4
పదిహేడు సంవత్సరాలు గడిచిన తర్వాత మళ్లీ ఇప్పుడు 1969ల ప్రత్యేక తెలంగాణ ఉద్యమం ‘పునరుత్తానంగ’ ప్రారంభమయ్యింది.
ఆ రోజు స్వామి సరిగ్గ కాలేజీకి పోకుండ నారాయణగుడా విఠల్‌వాడీల వున్న గోపి ఇంటికి బయలుదేరినాడు. విఠల్‌వాడీల రాగిచెట్టు కింద అమ్మవారి గుడి ఎదురంగ వాళ్ల ఇల్లు. వాళ్ల నాన్న ఎలక్ట్రిసిటీ బోర్డులో ఉద్యోగం చేస్తడు. వాళ్లది స్వంత ఇల్లే అయినా చాలా ఇరుకు. వాళ్ల ఇంట్ల సిటీ కల్చర్ స్పష్టంగ కనబడుతది. దక్కన్ క్రానికల్, ఆంధ్రభూమి దినపత్రికలు రెండూ తెప్పిస్తరు. పైగా భోషాణమంత పెద్ద పాత రేడియో ఒకటి ఉంది. గోపి నాన్న హైద్రాబాద్, ఢిల్లీ వార్తలే కాక సిలోన్, పాకిస్తాన్, చైనా వార్తల్ని కూడా రాత్రి పగలు అనక అతిశ్రద్ధగ వింటడు. ఇంట్ల మిగిలినోళ్లు హమేషా సీన్మా పాటలు వింటుంటే ఆయనకో రోజు కోపం వచ్చి ఆ రేడియోను రెండు చేతులతో ఎత్తి పట్టుకుని వీధిలోకి విసిరేసినాడు. కింద పడినా అది ఆగకుండ చక్కగ పాడుతనే ఉందట. అది ‘మేడిన్ జపాన్’ అని ఆయన ఇప్పటికీ అందరితోటి సగర్వంగ చెప్పుతుంటడట. ఆయన ఎప్పుడైనా మూడ్‌లో వున్నప్పుడు సైగల్ పాటలను రేడియోకు చెవ్వు ఆనించి మరీ వింటడట. అవి ఎంత బోర్‌గ, ఎంత జోక్‌గ ఉంటయో గోపి సైగల్ గొంతును అనుకరిస్తూ ముక్కుతో ‘జబ్ దిల్ హీ టూట్ గయా’ అని వెక్కిరిస్తూ పాడుతుంటే తనూ అశోక్ కడుపు పగిలేటట్లు నవ్వుతరు. అట్లనే భానుమతి పాటలంటే గోపికి మరీ చులకన.
స్వామి గోపి ఇంటికి పోయ్యేసరికి అక్కడ అశోక్, జెఫ్రీలు కూడ తయారుగా ఉన్నరు. స్వామిని చూడంగనే సంతోషంతోటి కావలించుకున్నంత పని చేసినారు.
అశోక్‌ది కరీంనగర్ జిల్లా మెట్‌పల్లి. వాడు తన క్లాస్‌మేట్. వెలమవాళ్లు. వాడి నాన్న రాజకీయాలు, వ్యవసాయంతో పాటు కాంట్రాక్టు పనులు కూడా చేస్తాడట. బాగా దండోళ్లు. అశోక్ నలుపే అయినా నిండైన గుండ్రటి ముఖం. తీర్చిదిద్దిన కనుబొమ్మలతో పెద్ద పెద్ద కండ్లతో అందంగ ఉంటడు. పెదవి మీద మీసం చివర్లను నాలిక చివరితోటి సుతారంగ అద్దుకుంట ఉంటడు. అది వాడి మేనరిజం. ఎప్పుడూ ఇస్త్రీ మడతలు నలగని టెర్లిన్, టెరికాట్ బట్టలు వేసుకొని, నల్లటి మెరిసే బెల్టుతో ఇన్‌షర్టు లేకుండా సాధారణంగా కనిపించడు. ఇసామియా బజారుల ఇల్లు కిరాయకు తీసుకుని, ఊరి నుండే వంటవాడ్ని తెచ్చుకొని తమ్ముళ్లతో సహా చదువుకుంటున్నడు. సంవత్సరానికి ఓసారి పంట అమ్మిన డబ్బులు రాంగనే వాడి నాన్న ఇంట్ల అందరికీ ఒకేసారి రెండు వేల రూపాయలు పెట్టి బట్టలు కొంటడని అశోక్ చెప్పినప్పుడు స్వామి బోలెడంత ఆశ్చర్యపోయినాడు. స్వామి బాపు నెల జీతం నెలకు మూడు వందలు. తమ మిత్ర బృందానికి ఫైనాన్సియర్ అశోక్. సినిమాలు, హోటళ్ల ఖర్చులన్నీ వాడే భరిస్తడు. అయినా ఎప్పుడూ ‘ఫోజు’ కొట్టడు. అదే స్వామికి నచ్చిన సంగతి.
జెఫ్రీ నల్లగ, పీలగ, పొట్టిగ ఉంటడు. దళిత క్రిస్టియన్. నింబోలి అడ్డల మసీదు ఎదురుంగ గల్లీల వాళ్ల ఇల్లు. ఇల్లు స్వంతం కాదు కిరాయది. వాడు ఇది వరకే ఓసారి పి.యు.సి. డిమ్కీ కొట్టినాడు. గజనీ మహమ్మద్ దండయాత్రలు. సప్లిమెంటరీ రాస్తున్నడు. అయినా చదువుతున్న వాలకం కనబడదు. జీవితం అంటే కేరేపిన్, కేరేజాట్. ఎంత సేపూ మార్నింగు షో సీన్మాలు, ఇరానీ చాయ్‌లు, పాన్ డబ్బాల కాడ సిగరెట్లు, దొరికిన దోస్తులతో పొంఖనాలు (కబుర్లు). గోపి వాడికి ‘బాతాల పోతురెడ్డి’ అని బిరుదు ఇచ్చేసినాడు. వాడి షర్టు కాలర్ ఎప్పుడూ పైకి లేపే ఉంటది. అది హిందీ సీన్మా హీరో దేవానంద్ స్టయిల్ అట. అమ్మాయిలకు లైట్ కొట్టాలంటే ఆ కాలర్ ఎప్పుడూ అట్ల పైకి లేపే ఉంచాలట. వాళ్లను ఆకర్షించడానికి నిరంతరం సిగరెట్లు కాల్చడమే గాక ఆ పొగను రింగులురింగులుగ గాల్లోకి వదులుతూ ఉంటడు. ‘పరీలను’ ఆకర్షించటానికి తన వ్యక్తిత్వం, ఉనికి, ప్రత్యేకత అంతా ఆ రింగురింగుల పొగలనే ఉందని వాడి నిశ్చితాభిప్రాయం. వాడికి చదువు లేకున్నా ప్రతి ఆదివారం చర్చికి పోతడు కావున ఇంగ్లీష్ స్టయిల్‌గ మాట్లాడతడు.
