ్దూమ్ మొహియుద్దీన్

హైదరాబాద్ నగరానికి ఎన్నో ద్వారాలు వున్నాయి. నగరంలో ఎవరైనా అడుగు పెట్టాలంటే, ఆ ద్వారాలగుండానే లోపలికి అడుగుపెట్టాలి. చంపాద్వారం నుంచి యాకుబ్‌పురా ద్వారం దాటి ధర్మంవంత్ హైస్కూలు దాకా నేను రోజూ నడుచుకుంటూ వెళ్ళే వాణ్ణి. ఆరోజుల్లో రిక్షాలుగానీ, సైకిళ్ళు గానీ, బస్సులు గానీ చాలా తక్కువగా కనిపిస్తూవుండేవి. రోడ్ల మీద ఏనుగులూ, ఒంటెలూ, ఎద్దుల రథాలు వుండేవి. షకరాలూ, జట్కాలూ టాంగాలూ, గుర్రపుబగ్గీలూ దర్శనమిస్తూ వుండేవి. ఆ రోజుల్లో వీధి వీధినా వ్యాయామశాలలూ, కుస్తీపట్లునేర్పించే తాలింఖానాలు ఉంటూవుండేవి. తమ తమ వీధుల గౌరవమర్యాదల్ని కాపాడుకోవాలనే ఆత్రం వీధివాళ్లలో వుండేది.
ఎవరయినా కొత్త పిల్లవాడు మా వీధిలోకి అడుగుపెడ్తే వాడిచేత ‘చిక్కటి మట్టి’ అని అనిపించి (ఓడించి) గానీ వాణ్ణి వదిలేవాళ్లం కాదు. అదే ఓ బలవంతుడయితే మాకు నాలుగు తగిలించి మరీ పోయేవాడు. లేదా మేము ఓటమి అంగీకరించాల్సి వచ్చేది. అదే పరిస్థితి ఇతర వీధుల్లోకి వెళ్లినప్పుడు మాకు సయితం జరుగుతూ వుండేది. వీధుల వెంట నడుస్తూ మేం కూడా యిలాంటి పరిస్థితుల్ని ఎదుర్కోవలసి వచ్చేది. గుర్రపు బగ్గీలలో స్కూలుకి వెళ్లే పిల్లలకి యిటువంటి పరిస్థితి ఎదురయ్యేదికాదు.
వేటగాళ్లు పిట్టల్ని పట్టుకోవటానికి పొడుగుపాటి కర్ర చివర చిక్కంలాంటిది కట్టే వారు. పిట్టలను పట్టడం చూడ్డానికి చాలా ఆసక్తిదాయకంగా వుండేది. రకరకాల పిట్టలు, పక్షులు-గోరింకలూ, రామచిలుకలూ, డేగలూ, తీతువు పిట్ట, పావురాలు వగైరాలను పట్టుకొనే దృశ్యాలు చూస్తూ ఆనందిస్తూ వుండేవాళ్ళం. తోవలో కోతులూ, ఎలుగుబంట్లూ, పాములు నృత్యం చేస్తూ వుంటే అవి చూస్తూ కాలాన్ని మర్చిపోయేవాళ్లం. తీరా స్కూలుకి వెళ్లటం ఆలస్యం అయిపోయేది. ఫలితంగా దండనకి గురి అయ్యే వాళ్ళం. మిగతా క్లాసు పిల్లల ముందు సిగ్గుతో తలవంచుకొనే వాళ్లం.
హై కోర్టు కాంపౌండులో నదివున్న వేపు దగ్గర్లోనే ఓ దేవాలయం ఉంది. ఉదయం సాయంత్రం వేళల్లో అక్కడి ఘంటారావం నా చెవుల్లో ప్రతిధ్వనిస్తూనే వుంది. దానికి దగ్గర్లోనే ఓ పెద్దాయన దర్గావుంది. ఆయనని అభిమానించే వాళ్లు ఆ దర్గా దగ్గరికి వెళ్లి సలాముచేసి దండాలు పెట్టుకొని, డబ్బులు వేసి వెళ్తుండేవారు. అప్పుడప్పుడు నేను అక్కడ ఊదుబత్తీ బూడిద తీసి సందర్శకులకు బొట్టులు పెట్టి ప్రసాదం యిస్తూ వుండేవాణ్ణి. అక్కడికి కొద్దిపాటి దూరంలోనే చంపాద్వారం వుంది. రాతి ద్వారంలో ఓచిన్న తలుపు దానికి వెలుపల ఓ కల్లు దుకాణం. మేక గుండెకాయతో తయారుచేసే ‘చాకనా’ మంచి రుచిగా వుంటుంది. దానికి మంచి పేరు. దాన్ని తినడానికి ఎక్కడెక్కడనించో మనుషులు వస్తూ వుంటారు. నది లోతుగా వుంటుంది. ఫీవ్‌ఖానా (గజశాల)లోని ఏనుగులు నదిలోకి వచ్చి గంటల తరబడి స్నానం చేస్తూ వుండేవి. వాటి మెడలకు గంటలు కట్టేవారు. అవి స్నానం చేస్తూవుంటే గంటలు చేసే శబ్దం వినసొంపుగా వుండేది. తొండాలతో నీళ్ళు చిలకరించే దృశ్యం పిల్లలకి ఎంతో ఆహ్లాదకరంగా వుండేది.
