Feed on
Posts
Comments

3

చిరుగాలికి చలించే చిగురాకువంటి స్వామి తనకు తెలియకుండనే, తన ప్రమేయం లేకుండనే ఇప్పుడు 1969ల మొదలైన ప్రత్యేక తెలంగాణ ఉద్యమం ఉప్పెనల తలనిండా మునిగి కొట్టుకపోతున్నడు.

స్వామి ఆ రోజు ఉత్సాహంగ నిద్ర లేచినాడు. ”ఇంత పొద్దున్నే ఎందుకు లేచినవురా?” అని అమ్మ ఆశ్చర్యపోయింది. ఆమె అప్పటికే నిద్ర లేచి వంటింట్ల మట్టిపొయ్యిని ఎర్రమన్నుతోటి చక్కగ అలికి, దానికి తెల్లటి ముగ్గు పిండితోటి వంకీలు వంకీలుగ ముగ్గులేసి వాటి మధ్య చుక్కల ముగ్గులేసింది. బొగ్గులు రాజేసి దాని మీద ‘చా’ కోసం డికాషన్‌ మస్లబెడుతుంది. నిద్ర మబ్బుతో, బరువు ముఖంతో నిద్రలేచిన స్వామి చెక్కపీట వాల్చుకొని అమ్మ పక్కనే సక్లంముక్లంగ కూచున్నడు. ఎర్రటి మట్టి పొయ్యిల ఎర్రెర్రగ మండుతున్న భగభగల భుగభుగల బొగ్గు కణికలు, ఆ ఎరుపు మంటల మధ్య నీలినీలి జ్వాలలు. అతని నిద్ర కండ్లకు హాయిని కల్గిస్తున్నై. మసులుతున్న డికాషన్‌ వాసన అతని ముక్కుపుటాలకు కమ్మగ సోకుతుంది. జనవరి చలి కాలంల వెచ్చగ అమ్మ పక్కన, మండే పొయ్యి దగ్గర కూచున్న స్వామికి లోకమంతా అందంగ, ఆ ఉదయం ఆనందంగ మొదలయ్యింది. నిన్నటి ఉద్యమ ఉత్సాహం మళ్లీ అతన్ని మెల్లమెల్లగ కమ్ముకుంటున్నది. కమ్మటి డికాషన్‌ ఆవిరి వాసనతోటి ఆవరించుకుంటున్నది.

”లే నానీ! పోయి ముఖం కడుగు” అంది అమ్మ.

అమ్మకు నిన్నటి వార్తలు ఏమీ తెలిసినట్లు లేవు. ఇంటికి పేపరు రాదు. ఇంట్ల వార్తలు వినడానికి రేడియో లేదు. బాపుకు తీరిక దొరికినప్పుడు తమందరికీ బోలెడన్ని సంగతులు, విశేషాలు వర్ణించి చెప్పుతుంటడు. ఆయన ఉర్దూ మీడియం స్కూల్ల లెక్కలు చెప్పే మాష్టర్‌ సాబ్‌. ఆయనకు స్కూల్ల ‘సియాసత్‌’ ఉర్దూ పేపరు వస్తది. అక్కడ వార్తలన్ని చదివి ఇంట్ల అవన్నీ చెప్తడు. స్వామికి వినికిడి జ్ఞానం, వినాలన్న జిజ్ఞాస ఎక్కువ. ఇంటాబయటా ఎవరేం మాట్లాడుతున్నా, ఏది మాట్లాడుతున్నా, ఎట్లా మాట్లాడుతున్నా జాగ్రత్తగ వింటడు. విన్న విషయాలను ఆకళింపు చేసుకునే ప్రయత్నం చేస్తడు. వినేవాళ్లు ఎవరైనా దొరికితే తను దానికి చిలవలు, పలువలు జోడించి, వర్ణించి చెబుతడు. విషయం తారుమారైనా సరే. పత్రికలు, పుస్తకాలు, రేడియో, టీవీలు లేని ఆ అమాయక కాలంల మనుషులు, మనుషుల మాటలే ప్రచార సాధనాలు. లోకజ్ఞానంల ప్రధానమైన భాగం వినికిడి జ్ఞానం.

శాలిబండ రూప్‌లాల్‌ బజార్‌ల స్వామివాళ్లకు స్వంత ఇల్లుంది. పాత గూనపెంకుల ఇల్లే అయినా పెద్ద ఇల్లే. తాము ఉండటానికి ఒక మనసాల మరో నాలుగు అర్రలు ఉంచుకుని మిగతా ఇల్లంతా కిరాయలకు ఇచ్చినారు. ఆ అతి స్వల్ప కిరాయలు ఆ కాలంల వేణ్నీళ్లకు చన్నీళ్లు. చిన్నచిన్న చిల్లర ఖర్చులకు ఆ కిరాయలు సరిపోయేవి. కిరాయదార్లు కన్నడిగులు, మరాఠీలు. తెలుగు వారు అరుదే. శాలిబండ రూప్‌లాల్‌ బజార్‌, చందూలాల్‌ బేలా, గౌలిపురా, లాల్‌ దర్వాజాలల్ల మరాఠీలు, కన్నడిగులతో పాటు కాయస్థులు కూడా అధికమే.

కుతుబ్‌షాహీల కాలంల ‘శివాజీ మహారాజా’తో వున్న సఖ్యత కారణంగ సర్దేశ్‌ ముఖి, చౌత్‌ పన్నుల వసూళ్లకు శివాజీ మహారాష్ట్రులను హైద్రాబాద్‌, తెలంగాణాలోని ముఖ్యపట్టణాలకు తన ప్రతినిధులుగ నియమించినాడు. కుతుబ్‌షాహీలకు, మహారాష్ట్రులకు ఇద్దరికీ ఔరంగజేబు ఉమ్మడి శత్రువు. అతడి దండయాత్రలను ఎదిరించడానికి కుతుబ్‌షాహీ రాజులు మహారాష్ట్రుల సైనిక సహాయం పొందేవారు. ప్రతిఫలంగ మహారాష్ట్రులు చౌత్‌ పన్నుల వసూళ్లకు తెలంగాణాలోని అనేక పట్టణాలలో స్థిరపడినారు. తర్వాత నైజాం కాలంల మరాఠా ప్రాంతాలు ఔరంగాబాద్‌, పర్బనీ, భీడ్‌, నాందేడ్‌, హైద్రాబాద్‌ సంస్థానంల భాగం కాబట్టి మహారాష్ట్రులు పెద్ద సంఖ్యలో హైద్రాబాద్‌ల స్థిరపడినారు.

