Feed on
Posts
Comments

- కె. శ్రీనివాస్‌

062609_aj.jpgభాష అంటే అది మాట్లాడే ప్రజలూ, వారి సంస్క­ృతీ, చరిత్రా. అవన్నీ ధ్వంసమయ్యాక, భాష ఒక్కటే బతికి బట్టకట్టడం సాధ్యం కాదు. విదేశీవస్తుబహిష్కరణ, సహాయనిరాకరణ- వంటి విలువలు కలిగిన జాతీయోద్యమాన్ని చరిత్ర చెత్తకుండీలోకి తోసేసిన తరువాత- ప్రపంచీకరణలోనే పరమస్వేచ్ఛ కనిపిస్తుంది…. ఎగుమతికి కావలసిన సరుకులు ఉత్పత్తి చేసే సెజ్‌లు, పార్కులు, విదేశాలకు కావలసిన పంటలు పండిచే వ్యవసాయం, ప్రపంచ వైట్‌కాలర్‌ కార్మికులుగా పనిచేయడానికి తీర్చిదిద్దే విద్య- ఇదీ నేటి దృశ్యం. ఈ చిత్రపటంలో ప్రజలు అస్వతంత్రులు. వారి నోట ఇతరుల భాషే చిలకపలుకుల్లాగా పలుకుతుంది.

గుణాఢ్యుడు తాను విన్న లక్షలాది కథలను ప్రజల భాషలో రాసి అంకితమివ్వడానికి వెడితే శాతవాహనరాజు తిరస్కారం చూపాడు. పిశాచభాషలో రాసిన కథలకు గౌరవమేమిటని ఈసడించాడు. అవమానభారంతో గుణాఢ్యుడు తాను రాసిన కథల తాళపత్రాలను అగ్నికి ఆహుతి చేశాడు. ఆరు అధ్యాయాలు అగ్గిపాలు కాగా, ఒకే ఒక్కటి బృహత్కథగా మిగిలింది. సంస్కృతంలో కథా సరిత్సాగరమైంది. ప్రజల భాష ఎప్పుడూ పిశాచమే. అదేమిటో ప్రపంచంలో ఏ మతమైనా తనను తాను ప్రచారం చేసుకోవడానికి జనంభాషను ఆశ్రయిస్తే, భారతదేశంలో వైదిక మతం మాత్రం ఎందువల్లనో ధర్మాన్ని రహస్యంగా ఉంచడానికి ప్రయత్నించింది. గౌతమబుద్ధుడు ఒక్కముక్క సంస్క­ృతం మాట్లాడినట్టు మనకు తెలియదు. వర్థమాన మహావీరుడూ అంతే. పాళీ భాషలో వారి బోధనలు వాయువేగంతో దేశమంతా విస్తరించాయి. అయినప్పటికీ, వేదాలను, భారత భాగవతాలను దేశభాషలలో రాయొద్దన్న ఆంక్షలు కొనసాగుతూనే వచ్చాయి.

‘జగద్ధితం’ కోసమైనా వాటిని తెలుగు చేయడానికి నన్నయాదులకు వందలాది ఏళ్లు పట్టింది. తెలుగురాజులు పాలించినంత కాలం భాషకు కొంత గౌరవం దక్కిందేమో కానీ, పరభాషీయులు పాలించినప్పుడు సంస్క­ృతమో పారశీకమో ఆ తరువాతి కాలంలో ఉర్దూయో ఇంగ్లీషో ఏలిక భాషలయ్యాయి. ‘మోదకేస్తాడయ’ అని సంస్క­ృతంలో సరసమాడితే అర్థం కాని మొగుణ్ణి చూసి రాణీగారే వెక్కిరించిన కాలం ఒకనాటిదైతే, ‘తెలంగీ బేఢంగీ’ అని ఈసడించిన కాలం మరొకటి. సామ్రాజ్యాల కాలంలో తెలుగు జీవనంలోని సృజన మలిపూత పూస్తున్న కాలంలో ‘దేశభాషలందు తెలుగులెస్స’ అంటూ వల్లభరాయడో శ్రీకృష్ణరాయలో కితాబులిచ్చారు. ప్రబంధాలు పెరిగి, పదాలు కీర్తనలు జావళీల్లో మాధుర్యం పొంగిపొరలిన కాలంలో ఎంతో పుణ్యం ఉంటే కానీ ‘ఆంధ్రత్వమాంధ్రభాషాచ’ ప్రాప్తించవని అప్పయ్యదీక్షితులు వంటి తెలుగేతరుడు తన్మయపడ్డాడు.