అశోక్‌గాడ్ని పట్టుకుని ఆ రోజు శాంతి టాకీస్‌ల మార్నింగు షో సీన్మా ‘తోటలో పిల్ల కోటలో రాణి’ పుకట్‌గ చూడాలన్న ప్లానుతోటి వాడు గోపి ఇంటికి వచ్చినాడు. స్వామికి వానిల నచ్చింది మ్యూజిక్ సెన్స్. వానికి ముఖేష్ పాటలన్నా, శంకర్ జై కిషన్ సంగీతమన్నా, రాజకపూర్ సీన్మాలన్నా బలే పిచ్చి. వానికి రాత్రుళ్లు నిద్ర పట్టనప్పుడు, ఏమీ తోచనప్పుడు నగరం నిశ్శబ్దపు నిశా రోడ్ల మీద ఏకాంతంగ నడుచుకుంట రాజకపూర్ పాటల్ని పెద్దగ పాడుకుంట తిరుగుతడు. వాడొక నిశాచరుడు.
గోపికి చదువు తప్ప ప్రపంచంలో వున్న జనరల్ నాలెడ్జి అంతా తెలుసన్నట్లు నిరంతరం గంటలు గంటలు నాన్‌స్టాప్‌గ మాట్లాడుతూ వుంటడు. వాడొక గొప్ప స్టోరీ టెల్లర్. ఎంత పనికి రాని చెత్త సంగతైనా కతలు కతలుగ అల్లి గొప్పగ చెప్పుతడు. పోయిన ఎండాకాలం సెలవులల్ల తను ఒక్కడే నగర శివార్లలోని తమ ఫాంహౌజ్‌ల ఎట్ల గడిపిందీ, పొలంల వున్న గుడిసెల తను వంట ఎట్ల చేసుకున్నదీ, కౌబాయ్ స్టయిల్లో తను తమ దున్నపోతు మీద ఎక్కి ఇంటి నుండి పొలానికి ఎట్ల పొయ్యిందీ, గాలి రాని ఇరుకిరుకు విఠల్‌వాడీ గల్లీలల్ల నివసించే తను ఆరుబయలు పొలంల వెన్నెల రాత్రుళ్లలో చంద్రుణ్ని చూస్తూ, చుక్కల్ని లెక్కపెట్టుకుంట ఎట్ల నిద్రపోయిందీ, మందంగా మీగడ పేరుకుపోయిన గడ్డ పెరుగు రుచి ఎట్ల ఉందీ, కొంత మంది ఆ ఊరి పోరీలు తనను ఎట్ల అభిమానంతో చూసిందీ వర్ణించి వర్ణించి చెప్పెటోడు. వాడు దక్కన్ క్రానికల్ పేపరు రోజూ చూస్తడు. అందుకే ఇంగ్లీషు తడబాటు లేకుండ మాట్లాడెటోడు. అండ్ల గ్రామర్ తప్పుల సంగతి పెరుమాళ్లకెరుక! వాడింట్ల వానికి స్వేచ్ఛ ఎక్కువ. అర్ధరాత్రి దాటిన తర్వాత వచ్చినా, అసలు రాత్రంతా రాకపోయినా ఎవరూ ఏమీ అనరు. వాడి పిచ్చిల ఉన్న ఏదో క్రమబద్దత స్వామిని ఆకర్షించి సన్నిహితుణ్ని చేసింది.
చేతిల ఆనాటి క్రానికల్, ఆంధ్రభూమి పేపర్లు పట్టుకుని గోపి తన దోస్తులను న్యూసైన్స్ కాలేజీ చౌరస్తాల వున్న ఇరానీ హోటల్‌కు తీసుకపోయినాడు. ఎవరూ డిస్టర్బ్ చేయని ఓ మూల బల్లని ఆక్రమించినారు. ‘దో బై చార్ చాయ్ లావ్’ అని అశోక్ కేకేసినాడు. ‘బిస్కట్ భీ సాత్ లావో’ అని జెఫ్రీ వంతపాట. ‘గరం గరం సమోసా’ అని గోపి ముక్తాయింపు ఇచ్చినాడు. వాటిన్నింటికంటే ముందు నాలుగు సీసపు గ్లాసులల్ల ఐదు వేళ్లూ ముంచి ‘పానీ’ పట్టుకొచ్చినాడు హోటల్ సర్వర్. టపీమని ఆ గ్లాసులన్నీ టేబిల్‌పై గట్టిగా శబ్దం వచ్చేటట్లు పెట్టంగనే ఆ గ్లాసుల్లోని నీళ్లు కొన్ని టేబిల్‌పై ఒలికిపోయినై. గ్లాసులు పగిలినంత పని అయ్యింది.
“ఈ తెలంగాణ ఉద్యమం ఎట్ల స్టార్ట్ అయ్యిందో తెలుసా?” అని గోపి జెఫ్రీని ప్రశ్నించినాడు. జెఫ్రీగాడు పదహారు పండ్లు కనబడేటట్లు ఇకిలించి ‘నాకేం తెల్సు?శాంతి టాకీసుల మార్నింగు షో తోటలో పిల్ల కోటలో రాణి” అని అశోక్ ముఖంలకు ప్రశ్నార్థకంగ చూసినాడు.
“అభే సాలే, కమీనే. మన తోటోళ్లేమో తెలంగాణ కోసం పోలీసోళ్లతోని తన్నులు తింటున్నరు. తలలు పగులగొట్టుకుంటున్నరు. కాల్జేతులు ఇరుగగొట్టుకుంటున్నరు. నీకేమో ఆ రాజశ్రీ పోరిని చూడాలని ఉంది. నీకేమన్న సిగ్గు శరమూ ఉందారా?” అని అశోక్ క్లాసు పీకిండు. ఆ దెబ్బతో జెఫ్రీ తలొంచుకుని బిస్కట్లు కొరుకబట్టిండు. గోపి హుషారుగ తను పేపర్ల చదివిన వార్తలన్నింటిని కలిపి కతలాగా చెప్పటం మొదలు పెట్టినాడు. అశోక్, స్వామిలు గోపిని ముచ్చటగ చూస్తూ వాడు చెప్పేది శ్రద్ధగా వినసాగినారు.
