Feed on
Posts
Comments

Book Cover page ‘Salam Hyderabad’

పురాతన హైద్రాబాద్‌ నగర సంస్కృతీ సంప్రదాయాలను ప్రేమించేవారందరి తరఫున ఈ నవల రాసినాను. హైద్రాబాద్‌ గురించి చర్చ జరుగుతున్న ఈ సందర్భంలో ఒక కర్తవ్యంగ ఒక బాధ్యతగ ఈ నవల రాసినాను. చరిత్ర రథచక్రాలు ముందుకు పోవడంలో నా వంతు ప్రయత్నమే ఈ నవల.

ఢిల్లీ, లక్నో నగరాలకు సంబంధించి బోలెడంత సాహిత్యం అనేక భాషలలో వచ్చింది. ఆ రెండు నగరాలకు ధీటైన, సమవుజ్జీ నగరమైన హైద్రాబాద్‌ నగరం గురించి ముఖ్యంగా తెలుగులో కొన్ని కథలు, రెండు మూడు నవలల్లో పాక్షిక ప్రస్తావనలు మాత్రమే ఉండటం నన్ను బాధపెట్టింది. అందులో ఒకరు తమిళుడు. ఆయన రాసింది కూడా సికింద్రాబాద్‌ గురించి. ఎవరేం రాసినా వారు హైద్రాబాద్‌ నగర ‘జీవనాడి’ని పట్టుకోలేకపోయినారు. నగర జనజీవన చిత్రాన్ని చిత్రించలేకపోయినారు. నగరాన్ని అర్థం చేసుకొని అక్షరబద్దం చేయలేకపోయినారు.

‘ప్రాచీన లక్నో’ రచించిన అబ్దుల్‌ హలీం షరర్‌ లాగానో, ‘దిల్లీ’ నవల రాసిన కుశ్వంత్‌ సింగ్‌ లాగానో, ‘వైట్‌ మొగల్స్‌’ రాసిన విలియం డార్లింపుల్‌లాగానో హైద్రాబాద్‌ గురించి నవల రాయాలన్న కల సుమారు పది సంవత్సరాల కిందటి నుంచి నన్ను వెంటాడుతున్నది; వేధిస్తున్నది. చదవటం సరేసరి. ఐదారు సంవత్సరాల కిందటి నుంచి ‘ముడిసరుకుల సేకరణ’ మొదలయ్యింది. నగర చరిత్రను లిఖించాలని, నగర సుందరి ఆత్మకు అద్దం పట్టాలని, జనజీవితాన్నే కాక నగరంలో నడిచిన ప్రజా ఉద్యమాలను రికార్డు చేయాలని, పనిలో పనిగా ఒక ‘హైద్రాబాదీ’ ఆత్మకథను కూడా అందులో అంతస్స్రవంతిగా మలచాలని నిర్ణయించుకున్నాను. అయితే రచయితగా నాకున్న అర్హతలేమిటని వంద సార్లు నన్ను నేను తరిచి తరిచి ప్రశ్నించుకుంటే ప్రతిసారీ ఒకేఒక సమాధానం దొరికేది. అది నేను ‘పైదాయిషీ హైద్రాబాదీ’ని అని.

పందొమ్మిది వేల ఏడు వందల పది రోజుల కిందట అనగా సరిగ్గా యాబై నాలుగు సంవత్సరాల కిందట నేను హైద్రాబాద్‌ పాతనగరం గల్లీలలో కళ్లు తెరిచి ఈ భూమి మీద పడినాను. ఇక అప్పటి నుంచి ఇప్పటి వరకు పాతనగరం పొత్తిళ్ల నుండి ఇవతల పడనేలేదు. గండిపేట నీళ్లను వొదలనే లేదు. ఈ ‘జన్మభూమి’ హక్కు, అర్హతనే ఈ నవల రాయడానికి ప్రేరణను ఇచ్చింది. నేలతల్లి రుణాన్ని అక్షరాభిషేకం ద్వారా తీర్చుకోవాలన్న తపన ఫలితమే ఈ నవల.

మాట వరుసకు కాదు – సాహిత్యం సామూహిక సృష్టి అని నేను నిజాయితీగా నమ్ముతాను. నిజమైన నగర ప్రేమికులందరి తరఫున బాధ్యత అప్పగించబడిన ఒక ‘ప్రతినిధి’గా మాత్రమే నేను ఈ నవలా యజ్ఞాన్ని నిర్వహించినాను. నగర సంకీర్తనను గానం చేసినాను. ఈ గూటి పక్షిగా ఇక్కడి పాటనే పాడినాను. ఆడినా పాడినా ఓడినా గెలిచినా ఇక ఇక్కడే. జీనా యాహాఁ మర్నా యహాఁ. చివరాఖరికి పురానాపూల్‌ చితిమంటల చిటపటలలో నుండి ఫీనిక్స్‌ మాదిరి లేచి చార్‌ సౌ సాల్‌ పురానా షహర్‌ గల్లీలలో రెపరెపలాడుతూ మళ్లీ మళ్లీ విహరిస్తాను. మళ్లీ మళ్లీ జీవిస్తాను.

