సెజ్: తుమ్మేటి రఘోత్తమరెడ్డి ‘చెప్పిన’ కథ
జూన్ 7th, 2009 by డిస్కవర్ తెలంగాణ
- స్కైబాబ

గ్లోబలైజేషన్.. నూతన ఆర్థిక పారిశ్రామిక విధానాలు… ఇవన్నీ ప్రజలకు చెడు చేస్తున్నయని చెప్పుకు తిరిగే ఒక వర్గం తయారై ఉంది. గబుక్కున ఈ ఫలితాలన్ని అందుకునే వాళ్ళలో ఈ వర్గం ముందే ఉంటుంది. అన్ని అనుబవిస్తది. పొరపాటునో లేక వేరే కారణాలవల్లో ఏవో కొందరికి అలాంటి మంచి జరిగితేనో ఇది ఈ విధంగా జరగటానికి వీల్లేదు. ఇది మీకు చాలా చెడు చేస్తదని వాళ్ళున్న స్థితిని, స్థాయిని పట్టించుకోకుండా వీళ్లుచెప్పబోతుంటరు వాళ్లకు.
నేను ఆ మధ్య నగరంలో ఒక పెళ్లికి వచ్చిన. పెళ్ళి తరువాత అదనంగా మూడు రోజులు ఉండవలసి వచ్చింది. ఒక జర్నలిస్టు ఫ్రెండ్ ఇంట్లో దిగిన. దిగితే, ఆయన ఒక రోజు సెజ్ ప్రాంతాన్ని సందర్శించడానికి ఏర్పాటు చేసిండు. “తిరుపతి నుంచి ఒక ప్రొఫెసరు వస్తున్నడు.. ఆయన స్టడీ చేస్తున్నడు సెజ్ ప్రాంతాలను. సెజ్‌లంటే ప్రత్యేక ఆర్థిక మండళ్లు. రాష్ట్ర ప్రభుత్వం గత మూడేండ్లుగా చాలా తీవ్రంగా చేస్తుంది. ఆ గొడవలు అదంతా దాదాపు మనబోటి వాళ్లందరికి తెలిసిన విషయమే. ఆ సెజ్‌ల సందర్శన సెజ్‌ల అధ్యయనం చేస్తున్నడట ఆ ప్రొఫెసరు. ఆయన వస్తున్నడు. ఆయన్తో పాటు మనం కూడా పోదాం, మీరు ఖాళీగా ఉన్నరు కదా.. మీరు గూడ సూడరండి..” అని తీస్కపొయిండు. కార్ల తీస్కపొయిన్రు. ఐదారేండ్ల కింద నా జర్నలిస్టు మిత్రుడికి కారు లేదు. స్కూటరు లేదు. సైకిలు కూడా లేదు.
ఈ ఐదారేండ్లు నేను అతన్ని కలవనుగూడా లేదు. అందాకా చేసిన తెలుగు దినపత్రికలో నుంచి ఈ మధ్య కొత్త టివి చానల్‌కు మారిండు. జీతం ఎంత అంటే.. నువ్వు ఊహించలేవు అన్నడు నాతో. ఆ మాట ఎంతో గర్వంగా అన్నడు. ఈ బూమ్.. జర్నలిజంలోనూ మీడియాలోనూ వచ్చిన బూమ్ వల్ల ఆయన ఇప్పుడు ఆ టివి ఛానల్‌కు రీజనల్ ఇంఛార్జిగా పని చేస్తున్నడు. ఆయన కారు గూడ కొనుక్కున్నడు. మారిండాయన. ఆయన ఆర్థిక స్థితి బాగయింది.
బాగయినట్టు కనపడ్డది సూస్తె. ఇదంతా ఎందుకు, ఎట్లా జరిగిందో సోయి లేనట్టుగానే మనిషిని గమనిస్తే అనిపించింది నాకు. ఆ వొచ్చినాయన గురించి చెప్పిండు. ఆ వొచ్చిన ప్రొఫెసరు చాలా కింది అట్టడుగు వర్గం నుంచి కులం నుంచి వచ్చినాయన. ఆయన తండ్రి చిన్న రైతు, అంటరాని కులాల్నుంచి చాలా కష్టపడి యూనివర్సిటీ ప్రొఫెసరై ఇప్పుడు విదేశాలకు కూడా పోయి ఉపన్యాసాలిచ్చి.. ఈ లెవలుగా ఆయన బాగా ఎదిగినాయన అన్నమాట. ఆయనకు నన్ను పరిచయం చేసిండు. సో… మేం ముగ్గురం మరో గైడులాంటి వ్యక్తితో సహా కార్లో ఆ సెజ్ ప్రాంతానికి చూసుటానికి పొయ్‌నం.
ఏడాదిగా జాజు రంగు గులక రాయి నేలలో వేల ఎకరాల భూమిని సేకరించి ప్రభుత్వం సుట్టూ ఫెన్సింగ్ ఏసేసింది. ఊరుతో పాటు ఊరి భూములన్ని సెజ్ కింద బొయ్‌నయ్. ఆ ఊరుకు మేం బొయ్‌నం. పొయింతర్వాత- గ్రామస్థులంత గత ఏడాదిగా బాగా అలవాటుపడి ఉన్నరు.. ఈ వచ్చే సందర్శకులకు విచారించేవాళ్లకు ఇట్లాంటివాళ్లు కనపడంగానె చెప్పడానికి సిద్దమైన మనుషుల తీర్గ ఆరితేరిన మనుషుల తీర్గ ఉన్నరు. వాళ్లు చెప్పే స్థితికి వచ్చిన్రనమాట. అంటె ఎంతమంది వచ్చి వాళ్లను ఇంటర్వ్యూలు చేసిన్రో, అడిగిన్రో… మా జర్నలిస్టు ఫ్రెండు, ఆ ప్రొఫెసరు- వీళ్ళు అర్ధం చేసుకున్నదేందంటే ఈ సెజ్‌ల కింద పోతున్న భూమిని ప్రభుత్వం లాక్కుంటుంది, వీళ్లని నిర్వాసితుల్ని చేస్తుంది, వీళ్లను అన్యాయం చేస్తుంది, వీళ్లకు చాలా అన్యాయం జరుగుతాంది. అది వీళ్లకు తెలియటం లేదసలు. దీనికి వీళ్లు ప్రతిఘటన కూడ చేయటం లేదు. చాలా పెద్ద అన్యాయం జరిగిపోతాంది అనే వైఖరితో వాళ్లు దీన్ని స్టడీ చేస్తున్నరు. వాళ్ల ప్రశ్నలు గూడ అట్లాగె అడుగుతున్నరు. ఒక గుడి ఉందాడ. సెజ్ ఫెన్సింగు ఇవతల గుడి ఉంటది దీని మాన్యం భూమి సెజ్‌ల పోయిందట. ఆ పోవటం వల్ల ఆ భూమి మాన్యం గన్క దాని నష్ట పరిహారం గ్రామ పంచాయితీకి చెందింది గాని ఆ పూజారికి చెందలేదు. ఈ ఊరు లేషిపోతుంది గనుక దూరంగా పునరావాస క్వార్టర్‌లలోకి చాలా మంది పోనే పోయారు. కొందరే ఆ ఊరిలో ఉన్నారింక.

ఈ గుడి ఇక్కడ పొయింది గన్క ఈ గుడికి ఎవరు రారు గనుక వీళ్ల ఉపాధి పొయింది. వీళ్లకు ఇటు నష్ట పరిహారమూ రాలేదు. అటు గుడి నడుస్తదన్న భరోసా గూడ లేకపోయింది. పాపం ఆ పూజారి బ్రాహ్మడు కాడు. అతను ఎస్టీలలో ఏదో ఒక కులంవాళ్లు. నేతకానివాళ్లు అన్నరు కాని.. నాకయితె కొత్త విషయం.. అట్లాంటోళ్లు ఒక గుడికి పూజారి..? అది ఏ గుడో కూడా నేను గమనించలేదు. ఎందుకంటే అంతటి పేదరికంలో వాళ్లు కనపడ్డరు. వాళ్లను ప్రశ్నలు వేయడానిగ్గూడ మనసొప్పలే. అసలు నాకు సూడ్డానికి కూడా కష్టమనిపించింది.
కనీ ఈ జర్నలిస్టు మిత్రుడు, ఈ ప్రొఫెసరు వాళ్లను ప్రశ్నలు వేసారు. జర్నలిస్టు మిత్రుడు తక్కువ ప్రశ్నలు వేసిండు గాని ఈ అట్టడుగు వర్గం నుంచి వచ్చి చాలా పైకి ఎదిగినటువంటి ఇపుడీ విదేశీ యానాలు చేస్తున్నటువంటి విదేశీ యూనివర్సిటీల్లో ఉపన్యాసాలు ఇస్తున్నటువంటి ఈ ప్రొఫెసరు సాబు మటుకు నెగెటివ్ టోన్‌తో నెగెటివ్ దృష్టితో వాళ్లను ప్రశ్నలేస్తుండు. ఎట్లాంటి ప్రశ్నలు.. ఆ పూజారి భార్యేమో.. పాపం ఆమె మట్టి కుండ తీర్గ.. ఏ ఆభరణం లేదు పాత చీర రైక మాత్రం ఉంది. ఒళ్లంత ఒక దుఃఖం బిందువు తీర్గ శరీరమంత ఒక దుఃఖపు బిందువైతె ఎట్లుంటదో కన్నీటి బొట్టైతె ఎట్లుంటదో అట్ల వచ్చి మా పక్కన నిలబడ్డదామె.
ఆ పక్కన గుడిసెలో ఆయన, ఈ టెన్షను తట్టుకోలేక పక్షవాతమొచ్చి పడిపోయి వున్నడు. కోడలుంది.. విధవ. కొడుకు అంతకు పూర్వం ఎప్పుడో గుండె జబ్బొచ్చి సచ్చిపొయిండు. మనవడున్నడు. చాలా కష్టం.. కుటుంబం.. ఎవరు లేరు. దుస్థితి కనబడతాంది. ఆమేమో అట్ల కన్నీటి బిందువు తీరుగ వచ్చి ఇట్ల సుట్టు చూస్తున్నది. సొ.. ఒక భూమి కోల్పోయిన రైతు తోవపొంట వచ్చి ఆగిండు. ఆగితె ఈ ప్రొఫెసరు సాబు ఆయినని ఇంటర్వ్యూ చేస్తుండు.
‘ఆఁ.. ఏఁవఁయ్యా.. జరట్లా ఆగు. నీ పేరు ఏం పేరు?’
‘నా పేరు రాజండీ’
‘ఆఁ.. రాజు! నీ భూమి ఎంత బొయింది సెజ్‌ల?’ అంటె-
‘సారు.. మాది మూడెకరాలు పొయింది’
‘మూడెకరాలకు ఎన్ని రూపాయలొచ్చినయ్?’
‘తొమ్మిది లక్షలొచ్చినయ్ సారు’
‘మరి తొమ్మిది లక్షలు ఏం జేసినరు.. సైకిల్ మోటరు కొన్నవా? ఆ సెల్‌ఫోన్ అదేనా? ఆ డబ్బుల్తోనే కొన్నవా? ఏం జేసినవ్.. అక్కడ ఓపెన్ బార్‌ను తెరిసిండ్రు గదా,.. రోజు సాయంత్రం పోతున్నవా అక్కడికి?’
‘ఎ, లేద్సార్! నేన్ తాగ సార్.
నేను బండి కొనుక్కోలేద్సార్. ఈ సెల్‌ఫోన్ గుడ ఇన్‌కమింగే ఉన్నది సార్. ఇది నేను అంతకు ముందే కొనుక్కున్న సార్’ అని అతనన్నడు.
‘అదేందయ్య, మరి భూమి పోతె ఎట్ల బతుకుతరయ్య మీరు? మీరు ఎందుకిచ్చిన్రయా మీరు? మీరు ఇవ్వమని అనాలె కదా’ అని అతనన్నడు. అంటె-
‘ఏమనాలె సారు, పెద్ద పెద్ద రైతులందరు ఇచ్చేసిన్రు సర్, మాదెంత.. మూడెకరాలు సర్.’
‘మరి తొమ్మిది లక్షలొస్తె ఏం జేసినవ్ చెప్పలేదు నువ్వు’
‘ముగ్గురం అన్నదమ్ములం సర్. నాకు మూడు లక్షలొస్తె అరవై వేలు బెట్టి ఇల్లు గట్టుకున్న సర్. కొద్దిగ అప్పులుంటె తీర్చుకున్నం సర్. కొంత ఏదో పోస్టాఫీసులో పక్కకు పెట్టుకున్న సర్.. నా భార్య పేరు మీద, నా పేరు మీద ఇంత పెట్టుకున్నం సర్. నాకు పిల్లలు లేరు సర్’ అని అతనన్నడు. నేనేమీ ప్రశ్నలు వేయలేదు.
ఒక్క మాటన్న. ‘మరి నీ భూమికి అంతకు ముందు ఎంత ధర ఉండె ఊర్లె’ అన్న.
‘ఎంతండి, ఎనబై వేలు పెడితె ఎక్కువండి’ అన్నడు.
