2005 జూన్ 10 శుక్రవారం. మధ్యాహ్నసమయం.
మక్కా మసీదుల నమాజ్‌లు చదువుతున్న సమయం.
నాలుగు వందల సంవత్సరాల నగరచరిత్రకు ప్రత్యక్షసాక్షిగ, ప్రథమసాక్షిగ నిలుచున్న ‘చార్‌మినార్’.
‘చార్‌మినార్’కు ఎదురుంగ లార్డ్ బజార్ సందు మలుపుల ‘ఇక్బాల్’ హోటల్ల స్వామి. కాలం శూలం దాడికి గురి కాక అట్లనే నిలుచున్న నైజాం కాలంనాటి అతి పురాతన ఇక్బాల్ హోటల్. అండ్ల ఎంతసేపట్నుంచి కూచున్నడో ఆయనకే తెలుస్తలేదు. చాయ్‌ల మీద చాయ్‌లు తాగుకుంట ఎదురుంగ నిలబడ్డ ‘జిగ్రీ దోస్త్ చార్‌మినార్’తోటి అంతులేని ముచ్చట్లు. ఎడతెగని నిరంతర సంభాషణ. గుఫ్తగూ. గతించని జ్ఞాపకాలు. వైభవోజ్వల కాలానికి సంబంధించిన మెరుపుల మరకలు.
చికాకు. చీదర. చుట్టుముట్టు జనంజాతర. రణగొణధ్వనులు. వాహనాల కాలుష్యం. ఇవేవీ వారిద్దరి ముచ్చట్లకు అడ్డొస్తలేవు. ఆటంకం కలిగిస్తలేవు. తమ అస్తిత్వాలనే మరిచిపోయిన వారిద్దరి ఏకాంత నిశ్శబ్ద మౌనరాగాల సంభాషణ.
ప్రపంచంల ఏ నగరం కూడ ప్రేమకోసం, ప్రేమకు గుర్తుగ స్థాపించబడలేదు- ఒక హైద్రాబాద్ నగరం తప్ప. రెండు విభిన్న మతాలకు మధ్య సమైక్యతకు, స్నేహానికి హైద్రాబాద్ ఒక సంకేతం. అటువంటి హైద్రాబాద్ నగరంల వారిద్దరిది ‘లంగోటీ యార్ దోస్తానా’. ఒకళ్ల భుజాల మీద మరొకళ్లు చేతులేసుకొని ‘చార్ సౌ సాల్ పురానా షహర్’ ఇరుకిరుకు గల్లీలల్ల, మొహల్లాలల్ల చక్కర్లు కొడుతున్నరు. ఆత్మల అంతరంగ లోకాలను ఆవిష్కరించుకుంటున్నరు.
వాళ్లిద్దరు గతించని జ్ఞాపకాలను తవ్వుకొని తవ్వుకొని ఆ తలపోతలల్ల తలమునకలై పోతున్నరు. నిండ మునిగి కొట్టుకపోతున్నరు.
”గుజ్రే జమానే యాద్ ఆతీ హై
దర్ద్ పురానే యాద్ ఆతీ హై”
* * *
1
1969 జనవరి 15 సోమవారం
అన్ని సోమవారాల్లాగనే ఆ సోమవారం కూడ ఎప్పటి లాగనే దిగులుగ మొదలైంది. స్వామికి మెలకువ వచ్చిందిగని కళ్లిప్పటానికి ఇష్టం లేక గడిచిపోయిన ఆదివారంలోని తియ్యదనాన్ని ఇంకోసారి జ్ఞాపకం చేసుకున్నడు. ఆదివారం సగం గడిచిపోంగనే దిగులు ప్రారంభమయితది. మిగిలిన సగం ఆదివారాన్ని ఆనందించటమేందోగని ‘అయ్యో ఆదివారం అయిపోతుందే’ అన్న బెంగతోనే ఆ దినం గడిచిపోతది. ఇక ఆనందించడమెక్కడ? దేవుడు వారానికి రెండు ఆదివారాలు ఎందుకు పెట్టలేదో!అన్నుకున్నడు స్వామి.
పదిహేడేళ్ల స్వామి సిటీ కాలేజీల పి.యు.సి. చదువుతున్న విద్యార్థి. ఇంక స్కూలు విద్యార్థి మనస్తత్వం పోనేలేదు. కాలేజీ అంటే స్కూలు లాగ భయం లేకున్నా, చదువంటే శ్రద్ధ లేదు. కావున కాలేజీ బరువుగనే, బాధగనే అనిపిస్తది. అటెండెన్సు పట్టింపులు లేకపోవటం, క్లాసులల్లకు ఎప్పుడంటే అప్పుడు వెళ్లటం, నచ్చకపోతే ఇవతలికి వచ్చే అవకాశం ఉన్నందున స్కూలంత బరువుగ కాలేజీ లేదు. ఇష్టం లేకపోతే క్లాసులకు హాజరు కాకుండా చెట్ల కింద కూచుని దోస్తులతో గప్పాలు కొట్టొచ్చు. పైసలుంటే కాలేజీ ఎదురుగ వున్న సిటీహోటల్ల కూచుని ఒక సమోసా, సగం కప్ ఛా తాగుతూ గోపిగాడు చెప్పే ఎడతెగని ముగింపు లేని కబుర్లు గంటలు గంటలు వినొచ్చు.
హెచ్.యస్.సి. వరకు తెలుగు మీడియంల చదివి ఈ కాలేజీ చదువు ఇంగ్లీష్ మీడియం అయ్యేసరికి తెలుగు తప్ప ఏ సబ్జక్టూ ఒక్క ముక్క కూడా అర్థం అయితలేదు. వాటి తలా తోకా తెలుస్తలేదు. సివిక్స్ మేడం ఆరిస్టాటిల్, ఆరిస్టాటిల్ అంటూ అర్థం కాని లెక్చర్ ఇస్తది. కాలేజీ ప్రారంభమై ఆరు నెలలైనా ఆ ఆరిస్టాటిల్ అన్న పదం ఎదైనా దేశానికి సంబంధించిన పేరో లేక మనిషికి సంబంధించిన పేరో చచ్చినా అర్థమయిత లేదు. ఎకనామిక్స్ దామోదరం సార్ వచ్చి తన లోపల తనే గొణుక్కుంటున్నట్లు శిలలాగ నిలబడి ఎటువంటి హావభావాలు లేకుండ పాఠం వొప్పచెబ్తడు. బహుశా ఆ పాఠాన్ని అతను ఇంట్ల బట్టీ పెట్టుకొని వస్తడేమో? కామర్స్ గ్రూపు, ఆర్ట్స్ గ్రూపు రెండూ కలిసి కామన్ క్లాసు, సుమారు రెండు వందల మంది విద్యార్థులు. ఆ క్లాసు రూం ఒక పెద్ద గ్యాలరీ లాగ కింది నుండి పైకి ఎత్తుగ వుంటది. స్వామి నాలుగో వరుసల కూచున్నా ఆయన పాఠం వినబడదు. విన్నా ఆ ఇంగ్లీష్ అర్థం కాదు. ఇక వెనుక బెంచీలవారి సంగతి దేవుడికే తెలుసు. ఆయనెప్పుడూ షుగర్ ఇండస్ట్రీ, షుగర్ ఇండస్ట్రీ అని పదే పదే ఒకే ఉదాహరణ ఇస్తాడు. అందుకే విద్యార్థులు ఆయనకు షుగర్ ఇండస్ట్రీ అని నిక్‌నేం తగిలించినారు.
పాఠాలు మొదలై ఆర్నెల్లు గడిచినా సివిక్స్‌ల మ్యాన్ ఈజ్ ఎ సోషల్ ఎనిమల్, ఎకానమిక్స్‌ల మ్యాన్ ఈజ్ ఏ బండల్ ఆఫ్ డిజైర్స్ అన్న కొటేషన్లు మాత్రం మనస్సుకు ఎక్కినై. మళ్లీ అండ్ల మ్యాన్‌ను ఎనిమల్ అని ఎందుకంటున్నరో స్వామి తనను తాను ప్రశ్నించుకుంటే జవాబు దొరకక మనస్సంతా చికాగ్గ, చీకటిగ మారిపోతుంది. లెక్చరర్లను ఏదైనా సందేహం అడుగుదామంటే భయంతోనూ సిగ్గుతోనూ నోట్లె నుండి ఒక్క ఇంగ్లీష్ ముక్క బయటికి రాదు. చీకట్ల గోడలు పట్టుకుని నడిచేవాడిలాగ అతడి జీవితంల కాలేజీ చదువు ప్రారంభమైంది. సంవత్సరం పరీక్షలకు ఇంకా టైం వుంది కావున అప్పటి వరకూ అన్ని సబ్జక్టులను అర్థం కాకున్న బట్టీ పెట్టి గండం గట్టెక్కవచ్చన్న భరోసాతోటి కాలేజీ రోజుల్ని నిష్క్రియాపరంగ, నిరాసక్తంగ గడుపుతున్నడు. అట్లాంటి అతడికి సోమవారపు ఉదయం అయిష్టంగ మొదలవక ఎట్ల మొదలవుతది?