కర్ణాటక ప్రాంతాలైన బీదర్‌, గుల్బర్గా, రాయచూర్‌లు నైజాం సంస్థానంల అంతర్భాగాలు కావున కన్నడిగులు కూడా పెద్దసంఖ్యలో హైద్రాబాద్‌ల నివాసాలు ఏర్పాటు చేసుకున్నరు. ముచికుందానది దక్షిణభాగంలోని నేటి పాతనగరం నైజాం పరిపాలకుల ముఖ్య కేంద్రం కావున దేశంలోని ఇతర ప్రాంతాల నుండి వచ్చిన వాళ్లందరూ నేటి పాతనగరంల స్ధిరపడినారు. నేటి హైద్రాబాద్‌ నగరం మూసీకి దక్షిణం నుండి మూసీకి ఇవతల ఉన్న ఉత్తరం వైపు ఖైర్తాబాద్‌, అమీర్‌పేట్‌, సుల్తాన్‌బజార్‌ల దిక్కు వ్యాపించింది.

కుతుబ్‌షాహీల పాలన అంతమొంది ఆసఫ్‌జాహీ నైజాం రాజుల పరిపాలన ప్రారంభం కాంగనే వారి వెంబడి ఉత్తర భారతదేశం నుండి కాయస్థులు వలస వచ్చినారు. వీరు యమధర్మ రాజు వద్ద ‘చిట్టాలు-ఆవర్జాలు’ రాసే ‘చిత్రగుప్తుని’ సంతానమని సగర్వంగ చెప్పుకుంటరు. వీరి ఉనికి చరిత్రల మొదటిసారిగ పృథ్వీరాజ్‌ ‘చౌహానుల’ కాలంల వెలుగులకు వచ్చింది. బానిస ప్రభువులు, ఖిల్జీలు, లోడీల కాలం నుండి మొగల్‌ పరిపాలకుల కాలం వరకూ వాళ్లందరి ఆస్థానాలల్ల వీళ్లు గుమాస్తాలుగ పని చేసెటోళ్లు. లెక్కపత్రాలు, మహాజర్లు (వినతిపత్రాలు), మిసళ్లు ( ఫైళ్ళు) రాయటమే వీరి వృత్తి, ప్రవృత్తి. బతుకనేర్చి బాగుపడటం వీరి స్వభావం. తమకు సంబంధం లేని విషయాలల్ల తలదూర్చటం, ప్రధాన స్రవంతికి వ్యతిరేకంగ వెళ్లటం వీరు కనీసం కలల కూడ చేయరు. భారత ప్రజలంత ముస్లిం విదేశీ పాలకులను ఎదిరించే రోజులల్ల కూడ వీళ్లు ఆ రాజుల అడుగులకు మడుగులొత్తే ఉద్యోగాలు చేసెటోళ్లు. ‘కాయస్థ్‌’ అంటే శరీరానికి లేదా భౌతిక విషయ వాంఛలకే అధిక ప్రాధాన్యత ఇచ్చేవాళ్లని కూడా అర్థం.

కుతుబ్‌షాహీల రాజ్యం గోల్కొండను గెలిచిన తర్వాత ఔరంగజేబు ఢిల్లీ నుండి తన సుబేదారుగ చిన్‌ ఖులిచ్‌ ఖాన్‌కు ఆసఫ్‌జాహీ బిరుదునిచ్చి 1724ల దక్కన్‌కు పంపినాడు. ఇతనే మొదటి నైజాం రాజు. ఇతని వెంబడే కాయస్థులు ఉద్యోగస్థులుగ ఔరంగాబాద్‌, హైద్రాబాద్‌లకు తరలివచ్చినారు. తర్వాత కాలంల నైజాముల ఆస్థానంల వీళ్లు పేష్కార్లుగా (ఆర్థిక మంత్రులు) దివాన్‌లుగా (ప్రధాన మంత్రులు) పని చేసినారు. ఉన్నతోద్యోగులుగా కూడా పనిచేసినారు. మహారాజా చందూలాల్‌, మహారాజా కిషన్‌ పర్‌షాద్‌ వీళ్లల్ల ప్రముఖులు. అట్ల హైద్రాబాద్‌ల కాయస్థుల సంతతి తామరతంపరగ పెరిగింది. హైద్రాబాద్‌ పాతనగరంల ఉన్న ఉప్పుగుడా కందికల్‌ గేట్‌ వద్ద చిత్రగుప్తుని దేవాలయం వీళ్లు కట్టించిందే. భారతదేశం మొత్తంగ చిత్రగుప్తునికున్న ఏకైక ఆలయం ఇదొక్కటే. దీనితో హైద్రాబాద్‌ నగరంల కాయస్థుల పాత్రను, ప్రాధాన్యతను గమనించవచ్చు.

వీళ్లే కాక వర్తక, వాణిజ్యాల కోసం వచ్చినవాళ్లు మార్వాడీలు, అగర్వాల్‌లు, జైన్‌లు, పార్సీలు, కచ్‌ ముస్లింలు, బోహ్రా ముస్లింలు. నేటి జైన్‌, మార్వాడీ వెండి, బంగారం, ముత్యాల వ్యాపారులందరూ ఒకప్పుడు రాజస్థాన్‌, గుజరాత్‌ల నుండి ‘అన్నమో రామచంద్రా’ అంటూ ఉత్త చేతులతో కాలినడకన వలస వచ్చినవాళ్లే. అక్కడి కరువులను, విదేశీ దండయాత్రలను తట్టుకోలేక ఇక్కడికి కాందిశీకులుగ వచ్చినారు. కుతుబ్‌షాహీల రాజ్యంల గోల్కొండ వజ్రాలగనులకు ప్రసిద్ధి. కార్వాన్‌, పురానాపూల్‌లు ముత్యాలు, వజ్రాల వ్యాపారానికి ముఖ్యమైన బజార్లు. మార్వాడీలు, జైనులంతా వీటితో పాటు బంగారం, వెండి ఆభరణాల వ్యాపారాన్ని చేసేవాళ్లు. వీరు మొదట గోల్కొండకోటలో, తర్వాత కార్వాన్‌, పురానాపూల్‌లకు వ్యాపారాలను విస్తరించినారు. కార్వాన్‌ బజార్లలో ముత్యాలు, రత్నాలని రాశులుగ పోసి కూరగాయల వోలె అమ్మేవాళ్లు.