ఖమ్మం జిల్లా పాల్వంచ థర్మల్ పవర్ స్టేషన్‌ల ఈ నెల ఐదో తారీఖున (1969 జనవరి) ఈ ఎజిటేషన్ శురువయ్యింది. సింగరేణి బొగ్గు, గోదావరి జలాలు ఆధారంతో నిర్మించిన ఆ విద్యుత్ కేంద్రంల ఆంధ్రోళ్లదే మెజారిటీ. ఆఫీసర్లు, ఇంజినీర్లు, క్లర్కులు వాళ్లు. మనోళ్లేమో చెప్రాసీలు, స్వీపర్లు, కార్మికులు. ఉద్యోగులల్ల తెలంగాణా కాని వాళ్లందరినీ వెనుకకు పంపాలనీ, తెలంగాణా వాళ్లకే ఉద్యోగాలు ఇవ్వాలనీ, తెలంగాణ రక్షణలు అమలు చేయాలనీ కృష్ణ అనే కార్మి నాయకుడు నిరాహారదీక్ష మొదలు పెట్టినాడు.అయితే ఆ ఎజిటేషన్ ఖమ్మం జిల్లా ముఖ్యకేంద్రానికి చేరుకుంది.
రవీంద్రనాథ్ అనే స్టూడెంట్ లీడర్ ‘భూక్ హర్తాల్’కు కూచున్నడు. ఆయనతో పాటు ఇంకా చానా మంది కూచున్నరు. మొన్న తొమ్మిదో తారీఖున పెద్ద జులూస్ భీ తీసినారు. ఆంధ్రాస్ గోబ్యాక్, తెలంగాణ రక్షణలు అమలు చేయాలని స్లోగన్లు ఇచ్చినారు. ‘ఆంధ్ర’ అని కన్పించిన బోర్డులన్నీ పీకేసినారు. కాళ్ల కింద పడేసి తొక్కేసినారు. ఆంధ్రా బ్యాంక్ మీద అటాక్ అయ్యింది. బస్సుల మీద పత్రం బాజీ అయ్యింది. ఖమ్మం రైల్వై స్టేషన్ల బెజ్వాడకు పొయ్యే రైళ్లన్నింటినీ ఆపేసినారు. అండ్ల వున్న ఆంధ్రోళ్లంతా పరేషాన్. కాని మీదికి మాత్రం బింకంగ కూసున్నరు.
నిజాంబాద్‌ల భీ ఎజిటేషన్ శురవయ్యింది. స్టూడెంట్లు ప్రొసెషన్లు తీసినారు. ‘నారా’లిచ్చినారు. ఖఠ్మల్ మామాలు లాఠీఛార్జీ జరిపినారు. చాలా మంది పోరలు జఖం అయినారు. పోరలకాల్జేతులు కట్టెపుల్లల లెక్క ఇరిగిపోయినయి. తలకాయలు పుచ్చపండ్లోలె పగిలిపోయినయి. ఇంక దాంతోని ఈడ హైద్రాబాద్‌ల ఉస్మానియా యూనివర్శిటీల భీ కాక తగిలింది. మొన్న తేరా తారీఖునాడు మనోళ్లు “తెలంగాణా విద్యార్థుల కార్యాచరణ సమితి”ని ఏర్పాటు చేసినారు. మల్లికార్జున్ దానికి ప్రధాన కార్యదర్శి. ఆయన మెడికల్ కాలేజీల స్టూడెంట్ లీడర్.
‘బహుత్ అచ్చా బోల్ రైఁ దోస్త్’ అని ఇద్దరు ముగ్గురు ముస్లిం స్టూడెంట్స్ తమ కుర్చీలను గోపి కుర్చీ దగ్గరకు లాక్కున్నరు. వాళ్లు పక్కనే ఉన్న న్యూసైన్స్ కాలేజీల బియస్‌సి చదువుతున్నరట. ఐ యామ్ సో అండ్ సో అని పరిచయాలు చేసుకున్నరు. సైన్స్ విద్యార్థులకు జనరల్ నాలెడ్జ్ తక్కువ అని మరోసారి తెల్సింది. అయినా వాళ్లు అతి శ్రద్ధగ గోపి మాటల్ని, సింపతితో వింటున్నరు.
అశోక్‌కు ఆవేశం ముంచుకొచ్చింది. వాడి పెద్ద పెద్ద కండ్లు నిప్పు కణికలుగ మారిపోయినై. గోపి మాటల ప్రవాహానికి అడ్డుపడి వాడు చెప్పటం మొదలు పెట్టినాడు. ప్రతీదాన్ని ఈజీగా తీసుకునే జెఫ్రీ కూడా సిగరెట్ అంటించడం మరిచిపోయి దానిని అట్లనే వేళ్ల సందున ఇరికించుకుని అందరి మాటలను సీరియస్‌గ వింటున్నడు. తన లోపల తనే ఏదో సీరియస్‌గ ఆలోచిస్తున్నడు.
“అరే భై ఎంత సేపూ చదువులు, ఉద్యోగాలు అనే మాట్లాడుతరు గని మా ఊళ్ల గురించి, భూములు వ్యవసాయం గురించి ఎవరూ మాట్లడరేంది? ఇండియా లివ్స్ ఇన్ విలేజేస్ అని గాంధీ మహాత్ముడు చెప్పలే? ఆంధ్రోళ్లతోని మేమెంత నుక్సానయినమొ, ఎంత పరేషానయినమో, ఎంత బద్నామ్ అయినమొ, మీ పట్నపోళ్లకు ఏమైనా ఎరికేనా? మీరు ఆరామ్‌గ నజాకత్‌లు చేసుకుంట, నాజూక్‌లు చేసుకుంట పంకల కింద కూసోని, చాలు తాక్కుంట, సిగరెట్లు పీక్కుంట, లెక్చర్ బాజీలు చేస్తుంటరు గని” అని నిష్ఠూరాలు పోబట్టిండు అశోక్.
“ఏమైందిరా, అశోక్?” అని నవ్వుతూ అడిగినాడు స్వామి. అశోక్ తమ ‘గోస’ విన్పించటం మొదలు పెట్టినాడు.
“1956లో ఆంధ్రప్రదేశ్ ఏర్పడక పూర్వమే 1948 పోలీసు యాక్షన్ నుండి ఆంధ్రోళ్లు తెలంగాణల గుసాయించడం మొదలు పెట్టిండ్రు. నీళ్లున్న చోట, తరి భూములున్న చోట కొడుకులు అడ్డా బిఠాయించిండ్రు. 1950 కౌల్దారీ చట్టం ప్రకారం తెలంగాణా భూముల్ని తెలంగాణా వోళ్లే కొనాలె. అమ్మాలె. కాని 1956ల ఆంధ్రప్రదేశ్ ఏర్పడక ముందే ఆ చట్టాన్ని బేఖాతర్ చేసి ఆంధ్రోళ్లు తెలంగాణాల భూముల్ని అగ్గువసగ్గువకు కొన్నరు. ఇక ఆంధ్రప్రదేశ్ ఏర్పడంగనే కోతికి కొబ్బరికాయ దొరికినట్లు అయ్యింది. ఏకు మేకై పోయిండ్రు. ఏలు బెట్టే సందైతే కాలు బెట్టేటందుకు వొచ్చినోళ్లు వొచ్చినట్లు ఊకుండకుండ తమ చుట్టపక్కాల్ని, దోస్తుల్ని, అందర్నీ దావత్ ఇచ్చినట్లు పిలుసుకున్నరు. కొత్త కొత్త ఊర్లు. కొత్త కొత్త పేర్లు. మనోళ్లేమో ఉన్న భూములమ్ముకోని కూలోళ్లయ్యిండ్రు. పట్నాలల్ల హమాలీలయ్యిండ్రు. అయితే కత ఇంతటితోటి అయిపోలే. వాళ్లకు నీల్గుడెక్కువయ్యింది. షానతనమెక్కువయ్యింది. మనకు తెలుగు రాదట. తెలివి లేదట. సోమరిపోతులమట. నాగరీకం అనేదే తెల్వదంట” అని ఆయాసంతో, ఉద్రేకంతో ఆగిపోయిండు.
