- వారాల ఆనంద్
సినిమా నిశ్చలమైంది కాదు. అది ఓ కదులుతున్న ప్రపంచం- ఓ విశిష్టమైన దృశ్య మాధ్యమం. సినిమా ద్వారా మనం ప్రేక్షకులకు కథ చెప్పం, చూపిస్తాం. ఆ చూడడంలోనే ప్రేక్షకులకు ఆ సినిమా కథ పట్ల ఆసక్తి కలగాలి. వారందులో మమేకం కావాలి. ఆ సినిమాలోని ఇతివృత్తం పట్ల పాత్రల పట్ల ప్రేక్షకుల్లో ఇష్టం, కోపం, ద్వేషం ఇలా అనేక భావాలు కలగాలి. అప్పుడే ఆ సినిమా ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది. వారు ఆ సినిమాను ఆదరిస్తారు.
సినిమాకు మూలాంశమైనది కథ. కథకుడు కథ రాసినప్పుడు పాఠకున్ని దృష్టిలో పెట్టుకుని రాస్తాడు. కాని అదే కథకు దృశ్యమాధ్యమంలో సినిమాగానో, టీవీ ఎపిసోడ్‌గానో, షార్ట్ ఫిలింగానో నిర్మించాల్సి వచ్చినప్పుడు ఆ కథను దృశ్యరూపం లో రాసుకోవాలి. కథలో ఉండే మాధుర్యము, దృశ్యభావన, పాత్రల ప్రవర్తన, వ్యక్తిత్వాలు, భాషా లాంటి అనేక అంశాలు స్క్రిప్ట్ రచనలోనూ సినిమా నిర్మాణంలోనూ ప్రధాన భూమిక ను పోషించాలి.
ఆ చిత్రాల్లో ఆయా కథాంశాలకు చెందిన ప్రాంతీయ పరిమళాలు వెల్లివిరియాలి. కాని ఇవాళ సినిమా అనగానే పెద్ద స్టార్లు, పెద్ద నిర్మాతలు, కోట్ల పెట్టుబడులు, నిర్మాణ సంస్థలు మన కళ్ళముందు ప్రత్యక్షమవుతాయి.
భీకరమైన ఫైట్లూ, ఫారిన్‌లో పాటలు, గ్రాఫిక్స్ ఇలా మన సినిమాకు ఓ నిర్మాణ సూత్రం అప్రకటితంగానే స్థిరపడిపోయింది. దేశ వ్యాప్తంగా ఇలాంటి సినిమాలు రూపొందించేందుకు, నటించేందుకు, ప్రదర్శించేందుకు కొంతమంది నిర్మాతలు, దర్శకులు, నిర్మాణ సంస్థలు, గ్రూపులు గుత్తాధిప త్యం చెలాయిస్తూ స్థిరపడిపోయాయి. అదంతా ఓ దుర్భేద్యమై న కోట. సినీ రంగాన్ని అది పూర్తిగా నియంత్రిస్తుంది.
వ్యాపారపరంగా కొన్ని విజయాలు, మరెన్నో అపజయాలు మూట గట్టుకుని ప్రధాన స్రవంతి సినిమా కొనసాగుతూనే ఉంది. ఈ ప్రధాన స్రవంతి సినిమాకు సమాంతరంగా మరో సిని మా ‘భారతీయ స్వతంత్ర సినిమా’ (ఇండియన్ ఇండిపెండెంట్ సినిమా) పాదులు వేస్తూ ఉంది. యువకులు, విద్యార్థు లు సినిమా మాధ్యమం పట్ల అభిమానం, నిబద్ధత కలిగిన వారు పెద్ద సినిమాకు భిన్నంగా దూరంగానూ తమ ప్రయత్నాలు ప్రారంభించారు.
ఇది సరిగ్గా అమెరికాలోని 7మేజర్ స్టూడియోలకు సమాంతరంగా ఎగిసివచ్చిన ఇండిఫిల్మ్ లేదా ఇండిపెండెంట్ ఫిల్మ్‌ను పోలి ఉంది. అమెరికాలో ఎం.జి.ఎం., పారమౌంట్, ఆర్‌కేఓ, వార్నర్ బ్రదర్స్, యూనివర్సల్ పిక్చ ర్స్, ట్వంటియత్ సెంచరీ ఫాక్స్ లాంటి స్టూడియోలు 1920- 50ల దాకా సినిమా రంగంపై తమ నియంత్రణని కొనసాగించాయి.