బాపు చదివే నిత్యానుసంధానంలోని ‘పెరుమాండ్లు, పెరుమాండ్లు, పెరుమాండ్లు రత్నాలు” అనే ద్రవిడ భాషా శ్లోకాలతో స్వామికి నిద్ర లేవక తప్పింది కాదు. ఆయన శ్లోకాలకు పోటీగ పక్కన జోషీ వాళ్ల ఇంట్ల నుండి రేడియో వివిధ్ భారతీల మహమ్మద్ రఫీ ‘ఏక్ ముసాఫిర్, ఏక్ హసీనా’ సీన్మాల జాయ్ ముఖర్జీ కోసం పాడుతున్నడు. స్వామి ఇంట్ల రేడియో లేదు. పాటలన్ని పక్కింట్ల నుండి వాళ్లింట్లకి ప్రవహిస్తుంటయి. జోషీలు కాశీ నుండి వచ్చిన బ్రాహ్మణ పండితులు. ఆబిడ్స్‌ల హనుమాన్ దేవల్ పూజారులు. వారు హిందీ పాటలు తప్ప తెలుగు పాటలు చచ్చినా పెట్టరు. అదొక నిరాశ. ఇదొక ఓదార్పు. స్వామివాళ్ల బాపు ప్రైమరీ స్కూల్ల సెకండరీ గ్రేడ్ లెక్కల టీచర్. ఆయనకు రేడియో అంటే అక్షరాలా ఒక విలాస సాధనమే. మొన్నమొన్న పాత సైకిల్ ఒకటి అప్పు చేసి కొనుక్కున్నడు. ఆ సైకిలు ఇంట్లకు వచ్చిన శుభసందర్భంల అమ్మ దానికి పూలదండ వేసి కొబ్బరికాయ కొట్టి తమ గల్లీల అందరికీ జిలేబీలు పంచింది.
స్వామి బాపు స్వంత ఊరు వరంగల్ జిల్లా మడికొండ గ్రామం. ఆయన ఉద్యోగరీత్యా స్వామి పుట్టక ముందే హైద్రాబాద్‌కు వచ్చి స్థిరపడినాడు. ఆయన ఉర్దూ మిడిల్ ట్రెయిన్డ్ టీచర్‌గ నైజాం రాజ్యం బీదర్‌ల ఉద్యోగం ప్రారంభించినాడు. ఆ ప్రాంతంల ఉండే అనేక కుగ్రామాలల్ల సింగిల్ స్కూల్ టీచర్‌గ పనిచేసి పైరవీతో హైద్రాబాద్‌కు బదిలీ చేయించుకొని పాతనగరంల స్థిరపడినాడు. ఆయన పని చేస్తున్న స్కూలు కూడ పాతనగరంలనే ఉంది. అయినా ఆయనకు మడికొండతోటి పురుటిబొడ్డు సంబంధం తెగిపోలేదు. తల్లి, చెల్లెళ్లతో సహా బంధువులందరూ అక్కడే వున్నరు. ఆయనకు మడికొండ అంటే మహా ప్రేమ. ఒక వేళ తాను చనిపోతే తనను మడికొండకు తీసుకుపోయి ఆ గడ్డమీదే అంత్యక్రియలు జరపాలని భార్యతోటి చెప్పెటోడు. ఆయనకు ఎడమ పక్క డొక్కల ఒక కంతి ఉంది. అది ప్రతి సంవత్సరం పెరుగుతనే ఉంది. దానిని ఆపరేషన్ చేసి తీసే వీలు లేదని ఉస్మానియా దవాఖానా డాక్టర్లు నిర్ధారించినారు. ఆయనను నిరంతరం మృత్యుభయం వెన్నాడుతనే ఉండేది. నెత్తి మీద కత్తి వేలాడుతున్నట్లు భయం, భయంగనే మృత్యుచ్ఛాయలల్ల బ్రతికెటోడు. పరమ సాత్వికుడు, మృదు స్వభావి.
‘ఆద్మీ మౌత్ కో సామ్నే రక్ లేఖే జీనా’ అని అందరితోటి అంటుండెటోడు. మృత్యువును ముందుంచుకుని బతికితే జీవితంల విర్రవీగమని, అందరితో స్నేహంగ, మంచిగ ఉంటమని ఆయన ఉద్దేశ్యం. వాళ్ల బాపు చెప్పిన ఇంకో సామెతను కూడ పదే పదే పిల్లలకు చెప్పెటోడు. ”తిన్నా మళ్లీ తినేటట్లు ఉండాలట. కొట్లాట పెట్టుకున్నా మళ్లీ కొట్లాట పెట్టుకునేటట్లు ఉండాలట” నిజమే పెద్దల మాటలు చద్దిమూటలు. వాళ్లు చెప్పిన సామెతలు జీవితపు సారాన్ని విప్పి చెప్పే పరమసత్యాలు. కడుపు నిండా తినే బదులు మితంగ తినటమే ఆరోగ్యకరం. మళ్లీ కొట్లాట పెట్టుకునే వీలు వుండటం అంటే సంబంధాలు తెగగొట్టుకోకుండ ఉండటం. ఆయన ఏ విషయం చెబుతున్న, వివరంగ ఓపికగ, చిన్నపిల్లలకు పాఠం చెబుతున్నట్లే చెప్పెటోడు. అది వృత్తిపరంగా వచ్చిన తత్వమేమో!
మడికొండ ఖాజీపేట రైల్వేస్టేషన్ నుండి హైద్రాబాద్‌కు వెళ్లే రహదారిపై మూడు కిలోమీటర్ల తర్వాత ఉంటది. కాకతీయుల కాలంల దీనిని ‘మణిగిరి’ అని పిలిచేటోళ్లు. ఈ గ్రామం సరస్వతీ నిలయం. సాహిత్యానికి పుట్టినిల్లు. అభినవ పోతన వానమామలై వరదాచార్యులు, గంగిరెద్దు కావ్యకర్త పల్లా దుర్గయ్య, రసబ్రహ్మ అనుముల కృష్ణమూర్తి, ప్రముఖ జానపద పరిశోధకులు బిరుదురాజు రామరాజు, కవి ‘షాద్’ కాళోజీ రామేశ్వర్ రావ్, ఓరుగల్లును పోరుగల్లుగా తీర్చిదిద్దిన ప్రజాకవి కాళోజీ నారాయణరావు మొదలగువారు ఈ గ్రామానికి చెందిన ముద్దుబిడ్డలు. స్వామి బాపుకు మడికొండ పేరు వింటేనే ఒళ్లు పులకరిస్తది. ఈ మడికొండకు దగ్గరలనే ‘పోతన’ స్వగ్రామం ‘బమ్మెర’ కూడా ఉంది.
తెలంగాణాల కొన్ని ప్రాంతాలల్ల తండ్రిని బాపూ అని పిలుస్తరు. తండ్రి కూడా కొడుకును తిరిగి ‘బాపూ’ అని పిలుస్తడు. రెండు పదాలు ఒక్కటే. రెండు హృదయాలకు ప్రేమ ఒక్కటే అయినట్లు రెండు అర్థాలకు పదం ఒక్కటే. స్వామికి బాపూ అన్న పదం ఇష్టం. ఎందుకంటే అది ‘బాపూజీ’ అన్న పదానికి దగ్గరగా వున్నందుకు!
