Feed on
Posts
Comments

2

ప్రతి పిల్లగాలి తెమ్మెరకు చిగురాకు వోలె చలించిపోయే హృదయం స్వామిది. ప్రతి చిన్న సంఘటనకు ‘అసంకల్పిత ప్రతీకారచర్య’ వోలె స్పందించే హృదయం స్వామికి ఎక్కడి నుండి వచ్చింది? బహుశా పాలు తాగే పసిడి ప్రాయంలోనే స్వామికి ఆ గుణం అమ్మ ఒడిలనే అబ్బిందేమొ!

* * *

అమ్మ పక్కల వెచ్చగ నిద్రపోతున్న స్వామి కళ్లు తెరిచినాడు. అమ్మ చీరె కొంగు వాడి ముఖంపై పడి ఉక్కిరిబిక్కిరై కాళ్లు చేతులు తసబిసా కొట్టుకున్నడు. హమ్మయ్య కొంగు తొలిగింది. గాలి ఆడుతుంది. ఆపద తొలిగిపోయిందని హాయిగా నవ్వినాడు. అమ్మ ముఖంలోకి చూసేసరికి అందమైన అమ్మ ముఖం. పచ్చని ముఖం. నుదుట ఎర్రని గుండ్రని కుంకుమ బొట్టు వాడి దృష్టిని ఆకర్షించింది. వాడి కళ్ల నిండ ఎరుపుదనం నిండిపోయింది. మళ్లీ చూపుల్ని మళ్లించినాడు. ఈసారి కళ్లలో ఆకుపచ్చదనం అలుముకుని పరవశించిపోయినాడు. ఆకుపచ్చ రంగు అమ్మ చీరె కొంగు. చేతుల్తో పట్టుకుని కాసేపు ఆడుకున్నడు. ఆకలయ్యిందేమో అంతలనే ఏడుపు. అంత వరకు చందమామ కథల పత్రిక చదువుకుంటున్న అమ్మ కొంచెం కదిలి వాడికి స్తన్యం అందించింది. ధార, తియ్యని ధార, పాలధార, ప్రాణధార, పంచదార. తృప్తిగా చప్పరిస్తూ పాలు తాగుతున్న స్వామి మళ్లీ తలెత్తి అమ్మ వైపు చూస్తే అమ్మ చేతిల రంగురంగుల బొమ్మల పత్రిక, ఎన్ని రంగులు, ఎరుపు, ఆకుపచ్చ, పసుపుపచ్చ, తెలుపు, నలుపు, అమ్మ ముఖం లాంటి పసుపుపచ్చ రంగు. చీరె కొంగులాంటి చిలకపచ్చ రంగు, నుదుట బొట్టులాంటి ఎరుపురంగు, రంగుల బొమ్మలు. రకరకాల మనుషుల బొమ్మలు, చెట్లు, ఆకులు, పువ్వులు, పక్షులు, జంతువుల బొమ్మలు, రంగురంగుల ఆకాశం, కొండలు, గుట్టలు, నదులు, సముద్రాలు, రంగులమయం. అంతా హరివిల్లు మయం. అమ్మ-అమ్మకు సంబంధించిన రంగులు. పుస్తకం-పుస్తకంల రంగులు. అమ్మ సామీప్యపు వెచ్చదనం. పాలధారల తియ్యదనం, సంతోషం, ఆనందం, కేరింతలు.

అట ఎవళ్లకు తెలియకుండనే వాడికి కూడ తెలియకుండనే అక్షరాభ్యాసం జరిగిపోయింది. పాలతో పాటు పుస్తకం కూడ ఏకకాలంల పరిచయం అయ్యింది. చాలా సహజంగ పుస్తకం, పుస్తకంలోపలి రంగులు, బొమ్మలు పరిచయమైనాయి. పాలు తాగినంత సహజంగ పాలు, పుస్తకం, అమ్మ ఈ మూడు ఒక్కటే అనుకున్నడు ఆ బంగారు సమయంలో.