ఆసఫ్‌జాహీ నైజాంల పరిపాలన గోల్కొండ నుండి నేటి పాతనగరంలకు మారి ప్రారంభం కాంగనే వీరందరూ చార్మినార్‌, గుల్జార్‌ హౌజ్‌, పత్తర్‌గట్టిలకు చేరుకొని కొత్తగ దుకాణాలు తెరిచినారు. తర్వాత కాలంల నైజాం పాలన అంతమయ్యి ఆంధ్రప్రదేశ్‌ ఏర్పడంగనే వీళ్లందరు న్యూసిటీకి అంటే కోఠీ, ఆబిడ్స్‌, అమీర్‌పేటలకు చేరుకొని షాపింగు కాంప్లెక్సులు, షాపింగు మాల్‌లు ప్రారంభించినారు. ఎన్‌క్లేవ్‌లలో, ఎస్టేట్‌లల్ల నివాసాలు ఏర్పరచుకున్నరు.

పోలీస్‌ యాక్షన్‌ జరిగి నైజాం రాజ్యం అంతం కాంగనే వాళ్ల వారసుల వద్ద ‘అడ్డికి పావుసేరు’గ వజ్రాలు, ఆభరణాలు, విలువైన పురాతన అపురూపమైన వస్తువులను కొని విదేశాలకు దొంగతనంగ ఎగుమతి చేసి ఈ వ్యాపారస్థులందరూ కోట్లకు పడగలెత్తినారు. నైజాం భవనాలల్ల పనిచేసే నౌకర్లు చాకర్లు దొంగతనంగ ఎత్తుకొచ్చిన సామానులను కూడా వాళ్లు అతి తక్కువకు కొని మారుబేరాలు చేసేవాళ్లు. జైన్‌ వ్యాపారస్థుల ఇళ్లల్ల బోషాణాలల్ల, త్రిజోడీలల్ల ఇప్పటికీ వాళ్ల పూర్వీకులు రాసిన చేతిరాత ప్రతులు ఉన్నై. అండ్ల వారు రాజస్థాన్‌, గుజరాత్‌ ప్రాంతాల నుండి తాము కాలినడకన ఎట్ల వచ్చినారో, వారి అనుభవాలేమిటో, అప్పటి సామాజిక స్థితిగతులేమిటో గ్రంథస్థం చేసినారు. ఇప్పటి తరం వారు ఆ గ్రంథాలను పవిత్ర మతగ్రంథాలుగ పూజాగదులల్ల పెట్టుకుని పూజిస్తరు గని చరిత్రను గ్రంథస్థం చేయడంల వాటి ప్రాముఖ్యతను గుర్తించరు.

దేశ విభజన కాంగనే వాయవ్య భారతదేశం నుండి పంజాబీలు, సిక్కులు కట్టుబట్టలతోటి హైద్రాబాద్‌ చేరుకొని కాలక్రమంల వ్యాపారాలల్ల, పరిశ్రమలల్ల స్థిరపడినారు. తమ శ్రమ, సాహసాలతో వాళ్లు శూన్యం నుండి అద్భుతాలను సృష్టించుకున్నరు. మొజంజాహీ మార్కెట్టుల కరాచీ బేకరీ, నాంపల్లిల డన్‌లప్‌ టైర్స్‌ వీళ్లవే. గౌలిగూడా, బహద్దూర్‌పురాలలో పెద్ద పెద్ద గురుద్వారాలను నిర్మించుకున్నరు. పంజాబీ దాబాలల్ల భోజనాన్ని ఇష్టపడని వాళ్లు ఎవరూ ఉండరు. పంజాబీలు, సిక్కులు హైద్రాబాద్‌ సంస్కృతిల పాలల్ల నీళ్లలాగ కలిసిపోయినారు.

బెంగాలీలు కూడా అంతే. వీళ్ల ముద్దుబిడ్డలే ‘నైటింగేల్‌ ఆఫ్‌ హైద్రాబాద్‌’ సరోజినీ నాయుడు, బహుముఖ ప్రజ్ఞాశాలి, కళాకారుడు, కవి హరీంద్రనాథ్‌ ఛటోపాధ్యాయ్‌. వీళ్లిద్దరి వల్ల హైద్రాబాద్‌ అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించింది. బ్రిటిష్‌ రెసిడెన్సీ కాలంల తమిళులు సికింద్రాబాద్‌ల స్థిరపడి ఉద్యోగాలల్ల, న్యాయవాద వృత్తిల రాణించినారు. రైల్వేలు బ్రిటిష్‌ పరిపాలనల ఉన్నందున సికింద్రాబాద్‌ రైల్వే ఆఫీసులల్ల వీళ్లు అత్యధిక ఉద్యోగాలను ఆక్రమించుకున్నరు. స్థానిక హైద్రాబాదీయులకు ఉర్దూ అధికారభాష కావున వాళ్లకు ఇంగ్లీషు భాష వచ్చేది కాదు. ఈ కారణం వల్ల తమిళులు రైల్వేలో ఉద్యోగాలు సంపాదించి సికింద్రాబాద్‌ ప్రాంతంల ఎక్కువగ స్థిరపడినారు.