ఇంగ్లీషు విద్య వచ్చి, ఆంగ్లమానసపుత్రులను తయారుచేసే బృహత్కార్యక్రమం ఆరంభమయ్యాక తెలుగు ‘టెలుగూ’ అయిపోయినా ఆంధ్రాభిమానం మాత్రం పెరుగుతూ వచ్చింది, పొరుగువాడి దాష్టీకానికి వ్యతిరేకంగానైతేనేమి, ఫ్యూడల్‌ నిరంకుశపాలనకు నిరసనగానైతేనేమి తెలుగు భాష ఒక ఉద్యమ సాధనమైంది. ఉద్యోగాల కోసం ఉర్దూ నేర్చుకోవలసిరావడాన్ని నైజాములో అవమానంగా భావిస్తే, ఇంగ్లీషు విద్య గుమస్తాలను తయారుచేసేందుకు తప్ప పనికిరాదని బ్రిటిషాంధ్రలోనూ కించపడ్డారు. ఈ రెండు ప్రాంతాలనూ అటూ ఇటూగా తెలుగు పరిస్థితి ఒకటే. అయినా సరే భాష ప్రాతిపదికగా ప్రాంతాలు కలిసే ఉండాలని వాదిస్తుంటాము. తెలుగు కోసం తపించి, ఉద్యమాలు చేసి, రాష్ట్రాలను సాధించి, రాజ్యాలను కూలదోసి- చివరకు తెలుగువాడు స్వచ్ఛందంగా తాను నిలుచున్న కొమ్మను తానే నరుక్కుంటున్నాడు. ఇంగ్లీషువాడు కనీసం ఆంగ్లో వెర్నాక్యులర్‌ స్కూళ్లనన్నా పెట్టాడు. నిజాం ప్రభువు మిడిల్‌ స్కూల్‌ వరకైనా తెలుగును అనుమతించాడు. ఇప్పుడు ప్రభువులే కాదు, పాలితులు కూడా తల్లిఒడినుంచే మాతృభాషను తన్నిపారేస్తున్నారు.

ఉగ్గుపాలతోనే ఎబిసిడిలను బోధించే, అడుగులు రాకముందే ఐఐటికోచింగ్‌ ఇచ్చే విద్యావిధానాన్ని మెకాలే సైతం ఊహించలేకపోయాడు. ఘనతవహించిన మాతృభాషలు గుమస్తా ఉద్యోగాలు కూడా ఇవ్వలేకపోతున్నాయని సాక్షాత్తూ సుప్రీంకోర్టే వ్యాఖ్యానిస్తున్నది. ఇంగ్లీషు చదువు ఉపాధినిస్తున్నప్పుడు, తల్లిదండ్రులు చదివిస్తున్నప్పుడు ప్రభుత్వానికేమి నొప్పి అని ప్రశ్నిస్తున్నది. ఇందులో మారిన కాలమూ చెదిరిన విలువలూ ప్రతిఫలిస్తున్నాయి తప్ప కోర్టు వ్యాఖ్యలకు నొచ్చుకోవలసినది ఏమీ లేదు. భాష అంటే అది మాట్లాడే ప్రజలూ, వారి సంస్క­ృతీ, చరిత్రా. అవన్నీ ధ్వంసమయ్యాక, భాష ఒక్కటే బతికి బట్టకట్టడం సాధ్యం కాదు. విదేశీవస్తుబహిష్కరణ, సహాయనిరాకరణ- వంటి విలువలు కలిగిన జాతీయోద్యమాన్ని చరిత్ర చెత్తకుండీలోకి తోసేసిన తరువాత- ప్రపంచీకరణలోనే పరమస్వేచ్ఛ కనిపిస్తుంది. బ్రిటిష్‌ సామ్రాజ్యవాదులు దేశంలోకి కన్నంవేసి ప్రవేశిస్తే వారిని నిష్క్రమింపజేశాము.