“అపన్ హౌలే నహీఁ హై దోస్త్. వోహీ మత్‌లబీ హై. బద్మాష్ హై. సాలోంకో భగాదో యహాఁ సే” అని ముస్లిం దోస్తులు అశోక్‌ను సముదాయించబట్టిండ్రు. అందుల ఒకతను “చే బన్ మస్కా లావ్ భై” అని ఆర్డర్ ఇచ్చిండు. బన్ మస్కా పేరు వినగానే స్వామికి నోట్లో నీళ్లూరటం ప్రారంభించినై. కేక్ పేస్ట్రీలు, బన్ మస్కాలంటే స్వామికి బలే ఇష్టం.
“మరి ఉస్మానియా యూనివర్శిటీ స్టూడెంట్లల్ల రెండు గ్రూపులు ఎందుకు ఏర్పడినయ్?” జెఫ్రీ తెలివైన ప్రశ్న వేసిండు.
“అవును. సేఫ్ గార్డులు. సపరేటిస్టులు అని రెండు గ్రూపులుగా మనోళ్లు చీలిపోయినారు. సేఫ్ గార్డ్స్ గ్రూపుల కమ్యూనిస్టు పార్టీకి చెందిన స్టూడెంట్ ఫెడరేషన్ వాళ్లున్నరు. సదానంద్ వాళ్ల నాయకుడు. అతను లా స్టూడెంట్. వెరీ డైనమిక్. ఇంక ఆ గ్రూపుల కాంగ్రెస్ పార్టీలోని సమైక్య వాదానికి సంబంధించిన విద్యార్థులు కూడ ఉన్నరు. తెలంగాణాకు అన్యాయం జరిగిందని ఈ సేఫ్ గార్డ్స్ కూడ ఒప్పుకుంటరు కాని రాష్ట్రాన్ని చీల్చకుండా తెలంగాణకు రక్షణలు కల్పించాలని, అభివృద్ధి చేయాలని రాష్ట్ర సమైక్యతను కాపాడాలని వారి వాదన. సపరేటిస్టు విద్యార్థుల గ్రూపుకు మల్లికార్జున్, శ్రీధర్ రెడ్డి నాయకులు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితేనే అన్ని కష్టాలు తీరుతయని, నిజమైన అభివృద్ధి జరుగుతుందని వారి అభిప్రాయం” అని వివరించినాడు గోపి.
“మరి ఈ రోజు ప్రోగ్రామ్ ఏంటిదీ?” అని ప్రశ్నించినాడు స్వామి.
“మనం సపరేటిస్టులం. నిజాం కాలేజీ నుండి సెక్రెట్రేట్ దాకా జులూస్ తీస్తం. అక్కడ మీటింగు. మన అప్పోజిషనోళ్లు అదే సేఫ్‌గార్డ్స్ వివేక్ వర్ధనీ కాలేజీ గ్రౌండ్స్‌ల జమయితరట. వాళ్లు ఎక్కడిక పోతరో, ఏం చేస్తరో మనకయితే తెల్వదు” అన్నడు గోపి.
ఇంతల బన్‌మస్కాలొచ్చినై. అందరూ కలిసి వాటిని లాగించినారు. ముస్లిం దోస్తులు వొద్దన్నా వినకుండ అన్ని బిల్లులు మొత్తం కట్టేసినారు. తర్వాత చలో అంటే చలో అని హోటల్ నుండి అందరూ గుంపుగ బయలుదేరినారు. న్యూసైన్స్ కాలేజీ ముందు మరికొంత మంది కలిసినారు. జై తెలంగాణా నినాదాలతో అనుకోని ఊరేగింపు బయలుదేరింది. కింగుకోఠీ, ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్, హైదర్‌గుడా, బషీర్‌బాగు చౌరస్తాల నుండి గుజ్రాయించి నిజాం కాలేజీ మైదానం చేరుకున్నరు. అన్ని కాలేజీల విద్యార్థులు అక్కడికే చేరుకున్నట్లుంది. మల్లికార్జున్, శ్రీధర్‌రెడ్డిలు అక్కడే తిరుగుతున్నరు. స్వామి మల్లికార్జున్‌ను చూడటం అదే ప్రథమం. అతను విద్యార్థి లాగ లేనేలేడు. నల్లగ, లావుగ వున్నడు. కొంచెం పొట్ట కూడ ఉంది. మీసాలు తాండ్ర పాపారాయుడి మీసాల్లాగ ఉన్నయి. మాటిమాటికి వాటిని రింగులురింగులుగ మెలి పెడుతున్నడు. శ్రీధర్ రెడ్డి మాత్రం తెల్లగ, పొడుగ్గ, సన్నగ ఉన్నడు. పల్చటి గడ్డం. బాగ ఎమోషనల్‌గ కనబడుతున్నడు. ఆ ఇద్దరూ ప్రతి ఒక్కరితో షేక్‌హాండ్లు ఇచ్చుకుంట హలో అనే బదులు ‘జై తెలంగాణా’ అంటున్నరు. మిగతా వారు బదులుగా జై జై తెలంగాణా అంటున్నరు.
సాంప్రదాయిక నమస్కారానికి ఓ నమస్కారం పెట్టి ఈ కొత్త పోరాట సంస్కృతిని అలవాటు చేసుకున్నట్లుంది. ఫోను ఎత్తంగనే కొందరు జై తెలంగాణా అనే అంటున్నరట. మొన్న ఒక పెండ్లి కొడుకు “జై తెలంగాణా” అని మంత్రం లాగ నినాదమిస్తూ పెండ్లిపిల్ల మెడల పుస్తె కట్టిండట. ప్రజలు చేసే పోరాటాలల్ల నూతన సంప్రదాయాలు ఇట్లనే వ్యాపిస్తుంటవి.