కనుసూపు మేర ఆ బూఁవులను ఎటు సూస్తె అటు చిట్టడవులె.. నీటి సౌకర్యం లేదు, మహా వృక్షాలూ లేవక్కడ.. ఒక చెరువున్నది ఊరికి. ఆ చెరువు నిండితె చెరువు కింది బూమి.. కొద్దిగ ఒక పంట పండుతది. బహుశ ఆ గ్రామస్తులకి వ్యవసాయ యోగ్యమైన భూమి అంటే అంతే. బోర్లు ఏసుకుంటె నీల్లు సరిగా రావట… దుర్భరమైన దారిద్య్రమే ఆ గ్రామానికి. ఎనబై వేలు పెడితె ఎక్కువ అంతకు ముందు అన్నడన్నమాట. నేనేమనుకున్నానంటె.. నాకు వ్యవసాయరంగంలోంచి వ్యవసాయరంగ సంక్షోభంలోంచే నేను బొగ్గుగనిలోకి పొయిన. తొమ్మిది ఎకరాల భూమి, నీటి సౌకర్యమున్న భూమే వదిలేసుకుని నేను బొగ్గుగనిలోకి పొయిన. ముప్పై ఏండ్ల కింద తెలంగాణ గ్రామంల బొగ్గుగనిలోకి నెత్తిన తట్ట మొయ్యడానికి సిద్దపడి పొయిన నేను. అదేదొ రాతకోతల పని కాదు, సన్న పని కాదు. కనుక ఆ క్రైసిస్ అగ్రికల్చర్‌లో ఉండే క్రైసిస్ ఏమిటొ నాకు తెల్సు. ఎందుకు పోతరో, ఎందుకు అమ్ముకుంటరో నాకు తెల్సు. ఎనభై వేలు పెట్టే భూమికి మూడు లక్షలిస్తానంటె ఇవాళ నేనే ఇస్త. నాకున్న తొమ్మిది ఎకరాల భూమి నేనిచ్చేస్త. మరో మాట మాట్లాడకుండ నేనిచ్చేస్త. ప్రభుత్వ పాలసీలు గత నాలుగైదేండ్లుగా విపరీతంగా మారి సెజ్‌లు రావటం వలన కొన్ని చోట్ల కొందరికి ఈ అవకాశం వచ్చింది. వాళ్లిచ్చేసుకుంటారు.
మీరెవరు చెప్పినా వాళ్లాగరు. ఎందుకిచ్చుకుంటరూ- ఇచ్చుకుంటె వాళ్లకు ఇప్పుడు మేలు గనక వాళ్లిచ్చుకుంటరు. నేననుకుంటాను- రైతులు తెలివైనవాళ్లు. వాళ్లకేదైన లాభం కలిగేటట్టుంటెనె వాళ్లా పని జేస్తరు. లేకపోతె వాళ్లు చెయ్యరు. వాళ్ల కళ్లతో వాళ్లు రిజల్ట్సు.. ఫలితాలు జూస్తెనె వాళ్లు నమ్ముతారు. మీరు ఫలితాలు చూపించకుండ మీరు ఎన్ని జెప్పిన వాళ్లు నమ్మరు. మి మాటలు నమ్మరు. ఏమొ.. కావొచ్చు.. అవునా.. సూద్దాం తియ్.. ఇట్లా ఉంటది రైతు మనస్తత్వం. వాళ్లు చప్పున నమ్మరు. కండ్లతో చూసి, అరె..! వాడికి ఫలితాలొచ్చినయ్ చేస్తె, అని ఇగ పొలోమని చేస్తారు. పోనీ- ఆ భూమికేమన్న నీటి వసతి ఉందా? అంటె నీటి వసతి లేదు. వాన కొడితె పండినట్లు. లేకపోతె ఎండినట్టు. సెజ్‌ల ఏర్పాటు లోపల ఎన్ని కుతంత్రాలు ఉన్నా.. రాష్ట్ర ప్రభుత్వాలకు ఎంతో కొంత రైతాంగం నుంచి ఆమోదం అందుకే దొరుకుతాంది. సొ.. ఆ రైతునట్లా ఇంటర్వ్యూ చేసిన్రు. వొదిలేసిన్రు. అతనెళ్లిపొయిండు.
ఆ సుట్టు మా దగ్గర నిలబడ్డామె, ఆ కన్నీటి బిందువొల్గె చేతులు కట్టుకొని నిలబడ్డ పూజారి బార్య, ఆమేమి మాట్లాడలేదు. ఏదో మాట్లాడాలని ఉంది. ఏదో అడగాలని ఉంది. కాని అడగ సాహసించలేకపోతుంది. సొ.. వీళ్లు కారు తిప్పుకున్నరిగ. వస్తున్నరు. నాకేమనిపించిందంటె, ఆమె కేమన్న కనీసం ఒ వంద రూపాయలు ఆమె చేతిల బెడితె బాగుండు అనిపించింది. నేన్ చేతుల బెడితె వీళ్లేమనుకుంటరో.. నాకు బాగనిపించలె.. నేను పొయి సప్పుడుజెయక కార్ల కూసున్న. కూసున్నంక వాళ్లిద్దరొచ్చిన్రు. నా జర్నలిస్టు మిత్రుడు కార్ తోలుతుండు. ఈ ప్రొఫెసరు గారు పక్కకు కూసుండు. నా జర్నలిస్టు మిత్రుడు ఈ సెజ్‌ల వల్ల రైతాంగానికి బాధలు కష్టాలు కలుగుతాయని ఈయన వరుస రిపోర్టింగ్ చేయటం వల్ల ఈయనకి ఓ గొప్ప బహుమతి వచ్చింది. ఓ లక్ష రూపాయల బహుమతి ఓ మాజీ ముఖ్యమంత్రి అల్లుడో, లేకపోతె బంధువో ఆ స్థాయాయన, ఆయన, పాతకాలపు జర్నలిస్టట ఆయన. ఆయన తన పేరు మీద నెలకొల్పిన బహుమతిని నా జర్నలిస్టు ఫ్రెండుకి ఈ మధ్యన ఇచ్చేసిన్రు.
సెజ్ బాధితుల మీద రాసిన వ్యాస పరంపరకి బహుమతి ఇచ్చిన్రు. మీరు సూడండి, సెజ్‌లల్ల వీళ్లకి కష్టాలు, కన్నీళ్లు అన్యాయం జరుగుతాందని రాస్తె ఈయనకి బహుమతి ఇచ్చిన్రు. ఈయనకి బూమ్ వల్ల ఈయన జీవితం బాగుపడ్డది. ఈ ప్రొఫెసరుగారు అంటరాని కులంలోంచి నానా తిప్పలుబడి ఈయన ఇట్లా వచ్చేసిండు.. నాకేమనిపించిందంటే- ఈ గ్లోబలైజేషన్.. లేదా నూతన ఆర్థిక పారిశ్రామిక విధానాలు.. ఇవన్నీ ఈ భాష నాకు మాట్లాడరాదు. ఇవన్నీ ప్రజలకు చెడు చేస్తున్నయని చెప్పుకు తిరిగే ఒక వర్గం మన దగ్గర తయారై ఉంది. ఈ వర్గం.. గబుక్కున ఈ ఫలితాలన్ని అందుకునే వాళ్ళలో ఈ వర్గం ముందే ఉంటుంది. ఇది అన్ని అనుబవిస్తది. అందుకుంటది. వాళ్లకు పొరపాటునో లేక వేరే కారణాలవల్లో ఏవో కొందరికి అలాంటి మంచి జరిగితేనో ఇది ఈ విధంగా జరగటానికి వీల్లేదు. ఇది మీకు చాలా చెడు చేస్తదని వాళ్ళున్న స్థితిని, స్థాయిని పట్టించుకోకుండా వీళ్లు చెప్పబోతుంటరు వాళ్లకు. వాళ్ళు అంటే రైతులకు.
నిజానికి వాళ్లకి ఎందుకు రియాక్షన్ వస్తలేదా అని నాకు అనుమానం కలిగింది. వాళ్లెక్కడ ఎదురు తిరుగుతారా వీళ్లమీదికి. మీకెందుకు బాధ.. మా భూమికి లక్ష రూపాయల బూమికి వాళ్లు మూడు లక్షలు ఇస్తమంటె మేము అమ్ముకుంటానం. దీని వల్ల అంటే ఈ భూమి వల్ల మేమేం బతికి బట్ట కడుతున్నం? మట్టి పిసుక్కొని సస్తున్నం. వాటిల్ల పండిందేమిటి? ఇంతకంటె మేం ఇంకేమన్న చేసుకొని బతుకుతాం. మీరెవరయ మా సుట్టు తిరిగి కాకుల తీర్గ పొడుస్తున్నరు అని వీళ్ల పైకి ఎక్కడ తిరగబడతరో అని నాకు బయమైతాంది.
సొ.. మొత్తమ్మీద ఆ కారు మలుపుకుంటాంటె ఆ పూజారి బార్య ఏమన్నదంటెఁ-
‘సారూ, మీరెక్కణ్నుంచో వస్తిరి మా కోసం, టీ చేసి పోద్దామన్న మా దగ్గర ఏం లేకపాయె..’ అన్నది.
మనసుకు నాకయితె కలుక్కుమన్నది. నిజానికి మాకేదన్న ఓ పూట అన్నం పెడతరా సారూ అని అడిగినట్టుగ నాకనిపించింది. అంత దుర్భరమైన స్థితిల వాళ్లున్నరు. వాళ్లంటే వాళ్ళే కాదు. ఎక్కడైన మనుషులు గిట్లనే ఉన్నరు. వాళ్ళ స్థితి గతులను పట్టించుకోకుండా అందరు చెప్పెటోల్లే! చేసెటోల్లే లేరు. అందుకనే ఎన్నేండ్లైనా ఎన్ని కొట్టాటలు నడిచినా ప్రజల దారి ప్రజలది పార్టీల దారి పార్టీలది. అట్టాంటివాళ్లను వీళ్లు ఇంటర్వ్యూలు జేస్తున్నరు. రిపోర్టింగు చేస్తున్నరు. సొ.. వీళ్లు కీర్తింపబడుతున్నరు.
వీళ్లు బహుమతులు పొందుతున్నరు. ‘అయ్యో.. ! దాందేముందమ్మా’ అన్నరు ఆమె అన్న తరువాత. ఆ కారు మలుపుకొని ముందుకు పొయినంక ఈయన తెలుగులో చేసిన రిపోర్టింగు, దానిమీద వచ్చినటువంటి బహుమతి, ఆ విశేషాలు ఈయన ఆయనకు చెప్తున్నడు. ఆ ప్రొఫెసరు సాబు ఈ సెజ్‌ల గురించి ఇంగ్లీషుల రాయబోయే పుస్తకం గురించి ఆయన ఈయనకు చెప్తున్నడు. అంతా ఇంగ్లీషులోనే మాట్లాడుకుంటున్నరు. మధ్య మధ్య వివిధ దేశాల సెజ్‌ల గురించి కూడా చెపుతున్నడు ప్రొఫెసరు. నేనేమొ ఎన్క కూసున్న. ఎన్క నాతో పాటు నా అసొంటి ఇంకొకాయన ఉన్నాడని అన్నాను కదా ఆయన గైడు లాంటాయన కూసున్నడు. సరె ఈ కారు పోతాంది.
కారు కొంతదూరం పొయినంక రోడ్డు కడ్డం వయసు పిల్లగాండ్లంత వాచ్‌మెన్ల డ్రస్సు ఏసుకున్న సెజ్ కంపెనీ గ్రామాల పిలవాళ్లు, వాళ్లకి వాచ్‌మెన్ ఉద్యోగాలిచ్చి ఈ భూముల మీద తోటలు, ఇవన్నీ ఉన్నాయ్, వీటి కాపలా కోసం ఆ మందిని పెట్టుకున్నరు వీళ్లు. ఒ రెండు వందల మంది ఉంటరు వాళ్లు. అందులో పదిహేను మంది దాకా సైకిళ్లమీద.. ఒకరిద్దరికి సైకిల్ మోటర్లున్నయ్. ఎవరో జర్నలిస్టులొచ్చిన్రట అని తెలవంగనె వాళ్లు ఆ రోడ్డు దగ్గర వచ్చి ఆపేసిన్రు. ఆపేసి వాళ్లు తమ కష్టాలు చెప్పుకుంటున్రు.
రేపొ ఎల్లుండో సి.ఎం. ఆ సెజ్జులో పరిశ్రమల శంకుస్థాపన చేస్తడట. పోలీసులొచ్చి ఒకవైపు బందోబస్తు చేస్తాన్రు. బుల్డోజర్లతో నేలను చదును చేస్తాన్రు. వచ్చే పోయే చోటా మోటా రాజకీయ నాయకులు- లారీలో నుంచి దిగుతున్న కుర్చీలు, టెంటులు, నీళ్ళ డ్రమ్ములు వగైరా.. అటుదటే నడుస్తాంది. నడుస్తాంటె వీళ్లు ఏమన్నరంటె
‘మీరు విలేకర్లున్నట్టుంది సర్. కొంచెం మా గురించి గట్టిగ రాయండి సర్’ అని ఆ వాచ్‌మెన్లలోంచి ఒకరు చొరవతోటి వీళ్లకు చెప్తాండు. ఐతె-
‘అ.. ఎంటీ.. గట్టిగ రాసేదేంటి.. ఏమున్నయ్ మీకు.. ఏం కష్టాలున్నయ్’ అని ఈ ప్రొఫెసర్ సాబ్ అడుగుతుండు.
