Feed on
Posts
Comments

10

ఆ రోజు మేడే. చికాగో వీధులల్ల తమ హక్కుల కోసం కార్మికులు రక్తం ధారపోసిన రోజు. తమ రక్తవర్ణంతోటి అరుణపతాకాన్ని సృష్టించిన రోజు. ఆ రోజుననే హైద్రాబాద్‌, సికింద్రాబాద్‌ జంటనగరాలల్ల తెలంగాణా ప్రజా సమితి ‘డిమాండ్‌ డే’ కోసం పిలుపిచ్చిన రోజు. తెలంగాణా కోసం ఊరేగింపు జరుపవలసిన రోజు.

స్వామి ఇక్బాల్‌ హోటల్ల కూచున్నడు.

“బోలో సాబ్‌ క్యా హుకూం హై” సర్వర్‌ పలకరింపుకు ఉలికిపడి ఈ లోకంలకు వచ్చినాడు స్వామి.

నహారి, ఖుల్చా, పాయారోటీ, శీర్మాల్‌, బోటీ కబాబ్‌, ఖీమా, రుమాలి రోటీ… సర్వర్‌ దండకం చదవసాగినాడు. వాడి దాడి నుండి తప్పించుకోనీకి పాయారోటీకి ఆర్డరిచ్చి మళ్లీ తన మనోవల్మీకంలకు జారిపోయినాడు.

ఉదయం ఏడవుతుంది. చార్మినార్‌ ఛత్రచ్ఛాయలల్ల అర శతాబ్దం నుండి నమ్మిన బంటుగ నిల్చున్న ఇక్బాల్‌ హోటల్‌. లార్డ్‌ బజార్‌కు పోయే మలుపుల తూర్పు దిక్కుకు అభిముఖంగ ఉంది. అది కాలం, శూలం దాడికి గురి కాక అట్లనే నిలబడి ఉంది. అతి పురాతన హోటల్‌. అవే పాత రేకులు. పాత కుర్చీలు. పాత పాత బెంచీలు, టేబుళ్లు. హోటల్‌ ముందు రోడ్డు మీద ఉదయించిన సూర్యునికి పోటీగ భగభగల, భుగభుగల ఇనుప బొగ్గులపొయ్యి. అండ్ల వేయిన్నొక సూర్యుళ్లు మండుతున్నట్లు కణకణలాడుతున్న నిప్పుల కుప్పలు. పొయ్యిపైన పెద్ద డేక్చాలో కళపెళా అర్ధరాత్రి నుండి ఉడుకుతున్న మేక కాళ్ల బొక్కల పాయా సూపు ఆ ఉదయపు ప్రశాంత వాతావరణంల కమ్మటి వాసనలను, సెగలను పొగలను ఎగజిమ్ముతుంది.

కౌంటర్ల నైజాం కాలంనాటి ఒక ముసలాయన. తెల్లటి లక్నో చికన్‌ ఖుర్తా, పైజామా, మెడల ఎర్రగళ్ల రుమాలు, తల మీద జాలీ టోపీ, నోటి నిండ పాన్‌, కళ్ల నిండ సుర్మా. పూరా సోలానా హైద్రాబాదీ ముసల్మాన్‌. సరిగ్గ అతని తల మీద గోడకు వేలాడుతున్న రాజా దీన్‌దయాళ్‌ తీసిన నైజాం కాలంనాటి నలుపు, తెలుపుల తస్వీర్‌. గతించిన కాలానికి సాక్ష్యంగ నిలబడింది. పక్కనే మరో ఫొటో. అండ్ల 1948 సెప్టెంబర్‌ 17న పోలీస్‌ యాక్షన్‌ అయిపోంగనే హకీంపేట ఎయిర్‌పోర్టుల సర్దార్‌ పటేల్‌కు స్వాగతం పలుకుతున్న ఏడవ నిజాం మీర్‌ ఉస్మాన్‌ అలీ ఖాన్‌. గత్యంతరం లేక భారత సైన్యాలకు లొంగిపోతున్న దీనస్థితి అండ్ల స్పష్టంగ కనబడుతుంది.

స్వామి మెదడు అడుగు పొరలల్ల హోరెత్తుతున్న సుద్దాల హన్మంతు. ‘ఏ బండ్లె పోతవ్‌ కొడుకో నైజాము సర్కరోడ’ యాదగిరి పాట. మరో వైపు నుండి ‘మా నిజాం రాజు జన్మజన్మాల బూజు’ పెద్ద దాశరథి కవితా ఘోష. ‘కూలిపోయే కోట గోడా, రాలిపోయే డేగ రెక్కా’ అంటూ అరుణారుణ మగ్దూం మొహియుద్దీన్‌. తన కలాన్నే కత్తిగ మార్చి నిరంకుశ నైజాంపై దండెత్తి కాచిగూడా చౌరస్తాల నడిరోడ్డు మీద ముక్కలు ముక్కలుగ నరికి హత్య చేయబడ్డ ఇమ్రోజ్‌ పత్రికా సంపాదకుడు షోయబుల్లా ఖాన్‌. అందరూ వాళ్లందరూ స్వామి కళ్ల ముందు నుండి కదిలి కాలం తెర వెనకకు పోతున్నరు.

“పాయా బహుత్‌ ఖూబ్‌ హై సాబ్‌. మజా లే లో” అంటూ సర్వర్‌ పాయా రోటీని స్వామి ముందు టేబుల్‌పై పెట్టినాడు. వాడి ఆప్యాయత స్వామిని కదిలించి కట్టిపడేసింది. ‘బోలో సాబ్‌ క్యా హుకూం హై’ అన్న వాడి తొలి పలకరింపే మహా గొప్పది. ఆ మాటలతో స్వామిని ఆ నగరానికి ఒక బాదుషాను చేసి ఉన్నతాసనంల అధిష్ఠింపచేసినాడు. ఎదుటి మనిషిని ఆత్మీయంగ పలకరించడం హైద్రాబాద్‌ సంస్కృతి. హైద్రాబాద్‌ తహెజీబ్‌ (మర్యాద).

రోటీని చిన్న చిన్న ముక్కలుగ తుంచి కటోరాల ఉన్న వేడి వేడి పాయా శోర్వాల వేసి బాగా నానిన తర్వాత చెంచాతోటి తీసుకొని మెల్లగ జుర్రసాగినాడు. ఆ చల్లని సుప్రభాతపు వేళల మధ్య ఆసియా నుండి సంక్రమించిన ఆ నాస్తా స్వామి జిహ్వకు రుచికరమైన ఆనందాన్ని, తృప్తిని ఇస్తున్నది. శరీరం కొద్దికొద్దిగ వెచ్చబడసాగింది. కౌంటరుల ఉన్న పాత గ్రామ్‌ఫోన్‌ రికార్డు నుండి శంషాద్‌ బేగం తీయ తేనియల మధుర స్వరం ‘సజ్‌నా మొహబ్బత్‌ వాలా’ అంటూ హుషారుగ జాలువారుతుంది. స్వామి మనస్సు మానస సరోవరం అయ్యింది.

నాస్తా ముగించంగనే సర్వర్‌ డబుల్‌ శక్కర్‌ మలాయ్‌ చాయ్‌ ‘పౌనా’ను ఒక పొడుగు సీసపు గ్లాసుల తెచ్చినాడు. దానిని చప్పరించుకుంట రోడ్డు మీద దృష్టిని సారించినాడు. ఆ హోటల్ల ఒక మూలల కూర్చొని చూస్తుంటే మొత్తం రోడ్డు విశ్వరూపం కనిపిస్తుంది. ఒక లిప్తకాలం కూడ ఆగని నిరంతర జనజీవన చైతన్య ప్రవాహం.

ఎదురుగ నిజాం కట్టించిన ఆయుర్వేద ఆసుపత్రి. దాని ఆవరణల యునాని దవాఖానా. చిన్నప్పుడు నడుచుకుంట అలీజా కోట్లల ఉన్న ముఫీదుల్‌-ఎ-నామ్‌ స్కూలుకు పోతూ తమాషాకు యునానీ దవాఖానాలకు దూరెటోళ్లు. తెల్లటి పొడుగు గడ్డాలు, షేర్వాణీలు, రూమీ టోపీల హకీం సాబ్‌లు అండ్ల ఉండెటోళ్లు. ఆ కాలంల అదొక ఉచిత సర్కారీ దవాఖానా. కడుపు నొప్పో, కాలు నొప్పో అని దొంగమాటలు చెప్పే సరికి హకీం సాబ్‌ చిన్న చీటిపై దవా రాసేటోడు. ఆ చిట్టీ తీసుకుని పక్క గదిలోకి పోయేటోళ్లు.