ఇప్పుడు దొంగలకోసం తలుపులు బార్లా తెరవాలని కోరే దేశభక్తులు పెరిగిపోయారు. అమెరికా విషయంలో ఎప్పుడూ ‘నో’ చెప్పడమే కాదు, ‘ఎస్‌’ అనడమూ నేర్చుకోవాలని ఉద్బోధించే జాతీయవాదులు తయారయ్యారు. విదేశాలకు వనరులు తరలించడం, సరుకులు తెచ్చుకోవడం- ఒక ఆర్థికవిధానంగా ఆమోదించాక- మానవవనరులూ తరలిపోవడం మొదలైంది. ప్రపంచమార్కెట్‌తో అనుసంధానమే పవిత్ర కర్తవ్యమైనప్పుడు ఇంగ్లీషుకు మించిన అనుసంధానభాష మరేముంటుంది? ఇంగ్లీషులో డాలర్‌గలగలలు వినిపిస్తున్నప్పుడు- తెలుగులో సత్తునాణేలచప్పుడే మిగులుతుంది. గోమాతను పవిత్రంగా పరిగణించే జాతీయవాదులు చూస్తుండగానే భారతీయ గోసంతతి సంకరమై పోయింది. రైతు గర్వంగా పండించిన వంగడాలన్నీ కాలగర్భంలో కలసిపోయి హైబ్రీడ్‌, బిటి విత్తనాలు మార్కెట్‌లో నిండిపోయాయి. ప్రకృతి ప్రసాదించే నీరు ఇప్పుడు వికృత మార్కెట్‌ సరుకైపోయింది.

చివరకు భూమాత కూడా ఎవరి చెరలోకో వెళ్లబోతోంది. బ్యాంకులు, ఫ్యాక్టరీలు, విద్యాలయాలు- ఒకనాడు దేశం గర్వపడిన సంస్థలన్నీ పరాయిచేతుల్లోకి వెళ్లడమో, అంతరించిపోవడమో జరిగింది. ఎగుమతికి కావలసిన సరుకులు ఉత్పత్తి చేసే సెజ్‌లు, పార్కులు, విదేశాలకు కావలసిన పంటలు పండిచే వ్యవసాయం, ప్రపంచ వైట్‌కాలర్‌ కార్మికులుగా పనిచేయడానికి తీర్చిదిద్దే విద్య- ఇదీ నేటి దృశ్యం. ఈ చిత్రపటంలో ప్రజలు అస్వతంత్రులు. వారి నోట ఇతరుల భాషే చిలకపలుకుల్లాగా పలుకుతుంది.

భాషను రక్షించుకోవడం అంటే అదేదో అమాయకభాషాభిమానుల కాలక్షేపం కాదు. భాషను కాపాడాలంటే దాన్ని మాట్లాడే ప్రజలను కాపాడుకోవలసిందే. ఆత్మను అమ్ముకునేవారికి తల్లిభాషపై మమకారం ఉంటుందని ఆశించడం తప్పు. భాషీయుల సమగ్ర అభివృద్ధి కోసం తపించేవారు, తమ ప్రత్యేకతలను నిలుపుకుంటారు, పోషించుకుంటారు, సమైక్యంగా ఉండడానికి భాషనొక సాధనం చేసుకుని బేరమాడే శక్తి పెంచుకుంటారు. మాతృభూమిని ప్రేమించినప్పుడే మాతృభాషనూ రక్షించుకోగలుగుతాము.

(26 జూన్ 2009, ఆంధ్రజ్యోతి సంపాదకీయం సౌజన్యంతోటి)

Leave a Reply

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

Managed by Discover Telangana Inc., a registered nonprofit organization in USA.

All opinions and views expressed by third party content providers and shown here as preview are not that of Discover Telangana.

If you find any Content that is infringing, libelous, defamatory, obscene, abusive, offensive or otherwise violation of copyright law, alert us by emailing us at discover.telangana(at)gmail.com