సలాం హైద్రాబాద్ : ఏడో భాగం
డిసంబర్ 14th, 2009 by డిస్కవర్ తెలంగాణ
7
ఆ రోజు పొద్దుపొద్దున్నే స్వామి ఇంకా నిద్ర లేవకముందే గోపి సైకిలేసుకుని, చెమటలు కారంగ, దమ్ములు పోసుకుంట శాలీబండాకు వచ్చినాడు. శాలీబండా చడావ్ మీద సైకిల్ తొక్కడమంటే మజాక్ కాదు. కాళ్ల పిక్కలల్ల మస్తుగ బలం ఉండాలె. శరీరానికి తాఖత్ గావాలె. కలేజాల ఖువ్వత్ ఉండాలె. అమ్మ వాడిని దివాన్‌ఖానాల ఉన్న ఆరామ్ కుర్చీల కూచుండబెట్టి కాశీ నుండి తెచ్చిన రాగిచెంబుల చల్లటి మంచి నీళ్లు, గుండ్రటి తెల్లటి కోపుల పొగలు గక్కే గరం గరం ఛా ఇచ్చింది. దివాన్ఖానా పక్కనే బాయి ఉంది. ఇనుప బొక్కెన చప్పుడు, దాని గొలుసు, గిరిక చేసే వింత వింత చప్పుళ్లతో గమ్మత్తు సంగీతాన్ని వింటూ వాడు ఛాను ఊదుకుంటూ, చప్పరిస్తూ గుటకలు మింగుతూ ఆనందిస్తున్నడు. బాయి గిరికకు నూనె పోయనట్టుంది. అది కీసుకీసుమని శబ్దం చేస్తుంది.
గోపిగాడి మరో హాబీ సైకిల్ రిపేరింగు. తీరిక సమయాలల్ల ఏమీ తోచనప్పుడు సైకిల్లోని అన్ని పార్టులను పూర్తిగా విప్పేసి ప్రతీదాన్ని శుభ్రంగా తుడిచి, ఓవర్ ఆయిలింగు చేసి మళ్లీ జాగ్రత్తగ వాటిని బిగిస్తడు. నూనె వేసిన సైకిల్ గంట గణగణా మోగుతుంటే, కొత్తగ ముస్తాబై, సింగారించుకున్న సైకిలు మళ్లీ గజ్జెల గుర్రంలా తయారవుతది. రయ్యిరయ్యిఁన పరిగెత్తుతది. ఆ మెకానిక్ పనికి మొత్తం ఒక రోజు పడుతది. ఆ పని పూర్తయేసరికి నూనె మరకలతో, నల్లటి జిడ్డు మురికితో వాని ఆకారం మోటారు మెకానిక్గ మారుతది. వాడు దినపత్రిక తప్ప మరేమీ చదవడు. ఇతర పుస్తకాల పఠనానికి వాడు ‘అకల్ కే దుష్మన్’. వాడి కళాత్మకత, సృజనాత్మకత అంతా ఆ సైకిల్ రిపేరింగులనే బయట పడుతది. లేదా గాలి కబుర్లను కథలుకథలుగ మలిచి వర్ణించి చెప్పడంల బయట పడుతది.
ఇంతల బొక్కెన గొలుసు తెగి బాయిలో పడినట్టుంది. ‘దబ్బుమని’ పెద్దగ చప్పుడైంది. గోపి ఆ చప్పుడుకు దడుసుకొని చా కొంత కిందికి ఒలకపోసుకున్నడు. ఇంట్ల ఉన్న కిరాయి వాళ్లతో సహా పిల్లా పీచు అంతా బాయిలకు తొంగిచూస్తున్నరు. బొక్కెన రహస్యోద్యమ విప్లవకారుడిలాగ అండర్గ్రౌండ్లకు వెళ్లిపోయింది. పానీ, పానీ, జల్దీ, జల్దీ అంటూ మరాఠోళ్లు, కన్నడావోళ్లు గోలగోలగ అరుస్తున్నరు.
ఇంతల ‘శంకర్ మామా’ ఒక పెద్ద పాతాళగరిగెకు పొడుగ్గ ఉండే కొబ్బరి తాడును కట్టిండు. ఆ పాతాళగరిగె వింత ఆకారంతో ఉంగరాల ఉంగరాల గొలుసులతో, ముండ్లతో, కొండ్లతో గలగల చప్పుళ్లతో వెయ్యికాళ్ల జెర్రోలె, వొంద చేతుల ఆక్టోపసోలె కనబడుతుంది. తాడును బిగించి కట్టుడు పూర్తి కాంగనే బాయి గోడను ఆనుకుని లోపలికి వొంగి జాగ్రత్తగ పాతాళగరిగెను లోపలికి జారవిడిచినాడు. దాని గలగలల చప్పుడు, పోరల కిలకిలల నవ్వులతో వాతావరణం గడ్బడ్గ తయారయ్యింది. గోపి కూడ ఇవతలికి వచ్చి బాయి లోపలికి తొంగి చూస్తున్నడు. ఆ పట్నం పిల్లగాడికి ఆ దృశ్యం వండర్ఫుల్గ ఉంది. శంకర్మామ చేతులు ఇటు అటూ జల్లెడ పడుతున్నట్లు ఊపుతూ తాడును గిరగిరా తిప్పుతున్నడు. తాడును పై వరకూ లాగి పాతాళగరిగె పైకి రాంగనే తపుక్కున లోపలికి విసిరేస్తున్నడు. బాయి లోపల బొక్కెనా, పాతాళగరిగె దాగుడుమూతలు, దొంగాపోలీసు ఆట ఆడుకుంటున్నట్లుంది. పాతాళగరిగె కొండ్లకు ముండ్లకు బొక్కెన చిక్కుత లేదు. ‘బొక్కెన బోర్ల పడిందేమో ! అందుకనే దొరుకత లేదు’ అని ఎవరిదో కామెంట్.
శంకర్ మామకు చెమటలు. చికాకు. అటూ ఇటూ తిప్పి తిప్పి చేతులు నొప్పి. భుజాలు గుంజుతున్నయి. పానీ, పానీ, జల్దీ, జల్దీ ఆయన పెండ్లాం రుక్కుంబాయి మారాఠీగోల. ఇక లాభం లేదు బాయిలకు దిగాల్సిందే అని ఎవరిదో ఉచిత సలహా. మధ్యాహ్నం ఎండపొడ బాగా వొచ్చినప్పుడు, అది నీళ్ల మీద పడినప్పుడు అడుగు భాగం స్పష్టంగ కనబడుతది. అప్పుడు తీరికగ తీద్దాం అని పాన్ నములుకుంట బాపు ఆలోచన. మరి ఇప్పుడు వొంటకు నీళ్లెట్ల, స్నానాలకు నీళ్లెట్ల అని అమ్మ ఆరాటం. పరేషాన్.
శంకర్మామ ఆల్ ఇన్ ఆల్. ఇంట బయట హీరో, హీరోయిన్ రెండూ ఆయనే. సింగిల్ మనిషి డబుల్ యాక్షన్. భార్య రుక్కుంబాయి ఉత్త నామ్ కే వాస్తే. ఆయన కొద్దిగ ఆడంగి రేకుల మనిషి. సార్థక నామధేయుడు. కాని చాలా మంచోడు. స్నేహశీలి, పరోపకారి పాపన్న. అందర్నీ అన్న, అక్క అని వరుస పెట్టి పిలుస్తడు. అతనొక ఆలిండియా రేడియో. ఆయనకు తెలియని ముచ్చట్లు, ఆయన చెప్పని ముచ్చట్లు ఏమీ లేవు. చైనా వాడు భారతదేశంపై ఎందుకు హమ్లా చేసిండో దగ్గర్నించి, బస్తీల ఎవరింట్లో కాన్పు అయ్యిందీ, ఏ పిల్ల పెద్దమనిషి అయ్యిందీ అనే దాకా అన్ని సంగతులు అందరితో చెప్పుతడు. ఆయన ఆడా, మగాకే కాదు, చిన్న పిల్లలందరికి కూడా సన్నిహితుడే, స్నేహితుడే. తన తీరిక సమయాలల్ల వారికి గరం గరం సమోసాలు, కచోరీలు చేసి పెడతడు. ఇంట్ల వంటంతా ఆయనదే. ఏ కూర ఎన్ని రకాలుగ వండచ్చో వైనవైనాలుగ వర్ణించి ఆడవాళ్లతో చెప్తుంటడు. అతని చేతి వంట ఆడవాళ్లను కూడా మెప్పిస్తది.
దసుర పండగ దేవీనవరాత్రులప్పుడు ఆయన చేసే పూజలు, సంబరాలు చూడవలసినవే. వినవలసినవే. ప్రతి రోజు రాత్రి పిల్లలందర్ని పోగేసి నవరాత్రి ఉత్సవాల సందర్భంగ అమ్మవారి ముందు కంచు పళ్లెం నిండ నల్లటి మట్టి నింపి అండ్ల నవధాన్యాలు వేస్తే మొలకెత్తిన ఆకుపచ్చని గడ్డిపరకల ముందు, మంచి ఆవు నెయ్యితో దీపాలను వెలిగించి, పూజలు చేసి, గణగణ గంటలు మోగించుకుంట, చప్పట్లు చరుచుకుంట ‘ఓం జయ్ జగదీష్ హరే, స్వామి జయజగదీష్ హరే’ అని భజనలు చేసుకుంట కార్యక్రమం అయిపోంగనే పిల్లలందరికీ పేడా, బర్ఫీ, మిఠాయీలు ప్రసాదంగ పంచి పెడ్తడు. బస్తీల ఉన్న పిల్లలందరూ వాటి మీది ఆశతో ఆ పూజలకు హజరైతరు, గొంతెత్తి భజన గీతాలు పాడుతరు.
బస్తీల ఎవరైనా చనిపోతే ఆడవాళ్ల కంటే ఎక్కువగ శంకర్మామనే సుదీర్ఘంగ, రాగయుక్తంగ శోకాలు పెట్టి ఛాతీమీద కొట్టుకుంట ఏడుస్తడు. స్పృహ కూడ తప్పిపోతడు. అది చావైనా, పెళ్లయినా, పురుడైనా, పుష్పవతి అయినా శంకర్మామ పాత్ర, హడావుడి వుండవలసిందే. హోలీ పండుగలు, హనుమాన్ జయంతులు, ఒక్క పొద్దు శివరాత్రులు, గణపత్ పప్పా, ఉత్సవాలన్నీ శంకర్ మామ హంగామా వల్లనే కాంతులీనుతూ వుంటై. కళకళలాడుతై. ఎవరికి ఏ ఆపద వచ్చినా కేరాఫ్ అడ్రస్ శంకర్ మామే! బోళా శంకరుడు కావుననే అర్థనారీశ్వర తత్త్వమేమో! కణ్కణ్ మే భగవాన్. కంకర్ కంకర్ మే శంకర్ భగవాన్ !