వీళ్లే గాక చిన్న చిన్న జాతులవాళ్లు కూడ వున్నరు. రూహేల్‌ఖండ్‌ నుండి వచ్చినవాళ్లే రోహిల్లాలు. వీరు నైజాం సైన్యంల ఒక ప్రత్యేకమైన పటాలం. 1857 సిపాయిల తిరుగుబాటు హైద్రాబాద్‌ల కూడా జరిగినప్పుడు కోఠీలోని బ్రిటిష్‌ రెసిడెన్సీపై దాడి చేసిన తిరుగుబాటు నాయకుడు తుర్రేబాజ్‌ఖాన్‌ ఈ రోహిల్లా జాతికి చెందిననవాడు. కోఠీ ఆంధ్రాబాంకు నుండి సుల్తాన్‌బజార్‌కు పోయే గల్లీకి తుర్రేబాజ్‌ఖాన్‌ రోడ్‌ అని పేరు.

మధ్యప్రదేశ్‌ బుందేల్‌ఖండ్‌ నుండి వచ్చిన వాళ్లే బోందిలీలు. వీళ్లను బొందిలోళ్లు అని కూడా పిలుస్తరు. వీళ్ల సంఖ్య చాలా స్వల్పం. హైద్రాబాద్‌లో పార్సీలున్నా వీరి సంఖ్య కూడా చాలా స్వల్పం. అట్లనే ఆంగ్లో ఇండియన్స్‌. ఖాజీపేట, సికింద్రాబాద్‌ రైల్వేలల్ల ఇంజన్‌డ్రైవర్స్‌గా, గార్డ్స్‌గా వీళ్లు పెద్దసంఖ్యలో పనిచేసెటోళ్లు. సికింద్రాబాద్‌లోని చిలకలగుడా, మారేడ్‌పల్లిలలో ఆంగ్లో ఇండియన్స్‌ సంస్కృతి బాగా కనబడుతది.

కేవలం హైద్రాబాద్‌ పట్టణంలనే స్థిరపడిన లోథ్‌లు, పార్థీల గురించి ప్రత్యేకంగా తెలుసుకోవాలె. గోల్కొండకోట మీద ఔరంగజేబు దండయాత్రకు వచ్చినప్పుడు వెంట వచ్చిన సైనికులల్ల ఒక జాతి లోథ్‌ రాజపూత్‌ క్షత్రియులు. బహుశా వీరి మూలాలు గుజరాత్‌ల ‘లోథాల్‌’ ప్రాంతానివి కావచ్చు. హరప్పా, మొహెంజోదారో నాగరికత ఆనవాళ్లు, అవశేషాలు ఈ లోథాల్‌ ప్రాంతంల కూడ లభించినాయి. ఔరంగజేబు సైన్యం విజయం సాధించి వెనకకు పోయినా ఈ లోథ్‌లు మాత్రం ఇక్కడే పురానాపూల్‌, ధూల్‌పేటలల్ల స్థిరపడినారు. కాలక్రమంల వీళ్లను లోథోళ్లుగా పిలువసాగినారు.

ధూల్‌పేట అసలు పేరు ‘ధూళిపేట’. నైజాం కాలంల లోథ్‌ క్షత్రియుల సైనిక కవాతులతో, ఏనుగులు, ఒంటెలు, గుర్రాల డెక్కల చప్పుళ్లతో, ధూళితో పరిసరాలు నిండి వుండేవి కావున ధూళిపేట, దూల్‌పేటగ మారింది. ఆ రోజులలో సైనికుల శరీర బడలికను తీర్చేందుకు ద్రాక్షసారాయిని తయారు చేసి విక్రయించే వృత్తిలో వీళ్లలో కొంతమంది స్థిరపడినారు. మరికొంత మంది సహజంగ కళాకారులు కావున పతంగులు తయారు చేసే వృత్తి చేపట్టినారు. పతంగుల ఆట, సంస్కృతి ఉత్తర భారతదేశానికి సంబంధించింది. యూరప్‌ నుండి వచ్చిన జిప్సీలు, దేశద్రిమ్మరులు మనదేశానికి పతంగులను పరిచయం చేసినారు. తిరిగి హైద్రాబాద్‌కు పతంగులను, మాంజాదారాన్ని పరిచయం చేసినవాళ్లు ఈ లోథ్‌ క్షత్రియులు. కాలక్రమేణా నగరంల విశాలమైన ఆటస్థలాలు, మైదాన్‌లు రియల్‌ ఎస్టేట్‌లకు, అపార్ట్‌మెంట్లకు బలైన తర్వాత ఈ పతంగుల ఆట క్రమక్రమంగ కనుమరుగవుతుంది. ఎన్ని రకాల పతంగులో ! ఎన్ని రకాల మాంజాలో !! అవన్నీ ఇంద్రధనుస్సులోని రంగుల్లాగ మాయమైనాయి.

ఆటపాటలతో, శారీరక వ్యాయామంతోటి పువ్వులాగ వికసించవలసిన బాల్యం, హరివిల్లులాగ మెరియవలసిన బాల్యాన్ని కంప్యూటర్‌ గేములకు, టీవీలలోని బూతప్రేత పిశాచాల సీరియళ్లకు అప్పగిస్తున్నరు. ఒక తరం మరుగుజ్జుల తరంగ మారే ప్రమాదం ముంచుకొస్తుంది.

పతంగులు, మాంజాల తయారీలనే గాక మరికొంత మంది వినాయకులు, దుర్గామాత, కాళీమాత మొదలగు దేవతల, దేవుళ్ల విగ్రహాలను తయారుచేసే వృత్తిల స్థిరపడినారు. అయితే అవి సీజనల్‌ వృత్తులు కావున నికర ఆదాయానికి వీలు లేదు. పుట్టుక రీత్యా క్షత్రియులు కావున సాముగరిడీలు, మల్లయుద్దాలు, తాలీం ఖానాలల్ల ప్రవేశించి మరికొంత మంది పహిల్వాన్లుగ ప్రసిద్ధి గాంచినారు.

