సలాం హైద్రాబాద్ : ఎనిమిదో భాగం
డిసంబర్ 21st, 2009 by డిస్కవర్ తెలంగాణ
8
స్వామి ఇంటికి చేరుకొనేసరికి ఇంట్ల ‘భూకంపం’ వచ్చినంత పరిస్థితిని గమనించాడు. క్రిందటి రాత్రి స్వామి ఇంటికి రాకపోయేసరికి ఇల్లంత అతలాకుతలం అయిపోయింది. పోలీసులు అరెస్టు చేసి జైల్ల పడేసినారేమో, కాకపోతే ఏదైనా టక్కర్ అయ్యి దెబ్బలు తగిలి దవాఖాన్ల పడిండేమో అని అమ్మ ఏడుపులు. అరుపులు. నెత్తి కొట్టుకొని క్రింద నేలపై పడిపోయింది. స్వామి గురించి భయమేందోగని బాపుకు అమ్మను సముదాయించడమే కష్టమైపోయింది. ‘నా కొడుకును సక్కగ ఇంటికి తీసుకు రాకపోతివో నీ ముందే నా ప్రాణమిస్త’ అని పెరుమాండ్ల పటాలు నిలబెట్టిన గద్దె ముందు తలకొట్టుకునేసరికి ఆమె నొసటికి దెబ్బ తగిలి బొడిపెలు వచ్చినై. ఆ తర్వాత శాంతించి తమ ఇలవేలుపు చిల్పూరుగుట్ట బుగులు వెంకటేశ్వర స్వామికి ముడుపు కట్టింది.
చిల్పూరుగుట్ట జనగామ మడికొండకు మధ్య దారిల స్టేషన్ ఘణపురం దగ్గర ఉంటది. అక్కడ దేవుడు భీకరంగ ఉంటడు. కావున బుగులు వెంకటేశ్వర్లు అని పేరొచ్చింది. కట్టిన ముడుపులు తీర్చకపోతే వెంటనే తన ప్రతాపం చూపిస్తడు. ప్రతీకారం తీర్చుకుంటడు. భక్తుల గండెలల్ల బుగులు పుట్టిస్తడు కావుననే బుగులు వెంకటేశ్వర్లని పేరు మోసిండు.
ఇంట్లకు అడుగుబెట్టిన స్వామిని చూడంగనే అమ్మ మళ్ల శోకాలు మొదలు పెట్టింది. “మీ కోసమే బతుకుతున్నన్రా పెద్ద నాని. పోయినోళ్లు పోంగ, పోంగ జిక్కినోళ్లు మీరే. మీ మీదే ఆశలు పెట్టుకొని బతుకుతున్న. నా మాట ఇనకపోతివో ఇక నాకు బలిమి చావే గతి.”
బాపుకు కోపమొస్తే ఉర్దూల తిట్టటం ప్రారంభిస్తడు. బడిల పిల్లలను తిట్టే అలవాటు కదా! “సువ్వర్ కే బచ్చే, నా లాయక్. కాళ్లు ఇంట్ల నుండి అవుతల బెట్టితివో కాళ్లు ఇరగ్గొట్టి ఇంట్ల మూలకు కూచోబెడ్త. బేవకూఫ్.”
ఆ శోకాలు, ఆ హెచ్చరికలన్నీ స్వామికి ఈ చెవుల నుండి ఆ చెవులకు- బయటికి పోతున్నయి. దబదబ బాయి దగ్గరకు పోయి బొక్కెనతోటి నీళ్లు చేదుకొని కాళ్లు చేతులు డుక్కొని సాపాటుకు వంటింట్లకు చొరబడినాడు.
స్వామి అమ్మనాన్నలది కూడ తప్పేం లేదు. జీవితంల వాళ్లు పడిన కష్టాలు, చేదు అనుభవాలు స్వామి విషయంల వాళ్లు అతి జాగ్రత్త తీసుకొనేటట్టు చేసినాయి. “పోయినోళ్లు పోంగ, పోంగ జిక్కినోళ్లు మీరు” అని అమ్మ అంగలార్చటం వెనుక పెద్ద కడుపు దుఃఖం ఉంది. కన్నీటి కథ ఉంది. ఆమె మొత్తం పదిమందిని కంటే ఆరుగురు మాత్రమే ఈ భూమ్మీద బతికి బట్టకట్టినారు. అండ్ల ముగ్గురు ఆడపిల్లలు. ముగ్గురు మొగపిల్లలు. ఆడపిల్లలే పెద్దోళ్లు. మొగపిల్లలందరూ చిన్నోళ్లు. మొగపిల్లలల్ల స్వామి పెద్దోడు. స్వామి బాపు ఉద్యోగం తొలిదశ అంతా హైద్రాబాద్‌ల భాగంగ ఉన్న ‘బిదర్ సుభా’ల గడిచింది. సింగల్ స్కూల్ టీచర్‌గ అనేక కుగ్రామాలల్ల పనిచేసినాడు. పదిహేను సంవత్సరాలు పనిచేసి 1948 పోలీసు యాక్షన్ జరిగిన తర్వాత సిఫారస్ మీద పట్నానికి బదిలీ అయినాడు. కాని ఏం లాభం? అప్పటికే ఆ గడ్డ మీద ఒక మొగపిల్లవాడ్ని, ఇద్దరు ఆడపిల్లలను బొందపెట్టి రావాల్సి వచ్చింది. రత్నాలవోలె, ముత్యాలవోలె అందమైన బిడ్డలు. వాళ్లెవరూ రెండు మూడు సంవత్సరాల కన్న ఎక్కువ బతుకలేదు.
నిజానికి రెండో ప్రపంచయుద్ధమే (1939-45) వాళ్లను పొట్టన పెట్టుకున్నది. కరువు, ఆకలి, అనారోగ్యం, డాక్టర్లు - ఆధునిక వైద్యం అందుబాటుల లేని పరిస్థితులు వాళ్లను బలి తీసుకున్నయి. అయితే స్వామి అమ్మ మాత్రం ఆ కన్నడ ప్రాంతాలల్ల ఉండే ‘బాణామతి’ తన బిడ్డలను మింగేసిందని గట్టిగ నమ్ముతది.
రెండవ ప్రపంచ యుద్ధ కాలంల దేశం మొత్తం ఆర్థిక మాంద్యానికి గురైంది. ముఖ్యంగ తిండిగింజలకు కరువొచ్చింది. ఆ దెబ్బకు హైద్రాబాద్ సంస్థానంల ఉండే ప్రజల జీవితాలు అతులాకుతలమైపోయినాయి. రేషన్ వ్యవస్థ ప్రవేశపెట్టబడింది. దానినే సామాన్య ప్రజలు ‘రాషన్’ అనేటోళ్లు. రాషిన్ కారట్ల మీద బియ్యం దొరకడం అపురూపమైంది. ఆ కారట్ల మీద దొడ్డు బియ్యాన్ని పరిమితంగ ఇచ్చేటోళ్లు. ఆ అన్నం ముద్ద నోట్లె పెట్టుకుంటే నోట్లె గుడాలు పోసుకున్నట్లే ఉండేది. వొయిక్ వొయిక్‌మని వోకిలింతలు వచ్చేవి. వరంగల్లు సన్నబియ్యం మల్లెపూలలాంటి పూలపూల అన్నం కమ్మగ కడుపు నిండ తిన్న స్వామి తల్లిదండ్రులు ఆ కొర్రబియ్యపు అన్నం ఒక ముద్ద కూడ తినలేకపోయేటోళ్లు. బీదర్ అసలే రొట్టెల దేశం. అది కూడ పచ్చ జొన్న రొట్టెలే. మూడు పూటలు అవే తినాలె. అలవాటు కాక కడుపునొప్పి, అజీర్తి, దస్తులు అయ్యేటివి. అజీర్తికి విరుగుడుగా వాళ్లిద్దరు పాన్ అలవాటు చేసుకున్నరు. ఆ అలవాటు జీవితాంతం ఒక దురలవాటుగ మారింది.