‘అయ్యొ సర్, అట్లంటరేంది సర్, మాకు చాలా కష్టాలున్నయ్ సర్. మాకిచ్చేది పద్దెనిమిదొందల యాబై రూపాలె సర్. ఉపాధి హామీ కూలీలకు రోజుకు వంద రూపాలిస్తున్నరు సర్. నెలకు మూడు వేలవుతయ్ సర్! మాకు నెలకు పద్దెనిమిదొందల యాబయ్యే ఇస్తున్నరు సర్. మీరు కొంచెం రాయాలె సర్. రేపు చీప్ మినిస్టరు వస్తుండంట సర్ ఇక్కడికి. ఇవాల రాస్తె రేపు పేపర్ల వస్తది సర్.’
‘నువ్వు చెప్పినట్టుగ నీ పేరుతోటి రాస్త నేను’ ప్రొఫెసర్ పరాచికమాడుతున్నడు.
‘వద్దు సర్, ఉన్న ఉద్యోగం పోతది సర్. నా పేరుతొ రాయొద్దు సర్. మీరు పెద్దవాళ్లు కదా సర్. మీరు రాస్తె చెల్లుతది సర్’ అని అతనంటున్నడు.
‘సరె, ఉపాధి హామీ కూలికి వాడు రోజంత మట్టి పని చేస్తున్నడని రోజుకి వంద రూపాయలిస్తరు.
నువ్వేం పని చేస్తున్నవయ్యా.. సైకిల్ మీద తిరుగుతున్నవ్. ఇటుటు తిరుగుతవ్..’
‘సర్, మీరే.. సదువుకున్నోళ్లు పెద్దోళ్లు సర్, మీరే అట్లంటె ఎట్ల సర్. పద్దెనిమిదొందలకి ఎట్ట బతుకుతం సర్. నాకు పెళ్లముంది సర్. నాకొ పిల్లవాడున్నడు సర్’ అని అతనంటున్నడు.
‘ఆ భూములన్ని ఎందుకిచ్చుకున్నరు?’ ఆ పక్కన ఉన్న వాచ్‌మెన్ అన్నడు-
‘సర్ కొద్దొగొప్పొ సదువుకున్నోళ్లం కదా సర్, మట్టేం పిసుక్కుంటం సర్’ అన్నడు. ఆ మాటతో ప్రొఫెసర్ నోరు మూతపడ్డది. ఇగ ఆయనను అడగటం మానేసిండ్రు. మానేస్తే ఆ పక్కనున్నాయన ఇంకొక మాటన్నడు,
‘సార్, ఇప్పుడంటె మాకు పద్దెనిమిదొందల యాబై ఇస్తున్నరు. మొన్నటిదాక మాకు పదారొందలె ఇచ్చిన్రు సర్’ అన్నడు. ఆయనన్న మాటను వీళ్ళు పట్టిచ్చుకోవడం లేదు. ఇక్కడేదో కిటుకు ఉన్నట్టు అనిపించింది నాకు.
‘అవునూ, పదారొందలున్న జీతం, పద్దెనిమిదొందల యాబైకి ఎట్ల పెరిగిందయ్యా?’ అని నేనన్న. అంటే-
‘సమ్మె చేసినం సర్!’ అన్నడు. ఆ పిల్లవాడు నవ్వుతున్నడు. నాకు ఆశ్చర్యం కలిగింది. వీళ్ళు చాలా గట్టివాళ్ళే అనిపించింది. అనాదిగా మానవ జాతి ఎట్టా మనగలుగుతూ వస్తోందో చటుక్కున స్ఫురించింది నాకు. అప్పటికే పొద్దు నడినెత్తినుంచి కిందికి జారింది. ఆకలి దంచుతోంది. మా కారు మట్టి రోడ్డుపై నగరం దారి పట్టింది. కారు వెనుక జాజు రంగు దుమ్ము రేగుతుంది.
(tummetikathalu.blogspot.com లో ఈ కథలను చూడొచ్చు)
తొలి ప్రయోగం
ఎన్నాళ్ల నుంచో కథలు రాయడం లేదన్న విమర్శ నెదుర్కొంటున్న ప్రసిద్ధ కథకులు రఘోత్తమరెడ్డి- తెలుగు కథకు నూరేళ్లు నిండిన సందర్భంలో - ఒక కొత్త ప్రయోగం చేశారు. కథ అంటే ఇలాగే ఉండాలనే సంప్రదాయాన్ని బ్రేక్ చేస్తూ ‘తుమ్మేటి రఘోత్తమరెడ్డి ఏడు మౌఖిక కథలు’ అనే డివిడిని తీసుకొచ్చారు. అల్లం రాజయ్య తన ముందు మాటలో కథల నేపథ్యాన్ని వివరించారు. ప్రజెంటర్‌గా ఒకరు వ్యవహరించగా, ఒక్కో కథ తరువాత ఒక్కొక్కరితో అభిప్రాయం చెప్పించారు. చివరగా కథలను పాణి సమీక్షించారు.
రఘోత్తమరెడ్డి ‘అతి’ సాధారణత్వాన్ని కోరుకుని కథలు చెప్పాలనే ప్రయత్నం చేసినట్టు కనిపిస్తుంది.. బ్లాక్ అండ్ వైట్‌లో స్క్రీన్ కొంత డల్ చేసి, ఒక సోఫాలో కూర్చుని ఆయన కథలు చెప్తుంటారు.. ఈ కథలన్నీ చివరలో ట్విస్ట్ ఉన్న కథలు. మౌఖిక కథలు కాబట్టి అలా ఉంటే బాగుంటుందని రచయిత భావించా రేమో. కాని ఆ ట్విస్ట్ ప్రజెంటేషన్‌లో ఆయన ఆకట్టుకోలేకపోయారు.. కొన్ని కథలు పేలవంగా అనిపించాయి.. చివరి రెండు కథలు చెబుతూ కంటతడి పెట్టిస్తారు.. పెడతారు రచయిత.. ‘రఘోత్తమ్ సాహిత్యం, జీవితం వేరు కాదు’ అని చెప్తారు రాజయ్య. ధ్వంసమవుతున్న మానవ సంబంధాల సంఘర్షణను తన అనుభవాల నుంచే పంచారు రఘోత్తమ్.
నాలుగో కథ ‘సెజ్’ విని షాక్‌కు గురయ్యాను. సెజ్‌లపై వచ్చిన కథల్లో ఇది పూర్తి భిన్నమైన కథ. ‘సెజ్’లకు వ్యతిరేకంగా ఉన్న అభిప్రాయాలకు భిన్నంగా ఈ కథ చెప్పడం సాహసం అనిపించింది. ఒక పూటంతా ఆ కథను వింటూ కంపోజ్ చేస్తూ పోయాను.. తరువాత రఘోత్తమరెడ్డితో సంప్రదించాం. ఆయన రాత ప్రతి తెప్పించుకొని, మౌఖికంగా చెప్పిన కథ, చదవడానికి ఎట్లా ఉందో చూసి అల్లం రాజయ్యతో కూర్చుని కొన్ని చిన్న మార్పులు చేసి పంపించారు..




అన్యాయమైన కథ…
తుమ్మేటి రఘోత్తమరెడ్డి చెప్పిన ఏడు మౌఖిక కథల్లో నాలుగో కథ ‘సెజ్’ ‘వివిధ’ (8 జూన్ 2009)లో చదివాను. ఈ కథకు అల్లం రాజయ్య వివరించిన నేపథ్యంగానీ, ఈ కథపై ఆయన చెప్పిన అభిప్రాయంగానీ, పాణి చేసిన సమీక్షగాని నేను ఇంకా వినలేదు. ‘వివిధ’లో ప్రచురించిన ‘సెజ్’ కథను దృష్టిలో పెట్టుకొని మాత్రమే నా ఈ స్పందన. ప్రత్యేక ఆర్థిక మండళ్ల పేరుతో పరిశ్రమలను, నీటి వసతి పుష్కలంగా వున్న ప్రదేశాల్లోనూ, బాగా పంటలు పండే భూములున్న చోటా ఏర్పాటు చేసి, ఆ భూములను ‘నష్ట పరిహారం’ ఇచ్చో, ఇవ్వకో స్వాధీనం చేసుకుంటున్న సందర్భంలో ప్రజలు ఎక్కువ ఆందోళన చెందారు- ఉద్యమాలు చేశారు. చేస్తున్నారు.
అయితే ఈ కథలో చెప్పినట్లు ‘అట్టడుగువర్గం, కులం నుంచి వచ్చిన ప్రొఫెసర్లో, మాజీ ముఖ్యమంత్రి బంధువులైన జర్నలిస్టులో’ ఉద్యమం నిర్మిస్తే ప్రజలు ఈ ఆందోళనల్లోకి రాలేదు. కథలోనే ఒకచోట చెప్పినట్లు ‘ప్రజలు చాల గట్టివాళ్లు. అనాదిగా మానవజాతి ఎట్లా మనగలుగుతూ వస్తోందో’ గమనిస్తే చాలు. ‘తొండలు గ్రుడ్లు పెట్టే భూమి’కి ఎకరానికి మూడు లక్షలు ఇవ్వడమూ, ఆ నష్టపరిహారాన్ని తీసుకోవద్దని ప్రజలకు ‘ప్రొఫెసర్లూ, జర్నలిస్టు’లూ చెప్పడమూ- ఇదంతా కథకుని కల్పనా సామర్థ్యానికి ఉదాహరణే కాని వాస్తవానికి ఏమాత్రం దగ్గరగా లేదు. ఒకవేళ అటువంటి సెజ్ ఒకటి కథకుడి దృష్టికి వచ్చినా, దాని నాధారం చేసుకొని సెజ్ వ్యతిరేక పోరాటాలను అవహేళన చేయడం ప్రగతిశీల దృక్పథం కాదు. ఎక్కువగా సెజ్‌లు ఎటువంటి భూముల్లో పెడుతున్నారో అధ్యయనం చేస్తే ఈ కథకుడు ఇటువంటి ‘భిన్నమైన కథ’ రాసే ‘సాహసం’ చేసేవారు కాదనుకుంటాను.
పాలకవర్గాలు గత 60 ఏళ్లుగా సాగునీటి సరఫరాకు ప్రాజెక్టులు కట్టడం, నీటి సరఫరా పథకాలు చేపట్టడం, చెరువులపై ఆధారపడిన వ్యవసాయాన్ని అభివృద్ధి చేయడం మొదలగు కార్యక్రమాలను విస్మరించడం వల్లనే భూమి నెర్రెలు విచ్చి, ఎడారిగా మారి వ్యవసాయానికి పనికి రాకుండా పోయింది. ఈ పరిస్థితిని సృష్టించిన పాలకవర్గాలు, ‘ఏమీ పండని భూమి’కి ఇన్ని లక్షలు ఇస్తామనడం క్రూరమైన పరిహాసం కాదా? చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా వున్న కాలంలో ప్రపంచబ్యాంకు ముద్దుబిడ్డ అయిన ‘జన్మభూమి’ కార్యక్రమాన్ని ముమ్మరంగా ప్రచారం చేసినప్పుడు డి.కామేశ్వరి అనే ప్రసిద్ధ కథా, నవలా రచయిత్రి ‘జన్మభూమి’ పేరుతోనే అనుకుంటాను ఒక నవల రాశారు.
ఆ నవలను ఆమె జన్మభూమి కార్యక్రమం ద్వారా సర్వతోముఖాభివృద్ధి సాధించిన ఒక గ్రామాన్ని ఊహించి రాశారు. ఇప్పుడు ‘సెజ్’పై వచ్చిన ఈ కథ కూడా అటువంటిదే అనుకోవచ్చు. వేలాది సంవత్సరాలుగా అణచబడ్డా, పీడిత వర్గాలు, కులాలకు సంబంధించిన వారు ఈ మధ్యే రిజర్వేషన్ల సౌకర్యం వల్ల, స్కాలర్‌షిప్‌ల సౌకర్యంవల్ల ఉన్నత విద్యావంతులై ప్రొఫెసర్లవుతున్నారు. డాక్టర్లవుతున్నారు. కలక్టర్లవుతున్నారు… వీరిపైన కథకునికి కోపం ఎందుకు? ఈ కథలో సెజ్‌ను వ్యతిరేకించే ప్రొఫెసర్ ‘అట్టడుగు వర్గం, కులం’కు సంబంధించిన వాడే ఎందుకు కావాలి? ‘ఉన్నత వర్గానికి, కులా’నికి సంబంధించినవాడు కాకూడదా? అగ్రవర్గం, కులం వారు ‘తప్పుడు’ ఉద్యమాలు చేపట్టరేమో! చేస్తే ఇలాంటి తప్పులు ‘అట్టడుగువర్గం, కులం’వారే చేస్తారేమో! కథకుడి ఈ దృష్టి కూడా అభ్యంతరకరమే.
(15 జూన్ 2009, ఆంధ్రజ్యోతి సౌజన్యం తోటి)
ఎవరి ప్రయోజనాలకోసం ‘సెజ్’ కథ?