అక్కడ పెద్ద పెద్ద గాజు జాడీలల్ల చూడంగనే నోరూరేటట్లు తీనెలూరే హల్వాలు. అరబ్బీ మురబ్బాలు ఉండేవి. రాగి రంగు, బంగారు రంగు, పసుపుపచ్చ రంగు రంగుల హల్వాలు నయనానందంగ కనిపించేవి. కట్టె గరిటెతోటి ఆ హల్వాలు ఒక కాగితంల కట్టి ఇచ్చెటోళ్లు. తియ్యగ, రుచిగ ఉండేవి కావున వాటిని కొంచెం కొంచెం నాకుకుంట స్కూలుకు పోయెటోళ్లు. హల్వాలనే కాక నల్లగ, తియ్యగ పుల్లగ ఉండే ‘చూరన్‌’లను కూడ ఇచ్చెటోళ్లు. వాటితోటి నాలికల తుప్పు వదిలి నాలిక సాఫ్‌ అయిపోయేది. అవి రుచిగ ఉండి ఆకలి కలిగించేవి. రుచిగ ఉంది కదా అని కొంచెం ఎక్కువ తింటే విరేచనాలు పట్టుకునేవి. ఆయుర్వేద మందులంటే మాత్రం ఆమడదూరం ఉరికెటోళ్లు. వొగరు భస్మాలు, చేదు కషాయాలు, వాంతికొచ్చే మందుల ఉండలు. భారతదేశంల ఆవిర్భవించిన ఆయుర్వేదం, గ్రీసు దేశం నుండి దిగుమతి అయిన యునాని వైద్యం ఒకే ఆవరణల పక్కపక్కన సహజీవనం చేయడం విభిన్న వైద్య శాస్త్రాల సామరస్యానికి ప్రతీకేమో!

సమయం ఎనిమిదవుతుంది. తూర్పున ఎదురుంగ మాతా భాగ్యలక్ష్మీ మందిరం. చార్మినార్‌కు ఆనుకొని ఆ మూలన అలీజా కోట్లకు పోయే దారిల ఉంది. గణగణగణ గుడి గంటలు నిర్విరామంగ మోగుతున్నై. ప్రభాత పూజా కార్యక్రమాలు కొనసాగుతున్నయి. మార్వాడీ, అగ్రవాల్‌, రాజస్థానీ స్త్రీల తలల మీది కొంగులతోటి, ముసుగులతోటి వారి చేతులల్ల హారతి కర్పూరం పళ్లాలు, కొబ్బరి కాయలు, పూజా సుగంధ ద్రవ్యాలు, పువ్వులతోటి ఆ ఉదయపు వాతావరణం అతి పవిత్రంగ మారుతుంది. భక్తుల మంత్రోచ్చారణలు అలలు అలలుగ వ్యాపిస్తున్నై.

అక్కడ పూజారి ‘పండిత్‌ మహరాజ్‌’ ఇంత పెద్ద బాన పొట్టతో నిరంతరం నల్లమందు సేవనంతో హమేషా మత్తుల జోగుతుంటడు. అతను ఓ మూలల మత్తుతోటి చిదానంద స్థితిల ఉన్నడు. అతని కొడుకు ‘చోటా పూజారి’ కార్యక్రమాలు నిర్వహిస్తున్నడు. ఆ పండిత్‌ దేశదిమ్మరిగ, జులాయిగ ఉత్తర భారతదేశం నుండి హైద్రాబాద్‌కు కట్టుబట్టలతో వలస వచ్చినప్పుడు మార్వాడీ సేఠ్‌లంతా జాలిపడి దయతో అతనిని ఇక్కడ పూజారిగ నియమించినారు. సమీపంల ఉన్న శాలీబండ మార్కెట్‌ గల్లీల అతనికి ఇప్పుడు రెండు పెద్ద బంగళాలు. ఇద్దరు భార్యలు. పన్నెండు మంది సంతానం. అతనిల ఏ మాత్రం సాత్వికత్వం, పవిత్రత కనిపించకపోగ కాశి, ప్రయాగ, పూరీ జగన్నాథ్‌, పాండాలల్ల ఉండే కాఠిన్యం, వ్యాపార తత్వం గోచరిస్తుంది. పూజకు వచ్చిన స్త్రీలు హారతి పళ్లెంల సరిపోయినంత దక్షిణ వేయకపోతే వారిని శపిస్తున్నట్లుగ తిడుతడు.

ఆ మందిరం పక్కన ఒకటి రెండు ఆవులు రోడ్డు మీదనే తిష్టవేసి భక్తులు వేసిన రోటీలను, అరటి పండ్లను తీరికగ నెమరేస్తున్నై. అవి ట్రాఫిక్‌కు ఆటంకంగ మారినా ఎవరూ అదిలించరు. ఒకవేళ అదిలించినా, కొట్టినా, గెదిమినా ‘గో సంరక్షక్‌ సమితి’వారికి ఆగ్రహం వస్తది. ఆ ఆగ్రహం ఏ కల్లోలానికైనా దారి తీయొచ్చు. మత రాజకీయాలల్ల ‘గోమాత’ అతి సున్నితమైన విషయం కదా! 1966ల లాల్‌ బహద్దుర్‌ శాస్త్రి ప్రధానమంత్రిగ ఉన్న కాలంల ‘గో హత్య బంద్‌ కరో’ అని హిందూ మతతత్వ ఛాందసవాదులు ఉత్తర భారతంల పెద్ద ఎత్తున అల్లర్లు చేసినారు. ఢిల్లీలో సాధువులూ సన్యాసులూ వేల మంది ఊరేగింపు తీస్తే గడబడలు జరిగినై. వారి కమండలాలల్ల పవిత్ర గంగాజలం బదులు కిరసనాయిలు, పెట్రోలు పోసుకొని వచ్చి బస్సులను తగులబెట్టినారు. ‘గో హత్య బంద్‌ కరో’ ఇప్పటికీ రగులుతున్న రావణకాష్టమే. చార్మినార్‌, గుల్జార్‌ హౌస్‌ల ఉన్న గుజరాతీ మర్వాడీ వ్యాపారస్తులందరూ ఆ ఉద్యమానికి సానుభూతిపరులు, ఆర్థిక పోషకులు.

మాతా భాగ్యలక్ష్మీ మందిర్‌కు ఒక స్థల పురాణం కథ ఉంది. మహమ్మద్‌ కులీ కుతుబ్‌ షా 1591ల చార్మినార్‌ను కట్టించే రోజులల్ల రాత్రుళ్లు సామానుల కాపలా కోసం ఒక గొల్లవాడిని నియమించినాడట. ఒక చీకటి రాత్రి ఆ గొల్లవాడు చుట్ట కాల్చుకుంట కొరివి దయ్యంలాగ కాపలా కాస్తున్నప్పుడు దేదీప్యమానమైన ఒక స్త్రీ మూర్తి అక్కడ ప్రత్యక్షమై తెల్లటి పట్టుచీర, జలపాతమోలె విరబోసుకున్న జుట్టు, విశాలమైన కళ్లు, ఒళ్లంత బంగారు నగలు, వజ్రవైఢూర్యాలు, కాళ్ల గజ్జెలు ఘల్లుఘల్లుమంటుంటే ఆమె అతణ్ణి సమీపించింది. కాళరాత్రిల ఆ కాంతి పుంజానికి వాడు భయకంపితుడై పోయినాడు. నోట మాట రాక నిశ్చేష్టుడైనాడు. “ఎవరు నువ్వు?” అన్నడు భయపడుకుంట. అప్పుడామె తన వీణావాదన స్వరంతో “నేను వచ్చానని మీ రాజుగారికి చెప్పు” అన్నది. “నేనిక్కడ కాపలావాడిని. ఇక్కడ్నుంచి కదలటానికి వీల్లేదు” అని ఆ గొల్లవాడు చెప్పితే “నువ్వు వచ్చే దాక నేనిక్కడే ఉంట. ఎక్కడికీ వెళ్లను” అని ఆమె వాగ్దానం చేసింది. వాడు పరుగు పరుగున గొల్లకొండ కోటకు పోయి నవాబుగారిని నిద్ర లేపి సంగతి విన్నవించినాడు. ఆ వచ్చిందెవరో గొల్లవాడికి తెలియకపోయినా నవాబుకు మాత్రం వెంటనే తెలిసిపోయింది.