మంచిరకం సన్నబియ్యం హైద్రాబాద్ పట్నంల మార్వాడీ సేట్లు చోర్‌బజార్‌ల చాల పిరియంగా (ప్రియంగ, ఎక్కువ ధరకు) అమ్మెటోళ్లు. అట్ల కొన్న దొంగ బియ్యాన్ని ఒక మెత్తల రహస్యంగ దాచుకొని రైలుల బాపు బీదర్‌కు తెచ్చెటోడు. పోలీసు జవాన్లు మధ్య స్టేషన్లల్ల చెక్ చేసి ఆ కొంచెం బియ్యాన్ని కూడ గుంజుకునేటోళ్లు. మీది నుండి జుర్మానాలు, చాలానాలు విధించెటోళ్లు. అట్ల తీసుకొచ్చేటందుకు ‘ఖానూన్’కు ఖిలాఫ్‌గ పోలేని ఆ మాష్టర్ సాబ్ బాగ భయపడెటోడు. ఆ పని స్మగ్లింగు కిందికి వస్తది కావున ఇజ్జత్ కా సవాల్ అని ఆయన భయం.
రాషన్ కష్టకాలం గురించి చాల సంవత్సరాలు ప్రజలు మర్చిపోలేదు. దానిని ఒక పీడకలగా, కథలుకథలుగ అమ్మాబాపులు తమ పిల్లలకు చెప్పెటోళ్లు. బియ్యం దొరకకపోయ్యేవి. ఇక షక్కరనైతె ఆకాశంల అందని చందమామనే. నల్లబెల్లం ‘చా’నే గతి. శనగపిండి, జొన్నలు, మక్కలు, మంచినూనె మాత్రం పుష్కలంగ దొరికేవి. స్వామి అమ్మ శనగపిండితోటి డబ్బాల కొద్ది మడుగూలు చేసేది. కర్జెలు, అరిసెలు, సకినాలు కూడ చేసేది. జొన్నరొట్టెల బదులు ఆ అప్పాలనే తినెటోళ్లు. అయినా అవి ఎన్ని తిన్నా అన్నం తిన్న తృప్తి రాకపోయేది. సగం రాత్రి అయ్యేసరికి మళ్లీ ఆకలయ్యేది, నిద్ర పట్టకపోయేది. కడుపుల పేగులు ఒర్లుతుంటే బాపు మళ్లీ లేచి మడుగూలో, సకినాలో తినెటోడు. ఆ కటకట చప్పుళ్లకు అమ్మకు నిద్ర చెదిరి మేల్క వచ్చేది. అర్ధాకలితో వాళ్లకు నిద్ర లేని రాత్రులు ఎన్నెన్నో.
సరియైన పౌష్ఠికాహారం లేక అమ్మకు పాలు రాక పిల్లలు బలహీనతతో రోగాల బారినపడి నవిసినవిసి చివరికి మృత్యువు ఒడిలకు చేరుకున్నరు. మొక్కజొన్న గింజలను ఎండబెట్టి ఇసుర్రాయిల వేసి ఇసిరి ఆ రవ్వపిండితో ‘కణియ’ (గట్క) చేసుకునేటోళ్లు. కూరగాయలు దొరకకపోయేవి. పాలు, పెరుగు మాత్రం సమృద్ధి కావున ఆ కణియలో పెరుగు కలుపుకొని తినెటోళ్లు. ఆ రోజులల్ల అప్పటికి పాలు, పెరుగు అమ్మి పైసలు సంపాదించే వ్యాపారసంస్కృతి పల్లెలకు పాకలేదు. ముంత పట్టుకొని ఎవరింటికి పోయినా వాటిని ఇచ్చెటోళ్లు. రెండు గుప్పిళ్ల మంచి బియ్యంతోటి సగం కుండల గంజి కాచి, రాత్రంత చల్లారబెట్టి తెల్లారి పొద్దున అండ్ల ఉల్లిపాయలు వేసి పాత చింతకాయ తొగితోటి నంచుకుంట దానిని జుర్రెటోళ్లు. ఆ గంజిని ‘తరవాణి’ అనెటోళ్లు. బాపు బడికి రెండు జొన్న రొట్టెలు, ఇంత బెల్లం గడ్డ తోషాదాన్‌ల (టిఫిన్ డబ్బా) పెట్టుకొని పోయేటోడు.
చిన్నపిల్లలకు సరియైన తిండి, తల్లిపాలు లేక రకరకాల రోగాలు వచ్చేవి. పల్లెటూళ్ల అపరిశుభ్ర పరిస్థితుల వలన, టీకాలు వేసే సౌకర్యం లేనందున గత్తర (ప్లేగు), దొమ్మరోగం (న్యుమోనియా), పాండురోగం (ఎనిమియా), అమ్మవారు (మశూచి), కక్కుడుకాళ్లకు (కలరా), నంజుబుడ్డలు (ట్రాన్సిల్స్), చలిజ్వరం (మలేరియా) రోగాలు వచ్చేవి. పోలియోతో ఎంతో మంది పిల్లలకు అంగవైకల్యం సంభవించేది. ఇంటింటికి పోలియో బాధితులు కనబడేటోళ్లు. ఎగిరిదుంకి ఆటలు ఆడవలసిన పిల్లలు కుంటుకుంట, దేకుకుంట కనబడేటోళ్లు. ఎండకాలం వస్తే సన్నిపాతం (టైఫాయిడ్) జ్వరం సరేసరి. ఈగలు, దోమలు, నల్లులతో పేదలు సతమతమయ్యెటోళ్లు.
ఫ్లష్ టాయిలెట్లు లేనందున ప్రతి ఇంట్ల ఈగలు జుమ్మని తిరుగుతుండేవి. పక్క బట్టలల్ల, బొంతలల్ల, గోడపొక్కలల్ల నల్లులు. అవి కుట్టుతుంటే రాత్రి పూట నిద్ర రాక దీపం వెలుగుల వాటిని చంపుకుంట కూచునెటోళ్లు. ఎలుకలతోటి గత్తర లేచేది. చంకలల్ల గడ్డలై, నోరంత పూతపూసి వారం లోపలనే రోగి చనిపోయెటోడు. గత్తర వ్యాధి తొలుత ఎలుకలకు వచ్చేది. ఇంట్ల ఎలుకలు చావటం మొదలు కాంగనే డొక్కలమ్మ (గత్తర) వచ్చిందని ఇండ్లు వదిలి పారిపోయెటోళ్లు. గత్తర రోగం తగిలినోళ్లను అట్లనే ఇండ్లల్ల ఉంచెటోళ్లు. సర్కారోళ్లే ఇండ్లను బలవంతంగ ఖాళీ చేయించి ఊరవతల గుడిసెలు వేయించి ప్రజలను అండ్ల ఉంచెటోళ్లు. గత్తరొస్తే ప్రజలు బేగర్, బేసహారా అయ్యెటోళ్లు. ఈ గత్తర హైద్రాబాద్‌ల కూడ వ్యాపించింది.