నిజాం కాలేజీ నుండి ఊరేగింపు బయలుదేరింది. ఎంత పొడుగైన ఊరేగింపో! నినాదాలే నినాదాలు. ఆకాశం విరిగి మీద పడుతున్నదా అన్నట్లు ! స్వామి గొంతు రెండు మూడు నినాదాలకే కీచుగొంతుగ మారింది. ఊరేగింపు బషీర్‌బాగు ఎల్.బి. స్టేడియం, బాగేఆం, రవీంద్రభారతి, నుండి సెక్రటేరియట్‌కు సాగిపోతుంది. మలబార్ స్పెషల్ పోలీసులు చిన్న టోపీలతో, మెషిన్‌గన్, లాఠీలతో జాగ్రత్తగ డేగకళ్లతోటి కాపలా కాస్తున్నరు. కవర్ చేస్తున్నరు. నగరం అంతటా 144 సెక్షన్. అయినా ఎవరికీ భయం లేదు.
స్వామికి ఫుట్‌పాత్‌పై ఒక కంకరరాళ్ల గుట్ట కన్పించింది. ఆ పక్కనే మున్సిపల్ లైట్‌బుడ్లు గుండ్రంగ తెల్లగ మెరిసిపోతూ కన్పిస్తున్నయి. స్వామి ఆ రాళ్ల గుట్టవైపు పరిగెత్తి ఒక రాయి చేతిలకు తీసుకోబోయినాడు. ఊరేగింపు లైనునంతా మల్లికార్జున్ పర్యవేక్షిస్తున్నట్లుంది. ఎక్కడ్నుండి చూసిండో దబ్బ దబ్బ స్వామి దగ్గరికి ఉరుక్కుంట వచ్చి “తమ్మీ! అదేం పని?” అని గద్దించినాడు. చటుక్కున రాయి విడిచిపెట్టి లటుక్కున గుంపులకు మాయమైనాడు స్వామి.
ఊరేగింపు సెక్రటేరియట్‌కు చేరుకుంది. దాని గేట్ల ముందు గంటల తరబడి నిలబడి ధర్నా చేసినారు. ఉపన్యాసాలిచ్చినారు. ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి గడ్డిబొమ్మను దహనం చేసినారు. నినాదాలు చేసుకుంట ఇండ్లల్లకు తిరుగుముఖం పట్టినారు.
ఆ తర్వాత కొన్ని రోజులకే స్వామి పంచముఖి హనుమాన్ గల్లీలల్ల ఒక స్కూల్‌ను బాయ్‌కాట్ చేయిస్తున్నప్పుడు మల్లికార్జున్ ఇంకో దోస్తుతో కల్సి బుల్లెట్ మోటార్ సైకిల్‌పై తిరుగుతూ ఆ స్కూలుకు వచ్చినాడు. పాతనగరంల పాఠశాలలు బాయ్‌కాట్ చేయిస్తున్న లీడర్ అని తెల్సి శభాష్ అని మెచ్చుకుని షేక్‌హాండ్ కూడా ఇచ్చినాడు. ‘ఏమైనా ప్రాబ్లెమ్ వుంటే ఈ ఫోన్ నంబరుకు ఫోన్ చేయండి’ అని ఒక కాగితంపై నంబరు రాసిచ్చినాడు. స్వామి గొప్పగా పొంగిపోయినాడు. నిజాం కాలేజీ మైదానంల వేలాది మంది ముందు ఉపన్యాసమిచ్చే మల్లికార్జున్ తనతో ఒంటరిగా మాట్లాడి తనకు ఫోను నంబరు రాసిచ్చినందుకు. అయితే కొద్ది రోజులకే ఆ ఫోన్ నంబరుతో పనిబడింది.
పాతనగరంల అనేక స్కూళ్లను బాయ్‌కాట్ చేయించినాడు. దూద్‌బౌలీలోని కస్తూర్‌బా పాఠశాలల క్లాసులు నడుస్తున్నవని ఇన్‌ఫర్‌మేషన్ వచ్చింది. స్వామి, సీతారాం, ఓంప్రకాశ్ బస్తీ మిత్రులు మరికొంత మంది కల్సి ఆ స్కూలుకు పోయినారు. గేట్లు బిగించి లోపల క్లాసులు నడిపిస్తున్నరు. వాళ్లంతా జై తెలంగాణా, జైజై తెలంగాణా అని గేట్లను దబ్బ దబ్బ కొట్టడం మొదలుపెట్టంగనే చప్రాసీ భయపడి గేటు తెరిచినాడు. అందరూ నినాదాలు ఇస్తూ లోపలికి గుసాయించి స్కూలు గంట గణగణా కొట్టేసినారు. పిల్లలంతా గట్లు తెగిన ప్రవాహంలాగ తమ చుట్టూ చేరిపోయినారు. వాళ్ల కోసమే చూస్తున్నరట – ఎవరైనా వచ్చి క్లాసులు బాయ్‌కాట్ చేయిస్తే బాగుండునని. తను వాళ్లతో జై తెలంగాణా నినాదాలు ఇప్పిస్తున్నడు.
ఇంతల ఆ స్కూల్ హెడ్ మిస్ట్రెస్ తన దగ్గరికి వచ్చి ఆర్గ్యుమెంట్ మొదలు పెట్టింది. ప్రత్యేక తెలంగాణా రాజకీయ ఉద్యమమనీ, విద్యార్థులకు రాజకీయాలతో ఏం పని అనీ, చదువులెందుకు చెడగొట్టుకుంటరని హెచ్చరికలు, హితబోధలు మొదలు పెట్టింది. స్వామి తీవ్రస్వరంతో స్వాతంత్య్ర పోరాటంల కూడ విద్యార్థులు పాల్గొన్నరనీ, మరి ఆనాడు వాళ్లు కూడ మీ మాదిరే ఆలోచిస్తే మరి ఈనాడు మనకు ఈ స్వాతంత్య్రం ఉండేదా అని అడిగినాడు. ఆ ప్రశ్నతో ఆమెకు గొంతుల వెలక్కాయ ఇరుక్కున్నంత పని ఐంది. ఏం జవాబు ఇవ్వాలో తోచక మిర్రిమిర్రి చూసింది. ఇంతల పోలీసులు స్కూలు ముందుకు గస్తీ తిరుగుతూ వచ్చినారు. స్కూలు లోపల గడబడ అవుతుందని తెలిసి లాఠీలు తిప్పుతూ లోపలికొచ్చినారు. పోలీసులను చూడంగనే వెంట వచ్చిన దోస్తులందరూ ‘దాగుడు మూతలు దండాకోర్. పిల్లీ వచ్చే ఎలకా పాయె’ అన్నట్లు ఎక్కడి వాళ్లక్కడే పరార్.
