- వెల్దండి శ్రీధర్
తెలంగాణ సామాజిక పరిణామాలు, జీవన విధానంపై తెలంగాణ కథకులు ‘ఏం చెప్పిండ్రు? ఏం చెప్పలేదు? ఎందుకు చెప్పలేదు?’ అన్న అంశంమీద మాట-ముచ్చట ఆగస్టు 9న హైదరాబాద్‌లో తెలంగాణ రచయితల వేదిక ఆధ్వర్యంలో జరిగింది.
ప్రారంభ సమావేశానికి అధ్యక్షత వహించిన తెరవే అధ్యక్షులు జూకంటి జగన్నాథం మాట్లాడుతూ తెలంగాణ సాహిత్యమంటే జన జీవన చిత్రణ కూడా అంటూ 1990 తర్వాత ఆడెపు లక్ష్మీపతి నుంచి పెద్దింటి అశోక్ దాకా అనేకులు గ్రామ విధ్వంస ముఖచిత్రాన్ని, వలసలను, ప్రపంచీకరణను వస్తువులుగా స్వీకరించి కథలు రాశారు. అయినా మన చుట్టూ వేగంగా జరుగుతున్న మార్పులను కథకులు అందుకోలేకపోయారు. ఈ నేపథ్యంలోనే ఈ మాట-ముచ్చట అంటూ వివరించారు.
‘తెలంగాణ-సామాజిక పరిణామాలు’ అంశంపై ఘంటా చక్రపాణి మాట్లాడుతూ నైజాం రాష్ట్రంలో ఒక్క పీడన మాత్రమే ఉండేది కానీ ఉమ్మడి రాష్ట్రంలో అనేక సజీవ గాయాలున్నాయి. గత ఇరవై ఏళ్లుగా ఆ పాత గాయాలకు తోడు ప్రపంచీకరణ మరిన్ని కొత్త గాయాలను చేర్చిందని అన్నారు. ప్రపంచీకరణ అనేక రూపాలలో మన జీవితాల్లోకి చొచ్చుకుని వచ్చేసింది. దీంతో భూమే కాదు మనుషులు కూడా వ్యాపార వస్తువులుగా మారిపోయారని అన్నారు.
హైదరాబాద్‌ను ఆనుకుని ఉన్న ఐదారు జిల్లాల్ని సెజ్‌ల రూపంలో ఆక్రమిస్తున్నారని ఈ సెజ్‌లు, సహకార వ్యవసాయ విధానం ఇవన్నీ తెలంగాణ ప్రాంతంలో ఒక కొత్త కార్పొరేట్ భూస్వామ్య వ్యవస్థకు పునాదులని వివరించారు. కథకులు మన చుట్టూ జరుగుతోన్న విశ్వంసాన్ని, సెజ్‌లను అక్కడి రైతుల, ప్రజల సంక్షోభాలను కథలుగా మలచాలని సూచించారు. సామాజిక స్పృహ, వర్గ స్పృహ, సాంస్కృతిక స్పృహతో కథలు రాయాలని అన్నారు.
తెలంగాణ ప్రాంత ప్రజల దయనీయ స్థితిని చెప్తూనే పరిష్కారం కూడా చూపాలని లేకపోతే వట్టి వలపోతగానే మిగులుతుందని అన్నారు. రెక్కలను నమ్ముకుని జీవించే తెలంగాణ ప్రజల రెక్కలను కత్తిరించే కుట్ర అంతర్లీనంగా జరుగుతోందని దీన్ని కథకులు సామాన్యులకు అర్థమయ్యే విధంగా వివరించాలని అన్నారు.
‘తెలంగాణ కథ నాడు-నేడు’ అంశంపై ముదిగంటి సుజాతారెడ్డి మాట్లాడుతూ తెలుగు కథ ఎప్పుడు పుట్టిందో అంతకంటే ముందుగానే తెలంగాణ కథ పుట్టిందన్నారు. సమకాలీన సమాజాన్ని తెలంగాణ కథ ఎప్పటికప్పుడు చిత్రిస్తూనే ఉందన్నారు. తెలంగాణ కథలు ఎక్కువగా ప్రచారం కాకపోవడానికి అనువాదాలు జరక్కపోవడమే కారణం కాదని, వాటిపైన ఆంగ్లంలో వ్యాసాలు, సమీక్షలు చేయాలని సూచించారు.
ఇతర ఏ భాషలో రానటువంటి కథలు తెలంగాణలో వచ్చాయని ఆమె అన్నారు. ‘తెలంగాణ-విధ్వంస ముఖచిత్రం’ అంశంపై కె.శ్రీనివాస్ మాట్లాడుతూ తెలంగాణ ముఖచిత్రం నిజంగానే విధ్వంసంగానే ఉందన్నారు. తొలి వలస పాలన అంటే బ్రిటీష్ వారి పాలనలో వనరుల దోపిడీ నుంచి తప్పించుకున్న ఏకైక ప్రాంతం తెలంగాణ. కానీ మలి వలస పాలన అంటే ఆంధ్ర నాయకుల పాలనలో ఈ వనరుల దోపిడీని అడ్డుకోలేకపోయామని, 2001 తర్వాత ఈ విధ్వంసం అధికమైందని అన్నారు. ఆది నుంచీ తెలంగాణలో మధ్యతరగతి లేదు, అందుకే ఈ ప్రాంతం నుండి ఉద్యమ కథలు, విధ్వంస కథలు మాత్రమే వచ్చాయి.