నైజాం వ్యతిరేక పోరాటంల నేపథ్యంగ ప్రధాన భూమికలు వహించినవి గ్రంథాలయాలు, తాలింఖానాలు. ఈ రెండు రంగాల నుండి అనేకమంది వీరులు సృష్టించబడినారు. సమరశీల తత్వం కలిగిన ఈ లోథ్‌లు తాలీంఖానాల నుండి ఆర్యసమాజం ఉద్యమంలకు, స్టేట్‌ కాంగ్రెస్‌ ఉద్యమంలకు ప్రవేశించి నైజాంకు వ్యతిరేకంగ పోరాడినారు. ఈ ధూల్‌పేట పేరు వింటే రజాకారుల గుండెలల్ల గుబులు పుట్టేది. 1939ల హైద్రాబాద్‌ పట్టణంల మొదటిసారిగా మతకల్లోలాలు జరిగినప్పుడు ఈ ధూల్‌పేట యోధులు వాళ్లకు వ్యతిరేకంగా పోరాడినారు.

కాలక్రమేణా వృత్తులన్నీ మట్టికొట్టుపోయి, సృజనాత్మకత, కళాత్మకత మూలబడి, బతుకులన్ని బజారున పడిన తర్వాత ఒకప్పుడు మేలిమి ద్రాక్షసారాయిని తయారుచేసి ప్రభువులచేత, సైనికులచేత శభాష్‌ అనిపించుకున్న వీళ్లే చివరికి గతి లేక దొంగ గుడుంబాను సారాయి బట్టీలల్ల రహస్యంగ తయారుచేసి విక్రయించే వృత్తిని స్వీకరించి రౌడీలుగ, మాఫియాలుగ ముద్రపడి, పాలకులు, ఎక్సైజ్‌ శాఖ అధికారులు కోటీశ్వరులుగ, లక్షాధికారులుగ మారేందుకు నిచ్చెనమెట్లయినారు. తమ బ్రతుకులను గుడుంబా బట్టీలల్ల కాల్చేసుకున్నరు. ధూల్‌పేట ఇరుకిరుకు మురికి గల్లీల్ల మట్టిల మట్టిగ మారుతున్నరు. సైనికులుగ, కళాకారులుగ, పహిల్వాన్లుగ ఒకప్పుడు రాణించిన వాళ్లు ప్రస్తుతం ధూల్‌పేట దుమ్ముల ధూళిగ మారుతున్నరు. ‘లోథాల్‌’ మొహెంజోదారో నుండి మొదలైన వారి మహాప్రస్థానం పురానాపూల్‌ స్మశానవాటికల చరమగీతం పాడుతున్నది.

ఇటువంటి ఇంకో విషాదగాథే పార్థీలది. వాళ్ల గోస పిట్టగోస. వీరిని పార్థీలు, పిట్టలోళ్లు అని కూడ అంటరు. వీరు నైజామ్‌ల కాలంలనే హైద్రాబాద్‌కు దేశద్రిమ్మరులుగ వచ్చినారు. లంబాడీల మాదిరిగనే వీరు కూడా మహారాణా ప్రతాప్‌ వంశానికి చెందిన వారమని, ముస్లిం రాజులతో ఆయన యుద్ధంల ఓడిన తర్వాత తాము ప్రాణరక్షణతో దేశద్రిమ్మరులమైనామని చెప్పుకుంటరు. వీరి భాష ప్రత్యేకం కాని లిపి మాత్రం లేదు. తొలుత హైద్రాబాద్‌ వచ్చినప్పుడు వీరిని నగరంలకు రానీయకుండ నగర దర్వాజాలకు అవుతలనే అడవిల దూరంగ వుంచినారు. ఆ రోజులల్ల నగరం చుట్టూ రక్షణగా ఒక ఫసీల్‌ (నగర ప్రాకారం, గోడ) 13 దర్వాజాలు, 13 కిటికీలు ఉండేవి. ప్రస్తుతం రెండు దర్వాజాలు మాత్రమే మిగిలి వున్నయి. శాంతిభద్రతల కారణంతోటి కోత్వాలు (పోలిస్ కమీషనర్) వీరికి ప్రవేశానుమతిని ఇవ్వలేదు. కొన్ని నెలల పాటు నగరం వెలుపల అడవిలనే నివసించినారు. పిట్టల్ని, పక్షులను వేటాడెటోళ్లు కావున పిట్టలోళ్లు అని పేరు వచ్చింది. వేట తమ వృత్తి కావున తాము ఏకలవ్యుని సంతానమని కూడా చెప్పుకుంటరు. అట్ల కొన్ని నెలలు గడిచిన తర్వాత తమలోని ఒక అందమైన కన్యను ఒక అధికారికి అలవాటు చేసినారు. ఆ అధికారి ఆమె అందానికి లొంగిపోయి వారి నగర ప్రవేశం కోసం నైజాం నవాబు వద్ద అనుమతి పొందినాడు.

ఫలక్‌నుమా గుట్ట వెనుక దిక్కున్న జల్‌పల్లి గ్రామాన్ని నిజాం వారికి దత్తతనిచ్చినాడు. అట్ల వాళ్లు తొలుత జల్‌పల్లిలో నివాసాలు ఏర్పాటు చేసుకొని క్రమక్రమంగ నగరంల ఉన్న అలియాబాద్‌, శక్కర్‌గంజ్‌, గాజీబండలకు వ్యాపించినారు. కొండజాతి ప్రజలు కావున మాతృస్వామిక సంఘం ఆచారాల ప్రకారం ఆ అందమైన కన్యనే తమ వంశానికి మూలమని భావించి ఆమె మరణించంగనే జల్‌పల్లి గ్రామంలనే ఆమెను సమాధి చేసినారు. అట్ల ఆమె అమ్మలగన్న అమ్మ, మూలపుటమ్మగ అవతరించింది. పార్థీలు నేటికి కూడ తమ వాళ్లు నగరంల ఏ మూలల చనిపోయినా ఆ జల్‌పల్లి స్మశానంలనే ఖననం చేస్తరు. ఆ కన్యను దేవతగ కొలుస్తూ ప్రతి సంవత్సరం హోలీ, కాముని పున్నమి పండుగ అయిన మూడో నాడు జల్‌పల్లి గ్రామంల ఒక పెద్ద జాతర చేస్తరు. వారం రోజుల పాటు ఈ జాతర ఘనంగ సాగుతది. సారా, బ్రాందీలు ఏరులై పారుతయి. తెగిన యాటల తలలతోటి, కారిన రక్తంతోటి దేవతకు అభిషేకాలు జరుగుతయి. స్త్రీలను అమ్మవారు పూనుతది. జోస్యాలు, వరాలు, దీవనలతో పాటు బగ్గ తాగిన స్త్రీపురుషుల కొట్లాటలతో జాతర ఘనంగ ముగుస్తది.