ఆఖరికి ఎట్లనో అట్ల బొక్కెన ఇవతలికి వచ్చింది. పిల్లలంతా కేరింతలు. హమ్మయ్య అని పెద్దల నిట్టూర్పులు. గోపి మళ్లీ దివాన్‌ఖానాల ఆరాం కుర్చీల కూచోంగనే “ఏంది, పొద్దు పొద్దుగాల్నే ఇట్ల దిగబడినవ్. ఏమైనా ప్రోరోగ్రామ్ ఉందా ఏంది?” అని స్వామి నిద్రకళ్లను తుడుచుకుంటూ, ఆవలించుకుంటూ వచ్చి మజాక్ చేసినాడు.
“ఆఁ పోలీసోళ్లతోని తన్నులు తినే ప్రోగ్రామ్” అంటూ “అభే బేవకూఫ్ కే బచ్చే! ఏ దునియల వున్నవ్? ఎన్ని రోజులయ్యింది కనబడక. లువక. నిన్నటి సంది ఆబిడ్స్ రెడ్డి హాస్టల్ల రెండు రోజుల తెలంగాణా సదస్సు జరుగుతుంది. నిన్న అక్కడికి వస్తవేమొ, కలుస్తవేమొనని ఎదిరి చూస్తి. ఎదిరి చూసిన కండ్లు ఎండిపోయిన చెరువులయి పాయె. ఎంత మంది వచ్చిండ్రనుకున్నవ్. హోల్ తెలంగాణా అంతట్నుంచి అందరు వచ్చిండ్రు. అశోక్, జెఫ్రీలైతే దినమంత అక్కడ్నే. వలంటీర్లుగ పనిచేస్తున్నరు. నువ్వేమొ లాడ్సాబ్ లెక్క ఇంట్ల పండుకున్నవ్. నిన్న పొద్దుగాల సదస్సు మొదటి సెషన్ల ఉస్మానియా ఫిజిక్స్ ప్రొఫెసర్ రావాడ సత్యనారాయణ ప్రారంభోపన్యాసం చేసిండు. సదాలక్ష్మి అధ్యక్షత వహించింది. ఇంకా చానా మంది చానా బాగా మాట్లాడిండ్రు. నువ్వేమొ అత్తపత్త లేకపోతివి. నువ్వు పక్కా అన్నాడీగానివి. మీ ఇంటికో పేపరు రాదు. ఇంట్ల రేడియో లేదు. ఇగ దున్య మీది ముచ్చట్లు నీకెట్ల తెలుస్తయి?” నారాజ్గ మాట్లాడబట్టినాడు గోపి.
తెలంగాణ ఉద్యమ వార్తలు తెలుసుకునేందుకు బాపును బతిమిలాడి ఎట్లనన్న ఆంధ్రభూమి తెలుగు దినపత్రిక తెప్పించుకోవాలని స్వామి లోలోపల నిర్ణయించుకున్నడు. అప్పటికి గోల్కొండ పత్రిక ఆగిపోయింది. ఆంధ్ర జనత, ఆంధ్రపత్రికలు వస్తున్నయి. కాని ఆంధ్రభూమికే ఎక్కువ డిమాండ్. దాని ధర పైది పైసలు. కమ్యూనిస్టుల విశాలాంధ్ర దిన పత్రిక గురించి స్వామికి తెలువదు.
“కనీసం ఈ రోజన్నా రా. ఈ రోజు సదస్సు ఆఖరు రోజు. సాయంత్రం రెడ్డి హాస్టల్ మైదాన్ల పబ్లిక్ మీటింగు. మీటింగు ప్లేస్‌ల మనం లుసుకోలేం. ‘కాట్’ అయిపోతం.మనందరం నాలుగ్గంటలకు ఆబిడ్స్ చౌరస్తా గ్రాండ్ హోటల్ల కల్సుకుందాం. అక్కడ్నుంచి మీటింగుకు పోదాం. ఈ సంగతి ఇంకా అశోక్, జెఫ్రీ గాడికి కూడా చెప్పాలె. మరి నేను పోయి రానా?” అని గోపి అడిగిండు.
“సరే సాయంత్రం కలుసుకుందాం” అన్నడు స్వామి.
గోపి సైకిలెక్కి ఆకాశంలకు ఎగిరిపోయే పక్షిలాగనే, పతంగి లెక్కనే ఎగిరిపోయినాడు.
* * *
స్వామి సరిగ్గ సాయంతం నాలుగ్గంటలకు ఆబిడ్స్ చౌరస్తాల గ్రాండ్ హోటల్‌కు చేరుకున్నడు. ఆ ఇరానీ హోటల్ కౌబాయ్ ఇంగ్లీష్ సీన్మాలల్ల చూపించే వేసైడ్ ఇన్ లాగనో, ఇటలీల జూదమాడే కేసినో లెక్కనో కనబడుతది. హోటల్ అంతా బిజీబిజీగ గడ్బడ్ గడ్బడ్గ ఉంది. కౌంటర్ల గ్రామఫోన్ రికార్డు నిర్విరామంగ మోగుతనే ఉంది. సర్వర్ల కేకలు. కస్టమర్ల ఆర్డర్లు. కప్పు సాసర్ల గ్లాసులు ప్లేట్ల గలగలల చప్పుళ్లు. హోమజ్వాలల భుగభుగల సిగరెట్ల ధూపదీపాలు. పాయా రోటీ బోటీ బిర్యానీల పరిమళాల ఆఘ్రాణింపులు. గోడలకు తగిలించిన పెద్ద పెద్ద నిలువుటెత్తు బెల్జియం అద్దాల మూలాన డబుల్ స్పేస్‌తో, డబుల్ డబుల్ మనుషులతో రెట్టింపైన వాతావరణంతో మాయాసంజనిత విభ్రాంతి దృశ్యాలు. జనం జాతరల జీవన సంగీతం. జనజీవన దృశ్యాలు.
స్వామి మిత్రబృందం కోసం వెతుకుతుంటే వాళ్లు ఓ మూలల ‘మూలపురుషులు’గ దర్శనమిచ్చినారు. అప్పటికే మొదటి రౌండ్ ఛా అయిపోయినట్టుంది. జెఫ్రీగాడు సిగరెట్ల మీద సిగరెట్లు గుప్పుగుప్పున పీకుతున్నడు. గోపి దక్కన్ క్రానికల్ పేపర్ల ఇసుకల తలదూర్చిన నిప్పుకోడిలాగ ఉన్నడు. అశోకుడు కండ్లు మూసుకొని పారవశ్యంతో పాత హిందీ సీన్మా పాటల్ని లోలోపలికి ఆవాహన చేసుకుంటున్నడు. స్వామి కుర్చీ లాగిన చప్పుడుకు అందరూ అటు వైపు తిరిగి “ఆయియే లేట్ లతీఫ్ సాబ్! ఆయియే” అని ఆహ్వానించినారు.
ముస్లింల ఇరానీ హోటళ్లకు, హిందువుల ఫలాహార భోజనశాలలకు భూమ్యాకాశాలకున్నంత తేడా స్పష్టంగ కనబడుతది. ఒక ముక్కల చెప్పాలంటే ఇరానీ హోటళ్లు ఎక్స్‌ట్రోవర్ట్స్. హిందువుల హోటళ్లు ఇన్‌ట్రోవర్ట్స్. తొలి దశల ఇరాన్ దేశం నుండి వచ్చిన వాళ్లే ఇరానీ హోటళ్లను స్థాపించినారు. ఆ కాలంల వీళ్లందరూ సామూహికంగా నివసించిన గల్లీ పేరు ఇరానీ గల్లీ. ఇది షెహరాన్ హోటల్ పక్క సందు నుండి మీర్ ఆలంమండికి పోయే తోవల వుంది. ఇరానీ హోటల్స్‌ల పేర్లన్నీ ఇరాన్ ఇరాక్‌లోని చారిత్రక స్థలాలకు సంబంధించిన పేర్లే. హోటల్ టెహరాన్, హోటల్ బస్రా. హోటల్ షెహరాన్. హోటల్ తాష్కెంట్ మొదలగు పేర్లన్నీ వారి చారిత్రక మూలాలకు సంబంధించినవే. ఇవే కాక మరి కొన్ని పేర్లు కవితాత్మకంగ, కళాత్మకంగ ఉంటై. మెహఫిల్, సాంజ్ ఔర్ సవేరా, వతన్, లైట్ ఆఫ్ ఇండియా, గుల్షన్ వంటివి కొన్ని ఉదాహరణలు.
హిందువుల హోటళ్ల పేర్లు ఎక్కువగ దేవుళ్లకు సంబంధించినవే. శంకర్ విలాస్, రామా విలాస్, వెంకటేశ్వర హోటల్ వగైరా. ఇరానీ కేఫ్లల్ల కూచుంటే ఫుట్‌పాత్‌లపై కూచున్నట్టే ఉంటది. మేలా మధ్యల నిలుచున్నట్లే ఉంటది. జాతరల జనం మధ్య కలిసి తిరుగుతున్నట్లే ఉంటది. అవతలి ప్రపంచం మొత్తం కనపడుతది. ఒక అతి పెద్ద ఓపెన్ ఎయిర్ థియేటర్ల కూచోని ఎంతకూ ముగింపులేని సుదీర్ఘ జనజీవన నాటకాన్ని చూస్తున్నట్లే వుంటది. ఒక నిలువుటద్దంల మనలను మనమే స్పష్టంగ దగ్గర్నుండి చూసుకుంటున్నట్లు ఉంటది.
దీనికి విరుద్ధంగ మన ఫలాహార భోజనశాలలన్నీ నాలుగు గోడల మధ్యన కుదించుకుని పోయినవే. ఏదో రహస్యమైన, నిషిద్ధమైన కాని పనిని త్వరగ ముగించుకుని బయట పడాలన్నట్లు ఆదరాబాదరగ కుక్షి నింపుకోంగానే అక్కడ్నుండి పారిపోవాలె. లేదంటే ‘సర్వరే’ ఇక బయలుదేరండి గిరాకీ టైం అని అతి వినయంగ మెడపట్టి గెంటేసినంత పనిచేస్తడు. ఇరానీ హోటళ్లు అట్లా కాదు. దాని తీరే వేరు. కేవలం ఏక్ మే దో చాయ్ చప్పరించుకుంట, సిగరెట్లు ఊదుకుంట గంటలు గంటలు గప్పాలు, బాతఖానీలు కొట్టినా సర్వరే కాదు, ఓనర్ కూడ అభ్యంతరం చెప్పడు. ‘దోస్తానాలకు చౌరస్తా ఇరానీ హోటళ్లు. అవి విశాల హృదయాలకు, స్నేహాలకు కూడళ్లు. సంగమ స్థలాలు. మిత్రులు కలుసుకునే సంకేత స్థలాలు.
