Feed on
Posts
Comments

6

జనవరి ఇరవై నాలుగున సదాశివపేటల పోలీసులు కాల్పులు జరిపినారు. పద్నాలుగు మందికి దెబ్బలు తగిలినాయి. ఆ కాల్పులలో శంకర్‌ అనే పదిహేడు సంవత్సరాల యువకుడు మరణించినాడు. 1969 ప్రత్యేక తెలంగాణ ఉద్యమంల శంకర్‌ తొలి అమరవీరుడు. శంకర్‌ అంత్యక్రియలలో మూడు వేల మంది విద్యార్థులు పాల్గొన్నరు. మిగిలిన క్షతగాత్రులందరినీ సికింద్రాబాదులోని గాంధీ దవాఖానాకు తరలించినారు. అక్కడ వాళ్లు కొసప్రాణాలతో మృత్యువుతో పోరాటం చేస్తున్నరు. శంకర్‌ సంస్మరణ సభ ఆ రోజు హైద్రాబాద్‌ల ఆర్ట్స్‌ కాలేజీ ముందు మైదానంల జరుగుతున్నది.

స్వామి ఆర్ట్స్‌ కళాశాల భవనం ముందు మహాకాయుడి ముందు మరుగుజ్జులాగ నిలబడినాడు. ఎత్తుగ, గంభీరంగ ఆకాశం అంచుల్ని ముద్దాడుతూ నిలబడిన ఆ భవనాన్ని చూస్తుంటే ఈజిప్టులోని పిరిమిడ్ల ముందు నిలబడ్డట్లో లేదా రోమ్‌లోని చారిత్రక కట్టడాల ముందు నిలబడ్డట్లో ఒక మాయాజనిత భ్రాంతి కలుగుతుంది. ఉస్మానియా విశ్వవిద్యాలయం 1917 ఆగస్టు 28న కింగుకోఠిల ప్రాణం పోసుకుంది. ఉర్దూ భాషలో విద్యను బోధించేటోళ్లు. ఉర్దూ మీడియంల బోధించే విశ్వవిద్యాలయం దేశంలో ఇదే మొదటిది. లాహోర్‌, లక్నోల నుండి ఆచార్యులు వచ్చి ఇక్కడ పనిచేసేటోళ్లు. లక్నవీ ఉర్దూ ముందు దక్కనీ ఉర్దూ చాలా ముతక అని, మోటు అని వారి దురభిప్రాయం. యాస, భాషలలో దక్కనీ ఉర్దూ ప్రత్యేకతను సాధించింది. దీనిని లష్కరీ ఉర్దూ లేదా లష్కరీ అని కూడా వ్యవహరించెటోళ్లు. లష్కర్‌ అనగా సైనికుల దండు అని అర్థం. సికింద్రాబాదు పూర్వనామం లష్కర్‌. పాతతరం వారు సికింద్రాబాదు అనకుండా లష్కర్‌ అనే పిలుస్తరు. ఆంగ్లేయుల పటాలాలు వున్నందున లష్కర్‌ అని పేరు వచ్చింది.

ఈ లష్కరీ ఉర్దూ ఉత్తర భారతదేశం నుండి దక్కన్‌కు వచ్చిన సైనికులు తీసుకువచ్చింది. మొహమ్మద్‌ బిన్‌ తుగ్లక్‌ ఢిల్లీ నుండి ఔరంగాబాద్‌ మీద దండెత్తినప్పుడు, రాజధానిని ఢిల్లీ నుండి దేవగిరికి మార్చినప్పుడు, అల్లావుద్దీన్‌ ఖిల్జీ కాలంల మాలిక్‌ కాఫర్‌ కాకతీయుల రాజ్యం వరంగల్లు మీద దండెత్తినప్పుడు, ఔరంగజేబు ఇటు గోల్కొండ మీద, అటు బీజాపూర్‌, అహమ్మద్‌నగర్‌ల మీద దండెత్తినప్పుడు వేలవేల సైన్యం ఉత్తరభారతం నుండి దక్షిణానికి వలస వచ్చింది. యుద్ధాలు అయిపోయినా, విజయాలు సాధించినా వాళ్లు ఇక్కడే స్థిరపడి స్థానికులతో పాలలో నీళ్ల లెక్క కలిసిపోయినారు. వాళ్లు తెచ్చిన భాషనే ఉర్దూ భాష, లష్కరీ భాష. కాలక్రమంల ఇది ప్రజల భాషగ మారింది. ఉత్తర భారతంలోని ఉర్దూ మీద హిందీ, సంస్కృత భాషల ప్రభావం హెచ్చు. కాని ఈ దక్కనీ ఉర్దూపై ఆ రెండు భాషలు కాక ఫార్సీ, అరబ్బీ భాషల ఆధిక్యత అధికం. దక్కన్‌ల బహమనీ సుల్తాన్‌లు కాని, కుతుబ్‌షాహీలు కానీ ఉత్తర భారతంలోని లాహోర్‌, లక్నో, ఢిల్లీ, ఆగ్రాలతో సంబంధం లేకుండ సక్కగ అరబ్‌, టర్కీ, ఇరాన్‌, ఇరాక్‌, ఆఫ్ఘనిస్తాన్‌ల నుండి సముద్ర మార్గం ద్వారా దక్కన్‌కు వచ్చినారు. పాలకవర్గం మొత్తం అక్కడి నుండి దిగుమతి లేదా వలస వచ్చిందే. కావున దక్కనీ ఉర్దూ ప్రత్యేకతను సాధించడమే కాక సంపద్వంతంగ మారింది. వినూత్న పోకడలతో వింత వింత అందాలను సంతరించుకుంది.