బాపు చేతి గడియారం ఆగిపోయినట్టుంది. టైము తెలుసుకోవాలనుకున్న స్వామి బద్దకంగ చాప మీద నుండి లేచి ఇంటి బయటికి వచ్చి ఎత్తయిన జాజురంగు అరుగుల మీదకు ఎక్కి దూరంగ ఉన్న శాలిబండ మహారాజా కిషన్ పర్‌షాద్ దేవిడీ మీది గడియారాన్ని చూసినాడు. సమయం ఎనిమిది పది. ఆ గడియారం పాత నగరంల వున్న చార్మినార్, ముర్గీ చౌక్, క్లాక్ టవర్లలాంటిది. నైజాం కాలంల వీటిని ఇంగ్లాండు, ఫ్రెంచి దేశాల నుండి తెప్పించినారు. చేతి గడియారాలు కూడా విలాసవంతమైన వస్తువులుగ పరిగణింపబడే ఆ రోజులలో పేద ప్రజలకు టైం చూసుకునేందుకు శాలిబండా మహారాజా కిషన్‌పర్‌షాద్ దేవిడీ మీది గడియారమే గతి. విక్టోరియా మహారాణికి వున్నంత ఠీవితో ఆ గడియారం గర్వంగా తలెత్తుకుని ఆకాశంలకు చూస్తూ నిలబడేది.
ఇటుక పొడిరంగు లాంటి ఉదారంగు మంజన్‌ను ఎడమచేతిల గుప్పెడంత గుమ్మరించుకుని కుడిచేయి చూపుడు వేలితో కసకసా, పసపసా పండ్లుతోమి, రెండువ్రేళ్లూ కుతికలోపలికి తోసేసి ఒయిక్, ఒయిక్‌మంటూ శబ్దాలు చేసుకుంట, వేళ్లతోనే నాలుకను శుభ్రం చేసుకుని ఇంట్లబాయి దగ్గరికి ఉరికినాడు. బొక్కెనతో దబదబా రెండుసార్లు చేదుకుని నెత్తిమీద నీళ్లు గుమ్మరించుకున్నడు. స్నానం అయిపాయె. స్వామి ఇంట్ల నల్లా లేదు బాయి తప్ప. తాగేనీళ్లు నాలుగు బిందెలు మాత్రం గల్లీ అవుతల మలుపుల సర్కారీ నల్లా నుండి తెచ్చుకుంటరు. మిగతా అవుసరాలకన్నీ బాయి నీళ్లే. నీళ్ల అవసరం ఎక్కువున్నప్పుడు వాళ్ల బాపు కూడా తెల్లారగట్ల ఎవరూ లేనప్పుడు, ఎవరూ చూడనప్పుడు నల్ల దగ్గర నుండి నీళ్ల బిందెలు ఇంట్లకి మోస్తుంటడు. ఎంతైనా మాష్టర్ సాబ్ గదా! ఎవరైనా చూస్తే పరువు పోదా?
శాలిబండా ఎత్తయిన ప్రాంతమే అయినా ఇంటింటికీ ఒక బాయి. అన్ని బావులల్ల నీళ్లు పైన్నే ఉంటై. నీళ్లు కూడ తియ్యగ ఉంటయి. ఆ ప్రాంతంల నీటి ఊటలు అధికం. దీనికి కారణం పాతనగరం చుట్టూ గండిపేట, హిమాయత్‌సాగర్, మీరాలం చెరువు, రాచెరువు, జల్‌పల్లి, సరూర్‌నగర్ చెరువు, బుద్వేల్ చెరువు, గోల్కొండ చెరువు లాంటి చెరువులు ఎన్నో ఉండటమే. ఈ చెరువులే కాక అనేకమైన బావులు కూడా వుండేవి. దూద్‌బౌలి, ఇమాంబౌలీ, గులాబ్ బౌలి, గచ్చిబౌలి, రాజన్నబావి లాంటివి.
తర్వాత కాలంల ఈ చెరువులు, కుంటలు అన్నీ ఎండిపోయి, మరికొన్నింటిని బలవంతంగా పూడ్చేసి, రియల్ ఎస్టేట్ల లాభాల బేహారులు వాటిని ప్లాట్లుగా మార్చిన తర్వాత ఆ బావులల్ల నీటి ప్రమాణం తగ్గుతూ వొచ్చింది. ప్రజలు కూడా నాగరీకం నేర్చుకుని నల్లాలు పెట్టించుకున్నరు. బహుశా బావులు పట్టణ సంస్కృతి కాదనుకున్నరేమో? చివరికి ప్రకృతి వరప్రసాదమైన నీరు కూడా అంగడి సరుకుగ మారింది.
హైద్రాబాద్ మూసీ నదికి దక్షిణాన చార్మినార్ దాటి అలియాబాద్ వెళ్లే తోవల ‘శాలిబండ’ ఉంది. ఏనుగుల వీరాస్వామి అనే యాత్రికుడు 1830 ప్రాంతంల కాలినడకన కుటుంబ సమేతంగ చెన్నపట్నం నుండి కాశీయాత్రకు పోతూ రాసిన దినచర్య పుస్తకంల ‘శాలిబండ పురము’ ప్రసక్తి ఉన్నది. ఎత్తయిన ప్రాంతం ‘చడావ్’ కావున ‘బండ’ అన్న పదం వాడుకలకు వచ్చినా అసలు పేరు మాత్రం ‘షా – అలీ – బందా’. బందా అంటే భక్తుడు. షా-అలీ-బందా ఒక సూఫీ యోగి. ఆ రోడ్డు మీద చడావ్‌ల ఒక రాగిచెట్టు కింద నివసించి అక్కడే కాలధర్మం చేసినాడు. ఆ చెట్టు కింద ఇప్పటికీ అతని దర్గా (సమాధి) ఉంది. ఏటేటా ఉర్సు ఉత్సవాలు జరుగుతై. ‘పట్నంలో శాలిబండా పేరైనా గోలుకొండ’ అన్న సీన్మా పాటతో శాలిబండ పేరు హోల్ ఆంధ్రప్రదేశ్‌ల మశూర్ అయిపోయింది. అట్ల స్వామి నివసించే బస్తీ పేరు శాలిబండ. దాని లోపల రూప్‌లాల్ బజార్ గల్లీల వాళ్ల ఇల్లు. ఆ శాలిబండ చుట్టుపక్కల గాజీబండ, మేకలబండ, పిసల్ బండ, రాంబక్షి బండ లాంటి మొహల్లాలు కూడా వున్నై. అర్థం చేసుకుంటే పేరులోనే పెన్నిధి కనబడుతది.
పాత చింతకాయ తొగి (పచ్చడి) బాగా కారం వేసిన కూర. కూరగాయలు ఎక్కువగా కొనలేరు కావున తక్కువగ వండే కూరలల్ల ఎక్కువ కారం వేస్తే కూరలు తక్కువగ తింటరని అమ్మ ప్లాను. పొదుపు. శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలు. నీళ్లచారు, నీళ్ల మజ్జిగతో పీట మీద కూచుని ముక్కులు చీదుకుంటూ, కండ్లు తుడుచుకుంటూ దబదబా ఉడుకుడుకు అన్నం తిన్నడు స్వామి. మళ్లీ సాయంత్రం దాక బేఫికర్. టిఫిన్ డబ్బాల అన్నం పెట్టుకుని కాలేజీకి పోతే నామోషీ అని ఆలితో అట్లనే నకనకలాడేటోడు కానీ టిఫిన్ డబ్బా మాత్రం పట్టుపోయేటోడు కాదు.
బాగా పాతబడి రంగు వెలిసిన కాటన్ పాంట్, షర్టు వేసుకున్నడు. అప్పటికింకా టెర్లినూ, టెరికాట్‌లు ధనవంతుల పిల్లలకు మాత్రమే పరిమితం. నామ్ కే వాస్తే ఏవో రెండు నోటుబుక్కులు, ఎక్కువగ చిరగకుండ కాస్త మంచిగా కనబడే టెక్స్‌ట్ బుక్ ఒకటి ఉత్త చేతులతోనే పట్టుకుని తెగిపోయిన స్లిప్పర్లను మరోసారి పిన్నీసుతో కుట్టుకుని ‘గ్యారా నంబర్’ బస్సెక్కి కాలేజీకి బయలుదేరినాడు. శాలిబండ నుండి సిటీ కాలేజీ మూడు కిలోమీటర్లు దూరం. గ్యారా నంబర్ బస్సు అంటే అదేందో బస్సు నంబరు అనుకునేరు. పేదవాళ్ల రెండు కాళ్ల నడకే గ్యారా నంబర్ బస్సు. హాస్యం వెనుక విషాదం.