వీరి ప్రధాన వృత్తి పండ్లు, పూలు, కూరగాయలు అమ్ముకొనటం. పురుషులతో పాటు స్త్రీలు సమానంగ వ్యాపారాలు చేసి డబ్బులు సంపాదిస్తరు. వీరి స్త్రీలకు స్వాతంత్య్రం ఎక్కువ. తమలో తాము గాని, పరాయివాళ్లతోటి గాని తన్నులాటలు, కొట్లాటలు వస్తే పురుషుల కన్నా స్త్రీలే సివంగులుగ మారుతరు. కూరగాయలు బేరం చేసేటప్పుడు వీరితో కొసరి కొసరి బేరం చేయటానికి చాలామంది భయపడతరు. పాతనగరంలోని షక్కర్‌గంజ్‌, గాజీబండ, పురానాపూల్‌లలో వీరి నివాసాలు ఎక్కువ. మతకల్లోలాలల్ల వీళ్లకు అధికంగ ప్రాణనష్టం, ఆస్తి నష్టం సంభవించి వీళ్ల ఇళ్లను అగ్గువగ్గువకు కొని, ఆక్రమించుకున్న తర్వాత ఈ పిట్టలోళ్లు గూడు చెదిరిన పక్షుల వోలె పుట్టకొకరు చెట్టుకొకరి మాదిరిగ నగరంలోని ఇతర ప్రాంతాలకు తరలిపోయినారు.

లంబాడోళ్లు అనగా బంజారాలది కూడా ఇంచుమించు ఇట్లాంటి కథే. వీరు కూడ రాజస్థాన్‌ నుండి దేశద్రిమ్మరులుగ బయలుదేరినవాళ్లే. రాణా ప్రతాప్‌ అనుచరులమని చెప్పుకుంటరు. రాజపుత్రుల పతనం తర్వాత వీరు ఉప్పు అమ్ముకుంటూ దేశసంచారం చేస్తూ హైద్రాబాద్‌కు వచ్చినారు. నేటి బంజారాహిల్స్‌ ప్రాంతాలు వీరి తొలి నివాసాలు. వ్యవసాయంల ప్రవేశించి స్థిరనివాసాలు ఏర్పాటు చేసుకున్నందున సాంఘికంగ, ఆర్థికంగ పార్థీలకంటే మెరుగైన స్థితిలో వున్నరు.

దేశంలోని ఇతర జాతులవాళ్లు, ఇతర ప్రాంతాలవాళ్లు గాక మధ్య ఆసియా, ఆఫ్రికా నుండి వచ్చిన విదేశీయులెందరో హైద్రాబాద్‌ల స్థిరపడినారు. బహమనీ సుల్తాన్‌లు, కుతుబ్‌ షాహీల కాలంలనే ఇరాన్‌, ఇరాక్‌, అరబ్‌, టర్కీ దేశాల నుండి ఎందరో దక్కనుకు చేరుకొని స్థిరపడినారు. వీళ్లందరినీ ‘ఆపాకీలు’ అనగా విదేశీయులు అనేవారు. స్థానికులను ‘ముల్కీ’లనేవాళ్లు. ముల్క్‌ అనగా దేశం. ముల్కీలనగా దేశీయులు అని కూడా అర్థం.

నైజాం రాజుల కాలంల పఠానులు, అఫ్ఘనులు, టర్కీలు, అరబ్బులు, చావూష్‌లు హైద్రాబాద్‌ పాతనగరంల స్థిరపడినారు. పఠాన్‌లు అఫ్ఘనిస్థాన్‌ నుండి వచ్చిన కొండజాతి వాళ్లు. సమరశీల పోరాట యోధులు కావున నైజాం సైన్యంల చేరినారు. పాతనగరంల పఠాన్‌వాడీ అనే బస్తీ కూడ ఉంది. అఫ్ఘనిస్తాన్‌ రాజధాని కాబూల్‌ నుండి వచ్చినవాళ్లే కాబూలీవాలాలు. వీళ్లు సైన్యంల కాక వడ్డీ వ్యాపారాలల్ల ఇతర వ్యాపారాలల్ల స్థిరపడినారు. అరబ్బులు కూడా పోరాటయోధులే కావున నైజాం వారికి ఒక ప్రత్యేక సైనిక పటాలాన్ని ఏర్పాటు చేసినాడు. పాతనగరంల చంద్రాయణగుట్ట దాటిన తర్వాత ‘బార్కాస్‌’ వీరి స్థావరాలు. బారకాసులు అంటే సైనిక స్థావరాలు అని అర్థం. బహుశా మక్కా మదీనాల నుండి వచ్చారని కాబోలు. నైజాంకు అరబ్బు సైనికుల మీద ప్రత్యేకమైన ప్రేమ కావున వీరికి ప్రత్యేకమైన సైనిక పటాలాన్ని ఏర్పాటు చేయటమే గాక సైన్యంలోని కీలక స్థానాలల్ల వీళ్లను నియమించినారు. పఠానులు, అరబ్బులు, చావూష్‌లు వేరువేరు దేశాలకు చెందిన వేరువేరు జాతులు కావున వారి మధ్య వైరం తలెత్తకుండ ప్రత్యేక సైనిక పటాలాలను ఏర్పాటు చేసినాడు. అరబ్బుల్ని ప్రత్యేకంగా ఖజానాల వద్ద కాపలాకు నియమించేవారు. వీరికి కామతృష్ణ అధికం కావున జనానాఖానాల వద్ద మాత్రం వీరిని నియమించక కొజ్జాలను కాపలాకు నియమించేవారు.