కాని వాటికి అవతల నిర్మించబడి పంపిణీ చేయబడుతున్న సినిమాలను ఇండిపెండెంట్ సినిమా అని పిలుస్తున్నా రు. ఆ సినిమా అమెరికాలో సమాంతర సినిమాగా నిలదొక్కుకుంది. అలాంటి ప్రయత్నాలే మన దేశంలోనూ జరగాల్సివుంది. వ్యక్తులుగా కొంతమంది ఇప్పటికే ఆ యత్నాలు ఆరంభించారు. ఇవాళ ఇండిపెండెంట్ సినిమా అభివృద్ధి చెందేందు కు అవకాశాలు ఎంతో మెరుగుపడ్డాయి.
నిర్మాణానంతర ఎడిటింగ్ తదితర పనులకు నాన్‌లీనియర్ ఎడిటింగ్ సాఫ్ట్‌వేర్ ఇవ్వాళ అన్ని కంప్యూటర్లలోకి అందుబాటులోకి వచ్చింది. 35 ఎంఎం ఫిలిం ఫార్మాట్‌లో సినిమా నిర్మాణానికి కెమెరా ఖర్చు లు, ముడిసరుకు ధరలు, పోస్ట్ ప్రొడక్షన్ వ్యయం అమితంగా పెరిగిపోయింది.
16 ఎంఎం చిత్ర నిర్మాణ మూ, ప్రదర్శనా ఈ రోజు అంతమైపోయిం ది. దాంతో డిజిటల్ టెక్నాలజి ఖర్చుల పరంగానూ, హాండ్లింగ్ పరంగానూ ఎంతగానో అనుకూలంగా మారిపోయింది. కెమెరాల్లో కామ్‌కర్డర్లు 1985లోనూ, హైడెఫినిషన్ డిజిటల్ వీడియో 1990లో నూ అందుబాటులోకి వచ్చాయి. ఇంకా డివి డి, ఫైర్‌వైర్‌లు రావడంతో చలన చిత్ర నిర్మా ణం విపరీతంగా పెరిగిపోయింది.
ప్రపంచంలో మొట్టమొదటి హైడెఫినిషన్ డివిడి ‘వన్ సిక్స్‌రైట్’ 2006 నవంబర్‌లో విడుదలైంది. ప్లాట్ లాండ్ మొట్టమొదటి పూర్తి కంప్యూటర్ ఎనిమేటెడ్ చిత్రం 2007లో విడుదలైంది. ఇలా డిజిట్ టెక్నాలజి ఇండిపెండెంట్ సినిమా ఎదుగుదలకు దోహదం చేస్తున్న క్రమంలోనే ఇంటర్నెట్, కేబుల్ టీవీలు ప్రదర్శనా రంగంలో స్వతంత్ర సినిమాలకు, షార్ట్ ఫిలింలకు గొప్ప వేదికలుగా రూపొందాయి.
ఇండిపెండెంట్ సినిమాల్లోనే షార్ట్ ఫిలింస్, ఆసక్తికరమైన అంశాలపై నిర్మితమవుతున్న డాక్యుమెంటరీలకు ఇంటర్నెట్ మాధ్యమం గొప్ప అవకాశాన్నిస్తోంది. ‘షార్ట్ ఫిలిం’ నిర్మాణానికి లభిస్తున్న ప్రోత్సాహం అంతా ఇంతాకాదు. అనేక దేశాల్లో జాతీయ, అంతర్జాతీయ షార్ట్ ఫిలిం ఫెస్టివల్స్ నిర్వహించబడుతున్నాయి. ఇంటర్నెట్‌లో ఆన్‌లైన్ కాంపిటీషన్స్ విరివిగా జరుగుతున్నాయి.
షార్ట్ ఫిలిం ల నిర్మాణం ఇవ్వాళ కొత్తగా మొదలుకాలేదు. అమెరికాకు చెందిన సుప్రసిద్ధ దర్శకుడు డి.డబ్ల్యు.గ్రిఫిత్ 450 షార్ట్ ఫిలింలను నిర్మించి ‘ఫాదర్ ఆఫ్ ఫిలిం గ్రామర్’గా పేరు గడించా డు. అట్లాగే డేవిడ్ లించ్ నిర్మించిన షార్ట్ ఫిలింస్‌లోనే ఆయన ప్రతిభ ప్రపంచానికి తెలిసింది.
చార్లీచాప్లిన్ తన జీవితకాలం లో 30 లఘు చిత్రాలు తీశాడు. ఇలా పూర్తి నిడివి చిత్రాలకు సమాంతరంగా లఘు చిత్రాల ఒరవడి 1930ల నుంచే ఉంది. ఒక కొత్త భావన, సరికొత్త ఆలోచన, ఓ స్పార్క్, ఓ కాన్సెప్ట్ ఓ లఘుచిత్ర నిర్మాణానికి సరిపోతాయి.
ఇవ్వాళ ఆధునిక సాంకేతికత మనకు అందించిన డిజిటల్ మాధ్యమంలో షార్ట్ ఫిలిం నిర్మాణం సులభ సాధ్యమవుతున్నది. ఓ కవి పెన్నుతో కవిత రాసినట్టుగా ఓ చిన్న కెమెరాతో మన సృజనని చూపించే అవకాశాలు ఆధునిక సమాజంలో మెండుగా వున్నాయి.