ఉత్తర భారతంల 1857లో సిపాయిల తిరుగుబాటు జరిగిన తర్వాత, మొగల్‌ సామ్రాజ్య వైభవం అంతరించిన తర్వాత అనేక మంది కవులు, కళాకారులు, ఉన్నతోద్యోగులు నైజాం ప్రభువుల ఆస్థానానికి వచ్చి ఇక్కడే వున్నారు. వారంతా దక్కనీ ఉర్దూను కీర్తించినవాళ్లే. ఫైజ్‌ అహమ్మద్‌ ఫైజ్‌, ఫిరాక్‌ గోరక్‌పూరీ, అక్బర్‌ ఇలాహాబాదీ, కైఫే ఆజ్మీ మొదలగు కవులందరూ హైద్రాబాద్‌ల వుండి దక్కనీ ఉర్దూను తలకెత్తుకున్న వాళ్లే. ఉర్దూ భాష ప్రామాణిక విలువల పట్ల ఉస్మానియా విశ్వవిద్యాలయంలోని స్థానిక ఆచార్యులకు, స్థానికేతర ఆచార్యులకు మధ్య వాగ్వివాదాలు కొనసాగుతుండేవి. అయితే ఆ పండిత చర్చలు భాష సుసంపన్నతకు దోహదపడినయే గాని దూషణ భూషణలకు, అవమానాలకు, తిరస్కారాలకు గురి కాలేదు. అదొక ఆరోగ్యకరమైన మిత్రపూరిత సంఘర్షణ. ఈ ధోరణి ఉత్తరోత్తరా ఆంధ్ర – తెలంగాణా యాస, భాషలలో కొనసాగలేదు. ప్రత్యేక తెలంగాణా ఉద్యమం తలెత్తటానికి ఈ ‘యాస-భాషలు’ కూడా ఒక ప్రధాన కారణం. తెలంగాణా ప్రజల యాస-భాషలను అవమానపరిచినారు. అగర్‌ కిసీ ఖౌమ్‌ కో బర్బాద్‌ కర్నాహైతో పహెలే ఉస్‌కీ జబాన్‌ కీంచ్‌లో అన్న నానుడిని తెలంగాణలో నిజం చేసినారు.

ఉస్మానియా విశ్వవిద్యాలయానికి తొలి రోజులల్ల స్వంత భవనం లేనందున ఆనాటి అధికమెట్ట (అడిక్‌మెట్) అడవిలో ఏడవ నిజాం నవాబ్‌ మీర్‌ ఉస్మాన్‌ అలీ ఖాన్‌ 1934 జూన్‌ 5న విశ్వవిద్యాలయాల భవనానికి శంకుస్థాపన చేసినారు. నిర్మించబోయే భవనసముదాయ నిర్మాణశైలిని, వాస్తును పరిశీలించి అధ్యయనం చేయటం కోసం ఆనాటి సుప్రసిద్ధ వాస్తు శిల్పులు – ఇంజినీర్లయిన నవాబ్‌ జైన్‌ యార్‌ జంగును, అలీ రాజాలను ఇంగ్లాండు, ఫ్రాన్స్‌, ఇటలీ, టర్కీ, జపాన్‌, అమెరికా దేశాల పర్యటనకు పంపినాడు. వాళ్లు ఆ దేశాలలోని విశ్వవిద్యాలయాల నిర్మాణశైలిని, వాస్తును పరిశీలించినారు. సుప్రసిద్ధ బెల్జియన్‌ వాస్తుశిల్పి మోనియర్‌ జస్వర్‌ను ఈజిప్టుల కలిసినారు. అతను ఈజిప్టు విశ్వవిద్యాలయం కోసం రూపొందిస్తున్న నమూనాను చూసి ఆశ్చర్య చకితులయినారు. వాళ్లు హైద్రాబాద్‌కు తిరిగి రాంగనే జస్వర్‌ పేరును నైజాం నవాబుకు సూచించినారు. జస్వర్‌ను నిజాం హైద్రాబాద్‌కు రప్పించి నూతన విశ్వవిద్యాలయ భవనాన్ని నిర్మించాలని వేడుకొన్నడు. జస్వర్‌ అజంతా, ఎల్లోరా, గోల్కొండ, చార్మినార్‌ మొదలగు కట్టడాలను, నిర్మాణాలను పరిశీలించి, భారతీయ వాస్తు వైభవాన్ని గమనించి, ఈజిప్షియన్‌ నిర్మాణశైలిని జోడించి, ఆర్ట్స్‌ కళాశాల భవనాన్ని నిర్మించినాడు. 1934 జులైలో ప్రారంభమైన ఈ భవనం 1939 డిసెంబర్‌లో పూర్తయ్యింది.

గత చరిత్ర పుటలల్ల చక్కర్లు కొడుతున్న స్వామి ఇహలోకంలకు జారి పడినాడు.

ఆర్ట్స్‌ కళాశాల ముందు వందలాది మంది విద్యార్థులు జమైనారు. కిందటి రోజు సదాశివపేటల చనిపోయిన అమరవీరుడు శంకర్‌ సంతాపసభ జరుగుతుంది. ‘అమరవీరుడు శంకర్‌కు జోహార్లు’, ‘శంకర్‌ అమర్‌ హై’ నినాదాలు నింగిని తాకుతున్నాయి. అమర వీరుల ఆశయాలు సాధిస్తాం! సాధిస్తాం!! అని ప్రతినలు పూనుతున్నారు. ‘లాఠీ గోలీ ఖాయింగే, తెలంగాణా లేయింగే’ అని మరికొంత మంది అంటున్నరు. స్వామికి తను చదివిన చరిత్ర, తనకు తెలిసిన చరిత్ర జ్ఞాపకం వస్తుంది. జ్ఞాపకాల వెల్లువల మళ్లీ మునిగి తేలుతున్నడు.