అయితే మధ్య తరగతి కథలు కూడా రావాలని అన్నారు. మధ్య తరగతి కథ వివిధ మానవ విలువలకు వేదిక అవుతుందని సూచించారు. అందుకే ఒక మల్లాది వెంకటకృష్ణమూర్తి, ఒక యండమూరి తెలంగాణకు అవసరమేనన్నారు. సెజ్‌ల ద్వారా, సహకార వ్యవసాయం ద్వారా ఒకసారి భూమి నుంచి మనిషి దూరమైన తర్వాత ఇక స్థానిక వనరుల గురించి ఎవరూ మాట్లాడేవారుండరు.
అందుకే మధ్యతరగతి కథలతోపాటు ఇక్కడ జరుగుతున్న అట్టడుగు విధ్వంసాన్ని కథలుగా మలచాలని అన్నారు. ‘తెలంగాణ ఉద్యమం-తీరుతెన్నులు’ అంశంపై అల్లం నారాయణ మాట్లాడుతూ 1969 తెలంగాణ ఉద్యమం నిస్వార్థంగా వనరుల దోపిడీని భరించలేక వచ్చిన విద్యార్థుల ఉద్యమమని అన్నారు. అది నిర్వీర్యమైన తర్వాత కూడా తెలంగాణ సమస్య అపరిష్కృతంగానే ఉంది. తర్వాత నక్సల్బరీ ఉద్యమం తెలంగాణను చేపట్టింది.
తెలంగాణవాదం ముందుకు వచ్చిన ప్రతిసారి ఒక గందరగోళ పరిస్థితి ఏర్పడుతుంది. దీని వెనక ఒక బలమైన కుట్ర ఉంది. తెలంగాణలో విధ్వంసం ఎప్పుడూ ఆగలేదు. సరళీకరణ విధానాలు, సంస్కరణలు వచ్చిన ప్రతిసారి తెలంగాణ ఒక ప్రయోగశాలగా మారింది. కారణం ఇక్కడి వనరులే. వాటిమీద ఆధిపత్యం కోసమే. ప్రపంచబ్యాంకు కుట్రలో భాగంగా రాబోవు రోజుల్లో ఊర్లన్నీ ధ్వంసం కాబోతున్నాయి. దీని వెనక ఒక ప్రణాళిక ఉంది. దాన్ని రచయితలు లోతుగా అర్థం చేసుకోవాలి. ప్రజలకు వివరించాలి. తెలంగాణపట్ల రాజకీయ నిర్లక్ష్యాన్ని కూడా వివరించాలని అన్నారు.
రెండవ సెషన్‌లో తెలంగాణ అన్ని జిల్లాల నుంచి వచ్చిన కథకులు ఇప్పటిదాకా తాము రాసిన కథలలో ‘ఏం చెప్పిన? ఏం చెప్పలేదు? ఎందుకు చెప్పలేదు?’ అనే కోణంలో మాట- ముచ్చట జరిగింది. దీనికి అధ్యక్షత వహించిన అల్లం రాజయ్య మాట్లాడుతూ ఉద్యమం, ప్రజలే తనను కథకునిగా మార్చాయని చెప్పారు. తాను రాసిన కథల గురించి వివరించారు. 2000 సంవత్సరం నుండి తాను రాయకపోవడానికి కారణం తాను ప్రధానంగా స్లో రైటర్ని కావడమేనన్నారు. ఒక్కో కథ రాయడానికి 15 ఏళ్లు తీసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయన్నారు. గత 40 ఏళ్లుగా జరిగిన మార్పుల గురించి అర్థం చేసుకోవాల్సింది చాలా వుందని, మనుషులు, పరిస్థితులు మునుపటివి కావని తెలంగాణలో దళారీ వ్యవస్థ నేడు ఎక్కువైందని అన్నారు.
లాటిన్ అమెరికా, జర్మనీ, ఫ్రెంచ్ దేశాలలో కథలు ఎలా రాయాలో కథలకు సంబంధించిన ‘గ్రామర్’ ఉంటుందనీ, తెలుగులో లేదని అన్నారు. కాళీపట్నం వేసిన ‘కథాకథనం’ ఆ లోటును కొంత తీర్చిందని అన్నారు. తెలంగాణలోని నవ కథకులకు జీవితం ఉంది, సంక్షోభం ఉంది, అయితే దాన్ని కథగా మలచడంలో ఇబ్బంది ఉందని, దీన్ని నివారించడానికి కథకులకు శిక్షణ ఇవ్వాలని, రచయితల సంఘాలు ఆ దిశగా ప్రయత్నం చేయాలని సూచించారు.
కాలువ మల్లయ్య, జూకంటి జగన్నాథం, పెద్దింటి అశోక్‌కుమార్ తాము ఏం రాసిందీ, ఏం రాయనిదీ వివరించారు. కార్యక్రమంలో జయధీర్ తిరుమలరావు, ద్వానాశాస్త్రి, అందెశ్రీ, కె.ముత్యం, ఐతా చంద్రయ్య, జూపాక సుభద్ర, శ్రీధర్ దేశ్‌పాండె, జ్వలిత, తాయమ్మ కరుణ, జాతశ్రీ, ఆడెపు లక్ష్మీపతి తదితరులు పాల్గొన్నారు.
(24 ఆగస్ట్ 2009, ఆంధ్రజ్యోతి వివిధ సౌజన్యంతోటి)