సెల్ ఫోన్ కెమెరాతో నిర్మించే లఘుచిత్రాలకూ పోటీలు వున్నాయి. ఇటీవల ఢిల్లీ లో నిర్వహించిన రెండు నిమిషాల మొబైల్ ఫోన్ సినిమా పోటీల నిర్వాహకుల అంచనాలకు అతీతంగా 500కు పైగా ఎంట్రీలు వచ్చాయి. ఇలా అందుబాటులోకి వచ్చిన డిజిటల్ టెక్నాలజీకి తోడు నూతన తరంలో ఉవ్వెత్తున ఎగుస్తున్న భావ పరంపరలతో ‘లఘుచిత్ర విప్లవం’ ఆవిర్భావానికి ఎంతో సమయం పట్టకపోవచ్చు.
ఈ ఒరవడిని అందిపుచ్చుకొని కొత్త తరానికి సరికొత్త భావనలకు వేదిక కల్పించే లక్ష్యం దిశలో రూపొందిందే ‘ఫిలిం తెలంగాణ’. ఏదైనా ఒక ప్రాంత ప్రజల జీవితమూ, సంస్కృతి, చరిత్ర విలక్షణంగానూ వైవిధ్యంగానూ ఉంటాయి. వాటిని రికార్డు చేయడం, మిగతా ప్రపంచానికి తెలియజేయడం, భావితరాలకోసం నిక్షిప్తం చేయడం అవసరమైన కృషిగా భావించి ‘ఫిలిం తెలంగాణ’ను రూపొందించాం.
ఇప్పటికే సమాంతర చిత్రాల ప్రదర్శన అప్రిిసియేషన్ రంగాల్లో కృషి చేస్తున్న కరీంనగర్ ఫిలిం సొసైటీ గత మూడేళ్లుగా జాతీయ స్థాయిలో షార్ట్, డాక్యుమెంటరీ ఫిలిం ఫెస్టివల్‌ను నిర్వహిస్తున్నది. ఆ క్రమంలోనే అమెరికాలో లాభాపేక్షలేకుండా స్వచ్ఛందంగా కళాసేవారంగాల్లో కృషి చేస్తున్న ‘డిస్కవర్ తెలంగాణ’ సహకారంతో, ముఖ్యంగా జయప్రకాశ్ తెలంగాణ సహకారంతో చొరవతో ‘ఫిలిం తెలంగాణ’ పోటీలు, చిత్రోత్సవాలు రూపొందాయి.
తెలంగాణ సాంస్కృతిక రంగంలో సినిమా ఇంకా అన్‌టచ్డ్ కళగానే మిగిలివుంది. తెలంగాణ జీవితం, సంస్కృతి చరిత్ర ఇలా అన్ని కోణాల్ని దృశ్య మాధ్యమంలో సమగ్రంగా లిఖించాల్సిన పని మిగిలేవుంది. అందుకే ‘ఫిలిం తెలంగాణ’ డిజిటల్ షార్ట్ ఫిల్మ్‌లకు ప్రాధాన్యం ఇస్తూ ఈ ఉత్సవాన్ని రూపొందించింది. ఇప్పటికే పోటీలో నిలిచిన చిత్రాలను filmtelangana.com వెబ్‌సైట్‌లో ఉంచాము.
ఈ చిత్రోత్సవంలో ప్రముఖ చిత్రకారుడు కొండపల్లి శేషగిరిరావుపైన, ఒగ్గు కళాకారుడు మిద్దె రాములుపైన నిర్మించిన చిత్రాలు ప్రదర్శించనున్నారు. తెలంగాణ గ్రామీణ జీవితాలను ఆవిష్కరించే బతుకమ్మ, బొమ్మరిల్లు, తెలంగాణం లాంటి చిత్రాలు ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన సిల్వర్ ఫిలిగ్రిపై నిర్మించిన చిత్రాలకు తోడు దగాపడ్డ తెలంగాణ, గుండె పగిలిన తెలంగాణ, చితికిన బతుకులు లాంటి లఘు చిత్రాలు ప్రదర్శిస్తున్నారు.
ఈ విలక్షణమైన ఉత్సవం ఈ నెల 18-20 మధ్య కరీంనగర్ ఫిల్మ్ భవన్‌లో జరుగుతోంది. ఈ ఫిలిం తెలంగాణ ఇక ముందు వార్షిక ఉత్సవమై డిజిటల్ సినిమా అభివృద్ధికి తోడ్ప డే అవకాశం ఉంది.
- Click here for ‘Film Telangana’ Festival Photos, & News Coverage.