గ్రామాలల్ల ఏ రోగమొచ్చినా డాక్లర్లు అందుబాటుల లేకపోయేది. నాటుమందులు, చెట్లమందులు, పసర్లు, లోహపు భస్మాలే గతి. రోగి చచ్చే స్థితిలో ఉన్నప్పుడు ‘ఇంగ్లీకాన్ని’ ఇచ్చేటోళ్లు. ధనుర్వాతానికి వాతలే మందు. ఎర్రగ కాలుతున్న చుట్టతోటి శరీరంల అనేక చోట్ల కాల్చెటోళ్లు. చిన్నపిల్లలకు మలబద్దకం వస్తే నాలుగైదు రోజులు చూసి ఒక కట్టెపుల్లకు చింతపండును బాగా ముద్దలాగ అంటించి వారి ఆసనాలల్ల బలవంతంగ దూర్చెటోళ్లు. భయంతోటి, బాధతోటి, మంటతోటి పిల్లలకు చెమటలు వచ్చి లబ్బలబ్బ మొత్తుకొన్నా చాలాసేపు ఆ కట్టెపుల్లను అట్లనే వుంచెటోళ్లు. తర్వాత ‘సాఫ్’గ కాలకృత్యం జరిగేది. కాని పిల్లల మనుస్సులల్ల భయం ‘ఫిక్సేషన్’ అట్లనే కూచుండిపోయేది. చిన్న పిల్లల కాలకృత్యాల మీద మనస్తత్వ శాస్త్ర సిద్ధాంతాలు రాసిన సిగ్మండ్ ఫ్రాయిడ్‌కు ఈ ఘోరం తెలిస్తే తట్టుకోలేక ఆత్మహత్య చేసుకునేవాడేమో!
మామూలుగా దగ్గు, పడిశెం చేస్తే వోమను బాగ కాలిన పెనం మీద వేయించి గుడ్డల దానిని మూటగట్టి అది వేడి మీద ఉండంగనే ముక్కు దగ్గర పెట్టి గట్టిగ లోపలికి శ్వాస పీల్చమనెటోళ్లు. ముంతపొగ శిక్షకు ఆ వైద్యం దగ్గరగ ఉండేది. దస్తులు అయ్యి ఆసనం నొప్పి పెడితే నిప్పుల పొయ్యిల ఇటుకబెడ్డను బాగ కాల్చి దానికి గుడ్డ చుట్టి పిల్లలను దాని మీద కూచుండబెట్టెటోళ్లు. చీమిడి పోయేందుకు ముక్కుల నెయ్యి, చెవిపోటు తక్కువయ్యేందుకు చెవుల నాటుసారా చుక్కలను లేదా మంచినూనె చుక్కలను వెసెటోళ్లు. డాక్టర్లు లేక, పైసలు లేక శతకోటి రోగాలకు అనంతకోటి వైద్యాలు. ఒక్కొక్కసారి అవి వికటించి పిల్లల ప్రాణాలు పోయేవి.
‘మనోహరుడి’ ప్రాణం అట్లనే పోయింది.
చందమామలాంటి బిడ్డ. పనసపండులాంటి అందమైన బిడ్డ. ఇంక పుట్టు వెంట్రుకలు తీయలేదు కావున జులపాల జుట్టు భుజాల మీదికి అందంగ జాలువారుతుండేది. అమ్మాబాపులకు పుట్టిన సంతానంల మొదటి మొగబిడ్డ. రెండూ రెండున్నర సంవత్సరాల వయస్సు. వాడి వెంట్రుకలను తమ ఇలవేల్పు చిల్పూరు బుగులు వెంకటేశ్వరస్వామి గుట్ట మీద తీయాలని అనుకున్నరు. కాని అందుకోసం పెద్ద ఎత్తున అయ్యే ఖర్చుకు పైసలు చాలక ఆలస్యం చేసినారు. ఆ ఆలస్యమే వాడి ప్రాణాలను తీసిందని అమ్మ అనుమానం.
ముందు వాడికి చెవుల చీము కారటం మొదలైంది. అది తగ్గాలని చెవుల మంచినూనె, సారా చుక్కలను వేసినారు. దానితో ఇన్‌ఫెక్షన్ ఎక్కువై చీమూ రక్తం కారి కారి మొత్తం పక్కబట్టలు అన్నీ తడిచిపోతున్నయి. నొప్పితో పిల్లవాడు ఒక్కటే ఏడుపు. రాత్రిపూట నిద్రలు లేవు. ఆ మారుమూల కుగ్రామంల వైద్యుడు లేనిచోట ఏం చేయాల్నో అమ్మాబాపులకు తోస్తలేదు. హైద్రాబాద్‌కు తీసుకుపోదామంటే చేతిల పైసలు లేవు. అమ్మ ధైర్యం చేసి తన చెవులకున్న వజ్రాల దుద్దులను గిరివి (తాకట్టు) పెట్టమని బాపుకు అందజేసింది. ఆ పైసలతోటి పట్నం చేరుకున్నరు.
స్వామి అమ్మకు ఒక్కడే అన్నయ్య. ఆయనిల్లు యాకుత్‌పురా, రైన్‌బజార్ల ఉంది. ప్రతిరోజు అక్కణ్నించి అంత దూరం, ఎర్రటి ఎండలల్ల కాళ్లీడ్చుకుంట ఉస్మానియా దవాఖానాకు పోయెటోళ్లు. అప్పటికింకా పట్నంల సైకిల్ రిక్షాలు రాలేదు. సైకిల్ రిక్షాలు పోలీసు యాక్షన్ జరిగిన తర్వాత వచ్చినై. అప్పటికి మనిషి చేతులతోటి గుంజుకొని పోయే టాంగాలు వుండేవి. ఆ టాంగాల పోయెటందుకు పైసలు చాలక అమ్మాబాపులు ఆ రోగిష్టి కొడుకును ఒకళ్ల తర్వాత ఒకళ్లు భుజాల మీదికి ఎత్తుకొని ఉస్మానియా దవాఖానాకు ప్రతి రోజు తీసుపోయెటోళ్లు. ఆప్పటికే ఇన్‌ఫెక్షన్ మెదడుకు కూడా పాకింది. తలంత పచ్చిపుండుగ మారిపోయింది. చీమూరక్తం కారికారి చెవుల, తలల బొయ్యారం (ఖాలీస్థలం) ఏర్పడింది. ఆ దవాఖానాల డాక్టర్లు పొడుగైన సీకుతోటి చెవ్వు శుభ్రం చేస్తుంటే ఆ నొప్పికి తట్టుకోలేక వాడు ఏడ్చెటోడు. బెహోష్ అయిపోయేటోడు. ప్రతిరోజూ ఆ దవాఖానకు పోయి ఆ వైద్యం చేయించుకోవాలె. దూరం నుండి ఆ దవాఖానాను చూడంగనే వాడు ‘అమ్మా వొద్దే. వొద్దు. ఇంటికి పోదాం’ అని దయనీయంగ ఏడ్చెటోడు. భయంతోటి వణికిపోయెటోడు. వాడి అవస్థను చూడలేక అమ్మాబాపులు కూడ ఏడ్చెటోళ్లు. ఎందుకనో ఆ వైద్యం సగంలనే ఆగిపోయింది. మళ్లీ వాళ్లుండే ఊరు ‘సింగితానికి’ వచ్చేసినారు.