అప్పటికింక శాలిబండ ఏరియాల బస్సులు తిరిగేవి కావు. పట్నం పోవాలంటే చార్మినార్‌కు వచ్చి బస్సు ఎక్కాలె. చారానా ఇస్తే రిక్షాల శాలిబండ నుండి చార్మినార్‌కు డబుల్ సవారీ. సింగిల్ సవారీగా వెళ్లాలంటే ఆఠానా ఇవ్వాలె. ఆ చారానాతో చా తాగొచ్చు కదా! గుల్జార్ హౌస్ దగ్గరి క్రిష్ణా టాకీస్‌ల ఆ చారానాతో థర్డ్ క్లాసు టిక్కట్టు కొనుక్కుని దారాసింగు ఫైటింగు సీన్మా చూడొచ్చు కదా అని చాలా మంది గ్యారా నంబర్ బస్సునే నమ్ముకునేటోళ్లు.
నడక. నడక. నడక నా నేస్తం అని నమ్మేటోళ్లల్ల స్వామి కూడా ఒకడు. అతను తన బస్తీ ఇరుకిరుకు గల్లీలన్నింటినీ రూప్‌లాల్ బజార్, శివశంకర్ చమన్, నానక్ బౌడీలను దాటుకుని శాలిబండ పెద్ద రోడ్డులోని రాగిచెట్టు దర్గా దగ్గరికి వచ్చేసరికి ఎర్రటి ఎండ ఎగిసెగిసి, మిడిసి మిడిసి పడుతుంది. ముఖానికి చెమటలు. కర్చీఫ్ కల్చర్ లేదు కదా! పాత గుడ్డలు చింపి అమ్మ కుట్టిచ్చే దస్తీలంటే నామోషీ. విధి లేక పుస్తకాలని ఎడమ చేతిలోకి మార్చుకుని కుడి అరచేత్తో ముఖం తుడుచుకున్నడు. చెయ్యంతా చెమట చెమట. మళ్లీ ముఖమంతా చెమట చెమట. చేతుల చెమటలు పుస్తకాల అట్టల మీదకు బదిలీ. చెమటలతో తడిసి చీకిపోయిన పుస్తకాల అట్టలు.
దూరంగా ఏదో సందేశంలా చార్మినార్ కనబడుతుంది. మొదటిసారి చిన్నప్పుడు చార్మినార్‌ను చూసిన జ్ఞాపకం. పెద్ద తమ్ముడు జ్ఞాని పుట్టినప్పుడు వయస్సు రెండు, మూడు ఏండ్ల మధ్యనేనేమో! ఉస్మానియా దవాఖానాల వాడి జననం. అమ్మ కోసం స్వామి ఏడుస్తుంటే వాడిని కూడ దవాఖానాకు తీసుపోయినారు. తొట్టెలలో తమ్ముణ్ని చూసిన జ్ఞాపకం. ‘తమ్ముడు, తమ్ముడు’ అంటూ అందరూ వాణ్ని స్వామికి చూపించినారు. ‘అమ్మా ఇంటికి ఎప్పుడు వస్తవే’ అని స్వామి ఏడుస్తుంటే వాడిని మరిపించి, మురిపించి బాపు రిక్షాల ఇంటికి వాపస్ తీసుకొస్తుంటే అగో అప్పుడు హఠాత్తుగ చార్మినార్ ఎదురుగ కనబడింది.
‘హాశ్చర్యం’తో కళ్లే విచ్చుకున్నయో, చిన్ని నోరే తెరుచుకున్నదో స్వామికేం తెలుసు? కాని చార్మినార్ మాత్రం వాడి చిన్నారి హృదయంపై మొదటిసారిగ ముద్ర వేసింది. చార్మినార్ గడియారం, అండ్ల ముండ్లు వాడిని అమితంగ ఆకర్షించినాయి. అట్ల చార్మినార్ పహెలీ నజర్, పహెలా పహెలా ప్యార్ అయిపోయింది. మనిషికి ముక్కెట్ల అందమిస్తదో హైద్రాబాద్‌కు చార్మినార్ అట్ల అందమిస్తది. గత్తర వ్యాధిని అరికట్టమని అల్లాకు మొక్కుకుని అది తగ్గంగనే ఆ జ్ఞాపకార్థం చార్మినార్‌ను నిర్మించినారని ఒక కథ ప్రచారంల ఉంది. హైద్రాబాద్ నగర సుందరి ముక్కుపుడకల తళుక్కున మెరిసే మేలిమి ముత్యమే చార్మినార్. హైద్రాబాద్ కీ షాన్ ఔర్ షౌరత్ చార్మినార్.
నడక. నడక. ఆశా టాకీస్ చౌరస్తా. సత్తాజీ మాంసం దుకాణం. కూరగాయల మార్కెట్. ఐస్ దుకాణం. అహమ్మద్ కిరాణా దుకాణం. మొగల్‌పురాల మౌలానా హోటల్. …….. మొగల్‌పురా. గోలుకొండ ఖిల్లా మీద దండెత్తుకొచ్చిన ఔరంగజేబు సైన్యాలు విడిది చేసిన పురమే మొగల్‌పురా. కోట స్వాధీనమైన తర్వాత తాత్కాలికంగ ఇక్కడ్నుండే మొగల్ పరిపాలకులు రాజ్యపాలన చేసినారు. ఈ ప్రాంతంలోని కట్టడాలు, నిర్మాణాలన్నీ మొగల్ శిల్ప శైలికి సంబంధించినవే. ఆ భవనాలన్నీ, ఇప్పుడు షాదీఖానాలుగ మారిపోయినై.
మౌలానా హోటల్ల గ్రామఫోన్ రికార్డుల పాటలు, హరియాలీ ఔర్ రాస్తా, తేరే ఘర్ కే సామ్నే సీన్మా పాటలు. ఆ పాటల ఆసరాతో, ఆ పాటల బలంతో, ఆ పాటల భరోసాతో స్వామి నడక. నడక కూడా ఒక అందమైన పాటే. పాంచ్ మొహల్లా, నాజ్ ఫొటో స్టూడియో. డబుల్ రొట్టెల బేకరీ దుకాణం. మొగల్‌పురా కమాన్. దాని ఎదురుగా ఘుమఘుమల వాసనలతో ‘చాక్నా’ తయారు చేస్తున్న తురక హోటల్.
లట్కుం, లట్కుం, లట్కుం. చెవులకు ఇంపైన లయబద్ధ సంగీతం. వెండి, బంగారు ‘వరఖ్’ కాగితాల కోసం రెక్కలు ముక్కలు చేసుకునే కూలీల సమ్మెట పోట్ల నుండి ఉద్భవించే అద్భుత శ్రామిక జీవన సంగీతం. లట్కుం, లట్కుం, లట్కుం. రిథమిక్ మ్యూజిక్. మిఠాయిల మీద, బిర్యానీల మీద అతికించే వెండి, బంగారు వరఖ్ కాగితాలు. పూత రేకులు. పూలరేకులు. రుచిని పంచి, ఆరోగ్యాన్ని పెంచే వరఖ్ కాగితాల సంగీత సమ్మేళనం.
తినే పదార్థాల మీదనే గాక ఆ వరఖ్ రేకుల్ని హిందూ దేవాలయాలల్ల ఆలయ గోపురంపై, విమానం, గర్భగుడి, రథాలపై లేపనం చేస్తరు. ముందు రాగి రేకుల్ని లేపనం చేసి, తర్వాత వాటిపై బంగారపు పూత పోస్తరు. ఆ బంగారపు పూతకు పూతరేకుల్లాంటి పలుచని రేకులను మాత్రమే ఉపయోగిస్తరు. వీటిని కూడా వరక్ కాగితాలనే పిలుస్తరు. హైద్రాబాద్ పాతబస్తీకి చెందిన ముస్లిం కళాకారులు ఈ వృత్తిల నిపుణులు. వీరు దేశవిదేశాలల్ల ఆలయాలకు ఈ వరఖ్ కాగితాలు, రేకుల తయారీ కోసం పోతుంటరు. హిందూ దేవాలయాలు వీరి పనితనానికి నీరాజనాలు పట్టాయి.