“సముద్రంల చేపల్లాగా నా నగరమంతా ప్రజలతో నిండిపోనీ, ధనధాన్యాలతో భోగభాగ్యాలతో అభివృద్ధి చెందనీ” అని అల్లాను దువా అడిగిన ఆ నవాబు ఆ వచ్చిందెవరో అర్థం చేసుకొని తన నగరం, తన ప్రజల క్షేమం కోసం, తన రాజ్యస్వార్థం కోసం వెంటనే తల్వారుతో వాడి తల నరికేసినాడు – మళ్లీ వాడు తిరిగి పోతే ఆ ‘భాగ్యలక్ష్మి’ అక్కడి నుంచి వెళ్లిపోతుందనే భయంతోటి. ఆ గొల్లవాని రాక కోసం భాగ్యలక్ష్మి అట్లనే ఎదురు చూసుకుంట సూర్యోదయం కాంగనే శిలగ మారిపోయింది. ప్రతి రోజూ ధూపదీప నైవేద్యాలతోటి భక్తుల పూజల్ని అందుకుంటనే ఉంది. నేటి నగర సిరిసంపదలకు ఆమె మూలపుటమ్మ. ఆ భాగ్యలక్ష్మి కటాక్ష వీక్షణాల వల్లనే ఏడవ నిజాం ఉస్మాన్‌ అలీఖాన్‌ యావత్‌ ప్రపంచంలనే అత్యంత ధనికుడైనాడని ఒక విశ్వాసం చెలామణిల ఉంది. కాలగమనంల పాపం ఆ గొల్లవాణ్ణి మాత్రం ప్రజలందరూ మరిచిపోయినారు. తమ శ్రమశక్తితో అందమైన నగరాన్ని సృష్టించి చరిత్రకందకుండా పోయిన చరిత్ర నిర్మాతలలో ఆ గొల్లవాడు కూడ ఒకడని నగర ప్రజలు మరిచిపోయినారు.

ఆలోచనలను దులుపుకొని ఆవలించుకుంట బద్దకంగ ఒళ్లు విరుచుకున్నడు. మరో చాయ్‌ తాగి బిల్లు చెల్లించి సర్వర్‌ “మనస్సునంతా చెయ్యిగ మార్చి చేసే సలాములను” స్వీకరించుకుంట హోటల్‌ నుండి ఇవతలికి వచ్చి రోడ్డెక్కినాడు.

స్వామికి తెలియకుండనే కాళ్లు మక్కా మసీదు దర్వాజా దగ్గరకు చేరుకున్నై. పక్కన ఫుట్‌పాత్‌ మీద పాత నాణాలు అమ్ముకునే బేహారి ఒకడు కూర్చున్నడు. కింద పరిచిన గుడ్డ మీద మధ్య యుగాల బానిస ప్రభువుల కాలం నాటి నాణాల నుండి మొఘల్‌, కుతుబ్‌షాహీ, ఆసఫ్‌జాహీ కాలంనాటి వరకూ ఒకప్పుడు చెలామణిల ఉన్న నాణాలను అమ్ముతున్నడు. కిందికి వంగి మోకాళ్ల మీద ముడుచుకొని కూర్చొని కొన్ని నాణాలను పరిశీలించినాడు. నైజాం కాలంనాటి హాలీ సిక్కాలను పరీక్షగ చూసినాడు. చిల్లి పైసలు, ఏకాణాలు, దొవ్వానాలు, పాత చారాణాలు – ఆఠాణాలు, బుడ్డ పైసలు, రెండు, ఐదు, పది పైసల నాణాలు స్వామిని పలకరించి పురా స్మృతులల్లకు తీస్కపోయినై. అప్పుడే వచ్చిన నయా పైసాను బాపు మొదటిసారి ‘దివాన్‌ఖానా’ల ఇచ్చిన సంగతి జ్ఞాపకం వచ్చింది. కొన్ని అపురూపమైన నాణాలను తన దగ్గరున్న పచ్చ కాగితాలతోటి ఖరీదు చేసి మక్కా మసీదులకు ప్రవేశించినాడు.

రెండు దిక్కుల బిచ్చగాళ్లు, ఫకీర్లు. ఆడ మగ, ముసలి ముతక. పక్కనే అరుగు మీద ఒక వేశ్య ఒంటి మీద సోయి లేకుండ కాళ్లూ చేతులను విసిరేసుకుని నిర్లక్ష్యంగ నిద్ర పోతుంది. పట్నానికి బతకటానికి వచ్చిన ఓ తల్లి పిల్లల్ని పక్కనే కూర్చోబెట్టుకుని దిగాలుగ దిక్కులు చూస్తుంది. కొందరు దయాళువులు బిక్షగాళ్లకు చిల్లర పైసలను, అరటి పండ్లను, రొట్టెలను దానం చేసి పుణ్యం మూట గట్టుకుంటున్నరు. వారందర్ని దాటి చెప్పుల్ని విడిచి మెట్లెక్కసాగినాడు.

సిడీల మీద కబూతర్ల సమూహాలు. వాటి గొంతుల గుడ గుడ ధ్వనులు. రెక్కల టపటపలు. అవి కొంచెం సేపు ఎగిరి మళ్లీ సిడీల మీద వాలుతున్నై. ఎవరో అబ్బాతో వచ్చిన ఇద్దరు ముగ్గురు చిన్న పిల్లలు వాటికి నూకలను, జొన్నగింజలను చల్లుతున్నరు. కేరింతలతోటి వాటి మధ్యలకు బుల్లి బుల్లి అడుగులతోటి పరుగెత్తుతున్నరు. కబూతర్లు పరేషాన్‌ అయ్యి కొంచెం కొంచెం పైకెగురుతున్నయి. పసి పిల్లల్లాంటి బూతర్లను, కబూతర్ల లాంటి పసిపిల్లల్ని చూస్తూ నీళ్ల హౌజును దాటి అక్కడున్న విశాలమైన నల్లరాతి చప్టా మీద కూర్చున్నడు. ఆ చప్టా మీద కూర్చుంటే మళ్ల తప్పకుండ హైద్రాబాద్‌కు వస్తరని ఒక నమ్మకం. స్వామి ఆ బెంచీ మీద కూర్చొని “అవును నా నగరంల నేనే ఒక యాత్రికుడిని” అని లోలోపల నవ్వుకున్నడు. మసీదంతా బక్రీదు పండుగ కోసం తయారవుతుంది. విశాలమైన ఆవరణల నమాజుల కోసం షామియానాలు వేస్తున్నరు.

ఎడమ దిక్కు తల తిప్పి చూసేసరికి వరుసగ ఐదు నైజాం నవాబుల సమాధులు. ఆరవ నిజాం మీర్‌ మహబూబ్‌ అలీ పాషా సమాధి ప్రత్యేకంగ కనబడుతుంది. ప్రజలు అతడిని అభిమానంతో, ప్రేమతోటి ముద్దుగ పాషా అని పిలిచెటోళ్లు. ఆయన సమాధి మిగిలినవాటి కన్నా ఎత్తుగ ఉండటమే కాక ఆకుపచ్చ పట్టు వస్త్రంతోటి కప్పబడి ఉంది. ఎవరో ఫకీరు ఆ సమాధిని శ్రద్ధగ శుభ్రం చేస్తున్నడు. గత వైభవాన్ని తలుచుకుంటున్న ప్రభుభక్తి పరాయణుడేమో! అక్కడే మరో మూల ఇద్దరు ముస్లిం ముసాఫిరులు తీరికగ కూర్చొని తాత్విక చర్చలు చేస్తున్నరు. ఒకరు చెప్పుతుంటే మరొకరు శ్రద్ధగ తల ఊపుకుంట వింటున్నరు. ఆఖరి రాజైన ఏడవ నిజాం మీర్‌ ఉస్మాన్‌ అలీ ఖాన్‌ సమాధి మాత్రం ఇక్కడ లేదు. అతని కోరిక ప్రకారం అతనిని తన తల్లి సమాధి పక్కనే ఖననం చేసినారు. ఆ సమాధి కింగుకోఠీల ఉంది. మొదటి నిజాం సమాధి ఔరంగాబాద్‌ల ఉంది.