ఆ ఊళ్లె ‘దుద్దాల ముత్తయ్య’ అని ఒక మంత్రగాడు ఉండెటోడు. మంత్రతంత్రాలతోటి రోగాలను, నొప్పులను నయం చేసెటోడు. ‘బాణామతి’ కూడ చేస్తడని అందరు గుసగుసగ చెప్పుకుంట వాడంటే భయపడెటోళ్లు. చేతబడి చేసే మంత్రగాళ్లు ప్రతి అమవాస్య, పున్నమి రోజులల్ల తమ విద్యను ప్రదర్శించెటోళ్లు. బాణామతి చేయటానికి చంద్రగ్రహణం చాల అనుకూలమైన రోజు. తమకు వచ్చిన క్షుద్రశక్తుల విద్యను పరీక్షించుకునేటందుకు చాల సరైన రోజు. ఎవరి మీద పగ, ప్రతీకారం లేకపోయినా సరే క్షుద్రశక్తులను సంతోషపెట్టటానికి, తమ క్షుద్రవిద్యను ప్రయోగించి దాని ఫలితాన్ని చూసి సంతృప్తి చెందటానికి బాణామతి చేసెటోళ్లు. ఆ ప్రయోగానికి లక్ష్యాలుగా చిన్న పిల్లలను ఎంచుకునెటోళ్లు. మొగపిల్లల మొదటి పుట్టు వెంట్రుకలు, చేతి, కాలివేళ్ల గోళ్లు, వారు వేసుకున్న పాతబట్టలు దొరికితే వాళ్లకు చాల సంతోషం. తమ ప్రయోగాన్ని సులభంగ అమలు చేయొచ్చు. ఆడపిల్లల తొలి రజస్వల మైలగుడ్డలు లభిస్తే వాళ్ల క్షుద్రవిద్యలకు బలం వచ్చేది. చేతబడి, బాణామతి రెండు వేర్వేరు విద్యలు. చేతబడికి గురైనవాళ్లు దీర్ఘకాలంల రకరకాల రోగాలు, నొప్పులు, మానసిక భయాలతోటి కృంగికృశించి మెల్లమెల్లగ మరణిస్తరు. కాని బాణామతి అట్ల కాదు. ఆరోగ్యంగ ఉన్నవాళ్లు కూడ మొదలు నరకబడిన పచ్చని చెట్టువోలె కుప్పకూలి మరణిస్తరు. చిత్రవిచిత్ర హింసలకు గురై ప్రాణాలు విడుస్తరు.
‘మనోహరుడు’ సరిగ్గ అట్లనే చనిపోయినాడు.
ఈ బాణామతి సంగతులన్ని అమ్మాబాపులకు తెలువదు. చంద్రగ్రహణం ఇంక కొన్ని రోజులుందనంగ దుద్దాల ముత్తయ్య వాళ్లింటికి వచ్చినాడు. అనుకోకుండ అకస్మాత్తుగ వచ్చిన ఆయనను చూసి వాళ్లు బీరిపోయినారు. అయినా మర్యాద కోసం ‘చా’ చేసి ఇచ్చినారు. చా తాగినంక వాడు చిన్నగ అసలు సంగతి చెప్పినాడు. పిల్లగాడి సుస్తీని నయం చేస్తనని దానికోసం పిల్లవాని పుట్టువెంట్రుకలు, చేతికాలివేళ్ల గోళ్లు కత్తిరించి ఇవ్వమని అడిగినాడు. అమాయకులైన ఆ తల్లిదండ్రులు కొడుకు ఆరోగ్యం బాగుపడతదనే సంతోషంల కత్తెరతోటి పుట్టువెంట్రుకలు, గోళ్లు కత్తిరించి ఇచ్చినారు. అట్లనే వాడు వేసుకొనే అంగీలాగూ కూడ ఇవ్వమని అడిగినాడు. అవి కూడ ఇచ్చినారు. అవన్నిటినీ మూట గట్టుకొని వాడు సంతోషంగ వెళ్లిపోయినాడు.
కొన్ని రోజుల తర్వాత స్వామి అమ్మ ఆ సంగతిని తన అమ్మకు చెప్పంగనే ఆ ముసలమ్మ ‘అయ్యో ఎంత పనిచేసినవు బిడ్డా!’ అని నెత్తినోరు కొట్టుకొని ఏడ్చింది. కాని అప్పటికే పరిస్థితి చెయ్యి జారిపోయింది.
చంద్రగ్రహణం రోజు మంత్రగాడు పొద్దటి నుంచి పచ్చి మంచినీళ్లు కూడ ముట్టడు. శుచీశుభ్రంగ ఉండి క్షుద్రశక్తులను పూజిస్తడు. చీకటి కాంగనే ఒక ఎర్ర బట్టల తన సేకరించిన పుట్టువెంట్రుకలు, గోళ్లు, పాతబట్టలను రజస్వల అయినోళ్ల మైలబట్టలను ప్రత్యేకంగ మూట కట్టుకుంటడు. ఇంకోసంచిల మాంసం, మద్యం (కల్లు లేదా సారా) ఇతర వస్తువులు సదురుకొని మంచి వయస్సుల ఉన్న ‘శివసత్తి’ని వెంటబెట్టుకొని పెంజీకట్లుండంగనే స్మశానానికి చేరుకుంటడు.
దక్షిణం దిక్కు అనువైన చోటు కూచొని క్షుద్రశక్తులను ఆవాహన చేస్తడు. వాటన్నిటిని ఒక్కటొక్కటిగా రప్పిస్తడు. చివరికి ఆ దుష్టశక్తులన్ని శివసత్తి ఒంటి మీదకు వస్తయి. అది తన ఒంటి మీద ఉన్న బట్టలన్ని విప్పేసి జుట్టును జలపాతంలాగ విరబోసుకుని నగ్నంగ తాంత్రిక ముద్రల సక్లంముక్లం కూచుంటది. మంత్రగాడు దాని చుట్టు ఒక పెద్ద ముగ్గు వేస్తడు. ఆ ముగ్గు వేయడం పూర్తి కాంగనే ఆ ముగ్గు పరిధిల భూమిలోపల తొర్రలల్ల దాక్కున్న పాములు, తేళ్లు, జెర్లు లాంటి విషప్పురుగులన్ని బిలబిల బయటకు వచ్చి బిరబిర దూరదూరంగ పారిపోతై. మంత్రగాడు మైల తుత్తం, విషముష్టి గింజల పిండిని కలగలిపి నీళ్ల బదులు జిల్లేడు ఆకులు, మొక్కల రసం కలిపి ఒక బొమ్మను తయారు చేస్తడు. ఆ బొమ్మకు జాగ్రత్తగ తను తెచ్చిన పుట్టు వెంట్రుకలను, గోళ్లను అతికించి పాత బట్టలను చింపి ఆ పేలికలను బొమ్మకు చుట్టబెడతడు. ఆ ముగ్గుల ఒక మూలల దానిని నిలబెడతడు. ఇప్పుడది ఒక కీలుబొమ్మ. ఆ బొమ్మ లోపలి అంగాలను ఎట్ల చిత్రహింసలు పెడితే అవతల అక్కడ ఊళ్లె ఉన్న మనిషి అట్లనే ఆ చిత్రహింసలకు లోనైతడు.