టర్కీ పాత పేరు తుర్కెనిస్తాన్‌. ఇక్కడ్నుండి వచ్చినవాళ్లనే తెలుగులో తురకలు లేదా తుర్కోళ్లు అన్నరు. వీళ్లు మాట్లాడే భాషను ‘తురకం’ అన్నరు. ఇందులో నుండి దక్కనీ ఉర్దూ ఆవిర్భవించింది.

ఇక చావూష్‌ల గురించి ప్రత్యేకంగనే చెప్పుకోవాలె. వీళ్లందరూ ఆఫ్రికాకు సంబంధించిన ముస్లింలు. వీరు ప్రధానంగ రెండు దేశాలకు ఎమెన్‌, అబిసీనియాలకు చెందినవాళ్లు. అబిసీనియా కొత్త పేరు ఇథియోపియా. అబిసీనియా వాళ్లను ‘హబ్సీ’లు అని కూడ అంటరు. నగరంలోని హబ్సిగుడా వీళ్లకు సంబంధించినదే. వీళ్లను చూడంగనే నీగ్రోలని సులభంగ గుర్తించవచ్చు. ఈ హబ్సీలు అనగా చావూష్‌లు హైద్రాబాద్‌ నగరానికి చేరుకున్న వైనం ఒక ఇతిహాస గాథ.

రెండు వందల సంవత్సరాల క్రింద వనపర్తి సంస్థానం నైజాం సంస్థానంల ఒక ముఖ్యమైన ఉపసంస్థానం. దీని మొదటి రాజు ‘రాజా రామేశ్వర్రావ్‌’ తన సంస్థానం పకడ్బందీ రక్షణ కోసం పటిష్టమైన సైన్యాన్ని రూపొందించుకోవాలని బొంబాయి బానిసల సంత నుండి కొంత మంది స్త్రీపురుష నీగ్రో బానిసలను కొనుగోలు చేసి వనపర్తికి బందీలుగ పట్టుకొచ్చి వారితో ప్రత్యేక సైనిక పటాలాన్ని తయారు చేసినాడు. ఆ నీగ్రో బానిసలంత ఆఫ్రికా అశ్వాల వలె బలిష్ఠులు, ఆఫ్రికా సింహాల వలె ధైర్యవంతులు. కాలక్రమంల వారి సంతతి తామరతంపరగ అభివృద్ధి చెంది వారి జనాభా కొన్ని వందలకు చేరుకున్నది. మొదటి దశల సంస్థాన రక్షణకు వాళ్లు బాగా ఉపయోగపడినా తర్వాత కాలంల వాళ్లు తలనొప్పిగా మారినారు. ఆ చిన్న సంస్థానంల వారిని పోషించడం, అదుపుల పెట్టడం తర్వాత వచ్చిన సంస్థానాధీశులకు తలకు మించిన భారమయ్యింది. గుర్రాల వలె బలిష్టులైన వారికి కామతృష్ణ హెచ్చు కావున స్థానికులకు వారు ప్రమాదంగ పరిణమించినారు. చివరికి విధిలేక వనపర్తి రాజావారు వాళ్లందరినీ ఒక శుభముహూర్తంల నైజాంకు నజరానాగ సమర్పించుకుని చేతులు దులుపుకున్నడు. నైజాం వాళ్లందరితోటి ప్రత్యేకమైన ఆశ్వికదళాన్ని రూపొందించినాడు. వాళ్లనే తరువాత ఆఫ్రికన్‌ కావల్రీ గార్డ్స్‌ అన్నరు. వాళ్ల కోసం నైజాం ప్రత్యేక నివాసస్థలాన్ని ఏర్పాటు చేసినాడు. అదే ఈనాటి ఎ.సి. గార్డ్స్‌ ఏరియా. మాసాబ్‌టాంక్‌లోని మహావీర్‌ హాస్పిటల్‌ వెనుక భాగమే ఈ ఎ.సి.గార్డ్స్‌ బస్తీ. వారి సంతతి ఇప్పటికీ అక్కడనే నివసిస్తున్నరు.

ఈ చావూష్‌లు హైద్రాబాద్‌ నగరానికి అందించిన తమదైన విలక్షణ సంస్కృతిల ముఖ్యమైంది ‘తీన్‌ మార్‌ వాయిద్య సంగీతం’. అది ఒక రకమైన డప్పు. ఆఫ్రికాకు మాత్రమే పరిమితమైన వాయిద్య పరికరం. ఇప్పటికీ పెండ్లిండ్లలో ఉత్సవాలలో, శుభసంతోష సందర్భాలలో ఈ ‘టుమ్కీ’ని బజాయిస్తుంటరు. దీని శబ్దం భీకరంగ, ఉత్తేజంగ ఉంటది. వినేవారిని పరవశుల్ని గావించి వారిచే చిందులు వేయిస్తది. హిందువులు కూడ ఈ తీన్‌మార్‌ వాయిద్యాన్ని ఆరాధిస్తరు. దీపావళి పండుగ తెల్లారి యాదవులు ‘సదర్‌’ (యాదవుల కుల సభ) మేళాను జరిపే సందర్భంల ఈ తీన్‌మార్‌ డప్పులకు అనుగుణంగ తలలకు శమ్లాలు చుట్టుకుని, చేతులల్ల పొడుగైన లాఠీలను పట్టుకొని రకరకాల సాముగరిడీలు, విన్యాసాలు చేసుకుంట చిందులు తొక్కుకుంట అందంగ అడుగులు వేసుకుంట ‘దద్దడ్‌ కీ దద్దడా, దద్దడ్‌ కీ దద్దడా’ అని నాట్యం చేస్తరు. హిందీ సినిమాలకు కూడ ఈ తీన్‌మార్‌ సంగీతం ప్రాకడం విశేషం.

ఎక్కడి ఆఫ్రికా? ఎక్కడి బొంబాయి బానిసల సంత? ఎక్కడి వనపర్తి సంస్థానం? ఎక్కడి హైద్రాబాద్‌? చావూష్‌లు హైద్రాబాద్‌ నగర సంస్కృతిలో పాన్‌సుపారీ లాగ కలిసిపోయినారు.