ఉస్మానియా విశ్వవిద్యాలయం ప్రారంభం నుండే పోరాటాల పురిటిబిడ్డ. 1938లో ఇక్కడ ‘వందేమాతరం’ పోరాటాన్ని విద్యార్థులు చేపట్టినారు. అప్పటికే యూనివర్శిటీ క్యాంపస్‌ల మూడు హాస్టల్స్‌ ఉండేవి. ప్రతి హాస్టలుకు ఒక మసీదు, ఒక మందిరం ఉండేది. సెప్టెంబర్‌ల ముస్లింలీగు అధ్యక్షుడు మహమ్మద్‌ అలీ జిన్నా క్యాంపస్‌లో ఉపన్యాసం ఇచ్చి పోయిన తర్వాత ముస్లిం విద్యార్థులలో మతాభిమానం హెచ్చింది. హిందూ విద్యార్థులు వందేమాతరం గీతాన్ని పాడుతూ తమ నమాజులను భగ్నం చేస్తున్నారని కొంతమంది ముస్లిం విద్యార్థులు వార్డెన్‌కు ఫిర్యాదు చేయగా ఆయన ఆ వందేమాతరం గీతాన్ని పాడటం నిషేధించినాడు. హిందూ విద్యార్థులు ఈ నిషేధాన్ని ఎత్తివేయాలని వైస్‌ చాన్స్‌లర్‌కు విజ్ఞప్తులు చేసుకున్నరు. కాని ఫలితం కనబడలేదు. పైగా ఆయన కొంత మంది హిందూ విద్యార్థులను సస్పెండ్‌ చేసినాడు. దానికి నిరసనగా విద్యార్థులు సమ్మె చేసేసరికి హాస్టల్స్‌ను మూసేసి విద్యార్థులను బలవంతంగా రాత్రికి రాత్రే ఖాళీ చేయించినారు. విద్యార్థుల సమ్మె నగరమంతటా పాకింది. వందేమాతరం గీతం నగరం అంత మార్మోగింది.

“ప్రాణమైనా పోనీ గాని పాట మాత్రం మానుకోం” అని విద్యార్థులు విజృంభించినారు. వందేమాతరం గీతం దశదిశలా వ్యాపించింది. ఆ రోజులలో విశ్వవిద్యాలయం విద్యార్థులకు నీలిషేర్వానీ, పైజామా యూనిఫారంగ ధరించాలని ఒక నియమం ఉండేది. ఈ వందేమాతరం ఉద్యమం సందర్భంగ వారు ఆ ముస్లిం సంస్కృతిని ప్రదర్శించే షేర్వానీ, పైజామాలను ధరించబోమని, హిందూ సంస్కృతికి సంబంధించిన తెల్లటి లాల్చీ, పంచెలను ధరిస్తామని డిమాండు చేసినారు. వారి డిమాండును వైస్‌ చాన్స్‌లర్‌ తిరస్కరిస్తూ పాలకుల సంస్కృతి ఆచారవ్యవహారాలనే పాలితులు పాటించాలని ఆదేశించినాడు. ఇష్టం లేనివారు కళాశాలను విడిచి వెళ్లాలని సూచించినాడు. విశ్వవిద్యాలయంలో అరబిక్‌, ఉర్దూ, పర్షియన్‌ భాషలకు ప్రత్యేక శాఖలున్నట్లే తెలుగు, మరాఠీ, కన్నడ, సంస్కృత భాషలకు కూడా ప్రత్యేక శాఖలు ఉండాలని విద్యార్థులు డిమాండ్‌ చేసినారు. ఆ డిమాండ్లను కూడా వైస్‌ చాన్స్‌లర్‌ బేఖాతరు చేసినారు.

ఈ వందేమాతరం ఉద్యమం 1938 నవంబరు, డిసెంబరు నెలల్ల జరిగింది. తొందరగనే తెలంగాణ అంతట వ్యాపించింది. ఈ సమ్మె సందర్భంల ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి 350 మందిని, సిటీ కాలేజీ నుండి 7గురిని, మహబూబ్‌నగర్‌ హైస్కూలు నుండి 120 మందిని బహిష్కరించినారు. రాష్ట్రం వెలుపల వున్న ఇతర విశ్వవిద్యాలయాలు కూడా వీరిని చేర్చుకోరాదని ఆజ్ఞలు జారీ చేసినారు. నిజాం ఇచ్చే గ్రాంటుకు ఆశపడి వైజాగు ఆంధ్రా యూనివర్శిటీ హైద్రాబాద్‌ విద్యార్థులకు అడ్మిషన్లు నిరాకరించింది. చివరికి నాగుపూర్‌ విశ్వవిద్యాలయం నిజాంను ధిక్కరించి కొంత మంది విద్యార్థులకు ప్రవేశానుమతి ఇచ్చింది. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి బహిష్కరణకు గురైన వాళ్లల్ల పి.వి. నర్సింహారావు, హయగ్రీవాచారి, ఆరుట్ల రామచంద్రారెడ్డి, దేవులపల్లి వెంకటేశ్వరరావు మొదలగు వారున్నారు. ఆ వందేమాతరం ఉద్యమాన్ని ప్రోత్సహిస్తూ పండిత్‌ జవహర్‌లాల్‌ నెహ్రూ, సుభాష్‌ చంద్రబోస్‌, వి.డి. సావర్కార్‌ మొదలగువారు విద్యార్థులకు లేఖలు రాసినారు. మహాత్మాగాంధీ కూడా విద్యార్థులకు సందేశాన్ని పంపినాడు.