బాణామతి చేసే మంత్రగాడు తను తెచ్చుకున్న మాంసాన్ని, మద్యాన్ని శివసత్తితో కలిసి కడుపు నిండ తిని, తాగి అక్కడే ఆ ముగ్గు పరిధిలనే చాలసేపు శివసత్తితో చిత్రవిచిత్ర భంగిమలతో రమిస్తడు. ఎంత సేపు గంటల తరబడి రమించినా వాడికి స్కలనం కాదు. అఘోర శాఖకు చెందిన తాంత్రికులు ‘ఊర్ధ్వముఖులు’ వంగదేశం తాంత్రికులకు తమ లక్ష్యాన్ని ఛేదించటానికి మద్యం, మాంసం, మగువ తప్పనిసరి అనుపానాలు. వేగుచుక్క పొడిచే ‘కలికి గాంధారి’ వేళల్ల రతిని ఉపసంహరించి బాణామతి ప్రయోగానికి పూనుకుంటడు.
మనోహరుడి చెవు బాధ అట్ల వుండంగనే మీది నుండి అమ్మవారు కూడ సోకింది. ఒంటి నిండ పూత పూసింది. ముత్యాల మాదిరిగ ఒళ్లంత తెల్లటి గుండ్రటి పుండ్లు. శరీరం మీద వేలుబెట్ట సందులేదు. మంటలు, మంటలు అని పొర్లుతున్నడు. ఏదో చెట్టు బెరడును ఉడకబెట్టి ఆ కషాయాన్ని ఒంటికి పూస్తే చల్లగుంటదని ఎవళ్లో చెప్పినారు. అట్లనే చేసేసరికి మంటలు ఇంక ఎక్కువై వాడు మరింత అరిచినాడు.
తెల్లవారి చంద్రగ్రహణం.
ఇక ఆ రాత్రంత ఆ పిల్లవాడి బాధ వర్ణనాతీతం. కనుగుడ్లు సీసపు గోళీలవోలె ముందుకు పొడుచుకొచ్చినై. కాళ్లూ చేతులు ఎవరో మెలిపెడుతున్నట్లు వొంకర్లు పోతున్నయి. ఇంక మెడనైతే గుండ్రంగ బంతివోలె ఆగకుండ తిరుగుతుంది. నాలుక తస్సతస్స కొరుక్కుంటుంటె రక్తం ధారాపాతంగ నోట్లె నుండి ఇవతలికి కారుతుంది. కింద పక్క మీద అటూఇటూ పొర్లుతు ఎగిరెగిరి పడుతున్నడు. ఆ యమబాధను చూడలేక బాపు ఏడ్చుకుంట బయటికి ఉరికినాడు. అమ్మా అమ్మమ్మలు వాడి పక్కనే కూర్చున్నరు. ‘అమ్మా! వాడి బాధను నేను చూడలేను. నువ్వే గొంతు పిసికి వాణ్ణి చంపెయ్యి’ అని అమ్మ అమ్మమ్మ ఒడిల తల పెట్టుకొని ఏడ్చింది.
తెల్లవారేసరికి మనోహరుడు రోగాలు, నొప్పులు, బాధలు లేని లోకానికి వెళ్లిపోయినాడు.
బాణామతి సంగతి తెలిసి ఆ ఊరివాడే అయిన బాపు జిగ్రీదోస్తు ‘సూగయ్య’ ఒక పెద్ద లాఠీ పట్టుకొని తన అనుచరులతోటి దుద్దాల ముత్తయ్య ఇంటి మీదికి దాడి చేసినాడు. కానీ ఆ ఇంటికి తాళం కనబడింది. పెండ్లాం, పిల్లలతో సహా మాయమైనాడు. శివసత్తి స్మశానంల శవమై నగ్నంగ తేలింది. దాని చుట్టు పాములు, తేళ్లు, జెర్లు, మండ్రగబ్బలు.
దేశం కాని దేశంల తొలిచూలు కొడుకును బొందపెట్టి ఇంక ఆ ఊళ్లె ఉద్యోగం చేయటం ఇష్టం లేక మరో ఊరికి ‘రేజింతలకు’ బదిలీ చేయించుకున్నడు. సామానంత ఒంటెద్దు బండిల నింపుకొని తమ కొడుకు పుట్టిపెరిగిన ఇంటిని, ఆడుకొన్న ఆవరణను వెనకకు తిరిగి మర్లమర్ల చూసుకుంట స్వామి అమ్మాబాపులు బండి వెంబడి నడుస్తున్నరు.
కుక్క ఒకటి వాళ్లను వెంబడిస్తున్నది. ‘పో, పో’ అని ఎంత చెప్పినా అది వింటలేదు. ఆ కుక్క మనోహరుడితో కలిసి ఆడుకున్న కుక్క. బహుశా వాడి వయస్సు, దాని వయస్సు ఒక్కటేనేమో! అదీ, వాడు ఒక్కరినొక్కరు బాగ ముద్దు చేసుకునెటోళ్లు. వాని కాళ్ల దగ్గర్నే అది పండుకొని నిద్ర పోయేది. వాడు దానికి రొట్టె ముక్కలు వేసెటోడు. అమ్మాబాపుల బాధ ఆ మూగజీవానికి తెలిసినట్టుంది. వద్దన్నా వినకుండ వాళ్లకు వీడ్కోలు ఇచ్చెటందుకు ఊరవతలి వరకు వచ్చింది. బండి బతుకుబాట మీదికి ఎక్కంగనే అది అక్కణ్నే ఆగిపోయింది. బండి దూరమవుతుంటే తల ఎత్తి విషాదంగ ఏడుస్తుంది. సుదీర్ఘమైన దాని ఏడుపు వాళ్లను చాలసేపు వెంబడించింది.
మూగజీవాలకు ఉండే నెనరు మనుషులకు ఎందుకుండదో అని అమ్మ మళ్ల ఏడ్చింది.
మలి చెలమ, కవేలిలాంటి ఊళ్లల్ల ఇంకో ఇద్దరు ఆడపిల్లలు చనిపోయినారు. పుష్పవల్లి మశూచితోటి, సరోజిని కలరాతోటి చనిపోయినారు. వాళ్ల వయస్సు కూడ రెండు, రెండున్నర సంతవ్సరాలు మాత్రమే.
హైద్రాబాద్‌కు బదిలీ చేయించుకొని వచ్చిన తర్వాత కూడ స్వామి అమ్మాబాపులకు మూఢనమ్మకాల విషయంల ఇంకా పట్టింపు పెరిగింది. ప్రతి అమవ్యాస, పున్నమి రోజులల్ల పిల్లలను బయటికి పోనియ్యకపోయేది. పిల్లల పాత బట్టలను ఎవరికీ దానం కూడ ఇచ్చెటోళ్లు కాదు. క్షవరం కోసం మంగలి ‘బాబయ్య’ ఇంటికే వచ్చెటోడు. వెంట్రులను, గోళ్లను జాగ్రత్తగ పెంట మీద పారేసెటోళ్లు. నడిచేటప్పుడు భద్రంగ తోవ మీద చూసుకుంట నడువాలని ‘సత్క’లను తొక్కవద్దని హెచ్చరికలను జారీ చేసెటోళ్లు. ఎవరి కండ్లు ఎటువంటివో అన్న అనుమానంతోటి పిల్లలు ఇంటికి రాంగనే దిష్టి తీసెటోళ్లు.