ఆసఫ్‌జాహీ వంశం వారు ఏడు తరాలు మాత్రమే పరిపాలన చేస్తరని, దానితోటి ఆ వంశపాలన ముగుస్తుందని ఒక చారిత్రక కథ వినికిడిల ఉంది. మొదటి నిజాం మీర్‌ ఖమ్రుద్దీన్‌ ఖాన్‌ ఆసఫ్‌జాహీ వంశపు మూలపురుషుడు. ఇతను మొఘల్‌ ప్రభువులచేత ‘నిజాం’ బిరుదును పొంది దక్కను ప్రాంతానికి సుబేదారుగ 1724ల నియమించబడినాడు. అతను ఢిల్లీ నుండి మొదటిసారి దక్కనుకు గుర్రంపైన సవారీ చేస్తూ మధ్యల ఔరంగాబాద్‌ ప్రాంతంల విశ్రాంతి కోసం ఆగినాడు. ఆకలి బాగ అయింది. తినడానికి అతని వద్ద ఏమీ లేదు. అటు ఇటు చూడంగనే కొద్ది దూరంల ఒక చెట్టు కింద ఫకీర్‌ కనిపించినాడు. అతని వద్దకు పోయి తినటానికి ఏమైనా ఇవ్వమని అడిగినాడు. అప్పుడు ఆ ఫకీర్‌ రొట్టెల దొంతరలను ముందు పెట్టితే అతను ఆకలితోటి దబ్బదబ్బ రొట్టెలను తిన్నడు. ఏడు రొట్టెలను తిన్న తర్వాత ఇక తినలేను ‘బస్‌’ అనంగనే ఆ ఫకీర్‌ ‘తథాస్తు’ నీ వంశంల ఏడు తరాల వాళ్లు మాత్రమే రాజ్యం ఏలుతరని జోస్యం చెప్పినాడు. సరిగ్గ అట్లనే ఆసఫ్‌జాహీ వంశం వాళ్లు ఏడుగురు రాజులు మాత్రమే పరిపాలన సాగించినారు. ఏడవ నిజాం కాలంలనే పోలీస్‌ యాక్షన్‌ జరిగి హైద్రాబాద్‌ సంస్థానం ఇండియన్‌ యూనియన్‌ల 17 సెప్టెంబర్‌ 1948న విలీనమైంది.

స్వామి చుట్టూ కబూతర్‌లు గుంపులు గుంపులుగ గుమికూడి ఉన్నై. కొన్ని కబూతర్‌లు సరిగ్గ స్వామి ఆలోచనల్లాగనే టపటపా రెక్కలు కొట్టుకుంట ఎగురుతున్నై. హైద్రాబాద్‌ సంస్కృతిల పక్షుల పెంపకం, పోషణ కూడ ఒక ముఖ్యమైన భాగం. కుతుబ్‌ షాహీ రాజుల కాలం నుండి రామచిలుకలు, పావురాలు ఇతర పక్షులను పెంచడం, ఒక సంప్రదాయంగ వస్తుంది. కొన్ని బస్తీల పేర్లు పక్షులతోటి ముడిపడి వున్నై. కబూతర్‌ఖానా, చిలకలగుడా. బొగ్గులకుంట అసలు పేరు బగల్‌కుంట. బగల్‌ అంటే కొంగలు. నవాబుల కాలంల తపాలా చేరవేయటానికి పావురాలను పెంచెటోళ్లు. పావురాల పెంపకం, వాటికి దాణా వేయడం, మతపరమైన ఆచారంగ, సంప్రదాయంగ స్ధిరపడింది. హిందువులు, ముస్లింలు పావురాలకు దాణా వేయడం పుణ్యకార్యంగ భావించడం వల్ల మసీదులల్ల, మందిరాలల్ల పావురాలకు ఆశ్రయం దొరుకుతుంది.

ఎండ చురుక్కుమని కాటేసింది. స్వామి అంతర్లోకాల నుండి కబూతర్లు ఎగిరిపోయినై. ఈ లోకంలకు వచ్చి హౌజ్‌ దగ్గరికి పోయినాడు. మసీదు ప్రాంగణం మధ్యల నలుచదరంగ ఉన్న విశాలమైన హౌజ్‌ల ఎండకు నీళ్లు తళతళలాడుతున్నై. లోపల ఆకుపచ్చని నాచు తీగలు తీగలుగ అల్లుకొని ఉంది. అండ్ల గుంపులు గుంపులుగ తిరుగుతున్న రాగి రంగు చేపలు. మనుషులు దగ్గరికి రాంగనే నోళ్లు తెరుచుకుని వారి దిక్కు అమాయకంగ చూస్తున్నై. గొంతుక్కూచొని ముఖం మీద నీళ్లు చల్లుకున్నడు. నీళ్లు చల్లగ, హాయిగ వున్నై. అట్లనే కాళ్లూ చేతులూ కడుక్కొని లేచినాడు. తాజాగ ఫీలవుకుంట మసీదు మెట్ల మీది నుండి కిందికి దిగి దర్వాజా దాటి ఇవతలికి వచ్చి ఎడమ దిక్కుకు తిరిగి చార్మినార్‌కు ఎదురుంగ నడవసాగినాడు.

మళ్లీ ఎడమ దిక్కు లార్డ్‌ బజారుకు పోయే తోవ. లార్డ్‌ బజార్‌ అసలు పేరు లాడ్‌ బజార్‌. ఈ బజార్‌ కుతుబ్‌షాహీల కాలం నుండే ఉంది. ఆ రోజులల్ల దీన్ని మీనాబజార్‌ అనేటోళ్లు. హయత్‌బక్షీ బేగం చిన్నపిల్లగ ఉన్నప్పుడు ‘లాడ్లీ’ అనెటోళ్లు. ఆమె పేరు మీదనే లాడ్‌ బజార్‌ వెలిసిందని ఒక ప్రచారం. ఈ వీధిల ఉన్న ‘ఖిల్వత్‌’ మహల్‌ను 1884ల వైస్రాయ్‌ లార్డ్‌ రిప్పన్‌ సందర్శించడం వల్ల లాడ్‌ బజార్‌ ‘లార్డ్‌ బజార్‌’గ పేరు మార్చుకుంది. అక్కడ దుకాణాలన్నీ స్త్రీల సింగారానికి సంబంధించినవే. వాళ్ల సింగారాన్ని అంగారమోలె మెరిపించే అలంకరణ సామగ్రి దుకాణాలు. పెండ్లిండ్లు, పండుగలు ఇతర శుభకార్యాలల్ల స్త్రీలకు సంబంధించిన అన్ని వస్తువులు అక్కడ లభ్యమైతయి. మతాతీతంగ హిందూ ముస్లిం స్త్రీలందరికీ అవసరమయ్యే అన్ని అలంకరణల వస్తువులు అక్కడ సరసమైన ధరలకే లభిస్తయి. ఆ దారికి రెండు దిక్కుల రంగు రంగుల తళుకులీనే సీసపు గాజుల దుకాణాలు. అండ్ల చల్లని సాయంత్రాలు గాజుల బేరాలు చేసే మేలిమి ముసుగుల ముస్లిం వనితలు. ముసుగు సుందరీమణులు. మెహందీ పెట్టుకున్న తెల్లటి నాజూకు చేతుల పూబోడులకు గాజులు తొడిగే దుకాణందారులు ఎంత అదృష్టవంతులో!

గాజులల్ల అనేక రకాలు. కుందన్‌, కంగన్‌, చాంద్‌తారా, చమ్కీ, కబూతర్‌ ఆంఖ్‌, సూరజ్‌ కా పూల్‌, బుట్టే కా జోడా అసొంటివి పాత కాలం పేర్లయితే పాకీజా, అనార్కలీ, లైలా మజ్ను, దూప్‌ చాఁవ్‌ గాజులు ఇటీవలి కొత్త కాలం పేర్లు. పక్కన్నే మరికొన్ని అగరుపొగరు అత్తరు సీసా దుకాణాల లీలావిలాసాలు. గులాబీ, మల్లె, జాస్మిన్‌, అడవి పుష్పాలు – హీన, చమేలి, గంధపు చెక్కల్ని, వనమూలికల్ని నలబై రోజులు నిరంతరం వేడి చేస్తే ఉద్భవించే ఆవిరి బిందువులే వివిధ రకాల అత్తరు పరిమళాలు. రూహే సందల్‌, రూహే గులాబీ, బగీచా, మాజ్మా, జన్నత్‌-ఎ-ఫిరోజ్‌, ఖనోజ్‌ వగైరా తులం, అరతులం అత్తరు సీసాల ధరలు వందలు, వేలల్లనే ఉంటై.