స్వామికి పారిపోవటం, అదీ ఆ హెడ్ మిస్ట్రెస్ ముందు అవమానం అనిపించింది. ధైర్యంగ అట్లనే నిలుచుండిపోయినాడు. ఎర్ర పట్టీ జమేదార్ వచ్చి ‘చలో పోలీస్ స్టేషన్’ అన్నడు. తనూ ‘చలో’ అన్నడు. ఓ ముసలిబక్క పోలీసు తనను పాత సైకిల్ హాండిల్‌బార్ మీద కూచోబెట్టుకొని చత్రినాకా పోలీస్ స్టేషన్‌కు తీసుకపోయినాడు. పోలీసు స్టేషన్‌కు పోవుడు స్వామికి అదే మొదటిసారి. లాకప్ లోపల ఎవరో దొంగలున్నరు. పోలీస్ స్టేషన్ హౌజ్ మాస్టర్ తన ఎర్రటోపీ పక్కన బెట్టి టేబుల్‌పై తలవాల్చి మాంచి నిద్రల ఉన్నడు. వాళ్ల చప్పుడుకు నిద్ర లేచి ఎగాదిగా చూసి పేరు, తండ్రి పేరు, బస్తీ, ఇంటి నెంబరు, కాలేజీ వివరాలన్ని రిజిష్టర్‌లో ఓపికగా ఎక్కించుకుని “మళ్లీ ఇంకోసారి ఇట్లనే చేస్తే అరెస్టు చేసి లాకప్‌ల పడేస్త. జైలుకు పంపిస్త. కబర్దార్” అని వార్నింగు ఇచ్చి “జావ్” అని హుంకరించినాడు.
స్వామి వీరుడిలాగ పోలీసు స్టేషన్ నుండి ఇవతలికి వచ్చి మండే ఎండలల్ల కాళ్లీడ్చుకుంట అప్సరా టాకీస్, లాల్ దర్వాజాల నుండి బస్తీకి చేరుకున్నడు. అక్కడ దోస్తులంతా పరేషాన్ ముఖాలతో నిల్చున్నరు. స్వామిని చూడంగనే వాళ్ల ముఖాలల్ల దీపావళీ ఫూల్‌చెడీలు. సంక్రాంతి నాడు ఎగురుతున్న పతంగుల్లాగ వారి ముఖాలు. అప్పటికి శాలిబండల ఫోన్లు లేవు, ఒక్క పోస్టు ఆఫీసులో తప్ప. సీతారాం పోస్టాఫీసుకు పోయి మల్లికార్జున్ ఇచ్చిన నంబరుకు ఫోను చేసి స్వామిని పోలీసోళ్లు పట్టుకుపోయినట్లు చెప్పినారట. “ఒక గంట ఆగి చూడండి. అప్పటికీ విడవకపోతే మేం చత్రినాక పోలీసులతో మాట్లాడుతం” అని ఎవరో సమాధానమిచ్చినారట.
చరిత్ర రథచక్రాలు వడివడిగ కదులుతుంటే ప్రత్యేక తెలంగాణా ఉద్యమం రక్తసిక్తమైన మలుపులకు, ఎవ్వరూ ఊహించని దారులకు తరలిపోయింది. అడుగడుగునా రక్తతర్పణలు. ప్రాణ త్యాగాలు. బలిదానాలు. అయినా విద్యార్థులు, యువకులు ఆ పోరాటాన్ని ముందుకు, మున్ముందుకే తీస్కపోయినారు గని ఎన్కకు తిరగలె! తెలంగాణా వీధులలో నవయువకుల ఉడుకురక్తం ఏరులై పారింది. తల్లి తెలంగాణా కోసం అడుగడుగున ఆత్మార్పణలు. రక్తాభిషేకాలు. అశ్రుసిక్త నయనాల నైవేద్యాలు. మళ్లీ మరొకసారి తెలంగాణా పోరాటాల పోతుగడ్డ, ఆరాటాల పురిటిగడ్డ అని ప్రపంచానికి తెలిసిపోయింది. పుడమి తల్లి పురిటినొప్పులే ప్రత్యేక తెలంగాణా పోరాట ఉద్యమం.
* * *
ఆ రోజు జనవరి 18, 1969
ఆ ఉదయం స్వామి తొందరగ తయారయ్యి అమ్మ పెట్టిన ఉప్పుడు పిండిల శర్కర కలుపుకుని కడుపు నిండా తిని కోపు నిండా చాయ్ పోసుకొని, అమ్మను బతిమిలాడి అందులో స్పెషల్‌గ మీగడ వేయించుకొని తృప్తిగా నాస్తా ముగించినాడు. ‘అమ్మా ఈ రోజు నేను గోపి వాళ్లింటికి పోతున్నా సాయంత్రం ఆలస్యమైతదేమో ఎదిరి చూడకు’ అని అమ్మకు చెప్పి వంటింట్ల నుండి మనసాలలకు వచ్చేసరికి బాపు కనబడ్డడు. ఆ రోజు ఆయనకు బడి హడావిడి లేనట్లుంది. చాయ్ తాగినట్లుంది. తీరికగ చాప మీద కూచుని పాన్‌దాన్ ముందు పెట్టుకుని దానిని తెరుస్తున్నడు. ఆయన స్వామిని చూడంగనే “అరే బాపూ! ఇట్ల రారా!!” అని ఆదేశించినాడు.
“ఏం బాపూ?” అని దగ్గరకొచ్చిండు స్వామి.
“కూచో” అని చేతిల ఉన్న కత్తెరతోటి సైగ చేసినాడు బాపు. స్వామి చాప మీద కూచున్నడు. ఒక వైపు ప్రాణం పీకుతనే ఉంది. నిజాం కాలేజీకి పోవాలె. ఈ రోజు అక్కడికి తెలంగాణా అంతటి నుండి విద్యార్థులు వస్తున్నరు. పెద్ద ఊరేగింపు. టైముకు పోకుంటే ఆ జనసముద్రంల తమ మిత్రబృందం ‘కాట్’ అయిపోతరని భయం.
బాపు పాన్‌దాన్ తెరిచినాడు. ఆయన తన తాంబూలం పెట్టె తెరిచినాడు అంటే చిన్న సైజు యజ్ఞానికి ఉపక్రమించినాడనే అర్థం. ఆ కాలంల ఇంట్ల ఫోన్ ఉండుడు ఎట్ల ఒక హోదానో, అంతస్తుకు సంబంధించిన సంగతో అట్లనే నోట్లో పాన్ వుండుడు కూడ ఒక హోదాకు, అంతస్తుకు సంబంధించిన విషయం. అందుకే హైద్రాబాద్ పాతనగరంల ‘నోట్లె పాన్ – ఇంట్లె ఫోన్’ అనే సామెత చెలామణిల ఉంది. పాన్ హీ షాన్ హై . పాన్ నైజాం నవాబుల దర్జాకి ఒక ప్రతీకగ నిలిచిపోయింది. బాపూ నైజాం కాలంనాటి మనిషి కావున నిరంతరం పాన్ నమలడం ఒక వ్యసనంగ మారింది.