హైకోర్టుని కొత్తగా కడుతున్నారు. ఉదయమూ, సాయంత్రమూ హైకోర్టు నిర్మాణంలో పనిచేసే కూలీలతో నేనూ ఉంటూవుండేవాణ్ణి. రాళ్లు కొట్టే కూలీలు, పెద్ద పెద్ద రాళ్లని మోసే కూలీలు, వేల సంఖ్యలో మా యింటి చుట్టుపక్కల నివసిస్తూవుండేవారు. తెల్లరాళ్లు, ఎర్రరాళ్లు, గోడలకి జాలీలు తయారు చేసే రాళ్లు, ఆర్చీలు చేసేరాళ్లు చెక్కుతున్నప్పుడు వేలాది శబ్దాలు ఒక్కసారిగా వినిపించేవి. కూలీలు సుత్తెలతో ఉలుల మీద వేసే దెబ్బలు చిత్రమయిన వాతావరణాన్ని సృష్టించేవి. ఎండాకాలం, వర్షాకాలం, చలికాలం అవుగాక- ఏ కాలంలోనయినా రాళ్లు చెక్కేపని ఆపడానికి వీల్లేదు. కూలీలు ఉలుల మీద సుత్తులతో కొడ్తూ రాళ్లని బద్దలు కొడుతూ వుండేవారు. వాళ్లు అలా శక్తినంతటిని ఉపయోగించి పనిచేస్తూంటే కండలు ఉప్పొంగేవి. నేను గంటల తరబడి ఆ దృశ్యాలను చూస్తూ వుండేవాణ్ణి. ఆ రోజుల్లో ఒక పైసా యిస్తే నాస్తా అయిపోయేది. ‘నయా ఫూల్’ (కొత్త వంతెన) దగ్గర మొఘల్ హోటలు ఉండేది. ఆ హోటలు కరెంటు దీపాల వెలుగులో ఎంతో అందంగా కనిపిస్తూ వుండేది. హోటలు గోడలకి పెద్ద పెద్ద అద్దాలూ, ఫ్రేముల్లో బిగించి రంగురంగుల్లో విదేశీ స్త్రీల బొమ్మలు వేళ్లాడదీసేవారు. అవి మనసును యిట్టే ఆకర్షిస్తూ వుండేవి. ఒక్క పైసా యిస్తే తందూర్ రోటీ, రెండు పైసలకి నాహిరీ (షేర్వా) యిచ్చేవారు. యాకుబ్‌పురా ద్వారానికి వెలుపల ఓ కల్లు దుకాణం వుండేది. అది ఇరవై నాలుగు గంటలూ తెరిచే వుండేది.
తాగేవాళ్లు తాగటం, వెళ్ళే వాళ్ళు వెళ్లటం- ఇలా సాగుతూవుండేది. అక్కడ మాంసం, కబాబ్, కలేజాలు వేయిస్తున్నప్పుడు వెలువడే సువాసన గుప్పుమని తోవంతా వ్యాపించేది. శెలవుల్లో నేను తరచూ ఆ తోవలో తిరుగుతూ వుండేవాణ్ణి. ఎన్నో సార్లు అక్కడే తచ్చాడుతూ, పచార్లుచేస్తూ ఆ సువాసనని పీలుస్తూ గడిపేస్తూ వుండేవాణ్ణి. అదే నా బాల్యపు లంచ్!
- మఖ్దూమ్ మొహియుద్దీన్ (‘జయంతి’ నుంచి)
(23 మే 2009, ఆంధ్రజ్యోతి సౌజన్యంతోటి)
కవి, కమ్యూనిస్టు మఖ్దూమ్ మొహియుద్దీన్ (1908-69). హైదరాబాద్ సంస్థానంలో కమ్యూనిస్టు పార్టీ వ్యవస్థాపకులలో ఆయన ఒకరు. 1952 -69 సంవత్సరాల మధ్య ఆయన తొలుత హైదరాబాద్ శాసనసభలోను, పిదప ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో సభ్యులుగా ఉన్నారు. మఖ్దూమ్ సాహిత్య సృజన స్వల్పమే అయినా ఉర్దూ మహాకవులలో ఆయన ఒకరు. ‘గులెతర్’ (తాజా రోజా), ‘సుర్ఖ్ సవేరా’ (అరుణోదయం) అనేవి ఆయని కావ్య సంపుటాలు. ‘ఉర్దూ భాష ఉన్నంతవరకు, అభ్యుదయ భావాలు ఉన్నంతవరకు మఖ్దూమ్ కవిత ఉంటుంది’.
May 23rd, 2009 at 10:09 am
టపా బాగుంది.