* * *

కాలం స్తంభించినట్టు ఇల్లంత ఏకాంత నిశ్శబ్దం. మధ్యాహ్నసమయం. ఇంట్ల ఎవళ్లూ లేరు అమ్మా స్వామి తప్ప. కడుపు నిండి నిశ్శబ్ద సంగీతాన్ని ఆస్వాదిస్తున్నడు. ఎక్కడ్నుంచో కోయిల కూ – కూ కూతలు. ఆగి ఆగి లయబద్దంగ ఆ ప్రశాంత వాతావరణంల సుతారమైన ఏక్‌తారా నాదంలాగ. ప్రతీరోజూ ఇదే మాదిరి మధ్యాహ్న ఏకాంత నిశ్శబ్ద సమయాలల్ల స్వామి కోకిలమ్మ కూకూలని వింటూ రాగాల లోకాలల్ల అనుకోకుండనే అడుగు పెట్టినాడు. అట్ల సంగీతం కూడ వాడికి సహజంగనే పరిచయం అయ్యింది.

అమ్మ పుస్తక ప్రపంచాన్ని పరిచయం చేస్తే బాపు పాటల లోకాలను, రాగాల ఆలాపనలను ఆవిష్కరించినాడు. పాట-పుస్తకం రెండు వాడి స్వప్నప్రపంచంల సంతోష చంద్రశాలలుగ స్థిరపడినాయి.

ప్రతి రాత్రి బాపు తన ఎదమీద పండబెట్టుకుని కమ్మని పాటలు పాడేటోడు. చిన్ని కృష్ణా, వెన్న కృష్ణా, వన్నెల కృష్ణా అంటూ రాగమాలాపించి దూరతీరాలకు నిద్రలోకాలకు తీసుకపోయెటోడు. పాటలు పాటలు. ప్రవాహంలాగ పాటలు. పాడుతూ పాడుతూ నిద్రపోయిండని పాట ఆపంగనే ఇంకా నిద్రపోని స్వామి తలెత్తి బాపు ముఖంలకు చూసేటోడు ‘పాట ఆపినవేంది’ అని ప్రశ్నించినట్టు. మళ్లీ ఇంకో పాట. అట్ల వాడు పాటలల్ల తేలిపోతూ ప్రపంచపు పొలిమేరలు దాటి స్వప్న లోకాలకు చేరుకునేటోడు.

* * *

అమ్మ అటు వైపు తిరిగి పండుకుని ‘చందమామ’ చదువుకుంటుంది. అమ్మ ముఖం చూద్దామనుకుంటే వీలు కాలేదు. పుస్తకం కనబడింది. కొత్త బొమ్మ, కొత్త రంగులు. చూపులు బాణాలై వాటిలోపలికి దూసుకపోయినై. భయం కల్గించే బొమ్మ. అయినా కుతూహలంతో వాని కళ్లు ఆల్చిప్పల్లాగ విచ్చుకున్నయి. ఎవరో నడుస్తున్న మనిషి భుజం మీద మరో మనిషి నిద్రపోతున్నట్లు పండుకుని వేలాడుతున్నడు. ఆ వేలాడే మనిషి వంటి మీద ఎటువంటి బట్టలు లేవు, ఒక చిన్న గోచీ తప్ప. ఆ గోచీ వాణ్ణి చాలా ఆకర్షించింది. వాడెందుకట్ల పండుకున్నడో, ఆ నడుస్తున్న మనిషి వాడిని ఎందుకు అట్ల మోస్తూ ఎక్కడికి తీసుకపోతున్నడో వానికి అర్థం కాలేదు. అయినా ఆ బొమ్మ వాణ్ణి అమితంగ ఆకర్షించింది. ఇంక కొంచెం పరిశీలించి చూసినాడు.