పాన్‌ సుపారీ సుగంధపు దినుసుల దుకాణాలు, చిక్ని చాలియాలు, లవంగు ఇలాచీలు, జాజీ జాపత్రులతోటి పాటు జర్దా, కాచులు కూడ అమ్ముతరు. దేశీ కత్తా, గులాబీ కత్తా, కాన్పూరీ – బరేలీ కత్తా ధనికుల కోసం. రాంపూరీ, లక్నో, పూనా జర్దాలు రంగు రంగుల కాంతులీనుతూ సువాసనలు వెదజల్లుతుంటయి. పాపం దేశీ జర్దా పేదల కోసం. గోరింటాకు పొడులు, రంగు రంగుల రిబ్బన్లు, బొట్ల సింగార్‌ దుకాణాలు. పసుపు కుంకుమలు, బుక్కా గులాల్‌, గంధపు చెక్కలు, చందన్‌ పౌడర్లు, ఊదులోబాన్‌లు అమ్ముతరు. పూర్తిగ తడి ఆరని దీర్ఘ శీరోజాలకు పూబోడులు ఆ సాంబ్రాణీ పట్టిస్తే మర్నాటి దాక ఆ వెంట్రుకలు గుప్పుమనే సువాసనలు వెదజల్లుతయి. ఈ మత్తుకు కొమ్ములు తిరిగిన ఎంతటి మగోడైనా చిత్తయిపోవలసిందే.

కార్‌చోబ్‌ దుకాణాలు, సిల్కు చీరెలు, దుపట్టాల మీద తమ హస్తకళా నైపుణ్యంతోటి పూలు, లతలు, పిందెలు అల్లే పనిని, కుట్టే పనిని కార్‌చోబ్‌ దుకాణాలని అంటరు. స్త్రీలు చీర ధర కంటే అనేక రెట్ల హెచ్చు ధరను ఆ పనికి, కళకు చెల్లిస్తరు. వెంట్రుకలవంటి అతి సన్నని బంగారు తీగెల అల్లికల మధ్య మేలిమి ముత్యాలను పొదిగించి ఆ కార్‌చోబ్‌ పని చేస్తరు. ఆ వస్త్రాలను విదేశాలకు కూడ ఎగుమతి చేస్తరు. లార్డ్‌ బజార్‌ పరిసర ప్రాంతాలల్ల అదొక కుటీర పరిశ్రమ. ఇదే కాక రవికెలు, చీరెల అంచులకు అతికించే ‘గోటీ కినారె’ వ్యాపారాన్ని మార్వాడీ వర్తకులు చేస్తరు.

రాత్రుళ్లు ఆ వీధి వీధంతా షాపింగుకు వచ్చే స్త్రీలతో పువ్వుల బజారులాగ వెయ్యిన్నొక్క వెలుగుల కాంతులీనుతుంటది. ఆ లార్డ్‌ బజార్‌ వీధిలనే చౌమహల్లా ప్యాలెస్‌, ఖిల్వత్‌ ప్యాలెస్‌, మోతీ గల్లీ, ఖజానే ఆమ్రాలు ఉన్నయి. నాడూ నేడూ ఎప్పుడూ ‘లార్డ్‌ బజార్‌’ ఒక అంతర్జాతీయ విపణి వీధి. స్వామి ఆ లార్డ్‌ బజార్‌ వీధిలకు పోకుండ కొంచెం ముందుకు నడిచినాడు. సైకిలు మీద చెంగేరీల అందంగ అమర్చబడ్డ ఎర్రటి జాంపండ్లు. “బార్కాస్‌ కీ జామ్‌, బార్కాస్‌ కీ జామ్‌” అని చార్మినార్‌ దద్ధరిల్లి నేలకూలిపోయేలాగ ఒర్లుతున్న ఆ జాంపండ్ల సైకిల్‌ వ్యాపారి. బహుశా బార్కాస్‌ ఛావూష్‌ కావచ్చు. అరటి తొక్క మీద కాలేసి జర్రున జారి పడబోయి తమాయించుకున్న ఓ మార్వాడీ బొజ్జ గణపయ్య.

ముందుకు పోతే చార్మినార్‌ డిసిపి పోలీసు కార్యాలయం. లాఠీ తూటా బాయ్‌నెట్‌ ఇనుపటోపీ బూట్లతోటి ‘సర్వాంగ శోభితంగ’ నోరు తెరుచుకుని పాతాళభైరవి సినిమాల రాక్షసుడి గుహలాగ నిలబడి ఉంది. మరో నాలుగు అడుగులు. వరుసగ ఉన్న నాలుగు చక్రాల తోపుడు బండ్ల వ్యాపారస్థులు. “హర్‌ ఏక్‌ మాల్‌ చారానా” అని రిథమిక్‌గ అరుస్తున్నరు. గిరాకీలను పిలుస్తున్నరు. ప్లాస్టిక్‌ వస్తువులు, ఆడవాళ్ల బొట్లు, పూసల దండలు, రిబ్బన్లు, మొగవాళ్ల మొలదారాలు, తాయెత్తులు, ముంజేతి కడియాలు, ఉంగరాలు, చిన్న పిల్లల రంగు రంగుల లట్టూలు, చెండ్లు ఇంకా లాయిలప్పలు. కళ్లకు కలర్‌ఫుల్‌గ కదిలే ఆ తోపుడు బళ్ల దుకాణాలు. దునియా రంగు రంగీలా బాబూ – దునియా రంగు రంగీలా.

మూలల శివమందిర్‌. అక్కడ భక్తజన సందోహాలు. శివరాత్రి పర్వదినాన ఆ గుడి ముందు అమర్చిన బల్ల పీటల మీద పెద్ద పెద్ద గంగాళాల్ల ‘భంగు’ పానీయాన్ని అమ్ముతరు. ఈ భంగు ఉత్తర హిందూస్థానం నుండి దిగుమతైన దేవతలు తాగిన సోమరసం కాబోలు. దానిని నైజాం కాలంల కాయస్థులు తెచ్చినట్లుంది. పాలు, చక్కెర, బాదాం, పిస్తా, అక్రోట్‌, నల్లమందు, భంగాకు బాగా నూరి షర్బత్‌ తయారు చేస్తరు. తాగితే మొదట తియ్యగ, చల్లగ, హాయిగ వుంటది. ఆ తర్వాత ఒక గంటకు శరీరంపై, మెదడుపై తన ప్రతాపాన్ని చూపిస్తది. దానిని సేవించినవాళ్లు కిందికీ పైకి గుండ్రంగ రంగులరాట్నంల కూర్చున్నట్లు డోలాయమాన స్థితి నుండి ఊహాజనిత మాయ జలతారు పరదాలల్లకు వెళ్లిపోతరు. అనుభవిస్తే గాని దాని తత్వం బోధపడదు. హోళీ, శివరాత్రి పండుగ రోజులల్ల ఈ భంగుకు బాగా గిరాకీ ఉంటది.

శివ్‌ మందిర్‌ తర్వాత చార్‌ కమాన్‌ దాటినాడు. రెండు దిక్కుల వెండి వస్తువుల దుకాణాలు. వ్యాపారస్థులందరూ జైన్‌, మార్వాడీలు. ఇవి కాక మరికొన్ని ముత్యాల, పగడాల దుకాణాలు. వాటిల సాయంకాలం సందడి ఎక్కువ. హైద్రాబాదు మంచి రకం మేలిమి ముత్యాలకు, నోరూరించే బిరియానీకి ప్రసిద్ధి అని ప్రపంచ పర్యాటకులందరికీ తెలుసు. గుల్జార్‌ హౌజ్‌ నీళ్లు లేక సూఖా హౌజ్‌గ పేరు మార్చుకుంది. కుతుబ్‌షాహీ కాలంల ఈ హౌజ్‌ అత్తరు పన్నీరులతో నిండి ఉండి గులాబీ పూరేకులతోటి తేలిపోయేది. ఆ హౌజు చుట్టూ గుల్‌బదన్‌లు చేతులల్ల తమ పర్వానాలు, దీవానాలు నజరానాలుగ ఇచ్చిన గుల్‌దస్తాలతోటి అభిసారికల్లాగ నిలబడి ఉండెటోళ్లు. చివరికి ఈనాడు ఆ గుల్జార్‌ హౌజ్‌ లేదు. గల్‌బదన్‌లు లేరు, గుల్‌దస్తాలు లేవు.