హిందువుల హోటళ్ల వాతావరణమంత దానికి సంబంధించిన మడీ, ఆచారాల నుండి ఉద్భవించినవే కావచ్చు. ముస్లింలు దస్తర్ఖానాలు పరిచి అన్ని ఆహారపదార్థాలనీ అందులో అందంగా అమర్చి అందరూ దాని చుట్టూ కూచుని భోజనాన్ని కళాత్మకంగ ఆస్వాదిస్తారు. ఏం తింటున్నామో కాదు ఎట్లా తింటున్నామో అన్నది కూడా వీరికి ముఖ్యం. ఎవరైనా చూస్తున్నారనే స్పృహ కూడా వారికి ఉండదు. రైలు ప్రయాణాలల్ల సహితం దస్తర్ఖానాల టైపులనే భోజనాలు ముగిస్తరు.
హైద్రాబాదీలకు ఇరానీ హోటల్స్‌తో తమ నిత్యజీవితంల విడదీయలేని సంబంధం ఉంది. ప్రతి రోజు తమతమ ఉద్యోగాలూ పనులూ పూర్తి చేసుకున్న తర్వాత చల్లని సాయంకాలాలన్నీ ఇరానీ హోటల్స్‌లో గడిపెటోళ్లు. రోజువారీ బడలిక నుండి సేద తీరెటోళ్లు. ఒక చారానా ఇస్తే కౌంటర్ల కూచున్న ఓనర్ మనకు కావాల్సిన పాత పాటలన్నీ వేసెటోడు. పాతకాలంల ఇంట్ల రేడియో కూడా లేని రోజులల్ల ఇరానీ హోటల్స్ ముందు నిలబడి రఫీ, ముఖేష్ పాటలన్నీ వినెటోళ్లు. మళ్లీ మళ్లీ పాడుకునెటోళ్లు.
సికింద్రాబాద్ హోటల్ ముందున్న ఆల్ఫా హోటల్ ఛాయ్ ఒక మత్తులాంటిది. ఆ చాయ్‌కు అలవాటైనవారు అక్కడ్నుండి వెళ్లేటప్పుడు ఆ హోటల్లోకి దూరి చాయ్ తాగకుండ ఉండలేరు. అక్కడ నిలబడే చాయ్ తాగాలి. లష్కర్ల సాయంత్రం రైల్వే స్టేషన్ ముందు చెలరేగే జనసముద్రాలను, జనసమూహాలను చూసుకుంట చాయ్ తాగటం ఒక అందమైన అనుభవం. అట్లనే ప్యారడైజ్ కార్నర్. గార్డెన్ రెస్టారెంట్. ప్రముఖ చిత్రకారుడు యం.యఫ్. హుస్సేన్ హైద్రాబాద్‌కు వచ్చిన ప్రతిసారీ క్లాక్ టవర్ చౌరస్తాల ఉన్న గ్రీన్‌పార్క్ హోటల్‌కు పోయి కౌంటర్ ముందు నిలబడే ఓనర్‌తో బాత్ఖానీ కొట్టుకుంట చాయ్‌ల మీద చాయ్ తాగుతూ ఉంటడు. గన్ఫౌండ్రీల స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ ముందు బాంబే హోటల్‌ను రోడ్లు వెడల్పు చేసే కార్యక్రమంల మున్సిపాలిటీ వాళ్లు కూలగొట్టినప్పుడు రెగ్యులర్‌గా వచ్చే కస్టమర్లందరూ కండ్ల నీళ్లు పెట్టుకున్నరు. ఇరానీ హోటళ్లతో అనుబంధం అంటే అది !
ఆబిడ్స్‌ల ఉన్న ఓరియంట్ హోటల్‌కు పెద్ద చరిత్ర ఉంది. అరవై డెబ్బై దశకాలల్ల అనేక ఉద్యమాలకు అది కూడలి. ప్రతి సాయంత్రం అక్కడ ఒక మూలల హషీం, అంజయ్య, వెంకటస్వామి లాంటి కాంగ్రెస్ నాయకులు కూచునేవారు. తర్వాత కాలంల వాళ్లు ప్రముఖ కార్మి నాయకులుగ, మంత్రులుగ అభివృద్ధి చెందినారు. అంజయ్య రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా అయినారు. మరో మూల దిగంబర వులైన జ్వాలాముఖి, నిఖిలేశ్వర్, నగ్నముని, మహాస్వప్న మొదలైనవాళ్లు, బైరాగి, మగ్దుం లాంటివాళ్లు కూడ కూచొని సాహిత్య చర్చలు, వామపక్ష రాజకీయాలు వేడిగా, వాడిగా చర్చించెటోళ్లు. కలకత్తాల కాఫీ క్లబ్బులు సాహిత్య చర్చలకు, మేధావుల రాజకీయ చర్చలకు ఎట్లయితే మూల కేంద్రాలో అట్లనే ఆ హోటల్ కూడ. ప్రత్యేక తెలంగాణా ఉద్యమ కాలంల రెడ్డి హాస్టల్ విద్యార్థి నాయకులంత ఆ హోటల్లనే ఉద్యమ నిర్మాణానికి రూపురేఖలు రచించినారు. గతం నుండే అనేక పోరాటాలకు, ఉద్యమాలకు, లాఠీఛార్జీలకు, పోలీసు కాల్పులకు ఆ హోటల్, ఆబిడ్స్ చౌరస్తా ప్రత్యక్ష మూగసాక్షులు.
ఆ చౌరస్తాల పోలీస్ స్టేషన్ పక్కనున్న కింగు సర్కిల్ హోటల్ కూడా ఇట్లాంటిదే. జమ్రుద్కు ఎదురుగ వున్న ఓరియంటల్ హోటల్‌ను కూలగొట్టి తర్వాత కాలంల దాని పునాదుల మీద ఓరియంటల్ ఎస్టేట్ అని షాపింగు కాంప్లెక్సును నిర్మించినారు. పుణ్యాత్ములు కనీసం పేరైనా అదే పెట్టినారు !
గ్రాండ్ హోటల్ల రాజకీయ నాయకులు, కవులు, కళాకారులే గాక “ఖానాజాద్”లు కూడా కూచునేటోళ్లు. వీరంతా కింగుకోఠీకి సంబంధించిన ముస్లింలు. కింగు కోఠీ ప్యాలెస్‌ల నిజాం నవాబుకు బోలెడంత మంది ఉంపుడుగత్తెలు ఉండేటోళ్లు. ఆ ప్యాలెస్‌ల వాళ్లకు పుట్టిన సంతానమేవీరు. మగవారిని ‘ఖానాజాద్’లని, ఆడవాళ్లని ‘సలాతిన్’లని పిలిచేవారు. వారి పోషణ భారమంతా నిజాం నవాబు వ్యక్తిగత ఖజానా అయిన ‘సర్ఫేఖాస్’ భరించేది. ఉదయం నాస్తాతో పాటు రెండు పూటలా భోజనాలు, సంవత్సరానికి సరిపడా దుస్తులు, ఇతర ఖర్చుల కోసం ప్రతి నెలా పెన్షన్ వాళ్లకు లభించేది. నవాబుల సంతతి ఛోటే నవాబులమన్న అహంకారంతో చదువులకూ, ఉద్యోగాలకూ దూరమైనారు. దినమంతా సోమరిగ గడపటం, టైంపాస్ కోసం గ్రాండ్ హోటల్ల్ల బేకార్గ కూచుని చాలు తాగుకుంట, బిర్యానీలు తినుకుంట, పాన్ సిగరెట్లతోటి కాలం వెళ్లబుచ్చే వాళ్లే ‘ఖానాజాద్’లు.
ఇరానీ హోటళ్లలో మదీనా హోటల్ చరిత్ర పాతనగరం చరిత్రతో ముడిపడి ఉంది. ‘చార్మినార్ భరండీ - మదీనా బిర్యానీ’ అని పాతకాలం సామెత. బ్రాండీని భరండీ అని పలికెటోళ్లు. నైజాంల కాలంలో హైద్రాబాద్‌ను సందర్శించడానికి వచ్చే వారందరూ మదీనా బిర్యానీ రుచి చూడకపోతే తమ యాత్రల ఒక లోపంగ భావించెటోళ్లు. పైసలు లేకపోతే కనీసం బన్, సమోసాలన్నా తిని చాయ్ తాగెటోళ్లు. ముస్లింలకు మక్కా ఎంత పవిత్ర స్థలమో హైదరాబాదీలకు ఈ మదీనా హోటల్ అంత ముఖ్యమైన స్థలం.
ఒకప్పుడు ఈ మదీనా హోటల్ ప్రాంతంల పాత కోర్టు ఒకటి ఉండేది. 1908లో మూసీనదికి వరదలు వచ్చి అనేక కట్టడాలతో పాటు ఆ కోర్టు కూడ కొట్టుపోయింది. మళ్లీ నూతన భవన నిర్మాణాలు జరిగినప్పుడు అదే స్థలంల ఈ మదీనా హోటల్‌ను నిర్మించినారు. దీని ఆదాయంతో కొంత ప్రతి సంవత్సరం పవిత్ర స్థలాలైన మక్కా మదీనాలకు పంపించాలని నిర్ణయించినారు. అరబ్ దేశాలల్ల నూనె బావులు బయల్పడి వారు నియోరిచ్ అయిన తర్వాత ఈ వితరణ ఆగిపోయింది.
మదీనా హోటల్‌ను ఇండో ఇరానియన్, ఈజిప్షియన్ వాస్తు ప్రకారంగా కట్టినారు. పెద్ద దర్వాజా దానిపై లతలు, పువ్వులు. బిల్డింగు పై భాగంల పెద్ద ఆకుపచ్చ గుంబజ్లు, వాటి కింద ఖురాన్ సూక్తులు. హోటల్ లోపల చాలా ఎత్తుగ వున్న రూఫ్ల నుండి వేలాడే రంగురంగుల షాండీలియర్లు. వాటి లోపల షమాలు. గోడలకు అంటించిన రంగురంగుల గాజు ముక్కల డిజైన్లు. సొగసైన ఫ్రేము కుర్చీలు, టేబుళ్లు. లోపల గోడలకు పెద్ద పెద్ద గ్లాసు అలమారాలు ఉండేవి. అందులో కాస్మోటిక్స్, జనరల్ సామానులను అందంగ అమర్చెటోళ్లు. ఆ వస్తువుల్ని అక్కడే కొనవచ్చు.