అది రాత్రికి సంబంధించిన దృశ్యం. అంతా చీకటి చీకటిగ వుంది. ఆ చిక్కని చీకట్ల బక్కచిక్కిన ఒక చెట్టు ఒంటరిగ, దిగులు దిగులుగ, భయం భయంగ నిలబడి వుంది. ఆ చెట్టు తొర్రలల్ల, ఆ చెట్టు వెనకనున్న చీకటి ఆకాశంల అక్కడక్కడ మనుషుల పుర్రెలు. నల్లటి చీకటిల తెల్లగ మెరిసే పుర్రెలు. అండ్ల ఖాళీగ ఉన్న గుంటకళ్లు. నవ్వుతున్నట్లు కనబడుతున్న కోరపండ్లు. ఆ నడుస్తున్న మనిషి చేతిలున్న పొడుగు కత్తి వానికి నచ్చింది. ఆ కత్తి తెల్లగ ధగధగలాడుతుంది. దాని కొన సన్నగ మొనదేలి పదునుగ మెరిసిపోతున్నది. ఆ మెరుపుతో వాడికి చీకటి భయం తొలగిపోయింది. మనస్సు తేలికయ్యింది. కని అంతలనే మళ్లీ దిగులావరించింది. కింద నేల మీద నల్లగ మెలికలు మెలికలుగ మసలుతున్న ఓ పొడుగైన పాము. అది వంకరటింకరగ పాకుతుంది. దాని వ్యవహారం వానికేం నచ్చ లేదు. దాని ముందు మనిషి కాలి ఎముక ఎవళ్ల కోసమో నిరీక్షిస్తున్నట్లు పడి ఉంది. ఆ బొమ్మల వున్న విడివిడి భాగాలు వానికి నచ్చలేదు గని ఆ బొమ్మకు సంబంధించిన మొత్తం దృశ్యం మాత్రం వాణ్ణి ఆకర్షించింది.

అమ్మ చందమామ చదివే ప్రతిసారీ వాడు ఆ బొమ్మ కోసం వెదికెటోడు. ఆ పేజీ కోసం మూగగా ఎదురు చూసెటోడు. ఆ బొమ్మ ఉన్న పేజీ రాంగనే అండ్ల లీనమయ్యెటోడు. ఆ నడుస్తున్న మనిషి, వాడి చురుకు చూపులు, కోరమీసాలు, మొన తేలిన కత్తి అంచు, భుజం మీద వేలాడే మనిషి, వాడి చిన్న గోచీ, చీకటి రాత్రి, భయం గొల్పే దయ్యాల పుర్రెలు, మెలికలు తిరిగే నల్లని పాము, నిరీక్షించే కాలి ఎముక వాని చిన్ని సృజనాత్మక ఊహాప్రపంచంలో స్థిరంగ అట్లనే ఫొటో ప్రింట్‌లాగ నిలిచిపోయినై.

ఆ నడుస్తున్న మనిషి పట్టువదలని రాజు విక్రమాదిత్యుడనీ, అతని భుజం మీద వేలాడుతున్నది శవంలోపలి భేతాళుడని వానికి తెలియదు కదా – పాపం !

తొందరగనే వాడు మరో ప్రపంచం గురించి తెలుసుకున్నడు. అదే ‘కథా ప్రపంచం’. కథలు వాని ఊహా ప్రపంచాన్ని విస్తృతపరుస్తున్నయి. ఉత్తేజపరుస్తున్నయి. కథల కోసం అమ్మాబాపుల్ని సతాయిస్తున్నడు. అన్నం తినమంటే కథ చెప్పుతెనే తింటనని కండీషన్లు. ఒక కథతోటి సరిపుచ్చుకోడు. ముద్దముద్దకు కథ వినిపించాలని గొడవ. చివరికి కథ విన్పిస్తరంటేనే స్నానానికి హాజరు. మధ్యమధ్యల సందేహాలు. సమాధానాలు. ఒక కథ నుండి మరో కథకు వెళ్లిపోవడాలు. గొలుసు కథలు. కాశీమజిలీ కథలు. బాలనాగమ్మ కథలు. వాడు కథల కాబూలివాలాగ మారుతున్నడు.