వీరు ముస్లింలైనా ఆలయాలల్ల పని చేసేటప్పుడు హిందువుల ఆచారాల్ని, పద్ధతుల్ని నిష్టగా పాటిస్తరు. పని చేస్తున్న కాలంల శాకాహారం మాత్రమే తీసుకుంటరు. ప్రతి రోజు దైవదర్శనం చేసుకుని ప్రసాదం ఆరగించిన తర్వాతే పనిలకు దిగుతరు. తిరుత్తణి, శ్రీకాళహస్తి, రాజమండ్రి, అన్నవరం దేవాలయాలల్ల వీరు పని చేసినారు. పాండిచ్చేరిలోని వినాయక ఆలయానికి డెబ్బై లక్షల విలువ గల వరఖ్‌లను తయారు చేసి అందించినారు. కంచి కామకోటి పీఠాధిపతి కూడా వీరి నైపుణ్యాన్ని మెచ్చుకున్నరు.
మేం భారతీయులం. మాకు మందిర్, మసీద్ రెండూ సమానమే. ఏ మతకల్లోలాలు మా విశ్వాసాన్ని సడలించలేవు అని గర్వంగ అంటరు. లార్డ్ బజార్, ముర్గీకా చౌక్‌లలో మరికొంత మంది ముస్లిం కార్మికులు బ్లాక్ మెటల్ అల్యూమినియంతో హిందూ దేవుళ్లదేవతల విగ్రహాలను చాలా కళాత్మకంగా తయారు చేస్తరు. కూటి కోసం కోటి విద్యలు. పాపీ పేట్ హై. పైసా హీ పరమాత్మా హై. వీరందరికీ అన్నం పెట్టే వృత్తి ముఖ్యం కాని, శవాల మీద పేలాలు ఏరుకుని తినే రాజకీయ రాబందుల మతకల్లోలాలు, మారణహోమాలు ముఖ్యం కాదు.
కాశీ విశ్వనాథుని ఆలయంల ప్రతిరోజూ బిస్మిల్లా ఖాన్ షెహనాయితో పూజలు ప్రారంభమవుతై. హైద్రాబాద్ వరఖ్ కార్మికుల చేతుల మీదుగ దేవాలయాలల్ల బంగారపు జిలుగువెలుగులు విరజిమ్ముతై. దేవుళ్లు, దేవతలు మెరిసిపోతుంటరు. మరి అట్లాంటప్పుడు ఈ దేశంల మతకల్లోలాలు ఎందుకు జరుగుతున్నయో !
కర్ర్ కర్ర్ కర్ర్. కత్తులకు, కటార్లకు, కత్తెర్లకు సానబట్టి మెరిపించే మెషిన్ల చప్పుడు. వాటిని సానబట్టేటప్పుడు మిరుమిట్లు గొల్పే నిప్పులరవ్వలు. దీపావళి పండుగ రాత్రి పూల్ చెడీలు. పువ్వుల రవ్వలు. నడక. నడక ఒక నడుస్తున్న చదువు. నడక ఒక నడుస్తున్న చరిత్ర. కంటికి దూరమైతే కాలికి దూరమా అనుకుని అన్నింటినీ చూసుకుంట, దాటుకుంట అడుగులేస్తుంటే మక్కా మసీదు. నల్లరాతి బండల మీద తెలతెల్లని శాంతి కపోతాలు. వీటికి గింజలు వెదజల్లే చిన్న పిల్లలు.
లార్డ్ బజార్ గాజుల దుకాణాల మలుపుల నైజాం కాలంనాటి అదే పురాతన ఇక్బాల్ హోటల్. ”బోలో సాబ్ ! క్యా హుకుం హై?” అంటూ వొంగి వొంగి సలాములు చేసే సర్వర్లు, చార్మినార్ ఛత్రచ్ఛాయల నుండి ముందుకు వెళ్తే శివాలయం. కుడిఎడమల కాపలా కాసే సింహాలు. చార్ కమాన్. మార్వాడీ అగర్వాల్‌ల వెండి, బంగారు దుకాణాలు. చౌరస్తాల గుల్జార్ హౌస్. నీళ్లు లేనందున పేరు మారిన సూఖాహౌస్. కృష్ణా టాకీస్ అందుల నడుస్తున్న రాజ్‌కపూర్ తీస్రీ కసమ్ సీన్మా. మచిలీ కమాన్ షెహరాన్ హోటల్. ”సాబ్ కా జబాన్ నికాలో, సాబ్ కా భేజా నికాలో” అంటున్న సర్వర్ల ద్వంద్వార్థాల జోక్‌లు. ఆనందించే కస్టమర్లు. మసీదు మలుపుల జి. మల్లయ్య బట్టల దుకాణం. పత్తర్‌గట్టీ కపడా గట్టీ. రంగురంగుల జండాల్లా రెపరెపలాడుతూ గాలికి ఎగురుతున్న సిల్కు చీరెలు. చీరెల కోసం కొంత మంది ఆడవాళ్లు బట్టల దుకాణంలోకి పోంగనే కొంత మంది కొంటె కుర్రాళ్లు ‘అమ్మగార్లొచ్చిండ్రు, బట్టలిప్పి చూపియ్యండ్రా’ అని డబుల్ మీనింగు జోకులు.
మీరాలం మండీ కూరగాయల మార్కెట్. దాని లోపల ఇరానీలు నివసించే ఇరానీ గల్లీ. పత్తర్‌గట్టీ కమాన్ లోపల నానక్‌రాం భగ్వాన్ దాస్ కాలేజీ. కమాన్ పక్కన జుబ్లి టపాఖానా. దాని ఎదురుగ ఆర్.ఆర్. గోపాల్ బట్టల దుకాణం. ముందుకు, మున్ముందుకు వెళ్తే మదీనా హోటల్. కమ్మటి బిర్యానీ వాసన. గుభాళించే సమోసాల వాసన. చార్మినార్ భరండీ మదీనా బిర్యానీ చల్నేదో బాల్‌కిషన్. లెఫ్ట్ టర్న్, రైట్ సైడ్‌ల కుతుబ్ షాహీలు కట్టించిన అషుర్‌ఖానా. మొహర్రంకు ముందు అండ్ల పీర్లను నిలబెడతరు. హైకోర్టు. కోర్టు పక్షులు. నల్లకోట్లు. అచ్చట న్యాయం అన్యాయంగ అమ్మబడును. దమ్ములుంటే, డబ్బులుంటే కొనుక్కోవచ్చును. సత్యమే శవం. హైకోర్టుకు ఎదురుగ తమిళ బ్రాహ్మణ సాపాటు నిలయం. నాలుగు అడుగులేస్తే ఎడమ వైపు మెహబూబ్ కీ మెహందీ. వసంతసేనల వేశ్యావాటిక. షమాలు, ముజ్రాలు. ఘుంఘురూలు. దివానా పర్వానాలు. కొండకచో మృచ్ఛకటికంలోని చారుదత్తులు. కుడివైపున ఘనత వహించిన సిటీ కాలేజీ.
అవిశ్రాంత పథికుడు స్వామి. మంజిల్‌కు చేరుకున్న ముసాఫిర్ స్వామి. స్వామి కాలేజీ ఆవరణలకు అడుగు పెట్టినాడు.
* * *
జై తెలంగాణా, జై జై తెలంగాణా. దిక్కులు దద్ధరిల్లేలా తెలంగాణా నినాదాలు. విద్యార్థులంత కాలేజీ ఆవరణల చెట్ల కింద మైదానంల గుంపులు గుంపులుగ నిలుచున్నరు. ఎవళ్లూ క్లాసులకు పోయినట్లు లేదు. అక్కడి వాతావరణంల ఏదో తెలియని ఉద్రిక్తత. అందరి ముఖాలల్ల ఆవేశం, ఆందోళన. ఆ గుంపుల వికసించిన విద్యుత్తేజం. విషయం ఏమీ అర్థం కాకున్నా సహజసిద్ధ ఉద్రిక్త స్వభావి అయిన స్వామి మెదడు, శరీరంల వెయ్యి వోల్టుల విద్యుత్తీగలు జిలజిలా ప్రసరించినాయి. తనకు తెలియకుండనే గుంపుల దగ్గరికి చేరుకున్నడు.