ఈ ఇరానీ హోటల్స్ అన్ని ఇప్పటికీ అతిస్వల్ప రేట్లకే పేదవాళ్ల కడుపు నింపే అన్నపూర్ణ నిలయాలు. బన్ -మస్కా, సమోసా, మిర్చి బజ్జీల కాంబినేషన్లతో కడుపు నింపుకుని ఛా తాగవచ్చు. రెండు చాయ్‌ల ఖరీదుకే దాల్ఖానా దొరుకుతది. ఇంకో రెండు రూపాయలు ఎక్కువిస్తే అండా కూడా ఇస్తరు. ఇరానీ హోటల్స్ పుణ్యమా అని బీదవాళ్లు కూడ హైద్రాబాద్ల సుఖంగ బతుకుతరు.
అశోక్‌కు మనీ ఆర్డర్ వచ్చినట్టుంది. మహా జోరుగ ఉన్నడు. జేబు బాగ గరం గరంగ ఉన్నట్లుంది. స్వామి రాంగనే ‘చార్ చికెన్ బిర్యానీ లావ్’ అని అరిసినాడు. ఘుమఘుమల పొగలు గక్కే చికెన్ బిర్యానీని ఆవురావురుమని అందరూ లాగేసినారు. ‘ఎగు ఫుడ్డింగు చెప్పరా’ అని గోపి బతిమిలాడితే అవి కూడా మినట్ల మీద హాజరు. ముగింపుగ డబుల్ శక్కర్తో - జబర్దస్త్ మలాయీతో చార్ పౌనాలు. ముక్తాయింపుగ మీఠా పాన్లు. జెఫ్రీగాడు తన కోసం ప్రత్యేకంగ బర్కిలీ సిగరెట్ పాకెట్ కొనిపించి “తెలంగాణా వొచ్చినంక సర్కారీ నౌఖరీలు చేసి నీ రుణం తీర్చుకుంటం లేరా” అని అశోక్‌తో మజాక్ చేసినాడు.
‘చల్ భే సాలా’ అని అశోక్ కొట్టబోయినాడు. ‘మరి నాకు అక్కలు లేరు గద బాస్’ అని జెఫ్రీ చురక అంటించినాడు.
ఒకళ్ల భుజాల మీద మరొకరు చేతులేసుకుని అందరూ కలిసి సదస్సు జరుగుతున్న రెడ్డి హాస్టల్ ప్రాంగణం దిక్కు ప్రయాణం. కలుషితం కాని స్నేహాలకు సంకేతాలు వాళ్లు.
ఆ సదస్సు ఆబిడ్స్ రెడ్డి హాస్టల్ల మార్చి 8,9 రెండు రోజులు చాలా పెద్ద ఎత్తున జరిగింది. ఆ సదస్సును విజయవంతం చేసేందుకు రెండు నెలల ముందే విద్యార్థులు, యువకులు, మేధావులు చాలా మంది అన్ని జిల్లాలల్ల విస్తృత పర్యటనలు చేసి, ప్రజలను సమీకరించినారు. భవిష్యత్తుల జరగబోయే ఉద్యమానికి ఆ సదస్సు మార్గదర్శకంగ పనిచేసింది. తెలంగాణ అంతట్నుంచి ముప్పై వేల మంది ప్రజలు హాజరైనారు. రెడ్డి హాస్టల్ మైదానం జనసముద్రంగ మారింది. సాయంత్రం పబ్లిక్ మీటింగుల ఉస్మానియా యూనివర్శిటీ విద్యార్థి నాయకులు, ప్రొఫెసర్లు, లెక్చరర్లే కాక లాయర్లు, జర్నలిస్టులు, డాక్టర్లు మొదలగు మేధావులెందరో పాల్గొన్నరు. ప్రసంగించినారు. వందేమాతరం రామచంద్రరావు, ఎస్.బి. గిరి లాంటి రాజకీయ నాయకులు కూడ ప్రసంగించినారు. ప్రత్యేక తెలంగాణా ఒక్కటే ఏకైక పరిష్కారం అని అందరూ ముక్తకంఠంతో ఘోషించినారు.
బహిరంగ సభకు ఆ మైదానం సరిపోలేదు. ఇసుక వేస్తే రాలనంత తొడతొక్కిడి జనం. జై తెలంగాణ, జై జై తెలంగాణ నినాదాలతో పరిసరాలు దద్ధరిల్లినై. జనం. జనం. ప్రభంజనం. జనం చోటు లేక చెట్ల కొమ్మల మీద, చుట్టుపక్కల గోడల మీద కూచొని, నిలబడి ఉపన్యాసాలు ఓపికగ విన్నరు. హాస్టల్ చుట్టుపక్కల గోడల మీద, బిల్డింగుల మీద ఎక్కడ చూసినా జనమే. జనశక్తి ఒక ప్రవాహం మాదిరిగ తెలంగాణా నలుమూలల నుండీ కదిలివచ్చింది. అర్థరాత్రి దాటిన తర్వాత కూడ సభ జరుగుతనే వుంది. సభకు వచ్చిన వేలాది మంది ప్రజల చేత తెలంగాణా సాధించి తీరుతామని ప్రతిజ్ఞలు చేయించినారు.
అదొక జనఘోష. జరగబోయే జనసంగ్రామానికి ముందొక జనగానం. ఆ జనగానాలు యుద్ధ గానాలాపనలు, కదన కుతూహల రాగాలు. మల్లికార్జున్, శ్రీధర్ రెడ్డి, పులి వీరన్న, మహదేవ్ సింగు, సదాలక్ష్మి మొదలగువారు రక్తాన్ని పరుగులు పెట్టించి ఉర్రూతలూగించే ఉద్రిక్త ఉపన్యాసాలు ఇచ్చినారు. రాజకీయ పార్టీల ప్రమేయం లేకుండ, విద్యార్థుల శక్తి ఏమిటో, ప్రజా ఉద్యమం అంటే ఏమిటో ఆ రెండు రోజుల సదస్సు రుజువు చేసింది. ఆ సదస్సు పిలుపు వలన మార్చి 11 నుండి తెలంగాణా అంతట విద్యార్థుల నిరవధిక సమ్మె ప్రారంభమయ్యింది. విద్యార్థుల ఉద్యమానికి మద్దతుగ ఉద్యోగులు, ఉపాధ్యాయుల కార్యాచరణ సమితి ఏర్పడింది. కె.ఆర్. అమోస్, బాలకృష్ణారెడ్డిలు దాని నాయకులు.
ఆ తర్వాత మార్చి పదిహేనున ఉస్మానియా యూనివర్శిటీల స్వర్ణోత్సవాలు జరిగినై. ఆ సంవత్సరంల యూనివర్శిటీ అర్ధశతాబ్ది వయస్సును పూర్తి చేసుకుంది. ఆ సందర్భాన్ని పురస్కరించుకుని ఘనంగ ఉత్సవాలు జరుగుతున్నై. ఆ రోజు యూనివర్శిటీ ఠాగోర్ ఆడిటోరియంల ప్రత్యేక తపాలా బిళ్లను ఆవిష్కరించటానికి రాష్ట్ర గవర్నర్ వచ్చినారు. స్వామి తన మిత్రబృందంతో కలిసి ఆ ఉత్సవాలకు హాజరైనాడు. లా కాలేజీ బస్‌స్టాప్‌ల బస్ దిగి లాండ్స్కేప్ గార్డెన్ లోపల్నుండి అడ్డదారి గుండ నడిచి ఆడిటోరియానికి చేరుకోంగనే లోపల గొడవలు ప్రారంభమైనై.
గవర్నర్ వేదిక మీదికి రాంగనే శ్రీధర్ రెడ్డి నాయకత్వంల వందలాది మంది విద్యార్థులు లేచి నిలబడి వేదిక మీదికి ఉరుకొచ్చి గవర్నర్ గోబ్యాక్ అని నినాదాలు చేయసాగినారు. అనుకోని ఆ హఠాత్పరిణామానికి అందరూ నిశ్చేష్ఠులైనారు. అందరూ తేరుకునేలోగా మరో మూల నుండి సదానంద్ నాయకత్వంల స్టూడెంట్ ఫెడరేషన్ కార్యకర్తలు ఏకంగ వేదికపైకి ఎక్కేసి స్వర్ణోత్సవాలు అక్కరలేదు. ఉద్యోగాలైనా చూపెట్టండి లేదా తిండైనా పెట్టండి, నిరుద్యోగ భృతి ఇవ్వండి లేదా జైళ్లల్ల పెట్టండి అంటూ నినాదాలు ఇవ్వసాగినారు. వాళ్లకు వ్యతిరేకంగ జై తెలంగాణా నినాదాలు. అంతా గందరగోళం. ఎవరేం అంటున్నరో వినబడత లేదు. ఈ లోపల పోలీసులు గవర్నర్‌ను రక్షించడం కోసం లాఠీచార్జీ చేసినారు, సాక్షాత్తూ గవర్నర్ ఎదుటే చాలా మందిని అరెస్టు చేసినారు.
స్వామి మిత్రబృందం పోలీసుల వలయాన్ని తప్పించుకోలేక పోయింది. అందర్ని మూకుమ్మడిగ అరెస్టులు చేసి వ్యాన్‌లోకి ఎక్కించినారు.
వ్యాన్లు ఎక్కడికి బయలుదేరినయో, ఎక్కడికి తీసుకుపోతున్నరో స్వామికి అర్థం కాలేదు. వ్యాన్ కిటికీల చుట్టూ టార్పాలిన్ క్లాత్‌లను కప్పినారు. లోపలంతా ఉక్కపోత, చీకటి, చెమట. ఒక గంట ప్రయాణం చేసిన తర్వాత ఎక్కడనో ఒక చోట చాలా సేపు ఆపినారు. ఎవర్నీ కిందికి దింపలేదు. ఆఫీసర్లు మాత్రం వ్యాన్ దిగి ఒక బిల్డింగు లోపలికి పోయినారు. వారి బదులు మామూలు కానిస్టేబుళ్లు వ్యాన్‌లోకి ఎక్కినారు. వ్యాన్ మళ్లీ బయలుదేరింది. చీకట్లు కమ్ముకుంటున్నై. ఎటు తీసుకుపోతున్నరో అగమ్యగోచరంగ ఉంది. ఆకలి, దాహం, ఉక్క, చెమట, భయం, నీరసం. జెఫ్రీ, అశోక్ కండ్లల్ల భయం నీడలు. గోపి ముఖంల తెగింపు. స్వామికి ఇంట్ల చెప్పి రాలేదన్న దిగులు. వ్యాన్ నగరం దాటుతుందని తెలుస్తనే ఉంది. లైట్ల వెలుగులు, ట్రాఫిక్ శబ్దాలు ఏమీ లేవు. చల్లటి గాలి, కీచురాళ్ల రొదలు విన్పిస్తున్నై. ఏదో గతుకుల తోవ పొంటి వ్యాన్ కుంటుకుంట నడుస్తుంది.