ఆయన తన పాన్‌ను తయారు చేసుకునే పద్ధతిని గమనిస్తే అదొక కళాత్మకమైన, రసాత్మకమైన పని అని తెలిసిపోతుంది. అయితే పాన్ తాలూకు తయారీ కంటే ముందు ఆ పాన్‌దాన్ వైభోగాన్ని మనం తెలుసుకోవాలె. నైజాం కాలంల పాన్ తినేవారి ఆర్థిక, సామాజిక స్థాయిని బట్టి రకరకాల పాన్‌దాన్‌లు వివిధ ఆకారాలల్ల వుండేవి. బంగారం, వెండి, ఇత్తడివి. బాపు పాన్‌దాన్ సుమారు ఒక కిలోబరువుతో చిన్న సైజు క్యాష్ బాక్సు లాగనో, పెద్ద సైజు బొగ్గుల ఇస్త్రీ పెట్టె లాగనో వుండేది. అది ఇత్తడిది. ప్రతివారం పాత చింతపండుతో గట్టిగ తోమటం వల్ల బంగారంలాగ తళతళా మెరుస్తూ వుండేది. దాని పై భాగంల ఏవేవో లతలు, పూలు, పక్షులు, జంతువుల బొమ్మలు. దానిని సృష్టించిన కళాకారుడి నైపుణ్యాన్ని నగిషీ పనితనాన్ని ఆ పాన్‌దాన్ తెలియపరిచేది. అవసరం అనుకుంటే దానికి తాళం వేయటానికి ఒక కొక్కెం వుండేది. చిన్న పిల్లలెవరూ దానిని తెరువరాదని, తెరిస్తే అందులోని సుగంధ వస్తువుల్ని చిందరవందర చేస్తరని, పాన్ తినడం అలవాటు చేసుకుంటరనే భయంతో పెద్దవారు దానికి తాళం కూడ వేసెటోళ్లు. అది చూడంగనే ఎంత ముచ్చటగ ఉండేదంటే చిన్నప్పుడు దానిని ఒక బండిలాగనో ఒక బస్సులాగనో ఊహించి నేలపై గీకుతూ ఆడుకునెటోళ్లు. దాని గలగలల శబ్దం వింతగా విచిత్రంగా వుండేది.
దానిని తెరవంగనే అండ్ల రెండు అరలుండేవి. కింది అరలో నాణ్యమైన లేత తమలపాకుల బొత్తి వుండేది. ప్రతి బొత్తిల పచ్చీస్ పాన్లు వుండేవి. వాటి ధర కూడ పచ్చీస్ ప్రకారంగానే వుండేది. కూరగాయల కోసం బజారుకు లేదా మండీకి వెళ్లినప్పుడల్లా పాన్‌లు కూడా తప్పనిసరిగ కొనుక్కొని రావాలె. మరిచిపోతే పెద్దల అక్షింతలు తప్పకపోయేవి. పచ్చీస్ పాన్ ధర సుమారు చారానా ఉండేది. నాణ్యత, రుచి విషయంల తాండూర్ లేదా బెంగుళూరు తమలపాకులు చాలా ప్రసిద్ధి చెందినవి.
ఆ తమలపాకుల బొత్తిపై ఒక ఖైంచీ – కత్తెర కూడ వుండేది. ఆ కత్తెర పాన్‌దాన్‌ల ఒక ప్రధానమైన ఉపాంగం. అవి కూడా రకరకాల ఆకారాలల్ల వుండేవి. కొన్ని కత్తెరలు పక్షులు, జంతువుల ఆకారాలతోటి వుండేవి. మరికొన్ని స్త్రీ పురుష సంభోగ శృంగార భంగిమలల్ల వుండేవి. బహుశా వాటిని కేవలం రాత్రుళ్లు పడక గదుల్లనే వాడటానికి తయారు చేసేటోళ్లేమో! ఆ కత్తెర్లతో గుండ్రని పోకల్ని చిన్న చిన్న ముక్కలుగా కత్తిరించుకునేవాళ్లు. తెలంగాణాలో పోకచెక్కల్ని ‘భాగాలు’ అని కూడా అంటరు. చిన్న చిన్న ముక్కలుగా కత్తిరించబడేవి కావున భాగాలు అని అర్థం కావొచ్చు. పెద్దవాళ్లని సతాయించటానికి అప్పుడప్పుడూ పిల్లలు కత్తెరను మాయం చేసెటోళ్లు. ఎక్కడ్నో దాచిపెట్టివారితోటి ఇల్లంతా వెతికించి లోపల్లోపల కిసకిస నవ్వుకునెటోళ్లు.
పాన్‌దాన్ల కింది అరకాక మరో పై అర కూడ వుండేది. ఆ అరల ఆరు ప్రత్యేకమైన విడివిడి డబ్బాలు వుండేవి. వాటిల పోకచెక్కలు, కాసు, సున్నం, యాలకులు, లవంగాలు, సోంపు, జాఫ్రానీ, జాజీ, జాపత్రీ వగైరాలుండేవి. ఉత్తర భారతదేశంల ఇంటికి వచ్చిన అతిథుల ముందు హుక్కా పెట్టినట్లు అప్పటి నైజాం రాజ్యంల వాళ్ల ముందు పాన్‌దాన్ పెట్టెను పెట్టెటోళ్లు. అతిథికి పాన్‌బీడా చుట్టి యివ్వడం ఒక ఫ్యూడల్ మర్యాద. ఇట్ల ప్రతి ఇంట్ల వుండే పాన్‌దాన్ ఆ ఇంటి అంతస్తును, హోదాను, గౌరవాన్ని, సామాజిక స్థాయిని నిర్ణయించేది కావున ‘పాన్‌దాన్ – ఖాన్‌దాన్’ అనే సామెత కూడా చెలామణిల ఉండేది.
మరి పాన్‌దాన్ గురించి ఇంత వివరంగ మాట్లాడుకున్నప్పుడు ఒగల్‌దాన్ గురించి కొంతైనా చెప్పుకోకపోతే న్యాయంగ వుండదు. ఒగల్‌దాన్ అంటే ఉమ్మే పాత్ర. నిరంతరం తాంబూలసేవన ప్రియులు ఎక్కడంటే అక్కడ ఎల్లప్పుడూ ఉమ్మటం కుదరదు కావున పాన్‌దాన్ పక్కనే ఒగల్‌దాన్ కూడ హమేషా హాజరుగ వుండేది. ఆ ఒగల్‌దాన్ వగల గురించి కూడ వైనవైనాలుగ వర్ణించవచ్చు. పొడుగువి, పొట్టివి, ఒంపుసొంపుల వంకరటింకరవీ, సాదాసీదావీ, ఆడంబరానివీ ఇత్తడీ వెండీ బంగారాలవీ వగైరా వగైరా. నవాబుల దర్బారులల్ల విధేయులైన సేవకులు ఆ ఒగల్‌దాన్‌లను పట్టుకొని ప్రభువుల వెనకనే నీడలాగ తిరుగుతూ వుండెటోళ్లు. అది నిండిన ప్రతిసారీ శుభ్రం చేయడానికి ప్రత్యేకమైన సేవకులు వుండేవాళ్లు.