సాధారణంగా పల్లెలో ఒక రైతు పొలం అమ్మితే మరో రైతు కొంటాడు. అంటే అక్కడి పని అక్కడే ఉంటుంది. పట్టా ఉన్న రైతుకే భూమిమీద హక్కు ఉన్నప్పటికీ, ఆ భూమి ఊరుమ్మడి ఆస్తి. ఇప్పుడు ఏకంగా ఊరిలోని రైతులందరూ పొలాలు అమ్ముకుని వెళ్లిపోతే వారిపైన, వారి పొలాలపైన ఆధారపడి జీవించే వారి బతుకులేం కావాల?
రెండు నెలల క్రితం మా పత్రిక (నవ్య వీక్లీ) కార్యాలయానికి సమీక్షకోసం తుమ్మేటి రఘోత్తమరెడ్డి కథల డివిడి వచ్చింది. ఇందులో ఏడు మౌఖిక కథలున్నాయట. నాకు ఈయన కథలంటే చాలా ఇష్టం. చాలాకాలంగా ఈయన కథలు రాయలేదు. ఇప్పుడు ఒకేసారి ఏడు కథలు రావడంతో మొదట ఆశ్చర్యానందాలు, తర్వాత బాధ కలిగాయి. వీటిని వినాలంటే కనీసం పదివేల రూపాయల పెట్టుబడి ఉండాలి.
ఎందుకంటే టీవీ, డివిడి ప్లేయర్ తప్పనిసరి కదా. మా ఇంట్లో డివిడి ప్లేయర్ లేకపోవడంతో రెండు నెలలుగా నేను ఆ కథలు వినలేదు. అయితే జూన్ 8 ‘వివిధ’లో తుమ్మేటి రఘోత్తమరెడ్డి ‘చెప్పిన’ కథ ‘సెజ్’ ప్రచురించారు. ఈ కథను చదివి చాలా బాధపడ్డాను. ఈ ‘సెజ్’ కథ ప్రభుత్వానికి మద్దతు ఇచ్చే కోవర్ట్ సిఫార్సు అన్పించింది. మాది చిత్తూరు జిల్లాలోని మారుమూల పల్లె. నేను తిరుపతి ఆంధ్రజ్యోతిలో ఆరేళ్లు పనిచేశాను. నేను అక్కడ పనిచేసే రోజుల్లోనే సత్యవేడు, వరదయ్యపాళెం మండలాల్లోని పదహారు గ్రామాలు సెజ్ పరిధిలోకి వచ్చాయి. దాంతో ఆ రెండు మండలాలు అతలాకుతలం అయ్యాయి. జర్నలిస్టు మిత్రులు కొందరు అక్కడ పర్యటించి వ్యాసాలు రాశారు. నేను కూడా ఒకసారి అక్కడ పర్యటించాను.
ఈ కథలో కథకుడు చెప్పిన అనుభవాలు నా అనుభవాలకు దగ్గరగా ఉన్నాయి. అయితే సెజ్ ప్రాంతంలోని రైతులను అర్థం చేసుకోవడంలో మా ఇద్దరిలో చాలా తేడా ఉంది. ‘సెజ్’ కథ ప్రథమ పురుషలో సాగింది. అందువలన కథ చెప్పే కథకుడు తుమ్మేటి రఘోత్తమరెడ్డిగానే భావిస్తున్నా. నీటి వసతి ఉండే తొమ్మిది ఎకరాల పొలం ఉన్నప్పటికీ రఘోత్తమరెడ్డి బొగ్గు గనిలోకి పనికి పోయాడు. ఇప్పుడాయన తన ఎకరం భూమికి మూడు లక్షల రూపాయలు ఇస్తానంటే ఇచ్చేస్తానని అంటున్నాడు. నిజమే! ఆయన ఇచ్చేస్తాడు! అయితే సెజ్‌లో భూములు కోల్పోతున్న వారికి ఈయనకు ఒకటే పోలికా? ఈయన ఇప్పటికే వ్యవసాయం వదులుకుని వేరే ఉపాధిని వెతుక్కున్నాడు. అక్కడ వచ్చే ఆదాయంతో కుటుంబం సాఫీగానే గడిచిపోతుంటుంది. కథకుడికి ఇప్పుడు భూమి ఆదాయ వనరు మాత్రమే.
అంటే అవసరం వస్తే మూడు లక్షలు కాదు కదా, ముప్పై రూపాయలకయినా అమ్మేయగలడు. కానీ సెజ్ ప్రాంతాల్లో అలా కాదు. వారికి ఆ భూమి ఆదాయ వనరు మాత్రమే కాదు, వారికి అది వట్టి మట్టి మాత్రమే కాదు, కేవలం పంటలు పండే నేల మాత్రమే కాదు. ప్రాణం. భూమాత. ఆ మట్టిలో పుట్టి ఆ మట్టిలో పెరిగి ఆ మట్టిలో పంటలతో జీవించి ఆ మట్టిలోనే ఐక్యమయ్యేవారికి వేరే వృత్తి తెలీదు. వారి పొలం లాక్కుని మూడు లక్షలు చేతిలో పెట్టినా దానిని ఎలా వినియోగించాలో, ఎక్కడ పెట్టుబడి పెడితే లాభం వస్తుందో తెలుసుకోవడానికి వాళ్లు వ్యాపారులు కాదు.
ఫలితం, వారి చేతిలోని మూడు లక్షలు కరిగిపోతాయి. భృతిలేక రోడ్డున పడతారు. ఇదొక పార్శ్వం. మరో విషయం..పల్లెల్లో ముఖ్యంగా రాయలసీమ జిల్లాల్లో చాలా మంది రైతులకు వాళ్ల తలలకు మించిన అప్పులు ఉంటాయి. అవి పొలాలు, పంటల ఆధారంగా అలా కొనసాగుతూనే ఉంటాయి. ఆ అప్పులు మితిమీరినప్పుడు, కనీస ధర కూడా లేక పండిన పంటలు నేలపాలైనప్పుడు లేదా అప్పులు తీర్చలేమని జీవితంపై భయం మొదలైనప్పుడు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇలాంటి నేపథ్యంలో సెజ్ ప్రాంతంలోని రైతులకు ఎకరాకు మూడు లక్షలు ఇచ్చినా అవి అప్పులకు పోను మిగిలేది చాలా తక్కువే. తానూ రైతునని తనకూ తొమ్మిది ఎకరాల పొలం ఉందని చెప్పుకున్న కథకుడు మౌలిక విషయాన్ని మరిచిపోయాడు.
పల్లెల్లో అందరూ పొలం ఉన్న రైతులే ఉండరు. చాలామంది రైతుల పొలాలపై ఆధారపడి జీవిస్తుంటారు. కూలీలుగా కొంద రు, చేతి వృత్తుల వారూ ఉంటారు. సాధారణంగా పల్లెలో ఒక రైతు పొలం అమ్మితే మరో రైతు కొంటా డు. అంటే అక్కడి పని అక్కడే ఉంటుంది. పట్టా ఉన్న రైతుకే భూమిమీద హక్కు ఉన్నప్పటికీ, ఆ భూమి ఊరుమ్మడి ఆస్తి. ఇప్పుడు ఏకం గా ఊరిలోని రైతులందరూ పొలాలు అమ్ముకుని వెళ్లిపోతే వారిపైన, వారి పొలాలపైన ఆధారపడి జీవించే వారి బతుకులేం కావాల? ఇక ఈ కథ ప్రారంభంనుంచే వ్యంగ్యంగా సాగుతుంది. జర్నలిస్టు మిత్రుడు ‘బూమ్’ వలన టివి చానల్లోకి పోయాడు. జీతం ఊహకందనంత పెరిగింది. ఐదేళ్ల ముందు సైకిల్ కూడా లేని ఆ మిత్రుడు ఇప్పుడు కారు కొన్నాడు అని కథకుడు అంటాడు. జర్నలిస్టు మిత్రు డు పత్రికలోంచి చానల్లోకి పోయినా తన జర్నలిజం వృత్తిని వదులుకోలేదు కదా? జర్నలిస్టుకు వచ్చిన బూమ్, సెజ్ ప్రాంతంలో రైతుల భూములకు వచ్చిన బూమ్ ఒకటెలా అవుతుంది.
రైతులకు బూమ్ అంటే వాళ్లు పండించిన పంటలకు అత్యధిక ధరలు రావడమే కానీ, బతుకునిచ్చే పొలాన్ని అమ్ముకుని, చేతకాని పనుల్లోకి పోయి చేతు లు కాల్చుకోవడం కాదు. కథకుడి అంచనా ప్రకారం జర్నలిస్టు బాగుపడినాడనుకుందాం! రైతులు కూడా అలాగే పొలాలు అమ్ముకుని బాగుపడుతున్నారా? ఇక ప్రొఫెసరు కానీ, జర్నలిస్టు కానీ ఎవరో అవార్డులు ఇస్తారనో, ఎవరో తమను పొగుడుతారనో వ్యాసాలు రాయరు. వారం పదిరోజులు సెలవులు పెట్టుకుని సెజ్ ప్రాంతంలో పర్యటించరు. సాటి మనుషులుగా స్పందిస్తారు. ఆ పల్లె ల్లో చదువూ సంధ్యలు ఎక్కువ లేక, ప్రపంచ పోకడ సరిగా తెలీకుండా ఉన్న రైతులు ‘సెజ్’లకు బలైపోతారనే వ్యాసాలు రాస్తారు.
కథలో సెక్యూరిటీ గార్డుల ప్రస్తావన తెచ్చారు. సెజ్‌లకు భూము లు కొన్నా, అక్కడ ఎలాంటి ఉత్పత్తులు, నిర్మాణాలు జరగడం లేదు. మరి ఎందుకు సెక్యూరిటీ గార్డులు? కథకుడు ఈ విషయాన్ని వదిలేశాడు. వాస్తవానికి అక్కడ వాళ్లు కాపలా ఉన్నది రైతులు తిరిగి తమ పొలాల్లోకి రాకుండా! మొదట్లో డబ్బుకు ఆశపడి కొందరు రైతులు పొలాలు అమ్ముకున్నారు. అయితే ఆ డ బ్బు చాలా తక్కువ రోజులో ్లనే చెల్లాచెదురైపోయింది. మట్టిమీద మమకారం మరింతగా పెరిగిం ది. దీంతో రైతులు తిరిగి తమ పొలాల్లోకి, తోటల్లోకి పోవడం మొదలుపెట్టారు. అలాంటి మట్టి మనుషులను అడ్డుకోవడంకోసం అక్కడి రైతు కూలీలనే సెక్యూరిటీ గార్డులుగా పెట్టుకున్నారు! ఇదీ సత్యం. వరదయ్య పాళెంలోని రాళ్లకుప్పంలో ఓ శిధిలమైన ఇంట్లో గెడిపూడి కృష్ణమనాయుడు అనే వృద్ధ రైతు ఉన్నాడు.
ఆయనకు చక్కెర వ్యాధి ముదరడంతో పాదం తీసేశారు. సరిగా నడవలేకున్నా, కాలికి కట్టు ఉన్నా ఆయన నిరుత్సాహంగా లేడు. ఆయన సెజ్‌కు తమ పొలం ఇవ్వడం లేదు. తనలాంటి మరో పదిమంది రైతులను హైకోర్టుకు తీసుకుపోయాడు. తమ పొలాల జోలికి ప్రభుత్వం రాకుండా ఉండేలా స్టే తెచ్చుకున్నాడు. సెజ్ కథ చెప్పిన కథకుడికి ఇలాంటి వారు కనిపించలేదో, కనిపించినా విస్మరించారో. కథలో ‘కనుసూపు మేర ఆ బూఁవులను ఎటు సూస్తె అటు చిట్టడవులె..’అంటాడు కథకుడు. మరి అలాంటి వ్యవసాయ యోగ్యం కాని భూములకు ఎకరాకు మూడు లక్షల రూపాయలను ప్రభుత్వం ఎందుకు ఇస్తోంది? ప్రొఫెసరును చాలాసార్లు అంటరాని కులానికి చెందిన వ్యక్తిగా కథకుడు సంబోధించాడు.
ఇలా సంబోధించవచ్చా? ఆయన మాటల ప్రకారం అంటరాని కులానికి చెందినవాడే అయినా అలాంటి వారు ప్రొఫెసర్లు కాకూడదా? విదేశాలకు పోకూడదా? ఆ కులస్థుల పట్ల కథకుడికి ఎందుకంత వ్యంగ్యం? తను తప్ప సమాజా న్ని సక్రమంగా అర్థం చేసుకున్న వారు లేరని, తను తప్ప మిగిలిన వారందరూ అవకాశవాదులనే టోన్‌తో కథంతా నడిపాడు కథకుడు. చెన్నయ్ ఎయిర్‌పోర్ట్‌కు, ఓడరేవుకు దగ్గరలో ఉన్న సత్యవేడు, వరదయ్యపాళెం మండలాలనే ఎందుకు ప్రభుత్వం ఎంచుకుంది? సెజ్‌కు అవసరమైనమేర కాకుండా భవిష్యత్ అవసరాల దృష్ట్యా అంటూ ఎందుకు వేల ఎకరాల వ్యవసాయ భూములను లాక్కొంటోంది? సెజ్ వల్ల నిర్వాసితులైన వారంతా ఎలా జీవిస్తారు? ఏమై పోతారు?