ఇంతల హఠాత్తుగ వ్యాన్ ఆగింది. కాని ఇంజన్ మాత్రం ఆపలేదు. వ్యాన్ల వున్న పోలీసులు వెనుక తలుపు రెక్కల్ని తెరిచి నలుగురైదుగుర్ని దిగమని ఆదేశించినారు. వాళ్లు చీకట్ల ఎట్లా దిగాల్నా అని తటాపటాయిస్తుండగ లాఠీలతోటి నాలుగు బాది వాళ్లను అవతలికి తోసేసినారు. తలుపులు మళ్లీ మూసుకోంగనే వ్యాన్ బయలుదేరింది. మరో అర్ధగంట అయిన తర్వాత స్వామి మిత్రబృందాన్ని మరికొంత మందిని నడుస్తున్న వ్యాన్ల నుండి మూటలను విసిరేసినట్లు కిందికి విసిరేసినారు. అందరూ ఒకళ్ల తర్వాత ఒకళ్లు రోడ్డు మీద పడ్డరు. అది కచ్చా మట్టి రోడ్డు. కాళ్లకు చేతులకు చిన్న చిన్న దెబ్బలు తగిలినై. మిగతావార్ని తీసుకుని వ్యాన్ ముందుకు కదిలిపోయింది. అర్ధరాత్రి పూట అట్ల నట్టడవిల వదిలిపెట్టడం ఒక విధమైన పనిష్మెంట్ అని స్వామికి తెలిసిపోయింది.
నిండు అమావాస్య. కటిక చీకటిరాత్రి. శ్యామలాకాశంల మినుకుమినుకు మంటున్న లక్షల లక్షల నక్షత్రాలు. గుడ్డి వెలుగుల కాలిబాట వెంబడి సుదీర్ఘ ప్రయాణం. ఆ బాట ఎటు పోతదో ఎవరికి తెలియదు. చెప్పులూడిపోయిన పాదాల బొటన వ్రేళ్లకి టపటప తగులుతున్న తట్టు దెబ్బలు. చిట్లుతున్న వేళ్లు. కారుతున్న రక్తాలు, నొప్పి బాధ. అయినా ఎండాకాలం రాత్రి గాలి మనస్సుకు ఉపశమనంగ ఉంది. అందరూ కలిసి ఎనిమిది తొమ్మిది మంది ఉన్నరు. ఒకరికొకరు తోడు. భయమన్న ప్రశ్నలేదు. ‘భూమి కోసమే నడు, భుక్తికోసమే నడు. విముక్తికోసమే నడు. భయం గియం విడు నడు. నడు నడు’. భయానికి భయమేసి పారిపోయినట్టుంది. మళ్లీ మెత్తటి మట్టిరోడ్డు పాదాలగాయాలను చల్లగ ముద్దుపెట్టుకుంటుంది. నేలతల్లి చందన చర్చిత చల్లని ఓదార్పులు. రోడ్డు, రోడ్డు Every road has a friend and every friend has a road. స్వామికి చర్చిగోడ మీద చదివిన వాక్యం గుర్తుకొచ్చింది. అది తన మనస్సులోని మాట. తన మాట.
స్వామికి రోడ్ల మీద చిన్నప్పట్నుంచీ జిజ్ఞాసే. చిన్నప్పటుంచీ ఇష్టమే. తన జీవితంల సడక్ ఒక ముఖ్యమైన భాగం. సడక్ ఎప్పుడూ ఏదో ఒక సందేశం ఇస్తున్నట్లు, ఒక రహస్యం చెపుతున్నట్లు అనిపించేది. సడక్ తనను సూదంటు రాయిలాగ ఆకర్షించే ఒక మార్మికశక్తి. సడకాకర్షణశక్తి తన మీద బలంగ ఉండేది. చిన్నప్పుడు బాపు చిటికెన వేలిని పట్టుకుని చిన్న చిన్న అడుగులేసుకుంట సడక్ మీద నడుస్తున్నప్పుడు “బాపూ ఈ సడక్ ఇట్ల ఎంత దూరం పోతది?” అని సడన్గ ప్రశ్నించినాడు. ఆ హఠాత్ ప్రశ్నకు ఆయనకు ఏం సమాధానం చెప్పాలో తోచక ‘మన ఊరు వరంగల్ లేదూ! అంత వరకు పోతది’ అని జవాబు చెప్పి తాత్కాలికంగ జిజ్ఞాసను ఉపశమింపచేసినాడు. అవును చిన్నప్పుడన్నీ ఆశ్చర్యమే!
స్వామిని చిన్నప్పుడే చీకటి వెలుగు నీడలు ఆకర్షించినై. ఇంకా విద్యుత్తు దీపాలు రాని ఆ పాతకాలం రోజులల్ల రాత్రి పండుకొనే ముందు గ్యాసునూనె కందీల్ లేదా పొగలు చిమ్మే చిమ్నీల జిలుగు వెలుగులతో గోడలమీదపడే తన నీడతో తనే గంటల తరబడి ఆడుకునేటోడు. అది తన నీడ అని స్వామికే తెలియదు. తన నీడే తన తొలినేస్తం. తనతో ఆడుకోవటానికి వచ్చిన తన దోస్తు అనుకునేటోడు. తను ఎట్ల చేతులుతిప్పితే వాడు కూడ అట్లనే చేతులు తిప్పి తనను అనుకరిస్తున్నాడనుకునేటోడు. ఆ నీడనేస్తం తన వెంబడి చాలా రోజులు ఉంది. గోడల మీది నీడల్ని చూడొద్దు. జ్వరం వస్తుందని పెద్దలు భయపెట్టేటోళ్లు. అయినా గోడ మీద నీడతో గంటలు గంటలు మాట్లాడేటోడు. తాను పెద్దయినంక పనికి మాలిన బుద్దీ, జ్ఞానం హెచ్చి పసితనానికి పసిడితనానికి రెక్కలొచ్చి పక్షిలాగ ఎగిరిపోయిన తరవాత ఆ “గోడ నీడనేస్తం” తన బతుకు నుంచి మాయమయ్యి శ్యామూల్ బక్కెట్ అసంగత నాటకంల “వెయిటింగు ఫర్ గోడో” పాత్రలాగ తన జీవిత నాటకం వేదికపై మళ్లీ ఎప్పుడూ కనబడనే లేదు. ఆ నీడకోసమే తన అన్వేషణ. తనలోని ఆ సగంకోసమే వెదుకులాట!
సడక్ మీద ఇంత మంది మనుషులు నడుచుకుంట, సైకిళ్లు తొక్కుకుంట, రిక్షాలల్ల, కార్లల్ల ఎక్కడికి పోతున్నరో, ఎందుకు పోతున్నరో స్వామికి తెలిసేదికాదు. వాళ్లంత ఎందుకోసమో పరిగెత్తుతున్నట్లు అనిపించేది. బాపు వాడిని సైకిలు ముందు ఎక్కించుకుని పోతున్నప్పుడు తన సందేహాలను అడిగేటోడు. ప్రశ్నలు. ప్రశ్న మీద ప్రశ్నలు. ప్రశ్నల్లోంచి ప్రశ్నలు. ఎన్ని సమాధానాలు దొరికినా చివరికి మిగిలేవి వేయిన్నొక శేష ప్రశ్నలు. సడక్ ఒక అన్వేషణ. దారి కాని దారులలో దారికోసం అన్వేషించే ఒంటరి బాటసారి కోసం ఎల్లప్పుడూ అభిసారికలాగ నిరీక్షించే సడక్. నగరంతో ఎంత సంబంధమో నగరంలోని సడక్లతో కూడా అంతే అవినాభావ సంబంధం. నగరానికి జవజీవాలనిచ్చే రక్తాన్ని సరఫరా చేసే సిరలు, దమనులే సడక్‌లు.
మనిషి రోడ్డున పడ్డడు. స్వామి చాలా చిన్నప్పుడే రోడ్లను పట్టినాడు. అకారణంగానే తన తమ్ముడు జ్ఞానిని తీసుకుని రోడ్లవెంబడి నడుస్తూ నడుస్తూ పోయెటోడు. రోడ్ల అంతు చూడాలనే తపన. దారులు ఎక్కడ ప్రారంభమయ్యి ఎక్కడ అంతం అవుతాయో తెలసుకోవాలనే అన్వేషణ. వాళ్లిద్దరు శాలిబండ నుండి బయలుదేరి సయ్యద్ అలీ చబుత్రా, అలియాబాద్ దర్వాజా, శంశేర్‌గంజ్, పెద్దపులి తోట, కాలువ గడ్డ, ఇంజన్‌బౌలి దాటి ఫలక్‌నుమా ప్యాలెస్ దాకా పోయెటోళ్లు. చెప్పుల్లేని చిన్న చిన్న పాదాలు కందిపోయేటివి. కాళ్ల పిక్కలకు తీపులు వచ్చేటివి. ఫలక్‌నుమాకు పోయే తోవల జహనుమా ప్యాలెస్ ఉండేది. జహాఁనుమా అనగా స్వర్గం అని అర్థం. దానిని తర్వాత కాలంల సీన్మా స్టూడియోగ మార్చినారు. అందుల లవకుశ, రహస్యంవంటి ప్రఖ్యాతి గాంచిన సీన్మాలు నిర్మించబడినాయి.