ఈ ఉద్యమం జరుగుతున్నప్పుడు రామచంద్రారావు యూనివర్శిటీ విద్యార్థి. హాస్టల్‌లో వుండి చదువుకునేటోడు. అతనిపై ఆర్యసమాజం, స్వామీ రామానంద తీర్థ, పండిత్‌ నరేంద్రజీల ప్రభావంతో పాటు జాతీయోద్యమ ప్రభావం కూడా అధికంగ ఉండేది. సమ్మె సందర్భంగ అతను ‘వందేమాతరం’ నినాదం ఇచ్చినందుకు నైజాం పోలీసులు అతడిని బెత్తాలతో కొట్టసాగినారు. ప్రతి దెబ్బకూ అతను వందేమాతరం అని నినదిస్తూనే వున్నాడు. పోలీసులు కొడుతనే వున్నరు. నలభై సార్లు వందేమాతరం అని నినదించి నలబై లాఠీ దెబ్బలు తిని స్పృహ తప్పి కింద పడిపోయినాడు. అప్పట్నుంచే అతడిని వందేమాతరం రామచంద్రరావు అని పిలువసాగినారు. ఆ వందేమాతరం అతని ఇంటిపేరైపోయింది. తర్వాత కాలంల అతను ప్రముఖ ఆర్యసమాజిస్టుగ, రాజకీయ నాయకుడిగ రాణించినాడు.

1938ల జరిగిన వందేమాతరం ఉద్యమానికి నేపథ్యంగ ఆర్యసమాజం, స్టేట్‌ కాంగ్రెస్‌ ఉద్యమాలు మాత్రమే గాక కమ్యూనిస్టు ఉద్యమం కూడ దోహదపడింది. అప్పటికే మగ్దూం మొహియుద్దీన్‌ సిటీ కాలేజీల తను పని చేస్తున్న ఇంగ్లీష్‌ లెక్చరర్‌ ఉద్యోగాన్ని వదిలివేసి కమ్యూనిస్టు పార్టీ పూర్తి కాలం కార్యకర్తగ పని చేస్తున్నాడు. అప్పటికే అతను ప్రముఖ కవి, రచయిత. ఆ రోజులల్ల కామ్రేడ్సు అసోసియేషన్‌ విద్యార్థులల్ల రహస్యంగ పని చేస్తుండేది. ఉస్మానియా విశ్వవిద్యాలయం విద్యార్థులైన ఆలంఖుంద్‌ మీరీ, జవ్వాద్‌ రజ్వీ, దేవులపల్లి వెంకటేశ్వరరావు, సిహెచ్‌ రాజేశ్వర రావు, రావి నారాయణరెడ్డి, సర్వదేవభట్ల రామనాథం మొదలగువారే గాక వైద్య విద్యార్థి అయిన రాజ్‌బహద్దూర్‌ గౌర్‌ కూడా అందులో చురుకైన కార్యకర్తలు. వందేమాతరం ఉద్యమం ముగియగానే వీరు ఆల్‌ హైద్రాబాద్‌ స్టూడెంట్స్‌ యూనియన్‌ను ఏర్పరిచారు. ఇది కమ్యూనిస్టు పార్టీకి అనుబంధ సంస్థగా పని చేసింది.

“శంకర్‌ అమర్‌ హై” నినాదాలతో స్వామి ఈ లోకంలకు వచ్చినాడు. ఆర్ట్స్‌ కళాశాల ఆవరణమంతా ఇసుక వేస్తే కిందికి రాలనంతగ విద్యార్థులతో నిండి ఉంది. ఎవరెవరో ఉపన్యాసాలిస్తున్నరు. ఇంతల ఒక తెల్లటి అంబాసిడర్‌ కారు పెద్దగ చప్పుడు చేసుకుంట ఆ సమావేశస్థలికి చేరుకుంది. అండ్ల నుండి తెల్లకోట్లు, మెడల స్టెతస్కోపులు వేసుకున్న మెడికోలు కిందికి దిగి దబ్బదబ్బ స్టేజీ వైపు పరిగెత్తుకొచ్చినారు. వారి ముఖాలల్ల ఆందోళన. వారిలో ఒకతను మైకు ముందు నిల్చుని హడావిడిగ ఒక ప్రకటన చేసినాడు. అందరూ నిశ్శబ్దంగ ఆ ప్రకటనని విన్నారు. “నిన్న సదాశివపేటల గాయపడినవారు సికింద్రాబాదులోని గాంధీ దవాఖానాల చావుబతుకుల మధ్య కొట్టుకుంటున్నరు. ఆపరేషన్లు చేస్తే వారికి ఎక్కించడానికి ఆసుపత్రిలో రక్తం లేదు. ఏ మాత్రం ఆలస్యం చేసినా వారి ప్రాణాలు గాలిలో కలిసిపోతయి. కొంతమంది మెడికోలు రక్తమిచ్చినా వారి బ్లడ్‌ గ్రూపులు పేషంట్లకు సరిపోతలేవు. ఉత్తుత్త ఉపన్యాసాలు కాదు. రక్తాన్ని ధారపోసి తెలంగాణాను సాధించాలనుకునే వారు రక్తదానానికి కూడా సిద్ధం కావాల”ని ఆ డాక్టరు ఆవేశంగా ఉపన్యసించినాడు. అతని పేరు డాక్టర్‌ గోపాల్‌కిషన్‌.