చాలారోజులు సెజ్ ప్రాంతంలో పర్యటించి ప్రజల కష్టనష్టాలను దగ్గరగా పరిశీలించి, వాళ్లతో మాట్లాడి రాసిన రాతలు, ఆలోచనలు పనికిరానివి అయిపోయాయి కథకుడికి. ఎవరో కారులో తీసుకుపోతే కేవలం కొన్ని గంటలపాటు నాలుగు గ్రామాల్లో పర్యటించి వచ్చిన కథకుడికి ఇంతకన్నా ఎక్కువ ఏం తెలుస్తుందిలే! అయితే ‘సెజ్’ కథ చెప్పిన వ్యక్తి ప్రభుత్వ అధికారో, పాలకపక్ష నాయకుడో అయితే పట్టించుకోనవసరం లేదు. ఈ కథకుడు విరసం సభ్యుడు. ఈ మౌఖిక కథలకు మరికొందరు విరసం సభ్యులు ప్రెజెంటర్లుగా వ్యవహరించారు. అంటే సెజ్‌లను విరసం సమర్థిస్తోందా? ఇదేనా విరసం భావజాలం? ఎవరి ప్రయోజనాలను ఆశించి ఇలాంటి కథ చెప్పారు?
-సుంకోజి దేవేంద్రాచారి
(22 జూన్ 2009, ఆంధ్రజ్యోతి సౌజన్యం తోటి)
భూమి గురించి ఎందుకో కొత్త బెంగ!
సెజ్ ప్రక్రియ దుర్మార్గమైందే. కానీ, అంతటి దుర్మార్గమైన సెజ్‌లకు, రైతాంగం ప్రాణప్రదంగా ప్రేమించిన, తమ చెమటతో రక్తంతో కాపాడుకున్న భూమిని ఈ రోజు ఇవ్వక తప్పనిస్థితి ఎందుకొచ్చింది? తమ పంటపొలాల మీద పొక్లయినర్లు పారాడుతుంటే కన్నీళ్లతో వెనుదిరిగిన రైతాంగం గత యాభైఏళ్లుగా ఎన్ని అలవిగాని కష్టాలు పడ్డారే! అదంతా ఏమైపోయిందీ? ఈ ప్రశ్నల వెనకాతల తారాట్లాడే విషాద చరిత్ర గురించి పునస్సమీక్ష చేసుకోకుండా మనం ఎన్ని మాట్లాడుకున్నా, ఉదాత్త విలువలను ప్రకటించినా అవి ఇంకేమైనా కావొచ్చేమోగాని, జీవిత సంఘర్షణను, మార్పులను గమనిస్తున్న వారి వ్యాఖ్యానాలు మాత్రం కావు.
తుమ్మేటి రఘోత్తమరెడ్డి మౌఖిక కథ ‘సెజ్’ ప్రచురించి ఆంధ్రజ్యోతి ‘వివిధ’ (08.06.09) మేలు చేసింది. రఘోత్తమరెడ్డి మౌఖిక కథల డివిడి రూపొందిస్తున్న సమయంలో ఆయనతో కలిసి తిరిగాను. పదేపదే ఆ కథల గురించి మాట్లాడుకున్నాం. ముఖ్యంగా సెజ్, అమ్మ, స్టెప్స్ కథల గురించి చాలా చర్చించుకున్నాం. ఇందులోని ప్రతి కథను గురించీ సమాజ సాహిత్య సంబంధాలవైపు నుంచి, తెలుగు సీమ సామాజిక, రాజకీయ, ఆర్థిక పరిణామాన్ని గురించి చాలా చర్చ చేయవచ్చు. కథా సాహిత్యం సమాజ గతిని ఎంత తీక్షణంగా, నిశితంగా పరిశీలిస్తుందో ఈ కథలు విన్నపుడు తెలిసివస్తుంది.
స్వాతంత్య్రానంతర ఆంధ్రప్రదేశ్‌లో అమలైన పాలకవర్గాల అభివృద్ధి నమూనాను, ప్రత్యామ్నాయ ఉద్యమ వైఫల్య, సాఫల్యాలను, ప్రపంచీకరణ నేపథ్యంలో మధ్యతరగతి ఎట్లా నిస్తేజమైపోయిందో, విలువల పతనానికి గురయిందో ఈ కథలు చాలా తీవ్ర స్వరంతో హెచ్చరిస్తాయి. స్కైబాబ తన అభిప్రాయం చెబుతూ కొన్ని కథలు పేలవంగా ఉన్నట్టూ, ‘ట్విస్ట్’ సరిగ్గా పేలలేదు అన్నారు. కాని ట్విస్ట్‌తో చెప్పే ఉద్దేశంతో ఈ కథలు సాగలేదనుకుంటాను. స్కైబాబ అనుకున్న ట్విస్ట్‌తో సంబంధం లేకుండా ఈ మౌఖిక కథల గురించి చర్చించాల్సిన, శోధించాల్సిన విషయాలు చాలా ఉన్నాయి.
పేలవంగా సాగాయన్న కథలను మరోసారి వింటే, రఘోత్తమరెడ్డి స్వరం వెంబడి ప్రయాణిస్తే చెప్పిన కథ వెనకాల చెప్పనికథా ఏంటో తెలుసుకునే ప్రయత్నంచేస్తే మనసును మెలి తిప్పే,దిగ్భ్రాంతికి గురిచేసే ప్రశ్నలూ సందేహాలూ మనని వెన్నాడుతాయి కరువు పీడిత ప్రాంతం, లేబరు జిల్లా పాలమూరు నుంచి వచ్చినవాడిగా, గత నాలుగు దశాబ్దాలుగా కరువు బారినపడి భూమంటే సర్కారు కంప మొలిచిన ఉట్టి నేలపై నుంచి వచ్చినవాడిగా సెజ్‌లపై మొదటి నుండీ నాకు కొన్ని సందేహాలున్నాయి. సెజ్ ప్రక్రియ దుర్మార్గమైందే. సందేహం ఏమీలేదు.
సెజ్‌లు భవిష్యత్ సమాజంలో రేపే ప్రతిక్రియలు భయానకమైనవే! కానీ, అంతటి దుర్మార్గమైన సెజ్‌లకు, రైతాంగం ప్రాణప్రదంగా ప్రేమించిన, తమ చెమటతో రక్తంతో కాపాడుకున్న భూమిని ఈ రోజు ఇవ్వక తప్పనిస్థితి ఎందుకొచ్చింది? తమ పంటపొలాల మీద పొక్లయినర్లు పారాడుతుంటే కన్నీళ్లతో వెనుదిరిగిన రైతాంగం గత యాభైఏళ్లుగా ఎన్ని అలవిగాని కష్టాలు పడ్డారే! అదంతా ఏమైపోయిందీ? ఈ ప్రశ్నల వెనకాతల తారాట్లాడే విషాద చరిత్ర గురించి పునరాలోచించకుండా పునస్సమీక్ష చేసుకోకుండా మనం ఎన్ని మాట్లాడుకున్నా, ఉదాత్త విలువలను ప్రకటించినా అవి ఇంకేమైనా కావొచ్చేమోగాని, జీవిత సంఘర్షణను, మార్పులను గమనిస్తున్న వారి వ్యాఖ్యానాలు మాత్రం కావు.
గత ఐదు దశాబ్దాల కాలంలో దేశవ్యాప్తంగా అమలైన పాలకవర్గాల అభివృద్ధి నమూనా మధ్యతరగతిని (ముఖ్యంగా పట్టణ మధ్యతరగతి) ప్రలోభాలకూ, భ్రమలకూ గురిచేస్తూనే కొండొకచో ఫలాలు ఇచ్చింది. సరిగ్గా ఈ మధ్యతరగతికి అభివృద్ధి ఫలాలు అందించిన అభివృద్ధి నమూనాయే ఇవాళ సెజ్‌లను తీసుకొచ్చింది. కార్పొరేట్ విద్యనూ వైద్యాన్ని, సాఫ్ట్‌వేర్ కలలను మధ్యతరగతికి అందించిన నమూనాయే రైతాంగం భూమినుంచి పరాయీకరించబడటానికి కారణమవుతున్నది. ఇంతకాలం బట్టి ఈ అభివృద్ధి ఫలాలను అందుకున్న మధ్యతరగతి ఏనాడైనా వాటిని ప్రశ్నించిందా? రాబోయే రోజుల్లో ఈ అభివృద్ధి నమూనా ఎంత విధ్వంసాన్ని సృష్టిస్తుందో అన్న ప్రశ్నలు వేసుకోడానికి సాహసించిందా అన్నదే ప్రధానం.
ఇంతకాలంపాటు కుయ్యనకుండా అన్నిటినీ అందుకుని పైకెగబాకిన మధ్యతరగతి ఇవాళ సెజ్‌లు రావడంతో ఉలిక్కిపడింది. భూమినుంచి ఏనాడో బేదఖలైపోయి, రైతాంగాన్ని మర్చిపోయినవాళ్లంతా భూమి విలువ గురించి కొత్తగా బెంగపడటం ఆరంభించారు. భూమి విలువ గురించి రైతాంగానికి ఇవాళ కొత్తగా మధ్యతరగతి చెప్పనక్కర్లేదు. ఇవ్వాల్సిన స్థితి ఎందుకొచ్చిందన్న ప్రశ్న వేసుకుంటే మన (మధ్యతరగతి) వైఫల్యాలు, సామాజిక జీవనంలో పాత్రను గురించి అంతే నిజాయితీగా ఆత్మవిమర్శ చేసుకుంటే మరింత ఉపయోగకరంగా ఉంటుంది. మనకున్న అపారమైన ప్రేమవల్ల భూమి నిలబడదు.
రైతాంగానికి కూడు పెడుతున్నదా? ఉరితాటికి తలొగ్గమంటున్నదా? అన్న దగ్గిరే భూమి ఏమైపోవాలన్న నిర్ణయం జరుగుతుంది. మన జీవితంలో గుర్తింప నిరాకరించే విలువను, వాస్తవాన్ని అవతలివాడిలో వెతకడం సులభం, సరదా మాత్రమే కాదు మనకు మరింత కీర్తి తెచ్చిపెడుతుంది. మన ఆపేక్షకూ, విలువలకూ జీవితానికి మధ్య జమీన్ ఆస్మాన్ ఫరక్ వచ్చి చాలా కాలమైంది. కాకపోతే, ఉద్దేశపూర్వకంగానో, మనం ఏర్పరుచుకున్న పూర్వాభిప్రాయాలు ఎక్కడ భగ్నమవుతాయో అన్న భయంకొద్దీ విస్మరిస్తున్నాం. అందుకే ఏ కొంచెం సంప్రదాయ నమూనాను ధిక్కరించి మాట్లాడినా బెంబేలుపడిపోవడం, ఠారెత్తిపోవడం. ఇక్కడే ఇంకో ప్రశ్న ఉత్పన్నమవుతుంది. ఇంతకాలం ప్రశ్నించలేదు, వ్యతిరేకించలేదు కాబట్టి ఇప్పుడు వ్యతిరేకించకూడదా? అని. తప్పకుండా ఇవన్నీ చెయ్యవచ్చు. కాని మనకేమైనా ప్రశ్చాత్తాపం, ఆత్మవిమర్శ ఉన్నదా? అనేదే గీటురాయి.
మధ్యతరగతి అయినందువల్లో, ఇంతకాలం ప్రశ్నించలేదన్న కారణంవల్లో వ్యతిరేకించకూడదని కాదు. మన గతం పట్ల మనకు నిజాయితీ ఉందా, లేదా? అన్నది ప్రధానం. రఘోత్తమరెడ్డి కథ సాంతం ఈ మధ్యతరగతి ద్వైదీభావం చుట్టూ మాత్రమే తిరగలేదనుకుంటా. ఇవాళ వ్యవసాయ సమాజం ఎదుర్కొంటున్న భయంకర సంక్షోభాన్ని గురించి తీవ్రస్వరంతో హెచ్చరించింది, ప్రశ్నించింది. సామాజిక మార్పులోని సంక్లిష్ట క్రమాన్ని గురించి అవసరమైన చర్చ చేయడానికి సందర్భాన్ని తెచ్చిపెట్టింది. అట్లా ఈ మౌఖిక కథ ల సందర్భంలో మనం ఎదుర్కొంటున్న కల్లోల కాలం గురించి చర్చ చేయడం సాహిత్యరంగానికే కాదు అటు రాజకీయోద్యమానికీ ఉపయోగకరం.
సాహిత్యం అందునా వ్యవస్థ మంచిచెడులకు సంబంధించింది అయినపుడు విమర్శా ప్రతివిమర్శలు సహజం. అవసరం కూడా. అంతమాత్రాన బెంబేలు పడిపోయి, ఉద్వేగాలకో, ఆవేశాలకోపోయి చర్చ చేస్తే వచ్చే ఫలితం శూన్యం. మన అసహన ప్రదర్శన మాత్రమే అవుతుందది. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో అపారమైన చైతన్యాన్ని ప్రదర్శించిన మధ్యతరగతి ఉన్నచోట, వ్యవసాయక సమాజం బలంగా ఉన్నచోట నక్సలైట్ ఉద్యమం ఎందుకు నిలదొక్కుకోలేకపోయింది? అన్న ప్రశ్నకు సులభమైన, సరళరేఖ జవాబు ఉంటుందా? నిలదొక్కుకోవడానికి చేసిన ప్రయత్నాలతోసహా గుర్తించని అనేక వైఫల్యాలున్నాయి.