స్వామి బాపుకు తన పాన్ తయారు చేసుకోవటానికి పక్కా ఓ అరగంట పట్టేది. ముందే చెప్పినట్లు అదొక కళాత్మకమైన పని. తమలపాకులను పెట్టెల నుండి తీసి కళ్ల ముందు పెట్టుకొని వెలుగుల వాటిని కళ్లు చిట్లించి పరీక్షగ రోగిని పరిశీలించే వైద్యుడిలాగ చూసెటోడు. అవి లేతగ వున్నయా లేక పండిపోయినయా అని నిర్ధారించుకున్న తర్వాత పనికొచ్చేవి పక్కన పెట్టుకొని పండిపోయినవి కిందపడేసెటోడు. ఎన్నిక చేసుకున్న ఆకుల్ని అతి జాగ్రత్తగ పసిపాపలను ఎత్తిపట్టుకున్నట్లు పట్టుకుని ఒక శుభ్రమైన తెల్లని బట్టతోటి వాటిని తుడిచెటోడు. ఆ తర్వాత వాటి ఈనెల్ని తన గోళ్ల కొసలతోటి నాజూకుగ తీసెటోడు. కాచి వడబోసిన వెన్నముద్దలాంటి తెల్లసున్నం ముద్దను చూపుడు వేలితో సుతారంగ తీసుకొని అంతే సుతారంగా ఆ ఆకు వెనుకభాగం మీద పై నుండి కిందికి పసిపిల్లల వీపును నిమురుతున్నట్లు ప్రేమగ రాసెటోడు. ఆ సున్నంపూత పూర్తయిన తర్వాత పొడిపొడిగ నూరిన నాణ్యమైన కలకత్తా ఖత్తాను ఆకు మీద పుప్పొడిలాగ వెదజల్లెటోడు. యాలకులను, లవంగాలను, జాఫ్రానీ జర్దాను తగుపాళ్లల్ల మిశ్రమం చేసి పాన్ మధ్యల అమర్చెటోడు.
చివరికి ఆ పాన్‌ను నాలుగు మడతలుగ మలిచి ‘బీడా’గ మార్చి వీలుంటే దానికి ఒక లవంగాన్ని గుచ్చి వేళ్లతో అలవోకగ పట్టుకుని పరవశత్వంతో కళ్లు మూసి, నోరు తెరిచి ఆ పాన్ ‘బీడా’ను నోట్లెకు నెట్టేసెటోడు. నోట్లె పాన్ వున్నంత వరకూ మాట్లాడే వీలు వుండదు కావున ఆ క్షణంల ఆయన్నెవరూ పలకరించే అవకాశం వుండదు. దానిని కొంత నమిలి కొంత ఉమ్మిన తర్వాతే ఆయన ఇహలోకంలోకి వచ్చెటోడు. ఎదురంగ ఉన్న వాళ్లతోటి సంభాషణలకు దిగెటోడు.
బాపు పాన్ యజ్ఞం పూర్తయిన తర్వాత స్వామితోటి మాట్లాడసాగినాడు. “అరే బాపూ! వీళ్లు వాళ్లు మాట్లాడుకోంగ వింటిని. సియాసత్ అక్బార్‌ల రోజూ వార్తలు చదువుతనే వుంటిని. తెలంగాణాల గడ్‌బడ్‌లవుతున్నవట. పట్నంల కాలేజీలు నడుస్తలేవని తెలిసింది. పిల్లలు క్లాసులకు పోతలేరని కూడ తెలిసింది. మరి రోజూ నువ్వు ఏం చేస్తున్నట్లు? ఎక్కడ గాలికి తిరుగుతున్నట్లు?” క్లాసు మొదలయ్యింది.
“లే బాపూ! నేను గోపి ఇంటికి పోయి కంబైన్డ్ స్టడీస్ చేస్తున్న”.
“ఉత్తప్పుడే చదువవ్. ఇగ ఇప్పుడు చదువుతవా? ఏం చేస్తున్నవో ఏమొ నాకైతే నమ్మకం లేదు. గడ్‌బడ్‌లల్ల షరీక్ కావొద్దు. కుఫియాలు (గూఢచారులు) ఉంటరు. వాళ్లు గిన రిపోర్ట్ ఇస్తే పోలీస్ గిరఫ్తార్ చేసి ఖైద్‌ఖానాల పెడ్తది. ఒక సంగతి గుర్తు పెట్టుకో. సర్కార్ కే సామ్నే, ఔర్ గధే కే పీచే నహీఁ చల్‌నా. అట్ల నడిచినవనుకో రెండు కూడా మూతిపండ్లు రాలి కింద పడేటట్లు ఈడ్చి తంతవి. ఒక్కసారి పోలీస్ నజర్‌ల పడ్తివో ఇక ఈ జన్మల సర్కారీ నౌఖరీలు దొరుకవు. చెప్పేది ఏమన్న తలకాయలకు ఎక్కుతున్నదా? అఖల్‌మంద్ కో ఇషారా కాఫీ అన్నరు పెద్దలు.”
అమ్మ సంగతులన్నీ విన్నట్లుంది. గాలి రాని వంటింట్ల ఉనుకపొయ్యిల కాలుతున్న కట్టెల పొగల వల్ల మండుతున్న కండ్లతో, కండ్లల్ల నీళ్లతో ఇవతలికి వచ్చింది. ముఖమంతా, వళ్లంతా చెమటలు. నుదుట కుంకుమబొట్టు కారిపోయి ఎర్రగ నుదురంత పాకింది. జుట్టంత బుట్టోలె తయారయ్యింది. వచ్చీ రాంగనే “అరే పెద్ద నానీ బాపూ, నేను చెప్పినట్లు వింటివా సరే. లేకపోతే నేను బతుక. ఇంట్లనే బాయి ఉంది. అండ్ల పడి చస్త. లేకపోతే ఈ చీరె కొంగుతోనే ఉరి పెట్టుకోని చస్త. ఎట్లనన్న నాకు బలిమి చావే రాసిపెట్టినట్లుంది. నా ‘పేరార! ఎందుకు కన్నదో మా అమ్మ. నిన్ను పోలీసులు పట్టుకుంటే ఎట్ల? అసలే బక్కోనివి. ఒక్క దెబ్బతో ప్రాణం పోతది” అనుకుంట అమ్మ ఏడుపుతో రాగాలు మొదలు పెట్టింది.
“అయ్యయ్యో నేను ఇట్ల పోయి అట్లొస్త. ఎక్కడికి పోను. ఎక్కడికి తిరగను. నోట్సు తీసుకుని తొందరగనే వస్త” అనుకుంట స్వామి ఇంట్లె నుండి బయటపడ్డడు.
“భద్రం రా బాపూ!” అని వెనుక నుండి హెచ్చరిస్తున్నడు బాపు.
… తరువాత భాగం ఒచ్చే వారం