Feed on
Posts
Comments

”బిష్ణు అజ్‌ నై చూఁ హికాయత్‌ మీకునద్‌”

”పిల్లనగ్రోవి ఏదో కథ చెప్తున్నది. విను.” అంటూ జగత్ప్రసిద్ధమైన తన మస్నవీ కథలు చెప్పటం మొదలు పెట్టినాడు మోలానా రూమీ. వెదురుపొదలోంచి వేరు చేయబడిన వెదురుముక్క మూగగా పడి వున్నది. ఉలుకదు – పలుకదు. ఎవరైనా పలికించాలని ఊదితే బర్‌ – బర్‌ అనే సవ్వడే కాని ఒక్క సుస్వరం వెలువడదు. అన్నీ అపస్వరాలే. ఎవరైనా వెక్కిరిస్తే, పరిహసిస్తే సహించుకుంటుంది. సర్దుకుపోయి పడివుండటం అలవాటయింది దానికి. సహించటం ఎంతకాలం? సర్దుకుపోవటమైనా ఎంత కాలం? తన మూలాన్నే తనకు కాకుండా చేసిరి కదా అని లోలోపలే కుమిలికుమిలి ఏడ్చింది. ఎంతగా ఏడ్చిందంటే ఎడద చిల్లులు పడింది. అప్పుడు పలికిందయ్యా! అన్నీ సుస్వరాలే. సప్తస్వరాల సరాగాలతో తన సంగతులు పలికింది. పదిలంగా వున్న తన పొదను చూసుకొని పరవశించి కథలు చెప్పింది. ఆ కథలే మోలానా రూమీ మస్నవీ.

‘సలాం హైదరాబాద్‌’ అనే ఈ కమ్మల్లో ‘పైదాయిషీ హైదరాబాదీ పరవస్తు లోకేశ్వర్‌’ ఏవో కథలు చెప్తున్నాడు వినండి.

తాను పుట్టిపెరిగింది పల్లెటూరే అయినా, పట్టణమైనా దాని మట్టిని, మట్టివాసనను, ఆ మట్టిలో పుట్టి పెరిగినవాళ్లను, మనిషైనవాడు మనసు నిండా ప్రేమిస్తాడు. లోకేశ్వర్‌కు ప్రేమించటం, ఆదరించటం, గౌరవించటం తెలుసు. అసలు హైదరాబాద్‌ నగరం నిర్మాణమే ప్రేమ మీద ఆధారపడి వున్నది. కులీకుతుబ్షా తన ప్రేయసి భాగ్‌మతి పేర నిర్మించిన నగరం భాగ్యనగరం. ‘హైదర్‌ మహెల్‌’ అనే గౌరవనామంతో భాగ్‌మతి కులీకుతుబ్షా జనానాలో చేరిన తరువాత భాగ్యనగరం హైదరాబాద్‌ అయింది. చార్‌మినార్‌ హైదరాబాద్‌కు అలంకారం. లోకేశ్వర్‌ చిన్నప్పుడే చార్‌మినార్‌ను చూసి సంబరపడ్డాడు. దాని ఆకారం అతని మనోమస్తిష్కాల్లో నిలిచిపోయింది. హైదరాబాద్‌లో ఏ ముషాయిరా జరిగినా జహాందార్‌ అఫ్సర్‌ అనే సుప్రసిద్ధ ఉర్దూకవి తాను రాసిన ‘చార్‌మినార్‌’ అనే కవిత తప్పక వినిపించేవాడు. అతడు వినిపించకపోతే శ్రోతలు ఫర్మాయిష్‌ చేసి వినేవాళ్లు.

”చార్‌మినార్‌ కే ఇస్‌ షహర్‌ మె రహనే వాలో

చార్‌మినార్‌ కా మత్లబ్‌ క్యా హై?”

ఈ ప్రశ్నతో మొదలవుతుంది ఆ కవిత. చార్‌మినార్‌ అంటే దాని భావమేమి? అని కవి ప్రశ్న. లోకేశ్వర్‌ చార్‌మినార్‌ అంటే ఏమిటో ఈ కమ్మల్లో చెప్పే ప్రయత్నం చేసినాడు. హైదరాబాద్‌ అన్నపూర్ణ. ఎక్కడికెక్కడి వాళ్లో వచ్చినారిక్కడికి. వచ్చి స్థిరపడ్డారు. భారతదేశంలోని పలు ప్రాంతాల్లోంచే కాక హబ్షీలు, నీగ్రోలు, అరబ్బులు – ఇలా ఎన్నో జాతులవాళ్లు వచ్చినారు. వాళ్ల సంతానమిప్పటికీ హైదరాబాదులో స్థిరపడి వున్నది. ఎవరి వృత్తిలో వాళ్లు వృద్ధి పొందుతూ హైదరాబాద్‌ నగరాన్నే కాక హైదరాబాద్‌ రాష్ట్రాన్ని సంపన్నం చేసినారు. తాము బాగుపడ్డారు. సాధ్యమైనంత వరకు నగరాన్ని, రాష్ట్రాన్ని బాగుపరిచే ప్రయత్నం చేసినారు. ఇక్కడి మూలవాసుల్లో కలిసిపోయినారు. మూలవాసుల ఉద్యమాలన్నిట్లో పాల్గొన్నారు. ఉత్తరాది నుంచి వచ్చిన కొందరు ఉర్దూ కవులు, పండితులు మాత్రం ఇక్కడి ఉర్దూను ఈసడించుకున్నారు. అప్పుడే హైదరాబాదులో ”నాన్‌ ముల్కీ గో బ్యాక్‌” అనే నినాదం మొదటిసారి వెలువడింది. తరువాత వచ్చినవాళ్లు కొందరు ఇక్కడివాళ్ల సంస్కారాన్ని, భాషను, యాసను పరిహసించి తామే గొప్పవాళ్లమన్నట్లు ప్రవర్తించినారు.