ఆ ఉపన్యాసం విన్న విద్యార్థులందరికీ ‘సిగ’ మొచ్చినట్లయింది. ఆవేశంతో, బాధతో, దయతో వారి శరీరాలు వణికిపోయినై. ఉప్పొంగిపోయినై. ‘ఖూన్‌ కా బద్‌లా ఖూన్‌సే లేంగే’ అని నినాదాలిచ్చే ఆ యువతరం రక్తదానం కోసం నడుం కట్టింది. సికింద్రాబాద్‌ గాంధీ దవాఖాన అక్కడ్నుంచి చాలా దూరమే వుంటది. ఆ అంబాసిడర్‌ కార్‌ వచ్చిన వారికే సరిపోతది. ఉద్యమం వల్ల క్యాంపస్‌ల బస్సులు భీ తిరగటం లేదు. అప్పటికింక రోడ్ల మీద ఆటోలు రాలేదు. రిక్షాలే గతి. ఐతే రిక్షాలు క్యాంపస్‌ల తిరగవు. విద్యార్థులకు స్కూటర్లు, మోటారు సైకిళ్లు, కార్ల లాంటివి లేవు. చాలా మంది సైకిళ్లపైన్నే తిరిగెటోళ్లు. ఉద్యమ సందర్భంగ విద్యార్థులెవరూ సైకిళ్లను తీసుకొస్తలేరు. ఊరేగింపులల్ల పాల్గొనేటందుకు అవి ఆటంకమని, పోలీసులు లాఠీచార్జీ చేస్తే సులభంగ ఉరకలేమని సైకిళ్లను తీసుకొస్తలేరు.

