నేటి నుంచి జిల్లా వ్యాప్తంగా బతుకమ్మ సంబరాలు మొదలు కానున్నాయి. పల్లెలు, పట్టణాల్లో ప్రతి ఇంటి లోగిలీ ఓ పూలతోటగా పరిమళించనుంది. ప్రతి యేటా మహాలయ అమావాస్య మొదలు మహర్నవమి వరకు తొమ్మిది రోజుల పాటు బతుకమ్మ ఉత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతాయి. ఆప్యాయతానురాగాలకు తోడుగా ఆధ్యాత్మికతను రంగరించే ఈ రంగుల పండుగ ప్రతి ఇంట్లో సంతోషాల పూలు పూయిస్తుంది.. ఇక ఈ తొమ్మిది రోజులూ జిల్లాలోని పట్టణాలు, పల్లెలన్నీ వీనుల విందైన బతుకమ్మ పాటలతో మారుమోగనున్నాయి.
తెలంగాణ ప్రాంత ప్రజలకు బతుకమ్మ పండుగ అత్యంత ప్రీతి పాత్రమైనది. తెలంగాణ ప్రాంతం కరువు కాటకాలు, ప్రకృతి బీభత్సాలు, ఆకలి చావులతో తల్లడిల్లుతున్న తరుణంలో ప్రజలు బతుకమ్మను సృష్టించి, తమను చల్లగా కాపాడాలని వేడుకున్నారనీ, కాలక్రమేణా అది సంప్రదాయంగా మారినట్లు తెలుస్తోంది. బతుకమ్మ పండుగ వచ్చిందంటే ఆడపడుచులంతా అత్తవారి ఇళ్ల నుంచి పుట్టిళ్లకు చేరుతారు. అందరూ ఒక చోట చేరి, చిన్ననాటి జ్ఞాపకాలు నెమరేసుకుంటారు. కష్టసుఖాలను పంచుకుంటారు. కొత్త చీరలు, నగలు ధరించి, రంగురంగు పూలతో బతుకమ్మలను అలంకరించి, ఆడిపాడుతారు.
చోళ దేశాన్ని ధర్మాంగుడనే రాజు పరిపాలిస్తుండేవాడు. అతని భార్య సత్యవతి. వారికి నూరు మంది సంతానం. అందరూ శత్రువుల చేతుల్లో మరణిస్తారు. ధనం, రాజ్యం, పుత్ర సంపద అంతా పోతుంది. ఆ దంపతులు దుఃఖ సాగరంలో మునిగిపోయారు. సత్యవతి లక్ష్మీదేవిని గూర్చి తపస్సు చేసింది. ఆ తల్లి ప్రత్యక్షమై వరం కోరుకోమంది. అందుకు సత్యవతి, లక్ష్మిని ఆమె గర్భంలో చేరి, జన్మించమని కోరింది. శ్రీ లక్ష్మి అలాగే చేసి, జన్మించింది. మునులు, కవులు, గాయకులు వచ్చి ఆ పాపను చూసి ‘బతుకమ్మ’ అని పిలిచారు. ఆ పాపకు తల్లి దండ్రులు ఆ పేరే ఖాయం చేశారు. శ్రీ మహా విష్ణువు చక్రాంకుడనే పేర జన్మనెత్తి ఆ ఇంటికి ఇల్లరికం వచ్చాడు. అతన్ని బతుకమ్మ పెళ్లి చేసుకోగా.. ఆరువేల మంది సుందరాంగులు జన్మించారు.
- శ్రీలక్ష్మినీ మహిమలూ గౌరమ్మ… చిత్రమై పోదురమ్మా గౌరమ్మా…
- ఒక్కేసి పువ్వేసి చందమామ… ఒక్క జాము ఆయె చందమామ.. అంటూ పాడే పాటలు.
- నేనెరుగ నేనెరుగ ఉయ్యాలో… నీభర్త నడుగు ఉయ్యాలో…
- రామరామ ఉయ్యాలో… రామనే శ్రీరామ ఉయ్యాలో… అయ్యయ్యో రామా ఉయ్యాలో… హరిజ బ్రహ్మదేవ ఉయ్యాలో…
- కస్తూరిక డవల్ల చందమామ… కృష్ణుడు ఎదురాయె చందమామ..
ఇలా బతుకమ్మ పాటల గురించి చెప్పుకుంటూ పోతే తెలంగాణ బతుకుచిత్రం కళ్ల ముందు కదలాడుతుంది. తెలంగాణ పల్లెల్లో బతుకమ్మలు పేర్చేందుకు రకరకాల పూలు వాడుతారు. వీటిలో గునుగు పూలు, పట్టుకుచ్చుపూలు, కట్ల పూలు, గుమ్మడి పూలు, రుద్రాక్ష పూలు, మందారపూలు, సీతజడపూలు, గోరింట పూలు, ఉద్రాశ పూలు ముఖ్యమైనవి.
బతుకమ్మ పండుగ మొదలైన తొమ్మిదో రోజున సద్దుల (పెద్ద) బతుకమ్మను ఘనంగా నిర్వహిస్తారు. బతుకమ్మలను పెద్దగా, అందంగా పేర్చడంలో మహిళలు పోటీపడుతుం టారు. రకరకాల పూలతో వాటిని అలంకరిస్తారు. తర్వాత గ్రామ, పట్టణ చావళ్లలో వాటిని ఉంచి, మహిళంతా వాటి చుట్టూ చప్పట్లు కొడుతూ పాటలు పాడుతూ తిరుగుతారు. బతుకమ్మ పాటల్లో దుర్గ, గౌరి, లక్ష్మి, ఆదిపరాశక్తిలాంటి దేవతలందరినీ కీర్తించడం కనిపిస్తుంది. ఈ సందర్భంగా పాడే బతుకమ్మ పాటల్లో దుర్గ, గౌరి, లక్ష్మి, ఆదిపరాశక్తిలాంటి దేవతలందరినీ కీర్తించడం కనిపిస్తుంది.
సద్దుల బతుకమ్మ రోజు రకరకాల పిండి వంటలు తయారు చేస్తారు. వీటిల్లో సత్తు పిండి ప్రత్యేకతే వేరు. పల్లి, నువ్వులు, మొక్కజొన్నలు, వరిబియ్యం, బెల్లం, చక్కెరలతో దీనిని రకరకాలుగా తయారు చేస్తారు. వీటిని సద్ది మూటలుగా కట్టుకుని, బతుకమ్మ ఆటలు పూర్తయ్యాక, అందరూ కలిసి ‘కొత్తసిబ్బి.. పాత సిబ్బి..’ అని పాడుతూ పంచుకుని తింటారు. అనంతరం బతుకమ్మలను చెరువులు, వాగుల్లో నిమజ్జనం చేస్తారు.