వాటివెనుక సంక్లిష్ట క్రమం ఉన్నది. ఈ మార్పులనూ, సంక్లిష్టతనూ శోధించడం, విశ్లేషించడం, మనని వెనక్కి తిరిగిచూసుకోవడం ఎంత అవసరమో రఘోత్తమరెడ్డి మౌఖిక కథలు మరోసారి గుర్తుచేస్తాయి. ఈ కథా చర్చ అంతా ఉద్యమాలనో, మధ్యతరగతినో బోనెక్కించే ఉద్దేశంతో కాకుండా, సమాజగతిని దాని నిరంతర మార్పులతో అర్థం చేసుకోవడానికి, భేషజాలకు పోకుండా మనని మనం కఠిన విమర్శ చేసుకోవడానికి ఉపయోగపడే సందర్భం. అవగాహన ప్రకారం జీవితం ఉండదనీ, జీవితం ఆధారంగా అవగాహన రూపొందాలని, రైలు బద్దీల స్థితి నుంచి బయటపడాలని చెబుతాయి ఈ కథలు.
- ప్రశాంత్ విరసం సభ్యులు
(29 జూన్ 2009, ఆంధ్రజ్యోతి సౌజన్యం తోటి)
రచయితలూ! రఘోత్తమ్‌తో జాగ్రత్త!
‘వివిధ’లో 8.6.09న రఘోత్తమ్ డివిడి కథనం ‘సెజ్’ చదివి భయంతో కూడిన జలధరింపుకు లోనయ్యాను. ఈ రచయిత దాదాపు పదేళ్ల నించీ కథలు రాయటంలేదు. బహుశా అప్పట్నించే అతడు దృక్పథానికి పూర్తిగా దూరమైనట్టున్నాడు. ‘పనిపిల్ల’ కథతో అతని తిరోగమన దృక్పథం బయటపడినప్పటికీ ‘సెజ్’ కథ ఇతని ముసుగు పూర్తిగా తొలగించి సాహితీ ప్రపంచం ముందు నిలబెట్టింది. ఈతని సెజ్ కథ సారాంశం ఏంటంటే- ప్రజా పోరాటాలు, విప్లవోద్యమాలూ ముగిసిపోయాయి. ఇక మేధావులు, ఉద్యమకారులు, ప్రజాసంఘాలు, రచయితలు అందరూ నోర్లు మూస్కోవాలి. పాలకవర్గ దోపిడీకి అలవాటుపడిపోయి, ప్రభుత్వం, ఫాక్టరీలు దయతో పడేసే కూలీ, వాచ్‌మెన్‌ల ఉద్యోగాలకు రాజీపడిపోయి ప్రశాంతంగా, ఘర్షణ లేకుండా బతుకుతున్న అమాయక ప్రజలను ఈ మేధావులు డిస్టర్బ్ చేయకూడదని చెప్పడమే.
ఈ కథ ద్వారా తను ప్రజా రచయితగా కాకుండా పాలకపక్ష రచయితగా రఘోత్తమ్ ప్రూవ్ చేస్కున్నారు. ఈ కథ ముగింపు రచయితకు సెజ్‌పట్ల సెజ్‌లోని లేబర్ చట్టాలపట్ల ఏ మాత్రం అవగాహన లేదని తెలుపుతుంది. లేకపోతే తన భూముల్లోనే సెక్యూరిటీ గార్డులుగా పనిచేస్తున్నవాళ్లు సమ్మె చేసి తమ జీతం రెండొందలు పెంపు చేస్కున్నారు అని ఎలా రాస్తారు? పైగా ఇందులో కిటుకు ఉన్నదట. వాళ్ల సమ్మె వలన అనాదిగా మానవ జాతి ఎలా మనగలుగుతూ వస్తుందో చటుక్కున స్ఫురించిందట. అదేంటంటే ప్రభుత్వం గుంజేస్కున్న పనికిరాని భూమి పోయినప్పట్కి ఫాక్టరీలో ఉద్యోగాలనే అభివృద్ధి ప్రతిఫలనాలను అందుకుంటూ అందులోనే ఇంకొద్ది మంచిగా జీవించడానికి జీతాల పెంపుకోసం సమ్మెలూ గట్రా చేస్కుంటూ నెట్టుకురావడం.
అసలు జీ.వో.ఎమ్.ఎస్.నెం.151 ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం సెజ్‌లని అనేక చట్టాల పరిధిలోంచి మినహాయించింది. కార్మిక చట్టాలనూ మినహాయించింది. దీని ప్రకారం కార్మికులకు సమ్మె చేసే హక్కుండదు. యజమానులు తమ కిష్టమైనప్పుడు కార్మికులను తొలగించవచ్చును. వేతనం రిజిష్టర్లు, రికార్డులు పెట్టుకోవల్సిన అవసరంలేదు. ఎన్ని షిఫ్ట్‌లు ఎన్ని గంటలు, ఏ పనికి ఎంత వేతనం ఇస్తుంది ప్రకటించనక్కరలేదు. యాజమాన్యం చేసే నిర్ణయాలను ఘోరమైన తప్పిదాలను రాష్ట్ర ప్రభుత్వమూ ప్రశ్నించలేదు. లే ఆఫ్‌కీ, రిట్రెంచ్‌మెంటుకూ, మూసివేతకూ ప్రభుత్వ అనుమతి అవసరంలేదు. విషాదం ఏమంటే ఇవన్నీ కార్మికులు దశాబ్దాలుగా పోరాటాలు చేసి సాధించుకున్న హక్కులు. పోలేపల్లిలో భూమి కోల్పోయిన లక్ష్మమ్మను మన్నెత్తే కూలీ పనినించి నోటీసు ఇవ్వకుండానే తీసేస్తే ముగ్గురు పిల్లల్ని పోషించలేక ఆత్మహత్య చేసుకున్న సంగతి రఘోత్తమ్‌కు తెలిసి ఉండకపోవచ్చు.
పోలేపల్లిలో విరసం బహిరంగ సభ జరుగుతున్నపుడు అరబిందో ఫార్మా కంపెనీ నుంచి ఒంటినిండా గాయాలతో ఏడుస్తూ వేదికవైపుకు పరుగెత్తుకుంటూ వచ్చి తనను యజమానులు 3 రోజుల జీతం అడిగినందుకు బూటుకాళ్లతో కర్రలతో కొడుతున్నారని ముక్తావర్ అనే ఒరిస్సాకు చెందిన కార్మికుడు మైకులో ఏడుస్తూ చెప్పాడు. అక్కడ భూములు గుంజుకున్న స్థానిక రైతులకు కాకుండా ఆంధ్రా, ఒరిస్సా, కేరళ నుంచి కార్మికులను తెప్పించుకుంటూ ఇదేం అన్యాయమని ప్రశ్నించిన, పోరు చేసిన స్థానిక పోలేపల్లి రైతాంగం మీదికి కుక్కల్ని తోలిన సంగతీ రఘోత్తమ్‌కు తెలియకపోవచ్చు. పొద్దంతా అలిసిపోయి
బీడీ తాగాడని, 50ఏళ్ల రైతు ఎట్టి పెదఎంకయ్య చెయ్యి బీడీ తాగడానికి నోటిదాకా పోకూడదని మోకాలికి కర్రకట్టి కాలూ కుడిచెయ్యి కలిపి తాడుతో కట్టేసిన వికృత కార్పొరేట్ సంస్కృతి నాజీల కాలాన్ని గుర్తుకు తేవటంలేదూ? పెళ్లి కాని ఆడపిల్లలపై లైంగిక అత్యాచారాలు, పర్యవసాన గర్భాలు- అబార్షన్లు ఈ అభివృద్ధి ప్రతిఫలనాలుగానే రచయిత అర్థం చేస్కుంటారేమో? చదువు ఆగిపోయిన యువకులు, పిల్లలు, గుండె ఆగి సచ్చిపోయిన భర్తల జ్ఞాపకాలతో సంసారభారం మోస్తున్న మహిళా రైతులు, పెరిగిన వలసలు.. చిన్నపిల్లలు హోటళ్లు, సినిమా హాళ్లముందు బిచ్చమెత్తుకునే దృశ్యాలు రఘోత్తమ్ చూడాల్సివుంది.
రైతుని భూమినించి బేదఖల్ చేసి బిచ్చగాడిగా మార్చిన ఈ పరిణామాన్ని ఏ రకమైన అభివృద్ధిగా చూపదల్చుకున్నారు రచయిత? అనేక పోరాటాల తర్వాత భూస్వాముల దొరల జమీందార్ల నుంచి రైతుకి దక్కిన భూమిని ఉత్పత్తిదారుడైన రైతునించి గుంజుకుని ప్రపంచబ్యాంకు, ప్రపంచ వాణిజ్యసంస్థల కనుసన్నల్లో మెలిగే విదేశీ కార్పొరేట్ కంపెనీలకు, కార్పొరేట్ పెట్టుబడిదారుడి చేతుల్లో పరిశ్రమలకోసం వెళ్లడం ఏ అభివృద్ధి నమూనా? ఎవరి అభివృద్ధి ఇది? మళ్లీ ఒక నయా జమీందారీ వ్యవస్థ నెలకొంటూంటే ప్రతిఘటన అవసరం లేదనా రచయిత భావం? పాక్షిక, నిర్లక్ష్య సమాజ పరిశీలన ప్రజా వ్యతిరేక, ప్రభుత్వ అనుకూల ప్రమాదకర రచనలు చేయిస్తుందనటానికి ఈ కథ నిదర్శనం. పనికిరాని భూములకు ప్రభుత్వం లక్షలు ఇస్తుంటే ఇక రైతులు ఉద్యమాలు చెయ్యవలసిరాకుండానే ప్రతిఫలనాలు అందుకుంటున్నారట.
రచయితలు, మేధావులు, జర్నలిస్టులు, ఉద్యమకారులు మాత్రం తమ జీవితంలో ఈ అభివృద్ధి ఫలితాలు పొందుతూనే రైతులను మాత్రం తీస్కోవద్దని చెబుతున్నారని రచయిత వక్రంగా ప్రతిపాదిస్తారు. స్వచ్ఛందంగా భూములు ఇచె ్చయ్యడం వెనకాల గ్రామాల్లో ఏం జరిగిందో రచయితకు తెలుసా? అంతా అయిపోయాక యాదృచ్ఛికంగా చేసిన ఒక సెజ్ పర్యటన తర్వాత రాసేస్తే సరిపోతుందా? విరసం గత ఏడాదిన్నర కాలంగా సెజ్ పీడిత క్షేత్రాల పర్యటనలు, సభలు నిర్వహించింది. సెజ్ వ్యతిరేక కథలు, నాటకాలు, కవిత్వం, పరిశోధనా వ్యాసాలతో సంకలనాలు వెలువరించింది.. ఎండి బీడైన భూములే సర్కారుకి రైతులు ఇచ్చారనే వాదనను పరిశీలిస్తే- సెజ్‌లకంటే ముందే ప్రపంచీకరణ ఆర్థిక విధానాలు వ్యవసాయరంగంలో ప్రవేశపెట్టింది సర్కారు.
విత్తనాలు ఎరువులు కరెంటుపై సబ్సిడీలు ఎత్తేసి సాగు నీరు, బ్యాంకు పరపతి సౌకర్యాలు రైతుకు ఇవ్వకుండా చేసి రైతుల్ని అప్పుల్లో తోసేసి అనివార్యంగా భూముల్ని అమ్ముకుని రైతాంగం వలసలు వెళ్లిపోయేట్లు- వ్యవసాయానికి, భూమికి, ప్రాంతానికి పరాయీకరణ చెందేట్లు చేసింది సర్కారు, దాన్ని నడిపించే ప్రపంచబ్యాంకు కాదా? ఫలితంగా ఎదురైన ఆహార కొరతను ఎదుర్కోడానికి మళ్లీ తనమీదే ఆధారపడేట్లు చేస్కున్నది సామ్రాజ్యవాదం కాదా? ఇది స్వచ్ఛందంగా ఇచ్చినట్లు అవుతుందా? తమ సొంత పొలాలకు పరాయివారైపోయిన తమ తల్లిదండ్రుల్నీ, ఊరి జనాలను రానియ్యకుండా తుపాకులు పట్టుకొని కాపలా కాస్తున్నందుకు కుములుతున్న సెక్యూరిటీ గార్డుల తుపాకులు ఎక్కుపెట్టాల్సింది
ఎవరివైపో బహుశా భావజాలానికి పదేళ్ల క్రితం దూరమైన రచయిత ఎరుకలోకి రాదేమో? సో.. ఇదంతా రచయిత పాలకపక్షం వహించే దిశగా జరిగిన నైతిక పతనం అందామా? బహుశా బాగా రాస్తున్న రచయితల చుట్టూ కొంతమంది భజనపరులైన సమీక్షకులు, విమర్శకులు, వారిని గుడ్డిగా ఆరాధించేవారు, వారిని సాధారణత్వానికి అతీతుడిగా, పెడధోరణుల్లో పోతున్నా, భారమై కూర్చున్నా, అన్‌క్రిటికల్‌గా వుంటూ భుజకీర్తులు మోయటం వలన తాము ఇక ఏం రాసినా చెల్లుబాటు అవుతుందన్న అహంకారులవుతారేమో? ఈ రచయిత కొన్ని కథావర్క్‌షాప్‌లకు ఉపదేశకుడిగా వెళ్తున్నారు. కొత్త రచయితలు ఈ రచయిత సలహాలు తీసుకుంటున్నారు. భావజాలానికి దూరమైన రచయిత ఈ సరికొత్త కథకుల కథల్ని మారిన తన దృక్పథంతో సరిచేసే ప్రమాదమూ వుంది. సో.. రచయితలూ రచయితల సంఘాలూ జాగ్రత్త!