ఫలక్‌నుమా అనగా ఆకాశహర్మ్యం, గగనంలో విలసిల్లిన భవనం అని అర్థం. ఇంజన్‌బౌలీ మొదలుకుని ఫలక్‌నుమా ప్యాలెస్ వరకు రోడ్డుకు ఇరువైపుల చల్లగాలి వీచే రకరకాల చెట్లు. వాటిపై పువ్వులు, పక్షులు. అక్కడ వాతావరణం చల్లగ, హాయిగ వుండేది. జనసంచారం అంతగ లేని రహదారి. ఆ రహదారి మీద బిగ్గరగ ఏదో పాత హిందీ సిన్మా పాట పెద్దగ పాడుకుంట పోతున్న ఒక ఒంటరి బాటసారి. పాట అతణ్ణి కమ్ముకుందో, అతడే పాటను కావలించుకున్నడో తెలియనంత తన్మయత్వం. పరవశించే పాట. వాళ్లిద్దరూ ఫలక్‌నుమా గుట్ట మీది గుండ్ల మీద ఎక్కి కూచోని కళ్ల ముందు విశాలంగ పరుచుకున్న ప్రకృతిని, పచ్చని పంటచేల మధ్య నుండి నెమ్మదిగ పోతున్న ఎర్రరంగు రైలు డబ్బాలనీ, దయ్యం లాంటి ఇంజను నుండి వెలువడే నల్లటి పొగల గుంపుల్ని కండ్లల్ల నింపుకుని, ఒంపుకుని తనవి తీరా చూసెటోళ్లు.
రైలు పొగ వాసనంటే స్వామికెంతో ఇష్టం. బొగ్గుతో నడిచే పాతకాలం, విక్టోరియా మహారాణి కాలంనాటి రైలింజన్ల అందం డీజిల్ ఇంజన్లకు ఉండదు గాక ఉండదు. తెలంగాణాల ధూమశకటం వచ్చిన కొత్తలో పల్లె ప్రజలు దానిని చూసి జడుసుకుని భయంతో జ్వరాలు తెచ్చుకున్నరట. అలవాటు అయిన తర్వాత దాని మీద పాటలు కట్టినారట, హాస్యాలు చేసినారట.
బండీర, పొగబండీర
దొరలెక్కే రైలు బండీర
దొరసానూలెక్కే
రైలు బండీర
నీళ్లూ నిప్పులు మింగుతాదీ
ముందుకు ముందుకు నడుస్తాదీ
బండీర పొగబండీర
దొరలెక్కే రైలు బండీర
పాత రైలింజన్ల పెద్ద పెద్ద చక్రాలు, దాని పొగమసి, మురికితో కనబడే ఇంజన్ డ్రైవర్లు స్వామి కంటికి హీరోలుగ కనబడెటోళ్లు. ఇంజను కొలిమిల భగభగల భుగభుగలతో రగులుతున్న రాక్షసిబొగ్గు పెద్దగ మండుతున్న సూర్యగోళం లెక్క ఉండేది. నోరు తెరుచుకున్న ఆ అగ్ని దాహానికి ఇనుప పారతో బొగ్గు ఖణికల్ని విసురుతున్నోడు సాహసవీరుడిగ కనబడెటోడు. తను పెద్దయిన తర్వాత రైలు ఇంజన్ డ్రైవర్ ఉద్యోగం తప్పనిసరిగ చేయాలని కలలు కనెటోడు. మనస్సులనే ప్రతిజ్ఞలు తీసుకునెటోడు. ఏం చదువుకుంటే ఆ ఉద్యోగం దొరుకుతుందో అని తన చిన్న బాపును అడిగి తెల్సుకున్నడు.
మధ్య రాత్రి గజ్జెల గుర్రం లాగ పోతున్న రైలు కూత తనను నిద్ర నుండి లేపేది. దాని సుదీర్ఘమైన ఈల పాట వెంబడి తను చాలా దూరం ప్రయాణించెటోడు. ఆ ఈలపాట సంగీతం రకరకాలుగ మారుతుండేది. ఒక ఈలకు మరో ఈలకు మధ్య కొంత విరామంతోటి పెట్టెల చప్పుడు, పట్టాల చప్పుడు లయబద్ద సంగీతమోలె వినిపించేది. అర్ధరాత్రి నిశ్శబ్దంల, సగం సగం మత్తు నిద్రల రైలు ఈలపాట వినటం అద్భుతమైన అనుభవం. చివరికి జీవితంల రైలు మిగిలిపోయింది. బాల్యం వెళ్లిపోయింది. ఇంజన్ డ్రైవర్ కల కరిగిపోయింది. అన్నీ సగం సగం విరిగిన కలలే.
ఫలక్‌నుమాకు పోయే దారిల ఇంజన్‌బౌలీ నీళ్లలోతు తనకేదో మాయను, మర్మాన్ని బోధిస్తున్నట్లు తోచేది. దాని పక్కనే రాజన్నబావి. అందులో తేలే దసుర పండుగ నాటి బతుకమ్మలు. ఎండిన గునుగు పువ్వులు బావి నీళ్ల మీద ఈతలు కొడుతూ వుండేవి. స్వామికి ఈత రాదు. ఆ నీళ్లలోతుల్లోని లోపలి లోకాలను తనెప్పుడూ ఊహించుకునెటోడు. చందమామ కతల్లో మాదిరిగ నీళ్ల అడుగున నాగలోకం ఉంటదనీ, అక్కడ నాగకన్యలు నాట్యం ఆడుతరనీ, నాగస్వరాలు ఊదుతుంటరనీ, ఆ స్వరాలు విన్న సర్పాలు పెద్ద పెద్ద పడగలు విప్పి విషం కక్కుతూ తోకపై లేచి నిలబడి బీకరనృత్యాలు చేస్తయని ఊహించుకునెటోడు. నీళ్ల లోపలి కాళింది సర్పం జ్ఞాపకం వచ్చేది. నీళ్లంటే భయమూ, ఆకర్షణ రెండూ వుండేవి.
అట్లా రోడ్లు పట్టుకుని తిరిగే స్వామిని, రోడ్ల మీద కాట్ అయిపోయిన స్వామిని వెతికి పట్టుకునేటందుకు అమ్మ కోపంతో బయలుదేరేది. చేతిల కట్టె పట్టుకొని భద్రకాళిలాగ నడిరోడ్డుల ప్రత్యక్షమయ్యేది. తమ్ముడు జ్ఞాని స్వామి వెనుక పిల్లిలా దాక్కునేటోడు. అమ్మ స్వామిని పట్టుకోని తన్నుకుంట ఇంటికి తీసుకొచ్చి కాళ్లను తాళ్లతో కట్టి పడేసేది. యశోదచేత రోలుకు కట్టివేయబడిన బాలకృష్ణుడు స్వామి. నిజంగనే స్వామి శ్రీకృష్ణుడిలెక్క సరిగ్గా అర్ధరాత్రి పూట పుట్టినాడు.
సంచారత్వం బహుశా స్వామి రక్తం లోపలి జీవధాతువుల కణకణాల్లోనే వుందేమో! వాళ్ల పూర్వీకులు వీరవైష్ణవ మతప్రచారం చేసుకుంట తమిళదేశం నుండి తెలంగాణాకు వలస వచ్చినారు. రామానుజాచార్యుల కాలంల శ్రీ పెరంబుదూరులోని వైష్ణవులల్ల ఒక వర్గం వీరవైష్ణవ మార్గాన్ని అవలంబించింది. వైష్ణవం కేవలం ఒక మతం కాదని, అదొక జీవన విధానమని, భక్తి ఉద్యమమని వారి వాదన. జ్ఞానమార్గం, కర్మమార్గాలే గాక భక్తి మార్గం ద్వారా, ప్రేమ ద్వారా, ప్రజల్ని ప్రేమించడం ద్వారా పెరుమాండ్లకు సన్నిహితం కాగలమని వారి విశ్వాసం. మానవసేవే మాధవసేవ. వైష్ణవం అగ్రవర్ణమైన ఒక బ్రాహ్మణులకే పరిమితం కారాదని, అది సమాజంలోని అట్టడుగు ప్రజలకు కూడా చేరాలని, అందరికీ చెందాలని వారు బ్రాహ్మణాధిక్యతను ఎదిరించినారు. ధిక్కరించినారు. ఆ ఆధిపత్యానికి చిహ్నాలైన జంధ్యాన్ని, పిలకను విసర్జించి శూద్రులతో కలిసి వారిని వైష్ణవం వైపు మళ్లించినారు.
తమిళంల చాత్తాద అనగ విసర్జించినవారు అని అర్థం. కాలక్రమంల వీరిని చాత్తాద వైష్ణవులుగ మిగిలినవారిని శ్రీవైష్ణవులుగ ముద్రవేసినారు. ఈ చాత్తాద అన్న పదం తెలంగాణాల సాతానిగ, అయ్యవార్లుగ మారి ఒక కులానికి సంకేతంగ నిలిచింది. ఈ సాతాని అయ్యవార్లు శూద్రులకు పూజార్లుగ మిగిలిపోయినారు. ప్రజలల్ల వైష్ణవాన్ని విరివిగా ప్రచారం చేయటం కోసం విద్యను, వైద్యాన్ని ఒక వృత్తిగ ఎంచుకున్నరు. తెలంగాణాలో ఖానిగీ (ప్రైవేట్) వీధి బడులన్నీ ఈ సాతాని అయ్యగార్లవే.
బెంగాల్‌లోని చైతన్య ప్రభువులాగా ఈ చాత్తాద వైష్ణవులు వైష్ణవాన్ని, ఒక భక్తి ఉద్యమంగా తీర్చిదిద్ది మతప్రచారం చేసుకుంట తెలంగాణాలకు మూడు వందల సంవత్సరాల కింద ప్రవేశించి మహబూబ్‌నగర్ జిల్లా కేశవపట్నం, వరంగల్లు జిల్లాలోని మడికొండ, కరీంనగర్ జిల్లాల శనిగరం, మెదక్ జిల్లాల కంఠేపాలెం మొదలగు గ్రామాలల్ల స్థిరపడినారు. వీరి ఆచారవ్యవహారాల్ల, ఆహారపు అలవాట్లల్ల తమిళ పదాలు విరివిగా చోటు చేసుకుంటై. సాపాటు, సాదం, తీర్థం, వెణ్ణె, మోరు, పుళి, కర్యాముదు, పొంగళి, ప్రదమాలు, ద్వితీయాలు, మెళుగు మొదలగు పదాలన్నీ తమిళ పదాలే. వీరు పఠించేవన్నీ, ద్రావిడ ప్రబంధాలే. అందుల నిత్యానుసంధానం, తిరుప్పావై ప్రముఖమైనవి. పెరంబుదూరు, శ్రీరంగం వారి పుణ్యక్షేత్రాలు. దేవదేవీలను పెరుమాండ్లు, ఆండాళ్లు అని పిలుస్తరు.