ఎట్ల ఎట్ల. అవుతల టైం అయిపోతుంది. ఆపరేషన్‌ టేబుళ్ల మీద గోలి దెబ్బలు తిని రెక్కలు విరిగిన పక్షులోలె ఎగశ్వాస దిగశ్వాసలతో తండ్లాడుతున్న తెలంగాణా తమ్ముండ్లు, చెల్లెండ్లు కండ్లల్ల కదులుతున్నరు, మెదులుతున్నరు. తమను బతికించే వాళ్లే లేరా అని మూగచూపులతో, ఎదురుచూపులతో ఆఖరి శ్వాసలతో అడుగుతున్నట్లనిపిస్తుంది. ఏం చేయాల్నో అర్థం కాక అందరూ తలలు పట్టుకున్నరు. చేతులు పిసుక్కుంటున్నరు. కాళ్లు తొక్కుకుంటున్నరు. తసబిస అవుతున్నరు. ఇంతల మైకుల ఎవరో “జయంబు నిశ్చయంబురా” అనే రికార్డు వేసినారు. తలకాయలల్ల చకచకా మెరుపులు మెరిసినయ్‌. “గ్యారా నంబర్‌ బస్‌ జిందాబాద్‌” అని ఎవరో గట్టిగ అరిచినారు. గ్యారా నంబర్‌ బస్‌ పక్‌డో ఔర్‌ భాగో. భాగో” అని మరెవరో వంత పాట పాడినారు. అంతే ‘ది గ్రేట్‌ మారథాన్‌ మొదలయ్యింది. హ్యుమన్‌ రేస్‌ ఫర్‌ హ్యుమన్‌ బీయింగ్సు షురువయ్యింది. మానవత్వం కోసం పరుగు. తెలంగాణా కోసం పరుగు. వందలాది మంది విద్యార్థులు పరిగెత్తటం ప్రారంభించినారు. ఒకర్ని చూసి మరొకరు. ఆ మరొకర్ని చూసి వేరొకరు. అందర్ని చూసి అందరు. అది పరుగుల పందెం కాదు. ప్రాణాలు బలిపెట్టి పోరాడే సోదరుల ప్రాణాలను రక్షించడం కోసం పరుగులు ప్రారంభమయినై. ఆ పరుగుల కోసం ఎవరూ జండాలు ఊపలేదు. వేరెవరూ సీటీలు కొట్టలేదు. వారి లక్ష్యం – గమ్యం తెలంగాణ. తెలంగాణా వారి చోదకశక్తి. “ఛాత్రశక్తి – దేశభక్తి”. తల్లి తెలంగాణా చావు బతుకులల్ల తండ్లాడుతుంది. దాన్ని ఎట్లనన్న బతికించుకోవాలె. ఎట్లనన్న కాపాడుకోవాలె. ‘సిరిమల్లె చెట్టు కింద లచ్చుమమ్మో లచ్చుమమ్మా, నువ్వు సిన్నాబోయి కూసున్నవ్‌ లచ్చుమమ్మో లచ్చుమమ్మా’ దమ్‌ నిక్‌లే ఇస్‌ దేశ్‌ కీ ఖాతిర్‌ బస్‌ ఇత్నా అర్మాన్‌ హై. ప్రాణాలు బలిపెట్టి పోరాడు సోదరులు – తెలంగాణా సోదరులు. చలో చలో చల్తే చలో ఏ వక్త్‌ కీ ఆవాజ్‌ హై చల్తె చలో. కర్బలా మైదానంల అసువులు బాసిన ఆశన్న ఊశన్నల ఆత్మశక్తులన్నీ వాళ్లల్ల ప్రవేశించినయ్‌. వారిని మొహర్రం పండగనాటి పీర్ల లాగా ఉరికిస్తున్నయ్‌. ఊగిస్తున్నయ్‌. ఊపేస్తున్నయ్‌. పాల్కూర్కి సోమన కాలం నాడు పేరిణీ శివతాండవం చేస్తున్న శివశక్తులు వాళ్లు. రుద్రవీణలు వాళ్లు. జటాఝూటధారి, గరళకంఠుడు శివుని డమరుకం వాళ్లు. చురకత్తులతో, పదునైన శూలాలతో, చెర్నాకోలాలతో ఒళ్లంతా రక్తాలు కారేలాగ గాయాలు చేసుకుంట వాటిపై పసుపు కుంకుమల బండారు పొడులు అద్దుకుంట ‘హరోం హరోం హర – హరహర హరహర’ అని హాహాకారాలు చేసే మైలారు దేవుండ్లు వాళ్లు. మైలారుభటులు వాళ్లు. యాదగిరిగుట్ట మీది ఉగ్రనరసింహులు వాళ్లు. కాకతీయులతో యుద్ధం చేస్తూ జంపన్నవాగుల మాయమైన పగిడిగిద్ద రాజు వారసులు వాళ్లు. ధర్మ యుద్ధంల పరాజయం పాలై చిలుకలగుట్ట మీదికి మాయమైన సమ్మక్క సారక్కల సంతానం వాళ్లు. గోల్కొండ ఖిల్లా మీద దాడి చేసి ఏడు గడియలు రాజ్యమేలిన సర్వాయి పాపడి ముద్దుబిడ్డలు వాళ్లు. ఇప్పపువ్వుల నిప్పురవ్వలను రగిలించిన కొమురం భీంకు చిన్న తమ్ముండ్లు వాళ్లు. విరామమెరగక ఒంటరి పోరాటం చేసిన బందగీ ఆత్మశక్తికి ఆనవాళ్లు వాళ్లు. పురాతన తెలంగాణా ఆత్మశక్తులన్నీ ఆ క్షణాలల్ల వాళ్లను ఆవాహన చేసినయ్‌. వాళ్లల్ల పరకాయ ప్రవేశం చేసినయ్‌. ప్రతి ఒకడూ ఒక జ్వలించే కాగడా. మండుతున్న మషాల్‌. ముందుకు ముందుకు మున్ముందుకు. మేం ముందుకు పోతాం ప్రపంచం మా వెంట వస్తుంది. జుకానే వాలా హైతో సారీ దునియా భీ జుక్‌తీ హై అంటూ ఆత్మవిశ్వాసంతో ముందుకు పరిగెత్తుతున్న యువతరం. యువతరం శిరమెత్తితే నవతరం గళమెత్తితే ఈ లోకమే మారిపోదా? ఈ చీకటే మాసిపోదా? చెమటలు కారుతూ ఎగపోస్తూ పరిగెత్తే ఆ విద్యార్థి లోకాన్ని చూసి ప్రజలంత విస్తుపోతున్నరు. దారి తొలిగి వారికి దారి ఇస్తున్నరు. కనపడని దేవతలు వారిని దీవిస్తున్నరు. వారిపై పువ్వుల వర్షం కురిపిస్తున్నరు. ఉక్కపోతలకు, చెమటలకు తడిసి ముద్దవుతున్నందున అంగీలనువిప్పి విసిరేసి బనీన్ల మీదనే పరుగు పెడుతున్నరు. పాంటు పాదాలకు అడ్డం పడుతున్నందున వాటిని మోకాళ్ల వరకు మడిచి మరికొందరు దౌడు తీస్తున్నరు. పరుల ప్రాణాలను కాపాడాలన్న వారి చైతన్యమే వారి చోదకశక్తి. వారిని చూస్తున్న ప్రజలు జేజేలు కొడుతున్నరు. జై తెలంగాణా జైజై తెలంగాణా అంటున్నరు. ప్రతి చౌరస్తాల ట్రాఫిక్‌ ఆగిపోయింది. ఆశయం కోసం పరిగెత్తే వారి మార్గం సుగమం అవుతుంది. కంటికి దూరమైతే కాలికి దూరమా పరిగెత్తు భాయీ పరిగెత్తు. గాలి ఆగిపోయింది. కాలం కదలకుండా స్తంభించిపోయింది. కాలం కత్తుల వంతెన మీద తెలంగాణా కోసం పరిగెత్తుతున్నవాళ్లు. అదిగదిగో గాంధీ…. గాంధీ… గాంధీ దవాఖానా. విద్యార్థుల ఊరేగింపు. ఉత్సవం ఊరేగింపు. ఉత్సవ సంరంభం వస్తుందని తెల్సిన డాక్టర్‌ సాబ్‌లందరూ దవాఖాన్ల నుండి ఇవతలికి వచ్చి గేట్ల దగ్గరే నిలబడి ఎదుర్కోళ్లు పలుకుతున్నరు. డాక్టర్‌ గోపాల్‌ కిషన్‌ వారిల ముందున్నడు. ప్రజా ఉద్యమాలు మట్టి మనుషుల్ని మహా మనుషులుగ తయారు చేస్తయి. రోగి మీది కంటే రూపాయి మీద ప్రేమ వున్న డాక్టర్లు కాదు వాళ్లు.. డాక్టర్లు తయ్యార్‌. విద్యార్థులు తయ్యార్‌. స్ట్రెచర్లు తయ్యార్‌. బెడ్లు తయ్యార్‌. తెలతెల్లటి గాజు సీసాలల్ల టపటప రాలుతున్న రక్తం సినుకులు వాడివేడి రక్తం సినుకులు. “సినుకు సినుకుల వాన ఉయ్యాలో, సిత్తారి వానల్ల ఉయ్యాలో”. తెలంగాణా బిడ్డల ఎర్రెర్రని రక్తపు బిందువులు. బిందువు బిందువు సింధువగును. రేపటి సింధువు తెలంగాణా. తల్లి తెలంగాణా నొసట సింధూరం తెలంగాణా.

తెల్లారి దినపత్రికలన్నీ పతాక శీర్షికలతో విద్యార్థులను అభినందించినై. మానవత్వం పూల పరిమళంలాగ వెల్లివిరిసిందని ప్రశంసించినై, శ్లాఘించినై.