మళ్లీ నాలుగు దారుల చౌరస్తా. ఈ జీవితమే ఒక పెద్ద చౌరస్తా. ఎటు పోవాలో ఏం చేయాలో తోచదు గాక తోచదు. లెఫ్ట్‌ టర్న్‌. యస్‌. యస్‌. లెఫ్ట్‌ ఈజ్‌ ఆల్‌వేస్‌ రైట్‌. మున్నాలాల్‌, దవాసాజ్‌ జడీబూటీ మందుల దుకాణం. దేశీ మందుల సహజసిద్ధ సువాసన. మళ్లీ బాల్యంలకు గుంజుకపోతది. చిన్నప్పుడు జ్వరంతోటి ఎండిపోయిన నాలుక మీద తియ్యటి పుల్లటి ‘అల్‌ బుఖారా’.

బుఖారా ఆఫ్ఘనిస్తాన్‌ దేశంల ఉన్న ఒక కొండ ప్రాంతం. హైదరాబాద్‌ల కొంత మంది పఠాన్‌ ముస్లింలకు ఇంటి పేరు బుఖారీ అని ఉంటది. వాళ్ల పూర్వీకులందరూ ఆఫ్ఘనిస్థాన్‌ బుఖారా ప్రాంతం నుండి ఇక్కడికి వచ్చినోళ్లే. వాళ్లు నీలి కళ్ల నీడలల్లకు తొంగి చూస్తే వారి పూర్వీకుల రహస్యాలు బయటపడతాయి. ఈ అల్‌ బుఖారా పండు పఠాన్‌ల ద్వారా మన హిందూస్థానంలకు దిగుమతి అయ్యింది.

డాక్టర్‌ రూప్‌ కరణ్‌ చౌబీస్‌ ఘంటా దవాఖానా. నిజాం కాలం నుండి ఇప్పటికీ అట్లనే కొనసాగుతుంది. ఆ రోజులల్ల ఆయన వైద్యుడే కాక సంఘ సేవకుడు కూడ. తనకు చిన్నప్పుడు ఎడమ కాలికి పోలియో సోకితే చికిత్స చేసి బాగుపరిచి తననిప్పుడు ఇట్ల రోడ్ల మీద నడిపిస్తున్న ‘వైద్యుడు – నారాయణుడు – హరి’ అన్నీ అతనే. ఆ డాక్టర్‌ సాబ్‌ ‘దవా ఔర్‌ దువా’ ఈ మరీజ్‌ మీద సరిగ్గనే పని చేసింది. ఆయన దయ లేకపోతే తను మరో ‘తైమూర్‌ లంగు’ అయిపోయెటోడు.

ఆ ఆసుపత్రి పక్కన్నే తోపుడు బండి మీద పొగలు కక్కుతున్న పెద్ద కడాయి. అండ్ల డాల్డా ప్రవాహంల మునిగితేలి ఈత కొడుతున్న జిలేబీలు. కింద పళ్లెంల పంచదార పానకంల నాని చల్లబడుతున్న రసాలూరే జిలేబీలు. పసుపుపచ్చ బంగారు రంగుతో మిసమిసలాడే జిలేబీలు. ఈ జిలేబీ ఏ దేశం నుండి దిగి వచ్చిందో. ఏ భాషకు సంబంధించిన పదమో? జిలేబీ గులాబీ బేబీ – బలే బలే గులేబకావళి! ఒక ఆదా పావు గరం గరం జిలేబీలను దబ్బదబ్బ తిని యాంటీ డోస్‌గ పక్కనున్న మరో గప్‌చిప్‌ల బండిల అప్పుడే తీసిన వేడి వేడి మసాలా మిరపకాయ బజ్జీలను కరకర, పరపర నమిలి మింగేసి కారం నసాళానికి అంటంగనే ఎదురుంగ ఉన్న ఆగ్రా హోటల్లకు దూరి చల్లటి రబ్డీ మలాయ్‌ లాగించి దాహార్తి చింతతోటి ఒక చక్కటి, చిక్కటి లస్సీ బిగించి బిల్లు చెల్లించి ఇవతలికి వచ్చి నవరతన్‌ పాన్‌ మహల్ల కలకత్తా మీఠా పాన్‌ ట్టించి, దౌడన దట్టించి, కృష్ణా టాకీసు ముందు నిలుచున్నడు.

ఈ రోజు ఉదయం తొమ్మిది, పది మధ్య ‘దుష్ట చతుష్టయం’ ఇక్బాల్‌ హోటల్ల కలుసుకోవాలని ముందే వేసుకున్న ప్లాన్‌. ఆ రోజు పది పదకొండు గంటలకు చార్మినార్‌ నుండి రాజ్‌భవన్‌కు ‘డిమాండ్స్‌ డే’ ఊరేగింపు. ఆందోళనాకారులు రాకుండా రాత్రి నుండే చార్మినార్‌కు వచ్చే అన్ని దారులను పోలీసులు మూసేసినారు. బస్సులన్నింటినీ ఉదయమే నయాపూల్‌ దగ్గర ఆపేసి, అంగుళమంగుళం పహరా కాస్తున్నరు. స్వామి గల్లీలల్ల నుండి రహస్యంగ పొద్దు పొద్దుగాల్నే చార్మినార్‌కు చేరుకొని దోస్తుల కోసం నిరీక్షిస్తున్నడు.

కృష్ణా టాకీసు నుండి తొందరతొందరగ నడుచుకుంట ఇక్బాల్‌ హోటల్‌కు చేరుకోంగనే త్రిమూర్తులు కనిపించినారు. వేణు బృందం సికింద్రాబాదు బోట్స్‌ క్లబ్‌ నుండి రాజ్‌భవన్‌కు చేరుకుంటమని ముందే చెప్పినారు. బస్సులన్నీ బందు కావున నడుచుకుంట వచ్చేసరికి గోపీ అండ్‌ కంపెనీకి జర లేట్‌ అయ్యిందట. ఆకలవుతుందని అశోక్‌ జెఫ్రీలు ఖీమా పరాటాలతో కుస్తీ పడుతున్నరు. జెఫ్రీగాడు ఇదే జీవితంల ఆఖరు తిండి అన్నట్లు ఆవురావురుమని తింటున్నడు. గోపి క్రానికల్‌ పేపరుల అక్షరాలను కళ్లల్లకు ఒంపుకుంటున్నడు.

చార్మినార్‌ను ఎవడన్న మాయలఫకీరు ఎత్తుపోతడేమో అన్నట్లుగ దాని చుట్టూ డేగకళ్లతోటి పోలీసుల కాపలా. తెలంగాణా ఊరేగింపు అక్కడ్నించి వెళ్లనీయవద్దని వారి దృఢ నిశ్చయం. ఇంతల హారతి పళ్లాలు కొబ్బరికాయలు పట్టుకుని తాళాలు కొట్టుకుంట భజనలు చేసుకుంట కొంత మంది స్త్రీపురుషులు అలీజా కోట్ల నుండి భాగ్యలక్ష్మి మందిరం దిక్కు వస్తున్నరు. ఆ రోజు శుక్రవారం పూజలు. స్త్రీలంత ముసుగులూ, కొంగుల్తో తలలు కప్పుకొన్నరు. పురుషులంతా పంచె, లాల్చీ, టోపీలతో ఉన్నరు. ఆ భక్తుల్ని ఆపటం మహాపాపం అని భావించి పోలీసులు పెద్ద మనస్సుతోటి వారిని ఆపకుండ రానిచ్చినారు. అదే వారి కొంప ముంచింది. వారు గుడి దగ్గరకు రాంగనే ‘జై తెలంగాణా’ అని నినాదాలు ఇవ్వసాగినారు. పోలీసులు ఒక్కసారే ఉలిక్కిపడి ‘హోష్‌’లకు వచ్చినారు. స్త్రీలందరూ తమ ముసుగులను తల మీద నుండి తీసినారు. మరికొంత మంది చీరెలు విప్పేసినారు. ఆశ్చర్యం. వాళ్లెవరో కాదు. కేశవరావు జాదవ్‌, మదన్‌మోహన్‌, మల్లికార్జున్‌, శ్రీధర్‌ రెడ్డి మొదలగువారు. ఇంక ఎంతో మంది ‘జై తెలంగాణా’ నినాదాలు ఇస్తున్నరు.