ఢిల్లీ మీద అహమ్మద్‌ షా అబ్దాలీ, నాదిర్‌షాలు దండెత్తి నగరాన్ని నేలమట్టం చేసి జనజీవనాన్ని అల్లకల్లోలం చేసినప్పుడు, 1857లో సిపాయిల తిరుగుబాటు విఫలమైనప్పుడు అనేకమంది ప్రజలు కాందీశీకులుగ వింధ్య పర్వతాలు, నర్మదానదిని దాటి దక్షిణ ముఖద్వారంలో ఉన్న హైద్రాబాద్‌ నగరానికి చేరుకుని ఆశ్రయం పొందినారు. హైద్రాబాద్‌లోని శాంతిసుస్థిరతలు వారిని ఆకర్షించినాయి.

అట్ల హైద్రాబాద్‌ నగరం ప్రపంచ నాగరికతల విభిన్న సమ్మేళనానికి చౌరస్తాగ నిలబడింది. చార్‌మినార్‌గ అవతరించింది. అందరికీ అమ్మగ, అన్నపూర్ణగ మారింది. అనేక జాతుల వారికి అనేక ప్రాంతాలవారికి ఆశ్రయమిచ్చింది. అక్కున చేర్చుకుంది. ‘సల్లగ బతుకుండ్రి బిడ్డా’ అని దీవనార్తెలు ఇచ్చింది. ఏ దేశమైతేనేం? ఏ జాతి ఏ మతమైతేనేం? ‘మానవుడా, మానవుడా’ అంటూ అందరినీ తన చల్లని ఒడిలకు తీసుకుంది. హైద్రాబాద్‌ ఒక మినీ భారతదేశంగ రూపొందింది. ‘జో జిస్సే మిలా సీఖా హమ్‌నే – గైరోంకో భీ అప్నాయా హమ్‌నే’ (ఎవర్ని కలిసినా వారి నుండి నేర్చుకున్నం – పరాయివారిని కూడా మా వారిగా చేసుకున్నం) అని ఆనంద గీతికలు పాడింది. ఇది హైద్రాబాద్‌ గొప్పతనం !

ఉత్తర భారతదేశంలోని ఢిల్లీ, లాహోర్‌, లక్నో నగరాల నుండి దక్కన్‌ నగరాలైన బీదర్‌, బీజాపూర్‌, అహమ్మద్‌నగర్‌లకు వచ్చే ముసాఫిర్లకు హైద్రాబాద్‌ నగరం ఒక ప్రవేశమార్గంగ, ప్రధాన గవాక్షంగ వెలిసింది. నానా జాతులు వచ్చి స్థిరపడిన కారణంగ నూతన సంస్కృతి ఆవిర్భవించింది. జీవనవైవిధ్యంల హైద్రాబాద్‌ తన ప్రత్యేకతను నిలుపుకుంది.

షానే షహర్‌ హైద్రాబాద్‌ దక్కన్‌
ప్యారే షహర్‌ హైద్రాబాద్‌ దక్కన్‌
చార్‌ సౌ సాల్‌ పురానా షహర్‌
ఏ షహర్‌ హమారా, ఏ షౌకత్‌ హమారా
ఏ హమారా షహర్‌ హైద్రాబాద్‌ దక్కన్‌

1948 సెప్టెంబర్‌ 13న హైద్రాబాద్‌ సంస్థానంపై నెహ్రూ ప్రభుత్వం పోలీస్‌ యాక్షన్‌ జరిపించి నిజాంను గద్దె దించి జె.ఎన్‌. చౌదరీ మిలటరీ గవర్నర్‌గ ఒక పౌర ప్రభుత్వాన్ని ఏర్పరిచింది. ఆ సమయంలో ఆంధ్రులు సివిల్‌ అధికారులుగ సైన్యంతో పాటు హైద్రాబాద్‌కు వలస వచ్చినారు. ఉర్దూను కించపరిచి ఇంగ్లీషు భాషా పెత్తనంతో విద్య ఉద్యోగాలలో చొరబడినారు. 1956లో విలీనానికి ముందే అనగా ఆంధ్రప్రదేశ్‌ ఏర్పడక ముందే ఈ వలసలు ఉధృతంగా జరిగినాయి. తమ ఆధిపత్యంతో స్థానికులను అవమానించినారు. దానికి వ్యతిరేకంగా 1952లనే ‘గైర్‌ ముల్కీ గోబ్యాక్‌’ ఉద్యమం విద్యార్థుల నాయకత్వంల జరిగింది. జంటనగరాలతో సహా తెలంగాణల వున్న అన్ని ముఖ్యపట్టణాలకు ఆ ఉద్యమం వ్యాపించింది. జంటనగరాలల్ల నిరవధికంగ 16 గంటల కర్ఫ్యూ విధించబడింది. 18 మంది ప్రజలు చనిపోయినారు. వందలాది అరెస్టులు జరిగి ఉద్యమం ఆగిపోయింది.

1952 నాటి మొదటి దశ ఉద్యమంల స్వామి జన్మించినాడు. 1969ల రెండవ దశ ప్రారంభం కాంగనే స్వామి అందులో భాగస్వామి అయినాడు. అట్ల ఆ ఉద్యమ పోరాట వారసత్వం రెండవ తరానికి కూడ అందించబడింది. బహుశా 1952 పోలీసు కాల్పులల్ల చనిపోయిన ఎవరైనా ఒక విద్యార్థి మరుజన్మల స్వామిగ జన్మించినాడేమో !

… తరువాత భాగం ఒచ్చే వారం

Leave a Reply

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

Managed by Discover Telangana Inc., a registered nonprofit organization in USA.

All opinions and views expressed by third party content providers and shown here as preview are not that of Discover Telangana.

If you find any Content that is infringing, libelous, defamatory, obscene, abusive, offensive or otherwise violation of copyright law, alert us by emailing us at discover.telangana(at)gmail.com