పాపం అమ్మాబాపులు కథలు చెప్పే విషయంలో వానికి బాకీదారులైపోయినారు. ఏ మాత్రం వీలు చిక్కినా వాడు వారిద్దరినీ కథల కోసం నక్షత్రకుడిలాగ వేధిస్తున్నడు. జబర్దస్తీగ కథలు వసూలు చేసుకుంటున్నడు. వాళ్లు స్వంతపనులల్ల సీరియస్‌గ, బిజీగ ఉంటే హఠాత్తుగ వెనక నుండి వచ్చి వీపు మీద వాలి మెడచుట్టూ చేతులేసి ‘ఒక కథ చెప్పవా?’ అని బ్రతిమాలుతడు లేదా డిమాండ్‌ చేస్తడు. వాని వ్యవహారం చూస్తుంటే ‘తెలిసీ చెప్పకపోయావో జాగ్రత్త’ అని బెదిరించే భేతాళుడే జ్ఞాపకం వస్తడు. వాడు ద్విపాత్రాభినయం చేస్తున్నడు. కథల కోసం బెదిరించే భేతాళుడు వాడే, పాటల కోసం పట్టు వదలని విక్రమాదిత్యుడూ వాడే.

పిల్లలకు ఆస్తుల్ని ఇచ్చిన ఇవ్వకున్న ఫరవాలేదు. కథలను, పాటలను మాత్రం వారసత్వంగ ఇచ్చి తీరాల్సిందే.

* * *

అప్పుడే తెల్లవారింది. ఇంక ఎండ రాలేదు. ప్రతీ రోజు లేవంగనే, నిద్రకళ్లతోటే ఇంటి ముంగిట్లకు పోయి అక్కడున్న చెట్టు కింది సిమెంటు అరుగు మీద కూచుండి ఉదయాన్ని, చల్లగాలులను ఆస్వాదించడం స్వామికి అలవాటు. ఆ రోజు కూడా చెట్టు కింద అరుగు మీద ధ్యానంల ఉన్న ‘లిటిల్‌ బుద్ధా’లాగ కూచున్నడు.

శ్రావణమాసం. చల్లటి గాలులు ఆగకుండా వీస్తున్నాయి. తెల్లటి ఆకాశంల నల్లటి మేఘాలు గుంపులు గుంపులుగ పోతున్నయి. తెల్లటి ఆకాశాన్ని చూసి ఆనందిస్తున్న వాని కళ్లు భూతాల్లాగ కదిలి పోతున్న నల్లని మేఘాలను చూసినాయి. కదిలిపోతున్న ఆ మేఘాలు క్షణక్షణానికి తమ ఆకారాలను మార్చుకుంటున్నయి. దీక్షగ చూస్తున్న వాని కండ్లకు ఆ మేఘాలు రూపం మార్చుకుంటున్న కామరూప పిశాచాల్లాగ, దేవతల మీద యుద్ధానికి దండెత్తి పోతున్న దయ్యాల గుంపులుగ కనిపించసాగినాయి. అట్ల వాడొక భ్రమాన్విత భయానికి లోనైనాడు. మొత్తం ఆకాశమే కదులుతున్నట్లు, దాంట్లె ఉన్న మేఘాలన్నీ స్థానభ్రంశం చెంది, చివరికి ఆ ఆకాశం నుండి ఊడిపోయి తన తలమీద పడబోతున్నట్లు ఊహించుకుని భయంతో ఇంట్లకు పరుగెత్తినాడు.

ఆ కదిలే ఆకాశం కూలే మేఘాల భయం వాణ్ణి తొందరగనే వదిలిపోయింది. మళ్లీ కొద్ది రోజులకు రాత్రి అన్నాలు తిన్న తర్వాత బాపుతోటి అదే అరుగుమీద కూచోని ఆకాశం దిక్కు చూస్తే అది పాపం ఏదో పోగొట్టుకున్నట్లుగ కన్పించింది. అటువంటి ఆకాశంమీద వానికి అకస్మాత్తుగ జాలి, ప్రేమా దయా ముంచుకొచ్చినాయి. ఇంకా పరీక్షించి ఆకాశాన్ని మళ్లీ చూసినాడు. అక్కడక్కడ మిణుకుమిణుకుమంటున్న చుక్కలు. అబ్బో ఎన్నెన్ని చుక్కలో, కొన్ని మసకమసకగ మరికొన్ని ప్రకాశవంతంగ, ఆకాశం నలుమూలల ఎటు చూస్తే అటు చుక్కలే చుక్కలు.