నుదుట తిరుచూర్ణం, తిరునామాలు నిష్టగా దిద్దుకొని, సంజకెంజాయ రంగులవో లేక ధవళ కాంతుల శ్వేత వస్త్రాలో ధరించి, మెడలో పొగడపూల దండలతో, పువ్వులతో అలంకరించిన అక్షయపాత్రను నడినెత్తిన నిలకడగ నిలబెట్టుకొని సాతాని జియ్యర్లు, ఆళ్వార్లు, మన్నార్లు తొలితొలి వెలుగుల తెల్లవారు జామున హరిలో రంగ హరి అని భక్తి గీతాలు పాడుకుంట లోకాన్ని నిద్ర లేపేటోళ్లు. “చిన్ని కృష్ణ, వెన్నె కృష్ణ, వన్నెల కృష్ణా” అంటూ భక్తి పారవశ్యంతో ఓలలాడేటోళ్లు. తెలతెలవారింది. మునులొచ్చే వేళాయె నల్లని నా సామి మేలుకో. కృష్ణా మేలుకో అని జగత్తును సుషుప్తావస్థ నుండి చైతన్యం వైపు మేల్కొలిపేటోళ్లు. అట్లా ప్రధాన ప్రవాహానికి ఎదురీది, అగ్రకుల ఆధిక్యతను ఎదిరించి వారిని నిరాకరించి, ప్రజలతో మమేకమై, దేశ సంచారం చేసుకుంట తెలంగాణాల తొలి అడుగులు పెట్టినవారు వాళ్ల పూర్వీకులు.
స్వామి రక్తంల అందుకే ఆధిపత్యానికి వ్యతిరేకంగ ధిక్కార స్వరం, పీడిత ప్రజల పట్ల ప్రేమా, వారి కోసం నిలబడి పోరాడే తత్వం, దేశసంచార తత్వం జీర్ణించుకున్నాయేమో! ఆ జన్యుసంబంధ వారసత్వం, పరంపరగ, కాలానుగుణంగ ఉత్తిష్టోత్తిష్టగ పరిణామం చెందుతుందేమో! ఒకప్పుడు భక్తి ఉద్యమాలకు భూమికగ ఉండిన బెంగాల్, మహారాష్ట్ర, పంజాబు రాష్ట్రాలు స్వాతంత్య్రోద్యమ కాలంల అతివాద విప్లవోద్యమాలకు ప్రధాన కేంద్రాలుగ మారటం గమనించదగిన విషయం. ఒకప్పుడు వీరశైవ సంఘ సంస్కరణలకు కాణాచిగ నిలిచిన ఓరుగల్లు వసంతకాల మేఘ గర్జనలకు ప్రతిస్పందించటం కాకతాళీయం కాదేమో!
“వైష్ణవ జనతో తేన కహీఁయే
జో పీడ పరాయె జాణేరే”
(పేద ప్రజల పీడనను గుర్తించిన వాడే నిజమైన వైష్ణవుడు)
* * *
తుఫాను చీకటి రాత్రి. అల్లకల్లోల నడిసముద్రంల నావ. ‘బ్రహ్మపట్నం పోదమంటే దారి తెలియదు అన్నయా. సూటిగా చుక్కాని పట్టి పడవ నడపవే చెల్లెలా’, ‘ఎంతెంత దూరం. చాలా చాలా దూరం.” చిన్నప్పుడు ఒకళ్ల వెనుక ఒకళ్లు. ఒకళ్ల భుజాలు మరొకళ్లు పట్టుకుని అడుగుకుంట, ఆటాడుకుంట పాడిన పాట. సరిగ్గ మళ్లీ ఇప్పుడు ఈ చిమ్మచీకట్ల ఒకరి వెనుకవొకరు నడుస్తున్నరు. నడువంగ, నడువంగ నడిరాత్రి దాటింది. నడిజాము పోయింది. మట్టిబాట, కాలిబాట సాగిసాగి ఒక పెద్ద జాతీయ రహదారిని చేరుకుంది. ఎక్కడున్నారో ఎవరికీ తెలుస్త లేదు. తూర్పు దిక్కున శుక్రగ్రహం కళగ వెలుగుతుంది. దాని ముందు చుక్కలు వెలవెలబోతున్నై. పెద్ద రోడ్డు చేరుకున్నామన్న తృప్తి, ధైర్యం కలిగినై. ఆ తోవ వెంబడి మళ్లీ నడువంగ, నడువంగ ఒక ఊరు మధ్యల బజారును చేరుకున్నరు.
అక్కడ ఒక చిన్న ఇరానీ హోటల్ వాడు అప్పుడే నిద్రలేచి నిద్దర కండ్లతోనే బొగ్గుల పొయ్యి రాజేసి విసనకర్రతోని దానిని విసురుకుంట కూర్పాట్లు పడుకుంట కూచున్నడు. వాని దగ్గరికి పోయి ఇదేం ఊరు అని అడిగినారు. వాడు ఆ గుంపును అనుమానంగ చూసుకుంట ‘కూకట్పల్లి’ అన్నడు. ఆ రోజులల్ల కూకట్పల్లి నగరానికి దూరంగ విసిరేసినట్లున్న ఒక చిన్న గ్రామం. అందరికీ ఆ మాట వినంగనే ప్రాణం లేచి వచ్చింది. ఆప్ లోగు కోన్ హై అని వాడు అడిగినాడు. గోపి తమ గోసంత వానికి ఉర్దూల అర్థం అయ్యేటట్లు చెప్పినాడు. ఆ కథ అంతా విన్నంక వాడు ‘మాఫ్ కర్నా భై. మై ఆప్ కో చోర్ సమ్‌ఝా థా’ అని నిజాయితీగ అనేసరికి అందరూ ఫక్కున నవ్వినారు. వాడూ తమతో పాటు నవ్వినాడు. ఆప్ లోగు మేరా మెహమాన్ హై. మూఁ ధోలో. మై ఆప్ కే లియే ఇస్పెషల్ అద్రక్ కా చాయ్ బనాతా హుఁ అనేసరికి అందరికీ ప్రాణాలు లేచి వచ్చినై.
అందరు హుషారుగ మొఖాలు కడుక్కున్నరు. తూర్పు దిక్కున మందారం ఆర్పరాని అంగారం. చీకటిని చిదిమి వేయటానికి తూరుపు దిక్కున ఆకాశంల సనసన్నని వెలుగురేఖలు. పక్షుల కిలకిలారావాలు. చెట్ల మీది నుంచి వచ్చి పలకరించి, పులకరింపజేసే చల్లని పిల్లగాలులు. ‘ఈ ఉదయం నా హృదయం’ అంటూ ఒక మూల నుండి సన్నని రాగం.
స్వామి మిత్రబృందం ‘దుష్టచతుష్టయం’ కాక అక్కడ ఇంకో ఐదుగురు పంచ పాండవులున్నరు. అంతా కలిపి తొమ్మిది మంది. ‘నవరత్నాలు’. ఆ నవరత్నాలు భోజరాజు ఆస్థానంల రత్నఖచిత సింహాసనాలల్ల కాక ఆ ఉదయం ‘కూకట్లపల్లె’, ‘కుక్కుటాల పల్లె’ కుగ్రామంల అతి బీదసాద ఇరానీ హోటల్ చెక్క బెంచీల మీద ఆసీనులై ఉన్నరు. అప్పుడప్పుడే ఆకాశంల ఉదయించిన సూర్యునికి పోటీగ చెక్క బెంచీల మీద తొమ్మిది తెలంగాణా జిల్లాలకు ప్రాతినిధ్యమోలె తొమ్మిది మంది తెలంగాణా సూర్యుళ్లు. ‘నౌ జిల్లొంకా నారా హై. తెలంగాణా హమారా హై’. అప్పటికింకా రంగారెడ్డి జిల్లా ఏర్పడలేదు.
‘ఈ ఉదయం నా హృదయం’ అని మళ్లీ అదే కూనిరాగం. ఆ రాగం దిక్కు స్వామి దృష్టి సారించినాడు. నవరత్నాలల్ల ఒక రత్నం. సామ నలుపుతో చిన్నగా, దళసరి అద్దాలతో, పైకి ఎగదువ్వి బొంగురం లెక్క ‘బుగ్గ’ తీసిన జుట్టుతో, హుషారుషారు చిర్నవ్వులతో, చాలాకిగా ఐ యామ్ వేణూ సికింద్రాబాద్ ఈవినింగు కాలేజీలో పియుసి స్టూడెంట్ను. సికింద్రాబాద్ రంగ్రేజ్ బజార్ల మా ఇల్లు అంటూ స్వామికి షేక్‌హాండ్ ఇచ్చినాడు. అతడి స్నేహవేణుగానం ఆ చేతి స్పర్శతోనే తెలిసిపోయింది. స్వామి తనను తాను పరిచయం చేసుకున్నడు. మళ్లీ వేణు హీ ఈజ్ మై ఫ్రెండ్ రాజేందర్. మా గల్లీలనే ఉంటడు. అని పక్కనున్న అతణ్ణి పరిచయం చేసినాడు. ఆ రాజేందర్ హలో అన్నట్లుగా చిన్నగ నవ్వినాడు. అతను తెల్లగ, సన్నగ, పొడుగ్గ వున్నడు. ఒక కన్ను కొద్దిగా మెల్ల. గద్ద ముక్కు కింద అతి సన్నని పెదాలు. రాత్రి చీకట్ల ఒకళ్లనొకళ్లు సరిగ్గ చూసుకోలేదు. పరిచయాలు కూడ సరిగ్గ చేసుకోలేదు. పోలీసుల అరెస్టు పుణ్యమా అని దోస్తులైనారు. పరేషాన్ పార్ అయిపోయినంక ఇప్పుడు ఫ్రీగా మాట్లాడుకుంటున్నరు.
“నా పేరు యాదగిరి. గౌలిగూడా బస్ డిపో బస్తీల మా ఇల్లు. యాఖుత్పూరా ధర్మవంత్ స్కూల్ల ఎస్.ఎస్.సి. స్టూడెంట్ను” అని మరో మిత్రుడి స్వపరిచయం. అతను నల్లగా ఉన్నా కళ్లు మాత్రం విశాలంగ, తెల్లగ, తెలివిగ ఉన్నయి. కంటి కింద బుగ్గపైన కత్తితో గీసినట్లు ఒక పొడుగాటి గాటు. రాత్రి నుండి అతడిని స్వామి గమనిస్తనే వున్నడు. వసపిట్టోలె ఎవరితోనో ఒకరితో నిరంతరంగ మాట్లాడుతనే వున్నడు. ఆ మాటల్ల ఊకదంపుడు కాక సమాచార సౌరభం తెలుస్తనే వుంది. ‘మాట్లాడకుండ ఉండటం కంటే మరణించడం మేలు’ అన్నట్లుంది అతని తత్వం. జనరల్ నాలెడ్జి అతని వయస్సును, చదువును మించి పోయినట్లుంది. అట్లనే మిగతా వారి పరిచయాలు కూడా అయిపోయినయి.