- గీతాంజలి, విరసం
(6 జులై 2009, ఆంధ్రజ్యోతి సౌజన్యం తోటి)
సత్యాన్ని అమ్మి కలల్ని కొనుక్కునే రోజులివి రఘోత్తంగారూ..
కాలం చాలా గడిచిపోయింది. రక్తమొలికిన నేల మీద సుఖాలకోసం దేబిరించే రోజులొచ్చాయి రఘోత్తంగారూ.. ఈ లోకం మీ ‘లక్ష్మణ రేఖ’ను దాటలేదు. ‘అమ్మ’ ప్రేమలో సైతం మీరు చూసిన లోచూపును ఈ అంధ ప్రపంచం చూడలేదు. చూడకూడదని మనసా, వాచా, కర్మణా నిర్ణయించుకుంది. మీ ‘మౌఖిక’ వేదన వినే మనుషులు లేకపోయిన కాలంలో, మీ ‘సత్య ప్రకటన’ను ఎగతాళి చేసే రోజుల్లో మీరు మాట్లాడితే శాపనార్థాలు పెట్టక ఏం చేస్తుంది చెప్పండి? మన ఇంట్లో తిట్లు అయిపోతే పొరుగింట్లో నుంచో, ఆంగ్ల గ్రంథాలనుంచో అరువు తెచ్చుకునైనా తిట్టదలుచుకున్నదీ లోకం… విలువల గురించి మాట్లాడితే లోకం వింటుందా రఘోత్తంగారూ.. చక్రాలబళ్ల ఊహలకూ తార్రోడ్డు సుఖాలకూ మరిగిన కాలమిది. నాలుగ్గోడలను; నడమంత్రపు సిరితో ఆకాశహర్మ్యాలో, అందాల భవంతులో నిర్మిస్తున్న రోజులివి.
లోహ విహంగాల ప్రయాణాలో, కరతాళ ధ్వనుల మధ్య సత్కారాలనో ప్రేమిస్తున్న, పూజిస్తున్న, ప్రాధేయపడుతున్న లోకంలో మీ మాటెవరూ వినరు. ఇది వినాల్సిన, ఆలోచించాల్సిన మాటని; మాట వరసకు కూడా అనుకోని దౌర్భాగ్యపు రోజులివి. ఆరుగాలం రక్తం పోసిన రైతన్న ఉరికంబం మీద నిలబడి ‘స్వయంహనన’ ప్రకటన చేసి, ఈ లోకం మొహంపై ఊసి వెళ్లాడు. జాలితో ‘జానేదో..’ అనుకొని వెళ్లిపోయాడు. అపుడు మన బుద్ధిజీవులంతా బాత్‌రూంలలో కన్నీరు పెట్టే ఉండవచ్చని మనమే సంతృప్తి పడాలి. దీర్ఘ ఉపన్యాసం చేస్తూ సందు దొరికినపుడు, ఏమార్చి, విలువల్నీ, వలువల్నీ అమ్ముకునే పాడుకాలం, కాని కాలమిది రఘోత్తంగారూ.. పేదరైతు కళ్ల నుండి లోకాన్ని చూడడం మహాపాతకం.
అపార్టుమెంటు బాల్కనీలో నిలబడి తార్రోడ్డును చూడటం పూర్వజన్మ సుకృతం. రెడ్డిగారూ.. మీరు పదేళ్ల తర్వాత, పదిపదుల ఏళ్ల తర్వాత, పది వందల ఏళ్ల తర్వాత ‘ఎలిజీ’గా ఏ’కాంత’ రోదనగా చెప్పాల్సిన కఠోర సత్యాల్ని ఇపుడే చెబితే ఎట్లా చెప్పండి? లోకం సుఖ నిద్రను చెడగొడితే గొల్లుమని పోదండీ.. మీ చిన్న సలహా, సూక్తి, సిద్ధాంతం, శ్లోకం.. వగైరా… ఏదైనా అనుకోండి… ‘లోకానికి ఇప్పటి సత్యాన్ని ఇప్పుడే చెప్పకూడదు. మీరు సాహసించి చెప్పిననూ.. అది వినకూడదని, విన్నా విననట్టే ఉండాలని, విననట్టే ఉండి; అదనంగా, ముఫ్త్‌గా దబాయించాలని కచ్చితమైన నిర్ణయంలో ఉంది. లోకం, లోలకంలా ఎటిఎం (అఖీక)కూ, ఎయిర్‌కండిషనింగ్ గదికీ తిరగడంలో నిమగ్నమై, నిబద్ధమై యున్నది.’ మీరు తెలుసుకోవాల్సిందల్లా.. ‘సచ్చాయి బేచ్‌కే ఖ్వాబ్ ఖరీద్‌నా హై’ అనే సూక్తిని…
- ఎ.రామ్మోహన్‌రావు, విఎఓ, చండూర్, నల్గొండ
(’సెజ్’ కథపై చర్చ mode of production వైపు నుంచి జరిగితే ఎక్కువ లాభకరం. ఎక్కడా అవకాశంలోని రోజుల్లో ‘ఆంధ్రజ్యోతి’ నిర్వహిస్తున్న ప్రజాస్వామిక చర్చా సంప్రదాయం హర్షణీయం)
(13 జులై 2009, ఆంధ్రజ్యోతి సౌజన్యం తోటి)
కథకుల్లోనూ హిపోక్రాట్లుంటారు!
గ్లోబలైజేషన్‌తో ఏయే రంగాలు అభివృద్ధి చెందాయో చెప్పలేం కానీ ‘ప్రజావంచనా’ రంగం మాత్రం అభివృద్ధి చెందిందని రఘోత్తమరెడ్డి ‘సెజ్’ కథ రూపంలో ‘చెప్పారు’. ప్రజావంచన అనే కళను, అభివృద్ధి చెందిన సాంకేతికత, వివిధ కథా టెక్నిక్‌లు జోడించటం ద్వారా ఎంతగా పెంపొందించవచ్చునో తన ‘సెజ్’ కథ వినిపించటం ద్వారా ఆయన మనకు నిరూపించారు. సెమీ మాండలికంలో మౌఖికంగా కథ చెప్పటం అన్న టెక్నిక్‌కు తోడుగా ‘నేనూ మీ వాడినే, మీలో ఒకరినీ’ అన్న సెంటిమెంటును జతచేయటం ద్వారా, గ్లోబలైజేషన్ బాధితులైన రైతాంగాన్ని ఎంత సునాయాసంగా వంచించవచ్చో సెజ్ కథా ప్రయోగం ద్వారా తేటతెల్లం చేశారు.
గ్లోబలైజేషన్ విధానాలను సూటిగా సమర్ధించకుండా, దాని ఫలితంగా వచ్చిందని చెప్పబడుతున్న ‘బూమ్’ వలన అందరికన్నా ముందుగానే దాని ఫలితాలను అందుకొని, ఆ విధానాలనే విమర్శించే ఒక వర్గంగా ఏర్పడిన కొందరు ‘జర్నలిస్టు’ల, ‘ప్రొఫెసర్’ల లాంటి వారి హిపోక్రసీని బట్టబయలు చేస్తున్న రూపంలో అన్యాపదేశంగా గ్లోబలైజేషన్ విధానాలను సమర్ధిస్తూ, వాటివలన ‘పొరపాటునో-ఇతర కారణాల వల్లనో’ మేలు జరుగుతుందని చెప్పటంలోనే వుంది కథకుడి వంచన అంతా.
జర్నలిస్టు, ప్రొఫెసరు గ్లోబలైజేషన్ విధానాలకు కృతజ్ఞులుగా వుండనందుకు వారిపట్ల ఎనలేని అక్కసుతో, వారి ‘హిపోక్రసీ’ని బహిర్గతపరిచే రూపంలో ‘సెజ్’ కథ చెప్పటం ద్వారా, తాను కొత్త ప్రయోగం చేయటానికీ డి.వి.డి సాంకేతికత తనకు అందుబాటులోకి తెచ్చిన ఈ నూతన ఆర్థిక, పారిశ్రామిక విధానాలకు కృతజ్ఞతగా, వాటిని అన్యాపదేశంగా సమర్ధించిన కథకుని వంచనా నైపుణ్యం కొనియాడదగింది!
కథకుడు అటు వ్యవసాయ సంక్షోభానికి గురయి జీవితం అస్తవ్యస్తమయి, నాశనమైన రైతుల అభిప్రాయాలకు కానీ, యాంత్రీకరణ, ప్రవేటీకరణ ఫలితంగా దుర్భరమైన పరిస్థితుల్లోకి నెట్టబడిన కార్మికుల అభిప్రాయాలకుగానీ ప్రాతినిధ్యం వహించి, వాటిని వ్యక్తం చేయక, ఏ ఎండకా గొడుగు పట్టే ‘మధ్యతరగతి మేధావి’ వర్గాలకు చెందిన అభిప్రాయాలను తాను చెప్పిన కథ ద్వారా ప్రచారం చేయబూనడంలోనే వుంది వంచనా శిల్పమంతా.
ఏటా ఒకే పంట పండినా తరతరాలుగా భూమిని నమ్ముకొనే రైతులు అష్టకష్టాల కోర్చి తమ జీవితాలను గడుపుతారనీ, అలాగే భూమిని నమ్ముకొని జీవితాలను సాగించటానికే రైతులు యిష్టపడతారన్న సామాజిక వాస్తవాన్ని కథకుడు తన కథ ద్వారా నిరాకరించే దుస్సాహసానికి పూనుకున్నారు. ఒక పంట పండే భూములైనా, వాటిని రైతాంగమే ఆ మేరకు పంట భూములుగా అభివృద్ధి చేసుకొన్నారన్న వాస్తవాన్నీ, ఆ భూములకు స్వంతదారులైన రైతులు మాత్రమే కాక, ఆ భూములపై ఆధారపడి పలు వ్యవసాయ వృత్తులవారు,…
వ్యవసాయ కూలీలతో సహా అనేకులు తరతరాలుగా జీవనాధారాన్ని గడుపుతున్నారనీ, ఆ భూముల పరిసరాల్లో చిట్టడవులుగా కనిపించే భూములు ఉమ్మడి సామాజిక అవసరాలైన పశువుల మేత, గ్రామీణ ప్రజల వంటచెరుకు, అడవి కలప, యితర అడవి ఉత్పత్తులు.. లాంటి అవసరాలు తీరుస్తూ వున్నాయనీ, ప్రధానంగా అవి పర్యావరణ పరిరక్షణకు (సమతుల్యం కొనసాగింపుకు) తోడ్పడుతున్నాయన్న వాస్తవాలను కథకుడు కావాలనే విస్మరించారు. వాచ్‌మెన్ల ప్రస్తావనలో ‘ఈ భూములమీద తోటలూ, ఇవన్నీ వున్నాయ్. వీటి కాపలాకోసం ఆ మందిని పెట్టుకొన్నారు’ అనడాన్ని బట్టిచూస్తే అవి పనికిరాని భూములు కాదన్నమాట. అందులో తోటలున్నాయి. పశుగ్రాసం యిచ్చే పచ్చిక బయళ్లున్నాయి. పంటభూములూ వున్నాయి.
అందువల్లే ఈ భూములను కారుచౌకగా కొనుగోలు చేసుకొని, వీటిని కార్పొరేట్ అగ్రి బిజినెస్‌కు అనుకూలమైన తోటలుగా మలచుకొంటున్నారు. వీటిని వాణిజ్యపంట భూములుగా మార్చేందుకోసం సూపర్ లాభాలు గడించటంకోసం ఎకరానికి 3 లక్షలు పెట్టి కొనుగోలు చేస్తున్నారు. వాచ్‌మెన్‌లుగా మారిన ఆ గ్రామాల యువకుల చేత ‘కొద్దోగొప్పో సదువుకున్నోళ్లం కదా సర్, మట్టేం పిసుక్కుంటం సర్’ అని చెప్పించిన కథకుడు వారు అనుభవిస్తున్న కనీసపు ప్రజాస్వామిక స్వేచ్ఛ లేని, వారి గోడు బయటికి చెప్పుకొంటే ఉన్న ఉద్యోగం పోయే స్థితిని మాత్రం విస్మరించారు. గ్రామీణ ఉపాధి కూలీల కిచ్చే కూలి కూడా ముట్టని ఈ దౌర్భాగ్యపు ఉద్యోగాలను పొందటం అన్నది చదువుకున్న వాళ్లకు వ్యవసాయం కన్నా మెరుగైనది అని చెప్పబూనటాన్ని మించిన వంచన యింకేముంటుంది? సెజ్‌ల వల్ల భూములు కోల్పోయిన, ఉపాధి కోల్పోయిన వారు ముష్టివాళ్లు కాదు.