ఎత్తయిన ఒక హౌజ్ గోడ మీద నిలబడి తను ఎన్నడూ చూడని ఒక యువకుడు ఆవేశంగ కుడిచెయ్యి ఎత్తి బిగించిన పిడికిలి గాలిల ఊపుతూ ఏదో ఉపన్యాసమిస్తున్నడు. అతను చక్కని టెరికాట్ పాంట్, టెర్లిన్ షర్టు వేసుకుని అందంగ, లావుగ, ఎత్తుగ వున్నడు. అతని ఉపన్యాసంల సంగతి ఏందో అర్థం కాకున్న ఆయన తరచుగ పదే పదే ప్రస్తావిస్తున్న తెలంగాణా తెలంగాణా, ఆంధ్రా ఆంధ్రా అన్న పదాలు మాత్రం స్వామి బుర్రలకు ఎక్కుతున్నయి. ‘ఆయన ఎవరు?’ అని తన పక్కనున్న విద్యార్థిని అడిగితే ఆయన పేరు వీరన్న అని, ఉస్మానియా యూనివర్శిటీ లా కాలేజీ యూనియన్ లీడర్ అని చెప్పినాడు. పి.యు.సి. చదివే స్వామికి ఆ లా కాలేజీ విద్యార్థి నాయకుడి పట్ల ఆరాధనా భావం కలిగింది. ఇంతల ఆ ఉపన్యాసం ముగిసినట్టుంది.
మళ్ల ఆకాశం బద్దలయ్యి తల మీద పడ్డట్టుగ జై తెలంగాణా, జై జై తెలంగాణా నినాదాలు. ఎండాకాలం గాలిదుమారం నాటి ఉరుములు. పిడుగులు. చీకటి తుఫాను రాత్రి చెట్ల కొమ్మల నుండి వీచే హోరుగాలి చప్పుడు. స్వామికి ఒళ్లంతా జ్వరం వొచ్చినట్లయ్యింది. ఆవేశపు పెనుగాలిలో గడ్డిపోచలాగ ఊగిపోయినాడు. వొణికిపోయినాడు.
వీరన్న ఉపన్యాసం అయిపోంగనే కాలేజీ విద్యార్థి సంఘం అధ్యక్షుడు గాంధీశ్వర్ మాట్లాడటం ప్రారంభించినాడు. అతను వీరన్నలాగ చక్కగ ఉపన్యసించకపోయినా మామూలుగ మాట్లాడుతున్నట్లే ప్రసంగించినాడు. ఈ రోజు అందరూ క్లాసుల్ని బహిష్కరించాలని, క్లాసులకు వెళ్లవద్దనీ, అందరూ ఊరేగింపుగ నిజాం కాలేజీకి వెళ్లాలని, అక్కడ అన్ని కాలేజీల నుండి వచ్చిన విద్యార్థులు జమ అవుతరని, పెద్ద సభ జరుగుతుందని ప్రకటించినాడు. ఆ ప్రకటనతో విద్యార్థులల్ల ఉత్సాహం పెల్లుబుకి, క్లాసులు లేవన్న ఆనందంతో వాళ్లు కెవ్వు, కెవ్వున కేకలేసినారు. చప్పట్లు చరిచినారు. ఈలలు, ఊళలు వేసినారు. స్వామి గుంపుల గోవిందా అన్నట్లు వారితో కలిసిపోయినాడు.
ఊరేగింపు మొదలయ్యింది. విద్యార్థులంత గుంపులు గుంపులుగ నడుచుకుంట రోడ్డు ఎక్కినారు. హైకోర్టుకు పొయ్యే రోడ్డుల ట్రాఫిక్ అటుఇటు జామ్ అయ్యింది. జై తెలంగాణా, ఆంధ్రాస్ గో బ్యాక్, ఇడ్లీ సాంబార్ గోబ్యాక్, గోంగూర పచ్చడి గోబ్యాక్ నినాదాలు భూమి, ఆకాశాన్ని ఒకటి చేస్తున్నయి. ఊరేగింపు ముందు భాగాన ‘వీరన్న, గాంధీశ్వర్, మధుసూదన్ రెడ్డి, ఇంద్రసేనారెడ్డి, జగతయ్య మొదలైన విద్యార్థి నాయకులు నడుస్తున్నరు. వారిచ్చే నినాదాలను వెనుక వున్న విద్యార్థులంత కోరస్‌గ అందుకుంటున్నరు. రోటీన్ జీవితాన్ని బద్దలు కొట్టిన ఈ ఉద్యమం వల్ల స్వామి హుషారుగ వున్నడు.
ఇంతల అతని మిత్రులు గోపి, అశోక్, జెఫ్రీ ఆ ఊరేగింపుల కలిసేసరికి ఆవేశం, ఆనందం ఇనుమడించినాయి. అందరూ కలిసి నినాదాలని హోరెత్తిస్తున్నరు. నయాపూల్ దగ్గరికి వచ్చేసరికి స్కూలు పిల్లలు కూడ ఊరేగింపుల కలిసి పిల్లకాలువ పెద్ద నదిలాగ మారింది. ఎక్కడ్నుంచో వచ్చిన పోలీసు వ్యానుల నుండి దిగిన ఇనుపటోపీ పోలీసులు బిలబిలా వ్యాన్ దిగి ఊరేగింపుకు కుడిఎడమల నడువసాగినారు. నయాపూల్ మీద ట్రాఫిక్ జామ్ అయ్యి బస్సులు, మోటారు కార్ల హారన్ల మోతలతోటి వాతావరణం మారుమోగుతున్నది. ఉస్మానియా హాస్పిటల్ గేట్, అఫ్జల్‌గంజ్ పోలీసు స్టేషన్ దాటి గౌలిగుడా దిక్కు ఊరేగింపు ప్రవాహంలాగ కదిలిపోతున్నది. ఆఫీసులకు, ఉద్యోగాలకు, వ్యాపారాలకు వెళ్లే ప్రజలంత ఉత్సాహంతోటి ఊరేగింపును చూస్తున్నరు. తామిచ్చే నినాదాల పట్ల వారికి కూడ ఏదో సానుభూతి వున్నట్లే అనిపించింది.
గౌలిగుడా చౌరస్తాకు ఊరేగింపు చేరుకోంగనే సికింద్రాబాద్ వైపు పోయే డబుల్ డెక్కర్ బస్సు ఇంకా ఒకటి రెండు సింగిల్ బస్సులు కనబడినాయి. విద్యార్థులంతా రెట్టింపు నినాదాలు చేసుకుంట నడిరోడ్డున బస్సుల్ని ఆపేసి వాటిలోకి ఎక్కేసినారు. బస్సులల్ల కూడా నినాదాలు ఆపలేదు. టిక్కెట్, టిక్కెట్ అని కండక్టరు దగ్గరికి వస్తే నినాదాలే సమాధానాలు. మొండిగా టికట్టు తీసుకోవాలన్న కండక్టరును కొట్టినంత పని చేసినారు. చివరికి పాపం కండక్టరు ప్రేక్షకుడిలాగ చూసుకుంట ఓ మూల నిలబడిపోయినాడు. బస్సు ఆబిడ్స్ చౌరస్తాకు చేరుకోంగనే మరికొంత మంది అందులోకి ఎక్కినారు. బస్సు ఆలియా స్కూలు దగ్గర ఆగింది. విద్యార్థులంతా బిలబిలా బస్సుల నుండి కిందికి దూకేసినారు.
ఎదురుగ నిజాం కాలేజీ. స్వామి నిజాం కాలేజీని చూడటం అదే ప్రథమం. అది చాలా గొప్ప కాలేజీ అని, గొప్పవాళ్లందరూ ఆ కాలేజీల చదువుతరని, నైజాం జమానా నాటి పాత కాలేజీ అని, ఆ కాలేజీల చదివే కొందరు కొంటె పిల్లలు బస్సులల్ల ఆడపిల్లల్ని ఏడిపిస్తుంటరనీ తన చిన్నక్క చెపుతుంటే చాలాసార్లు విన్నడు. తమ ఇంటి దగ్గరి మైదాన్‌ల ఫుట్‌బాల్ ఆడే ఒకరిద్దరు ముస్లిం యువకులు కూడ ఆ కాలేజీ విద్యార్థులేనని స్వామికి తెలుసు.