ఎవరో గుడి గంటల్ని గణగణా నిరంతరం మోగిస్తున్నరు. ఆ గంటల చప్పుడుకు మిడుతల దండోలె ఆయుర్వేద ఆస్పత్రి నుండి, యూనానీ దవాఖానా నుండి, మక్కా మసీదు లోపల్నుండి, శివమందిర్‌ నుండి, బిల్డింగుల వెనక నుండి, చుట్టపక్కల ఇరానీ హోటళ్ల నుండి, గల్లీలల్ల నుండి ప్రజలు వందల సంఖ్యల చార్మినార్‌ చుట్టూ జమ అవుతున్నరు. వారు ఉదయమే కాలి నడకన బయలుదేరి రహస్యంగ ఆ స్థలాలల్ల దాక్కున్నరు. మొదలే వేసుకున్న ప్లాన్‌ ప్రకారం గంటల సంకేతంతో హఠాత్తుగ ప్రత్యక్షమైనారు. ప్రజల అలల ప్రవాహం ఎక్కువయ్యే సరికి పోలీసులు నిస్సహాయులైనారు. స్వామి మిత్రబృందం ఆ జన ప్రవాహంల కలిసి కదిలి పోయింది.

ఆ రోజు హైద్రాబాద్‌ నగరం తన చరిత్రను తానే తన రక్తంతోనే ‘రక్తాక్షరాలతో’ లిఖించుకుంది. కడుపుకోతకు గురై దుఃఖించింది.

చార్మినార్‌ దగ్గర గుమికూడిన ప్రజా సమూహాన్ని ఉద్దేశించి మాజీ ఉప ముఖ్యమంత్రి, కురువృద్ధుడైన కొండా వెంకట రంగారెడ్డి ప్రసంగించినారు. తరువాత ఆయన నాయకత్వంల ఊరేగింపు బయలుదేరింది. జన ప్రవాహాన్ని ఆపటం కష్టమయ్యింది. మదీనా బిల్డింగు దగ్గరికి ఊరేగింపు చేరుకోంగనే గడబడలు మొదలైనై. ముందు బాష్పవాయువును వదిలినారు. దానికి జవాబుగ రాళ్లవర్షం కురిసింది. ప్రజలను చెదరగొట్టడానికి అనేకసార్లు లాఠీచార్జీ చేసి బాష్పవాయువును వదిలినారు. అరెస్టు చేసిన వారిని తరలించటానికి పోలీసు వ్యాన్లు సరిపోలేదు. దెబ్బలు తింటూ చెల్లాచెదురైన ప్రజలు మళ్లీ మళ్లీ గుమికూడుతున్నరు. సిద్ధి అంబర్‌ బజార్‌ మసీదు దగ్గరికి ఊరేగింపు చేరుకోంగనే పోలీసు కాల్పులు జరిగినై. అయినా పోలీసులపై రాళ్ల వర్షం కురుస్తనే ఉంది. ప్రజలు అక్కడికక్కడే ముగ్గురు అమరులైనారు. గాయపడినవారి సంఖ్య లెక్కలేదు. గుండ్ల దెబ్బలకు గాయపడిన ప్రజలు రోడ్డు మీదే గంటల తరబడి పడి అలమటించినారు. సమీపంలనే ఉస్మానియా దవాఖానా ఉన్నా పోలీసులు వారిని తరలించలేదు. ప్రైవేట్‌ జీబులల్ల ప్రజలే వారిని ఉస్మానియా దవాఖానాకు తీసుకొని పోయినారు.

సిద్ధి అంబర్‌ బజార్‌ చౌరస్తా నుండి మొజాంజాహీ మార్కెట్‌ వరకూ వీధులన్నీ రణరంగాలైనై. యుద్ధభూమిని తలపించింది. పోలీసులకు, ప్రజలకు మధ్య హోరాహోరీ పోరాటం జరిగింది. ప్రజలు వీరోచితంగ ప్రాణాలను తృణప్రాయంగ ఎంచి తిరగబడినారు. కాల్పులు జరిగినంత సేపూ గల్లీలల్లకు మాయమైనారు. కాల్పులు ఆగంగనే మళ్లీ రోడ్డుపైకి వచ్చి రాళ్లు రప్పలు విసిరినారు. ఊరేగింపు వెళ్లే దారిల దుకాణాలన్నీ స్వచ్ఛందంగ మూతబడ్డయి. రోడ్ల మీద యువకులు, విద్యార్థులు నిస్సహాయంగ లాఠీదెబ్బలు, గోలీ దెబ్బలు తింటుంటే పక్కనున్న భవనాల నుండి, కిటికీల నుండి తొంగిచూస్తున్న స్త్రీలు, పిల్లలే కాక పురుషులు కూడా దుఃఖం ఆపుకోలేక భోరుమని ఏడ్చేసినారు. మహరాజ్‌ గంజ్‌ పోలీసు స్టేషన్‌ను పూర్తిగ అగ్నికి ఆహుతిచ్చినారు. సెంట్రీ ఆత్మరక్షణ కోసం కాల్పులు జరిపితే మళ్లీ కొందరు మరణించినారు. అయినా పోలీసు స్టేషన్‌ ముందున్న వ్యాన్‌ను, ఇన్‌స్పెక్టర్ల మోటారు సైకిళ్లను పూర్తిగ తగులబెట్టినారు. అక్కడి వీధిల పోలీసులు, ప్రజలు ముఖాముఖి పోరాటం చేసినారు. వాళ్లంతా మలబారు పోలీసులు. ఎటువంటి సానుభూతి లేక ప్రజలపై దౌర్జన్యం చేసినారు. మొజంజాహీ మార్కెట్‌ చౌరస్తాల రెండు గంటల సేపు ప్రత్యక్ష యుద్ధం జరిగింది. పద్మవ్యూహంల చిక్కుకున్న పోలీసులు విచక్షణ కోల్పోయి ఇష్టం వచ్చినట్లు కాల్పులు జరిపినారు. అట్ల రక్తసిక్తమైన ఆ రోజు తెలంగాణా ప్రజలు వీరోచితంగ బలిదానాలు, ఆత్మత్యాగాలు చేస్తూ రక్తాన్ని సాకబోస్తూ ఊరేగింపుగ పబ్లిక్‌ గార్డెన్స్‌కు చేరుకున్నరు.

సికింద్రాబాద్‌ నుండి బయలుదేరిన ఊరేగింపుకు ఎస్‌.బి. గిరి, నాగం కృష్ణ, గౌతు లచ్చన్నలు నాయకత్వం వహించినారు. గౌతు లచ్చన్న స్వతంత్ర పార్టీ నాయకుడు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన సీనియర్‌ నాయకుడు. సికింద్రాబాదుల ఊరేగింపు వెళ్లే దారిల దుకాణాలన్నీ మూసేసినారు. ఊరేగింపు మున్సిపల్‌ ఆఫీస్‌, పరేడ్‌ గ్రౌండ్స్‌ దగ్గరికి రాంగనే పోలీసులు ఎస్‌.బి. గిరిని అరెస్టు చేసినారు. అల్లర్లు, లాఠీచార్జిలు వీధివీధినా జరిగినై. సికింద్రాబాద్‌ బోట్స్‌క్లబ్‌ దగ్గరికి ఊరేగింపు రాంగనే అది జనసముద్రంగ మారిపోయింది. అక్కడ గౌతు లచ్చన్న ప్రసంగించినాడు. ట్యాంక్‌బండు, సెక్రెటేరియట్‌ దాటి ఊరేగింపు పబ్లిక్‌ గార్డెన్‌ చేరుకొని చార్మినార్‌ నుండి వచ్చిన ఊరేగింపుల కలిసింది. నాంపల్లి రోడ్డుల ఒక మిలటరీ బస్సును, పోలీసు జీపును పూర్తిగ దహనం చేసినారు.

జంటనగరాలల్ల నుండి బయలుదేరిన రెండు ఊరేంపులు అసెంబ్లీ దగ్గర రవీంద్రభారతి ముందు కలుసుకున్నై. అదొక సాగరసంగమం.

ఆ తరువాత నగరంల కనీవినీ ఎరుగని ఊరేగింపు లక్డీ కాపూల్‌, ఖైరతాబాద్‌ల నుండి రాజ్‌భవన్‌కు చేరుకుంది. అడుగడుగున రక్తతర్పణాలు, అశ్రు అభిషేకాలు, హోరాహోరీ వీధి పోరాటాలు జరిగినై. చివరికి రాజ్‌భవన్‌ల గవర్నర్‌కు మహాజర్‌ను సమర్పించటానికి వెళ్లిన బృందం మీద కూడా ఆ ప్రాంగణంలనే లాఠీచార్జీ జరిగింది. ప్రభుత్వాన్ని వెంటనే బర్తరఫ్‌ చేసి రాష్ట్రపతి పాలన విధించాలన్న ఏకైక డిమాండుతో ఆ మహాజరును సమర్పించినారు. లోపల గవర్నర్‌ ఖండూబాయి దేశాయితో డెలిగేషన్‌ సభ్యులు మాట్లాడుతుండంగనే బయట ప్రజలకు, పోలీసులకు మధ్య యుద్ధం కొనసాగింది. మళ్లీ కాల్పులు మొదలైనాయి.