అట్ల బాణామతి వల్ల అమ్మ మనస్సుల భయం బలంగ నాటుకపోయింది. మిగిలివాళ్లను పట్నానికి వచ్చిన తర్వాత ‘రెక్కల కింద పిల్లలను దాచుకునే తల్లి కోడి’లాగ కాపాడసాగింది. అయినా ఇంకో కొడుకు ‘రమణుడు’ ఆరేండ్ల పిల్లవాడు చనిపోయినాడు. వానిది మరో విషాదగాథ.
ఆరేండ్ల రమణుడు పోలియో బాధితుడు. ఒక్క కాలు పూర్తిగ పీలబడి చచ్చుబడి పోతే పూర్తిగ కుంటుకుంట, కాలు ఎగురేసుకుంట నడిచెటోడు. ఆధునిక వైద్యం చేయించటానికి, ఇంజక్షన్లు ఇప్పించటానికి పైసలు లేక పోలియో వచ్చి వాడు కుంటోడిగనే మిగిలిపోయినాడు. వాణ్ని పిల్లలందరు వెక్కిరించెటోళ్లు. ఎవళ్లూ స్నేహం చేసెటోళ్లు కాదు. అయినా ముసిముసి నవ్వులు నవ్వుకుంటనే బడికి పోయెటోడు. కొంటెపిల్లలు కావాలని నూకేస్తే కింద పడెటోడు. కాని ఎవళ్లనూ ఏమీ అనెటోడు కాదు. ఎవరి మీద షికాయతులు చేసెటోడు కాదు.
స్వామికి అప్పుడు రెండేళ్ల వయస్సు. స్వామితోటి బాగ ఆడుకునెటోడు. స్వామి గోడలు పట్టుకొని నడుస్తుంటె సంతోషంగ చప్పట్లు కొట్టెటోడు. సరిగ్గ నడవలేని తను సరిగ్గ నడుస్తున్న తముడ్ని చూసి ‘అమ్మా! తమ్ముడు నడుస్తున్నడే!’ అని అరిచెటోడు. వానికి బట్టలు సరిగ్గ లేకపోయేది. అన్నీ చినిగిపోయిన పాత బట్టలే. వెనుక పిర్రల మీద చినిగిపోయిన పాత లాగులు. అట్ల అవే వేసుకొని బడికి పోయెటోడు. బడిల పిల్లలంత ‘పోస్టాఫీసు’ అని వెక్కిరించెటోళ్లు. అన్ని అవమానాలను పండ్ల బిగువున భరించుకుంట పైకి మాత్రం ముసిముసి నవ్వులు నవ్వెటోడు.
స్వామి అమ్మ తన అశాంతంతోటి తరుచుగ వాన్ని కొట్టుతుండేది. అది అమ్మ తప్పు కాదు -పరిస్థితులది.
తెల్లారితే పంద్రాగస్టు. అప్పుడప్పుడే స్వాతంత్య్రం వచ్చిన తొలి సంవత్సరాలు. ప్రతిసారి పంద్రాగస్టు చాల గొప్పగ పండుగలాగ చేసెటోళ్లు. ఆ దినం అందరి కండ్లల్ల దీపావళి ఫూల్ చడీలు వెలుగుతుండేవి. బడిపిల్లల హడావిడి చెప్పతరం కాదు. పిల్లలందరూ మంచి బట్టలు వేసుకొని బడికి పోయి పాటలు పాడుకుంట ప్రభాతభేరీలు తీసెటోళ్లు. మిఠాయిలు పంచిపెడుతరని సంబరపడేటోళ్లు.
రమణుడికి ఏం అనిపించిందో ఏమో! తన చినిగిపోయిన లాగును బకిట్ల ముంచి సబ్బు పెట్టి హడావుడిగ ఉతుక్కుంటున్నడు. సన్నగ వర్షం కురుస్తున్నది. కొద్ది దూరంల అంట్లు తోముతున్న అమ్మ వాన్ని చూసింది. వానల తడిసి సర్ది చేస్తే మల్ల డాక్టర్ దగ్గరకు ఉరకాలని ఆమె భయం. ‘లేవరా, వాన పడుతుంది’ అని అరిచింది. వాడు వినిపించుకోలేదో లేక నిజంగనే వినపడలేదో! ఆ చినిగిపోయిన లాగును వాడు ఎందుకు పిండుకుంటున్నడో ఆమెకు తెలవక తెల్లవారంగనే పంద్రాగస్టు పండుగ అని మర్చిపోయిన ఆమె కోపంతోటి చేతిల ఉన్న గంటెను అట్లనే వాడి మీదికి విసిరింది. ఆ గంటె వాడి తలకు తగిలి, తల పగిలి బొలబొలమని నెత్తురు కారసాగింది. వాడు అట్లనే వానల తడుచుకుంట లేచి నిలబడి కండ్లప్పగించుకుంట అమ్మను చూసినాడు. ఏడ్వలేదు. ఒక్క మాట కూడ మాట్లాడలేదు. అయినా అమ్మ మీద వానికేం కోపం ఉండేది కాదు. ఏదైన పనిల ఉన్న అమ్మకు చెమటలు పోస్తుంటే విసనకర్ర తీసుకొని అమ్మకు విసురుతూ ఉండెటోడు.
స్వామి చిన్నక్క ‘వెంకటమ్మ’, వాడు కలిసి ఒక్క రోజు ‘చావాట’ ఆడుతున్నరు. కొన్ని రోజుల కింద బస్తీల ఎవళ్లో చనిపోయినారు. అందరూ శవం ముందు కూచొని ఏడుస్తున్న దృశ్యం ఆ పిల్లలిద్దరికి తమాషాగ అనిపించింది. అదొక ఆటలాగ అనుకొని ఆ రోజు తమ ఇంట్లనే ‘చావాట’ ఆడుతున్నరు. రమణుడు చనిపోయినట్లు నేల మీద పండుకున్నడు. చిన్నక్క వాని ముందు కూలబడి ‘అయ్యో! తమ్ముడా! చచ్చిపోయినవా?’ అని నెత్తి కొట్టుకొని గట్టిగ ఏడుస్తుంది. వంటింట్ల నుండి స్వామి అమ్మ ఉరుకొచ్చి ఆ దృశ్యాన్ని చూసి ఇద్దరినీ చేతులతోటి చెడామడా వాయించి తను ఏడ్చుకుంట కూచుంది. ఒక నెల తర్వాత ఆ ‘చావాట’ నిజమే అయింది. చిన్నక్క నిజంగనే ‘తమ్ముడా! చచ్చిపోయినవా?’ అని ఏడ్చింది. ఆ చావుముచ్చట ఆమెను జీవితంల ఇంక ఇప్పటికిి కూడ ఏడిపిస్తనే ఉంది.
మంచి ఎండకాలం రోజులు. ఆఖరి పరీక్ష అయిపోయింది. బడి అవతలి రోడ్డు మీద ఐస్ ఫ్రూట్ బండి నిలబడి ఉంది. అందరూ కొనుక్కొని తింటున్నరు. మిలమిల మెరిసే ఎర్రని ఐస్‌ఫ్రూట్. రమణుడికి నోరూరింది. ఒక పైస ఇచ్చి దాన్ని చప్పరించుకుంట ఎర్రటి ఎండల ఇంటికి వచ్చినాడు. ఆ తెల్లారి గొంతు నొప్పి. ట్రాన్సిల్స్ వాచి తీవ్రంగ జ్వరం వచ్చింది. మరో రెండు రోజులల్ల అది డిప్టీరియాకు దారి తీసింది. శ్వాస అందక కండ్లు తేలేసినాడు. డిప్టీరియాల ఉండే బాక్టీరియా గొంతుల సాలెగూడు వంటి పొరలను నిర్మిస్తది. దానితోటి శ్వాస ఆడ రోగి చనిపోతడు. దాని వైద్యం కూడ చాల ఖరీదైంది.