తెలంగాణల ఉన్న నాన్‌ ముల్కీ ఉద్యోగులను వెనుకకు ఆంధ్రా ప్రాంతానికి పంపాలన్న ప్రభుత్వ జీ.వో.పై హైకోర్టుల రిట్‌ దాఖలయ్యి వాదప్రతివాదనలు మొదలయినై. తెలంగాణా అంతటా నిరాహారదీక్షలు, సమ్మెలు కొనసాగుతున్నై. జమ్మికుంటల ఆంధ్రా ఉద్యోగులను విద్యార్థులు ఘెరావ్‌ చేసినారు. ఉద్యమానికి మద్దతు తెలుపని తెలంగాణా మంత్రులందరికీ గాజులను బహుమతిగా పంపినారు. మార్చి నెలల హైద్రాబాద్‌ల తెలంగాణా సదస్సు ఏర్పాటు చేయాలని విద్యార్థి కార్యాచరణ సమితి నిర్ణయించింది. దాన్ని జయప్రదం చేయటానికి విద్యార్థి నాయకులంతా తెలంగాణా జిల్లాల్ల విస్తృత పర్యటనలకు బయలుదేరినారు.

ఆంధ్రోళ్లు భయంతో గజగజా వణికిపోతున్నరు. కుటుంబాలను, పిల్లలను తట్టాబుట్టా తపేలాలతో సహా ఆంధ్రాకు పంపించివేసినారు. తాము మాత్రం బిక్కుబిక్కుమంటూ ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని దినదినగండంగ బతుకుతున్నరు. ఆఫీసులల్ల పనిచేసెటోళ్లకు తెలంగాణా ఉద్యోగులచే అవమానాలు, దూషణలు తప్పలేదు. ప్రభుత్వం విడుదల చేసిన జీ.వో.కు వ్యతిరేకంగ ఆంధ్రా ప్రాంతంల కౌంటర్‌ ఉద్యమం బయలుదేరింది. నందిగామ ప్రజలు గుంపులు గుంపులుగ లారీలల్ల బయలుదేరి రాళ్లురప్పలు, కట్టెలతో కోదాడ ప్రజల మీదికి దాడి చేసినారు. ఆ రెండు గ్రామాల ప్రజలు ముఖాముఖి యుద్ధం చేసుకున్నరు. రైళ్లలో ప్రయాణం చేసే ఇటు ఆంధ్రా ప్రయాణికులపై, అటు తెలంగాణా ప్రయాణికులపై దాడులు జరిగినై. వారిని రైళ్ల నుండి దింపి అవమానాలకు గురి చేసినారు. తెలంగాణా ప్రజలు తీర్థయాత్రల కోసం తిరుపతి, అన్నవరం, సింహాచలం పోవుడు మానుకున్నరు. ఆంధ్రోళ్లు యాదగిరిగుట్టకు, వేములవాడకు, బాసరకు వచ్చుడు బందు అయ్యింది. దేవుండ్లకు కూడా ప్రత్యేక రాష్ట్రం బెడద తప్పలేదు. వీళ్లు కూడ రెండుగ చీలిపోయినారు.

రాజధానిని హైద్రాబాద్‌ నుండి ఆంధ్రాకు మార్చాలని కొత్త డిమాండ్‌ ఆంధ్రోళ్లు లేవనెత్తినారు. హైద్రాబాద్‌ హైద్రాబాదీయులదేనని ఈ నగరం అభివృద్ధికి ఆంధ్రా సర్కారు ఏమీ చేయలేదని పైగా నష్టం చేసిందని మేధావులు సరికొత్త వాదనలు చేసినారు. ఆందోళన శృతి మించి నాగార్జునసాగర్‌, విజయపురిలలో కాల్పులు జరిగి ఒక విద్యార్థి మృతి చెందగ మరొకరు గాయపడినారు. అక్కడ కూడ సరిహద్దు ప్రాంతాల ప్రజలు పరస్పరం దాడులు చేసుకున్నరు.

పాలుపొంగు మన తెలుగుగడ్డను పగులగొట్టవద్దు అని సి. నారాయణరెడ్డి ఒక సీన్మా కోసం పాట రాస్తే “నా తెలంగాణ కోటి రత్నాల వీణ. తీగలను తెంపినారు అగ్నిలో దింపినారు” అని మరికొంత మంది దాశరథిని కోట్‌ చేసినారు. అది వర్తమానానికి కూడా ప్రతీక అన్నారు. ప్రజాకవి, ప్రజల మనిషి కాళోజీ నారాయణరావు ప్రత్యేక తెలంగాణా ఉద్యమంల అగ్రభాగాన నిలిచినారు.

“దోపిడి చేసే ప్రాంతేతరులను
దూరం దాకా తన్ని తరుముతాం
ప్రాంతం వాడే దోపిడి చేస్తే
ప్రాణంతోనే పాతర వేస్తాం”

అని ఆయన అన్నరు. కాళోజీ ఆధ్వర్యంల వరంగల్లుల తెలంగాణా విమోచనోద్యమ సమితి సదస్సు జరిగింది. ఆ సదస్సు ముఖ్యమంత్రి రాజీనామా చేయాలని, రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని తీర్మానాలు చేసింది. మరునాడు వరంగల్‌, నిజామాబాద్‌లల్ల పెద్ద ఎత్తున అల్లర్లు జరిగినై. వరంగల్లుల ఆంధ్రా ప్రాంతంవారి దుకాణాలను, మిల్లులను ప్రజలు అగ్నికి ఆహుతిచ్చినారు. గ్రామాలల్ల వారి క్యాంపులపై దాడులు జరిగినై. 1956 విలీనానికి ముందే ఎక్కువగా వలసలు జరిగిన జిల్లాలు ఇవే.