స్వామికి మరో ప్రపంచంలకు వచ్చినట్లుంది. కాలేజీని బాయ్‌కాట్ చేయడం, టిక్కట్ లేకుండ బస్సుల ప్రయాణించడం, నిజాం కాలేజీని చూడటం అతనికి సాహస కార్యాలుగ తోస్తున్నై. ఉద్యమం, నినాదాలు అతనికి తను చదివిన స్వాతంత్య్ర పోరాటాన్ని గుర్తు చేస్తున్నై. విద్యార్థులంత రోడ్డు దాటి అవతలివైపునున్న నిజాం కాలేజీ దిక్కు నడుస్తున్నరు. ఇంతల గాంధీశ్వర్ ఊరేగింపు ముందు భాగాన డాన్స్ చేయడం ప్రారంభించినాడు. చాలా అందంగ డాన్సు చేసినాడు. అది ఏదో ఇంగ్లీష్ సీన్మాల రాక్ అండ్ రోల్ డాన్స్ అట. అందరూ చప్పట్లు కొట్టుకుంట అతడ్ని ఉత్సాహపరుస్తూ తాము కూడ ఆ డాన్సును అనుకరించినారు. ఊరేగింపు నిజాం కాలేజీ గేటు నుండి లోపలకు ప్రవేశించింది. రాజుల భవనంలా, అంతఃపురంలా నిజాం కాలేజీ బిల్డింగు స్వామిని ఆకర్షించింది. లెక్చరర్లందరూ సాలార్‌జంగు హాల్ ఎత్తయిన మెట్లపై నిలబడి ఊరేగింపును చూస్తూ, నవ్వుకుంటూ మాట్లాడుకుంటున్నరు. తమపై వారికేమీ వ్యతిరేకత లేనట్లు అనిపించింది.
కాలేజీ గేటుకు అవుతల రోడ్డు మీద తండోపతండాలుగ ఇనుపటోపీలు, లాఠీలు ధరించిన పోలీసులు. కొందరి చేతులల్ల తుపాకులు. పోలీసు బలగాలని చూసేసరికి స్వామికి ముచ్చెమటలు పోసినై. భయంతో గుండె దడదడలాడింది. ఒక లాఠీదెబ్బ తన ఒంటిపై పడితే తన బక్క శరీరంల బొక్కలు విరగటం ఖాయం అన్న భయం స్వామి బుర్రల ప్రవేశించంగనే ఒళ్లంతా వొణికిపోయింది.
ఇంతలనే గోపి కలిసి తనను ఆ కాలేజీ బిల్డింగు వెనుక వైపు గుంజుకుని పోయినాడు. అక్కడ విశాలమైన ప్లేగ్రౌండ్. జంటనగరాల విద్యార్థులందరూ అక్కడే జమ అయినట్లు కనిపిస్తున్నది. మైకుల హిందీ దేశభక్తి పాటలు వేస్తున్నరు. ”గంగా మేరా మా కా నామ్ బాప్ కా నామ్ హిమాలయ్” అన్న పాట స్వామికెంతో నచ్చింది. ఇంతల స్టేజీ మీద నుండి విద్యార్థి నాయకుల ఉపన్యాసాలు ప్రారంభమైనాయి. ఉర్దూ, తెలుగు, హిందీలల్ల ఉపన్యాసాలు ఇస్తున్నరు. గోపాల్ అనే నాయకుడు అందరికీ అర్థం అయ్యే ఉర్దూల, తెలుగుల అద్భుతంగ, ఆవేశంగ ఉపన్యాసమిచ్చినాడు. సందర్భానుసారంగ అనేకసార్లు నవ్వించినాడు.
స్వామికి అతని ఉపన్యాసం చాలా నచ్చింది. ఉద్యోగాలన్ని ఆంధ్రావాళ్లే చేస్తున్నరని, తెలంగాణా ఉద్యోగాలన్ని తెలంగాణావాళ్లకే ఇవ్వాలని స్వామికి అర్థం అయింది. వాళ్ల ఇంట్ల ఎప్పుడూ ఇడ్లీలు, గోంగూర పచ్చడి తినరు కావున అవి తినే ఆంధ్రోళ్లు తమకు పరాయివారని కూడా అర్థమైపోయింది. ఏది ఏమైనా కాలేజీ ఎగ్గొట్టి ఫ్రీగ బస్సుల తిరిగే ఈ ఉద్యమం మరికొన్ని రోజులు ఇట్లనే కొనసాగాలని స్వామి లోలోపల మనస్సుల దేవుడికి మొక్కుకున్నడు.
ఇంతల హఠాత్తుగ సభల కలకలం మొదలయ్యింది. ఉపన్యాసాలు ఆగి పోయినయి. విద్యార్థులంతా కట్ట తెగిన ప్రవాహంలాగ అక్కడ్నుండి కాలేజీ గేటు వైపు దూసుకుపోతున్నరు. గోపి తన చేయి పట్టుకుని అటువైపు గుంజుకపోయినాడు. గేటుకు అవతలి వైపు రోడ్డు మీద చిప్పటోపీ పోలీసులు. ఇవతల కాలేజీ ఆవరణల విద్యార్థుల గుంపులు. ఇతర కాలేజీల నుండి సమావేశానికి వచ్చే విద్యార్థులను పోలీసులు రోడ్డు మీదనే ఆపి లోపలికి రానిస్తలేరు. వారిని లాఠీలతో వెనుకకు తరిమికొడుతున్నరు. గేటును మూసేసినారు. ‘పోలీస్ జులుం డౌన్ డౌన్’ అంటూ విద్యార్థులు నినాదాలు చేస్తున్నరు. వారిని లోనికి రానివ్వమని అరుస్తున్నరు. పోలీసులు ఆ కేకల్ని లెక్క చేస్తలేరు. కాలేజీ లోపలి నుండి విద్యార్థులు పోలీసులపై రాళ్లవర్షం కురిపించడం ప్రారంభించినారు.
స్వామి మనస్సు ఏదో కీడును శంకించింది. కాని గుంపుల చిక్కుకుపోయినాడు. అటు నుండి పోలీసులు బాష్పవాయువు ప్రయోగించినారు. ఆ టియర్ గ్యాస్ గోళాలు దూసుకొచ్చి తమ గుంపులపై పడసాగినాయి. తెల్లని పొగ. ఎవరూ కనబడటం లేదు. స్వామికి దగ్గు, కళ్ల మంటలు, కళ్లనీళ్లు రాసాగినై. భయం ముంచుకొచ్చింది. రాళ్ల వర్షం ఆగినందున పోలీసులు గేట్లు తీసుకుని కాలేజీ ఆవరణలకు దూసుకొచ్చినారు. చేతికి అందినవారినల్లా గొడ్లను బాదినట్లు బాదుతున్నరు. ఏడుపులు, హాహాకారాలు, నినాదాలు. క్షణాలల్ల కాలేజీ ఆవరణంత యుద్ధభూమిలాగ మారిపోయింది. కొంత మంది ధైర్యవంతులు దస్తీలతో ముఖాలు కప్పుకుని ఆ రాలిపడే టియర్ గ్యాస్ గోళాలను చేతులతోటి పట్టుకొని పక్కనే వున్న నీళ్ల తొట్లల్ల వేయసాగినారు. మరికొంత మంది వాటిని తిరిగి పోలీసుల పైన్నే విసిరివేస్తున్నరు.
పోలీసు మూకలు గేటు తెరిచి కాలేజీ భవనం లోపలికి దూసుకొచ్చి లెక్చరర్లు, సిబ్బంది అని చూడకుండ అందర్నీ చితకబాదుతున్నరు. పెటీల్ పెటీల్‌మని తలలు పగిలిపోతున్నై. కాళ్లు, చేతులు విరిగిపోతున్నై. పెడబొబ్బలు, ఆర్తనాదాలు. అయినా జై తెలంగాణా నినాదాలు మిన్నంటుతూనే ఉన్నై. స్వామి ప్రవాహంల కొట్టుకుపోతున్నడు. ఎటు వైపు పరుగెత్తుతున్నడో తెలుస్తనే లేదు. పరుగెత్తుతుంటే హఠాత్తుగ ముళ్ల కంచె అడ్డం వచ్చింది. దానికి తట్టుకుని విద్యార్థులంత దభీదభీమని కింద పడుతున్నరు. అక్కడ తోవ లేదు. వెనక నుండి వచ్చే వారంతా తోసుకుంట వచ్చి వారి మీదనే పడుతున్నరు. అడుగున కింద పడిన వారికి లేచే చాన్స్ లేదు. వెనక నుండి లాఠీలతో యమదూతల్లాగ తరుముకొస్తున్నరు పోలీసులు. ముందు ముళ్ల కంచె. వెనక యమదూతలు.