”బాపూ! ఆకాశంల చుక్కలు ఎక్కడ్నుంచి వచ్చినై?” ఠపీమని ప్రశ్నించినాడు.

బాపు ఒక్క క్షణమాగి ఆలోచించి ”రాత్రిపూట చీకటిగ ఉంటది కదా! మనం నడిచేటప్పుడు తోవ కనపడాలని దేవుడు తన దగ్గరున్న స్విచ్‌ వేయంగనే వెలిగే చిన్న చిన్న దీపాలే ఆ నక్షత్రాలు” అన్నడు. ఆ జవాబుతో వానికి చాలా సంతోషం వేసి ఆ రోజు నుండీ ఆకాశాన్ని మళ్లీ ఎప్పటిలాగనే ప్రేమించసాగినాడు.

జీవితంల జడత్వాన్ని పొందిన పెద్దవాళ్ల మనస్సులు నిశ్చలనిశ్చితాలకు కేంద్రాలు. కాని స్వామికి అన్నీ సందేహాలే. అన్నీ సమస్యలే. మనస్సంతా ప్రశ్నల మయమే.

”బాపూ! ఆవు శాకాహారా? మాంసాహారా?”

”అదేం ప్రశ్నరా? ఆవు ఉత్త శాకాహారే!”

”ఆకులు, పువ్వులక్కూడ ప్రాణముంటదని, అవి కూడ మనలాగనే బాధపడతవని, సంతోషిస్తవనీ చెప్పినవు కదా! ప్రాణమున్న ఆకులను, చెట్లను తినే ఆవు శాకాహారి ఎట్ల అవుతది?”

జవాబు చెప్పలేక దిక్కుతోచని బాపు దిక్కులు చూసినాడు.

ఇంకోసారి ”బాపూ! నీళ్లు పలుచగా ఎందుకుంటయి?” అని ప్రశ్నించినాడు.

సమాధానం లేని బాపు నీళ్లు నమిలినాడు.

”బాపూ! మా బడికి పెద్దపులి వస్తే ఏం అవుతది? సరిగ్గ మనింట్లకు ఇక్కడికే వస్తే ఏం అవుతది?”లాంటి యక్షప్రశ్నలు.

ఇంకోసారి ”బాపూ! మన భారతదేశం పటం ఎట్ల ఉంటదో నీకు తెలుసా?” అని అడిగినాడు.

”ఎట్ల ఉండటం ఏందిరా? అదేమన్న మనిషా?”

”అవును మరి. తల పైకెత్తుకోని రెండు చేతులూ విశాలంగ చాపుకొని నిలబడ్డ మనిషిలాగ ఉండదా !”

”అవును సుమా, నిజమే. మనిషి ఆకారం లాగనే ఉంటది.”

”మరి దాని గుండె ఎక్కడుంటది?”

”మళ్లీ అదేం ప్రశ్నరా?”

”మన రాజధాని ఢిల్లీ సరిగ్గ దేశం మధ్యల ఉంటది కదా! అదే దాని గుండె.”

”సరేసరే” అనుకుంట చల్లగ అక్కడ్నుండి బాపు జారుకున్నడు మళ్లీ ఏం ప్రశ్నలు అడుగుతడో అన్న భయంతోటి.

* * *

ఎగ్జిబిషన్‌కు పోయినప్పుడు స్వామికి బొమ్మ రిస్ట్‌వాచీ కొనిచ్చినారు. అది వానికెంతో నచ్చింది. నీలిరంగు బెల్టు, ఎర్రఫ్రేము, తెల్ల డయల్‌పై నల్లని అంకెలు, కీ ఇస్తే తిరిగే ముల్లూ వాడికి అద్భుతంగ కనిపించసాగినై. ఇంటికి వచ్చినంక రాత్రి పండుకునేటప్పుడు నిద్రల మెలకువ వస్తే దాన్నొకసారి తనివితీరా చూసుకొని మళ్లీ నిద్రపోయినాడు.