గుల్జార్ హౌజ్‌ల డాక్టర్ రూప్‌కరణ్ దగ్గరికి వాన్ని తీసుకొని పరుగెత్తినారు. అప్పటికే రాత్రి అయ్యింది. డాక్టరు వెంటనే ఇవ్వాలని ఇంజెక్షన్లు రాసి ఇచ్చినాడు. వాటి ధర వందలల్ల ఉంటదని ముందే హెచ్చరించినాడు.
చేతిల రిక్ష పైసలు తప్ప మరేం లేవు. స్వామి అమ్మాబాపులు ఒకరి మొఖం ఒకరు చూసుకున్నరు. అమ్మ మౌనంగ చేతికున్న బంగారు గాజులు తీసి ఇచ్చింది. బాపు వాటిని అందుకొని కిరాయికి సైకిలు తీసుకొని వడ్డీవ్యాపారి మనోహర్‌లాల్ వద్ద వాటిని గిరివి పెట్టి మూడు ఇంజెక్షన్లు కొని చెమటలు కారంగ దవాఖానాకు వచ్చినాడు. మొదటి ఇంజక్షన్‌కే పరిస్థితి కొంచెం నెమ్మదించి శ్వాస కొంచెం పీల్చుకుంట కండ్లు తెరిచి అమ్మను చూసినాడు.
రేపు ఉదయం మల్లా ఇంకో ఇంజక్షన్ కోసం దవాఖానకు రావాలెనని డాక్టర్ జాగ్రత్తలు చెప్పినాడు. కొండంత సంతోషంతోటి అమ్మాబాపులు వాన్ని ఇంటికి తీసుకొచ్చినారు.
కాసేపైన తర్వాత అమ్మ అడిగింది -’నానీ ! అయిస్‌ఫ్రూట్ గాని ఏమైన తిన్నవా?’
‘అవును’ అన్నట్లు తలాడించినాడు.
అమ్మకు కోపం, దుఃఖం ముంచుకొచ్చి చటుక్కున తల అటు వైపు తిప్పుకొన్నది.
ఏమనుకున్నడో వాడు ! అమ్మకు తెలువదు. ఎవళ్లకు తెలువదు.
తెల్లారి ఉదయం హోలీ పండుగ. రంగుల పండుగ. ఈ పున్నమినాడే వాడు పుట్టిన రోజు పండుగ కూడ. సమయం ఎనిమిదవుతున్నది. అవతల బజార్‌ల హోలీ గుంపుల ఆనందాలు. కేకలు. అరుపులు.
రమణుడికి మళ్లా తీవ్ర జ్వరం. శ్వాస అందటం లేదు. అతి కష్టంగ తీసుకుంటున్నడు. కొద్ది సేపట్లనే గుర్రు మొదలైంది. కండ్ల మీదికి తెల్ల రెప్పలు కమ్ముకొస్తున్నై. అమ్మాబాపులు వాన్ని మంచం మీద నుండి కిందికి దించి చాప మీద పండబెట్టినారు.
అవతల బజార్‌ల రంగుల పండుగ ఆనందపు హరివిల్లులు. స్వామి ఇంట్ల మృత్యు దేవత నీలినీడలు.
అప్పటికే నాలుగు చావుల అనుభవం ఉన్న అమ్మాబాపులకు అంత అర్థమైపోయింది. కాసేపటికి వాడికి చావు తెలివి వచ్చి కండ్లు తెరిచి అమ్మను చూసినాడు.
అమ్మ ఏడ్చుకుంటనే ‘నానీ ! దేవుడికి దండం పెట్టుకో!’ అంది.
వాడు ‘పెట్టను’ అన్నట్లు అడ్డంగ తలూపినాడు.
ఎప్పుడూ ముసిముసి నవ్వులు నవ్వుకుంట ఎవరి మీద ఎన్నడు షికాయత్‌లు చేయని వాడికి బహుశా ఆ క్షణంల తన అవిటితనాన్ని సృష్టించిన దేవుడి మీద కోపం వచ్చిందేమో!
తర్వాత ప్రశాంతంగ కండ్లు మూసుకొని ఇంక ఎటువంటి అవమానాలు, చీదరింపులు లేని ‘సంతోష చంద్రశాలల’కు వెళ్లిపోయినాడు. ఆరేండ్ల రమణుడు. రమణముని. మౌనముని. మౌనంగనే తన పుట్టిన రోజు పండుగనాడు ఈ లోకం నుండి నిష్క్రమించినాడు.
బిగ్గరగ ఏడుస్తున్న బాపును కౌగిలించుకొని అమ్మ ‘భయపడకు, ఏడ్వకు’ అని ఓదార్చింది. ఆ క్షణంల ఆమె రాయిలాగ అయిపోయింది.
వాణ్ని బొంద పెట్టిన తర్వాత మూడొద్దుల నాడు అమ్మ ఎర్రరంగు అయిస్ ఫ్రూట్ తీసుకపోయి వాని సమాధి మీద ఉంచి ‘తిను బిడ్డా !’ అని గుండె పగిలేటట్లు ఏడ్చింది.
ఆ రోజే బాపు రూప్‌కరణ్ దవాఖానాకు పోయి ఆయన చేతులల్ల మిగిలిపోయిన రెండు ఇంజక్షన్లు పెట్టి, కండ్ల నీళ్లు కారుతుంటే నిశ్శబ్దంగ రెండు చేతులు జోడించి దండం పెట్టి ఇంటికి వచ్చినాడు.
కొద్ది రోజులకు బాపు వాడి బడికి పోయి ఇంక వాడు లేడన్న సంగతి అందరికి చెప్పినాడు. క్లాస్ టీచర్ బాధపడుకుంట వాని ప్రోగ్రెస్ రిపోర్ట్‌ను అందించినాడు.
‘రమణుడు’ పాస్ అయినాడు.
ఆ రిపోర్ట్‌ను బాపు చాల కాలం భద్రంగ దాచి పెట్టుకున్నడు - ఫొటో కూడ లేని ఆ కొడుకు నిషానీగా. ఆ తర్వాత స్వామికి ఇద్దరు తమ్ముళ్లు. జ్ఞాని, మధులు పుట్టినా అమ్మ ‘రమణుడిని’ మాత్రం మరువలేదు. ప్రతి రంగుల పండుగ నాడు వాన్ని యాది చేసుకొని ఏడుస్తనే ఉంటది. తన మాట ఎవరైన వినకపోతే ‘రమణుడి’ బొంద దగ్గరికి పోయి చచ్చిపోత అని బెదిరిస్తుంటది.
స్వామి ఇంట్ల రంగుల పండుగ ఎప్పుడూ జరగదు.
అట్ల పోయినోళ్లు పోంగ, పోంగ చిక్కిన మొగపిల్లల్ల మొదటివాడు స్వామి. అమ్మ ఆడపిల్లల మీద కన్నా మొగపిల్లల మీదనే ఎక్కువ ఇష్టం చూపేది. ఆ ఇష్టమే స్వామి విషయంల ‘అతి జాగ్రత్తలు’ తీసుకునేటట్లు చేసింది.