భ్రమరం పలు రకాల పుష్పాల నుండి మకరంద బిందువులను సేకరించినట్లు ఈ నవల కోసం పలు గ్రంథాల నుండి అనేక విషయాలను ముడిసరుకులుగా సేకరించుకున్నాను. ఆ గ్రంథ రచయితలందరికీ నేను రుణపడి వుంటాను. వారందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు. అనేక దినపత్రికలకు కూడా కృతజ్ఞతలు.

ఈ నవలకు తీసుకున్న కాలం 1578 – 1970 జులై 10. ముందే చెప్పినట్లు జడపాయలాగా ఈ నవలను మూడు విషయాలతో అల్లినాను.

  1. హైదరాబాద్‌ చరిత్ర, సంస్కృతీసాంప్రదాయాలు, నగర జనజీవితం, నగర సమాజ చిత్రణ.
  2. ఈ నగరం నేల మీద నడిచిన రాజకీయాలు, ఉద్యమాలు. 1578 నుంచి 1970 – ప్రత్యేక తెలంగాణ ఉద్యమం, నక్సలైట్‌ ఉద్యమం, దిగంబరోద్యమం, విరసం ఆవిర్భావం వరకు.
  3. నవలలో ప్రధాన పాత్రధారి (Protogonist) స్వామి ఆత్మకథ.

ఈ ‘సామూహిక సృష్టి’లో నేను మొట్టమొదట స్మరించుకునేది ప్రముఖ పాత్రికేయులు స్వర్గీయ జి. కృష్ణగారిని. హైద్రాబాద్‌ నగరం మీద నవల రాస్తున్నట్లు చెప్పంగనే ‘శుభం’ అని సంతోషంతో ఆశీర్వదించినారు. నగరం గురించి అనేక ముచ్చట్లు చెప్పుతానని వాగ్దానం చేసి తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయినారు. ఆ తర్వాత నేను గౌరవించేది పూజ్యనీయులు, పెద్దలు, తెలంగాణకు పెద్ద దిక్కు అయిన శ్రీ సామల సదాశివగారిని. ‘నీ వచనం బాగుంటది. ఇంకా, నువ్వు మాత్రమే హైద్రాబాద్‌ గురించి రాయగలవు’ అని ధైర్యాన్ని, విశ్వాసాన్ని ప్రసాదించింది ఆ పెద్దాయనే. శిరసు వొంచి భక్తితో ఆయనకు నమస్కారం చేస్తున్నాను. ఇక రెండవవారు ప్రముఖ చలన చిత్ర దర్శకులు శ్రీ బి. నరసింగరావుగారు. నిజానికి నాచే ఈ నవలా రచనకు అక్షరాభ్యాసం చేయించింది ఆయనే. కొన్ని సంవత్సరాల కిందటే నగరానికి సంబంధించిన అనేక గ్రంథాలను, అపురూపమైన ఫొటో ఆల్బమ్‌లను అందజేసినారు. కలిసిన ప్రతిసారీ ‘ఆలస్యమైనా ఫరవాలేదు కని మంచిగ రాయి’ అని నాకు భరోసాను కలిగించేవారు. ఆయన సహకారం, స్ఫూర్తి లేకపోతే ఈ నవల వెలుగు చూసేది కాదు. ఆయనకు కూడా శిరసు వొంచి నమస్కారం చేస్తున్నాను. ఇంకా ఎందరెందరో మహానుభావులు. పుస్తకాల సేకరణలో నాతో పాటు ఓపికగా ఖమ్మం అంతా తిరిగిన శ్రీ గుడిపూడి సుబ్బారావుగారు, అడిగిన వెంటనే అనేకసార్లు పుస్తకాలను కొరియర్‌లో పంపిన శ్రీ దేవులపల్లి కృష్ణమూర్తిగారు, నవలాశిల్ప రహస్యాలను విప్పి చెప్పిన నోముల సత్యనారాయణగారు…… వీరందరూ ‘సామూహిక నవలా యజ్ఞం’లో పాలు పొంగించినవాళ్లే. ఆ ముగ్గురు మూలపురుషులకు పరిపరి దండాలు.