వరంగల్‌, హన్మకొండ పట్నాలల్ల మంటలను ఆర్భటానికి ఫైర్‌ ఇంజన్లు వచ్చినై. కాని తాగునీటికే కొరత వున్న, ఆ పట్నాలల్ల మంటలను ఆర్పటానికి నీళ్లు దొరుకక ఆ ఫైరింజన్లు వాపసు పోయినై. తెలంగాణా ఆంధ్రా అంతటా అల్లర్లు వ్యాపించినై. అన్ని ప్రాంతాలకు సైన్యాన్ని పంపించి ఫ్లాగు మార్చ్‌లను చేయించినారు. ప్రజల గుండెలల్ల గుబులు రేపాలని సైన్యం ఆలోచన. జనవరి ముప్పైన గజ్వెల్‌లో కాల్పులు జరిగి నర్సింహులు అనే ఏడవ తరగతి విద్యార్థి అమరుడైనాడు. పసిపిల్లల లేతరక్తం వీధులల్ల పారింది. తెలంగాణా ప్రజలు తమ రక్తాన్ని సాకబోయటం మొదలయ్యింది. ఫిబ్రవరి 18న సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వ జీ.వో. అమలును నిలుపు చేస్తూ స్టే జారీ చేసింది. దాని మీద తెలంగాణా ఉద్యోగులు తీవ్రంగ నిరసన వ్యక్తం చేసినారు. అటు ఆంధ్రా ప్రాంతంల అసలు ముల్కీ నిబంధనలనే పూర్తిగా ఎత్తివేయాలని విద్యార్థులు సమ్మె చేసినారు. ఫిబ్రవరి 25న తాండూరుల పోలీసు కాల్పులు జరిగినై.

ఉద్యమాన్ని ఉధృతం చేయటానికి ఫిబ్రవరి 28న తెలంగాణా ప్రజాసమితిని ఏర్పాటు చేసినారు. విద్యార్థులు, యువకులు, మేధావులే ఇందుల సభ్యులు. తొలిదశల ఈ సంస్థల రాజకీయ నాయకులు ఎవరూ లేరు. దానికి అధ్యక్షులుగ మదన్‌మోహన్‌ నియమితులైనారు. సిద్ధిపేటల ఆయన ఒక యువ లాయర్‌. మార్చి 3న తెలంగాణా బంద్‌ సంపూర్ణంగ అమలు జరిగింది. బంద్‌ సందర్భంగ బొల్లారం రైల్వే స్టేషన్‌ మీద దాడి చేసినారు. ఆ సంఘటనతో తెలంగాణా మంత్రులల్ల, శాసనసభ్యులల్ల కదలిక వచ్చింది. మార్చి 15 లోగా తెలంగాణా రక్షణలు అమలు చేయకపోతే అసెంబ్లీల సహాయ నిరాకరణ చేస్తామని 52 మంది తెలంగాణా శాసనసభ్యులు ప్రభుత్వాన్ని హెచ్చరించినారు.

… తరువాత భాగం ఒచ్చే వారం

4 Responses to “సలాం హైద్రాబాద్ : ఆరో భాగం”

  1. 1
    Gladstone Says:

    Please add Google Translate. It will be easy for non telugu people to read this.

  2. 2
    suman Says:

    జై తెలంగాణా! జై జై తెలంగాణా!
    తెలంగాణా అమర వీరులకు జొహర్ జొహర్..
    ప్రస్తుత తెలంగాణా ప్రాంతమునందు, ఖమ్మం, మహబూబ్ నగర్, నల్గొండ, రంగారెడ్డి, వరంగల్, కరీంనగర్, నిజామాబాదు, అదిలాబాదు, మెదక్ , హైదరాబాదు అను జిల్లాలు కలవు.
    తెలంగాణా ప్రజలకు తెలియజెయనదీ ఎమనగా ఇది మన భవిష్యతు మన పిల్లల భవిష్యతు
    ఎందుకంటే తెలంగాణాకు చెందినా ఉద్యోగులలొ కోస్తాంధ్ర వారు ఎక్కువగా వున్నారు. హైదరాబాద్ ను ఫ్రీ జోన్ చేయాలనీ కోస్తాంధ్ర రాజకీయ నాయకులూ కుట్ర పన్నుతున్నారు.హైదరాబాద్ ను ఫ్రీ జోన్ చేయకూడదని తెలంగాణా ప్రజలకు తెలియజేయుచున్నాను.ఇలా ఊరుకుంటే కోస్తాంధ్ర రాజకీయ నాయకులూ రేపు అమెరికా లో వున్నా న్యూ జెర్సీ నీ కూడా ఫ్రీ జోన్ చేయాలనీ అంటారు .

  3. 3
    NAVEEN Says:

    VEERU THARU VATHA DELHI NE FREE ZONE AMERECAN NU FREEZONE SINGAPUR NE FREEZONE ANTARU TAMIL NADU VARENE DOCHU KUNNARU EPPUDU TELANGNANA VARENE THARU VATHA ENKA EA RASTRAM VARENE DOCHU KUNTARO JAGRATHA SUMA ALL INDIA STATES ANDRA VARU VASTHUNRU JAGRATHA
    DELHI LO KUDA VOTLA KOSAM PRACHARAM EE ANDRA PEOPLES

  4. 4
    prasad bangaru Says:

    జై తెలంగాణ ! ప్రతి ఒక్కరు తెలంగాణ చరిత్ర తెలుకూకొవలి!

Leave a Reply

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

Managed by Discover Telangana Inc., a registered nonprofit organization in USA.

All opinions and views expressed by third party content providers and shown here as preview are not that of Discover Telangana.

If you find any Content that is infringing, libelous, defamatory, obscene, abusive, offensive or otherwise violation of copyright law, alert us by emailing us at discover.telangana(at)gmail.com