ఇంతల గోపి ఆపద్బాంధవుడిలాగ ఎక్కడ్నుంచి వచ్చినాడో తన చేయి పట్టుకుని మరో వైపు పరిగెత్తినాడు. చెప్పులు ఎక్కడో, ఎప్పుడో ఊడిపోయినై. పుస్తకాలు జారిపోయినై. బరికాళ్లతోనే పరుగులు. తుప్పలల్ల పరిగెత్తుతున్నందున రాళ్లురప్పలు, ముండ్లు పాదాలను గాయపరుస్తున్నై. భయంల ఏ బాధ తెలుస్తలేదు. ఇంతల ఒక పసుపుపచ్చ పిట్టగోడ అడ్డం వచ్చింది. అది కాలేజీ కాంపౌండ్ వాల్. గోపి ఒక్క గెంతుల ఆ గోడను ఎక్కి కూచున్నడు. స్వామికి గోడలు ఎక్కడం, దుంకడం రానే రాదు. చిన్నప్పటి నుండి ఆటలకు ఆమడదూరం. గోపీగాడే ఓ చెయ్యి అందించి గోడ మీదికి లాక్కున్నడు. మోకాళ్లు గోడకు కొట్టుకుపోయి రక్తం కారుతున్నది. గోడనైతే ఎక్కినాడు గాని కిందకు దుంకాలంటే భయం. అవుతలి వైపున లోతెక్కువ. తటపటాయిస్తున్న స్వామిని గోపి ఒక్క తోపు తోసినాడు. దభీమని నేల మీద పడినాడు. మళ్లీ దెబ్బలు. నొప్పి, బాధ. గోపి కూడా దుంకి మళ్లీ స్వామి చేయి పట్టుకుని పరుగో పరుగు. కాని అక్కడ రోడ్డు మీద పోలీసులు లేరు.
అది బషీర్‌బాగు నుండి పాత ఎమ్యెల్యే క్వార్టర్స్ హైదర్‌గుడాకు వెళ్లే రోడ్డు. పరుగెత్తుతనే ఎమ్యెల్యే క్వార్టర్స్ చౌరస్తాకు చేరుకున్నరు. వాళ్లతో పాటు చాలా మంది విద్యార్థులు పరుగెత్తుకొచ్చి అక్కడే జమ అయినారు. చూస్తుండంగనే కొద్ది సేపట్లనే అక్కడ పెద్ద గుంపు పోగయ్యింది. మనుషులందరూ విడివిడిగా వుంటే ఒకటి అంకెలే కాని వారందరూ ఒక్కటైతేనే వ్యక్తులు శక్తులుగా మారుతరు. మాబ్ సైకాలజీ. అక్కడ పోలీసులు ఎవరూ లేరు. వారందరికీ బాధ, కోపం, దెబ్బలు తిన్న అవమానం. తెలంగాణా ఆశయం పట్ల ప్రేమ. మళ్లీ వాళ్లల్ల అగ్నిని రాజుకునేలా చేసినాయి.
జై తెలంగాణా, జై జై తెలంగాణా నినాదాలు ప్రారంభమైనాయి. ఇంతల ఎదురుగ ఒకటి రెండు బస్సులు వచ్చినై. విద్యార్థులకు తమ ఆగ్రహం ఎవరి మీద చూపించాల్నో తెలియక రోడ్డు మీది రాళ్లను ఏరుకుని బస్సు అద్దాలపై గురి చూసి విసరటం ప్రారంభించినారు. స్వామి, గోపి కూడా అందులో చేరిపోయినారు. బస్సు అద్దాలు భళ్లుభళ్లున బద్దలైపోతుంటే ఏదో తెలియని తృప్తి, ఆనందం. తీరుతున్న కసి. చౌరస్తాల అందరూ ఈ గడబడలకు భయపడి తత్తరబిత్తరగా ‘తీన్ తేరా నౌ అఠారాగా’ నాలుగు మూలలకు పరుగెత్తుతున్నరు. దుకాణాల షట్టర్లన్నీ ధన్‌ధన్‌న మూసుకుంటున్నయి. పక్కన్నే వున్న ఇరానీ హోటల్ యజమాని భయంతోటి షట్టర్‌ను మూసేసే ప్రయత్నంలో వుండంగనే స్వామి, గోపీ మరికొందరు అండ్లకు చొచ్చుపోయినారు. నినాదాలు, చేతిలో రాళ్లు. ఇరానీ హోటల్ అద్దాలన్ని రాళ్లదెబ్బలకు పగిలిపోతున్నై.
స్వామికి భయం పోయి ఉత్సాహం ఇనుమడించింది. యజమాని కౌంటర్‌పై పెద్ద పెద్ద సీసం జాడీలు. అందులో బిస్కట్లు, చాక్లెట్లు, కేకులు వగైరా. స్వామి దృష్టి వాటి మీదకు పోయింది. హఠాత్తుగ అటు వైపు పరుగెత్తి ఆ సీసాలను రోడ్డు మీదికి విసరటం ప్రారంభించినాడు. బళ్లుబళ్లుమనే చిత్రవిచిత్ర చప్పుళ్లతో రోడ్డు మీద పడి పగిలిపోయే సీసాలు. బిస్కట్లు, చాక్లెట్లన్నీ మట్టిపాలు. ఆ గడబడతోటి హోటల్‌లోని గిరాకీలందరూ బిల్లులు చెల్లించకుండనే సందట్లో సడేమియాగా పారిపోయినారు. ఇరానీ వాడి గోలగోల. ఇంతల పోలీసు వ్యాన్ సైరన్. పోలీసుల విజిల్స్. పకడో, పకడో, మారో మారో అని పోలీసుల కేకలు. మళ్లీ టియర్ గ్యాస్. మళ్లీ లాఠీఛార్జి. ఈసారి భయం లేదు, తెగింపు, చొరవ. కట్టలు తెగిన దుస్సాహసం. కోల్పోయిన విచక్షణ. స్వామి, గోపీ తెలివిగ ఆ పోలీసుల పద్మవ్యూహం నుండి బయటపడి విఠల్‌వాడీ దిక్కు మళ్లీ పరుగు. గోపి ఇల్లు విఠల్‌వాడీలనే.
* * *
… తరువాత భాగం ఒచ్చే వారం
November 3rd, 2009 at 1:29 am
సలామ్ హైదరాబాద్ ను ప్రచురిస్తున్నందుకు మీకు దండాలు.
చాలా గొప్ప రచన. లోకేశ్వరన్నకు లాఖ్ లాఖ్ శుక్రియాలు.
“లెట్ అజ్ డిస్కవర్ తెలంగాణా” అంటున్నారు. కానరుక్ష” సోయి , తెలంగాణా టైంస్, తెలంగాణా పదకోశమ్” వంటి సైట్లను ఓపెన్ చేసేందుకు క్లిక్ చేయగానె A Trojan Horse was Found, Avasthi Warning. The connection was Reset వంటి వార్నింగులు హడల గొడుతున్నాయి. వెంటనే వాటిని సవరింప చేయ గోరుతున్నాను.
అట్లాగె అనేక తెలంగాణా సైట్లు అప్ డేట్ చేయక నిస్తేజంగా దుమ్ము పట్టికపోయి వుండడం చాలా బాధ కలిగిస్టొంది. ఇక “తెలంగాణా జాగ్రుతి ఫిల్మ్ తెలంగాణా ” వంటి మరి కొన్ని సైట్లు తెలుగును విస్మరించడమ్ శొచనీయం, అర్ధ రహితం. తక్షణమే వాటిని తెలుగీకరింపచేయ గలరు.
జై తెలంగాణా.!
November 14th, 2009 at 6:36 am
తెలంగాణా బ్లాగుల నిర్వఃహణ ఎందుకో అంత ఉత్తేజకరంగా ఉద్యమ స్థాయిలొ వుందటంఅ లెదు.
దయచేసి వీటిపై దృష్టి పెట్టండి.
చాలా బ్లాగులపై శత్రువులు వైరస్ దాడి చేసారు. అవి ఓపెనే కావడం లేదు. ట్రాజన్ హార్స్ వైరస్ వున్నట్టు భయపెడుతున్నాయి.
ఉదాహరణకు ఈ కింది బ్లాగులు ఒపెన్ చేసి చూడండి.
సోయి,
తెలంగాణా టైంస్
తెలంగాణా పదకొశం
ఎవరైనా సత్వరమే చర్య తీసుకొగలరు
జై తెలంగాణా అ
November 19th, 2009 at 9:35 am
thank you very much, doing a very intelligent work.