స్వామి మిత్రబృందం అల్లర్లల్ల చిక్కుపోయింది. లాఠీఛార్జీల అప్పటికే గోపీ తల పగిలింది. ధారాపాతంగ రక్తం కారుతుంది. దస్తీతో గట్టిగ నొక్కిపట్టినా రక్తస్రావం ఆగుత లేదు. అశోక్‌ తన షర్టు లోపలి బనీను విప్పి దాన్ని సగానికి చింపి కట్టు కట్టాడు. రక్తస్రావం తగ్గింది. సి.ఆర్‌.పి. పోలీసువాడు తన బలమైన లాఠీతో అశోక్‌ను వీపు మీద కొట్టబోతే తప్పించుకొంటుంటే అది తుంటికి తగిలింది. నొప్పి భరించలేక కుంటుతనే పరుగెత్తుతున్నడు. బాష్పవాయువు గోళం ఒకటి సూటిగ వచ్చి స్వామి కాళ్ల ముందు పడింది. ఆ పొగల చిక్కుపోయిన స్వామికి కండ్లు విపరీతంగ మండుతూ దగ్గటం మొదలు పెట్టినాడు. ముక్కుల్నుండి, కళ్ల నుండి నీళ్లు కారి కారి ముఖమంత ఉబ్బిపోయింది. ముగ్గురు ఒకే చోట ఉన్నా ఎవరికీ దిక్కు తోస్తలేదు. ఇంతల జెఫ్రీ అక్కడికి వచ్చినాడు. వాడొక్కడే ఒక్క దెబ్బ కూడా తగలకుండ సురక్షితంగ ఉన్నడు. హుషారుగ నీటిల చేపపిల్లలాగ గుంపుల మధ్య అటూ ఇటూ తిరుగుతున్నడు.

ఇంతల ఫైరింగు మొదలయ్యింది. రాజ్‌భవన్‌ రోడ్‌ ఎటువంటి సందులు గొందులూ, గల్లీలు లేకుండ సూటిగ రాజమార్గం మాదిరిగ ఉంది. దుకాణాలు, హోటళ్లు, ఏమీ లేవు – పెద్ద పెద్ద మూసి వున్న గేట్లు, బిల్డింగులు తప్ప. పోలీసుల బారి నుండి తప్పించుకునే అవకాశం, తలదాచుకునే చోటు ఏమీ లేదు. ఎదురుంగ రైలు కట్ట. దానిని దాటితే బాబా సాహెబ్‌ మక్తా బస్తీ. అదొక ముస్లింల స్లమ్‌ ఏరియా. రైలు కట్ట దాటి ఆ మురికివాడలకు పోతే తప్పించుకోవటం బహు సులభం. కానీ చాలా మంది రైలు కట్ట మీద నిలబడే ఆ పట్టాల మీద ఉన్న కంకరరాళ్లను పోలీసుల మీదికి వర్షంలాగ విసురుతున్నరు. స్వామి బృందం ధైర్యం చేసి రోడ్డు మీద నుండి ఆ రైలు కట్ట మీదికి ఉరికింది. అదే సమయంల పోలీసులు తమ ఫైరింగు డైరెక్షన్‌ను రోడ్డు మీది నుండి తిప్పి రాళ్లవర్షం కురుస్తున్న రైలు కట్ట దిక్కు కేంద్రీకరించినారు.

గోపీకి దెబ్బ తగిలి రక్తం కారుతున్నా ధైర్యంగనే ఆ రైలు కట్ట మీద అందరి కన్న ముందు ఉరుకుతున్నడు. అశోక్‌ తుంటి నొప్పితోటి కుంటుకుంట చాల వెనుక ఉన్నడు. మధ్యల స్వామి, జెఫ్రీలు ఒకరిపక్కనొకరు సమానంగ ఉరుకుతున్నరు. కంకరరాళ్ల మీద ఉరుకుడు చాల కష్టంగ ఉంది. ఇంతల జెప్రీ ఆఁ… అని అరిచినాడు. స్వామి చూసేసరికి వాడి కుడికాలు పట్టాల కంకరరాళ్ల మీద నుండి జారుతుంటే వాడు వెనకకు ఒరిగిపోతున్నడు. ఆ కంకరరాళ్ల మీద కాలు జారిందేమోనని స్వామి ఒక చేత్తోటి వాని చెయ్యి పట్టుకొని తన రెండో చేతిని వీపు చుట్టూ వేసి ఆపబోయినాడు. వీపును చుట్టిన చేతికి వేడిగ, జిగటగ తాకింది. చెమటేమోనని చూసేసరికి వాడి వీపు మీద షర్టుకు రూపాయి బిళ్లంత రంధ్రం. అండ్ల నుండి నల్లాపైపు నుండి నీళ్లు కారుతున్నట్లు రక్తం చిమ్ముకుంట వస్తుంది. స్వామికి ఏమీ అర్థం కాక జెఫ్రీ ముఖంలకు చూసినాడు. వాని కళ్లు తెరుచుకుని స్వామినే చూస్తున్నా అవి ఎక్కణ్నో దిగంతాల అవతలి వైపు చూస్తున్నట్టనిపించింది. వాడు చిన్నగ మూలిగి స్వామి చేతులల్ల నుండి జారి పట్టాల మీదికి ఒరిగిపోయినాడు. కింద పడంగనే వాని నోట్లె నుండి రక్తం బొళబొళమని ఇవతలికి వచ్చింది.

స్వామి షాక్‌తోటి జెఫ్రీ జెఫ్రీ అని గట్టిగ అరుస్తున్నడు. వెనుక నుండి కుంటుకుంట వస్తున్న అశోక్‌ ఆ దృశ్యాన్ని చూసి కెవ్వున కేకేసి జెఫ్రీ జెఫ్రీ అని గోలుగోలున ఏడుస్తున్నడు. స్వామి అచేతనంగ రాయిలాగ నిలుచున్నడు. ముందున్న గోపీ ఆ అరుపులు విని వెనకకు వచ్చినాడు. సంగతి అర్థం కాంగనే ముఖానికి రెండు చేతులు అడ్డం పెట్టుకుని వెక్కెక్కి ఏడుస్తున్నడు. ఆ ఏడుపులకు చాలా మంది పోగైనారు. ఇంతల ‘క్యా హువా క్యా హువా’ అంటూ కేశవరావు జాదవ్‌ పరుగెత్తుకుంట అక్కడికి వచ్చినాడు. ఆయన సికింద్రాబాద్‌ ఈవినింగు కాలేజీల ఇంగ్లీష్‌ లెక్చెరర్‌. లోహియా ప్రభావిత సోషలిస్టు. ఆయన జెఫ్రీ మణికట్టు పట్టుకొని నాడీ నిధానం చేసినాడు. ముక్కు దగ్గర వేలు పెట్టి శ్వాసను చూసి ‘బిచారా బచ్చా మర్‌ గయా’ అన్నడు. స్వామికి కండ్లు గిరగిర తిరుగుతున్నై. ఎవరూ కనిపిస్తలేరు – కండ్ల ముందు ఎరుపు నలుపు రంగులు తప్ప. ఎవరెవరివో ఏడ్పులు పెద్దగ వినబడుతున్నై. ‘హటో హటో’ అని పోలీసుల మాటలు వినబడుతున్నయి. తను ఏవో అగాధాలల్లకు జారిపోతుంటే ఎవరో పట్టుకున్నట్టనిపించింది. స్వామి బేహోష్‌ అయిపోయినాడు.

One Response to “సలాం హైద్రాబాద్ : పదో భాగం”

  1. 1
    kvrn Says:

    Swamy! it is excellent piece of nostagia. will Hyderabad city be same tourist paradise, if Andhra Pradesh is divided?

Leave a Reply

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

Managed by Discover Telangana Inc., a registered nonprofit organization in USA.

All opinions and views expressed by third party content providers and shown here as preview are not that of Discover Telangana.

If you find any Content that is infringing, libelous, defamatory, obscene, abusive, offensive or otherwise violation of copyright law, alert us by emailing us at discover.telangana(at)gmail.com