* * *
ప్రత్యేక తెలంగాణా ఉద్యమం హింసాపూరితంగ మారుతున్నది.
మార్చి 23 తెల్లవారుజామున ఉస్మానియా యూనివర్శిటీ విద్యార్థులు జామే ఉస్మానియా రైల్వే స్టేషన్‌పైన దాడి చేసినారు. అక్కడ లంకా దహనం జరిగింది. ప్రమాదవశాత్తు ఆ మంటలల్ల చిక్కుకుని ఇద్దరు ఇంజినీరింగు విద్యార్థులు మృతి చెందినారు. అండ్ల ఒకతను ప్రకాశ్‌కుమార్ జైన్. ఇరవై ఒక్క సంవత్సరాల వయస్సు. ఇంజినీరింగు మూడో సంవత్సరం విద్యార్థి. ఇతని స్వగ్రామం ఖమ్మం జిల్లా గార్ల. తల్లితండ్రులకు ఏకైక పుత్రుడు. హైద్రాబాద్ అన్వరులూం కాలేజీలో పియుసి చదివి ఉస్మానియాల ఇంజినీరింగు చేస్తున్నడు. చాలా అందమైన యువకుడు. సంగీతం, నృత్యం అతని అభిరుచులు. దేశానికి దక్కాల్సిన ఒక యువ ఇంజినీరు తెలంగాణా ఉద్యమ హోమంల సమిధగ మారి ఆహుతయ్యిండు. అతని మరో మిత్రుడు పాశం సర్వారెడ్డి. మహబూబ్‌నగర్ జిల్లా గద్వాల తాలూకాల చెంగనపల్లి అతని స్వగ్రామం. ఉస్మానియాల ఇంజినీరింగు నాలుగో సంవత్సరం విద్యార్థి. తల్లిదండ్రుల్ని, ముగ్గురు తమ్ముళ్లను, ఇద్దరు చెల్లెళ్లను వదిలి ఆ ఇంటికి పెద్ద కొడుకు తన మిత్రుడు ప్రకాశ్ కుమార్ జైన్‌తో కలిసి కనపడని లోకాలకు వెళ్లిపోయినాడు. యువకులు సాకబోసిన రక్తంతో తల్లి తెలంగాణా ఎరుపెక్కింది.
స్వామికి ఒక రోజు ఒక అందమైన కవర్ పోస్టుల వచ్చింది. అది స్వయంగ తయారు చేసిన ఆర్టిస్టిక్ కవర్. ముత్యాలసరాల్లాంటి అందమైన అక్షరాలు. తిలక్ అన్నట్లు వెన్నెల్లో ఆడుకునే అందమైన ఆడపిల్లల్లాంటి అక్షరాలు. అడ్రసు కూడ మూడు నాలుగు రంగుల పెన్నులతో రాసినట్టుంది. కవరుకు నాలుగు మూలల పువ్వులు, నక్షత్రాల డిజైన్లు. ఇంత అందమైన లెటర్ నాకెవరు రాసినారబ్బా అని వెనుక వైపు ఫ్రం అడ్రసు చూస్తే వేణు, రంగ్రేజీ బజార్, లష్కర్ అని ఉంది. స్వామికి ఆనందం కలిగింది. వేణు తనని మరిచిపోనందుకు, లెటరు రాసినందుకు. పుర్‌సత్‌గ దీవాన్‌ఖానల ఆరామ్ కుర్చీల కూచుని కవర్ జాగ్రత్తగ విప్పినాడు - లోపలున్న ముత్యాలు రాలి నేల మీదికి ఒలికిపోతాయేమో అన్నంత జాగ్రత్తగ.
ఆల్‌ఫూల్స్ డే. 1969
రంగ్రేజి బజార్,
లష్కర్
ప్రియమైన స్వామీ !
100 నాలు.
ముందు రక్షకభటులకు కృతజ్ఞతలు. మనలను స్నేహితులుగ కలిపినందుకు.
నిన్ను యాదగిరిని మీ సాహిత్యాభిమానాన్ని నేను మరిచిపోలేదు. అందుకే నయాపూల్ మీద నుండి మీ శాలిబండకు నడిచి రాకుండ ఇట్ల ఈ అక్షరాల వంతెన మీద నుండి నీ హృదయంలకు నడిచి వస్తున్నాను. ఇది ఔర్ ఏక్ నయాపూల్. దూరాలను కలిపే దారాలే ఈ ఉత్తరాలు. కలం స్నేహం కలకాలం నిలిచే స్నేహం అని బలంగ నమ్ముతను.
సత్యశోధన, సత్యసందర్శనం అంత సులువైందేమీ కాదు. ఏ సత్యమూ సంపూర్ణం కాదు. ప్రతి సత్యమూ సాపేక్షికమే. సత్యం అఖండం కాదు. దానికి అనేక కోణాలుంటవి. అనేక పార్శ్వాలుంటవి. పాలునీళ్లు, తెలుపునలుపూ అన్నంత స్పష్టంగ ఏ సత్యమూ ఉండదు. సత్యం స్పష్టంగా గాక సంక్లిష్టంగనే ఉంటది. సత్యసందర్శనానికి వంద కళ్లు, సత్యశోధనకు వెయ్యి మెదళ్లు కావాలె.
ఈ ‘సోది’ అంతా ఎందుకు రాస్తున్ననంటే ఏప్రిల్ ఐదున సాయంత్రం ఆరు గంటలకు ఇక్కడ అంజలీ టాకీస్ చౌరస్తా వద్ద ఉన్న బూర్గు మహాదేవ్ హాలుల కమ్యూనిస్టు పార్టీ వారి మీటింగు ప్రత్యేక తెలంగాణా అంశంపై జరుగనుంది. వారు విశాలాంధ్ర, సమైక్యతా వాదులన్న సంగతి మనందరికి తెలుసు. అయినా వారి వాదన కూడ ఏమిటో తెలుసుకుంటేనే నాణాన్ని రెండు వైపుల చూసినట్టుంటుంది, తెలుసుకున్నట్టు ఉంటుంది. అందుకే పై తాత్విక చింతనను నీ ముందు ఉంచినాను.
వంద పూలు వికసించనీ
వెయ్యి ఆలోచనలు సంఘర్షించనీ.
మనం విషయాలను తెలుసుకునే విద్యార్థులుగ ఆ సభకు హాజరు కావాలని నా కోరిక. ఆ హాలు మా ‘గరీబ్‌ఖానా’కు చాలా దగ్గర. యాదగిరికి కూడా లెటరు రాస్తున్న. వీలైతే అతణ్ణి కూడ తీసుకురాగలవు. ‘అతనొక వాకింగు, టాకింగు లైబ్రరీ’. మధ్యాహ్నానికే మా ఇంటికి రండి. కాసేపు కడుపు నిండా మాట్లాడుకుందాం.
అంజలీ టాకీసు చౌరస్తాల ఉన్న జ్యోతి ఫొటో స్టూడియో పక్క సందుల దూరి ‘వేణు’ అని ఎవర్నడిగినా మా ఇల్లు చూపిస్తరు. ఎందుకంటే
వేణూ మేరా నామ్
దోస్తీ మేరా కామ్
ప్రేమతో ఎదిరిచూస్తూ
నీ
వేణు.
… తరువాత భాగం ఒచ్చే వారం