అదిగో, ఆ కొందరి కారణంగానే అందరిపట్ల పరాయి భావం యేర్పడింది. ఆ తరువాత జరిగిన కథంతా తెలిసిందే. ఈ కమ్మల్లో లోకేశ్వర్‌ ఆ ముచ్చట్లన్నీ వైనంవారీగా చెప్పుకవచ్చినాడు. మాటిమాటికీ నేను కమ్మలు అంటున్నా ఇది ఒక దీర్ఘ నవల. ఇందులో హైదరాబాదు నగర పూర్వసంస్కృతి; ఈ తరంవాళ్లకు తెలియని అనేక విషయాలు ప్రస్తుతీకరించబడినవి. లోకేశ్వర్‌ చూచిన హైదరాబాదును మన కళ్ల ముందుంచినాడు. అతని తొలి బాల్యం, మలి బాల్యం హైదరాబాదు గల్లీల్లోనే గడిచింది గనుక అప్పటి ఆటలు, పాటలు, ఆచారవ్యవహారాలు, ఇరానీ హోటల్లు, సర్వర్లు వంగివంగి ‘క్యా హుకుమ్‌ హై, సర్కార్‌?’ అని వినయంగా ప్రశ్నించే సంప్రదాయం – ‘ఏక్‌ చాయ్‌, ఏక్‌ మె దో చాయ్‌, దో మె తీన్‌ చాయ్‌, మలైదార్‌ పౌనా, పాయ్‌, పాయేకా షోర్బా, నిహారీ ఔర్‌ కుల్చా, ఖిచిడీ ఔర్‌ ఖీమా, బిర్యానీ, తందూరి రోటి – ఇవన్నీ లోకేశ్వర్‌కు ఇప్పటికీ నోరూరిస్తాయి. ఇవన్నీ తిన్న మాలాంటివారికీ నోరూరిస్తాయి.

ఇవే కాక అనేక చారిత్రకాంశాలు, మహలఖా బాయీ చందా వ్యక్తిత్వము, జాన్‌ మాల్కమ్‌తో ఆమె ప్రేమవ్యవహారం, పాట్రిక్‌ ఖైరున్నిసా ప్రేమవ్యవహారం కూడా వున్నాయి ఇందులో. ఇదంతా హైదరాబాదు చరిత్ర. ఇవన్నీ లోకేశ్వర్‌ చిన్ననాటి తీయని జ్ఞాపకాలు.

హైదరాబాదును చాలా ప్రేమించినాడు లోకేశ్వర్‌. బాధ్యతగల పెద్ద మనిషి ఎవరో ”మా కారణంగా హైదరాబాదు నగరం అంత సుందరంగా తయారయింది. అంతకు ముందు అక్కడేమి వుండేది? సిమెంటు కాంక్రీటు భవనాలుండేవా? ఆకాశహర్మ్యాలుండేవా? మట్టిగోడల భవనాల గోడలే కదా!” అని యెద్దేవా చేస్తూ వుంటే హైదరాబాదు నగరంలోనే కాదు, హైదరాబాదు రాష్ట్రంలో పుట్టిపెరిగినవాళ్లందరికీ ఆవేదన కలిగిస్తుంది. ఆనాటి మట్టిగోడల సౌధాలను, ఆ సౌధాల ముందుండే విశాలమైన ప్రాంగణాలు, అందమైన చెట్లను చూసినవాళ్లకు ఆ పెద్ద మనిషి మాటలు బాధ కలిగిస్తాయి.

ఒకప్పుడు మన దేశానికి ప్రధానమంత్రిగా వున్న ఇంద్రకుమార్‌ గుజ్రాల్‌ హైదరాబాదుకు వచ్చి ”నేను చూచిన అందమైన హైదరాబాదేమయింది? ఇప్పుడున్నది సిమెంటు కాంక్రీటు భవనాల అరణ్యమే” అని తన విచారాన్ని వ్యక్తం చేసినాడు.

డా. గోవర్ధనశాస్త్రి ‘సియాసత్‌’ ఉర్దూ పత్రికలో ‘హైదరాబాద్‌ కా ఆంగన్‌ గాయబ్‌’ అని ఒక వ్యాసం రాసినాడు. అప్పటి అందాలన్నీ లోకేశ్వర్‌కు తెలుసు. ఇప్పటి హైటెక్‌ వైభవాన్నీ చూస్తున్నాడు. ఈ నవలలో ఆ అందాలన్నీ పోయినవని ఆవేదన వ్యక్తమవుతున్నది.

ఎడదకు చిల్లులు పడితేనే కదా సుస్వరాలు పలికేది. నా చెవులకివన్నీ సుస్వరాలే.

ఆదిలాబాద్‌ – సదాశివ (7-7-2005)

Leave a Reply

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

Managed by Discover Telangana Inc., a registered nonprofit organization in USA.

All opinions and views expressed by third party content providers and shown here as preview are not that of Discover Telangana.

If you find any Content that is infringing, libelous, defamatory, obscene, abusive, offensive or otherwise violation of copyright law, alert us by emailing us at discover.telangana(at)gmail.com