ఇక ఈ ‘ముసాఫిర్‌’కు హమేషా కుడిఎడమల నిల్చున్నది ఇద్దరే ఇద్దరు. ఒకరు నా అర్థాంగి శోభ. మరొకరు నా దోస్త్‌ వేణు సంకోజు. నేను రాసే ప్రతీ అక్షరానికీ ఒకరు తొలి పాఠకులైతే, మరొకరు మలి పాఠకులు. నన్ను ‘సవరించిన’ ఆ ఇద్దరికి కృతజ్ఞతలు చెప్పడమంటే అద్దంలో నా ప్రతిబింబానికి నేనే కృతజ్ఞతలు చెప్పుకోవడం.

”ఇంకొంచెం సువర్ణం పూసి మరికొంచెం సుగంధం రాసి” అన్నట్లు, ”ఇంకొన్ని నగిషీలు చెక్కమని” చక్కని సలహాలను అందించిన ప్రియ మిత్రుడు డాక్టర్‌ ఎ.కె. ప్రభాకర్‌కు కృతజ్ఞతలు.

అట్ట మీది బొమ్మ కోసం రాతలు రాసి, గీతలు గీసిచ్చిన తమ్ముడు ఏలె లక్ష్మణ్‌కు బహుత్‌ బహుత్‌ షుక్రియా. అలనాటి లక్ష్మణుడు రాజ్యాన్ని ఏలకున్నా ఈనాటి లక్ష్మణుడు చిత్రప్రపంచాన్ని ‘ఏలే’ లక్ష్మణ్‌గా అవతరిస్తాడని ఆశిస్తూ…..

ఈ నవలలో నేను మాట్లాడే హైదరాబాద్‌ ‘యాసబాసలు’ వాడినాను. అయితే 150, 200 సంవత్సరాల కిందటి రెండు రెసిడెన్సీ కథలను రాసేటప్పుడు మాత్రం ఆ రోజులకు సంబంధించిన యాసబాసలు తెలియవు కావున పత్రికాభాషను పాటించాను.
బాణామతి మీద అభిప్రాయాలు నావి కావు. అదంతా మా అమ్మ ‘గోస’. తాంత్రికులకు సంబంధించి ‘సేకరించిన’ సమాచారం, జాతకచక్రానికి సంబంధించిన అభిప్రాయాలు కూడా నావి కావు.

నా తప్పులన్నీ ఒప్పులుగా డిటిపి చేసిచ్చిన చెల్లె సరస్వతికి ధన్యవాదాలు అర్పిస్తూ….. కొన్ని సంవత్సరాల నుండి నా మానాన నన్ను వదిలేసి, నన్ను తీరికగా రాసుకోనిచ్చిన నా పిల్లలు సమత, గాంధీ ‘రాజా’లకు ఆశీస్సులు అందిస్తూ…ఈ సాగుతున్న సాహిత్య ‘యాత్ర’ ఇంతటితో అయిపోలేదని, త్వరలోనే మళ్లీ లుస్తానని ‘వాదా’ చేస్తూ…..

మీ
- పరవస్తు లోకేశ్వర్‌ హైద్రాబాదీ
హైదరాబాద్, 15-07-2005

* * *

సలాం హైద్రాబాద్‌

లోకేశ్వర్‌

గాంధి ప్రచురణలు
హైద్రాబాద్‌

అంకితం

తమ శ్రమశక్తితోటి సుందరమైన నగరాన్ని నిర్మించి, చరిత్రను లిఖించి, చరిత్రకు అందకుండ అనామకంగ తెర వెనుకకు వెళ్లిపోయిన హైద్రాబాద్‌ ప్రజలకు……

SALAAM HYDERABAD
(Telangana novel)
by
LOKESHWAR

First Publication July 2005
Copies : 1000
Gandhi Publications, No.5
“SHOBHA”
H.No. 12-2-709/5/1/c , Navodaya Colony
Mehidipatnam , Hyderabad – 500 028
Phone : 040 – 23516539
Cell : 9849671525

Shobha

Cover & Title Disign : Aelay Laxman
Printing : Karshak Art Printers
O.U. Road, Vidyanagar, Hyderabad
Ph : 040 – 27618261, 040 – 27653348

Type setting : Saraswathi
Shalivahanagar, Hyderabad
Ph : 040 – 55367452
Cell : 9848956375

Copies available with Publisher & All Leading Bookshops of Andhra Predesh

Price : Rs. 250/- (* please check with the publishers)

* * *

Leave a Reply

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

Managed by Discover Telangana Inc., a registered nonprofit organization in USA.

All opinions and views expressed by third party content providers and shown here as preview are not that of Discover Telangana.

If you find any Content that is infringing, libelous, defamatory, obscene, abusive, offensive or otherwise violation of copyright law, alert us by emailing us at discover.telangana(at)gmail.com