తెల్లారి వానికో పెద్ద సందేహం వచ్చింది. కీ ఇవ్వంగనే ఆ ముండ్లు ఎట్ల తిరుగుతున్నయా అని. తెల్లటి డయల్‌ కింద ఇంక ఏమైన అద్భుతాలు ఉన్నయా అని. అట్ల ఆలోచించంగ, ఆలోచించంగ ఆ వాచీల ఏదో బ్రహ్మరహస్యం దాక్కున్నదని వానికి తోచసాగింది. ఆ రహస్యం ఏమై ఉంటదా అన్న అన్వేషణకు సంబంధించిన ఆలోచనలతోటి వాని బుర్ర వేడెక్కసాగింది. చివరికి ఆ నిగూఢ రహస్యమేందో తెలుసుకోవాలంటే ఆ వాచీని పగులకొట్టక తప్పదనే నిర్ణయానికి వచ్చి ఓ రాయిని సంపాదించి దానితోటి ఆ వాచీని ముక్కలు ముక్కలు చేసినాడు. అంతవరకు కనబడని వాచీ లోపల స్ప్రింగుల్ని చూసినంక వాడి జిజ్ఞాస చల్లబడింది.

ఏదైనా వస్తువు లోపలి రహస్యాన్ని తెలుసుకోవాలనుకుంటే ముందు దానిని పగులకొట్టక తప్పదనే సత్యాన్ని కనుగొన్నడు. ఒకసారి బ్యాటరీ సెల్స్‌ చూసినాడు. అవి నలువు ఎరుపు రంగులతోని తళతళా మెరుస్తున్నై. అవి ఎవర్రెడీ బ్యాటరీలు. ఆ బ్యాటరీలతోనే ఆ టార్చిలైటు బల్బు వెలుగుతున్నదనే సత్యాన్ని గమనించి అంత అద్భుతమైన సెల్స్‌ లోపల ఇంక ఏ రహస్యాలు దాక్కున్నయో తెలుసుకోవాలని చాలా కష్టపడి రాయితో చచ్చీచెడి పగులకొట్టితే చివరికి అండ్ల నుండి నల్లటి బొగ్గుపొడి బయటపడి వానికి బోలెండత నిరాశ కలిగింది.

బాలల్లో ఆలోచించే మెదడు, స్పందించే హృదయమూ, బాలవాక్కు బ్రహ్మవాక్కులాగ సత్యాన్ని మాత్రమే పలికే నోరూ, ప్రకృతిలోని అందాలను చూసే కళ్లూ, సంగీతాన్ని ఆస్వాదించే చెవులూ ఉంటై. కాని పెద్దవాళ్లకు తలస్థానంలో ఒక గుండ్రటి డబ్బా, దాని లోపల అంతా ఖాళీ ప్రదేశం, స్పందించక ఎప్పుడో చాలా కాలం కిందనే చనిపోయిన హృదయం, చూపు తప్ప దృష్టి లేని కండ్లు, అసత్యాలు మాట్లాడే నోరు, అబద్దాలు మాత్రమే వినే చెవులూ ఉంటై. వాళ్లల్ల సత్యాన్వేషణ ఆగిపోయి గానుగెద్దు జీవితం మాత్రమే మిగిలిపోతుంది.

చివరికి మనిషిలో మిగిలేది మరమనిషి మాత్రమే. మరణించిన మనసు మాత్రమే.

… తరువాత భాగం ఒచ్చే వారం

Leave a Reply

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

Managed by Discover Telangana Inc., a registered nonprofit organization in USA.

All opinions and views expressed by third party content providers and shown here as preview are not that of Discover Telangana.

If you find any Content that is infringing, libelous, defamatory, obscene, abusive, offensive or otherwise violation of copyright law, alert us by emailing us at discover.telangana(at)gmail.com