యాదగిరి వేణూతో “మీరేదో పాట పాడుతున్నట్లుంది. కొంచెం పెద్దగ పాడి మాకు కూడా వినిపించరా” అని రిక్వెస్టింగుగ అడిగిండు.
“అయ్యో అదేం పాట? అది ఉత్త సీన్మా పాట. మంచి కవిత్వం వినిపిస్తాను. వింటారా?” అన్నడు వేణు.
“వినదగునెవ్వరు చెప్పిన” అంటూ యాదగిరి చెక్క బెంచీ మీద సక్లం ముక్లంగ కూచున్నడు, వినటానికి సిద్ధం అన్న ఫోజుల.
వేణు శ్రీశ్రీ మహాప్రస్థానం ‘కవితా ఓ కవితా’ గేయాన్ని అలవోకగ, తడుముకోకుండ స్పష్టమైన ఉచ్చారణతో, భావయుక్తంగ మొదటి నుండి చివరి దాక వినిపించిండు. ఆ కవిత్వ ధ్వనిని వింటుంటే గలగలా పారే సెలయేరు జ్ఞాపకం వచ్చింది. అంత లాంగు పోయెం ఎట్ల గుర్తు పెట్టుకున్నడో అని ఆశ్చర్యమేసింది. స్వామికి కథలు, నవలలు చదవటం అలవాటే గాని కవిత్వం రుచి అప్పటికింకా తెలియదు. వేణు చదివిన ఆ పోయెంతోటి కొత్త లోకాల కవిత్వం తలుపులు తెరుచుకున్నట్లయ్యింది.
“మీరు కథలు, నవలలు కూడా చదువుతరా?” అని వేణును అడిగిండు.
“ఆఁ! ఎందుకు చదవను? చేతికి దొరికిన ప్రతి దాన్ని కరకరా పరపరా నమిలి మింగి జీర్ణించుకోవడమే మన పని” అని హాస్యంగ అన్నడు.
“కొత్తగ ఈ మధ్య ఏం పుస్తకం చదివినారు?” అడిగిండు స్వామి.
“రాచకొండ విశ్వనాథ శాస్త్రి ‘రాజు-మహిషి’ సీరియల్ మొన్ననే కంప్లీట్ చేసిన”
ఆ మాట వినంగనే స్వామి హృదయం సంతోషంతో గంతులు వేసింది. ఆ నవల సుదీర్ఘ వర్ణనలు, విశాఖ యాస, రచయిత శ్రామిక జన పక్షపాతం స్వామికి చాలా ఇష్టం. అప్పటికే దానిని ఒకటికి రెండు సార్లు చదివినాడు. అంకితమే మహా గొప్పగ వుంటది. ప్రత్యేకంగ నవలల కిళ్లీ కొట్టు వర్ణన స్వామి మరిచిపోలేడు. రావిశాస్త్రిగారి కలకంఠి, ఆరు సారా కథలను అప్పటికే ఎన్నో సార్లు ఔపోసన పట్టినాడు. ఒంటరి బాటసారి మాదిరిగనే స్వామి ఒంటరి పాఠకుడు. అతనికి సాహితీ మిత్రులంటూ ఎవరూ లేరు. సాహిత్యంల అతను ఏకలవ్య శిష్యుడు.
“నేను రాచకొండ అభిమానిని” అన్నడు వెలుగుతున్న కళ్లతో.
“అచ్చా. ఐసా హైతో హాత్ మిలావ్” అని వేణు స్వామికి గట్టిగ షేక్‌హాండ్ ఇచ్చి హఠాత్తుగ కళింగ ప్రాంతపు పాటకజనం యాసల మాట్లాడటం మొదలు పెట్టినాడు. ఆ ప్రాంతపు సాహిత్యాన్ని సునిశితంగ చదివితేనే గాని ఆ యాస పట్టుబడదు. అతను సీరియస్ రీడర్ అన్న సంగతి స్వామికి తెలిసిపోయింది. ఆ యాసభాషలకు అందరూ నవ్వసాగినారు. ఆ నవ్వులు ఆ యాసను హేళన చేస్తూ నవ్విన నవ్వులు కావు. వేణు మిమిక్రీ కళకు సంతోషం పట్టలేక నవ్వే నవ్వులు. అయినా వేణు ఆపటమే లేదు. గంగాఝరీ ప్రవాహమోలె అచ్చు శ్రీకాకుళం అప్పల్నాయ్డు మాదిరిగనే మాట్లాడుతున్నడు. అప్పటికే రేడియోల గణేష్ పాత్రో నాటికలు పావలా, కొడుకు పుట్టాల విని వున్న స్వామి ఆ యాసభాషల్ని అందరి కంటే ఎక్కువ అనందించినాడు.
“నేను కూడా ఒక పద్యం చదువుతను వినండి” అని యాదగిరి మధ్యల చొరబడినాడు.
“టపక్ సుపారీ” అని కిసుక్కున నవ్వినాడు జెఫ్రీ.
“ష్!” అన్నడు అశోక్ కండ్లు పెద్దగ చేసి జెఫ్రీని చూసుకుంట.
జెఫ్రీ తప్పు తెలుసుకుని ‘సారీ’ అన్నడు.
“క్యారీ ఆన్. క్యారీ ఆన్” అన్నరు అందరూ వేణుతో సహా.
అప్పుడు యాదగిరి గొంతు సవరించుకుని, అరచేతితో కుడిచెవి మూసుకుని నాటకం ఫక్కీల ఎడమచేయి చాపి రాగయుక్తంగా:
“బళీ బళీ మా తాత
బల్లెంబు చేబూని
పుల్లాకు తూటుగా పొడిచినాడు.
ఎద్దుచ్చ బోయంగ ఏరులై పారంగ
లంఘించి లంఘించి దుంకినాడు
కలుగులోని కప్ప గుర్రు గుర్రు మనంగ
కటారు తీసుకుని గదిమినాడు
ధర్మపురి కాడ నక్క తరుముక రాగ
కరినగురం దాకా ఉరికినాడు
నిండు వయసుల మూడేండ్లు సాము జేసి
మూలకున్న ముసలమ్మను కొట్టినాడు.
ఔరా ఎంతని చెప్పుదు, ఏమని చెప్పుదు
మా తాత పరాక్రమంబు అద్భుతంబు”
హోటల్ ఓనర్‌తో సహా అందరూ పొట్ట చెక్కలయ్యేటట్లు గొల్లుగొల్లున నవ్వులు. ఇంకా సరిగ్గా ఉదయించని ఉదయం వెలుగుల వెల్లివిరిసిన నవ్వుల పువ్వులు. ఆనందపు హరివిల్లులు. దానితోని కిందటి రాత్రి పరేషాన్ అంతా ‘ఉతార్’ అయిపోయింది.
“మై భీ కుచ్ సునావూఁ భై” అని హోటల్ ఓనర్ అడిగినాడు.
“జరూర్ జరూర్” అన్నడు గోపి.
“ఆషిక్ మర్తే నహీఁ
వో జిందా ధఫ్నాయే జాతే హైఁ
ఖబర్ ఖోద్ కర్ దేఖో
వో ఇంతెజార్ మే రహెతేఁ హై”
“బహుత్ ఖూబ్. బహుత్ ఖూబ్. ఔర్ ఏక్ పేష్ కరో” అన్నడు వేణు.
“ఆస్మాన్ కే తారే కోయీ గిన్ నహీఁ సక్తా
ముఖద్దర్ కీ రోటీ కోయీ చీన్ నహీఁ సక్తా”
“వాహ్వా. వాహ్వా” అని అందరూ ఆమోదాన్ని, ప్రమోదాన్ని తెలిపినారు.
ఇంతల ఎర్ర బస్సు ఒకటి సంగారెడ్డి వైపు నుండి వచ్చింది. అది గౌలిగుడా బస్సు డిపో వరకు పోతుంది. అందరూ హోటల్ ఓనర్‌కు శుక్రియాలు చెప్పినారు అతను కండ్లు చెమరిస్తుంటే ‘అల్లా తుమ్హారే కో సలామత్ రఖేఁ’ అని మనస్ఫూర్తిగ దీవించినాడు. అందరూ బస్సెక్కి సీట్లల్ల కూచున్నరు. కండక్టరు వాళ్ల దగ్గరికొచ్చి టికట్ టికట్ అనంగనే అందరూ ఒకేసారి బిగ్గరగ ‘జై తెలంగాణా’ అని అరిచిండ్రు.
కండక్టరు ముఖమంతా ముడుచుకుని ‘ఇవాల్రేపు మీ ఇస్టూడెంట్లదే రాజ్యం నడుస్తాంది’ అంటూ గొణుక్కుంటూ తన సీట్లకు వెళ్లి కూలబడ్డడు.
బస్సు నడుస్తుండంగనే వేణు స్వామి, యాదగిరిల ఇంటి అడ్రసులు రాసుకున్నడు.
“బస్సు డిపో వెనకనే మా ఇల్లు చెప్పిన గద. మా ఇంటి ముందు ఒక సర్కారీ నల్ల ఉంటది. ఆ సంగతి గుర్తు పెట్టుకో. సర్కారీ నల్లా బారా గంటా ఖుల్లా” అని మరొక్కసారి నవ్వించిండు యాదగిరి వేణును, స్వామిని. “తప్పకుండ రావాలె” అని చేతిల చేయి వేయించుకొని మాట తీసుకున్నడు స్వామి దగ్గర.
డిపోల బస్సు ఆగంగనే దిగేసి “ఫిర్ మిలేంగే, సీయూ” అని చేతులు కలుపుకుని విడిపోయినారు.
ఉద్యమం పుణ్యమా అని స్వామికి తన ప్రవృత్తికి సంబంధించిన దోస్తులు దొరికినారు.
… తరువాత భాగం ఒచ్చే వారం




హైదరాబదు నగరంలొ ఇరానీ హొటల్ల్ గురించి ఇతర ప్రదేశాలు బాగ వివరించారు.
“ఆస్మాన్ కే తారే కోయీ గిన్ నహీఁ సక్తా
ముఖద్దర్ కీ రోటీ కోయీ చీన్ నహీఁ సక్తా”
ఇక హైదరాబదు నగరము యెవరి రొట్టెముక్క /కేకు అవుతుందొ చూడాలి.
అబ్బ!! ఎంత బాగ రాసినవ్ !!శానా బాగుంది.తెలంగాన భాషను ఖూని చేస్తున్రు ఈ ఆంధ్రోల్లొచ్చి.