వారు సెజ్‌ల యాజమాన్యాలచేత ప్రభుత్వాల ప్రోత్సాహంతో దగాకు గురిచేయబడతారు. ప్రస్తుత ‘సెజ్’ కథలో ఉపాధి కోల్పోయిన పూజారి భార్య తమను యింటర్వ్యూ చేయవచ్చిన వారితో ‘మీరెక్కణ్ణించో వస్తిరి మాకోసం. టీ చేసి పోద్దామన్నా మా దగ్గర ఏం లేకపోయె’ అని చెప్పటం ఆ గ్రామీణ సమాజ ప్రజల సంస్కారాన్ని వెల్లడి చేస్తున్నది. ‘ఎక్కడైనా మనుషులు గిట్లనే వున్నరు. వాళ్ల స్థితిగతులను పట్టించుకోకుండా అందరు చెప్పేటోళ్లే. చేసేవాళ్లు లేరు’ అంటూ సూత్రీకరించిన కథకుడు బహుశా అందువల్లనే సెజ్‌ల ఏర్పాటును, బలవంతపు భూసేకరణలను సమర్ధించటానికి పూనుకొన్నట్లున్నారు.
బహుశా ఆయన ఈ రూపంలో తాను కీర్తింపబడే, బహుమతులను పొందేమార్గం ఎంచుకొన్నట్లున్నాడు. ఈ రకంగా పరోక్షంగా ‘పొరపాటునో లేక వేరే కారణాలవల్లనో సెజ్‌ల వలన కొందరికి మంచి జరుగుతుందని’ ప్రబోధించేందుకు కృతఘ్నులైన, ‘హిపోక్రాట్ల’యిన ఓ ‘జర్నలిస్టు’ ఓ ‘ప్రొఫెసర్’ను సృష్టించి సాధనంగా చేసుకొన్నారు. మన కథకుని గ్లోబలైజేషన్ విధానాల పరోక్ష సమర్ధనా దోషాన్నుండి, ఆయన చేపట్టిన ‘మౌఖిక కథా ప్రయోగం’ ఎన్నటికీ విముక్తం చేయజాలదు.
ఎంతటి ప్రయోగమైనా దాని సారాంశాన్ని బట్టే ప్రయోజకత సాధిస్తుంది. అందుకు ఈ మౌఖిక కథా ప్రయోగం కూడా మినహాయింపు కాదు. గ్లోబలైజేషన్ బూమ్ వల్ల తామే ముందుగా లాభాలను అందుకొని, ఆనక ఆ విధానాలు సృష్టించే వినాశనానికి వ్యతిరేక ప్రచారకులుగా మారిన కృతఘ్నులైన ఆ జర్నలిస్టు, ప్రొఫెసర్లే మన ‘కృతజ్ఞుడైన’ కథకుని కంటే కోటిరెట్లు ప్రజలకు మిత్రులు. మన కథకుడే వంచనతో ప్రజలను మోసం చేస్తున్న ప్రజా శతృవు- దోపిడీ వర్గాల మిత్రుడు అయ్యారు. ఈ ‘సెజ్’ కథ వలన బయల్పడిన కఠోర సత్యం ఏమంటే కేవలం జర్నలిస్టులూ, ప్రొఫెసర్లలోనే కాదు, కథకుల్లో కూడా హిపోక్రాట్లయిన ప్రజావ్యతిరేకులైన వారుంటారన్నది!
- జి.వి.భద్రం, విజయవాడ
(20 జులై 2009, ఆంధ్రజ్యోతి సౌజన్యం తోటి)
జీవితాలకు అనుకూలంగా సిద్ధాంతాలు మార్చుకోవాలి
తుమ్మేటి రఘోత్తమరెడ్డి ఆశువుగా కథ చెప్తూ వుంటే వీడియో రికార్డింగ్ చేసి డీవీడీలుగా మార్కెట్ చేయడం ఒక కొత్త ఆలోచన. ప్రసంగం వలె కథను చెప్పడం అంత చిన్న విషయం కాదు. కథ చెప్తూ తరువాతి కథను వెంటది వెంట మనస్సులోనే రూపొందించుకుంటూ సాగుతూ వుండాలి. అలవాటైతే ప్రసంగాల్లాగే కథను చెప్పడం కూడా సాధ్యమే. అలాంటి అవసరంగానీ, అభ్యాసంగానీ ఎక్కువగా జరగలేదు. అందువల్ల, ఆధునిక తెలుగు కథలో ఇదొక కొత్త ప్రయోగం. పాత జానపదుల ప్రక్రియను ఆధునిక ప్రక్రియగా మలుచుకోవడంలో రఘోత్తమరెడ్డి విజయం సాధించాడు.
ఆధునిక అభివృద్ధి, ఆధునిక విద్య, ఉపాధి అందుకోవడం కోసం వందేళ్ల నుండి బ్రాహ్మణులు, రెడ్లు, కమ్మలు భూములు అమ్ముకుంటూ ఇతర వృత్తుల్లో చేరుతున్నారు. దానిమీద వందల కథలు, నవలలు వచ్చాయి. ఇవాళ సెజ్‌ల సందర్భంగా ఎక్కువ ధర వస్తే భూమి అమ్ముకుని ఏదైనా పనిచేసుకుందాం, వ్యవసాయంలో లాభమేమీ లేదు అని వ్యవసాయాన్ని వదిలి ఇతర వృత్తుల్లోకి వెళ్లాలనుకుంటున్న రైతులు కూడా ఉంటారని వారి కోణం ఎలాంటిదో ఈ కథలో చక్కగా జీవితమంత వాస్తవికంగా చెప్పారు. సిద్ధాంతాల కన్నా జీవితం మౌలికమైనది. జీవితానికనుకూలంగా సిద్ధాంతాలను మలుచుకోవాలి, మార్చుకోవాలి.
జీవితంతో సంబంధం కోల్పోయి సిద్ధాంతాలను ప్రజల మీద రుద్ది అలాగే బతకాలనుకోవడం సరైంది కాదు అని ఈ కథలోని రచయిత, రైతు కూడా భావిస్తాడు. ఇందులోని రచయిత రైతు పక్షాన నిలబడి సెజ్‌లకు వ్యతిరేకంగా ఉద్యమించాలని చెప్పేవారిని ప్రశ్నించే క్రమం కనిపిస్తుంది. భూమియే ఉంచుకొమ్మని ఈ విద్యావంతులు, మేధావులు మమ్మల్ని ఎందుకు బలవంతపెడుతున్నారు? వాళ్లు భూమి దున్నుకుని ఎందుకు బతకడంలేదు? మేము భూమి వదిలేసి ఇతర వృత్తులు ఎందుకు చేపట్టకూడదు? అనే ప్రశ్నలు ‘సెజ్’ కథ ద్వారా రైతు ఫీలౌతున్నట్టుగా అన్పిస్తుంది.
తుమ్మేటికి పదెకరాలు ఉన్నప్పటికీ బొగ్గుబాయిలో ముప్పై ఏళ్లక్రితమే కార్మికుడిగా దిగినవాడు. అతని జీవితం ఇచ్చిన అనుభవాలే కథలోని రైతుకు అన్వయించి కొత్త ఉపాధికి రైతు వెళ్లడాన్ని చిత్రించాడు. బొగ్గుబాయిల్లోనే కాదు, అరబ్బు దేశాల కెళ్లేవాళ్లు వేలాదిమంది ఇలాంటి వాళ్లే.. వ్యవసాయం అనే వృత్తి నుండి సగానికి పైగా జనాభా ఇతర వృత్తుల్లోకి, ఆధునిక విద్య, అభివృద్ధి నైపుణ్యాల్లోకి మారాల్సిన అవసరం వున్నది. అలా, ఎవరూ చెప్పినా చెప్పకపోయినా వ్యవసాయంలోని అగ్రకులాలు వందేళ్లుగా మారుతూనే వస్తున్నారు. ముప్పైయేళ్ల క్రితం బొగ్గుబాయిల్లోకి వెళ్లారు. పాతికేళ్ల క్రితం అరబ్బు దేశాలకు బయలుదేరారు.
కొంతమంది కిరాణ షాపులు, ఆటోలు, జీపులు, సెల్‌ఫోన్ సెంటర్లు, జిరాక్స్‌లు, హోటళ్లు వగైరా పెట్టుకుని బతుకుతున్నారు. అందుకు పెట్టుబడి అవసరమైతే ఇలాగే భూములు అమ్ముకుంటున్నారు. అందువల్ల, రైతు భూమి వెంటే అంటిపెట్టుకుని వుండాలని చెప్పే ఆలోచన ఒక సిద్ధాంతంగా రుద్దాల్సిన అవసరం లేదు. ఇవాళ రైతులు వ్యవసాయం చేయడంలేదు. చేయిస్తున్నారు. ట్రాక్టర్లద్వారా, కరెంటు ద్వారా, కూలీలద్వారా, పంటకోత మిషన్లద్వారా వ్యవసాయం చేయిస్తున్నారు. ఇందులో కూలీలకు ఐదు నెలల పంటలో ఇరవై, ఇరవై ఐదు రోజులు మాత్రమే కూలి దొరుకుతున్నది. ఐదు నెలల పంట వ్యవసాయం చేయించుకుంటున్నవాళ్ల పాలు. అందుకోసం కూలీలు కావాలి. అయితే, అయిదు నెలల్లో ఇరవై అయిదు రోజుల కూలే లభిస్తున్నది.
మిగతా రోజులు ఎలా బతకాలి? అని ఈ వ్యవసాయం చేయించేవాళ్లకు అక్కరలేనిదైపోయింది. ఇలాంటి వ్యవసాయ కూలీలు, సన్నకారు రైతులు చదువుకుని విభిన్నరంగాల్లో ఉన్నతంగా ఎదగడానికి ఉచిత ఉన్నత విద్య, ఉచిత హాస్టళ్లు అవసరమని వాళ్లు కోరుకుంటారు. కానీ, వ్యవసాయంలోనే ఉండిపోవాలని కోర డం మంచిది కాదు. చదువుకుని ఆధునిక సమాజంలో ఎదిగే అవకాశాలను వారికి తెలపాలి, అందజేయాలి. ఆ పని అంబేడ్కర్ చేశారు. అలా, వ్యవసాయ కూలీల నుండి దళితులు అంచెలంచెలుగా ఎదుగుతూ వస్తున్నారు. పాలేర్లు ఐఎఎస్ ఆఫీసర్లు అయ్యారు. బోయి భీమన్న రాసిన ‘పాలేరు’ నాటకం చూసి ఎంతోమంది అలా ఎదిగారు. అలా ప్రజల గురించి, పేదల గురించి ఉదాత్తంగా, ఉన్నతంగా ఆలోచించాల్సిన అవసరముంది.
కొత్తపల్లి రవిబాబు, సుంకోజి దేవేంద్రాచారి, గీతాంజలి తదితరులు తాము ఇతర వృత్తుల మీద ఆధారపడుతూ రైతులు ఇతర వృత్తుల్లోకి వెళ్లడాన్ని వ్యతిరేకించడం సరైంది కాదు. సరిగ్గా ఇలాంటివాళ్లనే తీవ్రంగా ఖండిస్తూ ఈ కథ రాయబడింది. ఇలాంటివాళ్లు బతికే తీరు వేరు, ఇతరులు బతకాలని చెప్పే తీరు వేరు. తమ లాగా భూములు అమ్ముకుని, లేదా చదువుకుని లెక్చరుర్లు కావాలని చెప్పరు. భూమి దున్నుకుని బతుకుమని మాత్రమే చెప్తారు. వాళ్లు, ఆకలికి, అప్పులకు ఆత్మహత్యలు చేసుకుంటే మళ్లీ అన్యాయం, అక్రమం అని ఖండిస్తారు. వీళ్ల జీవితం వేరు. వాళ్ల జీవితానికి, వాళ్లు చెప్పే సిద్ధాంతాలకు సంబంధం లేదు. ఇతరులకు ఒకటి చెప్తారు, తాము వేరే ఆచరిస్తారు.
ఉన్నచోటనే ఉండాలని, అలాగే బతకాలని కోరే తత్వాన్ని సిద్ధాంతాల పేరిట ఇలాంటివాళ్లు సమర్థించడాన్ని, రుద్దడాన్ని రఘోత్తమరెడ్డి తన జీవితం ద్వారా, కథలోని రైతు ఆలోచన ద్వారా ప్రశ్నించి వ్యతిరేకించాడు. సెజ్‌లను వ్యతిరేకించవలసిందే. అయితే, రైతులు కోరుకుంటున్న నూతన జీవితాన్ని కూడా ఆహ్వానించవలసిందే. ఇవి రెండూ పరస్పర విరుద్ధమైనవి కావు. సెజ్‌ల్లో భూములు కోల్పోయినవారికి రియల్ ఎస్టేట్‌లో లాగా 25 నుండి 40 శాతం దాకా ఓనరు వాటాగా కూడా అందించే కృషి చేయవచ్చు. పూనా పరిసరాల్లో ఇలాంటి ప్రయోగాలు విజయవంతమయ్యాయి. ఆయా స్థలాల ననుసరించి, సందర్భాల ననుసరించి పరిష్కారాలు, అభిప్రాయాలు మారుతుంటాయి. అనుభవాలే జీవితానికి గీటురాయి. ఆ మాటనే ఈ కథ నిర్ద్వందంగా స్పష్టం చేసింది. అందుకు రచయితను అభినందిస్తున్నాను.
- బి.ఎస్.రాములు